నియంతృత్వపు నగారా “1984”

వ్యాసకర్త: భవాని ఫణి
*************

మీ ఇంట్లో ఒక స్క్రీన్ ఉంటుంది. అది మీరేం చేస్తున్నా చూస్తుంటుంది. మీరేమంటున్నా వింటూనూ ఉంటుంది. ఇంకా అది మీ శరీర భంగిమలను, ముఖ కవళికలనూ ఆఖరికి మీ గుండె కొట్టుకునే శబ్దాన్నీ కూడా గమనించి, వాటి ద్వారా మీ ఆలోచనలను పసిగట్టేస్తుంటుంది. మీరేం చెయ్యాలో, ఏం తినాలో, ఏం వినాలో, ఏం మాట్లాడాలో చివరికి ఏం ఆలోచించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించగలిగితే ఏం జరుగుతుందన్న ఆలోచనకు అక్షర రూపమిస్తూ 1948లో, జార్జ్ ఆర్వెల్ అనే బ్రిటిష్ రచయిత రాసిన నవల ‘1984’. అంటే, ఆయన ఈ రచన చేసిన కాలానికి (1948) ఉన్న నియంతృత్వ ప్రభుత్వాల కారణంగా, అదే పరిస్థితి కొనసాగితే – 1984 నాటికి కొన్ని దేశాల స్థితి ఎంత దుర్భరం కావచ్చో ఊహించి రాసారన్నమాట. మొదట్లో ఈయన శైలి నాకు కాఫ్కా – మెటమార్ఫసిస్ ని గుర్తు చేసింది. నిరంకుశులైన పాలకుల చేతుల్లోకి దేశం వెళ్లినప్పుడు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయికి పడిపోయే అవకాశముందన్న విషయాన్ని ఈ నవలలో చర్చించారు. నిజానికి ఈ నవలలో రాసిన కొన్ని విషయాలు అప్పట్లోనే జరిగినవీ, ఇప్పటికీ జరుగుతున్నవీ కూడా. (అప్పట్లో హిట్లర్, స్టాలిన్. ఇప్పుడు కిమ్ జాంగ్-అన్). ఈయన చెప్పింది ఒక ఊహాజనితమైన డిస్టోపియన్ భావిసమాజం గురించే అయినప్పటికీ ఇది వాస్తవానికీ, చరిత్రకూ ఏమంత దూరంగా ఉండదు. అంతేకాక, ఒళ్లు గగుర్పాటు తెప్పించే నిజాయితీ కూడా ఉంటుందీ రచనలో.

కేవలం అధికారాన్ని, స్వచ్ఛమైన అధికారాన్ని మాత్రమే కోరి ఏర్పరచబడిన టోటలిటేరియన్ ప్రభుత్వం చేతుల్లో ఉంటుందా దేశం. ఆ దేశం పేరు ఓషానియా. ప్రొటాగనిస్ట్ విన్స్టన్ కి, ఇంతకుముందు దాని పేరు బ్రిటన్ గా ఉండేదని లీలగా గుర్తు. అతని చిన్నతనంలో యుద్ధం జరగడం, అప్పుడు Ingsoc (English Socialism) అనే పార్టీ అధికారంలోకి రావడం అతనికి జ్ఞాపకముంటుంది. కానీ ఆ విషయాలేవీ బాహాటంగా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వం అవన్నీ జరిగినట్టుగా ఒప్పుకోదు. Ingsoc పార్టీనే ఎప్పటినించో అధికారంలో ఉందని ప్రజలంతా భావించాలి. దేశాధినేత ‘బిగ్ బ్రదర్’ ఏం చెప్తే, అదే నిజమని ప్రజలంతా మనసా వాచా కర్మణా నమ్మాలి. ప్రతి ఇంట్లోనూ ఒక టెలీస్క్రీన్ ఉంటుంది. అది పౌరుల దినచర్యలను మానీటర్ చెయ్యడమే కాక అవసరమైన సమాచారాన్నీ, ఆదేశాలనూ వారికి చేరవేస్తుంటుంది. (మన దేశంలో బిగ్ బాస్ గా రూపాంతరం చెందిన బిగ్ బ్రదర్ రియాలిటీ షో, ఇతని ఆలోచననే ఎడాప్ట్ చేసుకుంది.)

