రష్యన్ జానపద కథలు -స్వేచ్ఛానువాదం

వ్యాసకర్త: పూదోట శౌరీలు
******************
ఉమ్మడి కుటుంబాలున్న రోజుల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు రాత్రిళ్ళు కథలు చెబుతూ పిల్లలను నిద్రబుచ్చేవాళ్లు. పిల్లలు గూడా ఆ కథలు వింటూ వూహాలోకంలో విహరిస్తూ, కమ్మని కలలు కంటూ నిద్రపోయేవాళ్లు. ఆ కథల్లో ఎక్కువ నీతికథలే వుండేవి. ఆ నీతులను గూడా ఎక్కువగా జంతువులు, పక్షులు, ప్రకృతి పాత్రలుగా చేసుకుని చెప్పేవాళ్లు. లేదా భేతాళ మాంత్రికుడు, పేదరాశిపెద్దమ్మ కథలుండేవి. విష్ణుశర్మ గూడా రాజకుమారులకు రాజనీతి భోధించటానికి ఎక్కువగా జంతువులు, పక్షులు పాత్రధారులుగా చేసుకునే “పంచతంత్రం” రాశాడు గదా. పిల్లలు చిన్న వయసులో ఇలాంటి కథలు వినటం వలన వారిలో మానవతావిలువలు, సత్ప్రవర్తన అలవడుతాయి.

ఇళ్ళలో ఇలాంటి కథలు చెప్పటానికి ఇప్పుడు పెద్దవాళ్లూ కరువైనారు, తల్లిదండ్రులకూ అంత తీరిక లేదు. పిల్లలకు టివీలు, స్మార్ట్ ఫోన్లు అలవాటు చేసి కథలు చెప్పే పని నుండి తల్లిదండ్రులు తప్పించుకుంటున్నారు. వీటితోనే అనేక సమస్యలు, ఈ మద్య మరీ 10,12 ఏళ్ల పిల్లలు గూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాకాకుండా పిల్లలకు కథల పుస్తకాలు చదివే అలవాటు చేస్తే చదివే అలవాటూ పెరుగుతుంది, కథల ద్వారా మానసికానందం పొంది ఉల్లాసంగానువుంటారు. పిల్లలు ఎక్కువగా జంతువులు, పక్షుల బొమ్మలున్న పుస్తకాల పట్ల ఆసక్తి చూపిస్తారు. అలాంటి పుస్తకమే “రష్యన్ జానపద కథలు” ఈ కథలను అనిల్ బత్తుల గారు తెలుగు లోకి స్వేచ్ఛానువాదం చేశారు.

పిల్లలు ఎక్కడైనా పిల్లలే,వారి తత్వాలూ ఎక్కడైనా ఒక్కటే. ఇవి రష్యన్ కతలైనా ఆ కథల్లోని పాత్రలన్నీ అన్ని దేశాల్లో వుండేవే. ఈ పుస్తకం చూడగానే వెన్నముద్దలా మెరిసిపోతూవెంటనే చేతుల్లోకి తీసుకోవాలనిపించే వెన్నముద్దలాంటి పుస్తకం. అట్టమీద బొమ్మలో ఒక పిల్లవాడు కొండలమీదుగా ఆకాశంలోకి ఎగిరి సీతాకోకచిలుకల్లాంటి నక్షత్రాలను అందుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఒరిజినల్ రష్యన్ బొమ్మల్ని ఆర్ట్ పేపర్ మీద ముద్రించటం వలన పిల్లలకు ఆ బొమ్మల్ని తడిమి చూడాలనే కోరిక కలుగుతుంది.

ఈ పుస్తకంలో మొత్తం ఇరవై కథలున్నాయి. ప్రతి కతా పిల్లల చేతికొక ఆణిముత్యమే. పిల్లలు చదవటానికి ఇస్టపడే విధంగా పెద్దసైజ్ అక్షరాలతో, వరుసల మద్య ఎక్కువ నిడివితో, చిన్నచిన్న వాక్యాలతో, చిన్నచిన్న పేరాలతో, చక్కని, చిక్కని రంగులతో వున్న బొమ్మలతో, కథలు మరీ పెద్దవిగా లేకుండా రెండు, మూడు పేజీలతో ముగించటం, ఇన్ని మంచి అంశాలుండటం వలన పిల్లలు విసుగుతో పుస్తకాన్ని అవతలకు గిరాటేయ్యకుండా చక్కగా చదవగలుగుతారు. తల్లిదండ్రులు గూడా పిల్లలకు చదివి చెప్పగలిగే మంచి కథలున్న పుస్తకమిది.

