పుస్తకం
All about booksపుస్తకభాష

August 8, 2017

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: Halley
*************
ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ లైఫ్” అన్న పుస్తకం గురించి. ఆ పుస్తకం చదివాక నాలో కలిగిన ఆలోచనల గురించి. రచయిత డగ్లస్ నైట్ బాలసరస్వతి గారికి స్వయానా అల్లుడు కావటం విశేషం. బాలసరస్వతి గారి గురించిన వికీ లంకె. సంప్రదాయ దేవదాసి కుటుంబంలో పుట్టిన బాలసరస్వతి ఇరవయ్యో శతాబ్దంలో జాతి గర్వించదగ్గ కళాకారులలో ఒకరిగా ఎదిగారు.

దేవదాసి వ్యవస్థ గురించీ ఆ కళాకారిణుల గురించీ నాకు తెలిసింది ప్రధానంగా పుస్తకాల ద్వారానే. ఒక పదకొండు ఏళ్ళ కిందట మా కాలేజీ లో ఒక హిస్టరీ ప్రొఫెస్సరు వారిని రిలిజియస్ ప్రాస్టిట్యూట్స్ అని పరిచయం చేసింది మాకు. అదే సమయంలో నేను మొదటి సారి విశ్వనాథ వేయి పడగలు చదవటం జరిగింది. అందులో ఆయనేమో ఎంతో ఉదాత్తమైన పాత్ర ఇచ్చాడు దేవదాసికి. అప్పటి నుంచి ఇప్పటి దాకా నేను ఆ వ్యవస్థ గురించి ఈ విభిన్న కథనాలు అడపా దడపా చదువుతూనే వచ్చాను. వి.శ్రీరామ్ గారు రాసిన “Devadasi and the Saint” పుస్తకం చదివినప్పుడు మొదటి సారి బెంగళూరు నాగరత్నమ్మ గురించి వినటం. అటు తర్వాత తిరువయ్యారు వెళ్ళినప్పుడు ఆవిడ సమాధిని చూడటం కూడా జరిగింది. కొన్ని సంవత్సరాల కిందట నటరాజ రామకృష్ణ శర్మ గారి “రుద్ర గణిక” చదివాను. ఎన్నో కొత్త కథలు, గొప్ప మనుషుల గురించి తెలిసింది. ఈ మధ్యన లక్ష్మీ విశ్వనాథన్ గారు రాసిన “Women of pride” పుస్తకం చదవటం జరిగింది. ప్రస్తుతం ఈ దేవదాసీ ల గురించి చదువుతున్న పుస్తకం దావేశ్ సోనేజి గారు రాసిన “Unfinished Gestures – Devadasis, Memory and Modernity in South India” అన్నది. ఇందులో ‘కళావంతుల’ జీవిత చిత్రం ఉన్నది ప్రధానంగా. ఇంకా చదవవలసిన పుస్తకాల జాబితాలో రుక్మిణి దేవి అరుండేల్ జీవిత చరిత్ర, ముత్తులక్ష్మి రెడ్డి గారి జీవిత చరిత్ర ఉన్నాయి. ఈ ఉపాధ్ఘాతం అంతా ఎందుకు అంటే దేవదాసి వ్యవస్థ గురించి ఎన్నో అపోహలు తప్పుడు కథనాలూ తనలోని వలస మేధ ప్రభావాన్ని గుర్తించే విచక్షణ లేని రచయితలు రాసిన రచనలూ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మధ్యన ఈ పుస్తకం నావరకు నాకు ఒక అద్భుతం. చాలా నచ్చింది నాకు రచయిత ఆ కాలం కథలు కళ్ళకు కట్టినట్టు గా వర్ణించిన తీరు. స్వతహా నాకు క్లాసికల్ సంగీతం నృత్యం మొదలగు విషయాలలో పరిచయం తక్కువే. అయినప్పటికీ బాల సరస్వతి గారి జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఏదో తెలియని ఆరాధనా భావం ఏర్పడింది.

ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు చర్చింపబడ్డాయి. ఆంగ్లేయుల పాలన లో ఇరవయ్యో శతాబ్దపు మద్రాసు నగరంలో జరిగిన సాంస్కృతిక సంఘర్షణ సంప్రదాయానికి సంస్కరణాభిలాషకి జరిగిన అంతర్యుద్ధం వగైరా వగైరా. ఇవన్నీ కూడానూ బాలసరస్వతి గారి జీవితం ద్వారా మనకు చూపబడతాయి. నాకైతే ఎప్పుడో నేను చదివి గొప్పగా ప్రభావితమైన శ్రీపాద “అనుభవాలూ – జ్ఞాపకాలూను” లోని “భావ సంఘర్షణ, ఆచార సంఘర్షణ, ఆచరణ సంఘర్షణ” అన్న పదాలు గుర్తుకు వచ్చాయి. ఆ సంఘర్షణలన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడతాయి బాలసరస్వతి గారి జీవితం లోను, పుస్తకంలో పేర్కొన్న, ఆనాటి అప్పటి సంప్రదాయ కళాకారుల అందరి జీవితాల లోనూ!

