“గర్భసంచిని కాపాడుకుందాం… సమాజాన్ని బలపరుద్దాం” పుస్తక సమీక్ష

వ్యాసకర్త: దాసరి శిరీష
*************

ఈమధ్య కాలంలో స్త్రీల ఆరోగ్య, శారీరక మార్పుల గురించి తెలియజెప్పే పుస్తకాలు తెలుగులో అరుదుగా వస్తున్నాయి. డా. ఎస్. కామేశ్వరి గారు “గర్భసంచిని కాపాడుకుందాం… సమాజాన్ని బలపరుద్దాం” అంటూ శాస్త్రీయమైన అంశాలతో, ఉదాహరణలతో ఓ చక్కని పుస్తకాన్ని మనందరికీ అందించారు. వైద్యుల పరిభాష నుంచి నడిచొచ్చి అన్ని వర్గాల స్త్రీలకీ చేరువయ్యేలా చెప్పిన విధానం ఎంతయినా హర్షణీయం.

మనిషి పుట్టుకా, పరిణామ దశా, తన జీవితాన్ని తను నిర్మించుకునే క్రమం… ఇవన్నీ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. వారివారి అవకాశాలను బట్టి, నేపథ్యాలను బట్టి, సామాజికంగా ఆర్థికంగా ఎదగడం సులభమవుతుంది. కాని విచారించదగ్గ విషయం ఏమిటంటే – తమ తమ శారీరక నిర్మాణాల గురించి గానీ, ఎదిగే దశలో వచ్చే మార్పుల గురించి గాని, జబ్బుల గురించి గానీ ఏ మాత్రం అవగాహన లేకపోవడం. విద్యావంతులూ, వ్యాపారరంగంలో రాణించేవాళ్ళూ, శ్రమజీవులూ (స్త్రీ పురుషులు) ఆర్థిక నిచ్చెన మెట్లెక్కే ఆత్రుత తప్ప ఆరోగ్యకరమైన ఆలోచనా సరళీ, సక్రమమైన పరిశుభ్రమైన జీవనవిధానం అస్సలు ఏర్పరుచుకోలేకపోవడం జరుగుతోంది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు.

చాలావరకు స్త్రీలు తమని తాము తెలుసుకోలేరు. అనేక రకాల మానసిక జబ్బులు శారీరక రుగ్మతలతో ముడిపడి ఉంటాయి. ఇకపోతే వైద్య నిపుణులు వృత్తిపరంగా తప్ప (వారి కారణాలు వారికుండొచ్చునేమో) సామాజికంగా సన్నిహితంగా దగ్గరయి ‘మీ శరీర ధర్మాలేమిటీ? మార్పులేమిటీ’ అని హెచ్చరికలతో తెలియజెప్పడం జరుగడం లేదు. ఒక వేళ చెప్పినా వినని స్త్రీలూ ఉన్నారు. ఇది నేటి సమాజంలో దాదాపు అన్ని వర్గాలలో నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న అజ్ఞానం. ఆర్థికలేమి ఒక కారణం. అయితే తప్పుడు మార్గాలని ఎంచుకోవడం ఇంకొక కారణం. అందువల్లే సరైన హేతువు లేకుండా గర్భసంచిని తొలగించుకోవడం జరుగుతుంది.

పైన జరుగుతున్న ఇబ్బందులని గమనించి, చలించి స్త్రీలకి అత్యంత ప్రధానమైన గర్భాశయం గురించి వివరించే ప్రయత్నానికి పూనుకున్నారు ఈ డాక్టర్ దంపతులు. ఎన్నో శిబిరాలూ, చర్చలూ, మెడికల్ క్యాంప్స్ నిర్వహించిన అనుభవంతో ఈ అమూల్యమైన పుస్తకాన్ని మనకి అందించారు.

ఎంతో విలువైనదీ, అపురూపమైనదీ… నేటి తరాలకీ, భావి తరాలకీ నిస్సందేహంగా మార్గదర్శిని.

ఈ పుస్తకంలో మొట్టమొదటగా వైద్యశాస్త్రానికి అంతుచిక్కని ఘోరమైన అన్యాయాల గురించి ప్రస్తావన ఉంటుంది. వైద్యరంగంలో వుంటూ ఇంత నిజాయితీగా, నిర్భీతిగా బాధితుల పక్షాన నిలబడి మాటాడే వ్యక్తులు చాలా అరుదు. ఉత్పత్తి రంగంలో అన్ని విభాగాలనీ కదిలించే యంత్రాలు ఎంత ముఖ్యమో, స్త్రీల శరీరాలలో పొందికగా ఇమిడి ఉన్న గర్భాశయం కూడా అంతే ముఖ్యమనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఆ అంశాలే సోదాహరణంగా వివరించారు.