విన్స్టన్ స్మిత్, ఔటర్ పార్టీకి చెందిన వ్యక్తి. అతడు, ‘మినిష్ట్రీ అఫ్ ట్రూత్’ అనే ఒక ప్రభుత్వ శాఖలో పని చేస్తుంటాడు. అక్కడ అతని పని, పాత రికార్డులన్నింటినీ తన సృజనాత్మకతతో సరి చెయ్యడం. అంటే ఒక వ్యక్తిని ప్రభుత్వం అవసరం లేదనుకుని అదృశ్యం చేస్తే, అతనికి చెందిన రికార్డులను మొత్తం మార్చి, అసలా వ్యక్తి జాడలు ఎక్కడా మిగలకుండా చూసుకోవాలి. దీనినే ‘అన్ పర్సన్’ చెయ్యడం అంటారు. అంతే కాక ప్రభుత్వం ఎప్పుడు ఏ దేశంతో యుద్ధం చేస్తున్నామని చెబుతుందో, ఆ దేశంతోనే మొదటినించీ యుద్ధం జరుగుతున్నట్టుగా – ఎప్పటికప్పుడు రికార్డులను మారుస్తుండాలి. వారికి న్యూస్పీక్ అనే ఒక కొత్త భాష కూడా ఉంది. ఆ భాషను కనిపెట్టడంలోని ఉద్దేశ్యం – పౌరుల భాషను పరిమితం చేసి, తద్వారా వారి ఆలోచనా శక్తిని కూడా కట్టడి చేయడమే. ఉదాహరణకు గుడ్ అనే పదం ఉంటుంది. దాని వ్యతిరేక పదాలు, నానార్థాలతో నిఘంటువును నింపేయడం అనవసరమని వీరి ఆలోచన. ‘గుడ్’ కి వ్యతిరేక పదంగా ‘ఆన్ గుడ్’ ని వాడవచ్చు. ‘బెటర్’ను ‘ప్లస్ గుడ్’ గానూ, ‘బెస్ట్’ను ‘డబల్ ప్లస్ గుడ్’ గానూ చెప్పుకోవచ్చు .

విన్స్టన్ కి మనసులో పార్టీ వ్యతిరేక భావాలు తీవ్రంగా కలుగుతుంటాయి. ఎక్కడో, దేశంలో ఏ మూలనో పార్టీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యే ఉంటుందని అతడు నమ్ముతాడు. ఇంతలో జూలియా అనే సహోద్యోగిని, తానతడిని ఇష్టపడుతున్న విషయాన్ని తెలియజేస్తుంది. అప్పటినించీ వాళ్లు చాలా రహస్యంగా కలుస్తుంటారు. ఆమె పరిచయం కలిగాక, అతడికి జీవితం పట్ల కొంత ఇష్టం పెరిగి, పార్టీని గురించిన ఆలోచన తగ్గుతుంది. ఇంతలో అతని ఆఫీస్ లోనే పనిచేస్తున్న ఓబ్రైన్ అనే ఉన్నతోద్యోగి, తనని తాను తిరుగుబాటుదారునిగా పరిచయం చేసుకుని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు విన్స్టన్ ను ఆహ్వానిస్తాడు. విన్స్టన్ అందుకు ఒప్పుకుంటాడు. నిజానికి ఓబ్రైన్ పార్టీ గూఢచారిగా పనిచేస్తున్నాడన్న విషయం అరెస్టయ్యాక గానీ విన్స్టన్ కి అర్థం కాదు. అక్కడ జైల్లో అతడికి తిండి పెట్టరు. మానసికంగా శారీరికంగా చాలా హింసిస్తారు. నిజానికి హింస ద్వారా మనిషిని సంపూర్ణంగా మార్చివేయడమన్నదే పార్టీ అసలు సిద్ధాంతం. పార్టీ అభీష్టం మేరకు, తాను చేయని తప్పులెన్నో చేసినట్టుగా విన్స్టన్ ఒప్పుకున్నప్పటికీ, మానసికంగా కూడా అతడిని పూర్తిగా పార్టీ విధేయుడిగా మార్చివేసేందుకు ఓబ్రైన్ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అనేక విధాలుగా హింసిస్తాడు. విన్స్టన్ లో పూర్తిగా మార్పు కలిగిందనీ, అతడి శరీరంతో పాటుగా ఆత్మ కూడా పార్టీ వశమయిందనీ నమ్మకం కలిగాక, వాళ్లు అతడిని వదిలిపెడతారు. ఈ క్రమంలో విన్స్టన్ కీ, ఓబ్రైన్ కీ మధ్యన చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

