పుస్తకం
All about booksఅనువాదాలు

July 18, 2017

చెఖోవ్ కథ: హోమ్

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త:  సూరపురాజు రాధాకృష్ణమూర్తి

కథకు ప్రపంచసాహిత్యంలో ఒక విశిష్టరూపం కల్పించి దానిని ఉత్కృష్టస్థానంలో నిలిపినవారిలో చెఖోవ్ ప్రథముడు అంటారు. కథ రాయడం కవిత రాయడం వంటిదే. ప్రతి పదము సార్థకము సప్రయోజనము అయి ఉండవలె.అంటే, ఒక వాక్యమే కాదు, ఏ ఒక్క పదము తొలగించలేనిదిగా ఉంటుంది. ఒక శిల్పంలో, శిల్పం కాని రాతిని చెక్కి పడేసినట్లే, కథ చెక్కడంకూడా. ఆ శిల్పం చెఖోవ్ కథలలో పూర్ణరూపంలో చూడవచ్చు. సన్నివేశంలోగాని, పాత్రలవర్ణనలలోగాని, వస్తుప్రతిపాదనలోగాని ఏది అవసరమో అది మాత్రమే,ఎంత అవసరమో అంతమాత్రమే ఉంటుంది అతని కథలలో. ‘కథలో గన్ గోడకు ఉన్నది అంటే, కథ ముగిసేలోపల ఆ గన్ పేలవలె’అన్నది చెఖోవ్ ప్రసిద్ధ వాక్యం. ప్రస్తుతం ‘హోమ్’అన్న కథను చూద్దాం.

కథను యిలా చదవవచ్చు:

ఒక కథను కాని, కవితను కాని మరో సాహిత్యప్రక్రియను కాని ఆస్వాదించడమంటే సరి అయిన ప్రశ్నలడగడమే. ప్రతి వర్ణనను, ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని ‘ఇది కథలో ఏం చేస్తున్నది? దీని కథాప్రయోజనం ఏమిటి?’అని అడుగుతూ పోవడమే. వాటికి దొరికే సమాధానాలే కథార్థం. కనుక ప్రశ్నలడుగుతూ వెళదాం. అదే విశ్లేషణ. సమాధానాలు పాఠకుడు తనకు తానుగా పొందడంలో ఉన్న ఆనందమే నిజమైన సాహిత్యానందం. కథ స్థూలంగా కిందటి పోస్టులో చూశాం. మరి కొంత వివరంగా, మూడు భాగాలుగా చూద్దాం: ప్రవేశం, వస్తువు, ముగింపు. (ఇది కథకు యథాతథం అనువాదం కాదు. ముఖ్యభాగాలు, చిన్న మార్పులతో.)

 

ప్రవేశం

ప్రాసిక్యూటర్ సాయంకాలం యింటికిరాగానే, ఆయా ఆ రోజు వచ్చిన ఉత్తరము, న్యూస్ పేపరు ఇస్తూ, ఆయనతో ‘మీ పిల్లవాడు సిగరెట్టు తాగుతున్నాడు, ఈ రోజు చూశాను, మొన్న చూశాను.అతనితో మాట్లాడండి’అంటుంది. అది వినగానే ఆయనకు నవ్వు వచ్చింది. ఆ దివ్యశిశువు పెదాలపై సిగరెట్ ఎట్లా ఉంటుందో ఊహించుకుంటున్నాడు. ‘ఎన్నేళ్ళు వాడికి?’, అంటాడు. ‘ఏడేళ్ళు, ఇదేం పెద్దవిషయం కాదనుకుంటున్నారు. అంత చిన్న వయసులో పొగతాగడం మంచిది కాదు.ఆరోగ్యం చెడిపోతుంది. ఇట్లాంటి చెడు అలవాట్లు చిన్నవయసులోనే వదిలించాలి’, అన్నది. ‘వాడికి సిగరెట్లు ఎక్కడివి’, అని అడిగాడు . ‘మీ టేబుల్ సొరుగులో ‘,అంటుంది. ‘అయితే, వాణ్ణి నా గదికి పంపు’అంటాడు.

[ఈ భాగం, కథలోని పాత్రలను సన్నివేశాన్ని పరిచయం చేస్తుంది. ఈ భాగంలో ఎంత సమాచారం యివ్వవలెనో అంతే యిస్తాడు రచయిత. పిల్లవాడికి తల్లి లేదు. వాణ్ణి ఆయా చూచుకొంటోంది. తల్లి ఏమైంది? ఆ సమాచారం ఈ కథా భాగంలో అవసరం కాదు. మరో కథాభాగంలో దాని ఉపయోగం ఇక్కడికంటే ఎక్కువ. కనుక అక్కడే చెబుతాడు. అక్కడ కూడా ఎంత అవసరమో అంతే, వాక్యభాగంలో, పూర్తి వాక్యం కూడా ఉండదు. తల్లిలేని పిల్లవాడు, అన్నవరకే ఈ ప్రవేశ కథాభాగంలో అవసరం. పిల్లవాణ్ణి ఆయా చూచుకొంటోంది. తన కొడుకుకు ఎన్నేళ్ళు అని ఆయాను అడుగుతాడు. ఈ ప్రశ్న కథాప్రయోజనం ఏమిటి? ఆయా చెప్పిన మాటకు తండ్రికి కోపం రాలేదు, నవ్వు వచ్చింది. ప్రాసిక్యూటర్ దృష్టిలో, పిల్లవాడు సిగరెట్ తాగడం ఎక్కువ తప్పుగా అనిపిస్తుందా, తన టేబుల్ సొరుగులోనుండి తనకు తెలియకుండా తన సిగరెట్ దొంగిలించడం ఎక్కువ తప్పనిపిస్తోందా? ఈ ఎక్కువ తక్కువల ఆలోచన ఆయనకు ఎందుకు కలిగింది? కథలో దాని ప్రయోజనం ఏమిటి? ఆ ఆలోచన కలిగింది అనడానికి కథలో ఏ పదం ఆధారం? పిల్లవాడు దొంగతనానికి అలవాటు పడుతున్నాడు, మందలించండి అని చెప్ప లేదు ఆయా. ఇద్దరి దృష్టిలో ఈ భేదానికి ఏమిటి ప్రాధాన్యం?]

