కాళోజీ నారాయణరావు “ఇదీ నా గొడవ”

కాళోజీ నారాయణరావు గారి గురించి, ఆయన “నా గొడవ” కవిత్వం గురించీ, ఆత్మకథ గురించీ వినడం తప్పిస్తే నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు. ఎప్పటికప్పుడు ఏదన్నా చదవాలి అనుకోవడం, అందుబాటులో ఆయన రచనలు దొరక్కపోవడం జరుగుతూ వచ్చింది. మొన్న ఆమధ్య కాళోజీ జయంతి సందర్భంగా ఎ.కె.ప్రభాకర్ గారి “భాష కూడా యుద్ధ క్షేత్రమే” వ్యాసం, అదే సమయంలో నా మిత్రుడు రాకేశ్ వాళ్ళ కాలేజీలో కాళోజీ జయంతిని జరుపుకున్న విషయం ఫేస్బుక్ లో పంచుకోవడం రెండూ కలిపి ఇంక ఇప్పటికైనా చదవాలి అనిపించింది. తరువాత పుస్తకం ఇంటర్ లైబ్రరీ లోనులో నా చేతికొచ్చింది.

దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఇరవయ్యో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రధాన ప్రజా ఉద్యమాల్లోనూ ముఖ్య పాత్ర పోషించారు. నిజాము పాలన మొదలుకుని 80ల దాకా రకరకాల ప్రజా ఉద్యమాల గురించి, కాలానుగుణమైన మార్పుల గురించి, నిజాం-బ్రిటీష్ ఇండియా ల మధ్య తేడాల గురించి – ఇలా అనేక సంగతులు పుస్తకంలో ఉన్నాయి. ఆయన వ్యక్తిగతం గురించి, అన్న రామేశ్వరరావు గురించి ప్రస్తావన చాలా తక్కువ (మొదట్లో చిన్నతనం గురించి తప్పిస్తే కుటుంబ ప్రస్తావన దాదాపు అసల్లేదనే చెప్పాలి).

నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయం – ఆయన రాత అలా మాట్లాడుతున్నట్లే ఉండటం. ఆయనెంత ఎమోషనల్ మనిషో, ఎంత తొందరగా ఉద్వేగాలకి లోనౌతారో ఆయనే రాసుకున్నాడు గాని, పుస్తకంలో వివిధ సంఘటనల వద్ద కూడా – అది రాసిన విధానంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఆవేశమో, ఆవేదనో ఏదో కలుగుతుందని సన్నివేశాన్ని బట్టి మనం ముందే చెప్పేయొచ్చు అనమాట 🙂 కాళోజీ నగర బహిష్కారానికి కూడా గురయ్యారంటే (అసలు అలాంటి శిక్షలు జానపద కథల్లోనే అనుకున్నా నేను) పరమ ఆవేశపరుడు అనిపిస్తుంది. కానీ, మళ్ళీ నాకు “చిన్న విషయం”గా తోచిన అంశాలకి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానని కూడా రాశారు. మొత్తానికి భలే మనిషి. అడ్వెంచరస్ కూడా. నిజాం కాలంలో వీళ్ళు చేసిన పనుల గురించి, జైలు వాసాలలో జీవితం గురించి చెబుతూంటే పరమ ఉత్కంఠతో చదివాను.

అక్కడక్కడా రాసిన ఆయన కవితలు నాకు చాలా నచ్చాయి. నాకు సాధారణంగా ఎక్కడో ఒక శ్రీశ్రీ, ఒక అజంతా, ఒక ఇస్మాయిల్ – ఇలా కొందరు ప్రముఖులు రాసిన నాలుగైదు కవితలు తప్పిస్తే కవిత్వమంటే భయం. అర్థం కూడా కాదు. దూరంగా జరుగుతాను. కానీ, ఈయన రాసినవి నాకు ఎందుకో చాలా నచ్చాయి. ఎక్కువ భావుకత, మార్మికత అనుకునే తరహా vagueness, evasiveness లేకుండా సూటిగా, తేలికైన భాషలో ఉండటం వల్ల కాబోలు. పైగా కొన్ని కవితలు ( “నా ఇజం” వంటివి) కాలాతీతంగా, ఇప్పటికీ సరిగ్గా సరిపోయేలా ఉండటం ఓ కారణం కావొచ్చు.

