Ants among elephants

“Ants Among Elephants: An Untouchable Family And The Making Of Modern India” అన్న పుస్తకం గురించి ఆమధ్య మొదట న్యూయార్క్ టైమ్స్ లోనూ, తరువాత ఎన్.పీ.ఆర్. లోనూ చదివాక నాకు ఆసక్తి కలిగింది. గూగుల్ బుక్స్ ప్రివ్యూలో పుస్తకం లోని మొదటి కొన్ని పేజీలు చదివాక ఆ ఆసక్తి పెరిగింది. మొత్తానికి పుస్తకం చదివాక ఈ పరిచయం రాయాలనిపించింది.

పుస్తకంలో కథావస్తువు – రచయిత్రి గిడ్ల సుజాత గారి అమ్మా-నాన్న, అమ్మ పూర్వీకులు, మేనమామ కె.జి.సత్యమూర్తి (శివసాగర్) – వాళ్ళ జీవితాలు. ఖమ్మం జిల్లా ప్రాంతంలోని శంకరపాడు అన్న గ్రామంలో నివాసం ఏర్పరుచుకున్న ఒక సంచారతెగవారు వీళ్ళ పూర్వీకులు. వాళ్ళ మానాన వాళ్ళు ఉంటూండగా నాగరికుల కళ్ళు ఆ భూమి మీద పడ్డం, వీళ్ళు వీళ్ళ స్థలాల్లోనే కూలీలుగా మారి, హిందూ కుల వ్యవస్థలోకి అస్పృశ్యులుగా చేరడం, తరువాత మిషనరీల ప్రభావంలో క్రైస్తవ మతం పుచ్చుకుని, ఆధునిక విద్యను నేర్చి, క్రమంగా వీరిలో కొందరు ఉద్యోగ జీవితాల్లోకి (టీచర్లు/లెక్చరర్లుగా) అడుగుపెట్టడం దగ్గర మొదలవుతుంది కథ. ఇక ఆపైన వాళ్ళ పిల్లల జీవితాలు (సత్యమూర్తి, కేరీ, మంజుల), వాళ్ళ తరువాతి తరం (ఈ రచయిత్రి తరం) గురించిన వివరాలు మిగితా కథ. కనుక నిజానికి ఈ కథలోని ప్రధాన పాత్రలు నిజానికి ants among elephants కాదు. Elephants among ants అని అనుకోవాలి. వాళ్ళ నేపథ్యం నుండి వచ్చిన ఇతర (ఉద్యోగాలు, చదువుల వాసన అంటని) కుటుంబాల గురించి రాసినది చదువుతూంటే నాకు అనిపించింది అదీ.

రచయిత్రి వాళ్ళ అమ్మమ్మ-తాతయ్యల జీవితాలను గురించి రాసిన భాగం (మొదట్లో వచ్చినది) నన్ను ఇందులో అన్నింటికన్నా ఆకట్టుకున్న అంశం. ఆ తాతగారి కథ వినే అదృష్టం ఉండి ఉంటే బాగుండేదనిపించింది. ఇక సత్యమూర్తి గారి గురించి రాసిన భాగం కూడా ఆసక్తికరంగా అనిపించింది. నాకు అప్పుడప్పుడూ ఆయన కవిత్వం గురించి రాసిన వ్యాసాలు, “నిర్జన వారధి”లో ఆయన ప్రస్తావన తప్ప పెద్దగా తెలియదు. ఈ పుస్తకంలో కొంచెం ఆయన జీవితం ఉంది – కొన్ని అంశాలు ఆశ్చర్యకరంగా అనిపించాయి (సొంతపనులు చేస్కోడానికి మనుషులు కావాలనే మనిషి ఉద్యమాలను నడిపే నాయకుడవడం ఒక ఉదాహరణ). అలాగే, వీళ్ళు యువకులుగా ఉన్నప్పటి విషయాలు (ముఠాలు-గొడవలు, ఫోర్జరీ వంటివి) – దాపరికం లేకుండా ఓపెన్ గా రాయడం కూడా బాగుంది. ఆ కాలంలో మంజుల గారు రెండు మాస్టర్స్, అందునా ఒకటి బెనారస్ దాకా వెళ్ళి చదవడం గొప్ప విషయం అనిపించింది – మా అమ్మమ్మ కంటే పెద్ద వాళ్ళలో దేశం దాటెళ్ళి పీ.హెచ్.డీ చేసొచ్చిన స్త్రీలు నాకు తెలుసు కానీ, వాళ్ళంతా బాగా చదువుకున్న కుటుంబాల వాళ్ళు. తొలి తరం, లేదా రెండో తరం ఎడ్యుకేటెడ్ కాదు, దళిత నేపథ్యం లేదు. అందువల్ల వర్కింగ్ కండీషన్స్ గురించి,కుల వివక్ష గురించి చదివి అసహ్యం వేసినా, వీటన్నింటి మధ్యా ఆవిడ బాగా చదువుకుని కాలేజి లెక్చరర్ గా పనిచేయడం గొప్పగా అనిపించింది.