ఆ తర్వాత మొదటి అధ్యాయంలో ఆధారాలు లేకుండా గర్భసంచి తొలగింపూ, ఆ తరువాత ఆయా స్త్రీల అనారోగ్య పరిస్థితీ ఎంతో వేదనగా చెప్పారు. వయస్సు పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి చర్యలు చాలా జరుగుతున్నాయి. అమెరికాలో ప్రతీ వెయ్యిమందిలో 55 మందికీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో కేవలం 20 మందికి గర్భాశయం తొలగింపు (హిస్టరెక్టెమీ) జరుగుతుంటే…. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో ప్రతీ 1000 మందిలో 920 మందికి ఆపరేషన్లు జరుగుతున్నాయట. ఎంత దారుణం? ఎంత అమానుషం!

ఆయా దేశాల్లో ఆపరేషన్ చేయించుకున్న స్త్రీల సగటు వయస్సు 44 సంవత్సరాలయితే, ఇక్కడ మన స్త్రీల సగటు వయసు 29 సంవత్సరాలు మాత్రమే. స్త్రీ శిశు గణాంకాలలో ప్రపంచంలో 179 దేశాలలో మనది 140 వ స్థానంలో ఉండగా… రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు అధిక శాతం మన దేశంలోనే ఉన్నారు. 38.7% చిన్నారులలో సరయిన పోషకాహారం లేక ఎదుగుదల సక్రమంగా ఉండడం లేదు. ఎంత దయనీయమైన సమస్య ఇది?

ఆకలి బాధా…. పోషకాహార లోపం… అసలు మనకేం కావాలో (తక్కువ ఖర్చులోనే) తెలియకపోవడం ఈ దుష్పరిణామాలకి కారణాలు. ఈ పరిస్థితిని అంచనా వేస్తూ కామేశ్వరి గారు ఎంతో ఉదారంగా స్పందించి చాలా విషయాలు తెలియజెప్పారు. బాధితుల గురించి ఇంత లోతుగా ఆలోచించి మధనపడిన మానవతామూర్తులు ఎందరు?

రెండవ అధ్యాయంలో ‘గర్భసంచి – ఆరోగ్య సూచిక’ అనే అంశం మీద చర్చ. ప్రతీ అవయవానికీ సమస్య వచ్చినట్టే గర్భసంచికి ఇబ్బంది రాగానే స్త్రీలూ, వైద్యులూ ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు చాలా విచిత్రంగా, అసమంజసంగా ఉంటూంటాయి. మూలాల్లోకి వెళ్ళి కారణాలు చర్చించకుండా… తాత్కాలిక వైద్య చిట్కాలతో బాధితులని సముదాయించడం ఒక తప్పయితే… ఆ తరువాత దశలో శరీరానికి అతి ముఖ్యమైన సాధనంగా నిలబడే గర్భాశయాన్ని తీసేసే ప్రయత్నాలు ఎంత హేయమైనవో, ఘోరమైనవో ఆమె తెలియజేశారు. జ్ఞానవంతంగా ఆలోచించే ఓపికా, స్పృహ, సహనం స్త్రీలలో లేకపోవడం… ఓర్పుగా నేర్పుగా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి కూలంకుషంగా వివరించే ప్రయత్నం వైద్య నిపుణులు చేయకపోవడం… ఇవన్నీ గర్భాశయాన్ని దెబ్బదీసే చర్యలుగా మారుతున్నాయి.

మూడవ అధ్యాయంలో ‘కాల్షియం జమ’ గురించి చెబుతారు. ఇందులో ఈస్ట్రోజన్ అనే హార్మోన్‌తో పాటుగా పోషకాహారం వల్ల ఎముకల పటిష్టత ఎలా ఉంటుందో… వాటికి విరుద్ధమైన చర్యలు జరిగితే కాల్షియమ్ ఎలా తగ్గిపోతుందో వివరించారు. చిన్న వయస్సులో జరుగుతున్న గర్భసంచి ఆపరేషన్ వల్ల నడుం నొప్పి, ఎముకలు పెళుసుబారడం వంటి అనర్థాలు జరుగుతున్నాయి.

ఇంకా అనేకానేక అంశాల గురించి సమగ్రమైన వివరణ ఉంది. గర్భసంచీ అండాశయాల సంబంధం, వైద్యశాస్త్రంలో పరిమాణక్రమం, స్త్రీలు తమ గురించి తాము మెలకువతో వ్యవహరించడం మొదలైన విషయాలతో పాటు క్షేత్రస్థాయి పరిశోధన – ఫలితాలు సరైన గణాంకాలతో ఇస్తూ గర్భాశయాల్ని తొలగించుకున్న స్త్రీలలో వెన్నుపూస, తుంటి ఎముకల సాంద్రత ఎలా తగ్గిందో పట్టికలో చూపించారు.