ఈ పుస్తకంలోని మరొక ప్రధాన చర్చ “sanitised art” “reconstructed art vs heriditary art” వగైరాల గురించి. అంటే సాంప్రదాయ కళలకు ఆ కళాకారులకు ఆ వ్యవస్థలకు బ్రిటిషు పాలనానంతరం కొత్తగా పుట్టుకొచ్చిన సంస్థలు మరియు వ్యక్తులు తెచ్చిన కొత్త కళలు వాటి తాలూకా కళాకారుల మధ్యన సంఘర్షణ గురించి. ఉదాహరణకు భరతనాట్యం పుట్టుక గురించిన కథ. ఆ కథలో దేవదాసీల పాత్ర సామాన్య ప్రజానీకానికి అంతగా తెలియదు. పాఠ్య పుస్తకాలలోనూ కనపడదు. బాగా చిన్నప్పుడు భరత నాట్యం అంటే బ్రాహ్మణులు పెంచి పోషించిన కళ అని అనుకునే వాడిని. ఇవన్నీ పాఠ్య పుస్తకాలకి వెలుపల ఉండే కథలు, చేదు నిజాలు (చూడు)

నేటికాలంలో తమ తమ పిల్లలకి కళలలో ప్రవేశం ఇప్పించే తల్లితండ్రులు మహా అంటే కూచిపూడి భరత నాట్యం క్లాసికల్ మ్యూజిక్ (అనగా కర్నాటిక్ లేదా హిందుస్తానీ) ఇలా ఒక సంక్షిప్త చిట్టా నుంచి ఎంచుకుంటారు. అయితే బ్రిటీషు ప్రభావానికి లోను కాక ముందు మన కళలలో ఎంతో భిన్నత్వం ఉండేది. అంతకంతకూ అన్నిటిని కట్టి పడేసే ఏకత్వం కూడా ఉండేది. అటువంటి సంప్రదాయాలలో ఒక సంప్రదాయమే ఈ దేవదాసి కళా సంపద, తంజావూరు సభా నర్తకుల కళా సంపద, సదిర్ నృత్యాలు, విలాసినీ నాట్య సంప్రదాయాలు వగైరాలు. అయితే మన ఈ నేటి కాలానికి వచ్చేసరికి ఎన్నో కళలు (చూడు: తెలుగు వారి జానపద కళలు) చనిపోయే సరికి ఇప్పుడెవరు “మా వాడు ఒగ్గు కథలలో స్పెషలిస్టు ఆండీ! ఎంత బాగా చెబుతాడో” అనో . లేదా “చూడండి అసలు మా అబ్బాయి డెక్కలి జాంబ పురాణం ఎంత బాగా చెబుతాడో” అని అనరు తల్లితండ్రులు. అవన్నీ తక్కువ కళలు అయిపోయాయి మన సమాజానికి. ఆ కులాల వారికీ, ఇతరులకూ. ఆ కళలు వాటి కథలు ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు. దేవదాసీలు వారి గతము కూడా ఎవరికీ అక్కర్లేదు కాబోలు. అందుకనే ఆరు వందల రూపాయల ఈ పుస్తకం ఒక డిస్ట్రిబ్యూటర్ రెండు వందలకు డిస్కౌంటులో అమ్ముతున్నా కూడా ఎవరు కొనట్లేదు నేను కొన్న షాపులో. మనకి ఒక్కో రాష్ట్రానికి ఒక ఆర్టు ఉంటే చాలు అనుకుంటాను. చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో ఒక లిస్టు ఉండేది ఇలాగ కూచిపూడి: ఆంధ్ర, భరత నాట్యం:తమిళనాడు, కథక్కళి+మోహిని అట్టం: కేరళ, కథక్+ఒడిసి:ఒరిస్సా ఇలాగ. ఎన్నో రంగుల ఇంద్ర ధనస్సుల లాంటి మన కళా సంపదను బ్రిటిషు ఇండియా వదులు కోవాల్సి వచ్చింది. ఆ ప్రయత్నంలోనే ఎన్నో కళలు ఎందరో కళాకారులు రోడ్డున పడ్డారు. ఆ కాలం నాటి కథ ఇది.