నచ్చని అంశాలు చాలానే ఉన్నాయి: ప్రధానంగా ఎడిటింగ్ కొంచెం సరిగా ఉంటే బాగుండనిపించింది. చాలా చోట్ల ఒకటి చెప్తూ ఇంకోదాన్లోకి పోవడం, టైం లైన్ గురించి స్పష్టంగా లేకపోవడం, పాత్రలు వస్తూ పోతూ ఉండటం వల్ల చివరికొచ్చేసరికి అసంపూర్ణంగా, అసంతృప్తిగా అనిపించింది. ఇక, టైటిల్ చూసి, మొదట్లో ప్రివ్యూ చూసి, పుస్తకం గురించి నేను అనుకున్నది వేరు – నేను ఇంకా వాళ్ళ పూర్వీకుల గురించి, వాళ్ళ జీవితాల్లో చదువు, క్రైస్తవమతం వల్ల వచ్చిన బాగు – చదువుకోని బంధువర్గం ఏం చేశారు? వాళ్ళు ఆధునిక భారద్దేశంలో ఎలా ఇమిడారు? ఇలాంటివి రాస్తారనుకున్నాను. అలాగే, సత్యమూర్తి గారి గురించి రాసిన భాగాలు కూడా – ఇంతకీ ఆయన కుటుంబం తర్వాత ఏమైంది? అసలు ఆయన చివరి రోజులకి ఉద్యమంతో సంబంధాలు ఏమిటి?, సుజాత గారి అమ్మ దృక్కోణంలో అసలు తమ కుటుంబాల పరిణామక్రమం ఎలా ఉంది? ఇలాంటివి ఏవన్నా ఉంటాయనుకున్నాను ఆ ప్రివ్యూ చూసి. టైటిల్లో గల making of modern India గురించి పుస్తకంలో ఏమీ లేదు. ఇదంతా సుజాత గారు చేయి తిరిగిన రచయిత్రి కాకపోవడం వల్ల కావొచ్చు, విషయ సేకరణలో ఆవిడ మాట్లాడుతున్న పెద్దవాళ్ళంతా దాదాపుగా క్రమంగా మరణించడం కూడా కావొచ్చు – ఆవిడే రాసినట్లు.

మొత్తానికైతే తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం అనను కానీ, ఆ మొదటి యాభై పేజీలు చదివి అంతా అదే స్థాయిలో ఊహించుకుంటే నిరాశపడతారు అని చెప్పగలను. “My father Balaiah” పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాను ఇది చదివాక (కబాలి సినిమా చూసినరోజే అనుకున్నా ఇంకా చదవలేదు. ఈ పుస్తకం పుణ్యమా అని చదువుతానేమో!).

You Might Also Like

Leave a Reply