ఆయా వెళ్లిన తరువాత, ఆయన కొడుకును ఊహించుకుంటాడు. పెదాలమధ్య మూడడుగుల పొడుగు చుట్ట. వాడు పీల్చి వదిలిన పొగ మబ్బులై, వాడు ఆ మబ్బులపై కూర్చుని ఉన్నట్టు, కొడుకును తన ఊహలలో చూసుకుని మురిసిపోతున్నాడు.


కాని వెంటనే ఆయా ముఖం గుర్తొచ్చింది. ఆమె ఈ విషయం ఏమాత్రము తేలికగా తీసుకోవడంలేదు . నిజమే వెనుకటి రోజులలో సిగరెట్ తాగడం తెలిసి తల్లిదండ్రులు హాహాకారాలు చేసేవారు. టీచర్లు ఒళ్ళు వాతలు పడేటట్టు కొట్టి స్కూలునుండి తరిమేసేవారు. ‘కాని ఎవరికీ పొగతాగడంలో హాని ఏమిటో అది ఎందుకు తప్పో తెలియదు. అర్థంకాని దానిపై ఆగ్రహం ఉండడమన్నది సామాజికజీవన లక్షణమేమో? ఎంత అర్థం కాదో అంత ఆగ్రహం, అంత క్రూరమైన శిక్ష. మనుషులు ఎటువంటి పరిస్థితికి కూడా అలవాటుపడిపోతారు, అర్థంలేని ఆగ్రహానికి, అవసరంలేని అపరాధభావానికి, అపరాధాన్ని మించిన శిక్షకు.’

[ప్రాసిక్యూటర్ తన పిల్లవాడిని విచారణకు పిలిచి, వాడు వచ్చేలోపల ఈ విధంగా ఆలోచించడానికి కథలో ఏం ప్రాముఖ్యం? ఈ ఆలోచనలు తండ్రివా, ప్రాసిక్యూటర్‌వా?]

 

వస్తువు

రాత్రి ఎనిమిదవుతోంది. పై ఫ్లోర్ లో ఎవరో గదిలో ఇటునుంచి అటు, అటునుంచి ఇటూ, నడుస్తున్నారు.
ఆ పై ఫ్లోర్ లో ఇద్దరు పియానో నేర్చుకుంటున్నారు. గది బయట పిల్లవాడు ఆడుకుంటూ, ‘నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు’అని వాడిలో వాడు పాడుకుంటున్నాడు. ‘మీ నాన్న పిలుస్తున్నాడు, వెళ్ళు. నీకే చెప్పడం’, అని అరుస్తోంది ఆయా. లోపల, తండ్రి ‘ఏం చెప్పాలి వీడికి? ‘, అని ఆలోచిస్తున్నాడు. కొడుకు ‘గుడ్ ఈవినింగ్, నానా’, అంటూ వచ్చి తండ్రి ఒడిలో ఎక్కి కూర్చుని, ఒక తొందరముద్దు ఇచ్చాడు. ఆయన వాణ్ణి ఎత్తి పక్కన కూర్చోపెట్టి, ‘నేను నీతో ఒక సీరియస్ విషయం మాట్లాడాలి. తరువాతే ముద్దులు. నీవంటే నాకు ఇష్టం లేదు. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది.నీవు నా కొడుకువు కాదు’, అన్నాడు. పిల్లవాడు కాసేపు నాన్న ముఖంలోకి చూచాడు. చూపు టేబుల్ మీదికి మళ్ళించి, ’ఏం చేశాను? ఈ రోజు నీ గదిలోకే రాలేదు నేను’, అన్నాడు. ‘ఆయా చెప్పింది, నీవు సిగరెట్ తాగుతున్నావని.అవునా?’ ‘ఒక్కసారి తాగాను…అవును’. ’రెండు సార్లు చూశానన్నది, ఆయా’ ‘ఊ…అవును.ఈ రోజు, మొన్ననొకరోజు.’ ‘చూశావా! ఒకసారి కాదు, రెండు సార్లు. మంచి పిల్లవాడివి అనుకుంటూ ఉన్నాను. ఎందుకు యిట్లా పాడయిపోతున్నావు?’ కొడుకు వెల్వెట్ జాకెట్ కాలర్ సవరిస్తూ ప్రాసిక్యూటర్, యింక తరువాత ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. ‘అసలు నీవు నాటేబుల్ సొరుగు తెరిచి, నా వస్తువు తీయడం మొదటి తప్పు. ఇతరుల వస్తువులు వాళ్ళకు చెప్పకుండా తీసుకోడం తప్పు కదా? (ఫరవా లేదు, కేసు బాగానే వాదిస్తున్నట్టున్నాను!) అసలు, ఒకరి వస్తువులు ఒకరు తీసుకోకూడదు. ఇప్పుడు, ఆయాకు ఒక పెట్టె ఉంది.ఆ పెట్టెలో ఆమె బట్టలు పెట్టుకుంటుంది. ఆ పెట్టె తెరిచి అందులో వస్తువులు మనం, అదే నీవుగాని నేను గాని, తీసుకోవచ్చా? (నేను చెప్పదలచుకున్నది ఇది కాదేమో?) కొడుకు అందుకొని అన్నాడు: ‘ఏమవుతుంది, నానా! నీ టేబుల్ మీది పచ్చకుక్క నాదే! ఉంచేసుకో. నేనేమీ అనుకోను.’ ‘అది కాదు.(వీడికి అర్థం కావడం లేదు, నేనేం చెబుతున్నానో.ఎలా చెప్పాలి?)’. కొడుకు తన పొడుగు గడ్డంపై వాడి ముఖం తాకిస్తూ , తల తిప్పుతూ ఉన్నాడు. ‘అనుమతి లేకుండా వేరేవాళ్ళ సిగరెట్ తీసేసుకొని తాగకూడదు. ఒకరి సొమ్ము ఒకరు తీసుకోవడం తప్పు. ’పిల్లవాడి దృష్టి టేబుల్ మీద ఉన్న బంకసీసా మీదికి వెళ్లింది. దాన్ని చేతిలోకి తీసుకుని కంటిదగ్గర పెట్టుకొని చూస్తూ, ’పాపా, బంక దేంతో చేస్తారు?’ అన్నాడు. తండ్రి వాడిచేతిలో సీసా లాగేసి, మళ్ళీ టేబుల్ మీద పెట్టి, ఆస్తి, ఆస్తిపై హక్కులు, వీటి గురించి వాడికి అర్థమయేటట్టు పిల్లల భాషలో వివరించే ప్రయత్నం చేస్తున్నాడు (వాదన సరిగా సాగుతున్నట్ట్టు లేదే!). నేను సిగరెట్ తాగుతాను. నేను పెద్దవాణ్ణి. అలా చేయకూడదని తెలుసు, ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. (నేను మంచి టీచర్నే!) ‘చూడు,పొగతాగడం వల్ల క్షయ, యింకా అనేక రోగాలు వస్తాయి. పదేళ్ళ తరువాత చనిపోయేవాడు ఇవేళే పోతాడు. మీ మామయ్య చూడు! సిగరెట్లు తాగకపోతే యింకో పదేళ్ళుండేవాడు.’పిల్లవాడి ముఖంలో ఒక మబ్బు తెర, ‘మామయ్య వయొలిన్ బాగా వాయించేవాడు.’ఈ మధ్యనే చనిపోయిన వాడి తల్లి గుర్తు వచ్చి ఉంటుంది. ‘అమ్మను మామయ్యను చావు పైకి తీసుకెళ్ళి పోయింది. చనిపోయిన వాళ్ళందరూ పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ వయొలిన్ లు, వాళ్ళ పిల్లలు కింద ఉండిపోతారు. పోయినవాళ్ళు ఏ చుక్కల మధ్యనో ఉండి మనలను చూస్తూ ఉంటారు. ’తండ్రికి ఆ తరువాత ఏం చెప్పాలో తెలీలేదు. లేచి నిలబడ్డాడు. గదిలో అటునుంచి యిటు యిటునుంచి అటు తిరుగుతున్నాడు. ‘మా చిన్నతనంలో ఇంత కష్టం ఉండేది కాదు.ఈ విషయాలు సులభంగా పరిష్కారమయ్యేవి. పిల్లలు ఏదైనా తప్పుచేస్తే, నాలుగు పీకడమే. అంతటితో అయిపోయేది. నా చిన్నతనంలో నేనేదైనా తప్పు చేస్తే, అమ్మ మిఠాయిలు యిచ్చేది, ‘యింకెప్పుడూ చేయకురా’ అంటూ. ఇప్పుడూ అవేవీ పనికిరావంటారు. అంతా వాదమే. న్యాయము తర్కము హేతువాదము.