ఈ పుస్తకం గురించి కొందరి అభిప్రాయలు ప్రింటులో వేశారు. కపిల వాత్సాయన్ గారి one line summary ఇది:

“A gripping account of the hereditary system of transmission in the performing arts though the biography of one of India’s greatest dancers, T. Balasaraswati. Douglas Knight Jr. unfolds many layers of the personal, social, artistic, national, and international aspects of T. Balasaraswati’s life.”
— Dr. Kapila Vatsyayan

బాలసరస్వతి గారి కళ వారి జీవితం ఒక మహా సంప్రదాయానికి ఆయువు పట్టనీ అదే తర్వాత తరువాత ఒక ‘కొత్త’ క్లాసికల్ డాన్సు గా రూపాంతరం చెందిందని అన్నారు రచయిత. తాను నేటి కాలంలో భరత నాట్యంగా చెలామణి అవుతున్న కళ పుట్టుక గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ కొత్త కళ పుట్టుకకు మూల కారణమైన వ్యవస్థల గురించీ వ్యక్తుల గురించీ విమర్శలు ఝళిపించటం తన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు. అయితే ఈ నవీన దక్షిణ భారత నాట్య కళా సంప్రదాయం మీద పాశ్చాత్య సంఘ వ్యవస్థ యొక్క ప్రభావం, బ్రిటీషు మిషనరీ ఆలోచనా స్రవంతి యొక్క ప్రభావం కొట్టి పారేసేది కాదనీ, ఈ కొత్త కళలను కనిపెట్టడం వెనుక వలస మేధా ప్రభావమే ప్రధానమని తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. కళ ఎందుకు? ఎవరు నర్తించాలి? ఎవరు కూడదు? ఈ కళా వ్యవస్థను ఎలా నిర్మించాలి? దీనికి అధికారులు వంశ పరంపార్యంగా ఆ కళలని నేర్చుకుంటూ పోషించుకుంటూ వస్తున్న కళాకారుల పోషకుల కుటుంబాలా లేక కొత్త సంస్థలా లేక ప్రభుత్వాలా? వంటి ఎన్నో కీలక ప్రశ్నలకుఆ కాలంలో ఇచ్చిన సమాధానాల వెనుక ఉన్న పాశ్చాత్య భావజాల ప్రభావాన్ని గుర్తించి తీరాల్సిందే అని వాదిస్తారు రచయిత.

తాను ఈ పుస్తకంలో “దేవదాసి” అని అన్నపుడు తన ఉద్దేశ్యం భరత నాట్య సంప్రదాయాన్ని పరంపరా గతంగా భద్రపరుస్తున్న సాంప్రదాయ నాట్య సంగీత కళాకారులనీ పుస్తకం మొదట్లోనే చెప్పుకొచ్చారు రచయిత.

పంతొమ్మిదవ శతాబ్దపు భారతంలో వలస విద్య వ్యవస్థ, కొత్త నైతిక విలువలు, కొత్త సంఘపు కట్టుబాట్లు వచ్చాయనీ వాటి ప్రభావానికి లోనయిన ఎందరో భారతీయలు తమ సంస్కృతి వెనుకపడిన జాతి సంస్కృతనీ అనైతిక విలువలు కలిగినదని అనుకోవటం మొదలయినదని అంటారు రచయిత. ఈ ప్రభావంతోనే Institutionalisation and standardisation of art జరిగిందనీ, ఈ ప్రయత్నంలో సంప్రదాయ కళలకీ కళాకారులకి తీరని అన్యాయం జరిగిందని అంటారు.

దేవదేసి వ్యవస్థ గురించీ అప్పటి దేవదాసి చట్టం గురించీ పుస్తకంలో ఎంతో లోతైన చర్చలు ఉన్నాయి. దేవదాసి కులపు ఆడవారిని బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపుతున్నారని ఎందరో సంస్కర్తలు ఆ వ్యవస్థ మీద ఉద్యమించారని అన్నారు. అయితే తాను చూచినంత మేరకు తనకు దేవదాసికి బలవంతంగా సంఘం ద్వారా ఒక sexual role ఆపాదించారు అన్న ఆరోపణకు సాక్ష్యము దొరకలేదని అన్నారు.

సంప్రదాయ పరంపరానుగతమైన కళలను దాన్ని పెంపొందించిన వ్యవస్థను ధ్వంసం చేయాలననుకున్న ఈ ఆలోచనల వెనుక ఎందరో పాశ్చాత్యుల ప్రభావం ఉన్నదని అన్నారు. వీరిలో మిషనరీలు, బ్రిటీషు భారతాన్ని పాలించిన అధికారులు, వలస పాలకుల అధికార వ్యామోహంలో పడిన భారతీయ అధికారులు, మేధావులు ఎందరో ఉన్నారు అని అన్నారు. రచయిత ప్రధానంగా సంస్కరణాభిలాషను ప్రభావితం చేసిన శక్తుల గురించి ఎంతో నిశితమైన పరిశీలనతో కూడిన వ్యాఖ్యలు చేసారు. “India was being reinvented” అన్న ఒక్క వాక్యంతో ఆ కాలంలో జరిగిన ఎన్నో ఉద్యమాలకు, చేసిన ఎన్నో చట్టాల గురించి ఎంతో చెప్పారు.