పార్టీకి మూడు నినాదాలుంటాయి. యుద్ధమే శాంతి, స్వేచ్ఛ అనేది బానిసత్వం, అజ్ఞానమే బలం. ఈ నినాదాల ద్వారానే మనం పార్టీ సిద్ధాంతాలను కొంతవరకూ అర్థం చేసుకోవచ్చు. ఓబ్రైన్ తమని తాము అధికారపు అర్చకులుగా అభివర్ణిస్తాడు. స్వేచ్ఛ, అధికారం ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు, అది అతని మరణంతో పాటుగా అంతరించిపోతుందనీ, అదే వ్యక్తి తన ఇడెంటిటీని కోల్పోయి పూర్తిగా పార్టీలో ఐక్యమైపోయినప్పుడు, చనిపోయిన తర్వాత కూడా పార్టీ రూపంలో బ్రతికే ఉండవచ్చనీ చెబుతాడు. పార్టీకి చెందిన ఇటువంటి గొప్ప ఆలోచనలు ఓబ్రైన్ దగ్గర చాలానే ఉంటాయి.

ఇక్కడ పార్టీ సిద్ధాంతాలలో, ‘డబల్ థింక్’ అనే ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ ఉంటుంది. ఉదాహరణకు – ‘రెండు రెళ్లు నాలుగన్న’ విషయం మనకు తెలిసిందే. కానీ పార్టీ ఇప్పుడు, ‘రెండు రెళ్లు ఐదని’ చెబితే దాన్ని మనం నమ్మాలి. అంటే పైపైన ఒప్పుకోవడం కాదు. పార్టీ చెప్పింది కనుక, రెండు రెళ్లు ఖచ్చితంగా ఐదే అవుతుందని మనకి మనస్పూర్తిగా అనిపించాలి. అదే సమయంలో రెండు రెళ్లు నాలుగన్న విషయం కూడా తెలుస్తూ ఉండే కారణంగా దీన్ని డబల్ థింక్ అని పిలుస్తారు.

