పుస్తకం
All about booksపుస్తకాలు

October 6, 2017

మనకు తెలిసినాయనే! మామంచి కథలు రాశారు!!

More articles by »
Written by: అతిథి
Tags: ,

మనకు తెలిసినాయనే! మామంచి కథలు రాశారు!!
(వేలూరి వేంకటేశ్వరరావు గారి “ఆ నేల, ఆ నీరు, ఆ గాలి”)!!!

వ్యాసకర్త: వాసు
**********

కథలంటే మనందరికీ ఇష్టమే. అందునా మంచి కథలంటే మరీ ఇష్టం కూడా. శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారు తను చెప్పుకున్నట్టుగానే “గత ఏభయ్ ఏళ్ళలో పాతిక పైచిలుకు కథలు” రాశారు. అసలిలా మరీ తక్కువ రాసిన చాలామందిలో గ్రంథపఠనాభిలాషా, సమాజాన్నీ మనుషుల్నీ జీవితాన్నీ పరిశీలించే సల్లక్షణాలూ ఉంటాయన్నది నిజమని మనకు ఇట్టే తెలిసిపోతుంది వేలూరి గారి కథలు చదువుతూంటే. వీరు రాసినదానికన్నా రాసి చింపేసినవీ “చెరిపేసినవీ” రాయకుండా మూల పెట్టేసినవే ఎక్కువని కూడా చెప్పుకున్నారు. నిజమే. అప్పుడే రాసినవి నిగ్గుదేలి సానబట్టిన వజ్రాల్లా మెరుస్తాయి.

ఏ రచయితైనా తనకు అనుభవంలోకి వచ్చిన సంగతులూ విషయాలూ ముచ్చటిస్తేనే మనకు అవి వినసొంపుగా ఉంటాయి. అప్పుడే కథానేపథ్యం పరిచితంగా అనిపిస్తుంది. పాత్రలు రక్తమాంసాలతో జీవం పోసుకుంటాయి. మనం కథలో లీనమవగలం. కథ చదవడం పూర్తయాక వావ్ అనుకుంటాం. మంచి కథకు ఈ రచయిత అనేక తర్జనభర్జనలు పడి ఇచ్చిన నిర్వచనం కూడా ఇదే, పాఠకునిచేత వావ్ అనిపించుకోవడం.

రచనలో స్పష్టత ముఖ్యమని చాలామంది చెప్పారు మనకు. అదే సత్సంప్రదాయాన్ని వేలూరి గారూ కొనసాగించారు. వీరి కథలు స్ఫటికాల్లా తళతళమని మెరుస్తాయి. కథావస్తువు ఎంత మామూలు సంగతైనా వీరి కథనంలో లోపం ఉండదు. వీరు కథకు అనవసరమైన సంగతులు ఎత్తుకోనే ఎత్తుకోరు, అంతేగాక ఆ విషయం అక్కడా అక్కడా చెబుతారు కూడా (ఉదా: పులివేట)

వేలూరి గారిది ఏలూరు (ప.గో. జిల్లా). వీరు 1968లోనే అమెరికా వెళ్ళిపోయారు. వృత్తిరీత్యా Physicist ప్రవృత్తి రీత్యా కవీ, కథకులూనూ.
అయితే వీరి కథలన్నీ “NRI కథలు” కావు. అంటే అమెరికన్ తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కథలు లేవని కాదు, అవొక చిన్న భాగం మాత్రమే. వీటిని తెలుగు Diaspora కథలనీ అనొచ్చు తెలుగు వాళ్ళ కథలనీ అనొచ్చు. నేను వీటిని మంచి తెలుగు కథలనే అంటాను, ఎందుకంటే కథల్లో సగటు తెలుగు పాఠకునికి Footnotes అవసరమయ్యే అమెరికన్ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలూ ప్రస్తావనలూ దాదాపు శూన్యం గనక.

నిజానికి వేలూరి గారికి అమెరికన్ తెలుగు Diaspora సాహిత్యానికీ Nostalgia లోంచీ వచ్చే కథలకూ మధ్యనున్న సూక్ష్మభేదం తెలుసు. అక్కడికెళ్ళిన తెలుగు వారు ఆ జాతి జీవనాన్నీ సంస్కృతినీ వంటపట్టించుకొని అక్కడి మనుషులతో మమేకమౌతూ ఇక్కడి వారు అక్కడివారైన కథలు రాయడమే Diaspora సాహిత్యమంటారు. ఐనా నాకివి తెలుగు కథలుగానే అనిపిస్తాయి, రచయిత ఏ దేశమేగినా ఎందు కాలిడినా తెలుగు భారతికే సేవ చేశారు గనక.

కథల్లోకెళ్ళే ముందు వేలూరి గారి తెలుగు మాష్టారికి వినమ్రంగా నమస్కరిద్దాం. తెలుగు మాష్టారిపై ఒక మంచి కథతో పాఠకులీ పుస్తకాన్ని తెరుస్తారు.