చాలామంది ప్రముఖుల గురించి ఆసక్తికరమైన స్కెచెస్ ఉన్నాయి – విశ్వనాథ, పీవి నరసింహారావు, రాయప్రోలు సుబ్బారావు, సర్దార్ జమలాపురం కేశవరావు – ఇలా అసార్టెడ్ వ్యక్తుల గురించి. విశ్వనాథ వారి గురించి నాలుగైదు చోట్ల ప్రస్తావన ఉంది. వీళ్ళిద్దరికీ స్నేహం ఉందన్న విషయం నాకసలు ఊహకైనా రాలేదు. పుస్తకం చదివే ముందు నా ఊహ వీళ్ళిద్దరూ భిన్న ధృవాలని. కానీ, ఇందులో ఆయన గురించి రాసిన విషయాలు పుస్తకాలు చదివి ఆయన గురించి అనుకున్నదానికి కొంచెం భిన్నంగానే ఉన్నాయి. అలాగే, భక్తుడు భజనచేసినట్లు కాక, ఒక సమకాలీకుడు, స్నేహితుడు, సాహిత్యకారుడు భక్తిభావంతో-గురుభావంతో కాకుండా, మామూలుగా ఇంకో తెలిసిన రచయిత గురించి రాసినట్లు ఉన్నాయి (విశ్వనాథ మీద గుత్తాధిపత్యం తీసుకున్న దురభిమానులు ఇప్పుడు నన్ను ఏకేస్తారు కాబోలు). పీవీ గురించి ఈయన చాలా అభిమానంతో, చనువుతో రాసుకున్నారు. జమలాపురం కేశవరావు గురించి మాకు తెలుగు పాఠ్యపుస్తకంలో ఉండేది స్కూల్లో. పేరు తప్ప ఆట్టే గుర్తులేదు కానీ, కాళోజి రాసింది చదివాక ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.

పుస్తకం రచనా కాలం నాకు తెలియదు కానీ నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం మట్టుకు ఒక కాలం నుండి ఇంకో కాలంలోకి జంప్ అవుతూ ఆయన కథ చెబుతూ పోవడం. రికార్డు చేసిన దాన్ని ఫెయిర్ చేసినట్లే అనిపించింది నాకు – మొదట్లో వాళ్ళు రాసినట్లు. దీని వల్ల ఆయా సంఘటనలతో, కాళోజీ తో పరిచయం లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందే కావొచ్చు. ఏ బయోగ్రఫీనో చదవనిదే పూర్తి పిక్చర్ రాదు. పేర్వారం జగన్నాథం గారు రాసిన జీవిత చరిత్ర ఒకటి కనబడ్డది తెలుగుథీసిస్ వెబ్సైటులో. త్వరలో వీలు చూసుకుని చదవాలి.

intolerance గురించి ఆయన రాసిన విషయం ఆలోచింపదగ్గది.

“బ్రిటీష్ ఇండియా సంగతి తెల్వదుగాని నైజాంలో చదువుకున్న ప్రతివాని ఇంట (హైద్రాబాదు, వరంగల్ లలో) భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల ఫొటో వుండేటీది. బజార్లొ అమ్మెటోళ్ళు, వకీళ్ళ ఇళ్ళలో గాంధీ, మోతీలాల్, చిత్తరంజన్ దాసు, తిలక్, లాలా లజపతిరాయ్, సేన్ గుప్త ఫొటోలు కూడా వుండేటివి. ఇవేవీ నైజాం కాలంలో అభ్యంతరాలు కాదు. మరి ఇప్పుడు ’80-’85 లలో మావో సాహిత్యం, విప్లవ సాహిత్యం దొరికినయని దాడులు చేస్తరు, రాడికల్ సభలో మావో ఫొటో పెట్టిన్రని ఆక్షేపిస్తరు.

“నా యిజం” కవిత పుస్తకం మొత్తంలోకి నన్ను అమితంగా ఆకట్టుకున్న అంశం.