ఈ వ్యవస్థలో థాట్ పోలీస్ కూడా ఉంటారు. అంటే పౌరులెవరైనా నేర సంబంధమైన ఆలోచన చేస్తే, వీరు గమనించి శిక్షిస్తారన్నమాట. అంతే కాక ‘హేట్’ అని రెండు నిమిషాల కార్యక్రమం, రోజూ ప్రతి ఇంటిలోనూ, కార్యాలయంలోనూ తప్పనిసరిగా నిర్వహింపబడుతుంది. టెలీస్క్రీన్ ల ద్వారా ఆ రోజు ఎవరిని అసహ్యించుకోవాలో తెలియజేయబడుతుంది. అప్పుడు పౌరులంతా ఆ వ్యక్తిని అసహ్యించుకుంటూ, అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహంతో ఊగిపోతారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పూనకం వచ్చినట్లుగా ట్రాన్స్ లోకి వెళ్లిపోక తప్పదు. ఇక ఆలోచనలోని నేర ప్రవృత్తిని, అంటే పార్టీ వ్యతిరేక భావాలను తొందరగా వదిలించుకోలేని నేరస్తుల కోసం, ప్రత్యేకంగా 101 నంబరు గల గది ఉంటుంది. అక్కడ సదరు నేరస్తుడికి ఏదంటే ఎక్కువ భయమో, దేనికి దూరంగా ఉండాలని అతడు కోరుకుంటాడో – ఆ భయాన్ని ఎదుర్కో వలసి వస్తుంది. మానసికంగా ఎంతటి బలమైన వ్యక్తైనా, ఆ రూమ్ లోకి వెళ్లాక బలహీనపడి కృంగిపోక తప్పదు. ఉదాహరణకు విన్స్టన్ ను ఎంతగా హింసించినప్పటికీ అతడు తన ప్రేయసి జూలియాను తాను మోసం చెయ్యలేదన్న సంతృప్తితోనే కాలాన్ని వెళ్ళదీస్తుంటాడు. ఇక్కడ మోసం చెయ్యడం అంటే, పోలీస్ విచారణలో ఆమెకు చెందిన నిజాలు వెల్లడించడం కాదు, ఆమెను కేసుల్లో ఇరికించే విషయాలు చెప్పడం కూడా కాదు. అవన్నీ చేయక తప్పదని ఇద్దరికీ ముందే తెలుసు కూడా. కానీ, ఆమె మీద తనకున్నఇష్టాన్నీ, ప్రేమనూ మాత్రం పోగోట్టుకోలేదన్ననమ్మకాన్నే అతడు కలిగి ఉంటాడు. చివరగా రూమ్ 101 లోకి వెళ్లినప్పుడు, తనను విపరీతంగా భయపెట్టే ఎలుకల ద్వారా కరవబడినప్పుడు మాత్రం, నిజంగా అతడు జూలియాని మోసం చేస్తాడు. ఆ ఎలుకల చేత ఆమెని కరిపించమని అరవడమే కాక, ఈ బాధ నుండి విముక్తి పొందగలిగే పక్షంలో – అలానే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటాడు కూడా. కేవలం పార్టీ మీదా, బిగ్ బ్రదర్ మీదా నమ్మకం, విశ్వాసం తప్ప, వేరే ఏ విధమైన ఉద్వేగాలూ, ఆలోచనలూ, స్వతంత్ర భావాలూ – అక్కడి పౌరులకు ఉండకుండా చేయడమే పార్టీ లక్ష్యం.

వ్యక్తి యొక్క అన్ని మానవ సంబంధిత భావాలనూ, కోరికలనూ పూర్తిగా నాశనం చేయగలిగినప్పుడు మాత్రమే సంపూర్ణమైన అధికారం సాధ్యమని భావించే అధినేత లేదా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పౌరులు ఎదుర్కోవలసి వచ్చే దీనమైన పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వర్ణిస్తాడు రచయిత ఈ రచనలో. కథేమీ పెద్దగా లేకపోవడం వల్ల చివర్లో కొద్దిపాటి విసుగును పుట్టిస్తుంది గానీ, కొత్త రకమైన ఆలోచనా విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాలి. ఇది పాలనలోని అసలైన నిరంకుశత్వాన్నీ, నియంతృత్వాన్నీ కళ్లకు కట్టినట్టుగా చూపే సమగ్ర వ్యంగ్య రచన.

You Might Also Like

2 Comments

  1. nagamurali

    Heard about this book so many times! Thank you for a very useful review.

    1. Bhavani Phani

      ధన్యవాదాలు నాగమురళి గారూ

Leave a Reply