బతుకుబాటలో కొండగుర్తులు – భద్రిరాజు కృష్ణమూర్తి ఆత్మకథ

ఈమధ్య ఒక ప్రాజెక్టు పనిలో భాగంగా చాలా రోజులు భద్రిరాజు కృష్ణమూర్తి, జె.పి.ఎల్.గ్విన్ గార్ల “A grammar of modern Telugu” పుస్తకంలోని ఉదాహరణలు, వివరణల గురించి బాగా చర్చించడంతో భద్రిరాజు గారు రాసిన ఇతర పుస్తకాల గురించి చూస్తూండగా worldcat.org వెబ్సైటులో ఈ పుస్తకం ప్రస్తావన కనబడ్డది. ఇదివరలో ఈమాట పత్రికలో ఈయన ఇంటర్వ్యూ, ఆయన మరణించినపుడు వచ్చిన వ్యాసాలూ అవీ చదివాను కానీ, అంతర్జాలంలో ఈ ఆత్మకథ ప్రస్తావన ఎక్కడా చూసినట్లు గుర్తులేదు. దానితో ఆశ్చర్యపడి ఇంటర్-లైబ్రరీ లోను లో తెప్పించుకున్నాను. పుస్తకం ముందుమాటలో రాసినట్లు “ఇవి ఒక విద్వాంసుడి బతుకుబాటలో కొండగుర్తులు”. నేను “మహా” చేరుస్తాను విద్వాంసుడికి ముందు. అంతే.

పుస్తకం నేపథ్యం: ఎప్పుడు మొదలుపెట్టారో తెలియదు కానీ ఈ పుస్తకం ఆయనకి బాగా వయసు మీదపడ్డాకే మొదలైంది. ఆయన చెబుతూంటే డా. అప్పం పాండయ్య అన్న మరొక భాషాశాస్త్రజ్ఞుడు లేఖకుడిగా వ్యవహరించి గ్రంథస్థం చేశారు. కానీ, పుస్తకం పూర్తయ్యేలోపే కృష్ణమూర్తిగారు మరణించడంతో పుస్తకం అసంపూర్తిగా ఆగిపోయింది. చివర్లో ఎపిలాగ్ గా ఒక వ్యాసం తయారుచేసి పుస్తకాన్ని వేశారు. అదీ ఈ పుస్తకం వెలువడ్డం వెనుక కథ.

ఇక విషయానికొస్తే, పుస్తకంలో ఆయన చిన్నతనం, ఉద్యోగం-వివాహం, పైచదువులకి అమెరికా వెళ్ళడం, తిరిగి వచ్చి ఆంధ్రదేశంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో (ఆంధ్ర, ఉస్మానియా, హెచ్.సీ.యూ) ఆచార్యుడిగానే కాక, వివిధ హోదాల్లో యూనివర్సిటీ వ్యవహారాలు చూసే పదవుల్లో పనిచేయడం గురించి ఆయన అనుభవాలు ఉన్నాయి. ఆయన చెప్పినది 1993లో హెచ్.సీ.యూ. వైస్ ఛాన్సెలర్ గా 65 ఏళ్ళ వయసులో పదవీవిరమణ చేసేదాకా. ఆయన మరణం 2012లో. ఈ మధ్య కాలంలో విశ్రాంతాచార్యులు అని మనం అనుకోవచ్చు కానీ, పరిశోధనలు చురుగ్గానే కొనసాగించి, గొప్ప పుస్తకాలనదగ్గవి రాశారు కూడా. ఈ విషయాలన్నీ భద్రిరాజు గారు చెప్పలేకపోయారు కానీ, ఈ కాలాన్ని గురించి ఒక చిన్న ఎపిలోగ్ రాశారు పాండయ్య గారు – కె.కె.రంగనాథాచార్యులు గారి సహకారంతో.

పుస్తకంలో మొదటి నుండి ఆయన అమెరికా వెళ్ళి తిరిగొచ్చేదాకా ఉన్న భాగం నన్ను చాలా అకట్టుకుంది. ఆయన “సాహిత్యం మనం పుస్తకాల నుంచి చదువుకోవచ్చు; కానీ భాషకు చెందిన విషయాలు గురుముఖతః కానీ సాధ్యంకావు, అందుకని భాషనే మనం తీసుకుందాం” అనుకుని సాహిత్యం నుండి భాషాశాస్త్రానికి మళ్ళిన సంఘటన – ఇంకాస్త రాసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఈ విషయం గురించి ఈమధ్యే ఈమాట పత్రికలో ఉన్న 2008 ఇంటర్వ్యూలో కూడా ఒకసారి అన్నారు.ఆ కాలం (అరవై ఏళ్ళ పైమాటే!) నాటికి అలా ఆలోచించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అమెరికా వెళ్ళాక రెండేళ్ళలోనే ఒక మాస్టర్స్, ఒక పీ.హెచ్.డీ తెచ్చుకోవడం మరింత ఆశ్చర్యంగా అనిపించింది.