పాఠకలచేత వావ్ అనిపించుకోవాలంటే పెద్ద చిట్కాలేంలేవు. వ్యంగ్యాస్త్రాలనే సంధించాలని లేదు. Satires ఝళిపించాలనీ లేదు. ఈ రచయిత ఆ రెండూ సమర్థవంతంగా చేసినా మనసుని తాకే పనివాళ్ళ కథలూ రాసి చదివించొచ్చు. ప్రెసిడెంటు నరికేసిన క్లబ్బుచెట్టు చూపించొచ్చు. (ఎవరు చెట్టు నరికేశారన్నా నాకు చెహోవ్ కథ Cherry Orchard గుర్తొస్తుంది.)

“గోమెజ్ ఎప్పుడొస్తాడో” అనే కథ Uncdocumented Workers అమెరికాలో పడే సాధక బాధకాల్లోంచీ వచ్చినది. గోమెజ్ వంటి అమాయకులూ ఒళ్ళుదాచుకోకుండా పనిచేసే వాళ్ళు ఎటువంటి ఆర్థిక దోపిడీకి గురి అవుతారో Insurance లేని జీవితం ఆ దేశంలో ఎంత Riskతో కూడుకున్నదో మనకు
అర్థమవుతుంది. NRI సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇండియాకి పెళ్ళిచూపులకని వస్తే జరిగే సంగతులూ ఒక కథయ్యాయి. చాలా ఏళ్ళ తరువాత వచ్చిచూస్తే సొంతూరు ఎంత మారిపోయిందో ఇంకో రెండు కథల్లో చూడొచ్చు. మనిషి ఎంత అమెరికా వెళ్ళి వేషభాషలు మారినా తెలుగు వాడికి ఆవకాయ, గోంగూర తోడుగా ఉంటాయన్న సంగతి ఇంకో కథలో సరదాగా చెబుతారు.

కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే ఈ సంపుటిలో Title కథ ఒక Mythological Satire అవడం. ఈ కథలో సొంతగడ్డ మీద Nostalgiaలోంచీ వచ్చే కథనుకుంటాం గానీ ఇది పచ్చి వ్యంగ్య రచన. ఈ కథ బాగున్నా నాకెందుకో కాస్త అసంతృప్తి మిగిల్చింది. మన గురించిన పచ్చి నిజాలు మనకే చెబితే ఆ మాత్రం మనసు చివుక్కు మనడం సహజం.

ఈ రచయితకు Mythological Satires అంటే ప్రత్యేకమైన ఇష్టమేదో ఉండుండాలి. లేకపొతే “స్వర్గంలో స్ట్రిప్‌టీజ్”, “బ్రహ్మసృష్టి” వంటి కథలు రాసుండరు. అయితే వీటిల్లో మనకు వ్యంగ్యం కన్నా ఏదో విషాదం ఎక్కువ కనిపిస్తుంది.

“గుర్రాలు గుగ్గిళ్ళు” అనే కథల్లో అమెరికన్ రాజ్యతంత్రాన్నీ, విదేశాంగ విధానాల్లోని కుటిలనీతినీ బట్టబయలు చేస్తారు. రచయిత దీన్ని రూపకం అన్నా కథంతా తేటతెల్లంగా ఉంటుంది.

మనిషిని మనిషి దోచుకోవడం, ఒక జాతిని వేరొక జాతి పీడించడం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా తన గొంతునెత్తి తనదైన పంథాలో రచనలు చేసిన వేలూరి గారు తమ కథలతో మనకు నవ్వు తెప్పిస్తారు, ఒక్కోసారి కోపం కాస్త చిరాకు కలిగిస్తారు కానీ మనకంట కన్నీరెందుకో తెప్పించరు. “మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్” అనుకుంటారేమో.

బహుశా ఆయనకు మనల్ని నవ్విస్తూ ఆలోచింపజేస్తూనే హఠాత్తుగా ఒకసారి ఈ నవ్వుల వెనుక ఏదో విషాదముందని జ్ఞానం కలిగి తరుణోపాయం గురించి మనమే ఆలోచిస్తామని అత్యంత నమ్మకం కాబోలు. నా మటుకు నాకు అలాగే అనిపిస్తుంది. వేలూరి గారి కథలు చదివితే మీకూ అలాగే అనిపిస్తుందేమో! చదివి చూడండి.

-వాసు-

For Copies:
Navodaya Publishers,
Eluru Road,
Vijayawada, Ph: 0866-2573500
Or
Contact The Author: vrveluri @ gmail.com

(ఈ పుస్తకానికి వాసిరెడ్డి నవీన్ గారి ముందుమాట ఇక్కడ చూడవచ్చు)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.3 Comments


  1. Vasu (Srinivasa Nyayapati)

    Thanks a lot DCNS Rao garu. -Vasu-


  2. Desu Chandra Naga Srinivasa Rao

    ఏ దేశమేగినా ఎందు కాలిడినా తెలుగు భారతికే సేవ చేశారు…
    Veluri’s contribution described greatly  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వేలూరి వేంకటేశ్వర రావుతో ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూ చేసినది: సాయి బ్రహ్మానందం గొర్తి (ఈవారం నవ్య వారపత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ...
by అతిథి
1

 
 

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి – వేలూరి వెంకటేశ్వరరావు కథలు

ఈమాట సంపాదకులలో ఒకరైన వేలూరి వెంకటేశ్వరరావు గారు రాసిన కథల సంపుటి – “ఆ నేల, ఆ నీరు,...
by పుస్తకం.నెట్
5