బాలసరస్వతి గారి కుటుంబం గురించి, వారి పరంపర గురించి చెబుతూ వీణా ధనమ్మాళ్ గురించి, జయమ్మాళ్ (బాలసరస్వతి గారి తల్లి) గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు రచయిత. జయమ్మాళ్ గారు కళల ద్వారా భగవంతునికి సేవ చేయటమే తమ కుటుంబానికి ప్రధాన కర్తవ్యమని తక్కిన విషయాలు అప్రధానమని అనేవారట. సంప్రదాయ దేవదాసి కుటుంబాలలో బాల్యం విద్య వాగైరాల గురించి చెప్పారు. వీరితో పాటే మైలాపూర్ గౌరీ అమ్మాళ్ గురించి కూడా రాశారు.

భారత దేశంలోని సంస్కరణలకు బీజం ఇంగ్లాండు అమెరికాలో అప్పటి కాలంలో జరిగిన సాంఘిక మాత మార్పులలో ఉన్నదని అన్నారు. పారిశ్రామిక విప్లవానంతర ఇంగ్లాండు అమెరికాలో పేద కుటుంబాలకి చెందిన ఆడవారిని పిల్లలను కొత్త పరిశ్రమలకు కార్మికులుగా మార్చాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది అని, ఇక్కడ భారత దేశంలో జరిగిన మార్పులను అర్థం చేసుకోవాలంటే అప్పటి ఇంగ్లాండు అమెరికాలోని మార్పులను కూడా అర్థం చేసుకోవాలని చెప్పకనే చెప్పారు.

ఆనాటి సంఘపు పరిస్థితుల గురించి చెబుతూ క్రైస్తవ సువార్త ప్రచారకర్తలు వారి ఆలోచనా పద్ధతులు గురించి కొంత రాశారు. అలానే థియొసాఫికల్ సొసైటీ ఆవిర్భావం అప్పటి మద్రాసు పైన ఈ సంఘం ప్రభావం హెన్రీ ఆల్కాట్, అన్నీ బీసెంట్ వగైరాల గురించి చెబుతూ దేవదాసి చట్టం రూపు దాల్చటానికి ముఖ్య కారకులైన ముత్తులక్ష్మి రెడ్డి గారి పైన వీరి ప్రభావం గురించి చెప్పుకొచ్చారు. థియొసాఫికల్ సొసైటీ మేధావులకు భారత స్త్రీ వెనుకబాటుతనం గురించి ఉన్న ఆలోచనల వెనుక సమకాలీన భారత సమాజంలో స్త్రీ పరిస్థితి పట్ల నిజమైన అవగాహన కంటే కూడా ఆనాటి అమెరికన్ సంస్కరణల ప్రభావం ఎక్కువని అన్నారు.

దేవదాసీలు వేశ్యలు అన్న నమ్మకం అంత బలంగా నాటుకు పోవటానికి 1880 కాలంలో మొదలైన ఆంటీ-నాచ్ (anti-nautch) సంస్కరణలు కారణమని అన్నారు. అయితే ఈ దేవదాసి అనబడే గొప్ప మాతృస్వామ్య వ్యవస్థ ఆ దౌర్భాగ్య దశకు చేరుకోవటానికి ప్రధానంగా రాజ పోషకులు దివాణాలు సంస్థానాలు నిర్వీర్యమై పోవటం, కళల స్థాయి తగ్గటం, వీక్షకుల లేదా రసికుల ఆలోచనలు మారటం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయాల గురించి పట్టించుకున్న వాడు లేడు. అలాగే ఎందరో కళాకారుల కుటుంబాలు సంస్కర్తల ఉద్యమాల వల్ల రోడ్డున పడ్డారని, వాళ్ళని పట్టించుకున్న నాథుడు లేడని అన్నారు. ఈ పుస్తకంలో పేర్కొన్న మరొక విశిష్ట వ్యక్తి ఈ. కృష్ణ ఐయ్యర్ ఇలా అన్నారట అప్పట్లో:

“…… as E. Krishna Iyer , a lawyer and someone who had learnt the Bharatanatyam dance, questioned the cultural discrimination and the assumed connection, asking why prostitution needs years of learning and training for performance arts such as the Bharatanatyam, and how can killing performance arts end any evils in a society?”