పిల్లవాడు ఎప్పుడో టేబుల్ ఎక్కి కూర్చుని, దాని మీద ఉన్న కాగితము కలము తీసుకొని ఏదో బొమ్మగీసుకుంటున్నాడు. గీస్తూ మాట్లాడుతున్నాడు. ‘ఈ వేళ, పాపా, వంటావిడ కాబేజి తరుగుతూ చెయ్యి కోసుకుంది. పెద్ద కేక వేసింది. భయపడి వెళ్ళి చూశాం. వేలు నీళ్ళలో ముంచమంది ఆయా. ఆమేమో వేలు నోట్లో పెట్టేసుకుంది. చేతికి ఎంత మురికి ఉంటుంది! నోట్లో పెట్టుకోవచ్చా? ’ఏదేదో చెప్పుకు పోతున్నాడు. తలెత్తకుండా, బొమ్మ గీస్తూ. ‘వీడు వినడం లేదు. నేనేదో చెబుతున్నాను, వీడేదో ఆలోచిస్తున్నాడు. వాడి బుర్రలో వేరే లోకం ఉంది. వాడి లోకమే వేరు. వాడు చేసిన తప్పుగాని, నా వాదనలుగాని, వాడు ఏమీ సీరియస్ విషయాలు అనుకోడంలేదు. ఏం చెయ్యాలి? వాడు నా మాటలు పట్టించుకోవలె అంటే నర్సరీ భాషలో మాట్లాడితే చాలదు. భాష కాదు, భావం పట్టుకోవాలి. వాడి మనసును పట్టుకోవాలి. నా సిగరెట్ నష్టమైనందుకు నాకు కష్టం కలిగితే, నేనేడిస్తే వాడికి అర్థం అవుతుంది. అందుకే మరెవ్వడూ తల్లిస్థానాన్ని తీసుకోలేడు. వాడితో కలిసి ఏడవాలి, కలిసి నవ్వాలి. తర్కము నీతి అవినీతి, ఇవేవీ పనిచేయవు. కోర్టులో యింతకాలంగా ఎందరితోనో వాదించి గెలిచాడు. ఒక పిల్లవాడిముందు ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోయాడు. 
చివరగా అన్నాడు, ‘ప్రమాణం చేసి చెప్పు, ఇంకెప్పుడూ చేయనని’. “ప్రమాణం”? అంటే? ప్రాసిక్యూటరుకు విసుగొచ్చేసింది. మళ్లీ కుర్చీలో కూర్చున్నాడు. కొడుకు గీస్తున్న బొమ్మ లాక్కున్నాడు. ఒక యిల్లు, చిమ్నీలోంచి పొగ. ఇంటి పక్కన నిలబడిన ఒక మనిషి. వాడి కళ్ళు రెండు ఫుల్ స్టాపులు. వాడి చేతిలో తుపాకి.

‘ఇంటికంటే మనిషి ఎత్తుగా ఉంటాడురా, ఎక్కడైనా?’

‘నానా, మనిషి అంతకంటే చిన్నగా ఉంటే వాడి కళ్ళు యింకా చిన్నగా గీయాలి. కనిపించవు.’

ప్రాసిక్యూటర్ అనుకున్నాడు, తనది తర్కం, వాడిది కళ. ఇళ్ళు, కళ్ళు కాదు. రూపంలేని భావాలను, సంగీతస్వరాలను కూడా బొమ్మలుగా గీస్తాడు.

