“కొల్లాయిగట్టితేనేమి?” – మహీధర రామమోహనరావు

వ్యాసకర్త: Sujata Manipatruni
*****************
“కొల్లాయిగట్టితేనేమి” ఒక చారిత్రక నవల – ఒక ఆదర్శవాది జీవితం గురించి ఒక కథ. భారత స్వాతంత్ర్య చరిత్ర లో తెలుగు వాళ్ళ పాత్ర – గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, వీరేశలింగం లాంటి ఆదర్శ వాదుల కథ. స్వాతంత్ర్యోద్యమం గురించి ఆ రోజుల్లోనే సమాజం చీలి వుండడం గురించి కూడా నిర్భయంగా చర్చించిన నవల.

మామూలుగా చరిత్ర అంటే రాజులు, రాణులూ, రాజకీయాలూ, సామ్రాజ్యాలూ, యుద్ధాలూ వరకే తెలుసు. Ko.ku “చదువు” చదివాకా, స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి తెలుగు సమాజం కూడా కాస్త తెలుస్తుంది. ఈ కొల్లాయి గట్టితేనేమి లో చాలా విషయాలు, చరిత్రా, తెలుగు సాంఘిక జీవనం, కులం పట్టింపులు, ఆచారాలూ, అనాచారాలు, ముఖ్యంగా కులం, అస్పృస్యతా, దాన్ని కూడా సమయానుకూలంగా మార్చుకోవడం, ఒకరి మీదొకరు ఆధారపడే సమాజంలో మార్పు కోసం ఇరు వర్గాలూ కాంక్షించడం, విరోధించడం, మడీ, మైలా, అంటూ, సొంటూ, విచిత్రమైన మూఢ నమ్మకాలు – అన్నీ దేన్నీ వొదలకుండా అన్నిటి గురించీ చర్చించారు.

పాత్రలు ఏవీ ఏకపక్షంగా ఉండకుండా, అసలు వాటి కంట్రోల్ లో లేని సంఘటనల్లో జీవితం కొట్టుకు పోతుంటే, ఎవరి నమ్మకాలూ, ఆదర్శాలూ, పట్టింపులూ, వీటి చుట్టూ పరిభ్రమిస్తూనే, జీవితం కంట్రోల్ లోకి వస్తుంటారు. వీటిల్లో అన్నిట్లో ఉత్తమ వ్యక్తిత్వం హీరో Ramanadham ది. మొండివాడు రాజు కన్న బలవంతుడు అనో మాట ఉంది. జాతీయోద్యమం ఉధృతమవుతున్న రోజుల్లో రాజమండ్రి కాలేజీ నుంచీ ఇంగిలీషు చదువు బహిష్కరిస్తాడు. విదేశీ వస్త్ర దహనం లో తనకున్న బట్టలన్నీ కాల్చి, వంద అప్పు చేసి, ఖద్దరు వస్త్రాలు కొనుక్కుంటాడు. అప్పటికే పెళ్ళి అయి వుంటుంది. భార్య కాపరానికి వచ్చే వయసు లో లేదు. మామ గారు సర్కిలిన్స్పెక్టరు. చదివి కలెక్టరు అవుతాడేమో అనుకున్న అల్లుడు ఇలా చదువు మానేసి ఇంటికి రావడం ఆయనకు నచ్చదు. అదీ ఆయన రాజోద్యోగి. అల్లుడు రాజ ద్రోహి. ఎలా పొంతన కుదురుతుంది? కుటిలుడు, ముక్కోపి అయిన మామ కీ, ఆదర్శవాది, శాంత స్వభావి, మానవత్వం ఉన్నవాడూ అయిన అల్లునికీ జరిగే ఘర్షణే మిగతా అంతా.