(రెఫ్)

డగ్లస్ నైట్ గారి వాదన కూడా ఇంచు మించు ఇదే. సరే వారిలో కొందరు పడుపు వృత్తిలోకి దిగారనే అనుకుందాము. దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అందరు ఇలా లేరు కదా. ఒక వేళ ఎక్కువ శాతం ఉన్నా కూడానూ వారూ మనుషులే కదా వారి జీవితంలోని ఇతర aspects ఏమిటి sexual aspect పక్కన పెడితే అని ఆలోచించచ్చు కదా? అలా అని వారిని వారి కళా సంపాదనను వారి సాహిత్య సాంస్కృతిక సేవను అన్నిటిని వదులు కోవటం సరియైన పనేనా? అన్నది ఆయన వాదన. ఎన్నో దశాబ్దాల తర్వాత ఇప్పుడి పరిస్థితులను ఒక సారి తరచి చూస్తే వేశ్యా వృత్తి అలాగే ఉంది. నిజానికి ఇంకా వికృతమైన బలవంతపు పడుపు వృత్తిగా మారి దాని మరొక పార్శ్యం పోర్నోగ్రఫీ గా రూపాంతరం చెంది ఇపుడు ఎక్కడ బడితే అక్కడ విచ్చల విడిగామొబైలు స్క్రీన్ లలో లాప్టాప్ ఫోల్డర్ లలో బ్రౌసరులో రాజభోగం అనుభవిస్తోంది. ఈ దేశంలో ఏ ప్రభుత్వమూ అశృంఖల వ్యభిచారాన్ని పోర్నోగ్రఫీని కానీ regulate చేసినట్టు కానీ, ఒక వేళ చేసినా గొప్ప విజయం సాధించిన దాఖలాలు లేవు. అయితే నేను చూసిన నా కాలపు సమాజంలో వందల కొద్దీ గొప్ప కళాకారులు పుట్టుకు వచ్చారా అంటే లేదనే అనిపిస్తుంది. ముఖ్యంగా జానపద కళలు లైఫ్ సపోర్టు మీదనే ఉన్నాయి మరి. జిల్లా జిల్లాలో మండలం మండలంలో వారి వారి సొంత మార్కు ఏర్పరుచుకున్న కళలు కానీ కళాకారులు కానీ లేరనే చెప్పాలి ఇప్పుడు అప్పటిలా. ఏదో ఒకటి రెండు నగరాలలో అమెరికాలో భారతీయులు చేసుకునే కొన్ని సభలలో కనపడతాయి మన కళలు అంతే. నా ప్రోఫెస్సర్ ఒకరు అప్పట్లో అన్నట్టు ఏం.ఏ లిటరేచర్ చదివి ఏం.ఏ ఫైన్ ఆర్ట్స్ చదివి గొప్ప గొప్ప కళాకారులు వచ్చిన దాఖలాలు లేవు. కళా పోషణ సంప్రదాయ కుటుంబాల నుంచి చేజిక్కించుకున్న ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు సాధించింది తక్కువే మనం కోల్పోయిందే ఎక్కువ అని. నిజమేనేమో.

దేవదాసి చట్టం గురించి అప్పట్లో జరిగిన వాగ్యుద్ధాలలో నాగరత్నమ్మ గారి అధ్యక్షతన ఎందరో సంప్రదాయ కళాకారులు జరిపిన పోరాటము వారి వాదనల గురించి ఎంతో చక్కగా రాశారు. వారి వాదనాక్రమంలో దేవదాసీలు తాము భారతీయ సంగీత నాట్య కళా సంపదలకు సంరక్షకులమని ఐహిక భోగాలకు తలొగ్గకుండా నిష్టగా వేద అధ్యయనం అధ్యాపనం చేసెడి బ్రాహ్మణుల వంటి వారమని అన్నారుట. ఎంతో గొప్ప మాట!

ఇలా దేవదాసిల గురించి అప్పటి సంఘానికి చీత్కార భావం ఏర్పడటానికి స్త్రీత్వం గురించిన పంతొమ్మిదవ శతాబ్దపు ఐరోపా భావజాలం కారణమని భారతీయుల ఆలోచనలపై అది తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.

మోడరన్ భరత నాట్యం ఎలా పుట్టిందీ, మద్రాస్ మ్యూజిక్ అకాడెమి గురించీ, ఈ. కృష్ణ అయ్యర్ గారి గురించి కొన్ని చర్చలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ అకాడెమి లాగానే అప్పటి కాలపు భారత దేశంలో లలిత కళలను ప్రభావితం చేసిన మరికొన్ని వ్యక్తులు సంస్థలు గురించి చెబుతూ అన్న పావ్లోవా, ఉదయ్ శంకర్, రబింద్రనాథ ఠాగూరు శాంతినికేతన్, సంగీత్ నాటక అకాడెమీ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు రచయిత.

ఇక్కడ “జన గణ మన” గురించిన ఒక పిట్ట కథ నాకు ఎంతో నచ్చింది. బాలసరస్వతి గారు వారి తల్లి జయమ్మాళ్ గారితో కలిసి “జన గణ మన” కు అభినయం తో కూడిన ప్రదర్శనలు ఇచ్చారట వివిధ వేదికలలో. ఇంచు మించు మూడు సార్లు 1934 మొదలుకొని. ఇదంతా “జన గణ మన” జాతీయ గీతం కాక మునుపు అట. బహుశా ఇలా జరగటం ఇదే మొదలు, ఆఖరు కాబోలు అంటాడు రచయిత!