తిరిగొచ్చి ఆంధ్రదేశంలో భాషాశాస్త్ర శాఖ సెటప్ చేయడం గురించి రాసిన భాగం బాగుంది. ముఖ్యంగా ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్లంటూ వర్ణించిన వారు తదనంతర కాలంలో చాలా పేరు తెచ్చుకోవడం గురించి చదవడం బాగుంది (వీళ్ళలో ఒకరు – ప్రొఫెసర్ లక్ష్మీబాయి గారి క్లాసులు రెండు మూడింటికి నేను వెళ్ళాను. అప్పట్లో కంప్యూటర్ సైన్సు చదివేవాళ్ళకి ఇంత లింగ్విస్టిక్స్ ఎందుకనుకుని మానేశా!! తర్వాత ఓ ఐదేళ్ళు దాటాక అనుకున్నా కోర్సు తీసుకుని ఉండాల్సిందని.). అయితే ఈ భాగం దాటాక పుస్తకం నాకు assorted dairy entries చదువుతున్న భావన కలిగించింది. ఆయన పరిశోధనల నేపథ్యాల గురించి, విద్యార్థులతో పనిచేయడం గురించీ, ఆకాలంలో విదేశాల్లో జీవించడం గురించీ ఇంకాస్త రాస్తారనుకున్నాను. ఆయన అనేక పర్యాయాలు వివిధ దేశాలకి వెళ్ళడం, టాక్స్ ఇవ్వడం – ఇదంతా నేను అబ్బురపడుతూ చదివాను – ఒక పరిశోధకుడి ఆత్మకథ చదవడం నాకు ఇదే మొదటిసారి. ఆయనా ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన భాషావేత్త – కనుక వివిధ యూనివర్సిటీలలో, కాన్ఫరెన్సులలో ఆయన అనుభవాలు ఆసక్తికరంగా ఉన్నాయి (రాసినంతలో). కానీ, చివర్లో ఆయన ఎడిట్ చేయలేకపోవడం వల్ల కావొచ్చు, ఓరల్ గా చెప్పడం వల్ల కావొచ్చు – ఒకదానికొకటి సంబంధం లేకుండా incoherent గా అనిపించాయి.

ఆయనెవరు? ఎందుకు ఆయన ఆత్మకథ అన్నది ఒక ముఖ్యమైన పుస్తకం? అన్నది మీకు ఇదివరకే ఓ అవగాహన ఉంటే ఇదేం పెద్ద సమస్య కాదు. ఇదంతా లేదు, ఊరికే ఆయన గురించి తెల్సుకోడానికి చదవొచ్చా? అంటే – చదవొచ్చు కానీ నచ్చకపోవచ్చు. దానికైతే ఆయన గురించి వేరే పుస్తకాలేవైనా వచ్చాయేమో తెలీదు కానీ, ఈమాట వెబ్ పత్రికలో చాలా వ్యాసాలున్నాయి ఆయన గురించి – అవి చదువుకోవచ్చు.

పరిశోధన గురించి ఆయన అన్నమాటలు:
“ఈ రోజుల్లో పరిశోధన చేసే వాళ్ళకు ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. డబ్బుకు కూడా కొదువలేదు. ఇవేమీ లేని రోజుల్లో ఎంత కష్టపడవలసి వచ్చిందో ఊహిస్తేగాని తెలియదు. కొద్ది జీతాల్తో సంసారపోషణకు సతమతమౌతూ నెగ్గడానికి గట్టి పట్టుదల, సాధించాలనే పూనిక తప్ప మరేవీ కారణాలు కాదు. మన పూర్వ కవులు ఆముదపుదీపాల దగ్గర కూర్చుని భారత భాగవతాల వంటి మహాగ్రంథాలు ఎలా రాయడం సాధ్యమయింది? వాళ్ళు మనకు ఆదర్శం కావాలి. పరిశోధనకు ధృఢమైన మోటివేషన్ ఉండాలి. ఆరోజుల్లో అది బాగా ఉన్నవాళ్ళే పరిశోధనరంగంలో దిగేవాళ్ళు. వాళ్ళలో చాలామంది విజయం సాధించేవాళ్ళు. వసతుల లేమి వాళ్ళకు అపకర్షకం కాలేదు. ఇప్పుడు వసతులే కొందరు పరిశోధనలోకి దిగడానికి కారణమౌతున్నాయి. అందువల్ల పరిశోధకుల్లో కొందరు విజయం సాధించలేకపోతున్నారు. మరికొందరికి పరిశోధన ఉద్యోగావకాశాలకు అవసరం అనే దృష్టి కలిగి ఆ తరువాత పరిశోధన మీద ఆసక్తి సన్నగిల్లుతున్నది.”

ఇది చదివాక ఒకసారి వేమూరి గారు తమ అనుభవాలు రాస్తున్న బ్లాగుని తల్చుకున్నాను. అప్పటి తరంలో పరిశోధనారంగం పై ఆసక్తితో దేశం వదిలిన వారు ఇలా తమ అనుభవాల గురించి రాస్తే బాగుండనిపించింది. నాకు తెల్సిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు అరవైల్లో వెళ్ళినవారు – మొన్నీమధ్యే నెల్లూర్లో కలిశాను కూడా – వారిని కూడా రాయమనడమో, లేదంటే వయసు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడితే రికార్డు చేయడమో చేయాలని నిర్ణయించుకున్నాను. చూడాలి వీలవుతుందో లేదో.

You Might Also Like

Leave a Reply