చదువు మానేసి వచ్చిన రామనాథం స్ఫురద్రూపి, సద్బ్రాహ్మణుడు. తల్లి తండ్రీ చినతనం లోనే చనిపోగా పిన్నీ బాబాయిల పెంపకంలో పెరిగిన వాడు. అతని పెద్ద తండ్రి రెండో భార్య గా ఒక తక్కువ కులపు స్త్రీ ని పెళ్ళాడి, ఆమెను విడిగా ఉంచుతూ, ఒక కొడుకుని కంటాడు. ఆ అబ్బాయి వెంకట రమణ – అంతఃసంఘర్షణ ని చక్కగా ప్రకటించడం రచయిత మానవత్వాన్ని చెప్తుంది.

అసలు తెల్ల వాడొచ్చి దేశానికి మంచిదే జరిగిందనీ, వాళ్ళ మూలంగానే మనకి చదువులూ, రైళ్ళూ, ఆస్పత్రులు, అభివృద్ధీ – ముఖ్యంగా వాళ్ళకి ఈ అస్పృశ్యత పట్టింపులు లేవు. సమాజంలో అస్పృశ్యుల కు కూడా చదువ్కోవడానికీ, ఉద్యోగం చేసుకోవడానికీ అవకాశం దొరుకుతుంది. పాత దేశపు పద్ధతుల్లో అయితే మరి ఇలాంటివేవీ ఉండవు. అభివృద్ధి మాటే లేదు అనే వాదనా వుండేది. అంతరాంతరాల్లో బ్రాహ్మణులూ, అగ్ర వర్ణీకులూ కాని వాళ్ళకైతే అలానే అనిపించేది. ఇప్పుడు ఈ మార్పుల్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఈ ఉద్యమం లేవనెత్తినట్టు వారు భావించారు.

నవల లో కథా కాలం – 1919-20 నాటిది. అప్పుడే జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది. దేశం లో ఉద్యమపు కార్చిచ్చు అంటుకుంది. కానీ కథాస్థలి – ముంగండ అనే ఓ చిన్న అగ్రహారం. ఓ మారుమూల పల్లె. రాజమండ్రి నుండీ ఒక పగలూ ఒక రాత్రీ పడవలో అంచె ప్రయాణం చేస్తే గానీ చేరలేని ఊరిలో గాంధీ ఎవరో తెలీని వాళ్ళూ ఉన్నరప్పటికి. గాంధీ మాట అంటేనే పడని వాళ్ళూ ఉన్నారు. గాంధీ పుణ్యాత్ముడనే వాళ్ళూ ఉన్నారు. ఆ వూర్లో అబ్బాయి రామనాథం. చిన్నప్పట్నించీ బ్రాహ్మణపు అలవాట్లూ… జంధ్యం, సంధ్య వార్చడం అవీ ఉన్నా కొద్దో గొప్పో ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాడు. చక్కగా పెళ్ళయి, హోదాలో మామగారిని మించిపోయేంత చదూకుంటాడూ, కలెక్టరు అవుతాడూ అనుకునీసరికీ ఉద్యమం లో చేరి, కాలేజీ మానేసి వస్తాడు. అందరూ ఈ పిచ్చి పనిని వ్యతిరేకించేవాళ్ళే. సభా ముఖంగా అతను కాలేజీ మానేయడం గురించి విని, గొప్పగా అభినందించిన కాలేజీ కుర్రాళ్ళే ఆఖరికి ఆ రాత్రే అతని చుట్టూ చేరి, అదెంత పిచ్చి నిర్ణయమో చెప్పడానికి ప్రయత్నించేసరికీ రామనాథానికి ముందున్నది చాలా పెద్ద యుద్ధమే అని తోస్తుంది. అతనితో పాటూ మానేసిన మిగిలిన నలుగురూ తిరిగి కాలేజీ లో చేరతారు. రామనాథం మాత్రం చేరడు.