పిల్లవాడు మళ్ళీ దిగివచ్చి వాళ్ళ నాయన గడ్డంతో ఆడుకుంటున్నాడు. దాన్ని దువ్వాడు.రెండు పాయలుగా చేశాడు. మళ్ళీ ఒకటి చేశాడు. తండ్రి ముఖంలోకి చూస్తున్నాడు. అంతా వాళ్ళ అమ్మచూపులాగే ఉంది వాడిచూపు.

వీణ్ణి కొట్టడమా?

ప్రాసిక్యూటర్ ఈ రోజుకు సెషన్స్ ముగించి పిల్లవాణ్ణి వెళ్ళి పడుకోమన్నాడు. వాడు కథ చెప్పు, అన్నాడు .

 

ముగింపు


పిల్లవాడు కథ చెప్పమన్నాడు. ప్రాసిక్యూటర్ కు క్లాజులు సబ్ క్లాజులు కంఠస్థమైనట్టు కథలు కథల పాటలు కావు. కాని ఆయనకు తీరిక ఉన్న రోజున కొడుకుకు కథ చెప్పడం అలవాటు. అన్ని కథలలాగే అనగనగా ఒక రాజుతో మొదలవుతుంది కథ. కాని కథలో తరువాత ఏం జరుగుతుందో తెలియదు. ఏదో కల్పించవలె. మొదలుపెట్టినపుడు కథ ఎలా ముగుస్తుందో తెలియదు. ప్రతి వాక్యము దాని తరువాత వాక్యం ఎలా ఉండబోతుందో తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ పద్ధతి పిల్లవాడికి నచ్చింది. అప్పటికప్పుడు తన కళ్ళముందే పుట్టిపెరుగుతున్న కథ వినడంలో వాడికి రెండువిధాల ఆనందం, కథ, కథావిర్భావము. ప్రాసిక్యూటర్ కథ చెబుతున్నాడు. ‘ఒక పేద్ద అందమైన తోట. రకరకాల చెట్లు. పూలు కాయలు పండ్లు. ఆ చెట్లకు గాజుగంటలు పూలు! అవును. గాలి వీచినప్పుడల్లా ఆ గంటలు ఊగి మోగుతాయి. గాజుగంటల మోత, లోహగంటలమోతలా ఉండదు. నాజూగ్గా ఉంటుంది. పూలమొక్కలు. రంగురంగుల పూలు. రంగురంగుల పక్షులు, రెక్కలాడిస్తూ తోటలో ఎగురుతుంటాయి. రకరకాల కూతలు. ఊఁ…ఇంకా…? ఆఁ. ఫౌంటెన్ లు! ఆంటీ యింట్లో చూచావు చూడు? అట్లాంటివి. అయితే యింకా పేద్దవి. ఆ తోటలో ఒక రాజభవనం. అంతా గాజుతో కట్టిందే. ఆ భవనంలో ఒక రాజు. పెద్దవాడైపోయాడు. తలా గడ్డమూ తెల్లగా అయిపోయాయి. ఆయనకు ఒకే ఒక్క కొడుకు. చిన్న పిల్లవాడు, నీ లాగే. తన తరువాత రాజ్యం చేయవలసినవాడు. మంచి పిల్లవాడు. అల్లరి చేసేవాడు కాదు. బుద్ధిగా వేళకు తిని వేళకు నిద్ర పోయేవాడు.ఏ చెడ్డ అలవాట్లు లేవు. ఒక్కటి మాత్రం ఉండేది. పొగతాగేవాడు. దాంతో పాపం వాడికి క్షయవ్యాధి పట్టుకుని చిన్నతనంలోనే చనిపోయాడు. ముసలిరాజు పాపం దిగులుతో మంచంపట్టాడు. శత్రురాజులు దాడిచేసి, రాజును చంపేశారు. రాజభవనం ధ్వంసం చేశారు. తోటనంతా చిందరవందర చేసేశారు. పక్షులకూతలు లేవు. గాజుగంటల మోతలు లేవు. …అదీ జరిగింది.’కథ ముగించాడు. కాని ప్రాసిక్యూటర్ కు తన కథ మరీ చిన్నపిల్లల కథలా, అసంబద్ధంగా అనిపించింది. పిల్లవాడి మనసుపై మాత్రం కథ బలమైన ముద్ర వేసింది. ’నేనిక పొగ తాగను’, అని, గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పోయాడు. ప్రాసిక్యూటర్ కు నవ్వు వచ్చింది. ‘కళ , సౌందర్యము వాటి ప్రభావము అంటారు. కావచ్చు. కాని దాని వల్ల ఏం లాభం లేదు. అది సరి అయిన పద్ధతి కాదు. నీతి నిజాయితీ ఉన్నదున్నట్టు ఎందుకు చెప్పకూడదు? దాన్ని అందంగా అలంకరించాలి, మెరుగులు దిద్దాలి, చక్కెరపూతపూసిన మందులలాగా చేసి యివ్వాలి అంటారు. కాదు. అది భ్రమ పెట్టడం. మోసం చేయడం ..గారడి …’ ఆయన ఆలోచించాడు. కోర్టులో ఆయన తర్కమే పనిచేస్తుంది. కాని తాను జీవితంలో నేర్చుకున్నదంతా న్యాయశాస్త్రగ్రంథాలనుండి కాదు, నీతికథలనుండి, కథలనుండి, కవితలనుండి. ఏమిటో? జీవితంలో భ్రమలకు కూడా స్థానం ఉంది. వాటికి ఒక ప్రయోజనం ఉంది.’ ప్రాసిక్యూటర్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. రేపటి కోర్టుపనికి చూసుకోవలసినది ఉంది. కాని ఆయన మనసులో ఏవో కదలికలు. ఆ పై ఫ్లోర్ లో సంగీతం ప్రాక్టీసు ముగిసింది. కాని, పై ఫ్లోర్ లో అడుగుల చప్పుడు ఆగలేదు. ఇదీ కథ. మొదటనే చెప్పాను, ఇది పూర్తి అనువాదం కాదు. ఇక “హోమ్” వర్క్:

-“హోమ్” కు సరి అయిన తెలుగుపదం ఉందా?

-ఈ కథకు ” హోమ్” అన్న పేరే ఎందుకు? 