మొదటి కథే “బుజ్జి పిచుక” పిచ్చుకలకు మనుషులతో అవినాభావసంభందమెక్కువ. మన ఇళ్ళలో మనతో పాటు సహజీవనం చేసే పిట్ట ఇది. ఈ కథలో బుజ్జిపిచ్చుక “పూడిక”కి అన్నీ సందేహాలే. “అమ్మా మనలాగ మనుషులకేందుకు రెక్కలుండవు? ఎందుకెగరరు?” పూడిక్ కి అన్నీ తొందరగా నేర్చుకోవాలని ఆరాటం. ఆ తొందరలో పిల్లికి ఆహారం కాబోతుంది పూడిక్. వాళ్ళ అమ్మపిచ్చుక దాన్ని కాపాడి “పిల్లలు పెద్దల మాట వినాలమ్మా” అని సందేశంస్తుంది. అలాగే “అన్నదమ్ముల కథ”లో పిచ్చుకలు తమ ముక్కులతో పొడిచి మంచుగది తాళం తీయటంలో పెద్దోడికి సాయ చేస్తాయి. పిచ్చుకలు, ఇతర పక్షులు, జంతువుల సాయంతో చిన్నోడిని కాపాడుకుంటాడు పెద్దోడు. “మేలు మరవని పిచుక” కథలో పిచ్చుకలు కాకులతో యుద్దం చేసి అవి దొంగలించిన గాజుపూలగుత్తిని సిండ్రెల్లా పాత్రలో నటిస్తున్న మాషా వాళ్ళ అమ్మకు అందిస్తాయి.

పావెల్ రాసిన “వెండి గిట్ట” కథలో వెండిగిట్ట వున్న మేక పిల్లల్ని ఊహా లోకంలోకి తీసుకెళ్లి ఆనందడోలికల్లో వూపుతుంది. వెండిగిట్ట మేక కోసం పాప అన్వేషణ.. ఆ మేక తన గిట్టతో ఇంటి చుట్టుపక్కల, ఇంటిమీద రంగురంగుల వజ్రాలను రాల్చటం, ఆ వజ్రాలను రాల్చటంలో పిల్లి సాయం, బోలెడన్ని వజ్రాలు ఎరుకున్న పాప, పాప తాత… ఈ కథలోని వెండిగిట్ట మేకను చూస్తూ పిల్లలు అక్కడే కాసేపు ఆగిపోతారు.

పిల్లలెప్పుడు ముదురు రంగుల్నే ఇస్టపడతారు. అవి కంటికి అనువుగా వుంటాయేమో. అందుకే వాళ్ళు ఆడుకునే బొమ్మలన్నీ ముదురు రంగుల్లోనే వుంటాయి. ఇంద్రధనుసులో వున్నట్టే వున్న “ఏడురంగుల పువ్వు”ల రేకలతో పాప మేడలు, మిద్దెలు, అష్టైశ్వర్యాలు కోరుకోలేదు. కోరికలు తీర్చే ఏడురేకలతో చిన్నిచిన్నికొరికాలే తీర్చుకుంది, ఆఖరి లేత నీలపు రేకతో కుంటివాడైన స్నేహితునికి కాలిమ్మని కోరుకుంది. “పన్నెండు నెలలు”కథలో నెలలన్నీ కూడబలుక్కుని సవతితల్లి చేతిలో కష్టాలు పడుతున్న పాపాకి మంచుబిందువులిచ్చి సాయం చేస్తాయి. పిల్లలు పుస్తకాలలో చదివినవాటిని, టి‌విల్లో, సినిమాల్లో చూసిన సాహసాలను చేయాలనుకుంటారు.. అలాంటి కథే “చెట్టు రహస్యం”. అల్లాగే జంతువులు ప్రధానపాత్రలుగా వున్న కథలు: నక్క [శీతాకాలపు కథ-12], ఒంటె[పిల్లవాడు-ఒంటె-13], కుందేలు [బుజ్జికుందేలు ఇకసెలవ్-15], ఉడుత [మాయా వుంగరమ్-17], కుక్క [ఇసుకతుఫాన్-18], ఆవు [బుల్ ఫైట్-19], గుర్రం [గుర్రపు స్వారీ-16] – ఇవన్నీ పిల్లలకు ఆనందం కలిగించే కథలే.

ఈ “రష్యన్ జానపద కథలను” అనువాదం చేసిన అనిల్ బత్తుల గారు ప్రతి కథ చివర మూలరచయిత వివరాలు, ఫోటో తో సహ వేసి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే ఇంగ్లిష్ అనువాదకుల పేర్లు, చిత్రకారుల గురించి కూడా రాశారు. ప్రపంచ సాహిత్యంలో వున్నత స్థానాన్ని పొందిన గోర్కీ, ఐత్మాతోవ్, పావెల్ లాంటి రచయితలు గూడా పిల్లల స్థాయికి దిగి వారికోసం మంచి కథలు రాశారు. ఈ ఇరవై కథలూ పిల్లలకు నీతులు భోధించేవే. మంచి ఆలోచనలు, మానవతావిలువలు, సామాజిక సేవ, సృజనాత్మకత, సమయ స్పూర్తి లాంటివి పెరగాలంటే పిల్లలకి ఇలాంటి పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలి. ఆటలపోటీల్లో, వారికి జరిగే వేడుకల్లో గన్,టెడ్డి బేర్ ల కన్నా పుస్తకాలే ప్రధానంగా కనిపించాలి. అందుకే అనిల్ గారు ఈ పుస్తకానికి స్వల్ప ధరనే పెట్టారు. కేవలం 100/రూ మాత్రమే. ఈ పుస్తకం తప్పక ప్రభుత్వ, ప్రైవేట్ పాటశాలల లైబ్రెరీ లో వుండాల్సిన పుస్తకం.

పుస్తకం వెల-100/రూ
పేజీలు-78
పుస్తకం దొరుకు ప్రదేశం: అనిల్ బత్తుల -9676365115 మరియు నవోదయ

You Might Also Like

Leave a Reply