కాలేజీ వదిలేసి ఊరొచ్చేసే తోవలో పడవ లో సహ ప్రయాణికురాలు స్వరాజ్యం – ఇంగ్లీష్ చదువులు చదూతుందని మొగుడొదిలేసిన 20 ఏళ్ళ అమ్మయి. తండ్రి వీరేశలింగం పంతులు స్నేహితుడు. స్త్రీ కి విద్యే ఆభరణం అని నమ్మి, ఆ రోజుల్లో నే వియ్యంకులు ఎంత వద్దన్నా వినకుండా కూతుర్ని ఇంగ్లీషు చదివిస్తున్నాడు. ఆ స్వరాజ్యం మాట విని అదేంటండీ..గాంధీ గారు ఇంగ్లీషు చదువు వొదిలేయమంటుంటే మీరు జీవితాన్నే కాదనుకుని చదువుతున్నారేంటీ అని అడుగుతాడు రామనాథం. ఈ ప్రశ్నలూ, వాటి జవాబులూ, మనిషి కాలంతో పాటూ ఎన్నో సార్లు మారతాడు. ఒకే లా వుండడు. అతని అభిప్రాయాలు కూడా మారతాయి. మారాలి కూడా అన్నట్టు ఉంటాయి.

రామనాథానికి ముంగండ తిరిగొచ్చాకా, విపరీతమైన తిరస్కారమూ, అత్భుతమైన ఆదరణా ఏమీ లభించవు. పెంచిన బాబయ్య, అమ్మ (పిన్ని) ఇద్దరూ పెద్దగా ఆక్షేపించకపోయినా మీ మామగారేమంటారో ఆలోచించుకోలేక పోయావా అని మందలిస్తారు. దానికి రామనాథం తన ఆదర్శాన్నే జవాబు గా చూపిస్తాడు. అయితే బలవంతంగా అతనికి 15 వ ఏటే వొద్దన్న పెళ్ళి చేసిన బాబాయి మాత్రం అతని జీవితాన్ని గాడిన పెట్టే ప్రయత్నాలు మొదలెడతాడు. అమ్మాయి కాపరానికొస్తే అబ్బాయి దార్లోకి వస్తాడని, ఊరిని ఉద్ధరించే కార్యక్రమాలు వొదిలి పెట్టి భార్యా పిల్లల కోసం ఉద్యోగాన్వేషణార్ధం మళ్ళా చదువు గాడిలో పెడతాడనీ ఆశిస్తాడు. అతని భార్యని కాపరానికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. పిల్ల వయసు రీత్యా రామనాథం దానికి నిరాకరిస్తాడు. దాంతో పెద్దల అసహనం ఒక్క మాట పెరుగుతుంది. కుటుంబాలు దూరమవుతాయి, అతని పెళ్ళి పూర్తిగా అస్థవ్యస్థమవుతుంది. రోజులు గడుస్తున్నాయి.

గ్రామంలో అతని జీవితానికి ఒక దిక్సూచి ఏమీ లేకుండా పోతుంది. ఈ లోపు పొరుగు గ్రామపు పిల్లే కావడం వల్ల స్వరాజ్యం తో స్నేహం చిగురించిస్తుంది. తన భవిష్యత్తు భార్య తోనే అనుకున్న రామనాథం, తన మూలంగా పాడైపోతున్న వైవాహిక జీవితంలో, భార్య తప్పేముందని భావించిన రామనాథం తన ఆదర్శాలనీ, కలల్నీ తన ఖద్దరు జీవితాన్నీ భార్య అంగీకరిస్తుందో లేదో తెలుసుకుందామని ఆమెను కలవడానికి మామగారింటికి వెళ్ళి, అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనలో మామ గారి చేత దెబ్బలు తిని, జైలు పాలవుతాడు. జైల్లో నానా హింసా భరించి, పురుగుల అన్నం తిని, విడుదలయ్యి ఇంటికొచ్చాకా, ఇంట్లో అతనికి పట్టింపుల బ్రాహ్మణత్వం ఎదురవుతుంది. జైలుకెళ్ళొచ్చినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోమంటే నిరాకరించి, తోటలో గుడిసె వేస్కొని కొత్త జీవితం మొదలుపెడతాడు. ఇక్కడ వుండగా చెరువు లో నీళ్ళను ఆ ఊరి అస్పృశ్యులను తాకనివ్వకపోవడం చూసి, బాధపడి, కొన్నాళ్ళు వాళ్ళకి నీళ్ళు తోడి పోసి, వాళ్ళకి శాశ్వత ప్రాతిపదిక న తన తోటలో బావి నీళ్ళని వాడుకోనిచ్చి, కుల బహిష్కృతుడవుతాడు.