-పిల్లవాడి వయసు ప్రస్తావన ప్రాధాన్యం ఏమిటి? వయసు ఏడు కాక పదిహేడు కావచ్చా?

-ప్రాసిక్యూటర్ చెప్పిన కథ పిల్లవాడిని ఉద్దేశించినది మాత్రమేనా? కథాకారులనుకూడా ఉద్దేశించినదా?

-కథ ముగింపులో, పై రెండు ఫ్లోర్ లలో ఏం జరుగుతుందో, ఏమి ఆగి పోయిందో చెబుతాడు. వాటి ప్రాధాన్యం ఏమిటి?

-కథ ప్రాసిక్యూటర్ మనసులోని మథనతో ముగుస్తుంది.ఏమిటా మథన?

వ్యక్తిలో సమాజంలో నిత్యము జరిగే మథన. బుద్ధికి మనసుకు, తర్కానికి కళకు, న్యాయానికి ప్రేమకు నిరంతరాయంగా జరిగే ఘర్షణ. చట్టము దయ ఈ రెంటిలో దేనినీ వదిలి సమాజం నడవలేదు. క్రోధాన్ని శోకాన్ని సమన్వయం చేయడంలో జరిగే మథన ఏ రచనకైనా వస్తువు. క్రోధము శోకము శ్లోకత్వం పొందడమే కావ్యావిర్భవం. చట్టాన్ని గంగలో కలిపి, కేవలం ప్రేమతో సమాజం నడవగలదు అని చెఖోవ్ చెప్పడంలేదు. ఏ రచయిత చెప్పలేడు చెప్పడు. ప్రేమ కరువైతే ఏ సమస్యకు పరిష్కారం లేదన్నదీ అంతే సత్యం. ఈ సమన్వయకార్యమే కావ్యవస్తువు. ఈ కథ కేవలం పిల్లల కథ కాదు. ఇందులో వ్యక్తి, కుటుంబం, సమాజం అనే మూడు వృత్తాలు ఒకదానికంటే మరొకటి విస్తృతమై ఒకదానిలో ఒకటి యిమిడి ఉన్నాయి. కథార్థం అన్ని వలయాలుగా విస్తరిస్తుంది.

ధర్మము దయ ఈ రెంటి సమన్వయమే ఏ కావ్యమైనా. ఏ ఋషి అయినా అదే చెబుతాడు, ఏ కవి అయినా అదే చెబుతాడు.
కలం పట్టిన ప్రతివాడు కవి కాకపోవచ్చు, ఋషి కాక తప్పదు, పట్టిన కలమేదైనా పుట్టిన కులమేదైనా.

 

ఉత్తరోత్తరం.(Post script)

‘కలం పట్టిన ప్రతివాడు కవి కాకపోవచ్చు, కాని ఋషి కాక తప్పదు. పట్టిన కలం ఏదైనా పుట్టిన కులం 
ఏదైనా.’ఈ వాక్యం ఏదో బాగుంది కదా అని అనేసినట్టు అనిపించవచ్చు. చెఖోవ్ ఆర్షభూమిపై పుట్టినవాడు కాడు. ఆస్తికుడు అసలే కాడు. మరి ఋషి ఎట్లా? దీనికి వివరణ యివ్వవలసిన అవసరం ఉంది. దానికి ముందు, అడిగిన ప్రశ్నలకు కొన్నిటికైనా సమాధానాలు చెప్పాలిగా?

 

వస్తువు-శిల్పము

సమాధానాలు కథాశిల్పంతో కలిసిపోయి ఉంటాయి. శిల్పము వస్తువు వేరు కావు. కథాప్రయోజనాన్ని సఫలం చేసేది, వస్తువును ఆవిష్కరించేది శిల్పం. శిల్పినైపుణ్యాన్ని శిల్పంలోనే కదా చూడగలం? వేరుచేసి చూడలేము కదా? కథా వస్తువు కథాప్రయోజనము శిల్పంలో భాగమే.(Content? That is also part of the form.) “చెఖోవ్ తుపాకి” అనేది ప్రసిద్ధవాక్యం. కథలో గోడమీద ఒక తుపాకీ వేలాడుతోంది అన్నావంటే, కథ ముగిసేలోపల ఆ తుపాకీ పేలాలి. అంటే కథాప్రయోజనానికి పనికిరాని ఒక్క మాట కూడా ఉండకూడదు. ఇది వఠ్ఠి మాటేనా? ఈ కథలో ఏదైనా తొలగించగలమేమో ప్రయత్నించి చూద్దాం.

ప్రాసిక్యూటర్ నవ్వు

‘నీ కొడుకు సిగరెట్ తాగుతున్నాడు’అని చెప్పగానే, తండ్రికి కోపం వస్తుందా, నవ్వు వస్తుందా? కథలో తండ్రికి నవ్వు వచ్చింది. నెలల పిల్లవాడు మొదటిసారి నడిచే ప్రయత్నం చేస్తూ రెండడుగులు వేసి మూడో అడుగు వేస్తూ చతికిలపడ్డాడు. చూస్తున్న తండ్రికి నవ్వు వస్తుందా కోపం వస్తుందా? నవ్వు రావడం అసహజం కాదు, రాకపోవడం అసహజం. లోకంలో ఇలాగే జరుగుతుంది. మంచి లోకానుశీలనం. నిజమే.కాని, లోకంలో జరిగేవన్నీ కథలో చెబుతారా? ఈ అనుశీలనం కథకు అవసరమా? దాన్ని తొలగించి చూద్దామా? ఎవడైనా తప్పు చేస్తే మనకు మొదట, చివర వచ్చేది కోపం. ‘ఏదో తెలియక చేశాడు పాపం!’ అని అనడం లేదు.మనిషికి సహజమైన నవ్వు, నాగరికతలో (చట్టము న్యాయము) మరుగునపడిపోయింది. తండ్రి అలా నవ్వుతూ ఉండిపోడు. చతికిలపడ్డ పసివాణ్ణి ఎత్తుకొని ఎగరేసి, పట్టుకుని, తిరిగి నేలమీద నిలబెట్టి, వేలు అందించి నడిపిస్తాడు. కథ గుర్తుచేస్తున్నది మనిషి మరిచిపోయిన ఆ మొదటినవ్వును. పసివాడి తప్పటడుగులు మనకు “తప్పుటడుగులు” గా కనిపిస్తున్నాయి. అది కథలో ఆ నవ్వు ప్రయోజనం. కనుక, కథలో ఆ నవ్వును తొలగిస్తే ఏమవుతుంది? పునాదిరాయిని పీకేస్తే ఏమవుతుంది? కథ కుప్పకూలుతుంది. అయితే, నవ్వు సమస్యలన్నిటికీ పరిష్కారమా? అలా అన్నాడా చెఖోవ్ కథలో ఎక్కడైనా? పరిష్కారం కాదు. కాని, మనం తప్పటడుగును తప్పుటడుగుగా మాత్రమే చూస్తున్నాము అన్నదే కథలో విషయం. కథకుడి పని ప్రశ్నలడగడమే, సమాధానాలు పరిష్కారాలు సూచించడం కాదు. (అలాగని ప్రశ్నలు మాయమవవు.) సాహిత్యం, ఉత్తమసాహిత్యం, యిచ్చే సమాధానం ఒకటే. జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఈ జ్ఞానంలో కలిగే చిత్తసమాధానమే నిజమైన సమాధానం.ఈ సమాధానమే అలంకారికులనే శాంతరసం (tranquility).