అప్పటి భారత దేశంలో బెంగాల్ లోని శాంతినికేతన్, చెన్నై లోని కళాక్షేత్ర, అల్మోరా దగ్గర ఉన్న ఉదయ్ శంకర్ కల్చరల్ సెంటర్ వంటి ఎన్నో కొత్త సంస్థలు వచ్చాయనీ ఆ విధంగా కళల సంరక్షణలో సాంప్రదాయ కళాకారుల కుటుంబాలు పోషించిన పాత్రని కొత్త సంస్థలు పోషించ సాగాయనీ మరియు ఈ కళా కుటుంబాలకు సంస్థలకు చెందిన కొత్త వ్యక్తులు పెద్దలుగా మారారు అనీ అన్నారు. ఈ మధ్యన కిషోరి అమోంకర్ ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. అది గుర్తుకు వచ్చింది నాకు ఇది చదివినప్పుడు (చూడు🙂 గురువుకి టీచర్ కి గల భేదం గురించి ప్రస్తావించారు ఇందులో.

సాంప్రదాయ నాట్యాచార్యులైన నట్టువానార్లు అల్మోరాలో అడయార్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలలో వారి విద్యా విధానంలో భాగం కాసాగారనీ దీని ద్వారా కళా బోధనలో నట్టువానార్ల గుత్తాధిపత్యానికి చరమ గీతం పాడినట్టుగా కొత్త సంస్కర్తలు అనుకోసాగారని అంటారు రచయిత. అయితే ఈ నట్టువానార్లు ఇలా ఉద్యోగాలకి చేరటానికి కారణం అప్పటి సంఘంలో వారు ఒంటరి వార్లు కావటమే అనీ పేదరికము కటిక దారిద్య్రము అనీ చెప్పుకొచ్చారు రచయిత.

ఇదే విషయం పైన మరి కొన్ని వ్యాసాలు “Where are the master gurus“, “Rise and fall of the nattuvanar“. ఆలోచింపజేసే వ్యాసాలు!

సాంప్రదాయ కళా ప్రపంచంలో కళాకారుడు terms of engagement నిర్ణయించేవాడని, కొత్త కళా ప్రపంచంలో ఈ సంస్థల నిర్వాహకులు నిర్ణయిస్తున్నారని అన్నారు రచయిత.

దేవదాసి చట్టం వలన గుడిలో నాట్యం చేసే అర్హత దేవదాసీలు కోల్పోవలసి వచ్చిందనీ, అయితే సాంప్రదాయ హిందూ దేవాలయం లో సంస్కర్తలు వాపోయినంతగా వివక్ష ఉన్నదని తాను అనుకోనని అన్నారు రచయిత. ఎన్నో దేవాలయాలలో ఆలయ మూర్తికి నిత్యం గీతారాధన అందించే ఓడువారు (Oduvar) కులానికి చెందిన వారు బ్రాహ్మణులు కారనీ, అలానే స్వామి వారి సేవలో మృదంగం ఇతరత్రా వాద్యాలు వాయించే వాద్యకారులు కూడా ఇతర కులాల వారే అనీ , అర్చకునికీ, గీతము ఆలపించే ఓడువారు వారికీ, నాట్యము చేసే దేవదాసీలకీ, సాంప్రదాయ వాద్య కారులకీ మధ్యన పరస్పర గౌరవం అభిమానం తో కూడుకున్న సంబంధం ఉండేదని రాసారు. వర్ణ వివక్ష, దోపిడీ మొదలగు భావాలన్నీ మతాన్ని రాజకీయం చేయటం వల్ల వచ్చిన భావాలనీ అన్నారు. రచయిత మాటలు ఉన్నది ఉన్నట్టు గా (అసలే ఇటువంటి విషయాల గురించి పబ్లిక్ ఫోరమ్ లో రాయటం పెద్ద రిస్కు! ఈ విషయం పైన ఉన్న కంప్లయింట్లు డైరెక్టు గా రచయితకు పంపించుకొనుడి!)

In the traditional hindu temple, the relationship between people was unbounded by community or caste; the balance and compatibility between people was grounded in community and purpose; not in hierarchy or social dominance.

The respect given to a dancer and the respect temple servants had for one another was based on gnanam (knowledge) and dharma (duty). The notion of hierarchical distinction arose only when outside forces politicised religion; the traditional community did not politicise their duty

ఇందులో ఎంత నిజము ఉన్నది అన్న విచారణ పక్కన పెడితే, ఈ వ్యవస్థలు నాశనం అవ్వటం వలన కళల విషయంలో మనం ఏమి సాధించాము అన్నది నా వరకు నాకు సమాధానం లేని ప్రశ్ననే. ఉన్న diversity అంతా పోయి uniformity వచ్చింది. కొన్ని చోట్ల అసలు శూన్యం మిగిలింది. అది మాత్రం నిజం!