ఆఖరికి అతను ఈ ఉద్యమ బాట లోనే నడిచి, తన మేనల్లుళ్ళకి, ఊర్లో కొత్త తరానికి ఆదర్శం గా నిలిచి, ఖద్దరు ప్రచార బాధ్యత ని తలకెత్తుకుని ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడం, గాంధీ గారు దాన్ని చూడడానికి ఆ కుగ్రామానికి రావడం తో నవల ముగుస్తుంది. ఆ సంఘటనలు మానవ ప్రయత్నం తోనే జరిగి దైవికంగా జరిగినట్టు అనిపించేలా చెయ్యబడడం కూడా అర్థం కానంత అమాయకుడు రామచంద్రం. కానీ ఒక మాట నమ్మాక మాత్రం వెనుతిరిగే లక్షణం లేదతనిలో. ఎంత కష్టం వచ్చినా గానీ ఎదురు నిలుస్తాడు. ఇలాంటి ఎందరో రామచంద్రాలు పోరాడితే నే మన సమాజంలోనూ, భవిష్యత్తు లోనూ మార్పులొచ్చాయి. ఎంత చిన్న స్థాయిలో ఎంత కొంచెంగా మొదలు పెట్టినా కానీ ఆ లక్షణాన్ని నిలుపుకున్నాడు కనకనే ఆ విజయం సాధించాడు అని చెప్పినట్టుంటుంది.

నవల ముగిసే నాటికి, వివాహం విఫలమైన రామనాథం, స్వరాజ్యం, పెళ్ళి చేసుకుంటారు. అతని జాతీయోద్యమపు జీవితం ఎందరో మహనీయుల్ని అతని స్నేహితులను చేస్తుంది. దువ్వూరు సుబ్బమ్మ తో రామనాథం సాన్నిహిత్యం, సుబ్బమ్మ అందర్నీ ఎగదోస్తుందని ముంగండలో ‘అమ్మ’ లు ఆవిణ్ణి ఆడిపోసుకోవడం అవీ బావుంటాయి. తమ తమ జీవితాల్ని ప్రభావితం చేస్తున్న గాంధీ కూడా వాళ్ళకి అయిష్టుడే. కానే అదే గాంధీ వాళ్ళ ఊరికి వస్తే మాత్రం, అంతవరకూ అస్పృశ్యులతో రాక్షసంగా ప్రవర్తించినవాళ్ళే – దాన్ని రూపుమాపడానికి ప్రయత్నించిన మహాత్మునికి బ్రహ్మరథం పడతారు.

ఈ నవల లో ప్రతీ పాత్ర కి ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుంది. ఏవీ అనవసరమైనవి కావు. ప్రతీ పాత్ర ప్రవర్తన వెనకా ఒక విశ్లేషణ ఉంటుంది. అవి ఎంత సహజంగా, నమ్మదగ్గవి గా ఉంటాయో, ప్రతీ పాత్రా – అది విలన్ పాత్రన్నా సరే, కాస్తయినా అర్థం చేసుకోగలిగితే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. రావణ బ్రహ్మ భయంకరమైన విలనే అయినా ఆయన ఆదర్శాలూ – ఆయన కారణాలూ ఎవరైనా విడమరచి చెప్పినప్పుడు అరే – ఈ వాదన కూడా భలే బావుందే అనిపిస్తుంది. రామనాథం మామ గారు – ఇందులో విలన్!! తాననుకున్నట్టుగా జరగక పోతే ఏ మనిషైనా ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలీదు. కాబట్టి ఈ నవల్లో ఈ విలన్ ని కూడా పెద్ద విమర్శించడానికి ఉండదు. రామనాథం ఎంత న్యాయం గా ప్రవర్తించినా, ఈ మంకుపట్టు కఠినత్వం, క్రూరత్వాల మామ గారు, కూతురి జీవితం అల్ల కల్లోలమైనా సరే – తాననుకున్నదే జరగాలని భీష్మించుకునే రకం. దానికి విరుగుడు ఉండదు. అలాంటతను తన భార్య స్వరాజ్యాన్ని అవమానిస్తే, రామనాథం ఆయన దగ్గరకి స్వరాజ్యాన్ని తీస్కెళ్ళి – మీకు తెలీదు గాబట్టి చెప్తున్నాను. ఈమె నా భార్య అని పరిచయం చేస్తాడు.