‘ఎన్నేళ్ళు వాడికి?!’

తండ్రి ఈ ప్రశ్న ప్రాసిక్యూటర్ గా అడగలేదు. నవ్వుతూ అడిగాడు. తనకు పిల్లవాడి వయసుకూడా తెలియనంతగా తన లోకవ్వహారాలలో మునిగిపోయాడు, అది తల్లులకు తెలిసేది, అన్నది ప్రశ్నకు ఒక కోణం. మరో కోణం, తను నవ్వుతూ అడగగలగడం. ఇది తప్పు అన్న భావం కంటె, ఇది ఈ వయసులో సహజం అన్న భావన అతనికి కలిగింది. అయితే ఈ ప్రశ్న కేవలం తండ్రి వేసిన ప్రశ్న మాత్రమేనా? కాదు. ఇది యిద్దరి ప్రశ్న. నేరస్థుణ్ణి కోర్టులో ప్రవేశపెట్టగానే ప్రాసిక్యూటర్, తనకు సమాధానం తెలిసి, అడిగే ప్రశ్నలలో ఇది ఒకటి. కోర్టు ఏడేళ్ళపిల్లవాడికి (juvenile), పదిహేడేళ్ళు దాటిన పిల్లవాడికి ఒకే తీర్పు చెప్పదు. అక్కడ వయసు ప్రశ్నకు ప్రాధాన్యం ఉంది. అక్కడే కాదు, న్యాయశాస్త్రవికాసంలో కూడా, ‘కాలం వయసు’ కు తేడా ఉంటుంది. ఏడేళ్ళ మానవనాగరికతకు ఏడువేల ఏళ్ల నవనాగరికతకు ఒకే చట్టం పనికిరాదు. కృతయుగపు మనుస్మృతి కలియుగంలో చెల్లదు. కనుక ఈ వయసుప్రశ్నకు రెండు ముఖాలు. 

ఈ కథలో గమనించవలసిన రెండు మూడు అంశాలు చెప్పుకుని, ఋషి శబ్దప్రయోగం వివరించి,చెఖోవ్ ముచ్చట ముగిస్తాను.

కథలో కథ

తన కొడుకుకు చెప్పిన కథ తనకు నచ్చలేదు అంటాడు ప్రాసిక్యూటర్. కథ అసంబద్ధంగా తోచింది ఆయనకు. బుద్ధి, తర్కము దృష్టిని నియమించే ప్రాసిక్యూటర్ కు తను సృష్టించిన కథే అయినా నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. కాని తండ్రిగా తను చెప్పిన కథ ప్రాధాన్యం, దాని ప్రయోజనము గుర్తించలేనివాడు కాదు. వృత్తి రీత్యా బుద్ధిజీవి. కాని జీవితంలో తను నేర్చుకున్నది న్యాయశాస్త్రగ్రంథాలనుండి కాదు. జీవితానికి పనికివచ్చేదంతా తాను నీతికథలు, నవలలు, కావ్యాలు- వీటినుండి నేర్చుకున్నాడు. ‘సృష్టిలో చాలా భ్రమలు మోసాలు ఉన్నాయి, వాటి అవసరం ఉంది’, అంటాడు. అంటే, ‘మరక మంచిదే’, అంటున్నాడు.

కథ ప్రాసిక్యూటర్ పిల్లవాడికి చెప్పిందేనా?

అవును. కాని అది మాత్రమే కాదు. పాత్ర చేత కథ చెప్పించడమే కాక, పాత్ర ద్వారా చెఖోవ్ కథ ఎలా రాయాలి అని చెబుతున్నాడనిపిస్తుంది. ‘దృశ్యాలు,పాత్రలు, సన్నివేశాలు అన్నీ అప్పటికప్పుడు అనుకుని తీసుకున్నవే. కథాసంయోజనము, నీతి కథకుడి పథకం లేకుండానే, వాటంతట అవే వచ్చి చేరుతాయి. ఈ విధంగా అప్పటికప్పుడు ఆవిర్భవించే కథ పిల్లవాడికి చాలా యిష్టం.’ ఈ మాటలు కథాకారులను ఉద్దేశించినవే. రచన కృత్రిమం కాకుండా సహజంగా ఆవిర్భవించవలె, అంటాడు చెఖోవ్. కథలో నుండి నీతి, సందేశం రావలె. నీతిలో నుండి, సందేశం లోనుండి కథ రాకూడదు..