“నేనున్నదే నిలువదగిన చోట
అటుఇటు పోయినచో లోటు
నను దాటిన భ్రష్టాచారం
వెనుకబడిన చాదస్తం
నాది నిత్యనూత్న వికసిత జ్ఞానం
నీది బుద్ధి జాడ్య జనితోన్మాదం
నాకోపం స్వభావసిద్ధం
మీకైనను ఓర్పుండొద్దా?
నాకున్నవి అన్నియు హాబీలు
మీకున్నవి వ్యసనాలవి తగవు
నాదంతయు అప్టుడేట్ కల్చర్
దస్ ఫార్ అండ్ నో ఫర్దర్
ఇదిగిదిగో చెలియలికట్ట
కాదన్నవాడి కన్నులు లొట్ట
నాకందినది నాది
నాకందనిది మనది
నానా ‘యిజా’ల కడుగున జూడ
‘నా యిజం’దే అగుపడును జాడ.”

ఇంకా చాలా చెప్పొచ్చు గాని ఇంక ఆపుతాను. చివరగా, సాధారణంగా నాకు అంత బారుండే ముందుమాటలంటే చిరాకు. అందునా ఇదివరలో “ఊరువాడ బ్రతుకు” పుస్తకానికి వరవరరావు గారి ముందుమాట చదివి బోరు కొట్టిందనుకున్న అనుభవం వల్ల కాస్త సందేహించాను చదివేందుకు. కానీ బాగుంది. కాళోజీ వ్యక్తివాన్ని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు రాశారు.మొత్తానికైతే కాళోజీ భలే మనిషి. ఎంచక్కా ఎదురుగుండా నిలబడి మాట్లాడుతూంటే గొప్పగా ఉండేది అనిపించింది. పైగా చెవులకింపుగా తెలంగాణంలో! పుస్తకం దొరికితే తప్పకుండా చదవండి. archive.orgలో, తెలుగుథీసిస్.కాం లోనూ కాళోజి రచనలు, రికార్డింగు ఒకటీ ఉన్నాయి.

You Might Also Like

3 Comments

  1. నాగరాజు ఆధురి

    కమ్మని భావాలను కలంతో రాయడమే కవిత్వం అని భావించి నేను నా గోడను కొంత చదివి నా గోడవేంటో తెలుసుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి వైతాళికుని విలువైన మాటలముఠలను మరింత మందికి చేరగలరని కోరుకుంటున్నాను కాళోజి గారి కలం అడుగుల్లో ఆశలను ఆశయాలుగా మార్చుకుని మరోప్రస్థానం కోసం కవితలు రాస్తున్న కవిని నేను

  2. G K S Raja

    బావుంది సౌమ్య గారూ మీ సమీక్ష, పరామర్శ. నేనూ గతేడాదే చదివాను. ‘నా గొడవ’ లోనే మరోచోట నాకు నచ్చిన ఆయన మాట – “ద్రోహం చేసినవాడు పరాయివాడైతే తరిమికొట్టు.
    ఇక్కడివాడైతే పాతిపెట్టు”.

  3. రవి

    ఈయన “రెండు జిల్లాల భాష మాత్రమే తెలుగైతే, ఆ తెలుగు నాది కాదు” అని అన్నాడని ఎక్కడో చదివాను. అది తప్ప ఈయన వ్రాసిన పుస్తకం గురించి ఇప్పుడే తెలుస్తోంది. వ్యాసం చదివితే దాశరథి సోదరుల జీవితచరిత్రలు గుర్తొచ్చాయి. దాశరథి రంగాచార్య గారి పుస్తకంలోనూ ఓ చోట విశ్వనాథ ప్రసక్తి ఉంది. 🙂

    కాళోజీ విశ్వనాథను పేర్కొన్నాడు కాబట్టి స్నేహభావం ఉంది కాబట్టి, ఈ కాళోజీని గొప్పకవి అని అంగీకరించక తప్పదు. పొగిడి ఉంటే తప్పక ’మహాకవి’ అయుండేవాడేమో. ఛాన్స్ మిస్. ఏదేమైనా, కాళోజీ కవితలను, ఆయన జీవితచరిత్రను ఎప్పుడైనా వీలుదొరికితే చదవాలి.

Leave a Reply to రవి Cancel