ఆ రోజుల్లో తెలుగు నేల లో జీవితం, పల్లె లో ప్రయాణాలూ, జాతీయోద్యమం లో పాల్గొన్న ప్రముఖులూ, వాళ్ళ కు ఎదురైన మంచీ చెడ్డా అనుభవాలూ, వాళ్ళ తో పాటూ వాళ్ళ కుటుంబాలు అనుభవించిన సంఘర్షణా – ఈ నవల్లో బాగా చర్చించారు. ఎందరో హిందూ మతానికి మచ్చ అయిన అంటరాని తనాన్ని, కుల మాత్సర్యాన్నీ అసహ్యించుకుని బ్రహ్మ సమాజం బాట పట్టారు. ఎందరో చదువుకున్న వాళ్ళూ, చదువుకోలేక పోయిన వాళ్ళూ మార్పు ని కోరుకున్నారు. అది సాంఘిక మార్పు. మొదట మనం మారి, గ్రామాన్ని మార్చి, సమాజాన్ని గాడి లో పెట్టి – అప్పుడు దేశానికి స్వాతంత్రం కోరదాం అనే ధోరణి ఎక్కువ గా కనిపిస్తుంది.

గాంధీ లాంటి ఒక మహాత్ముడు ఈ కొత్త వేవ్ ని ఒడిసి పట్టి, ప్రజలందర్నీ ఒక తాటికి తెచ్చి, దేశాన్ని స్వాతంత్ర ఉద్యమం వైపుకు నడిపించి, గెలిపించాడు. ఆయన్ని ఆరాధించిన దేశ ప్రజల ప్రేమ, గాంధీ మాటంటే, నోరెత్తకుండా పాటించే అభిమానం ఏ కొల్లాయి తో నైతే సాధించుకున్నాడో ఆ కొల్లాయి, ఈ నవల వచ్చిన కొన్నాళ్ళ తరువాతే ఆయన ధరించడం మొదలు పెట్టాడంట. ఈ ‘కొల్లాయిగట్టితేనేమి’ కి కొనసాగింపుగా, ‘దేశం కోపం’, ‘జ్వాలా తోరణం’ రాసారు మహీధర రామమోహనరావు గారు. అవి ఎక్కడ దొరుకుతాయో తెలీదు గానీ ఈ పుస్తకం మాత్రం కినిగె లో ఉచితంగా దొరుకుతుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 1965, 1978 తరవాత జూలై 2015 లో ఓ వెయ్యి కాపీలు వేసింది. ఇదీ కథ.

(ఈ నవల గురించి పుస్తకం.నెట్ లో గతంలో వచ్చిన వ్యాసాలు ఇక్కడ. ఈ పుస్తకం ప్రాజెక్ట్ గూటెన్బర్గ్ లో వాలంటీర్ల కృషితో వెలువడ్డ మొదటి తెలుగు పుస్తకం. )

You Might Also Like

One Comment

  1. Varaprasad

    మంచి కథావస్తువు .నాటి సమాజ పరిస్థితులను చక్కగా వివరించారు,

Leave a Reply