‘పై రెండు ఫ్ల్లోర్ లు’

ప్రాసిక్యూటరు గదికి పైన రెండు ఫ్లోర్ లు ఉన్నాయి.ప్రాసిక్యూటర్ కొడుకుతో మాట్లాడడానికి మొదలుపెట్టినప్పుడు పై ఫ్ల్లోర్ లో అడుగుల చప్పుడు, దానిపై ఫ్ల్లోర్లో సంగీతాభ్యాసము వినిపించాయి. కథ ముగిసినప్పుడు సంగీతం ఆగింది. కాని అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంది. ఇవి దేనికి సంకేతం? సంగీతం తను చెప్పిన కథతో ముగిసింది అంటే, చేదు పాఠానికి చక్కెరపూత అప్పటికి పనిచేసింది. కాని అది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. సత్యానికి భ్ర్రమకు, కల్పనకు తర్కానికి మధ్య ఘర్షణ ఆగదు. అదే ఆగని అడుగుల చప్పుడు. ప్రాసిక్యూటర్ చెప్పిన కథ శాశ్వత పరిష్కారం అనడం లేదు చెఖోవ్. భ్ర్రమలకు కూడా ప్రయోజనం ఉన్నది అని గుర్తు చేస్తున్నాడు.

కథ పేరు

“హోమ్” కు సరి అయిన తెలుగు పదం లేదనుకుంటాను. “ఇల్లు” కు “నా” కాని “మా” కాని చేరిస్తే( నా యిల్లు, మా యిల్లు) కొంత సరిపోవచ్చు. ఈ కథకు ఆ పేరు పెట్టడంలో ఔచిత్యం తెలుస్తూనే ఉంది. శిక్ష, శిక్షణ కూడా ఇంట్లోనే మొదలుకావలె, తల్లి ప్రేమలో. సమాజంలో కూడా ఈ తల్లిప్రేమను ఆశించడం అవాస్తవం కావచ్చు. కాని కోరడం కవి స్వభావం.

కలం మహిమ: ఋషి

రష్యన్ సాహిత్యానికి పందొమ్మిదవ శతాబ్దం స్వర్ణయుగమంటారు. (ఇంగ్లీషుకు పదహారో శతాబ్దంలాగా.) ఆ యుగపు ప్రసిద్ధత్రయమని చెప్పదగినవారు: Dostoevsky (1821-1881), Tolstoy (1828-1910), Chekhov (1860-1904) ఈ ముగ్గురు ఒక్కొకరు ఒక ప్రత్యేకమైన ముద్రవేసి పోయారు రష్యన్ సాహిత్యంపై. చెఖోవ్ అన్నాట్ట, ‘నా రచనలు మరో ఏడు సంవత్సరాలు చదువుతారు పాఠకులు’, అని. ’’ఏడే ఎందుకు’, అని అడిగితే, ‘ఏడున్నర. ఇంకా ఆరేళ్ళు బతుకుతాను కదా’, అన్నాడట, తరుముకొస్తున్న క్షయవ్యాధిని తలచుకొని. జూలై 15 కు ఆయన పోయి నూటపదమూడు సంవత్సరాలు.) ఇక్కడ ప్రస్తావించిన ముగ్గురి గురించి సాధారణ అభిప్రాయం, ‘మొదటి యిద్దరి రచనలను మనం చదవనవసరం లేదు. అవి చదివిస్తాయి. చెఖోవ్ రచనలను మనం చదవాలి’, అని. ఇటువంటి అభిప్రాయాలు పాక్షికంగానే గ్రహించాలె. నా మటుకు నేను ఈ గంపగుత్త బేరాలు చేయను. గంపలో నాకు కావలసినవే ఏరుకుంటాను. “ఆనా కెరినినా” ఆపకుండా చదివించింది. “వార్ అండ్ పీస్” మూడు సార్లు మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయాను. ఏ రచయిత విషయంలోనైనా యిలాగే ఉంటుంది. ఏ రచనకు ఆ రచనే. అయితే, చెఖోవ్ విషయంలో, తక్కిన యిద్దరే కాదు, ఏ యితర రచయితల రచనలలో కంటే కూడా పాఠకుడి పాత్ర ఎక్కువ అవసరమవుతుంది. ఈ మాట కూడా అతని ఒక రచనాదశలోని రచనల విషయంలో మాత్రమే, రచన పరిణతి పొందిన దశలో. ఈ దశలో అతని కథలకుగాని నాటకాలకుగాని వస్తువు తక్కిన చాలామంది రచయితల రచనలలో లాగా పాత్రలో ఘటనలో దృశ్యమో కాదు. ఒక రకంగా చెప్పాలంటే, యితరులకు వర్షంలో వర్షధార వస్తువైతే, చెఖోవ్ కు ధారకు ధారకు మధ్యనున్న శూన్యం కావ్యవస్తువు. కనుక పాఠకుడు ఎక్కువ ధ్యానం ఉంచవలె. చెఖోవ్ బాల్యం దారిద్ర్యంలో గడిచింది. కుటుంబవాతావరణం సంతోషకరమైంది కాదు. తండ్రి తాగి అప్పులు చేసి భార్యాపిల్లలకు అప్పులే మిగిల్చాడు. ఒకరోజు పులుసులో ఉప్పు ఎక్కువైందని, (ఒకరోజు కాదు, ప్రతిరోజు ఏదో ఒకటి ఎక్కువో తక్కువో అవుతుంది,) తండ్రి తన తల్లిపై చేసిన రచ్చ, చెఖోవ్ జీవితాంతము మరచిపోలేదు. చెఖోవ్ కుటుంబభారం వహించాడు. మొదట డబ్బుకోసం పత్రికలవాళ్ళు ఏది ఎలా రాయమంటే అలా రాశాడు. ఈ దశలో అతని రచనలలో వ్యంగ్యము వైముఖ్యము వైరస్యము నైరాశ్యములు ప్రధానంగా ఉండేవి. తనకు రచయితగా పేరు రావడం మొదలయాక (1880-84), రచనలో కొంత స్వేచ్ఛ వికాసము కనిపిస్తుంది. ఈ దశలో తోటివారిపట్ల సహనము దయ తన రచనలలో కన్పించటం మొదలయింది. 1885 తరువాత అతనిపై టాల్స్టాయ్ ప్రభావం బాగా పడింది. ఈ దశలో చేసిన రచనలలో ఏ వైరస్యము లేని ఒక చిత్తసమాధానం కనిపిస్తుంది. సృష్టిని, దాని అన్ని వైషమ్యాలతో స్వీకరించగలిగాడు. సృష్టిలోని సమస్యలకన్నిటికీ సమాధానాలుండవు అన్నదే పెద్ద సమాధానమన్న శాంతస్థితిని పొందాడు. ఈ చిత్తసమాధానమే ఋషిలక్షణం. కలం పట్టుకున్న ప్రతివాడు ఈ సమాధానానికి వస్తాడు.కలం పట్టి మంచిని శపించగలిగినవాడు లేడు. కలం పట్టి కవి కాక పోవచ్చు. కాని లోకానికి మేలు తప్ప కీడు కోరలేడు. కలం ఒక మంత్రదండమే. ద్వేషమూర్ఛితుడి చేతిలో కలం పెట్టండి. వాడికి స్పృహ వస్తుంది, సామాజికస్పృహ. వాడి ద్వేషంలో కూడా ప్రేమ నిండి ఉంటుంది. లోకాన్ని శపించలేనివాడు ఋషికాక మరేమవుతాడు?