1947లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దేవదాసి చట్టాన్ని ప్రవేశపెట్టిందని దాని ప్రకారం “the performing of any dance by any woman in the precincts of any temple or religious institution or in any procession of a hindu diety” నేరమని ప్రకటించారని అన్నారు. అయితే ఈ విషయం పైన స్పందిస్తూ బాల సరస్వతి గారు చట్టం సంగతి ఎలా ఉన్నా.. మైలాపూర్ కపాలీశ్వర ఆలయ గర్భ గుడిలో మైలాపూరు గౌరి అమ్మాళ్ నాట్యం కొనసాగుతూనే ఉంటుంది అని అన్నారట! ఈ చట్టం వలన ఆలయ పరిసరాల్లో నాట్య ప్రదర్శన నేరం అయినందున తిరుత్తణి ఆలయం లో నాట్యం చేయాలని సంకల్పించిన బాల సరస్వతి ఆ రోజున ఎలా నాట్యం చేసిందో వివరిస్తూ ఒక్క చిన్న కథ చెప్పారు రచయిత. తాను చెన్నై నుంచి ప్రత్యేక పూజ చేయటం కోసం వచ్చానని పూజ సామాగ్రి కంగారులో మర్చిపోయానని ఆలయ పూజారికి చెబితే తాను తీసుకొని వస్తానని అన్నాడట ఆ పూజారి. ఆయన తిరిగి రావటానికి అరగంట సమయం ఉందని గుర్తించిన బాలసరస్వతిగారు ఆ అరగంటలో తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఎదుట డాన్సు చేశారట ప్రధానాలయంలో! తల్లి జయమ్మాళ్ గానం చేస్తుండగా!

కొత్త తరపు కళాకారులు నాట్య కళలో మార్పులు చేర్పులు చేస్తున్న విధానం గురించి మాట్లాడుతూ బాలసరస్వతి గారు ఇలా అన్నారట. కళాకారుడిని ఉండాల్సిన ప్రధాన కర్తవ్యం ముందు ఆ కళ యొక్క ఉన్నత స్థాయిని అర్థం చేసుకోవటం, ఆ స్థాయిని అందుకోవటం కోసం అకుంఠిత సాధన చేయటం. ఒక స్థాయిని అందుకున్నాక అప్పుడు మార్పులు చేర్పులు సొంత శైలి వగైరాల కోసం తాపత్రయ పడటం సబబు అని.

బాలసరస్వతి గారితో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన వారి తల్లి జయమ్మాళ్ గారు సాంప్రదాయ పరంపరానుగత కళాకారుల గొప్పతనం గురించి ఒకసారి ఇలా అన్నారట. భారత ప్రభుత్వం సాంప్రదాయ కళాకారులని చిన్న చూపు చూడటం ఎంతో బాధాకరం. ఒక కళాకారుడు గొప్ప స్థాయిని అందుకోవాలంటే కనీసం మూడు తరాల సంప్రదాయాన్ని ఔపాసన పట్టాలి. లేదంటే మనకి మిగిలేది కదలాడే గుఱ్ఱాలు మరియు గాడిదలు మాత్రమే అని!

అటు తర్వాత బాల సరస్వతి గారు ఇచ్చిన ప్రదర్శనలు పొందిన సత్కారాల గురించి చెప్పుకుంటూ ఆవిడకి 1957లో పద్మ భూషణ్, 1976లో పద్మ విభూషణ్ వచ్చిన వైనాన్ని వివరిస్తారు రచయిత.

రుక్మిణి దేవి అరండేల్ గారి క్లాసికల్ భరత నాట్యానికి బాలసరస్వతి గారి సంప్రదాయ నాట్యానికి మధ్యన కలిగిన అంతరాలు అభిప్రాయ భేదాల గురించి తెలుపుతూ శృంగార రసాభినయ విషయంలో వారిద్దరి మధ్యన ఉన్న అభిప్రాయ భేదం గురించి సుదీర్ఘంగా చర్చించారు రచయిత. బాలసరస్వతి గారి ప్రకారం శృంగార రసం ఎంతో ఉదాత్తమైనదని, మనిషి దైవంలో ఏకమయ్యే అపురూప కలయికను చూపటం అన్నది ఒక్క శృంగార రసాభినయం లో మాత్రమే సాధ్యం అని అనేవారట. కొందరు భరత నాట్యం నుంచి శృంగారాన్ని వేరు చేయటానికి ప్రయత్నిస్తున్నారు అని వారికి తాను చెప్పదలచుకున్నది ఒకటేనని భరత నాట్యంలో కొత్తగా పవిత్రం చేయవలిసిన అవసరం ఏమి లేదని భరత నాట్యంలో చూపించే శృంగారం శరీర సంబంధి కాదనీ ఎప్పటికి కాదనీ అన్నారట. 1962లో క్షేత్రయ్య పదాలని భరత నాట్య ప్రదర్శనల నుంచి తీసి వేయాలని జరిగిన చర్చల గురించి కూడా రాశారు రచయిత. క్షేత్రయ్య పదాలలో మితిమీరిన శృంగారం ఉందని సదరు సంస్కర్తల అభిప్రాయం అట. నాకు ఇది చదువుతున్నపుడు ప్రచురణ నిషేధానికి గురి అయిన ముద్దు పళని రాధికా సాంత్వనం గురించి బెంగళూరు నాగరత్నమ్మ రాసిన వాక్యాలు జ్ఞప్తికి వచ్చాయి. రచయిత పుస్తకం మొదట్లో రాసినట్టు గా వలస పాలకుల ప్రభావం వల్ల మారిన విలువల లో sexuality గురించిన ఆలోచనలు ప్రధానం. శృంగార రసం గురించి అప్పుడు జరిగిన వివాదాలలో ప్రస్ఫుటమైనది అదే.