గర్భసంచీని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో… డా. కామేశ్వరి గారు చెప్పిన వైద్య చరిత్రని స్త్రీ పురుషులు కూడా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ అధ్యయనాన్ని సున్నితమైన భాషలో, చక్కటి పదాలతో రామారావ్, రాజ్యలక్ష్మి గార్లు సులభతరం చేశారు. వారితో పాటుగా ఈ పుస్తక రచనని ఓ యజ్ఞంలా నిర్వహిస్తూ పాలుపంచుకున్న జ్యోతీ, సంపత్‌రెడ్డి గార్లు ఇంకా అనేకమంది మిత్రులూ ఈ పుస్తకాన్ని ఎంతో ఉపయోగకరమైన అర్థవంతమైన రచనగా తీర్చిదిద్దారు. అందరూ అత్యవసరంగా చదవాల్సిన పుస్తకం ఇది.

ఇకపోతే, ఈ డాక్టరు దంపతుల గురించి మరికొంచెం:
‘నేనూ… నా కుటుంబం… నా అవసరాలూ, కోరికలూ’ అని పనికిమాలిన ఆశలతో, అంచనాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నేటి సమాజంలో… ‘అందరి ఇల్లు’ అంటూ మొదలుపెట్టి… అందరినీ కలుపుకుంటూ ప్రయాణించడం సామన్యమైన విషయం గాదు. వారు ఎన్నెన్ని కార్యక్రమాలు ఎంతెంత పట్టుదలగా గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించారో లెక్కకి అందవు. ‘మనిషికి నిజంగా ఏం కావాలీ’ అనే సరళమైన ఆలోచనా విధానాన్ని వ్యాప్తి చేయడమే వీరి ఆశయం. కార్యాచరణా… మానవతా విలువలూ… స్నేహబంధాలు… “ఏదీ నాది కాదు, అందరిదీ” అనే విశాల దృక్పథం… ఇవన్నీ సంతరించుకున్న సజ్జనులే ఈ దంపతులు. సమాజంలో ఎంతో కొంత కలిసిపోయి బాధ్యతగా కొన్ని ఆచరించాలనుకునే నాలాంటి… మాలాంటి వాళ్ళు చాలాసార్లు ‘హబ్బా టయిమ్ లేదండీ…’ లేదా ‘ఇంటి సమస్యలు ఇలా…’ అని నసుగుతూ కొన్ని తప్పించుకుంటాం. కాని సమయపాలన అనేది వీరు నుంచి నేర్చుకోవాల్సిందే. బంధాలకి ఏ మాత్రం తాత్కాలిక వియోగం వచ్చే ప్రమాదం ఉందని గ్రహించినా వెంటనే వచ్చి వాలిపోయి మన బెంగని తీర్చేస్తారు. తమదైన శైలిలో కులమతాలకి అతీతంగా స్నేహానురాగాలను పంచుతున్న నిరాడంబర జీవులు. ఇంకా వీరి గురించి చాలా రాయొచ్చు గాని ప్రస్తుతం మన పని ఈ పుస్తకం విలువని అందరికీ తెలియజేయడమే కదా? పుస్తకంలో భాషాదోషాలు లేకుండా మంచి శైలితో, విషయ సూచికలతో అందరికీ అర్థమయ్యే రీతిలో తయారు చేశారు. ఈ సమిష్టి కృషిలో ముఖ్య పాత్రధారులు రామారావ్, రాజ్యలక్ష్మి, జ్యోతి, సంపత్‍రెడ్డి తదితరులు (ఇంకా పేర్లు మర్చిపోయుంటే నన్ను క్షమించాలి). పుస్తకం ఇంత అందంగా, విపులంగా రావడానికి వీరి కృషి శ్లాఘనీయం.

పుస్తకం ముగింపులో “నా ప్రియమైన నీకు!” అంటూ తన ఉనికిని ఆర్ద్రంగా, ఆరాటంగా చాటుకున్న గర్భసంచిని మనతో సంభాషించేలా చేయడం ముదావహం. ఓ ప్రఖ్యాత అనుభవజ్ఞురాలైన స్త్రీల వైద్య నిపుణురాలిగా సామవేదం కామేశ్వరి గారు ప్రజ్ఞావంతంగా గర్భసంచితో మాట్లాడించారు. వైద్యభాషని కవితాత్మకంగా, స్నేహపూరితంగా చెబుతున్న కామేశ్వరి గారు అందరికీ ప్రియనేస్తం. వైద్యమూ – సాహిత్యమూ ఆమెకు కార్యరంగాలు.
106 పేజీల ఈ పుస్తకం వెల అమూల్యం. ప్రతులకు ఈక్రింది చిరునామాలో సంప్రదించవచ్చు.

ప్రతులకు:
లైఫ్ హెచ్.ఆర్.జి ప్రచురణలు
అమర్ ప్రేమాలయం,
ఇంటి నంబరు 10-16, రోడ్ 2, ఎస్.బి.ఐ. కాలనీ, కొత్తపేట, హైదరాబాద్ 500035.
ఫోన్: 040-24056984

You Might Also Like

One Comment

  1. sri

    ఇంపార్టెంట్ బుక్ ఫర్ లేడీస్

Leave a Reply