‘…at the heart of the aesthetic imperative we discern the moral imperative.'(Sartre)

“హోమ్” కథను సమభావం సహానుభూతి దయ ప్రేమ నిండి ఉన్నాయి.

(చెఖోవ్ కథ పరామర్శ ఇంతటితో ముగిసింది.)

 About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.3 Comments


 1. Sai Brahmanandam Gorti

  గారూ: మీరు చెఖావ్ కథ మీద రాసిన వ్యాఖ్యానం చదివాను. బావుంది.

  అదే కథ మీద నాకనిపించిన రెండు మాటలు:

  చెఖావ్ రాసిన మూల కథ పేరు “దోమా” ( మన తెలుగులో దోమ కాదు – Russian భాషలో “Doma” ). దోమా అంటే “ఇంటి దగ్గర”, “ఇంటి వద్ద”, “ఇంట్లో” ఇలా నానార్థాలు వున్నాయి. అది కాస్తా ఇంగ్లీషు అనువాదంలో “Home” గా మారింది. ఆ పేరుతోనే చాలామంది అనువదించారు. మనకి కూడా ఇంగ్లీషు అనువాదమే మూలం. దాని ద్వారానే మన వ్యాఖ్యానాలూ, విశ్లేషణలూ. అందులో తప్పు లేదు. అసలు అర్థానికి “దోమా” అంటే “At Home అని కథ పేరు ఉండాలి. అమెరికన్ అనువాదకులు “at” అనే proposition తీసేసారు.

  బయట ఎన్నో లాజిక్కులూ, పద్ధతులతో కేసులో గెలిచే ప్రాసిక్యూటర్ తీరా తన పిల్లాడి వద్దకొచ్చేసరికి అవేమీ పనికి రావని గ్రహించాడు. పిల్లవాడు సిగరెట్ కాల్చడం తప్పని వాడికి చెప్పాలి. కానీ ఆ పిల్లవాడికి అది అర్థం చేసుకునే వయసూ, బుద్ధీ లేవు. ఇంకా వాడు ప్రతీ పిల్లాడికీ “ఇంట్లో” లభించే తల్లి ప్రేమ వాడికి లేదు. తల్లి ఉంటే లాలిస్తూనో, భయపెడుతూనే వాడికర్థమయ్యే రీతిలో చెప్పుండేది. ఆ అవకాశం లేదు. ఈ విషయం ఆ పిల్లాడితో మాట్లాడుతుంటేనే గ్రహించాడు. ఎంత లాజికల్‌గా చెబుతున్నా పిల్లాడికి ఎక్కడం లేదు. ఎలా? అందుకని ప్రాసిక్యూటర్ వాడికర్థమయ్యే పద్ధతిలో అంటే ఒక చిన్న కథా రూపంలో, అది ఎంత అసంబద్ధమైనదైనా, చెప్పడం మొదలు పెట్టాడు.
  అది ఆ పిల్లాడికి ఎక్కింది. సిగరెట్ తాగనని ప్రమాణం చేసాడు. పనయ్యింది. కానీ ప్రాసిక్యూటర్ ఆలోచనలో పడ్డాడు. అన్నీ తర్కంతోనూ, వాదనలతోనూ చక్కబెట్టలేం. ఎవరి స్థాయికి తగ్గటు వారికి అందించాలి, అది ఎంత హేతుబద్ధమైనది కాకపోయినా.

  ఇదీ నాకు కథ చదివిన తరువాత అనిపించింది.

  ఈ కథలో తండ్రి ఆలోచనలకీ, తల్లి అనునయించటానికీ మధ్య ఉన్న సన్నటి గీత చూపిస్తాడు చెఖావ్. మన ఇళ్ళలో కూడా చిన్నప్పుడు “అబద్ధాలు చెబితే దొంగాడెత్తుకు పోతాడు” అనమూ? అలా చెప్పడంలో వారికర్థమయ్యే భాషలో భయం పుట్టించడం. కొంచెం వయసొచ్చాక దొంగ లేడు, ఎత్తుకు పోవడమూ ఉండదని అర్థమవుతుంది. ఒక్కోసారి ఆ పిల్లలే దొంగలుగా కూడా మారచ్చు. అది వేరే విషయం. ఈ కథలో తల్లి లేని ఇల్లు ఎలా వుంటుందో అన్న ఎరిక తండ్రికి కలిగించేలా కథ చెప్పాడు చెఖావ్. ఎక్కడా సూక్తులూ, నినాదాలూ, హిత బోధలూ లేవు. అందుకే ఈ కథకి “దోమా” అన్న పేరు చక్కగా కుదిరింది. తెలుగులో, నేనయితే, “ఇంటి పట్టున” అన్న పేరుతో అనువదించేవాణ్ణి.


 2. వాడ్రేవు చినవీరభద్రుడు

  పైకి చాలా స్థూలంగా కనిపించే కథకి చాలా లోతైన పరిశీలన.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Anton Chekhov – A life in letters.

(Chekhov అనే రష్యన్ పేరును ఎలా పలకాలో నాకు తెలీదు. గూగుల్ ఆ ప్రశ్నకు ఎన్నో జవాబులు ఇచ్చింద...
by Purnima
3