బాలసరస్వతి గారి కళకు విదేశాలలో కలిగిన పేరు ప్రఖ్యాతల గురించి వారు ఇచ్చిన వందల కొద్దీ ప్రదర్శనల గురించి ఎన్నో విషయంలో ఉన్నాయి ఈ పుస్తకం లో. లూయిస్ స్క్రిప్స్ వంటి వారు బాలసరస్వతి కళ గుర్తింపబడటానికి చేసిన సహాయం గురించిన ఎన్నో విషయాలు రాశారు రచయిత (చూడు)

బాలసరస్వతి గారి కూతురు లక్ష్మిని రచయిత వివాహం ఆడిన నాటి సంగతులు చెబుతూ వారి పెళ్ళికి బాలసరస్వతికి మంచి స్నేహితురాలయిన ఎం.యస్. సుబ్బలక్ష్మి గారు పాట పాడారట. అటు తర్వాత వారికి పుట్టిన బిడ్డకు అనిరుద్ధా నైట్ అని పేరు పెట్టారని (చూడు) అనిరుద్ధాకు కూడా నాట్యంలో శిక్షణ ఇప్పించారని చెప్పుకొచ్చారు రచయిత.

ఇది కాక సత్యజిత్ రే బాలసరస్వతి మీద తీసిన డాక్యుమెంటరీ దాని షూటింగ్ విశేషాలు తర్వాత ఆ డాక్యుమెంటరీ పై వచ్చిన విమర్శలు వగైరాలు ప్రస్తావించారు రచయిత.

చివరిగా బాలసరస్వతి ఆఖరు రోజుల గురించిన విషయాలు ప్రస్తావించి పుస్తకం ముగించారు రచయిత డగ్లస్ నైట్.

ఇప్పటి దాకా నేను చదివిన జీవిత చరిత్రలలో ఈ స్థాయిలో నన్ను ఆకట్టుకున్నవి ఎన్నో లేవు! అయితే ఆ గొప్పతనంలో కొన్ని పాళ్ళు రచయిత రచనాశైలిలో, కొంత విషయ పరిజ్ఞానంలో కొంత బాలసరస్వతి గారి జీవన ప్రయాణంలో, మరి కొంత వ్యక్తిగా ఆవిడ గొప్పతనంలో కొంత ఉంటే, చాలా వరకు ఆ గొప్పతనానికి కారణం ఆవిడలో అణువణువునా జీర్ణించుకుపోయి ఒక శక్తిలా ఆవిడని వెనుక నుంచి నడిపిన సంప్రదాయంలో ఉన్నాయి అనుకుంటాను. పుస్తకంలో ఒక చోట రచయిత ఇలా అన్నారు “She did not represent the hereditary tradition of Bharata natyam; she was the hereditary tradition” అని. పుస్తకం చదివాక బాలసరస్వతి గారి గురించి మరికొంత సమాచారం సేకరించాక నిజమే అనిపించింది నాకు. సాంప్రదాయ కళాకారుల జీవన శైలి గురించి తెలుసుకోవాలని అనుకున్న ప్రతీ పాఠకుడు తమ లైబ్రరీ లో భద్రపరుచుకోవాల్సిన పుస్తకం ఇది!About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
3

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
4

 

 

Rearming Hinduism – Vamsee Juluri

వ్యాసకర్త: Halley ********** ఈ పరిచయం వంశీ జూలూరి గారు రాసిన Rearming Hinduism: Nature, History and the Return of Indian Intelligence అనే పుస్...
by అతిథి
2

 
 

భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం హరి సోదరులు రచించిన “భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)...
by అతిథి
5

 
 

ఆరునదులు – విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: Halley ******** విశ్వనాథ సత్యనారాయణ గారి “ఆరు నదులు” చదివింది బహుశా రెండేండ్ల క...
by అతిథి
1