BLINDNESS – Jose Saramago

ఒక్కో పుస్తకం మిగిల్చే అనుభవం ఒక్కోలా ఉంటుంది. కొన్ని పుస్తకాలు మన చుట్టూ ఉన్న లోకానికి సుదూరంగా తీసుకెళ్తే మరి కొన్ని పుస్తకాలు ఏ ముసుగులూ  వేసుకో(లే)ని మనిషిని, అతడి అసహాయతనూ మనకి చూపిస్తాయి. కనీవినీ ఎరుగని లోకాల్లో విహరింపచేసేవి కొన్ని రచనలయితే, మనం  ఉన్న లోకంలోనే ఏదో ఒక లోపం సృష్టించి, ఆ ఒక్కటీ లోపించినందుకు మన లోకం ఎంత చిన్నాభిన్నం కాగలదో కళ్ళకి కట్టినట్టు చూపించిన రచన Jose Saramago – BLINDNESS.

కథ:

blindness“ఓ మనిషి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినందుకు ఆగుండగా, ఉన్నట్టుండి అప్పటికప్పుడు అతడి కళ్ళు  విపరీతమైన వెలుగు తప్పించి మరేమీ చూడలేకపోయి, అంధుడుగా మారిపోతాడు. దారీ పోయే దానయ్య ఎవరో పుణ్యం కట్టుకొని అతడిని  ఇంట్లో దిగబెడతాడు. ఆఫీసు నుండి ఇంటికి తిరిగొచ్చిన అతడి భార్య, భర్త పరిస్థితి చూసి గాబరా పడి డాక్టరు దగ్గరకి తీసుకెళ్తుంది. డాక్టరు పరీక్ష చేసి “ఉన్నపళాన కంటి ముందు విపరీతమైన వెలుగు తప్పించి మరేమీ కనిపించకపోవటం” అనే కేసు ఏమిటో తేల్చుకోలేక ఏవో మందులిచ్చి ఇంటికి పంపిస్తాడు. తెల్లారే సరికి, ఇతడి భార్యకి, డాక్టర్ కి, డాక్టర్ తర్వాత పరీక్షించిన రోగులకీ, ఆ రోగులు ఎవరితో అయితే కలిసి తిరిగారో వారందరికీ అదే  అంధత్వం సోకుతుంది. అలా ఒకరి నుండి ఒకరికి త్వరిత గతిన ఈ జబ్బు వ్యాపిస్తుందని నిర్ధారించుకున్న ప్రభుత్వం అప్పటికే అంధులు అయిన వారిని ఊరి చివరనున్న పిచ్చాసుపత్రిలో బందీలను చేస్తుంది. కనీస అవసరాలు కూడా లేని ఆ చోట, తమ వారందరికీ దూరమై బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆ రోగులు, అలా ఎన్నాళ్ళు ఉంటారు?  ఆ తర్వాత ఏం జరిగింది? ప్రభుత్వం ఈ విపత్తును అరికట్టగలదా?  ప్రభుత్వ యంత్రాంగం ఈ విపత్తును ఎలా ఎదుర్కున్నారు?” అన్న నాలుగు వాక్యాలూ ఒకానొక రివ్యూలో  చదవగానే “చదివి తీరాల్సిన” జాబితాలో ఈ పుస్తకాన్ని వేసేసుకున్నాను.

పుస్తకం నా చేతికి చిక్కేంత ఊపిరి బిగబట్టి ఎదురుచూసాను. తీరా చేతి చిక్కాక, ఈ మధ్యకాలంలో బాక్ డ్రాపులు చదివిన ఆవేశంలో కొన్న పుస్తకాలు మిగిల్చిన నిరాశ గుర్తుకొచ్చి కాస్త కంగారు పుట్టినా, పుస్తకం మొదలెట్టింది మొదలు, అయిపోయే అంత వరకూ వదిలిపెట్టబుద్ధి కాలేదు. ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగే రచన ఇది. కథనం కూడా చాలా సరళంగా ఉంటుంది. కథ పూర్తిగా నేను చెప్పేసినా, ఈ పుస్తకం చదవటం మొదలెట్టాక ఆపటం జరుగదు. కథనం అంత బలంగా ఉంటుంది.

నా అనుభవాలు:

రచన పఠానుభవాన్ని ఒక ఉపమానంతో పోల్చి తీరాలి అనుకుంటే, ఈ పుస్తకం చదవటం ఓ దుస్స్వప్నం చూడడం లాంటిదే అని చెప్తాను. అసలేం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఏమీ తెలీదు. కానీ జరగాల్సింది జరగుతూ పోతూ ఉంటుంది, దానితో పాటు మనల్ని కూడా లాక్కుని పోతూ ఉంటుంది. ఉన్నట్టుండి మనిషికి ఏమీ కనిపించకపోవటమేమిటీ? పోనీ అంతా చిమ్మ చీకటిగా మారక, కళ్ళు భరించలేనంత తెలుపేంటీ? ఏ ఒక్క మనిషికో వస్తే ఊరుకొవచ్చు, అతడిని తాకిన ప్రతీ ఒక్కరికీ అంధత్వం సోకడం ఏమిటీ? లాంటి ప్రశ్నలు ఎన్ని మదిలో మెదులుతున్న కథనంతో ముందుకి వెళ్తూనే ఉంటాం.

కారుచిచ్చులా వ్యాపిస్తున్న ఈ అంధత్వాన్ని నివారించటానికి, ప్రభుత్వం అప్పటికే అందులైన వారందరినీ  మారు మూలనున్న ఒక ఖాళీ పిచ్చాసుపత్రిలో వేసేస్తారు. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేక, తిండికీ, నీటికీ కూడా రోగులు అలమటిస్తూ ఉంటారు. తమకి మరో మనిషి ద్వారా హాని కలిగే అవకాశాలున్నాయి అని గుర్తించగానే, సాటి మనిషని కూడా చూడకుండా మనిషి వ్యవహరించే తీరుని అమోఘంగా చిత్రీకరించారు. అంత మందిఅంధులలో ఒకరికి మాత్రం ఆ వ్యాధి సోకదు, కాకపోతే ఆ మనిషి కూడా వీళ్ళతో పాటే ఉండడటం వల్ల, అక్కడి పాట్లనూ, అగచాట్లనూ కళ్ళారా చూస్తూ ఉండడటం ఒకరకమైన నరకం.

ఇక నేను పీడకలతో ఎందుకు పోల్చాల్సి వచ్చిందంటే, మనిషి ఏ పరిస్థితుల్లో బతుకుతున్నాడు అన్న దానికే బట్టే అతడిలోని మనిషి బతికుంటాడు అనీ, అసలే పరిస్థితిల్లో ఉన్నా తన ప్రాధమిక అవసరాలైన ఆకలి, దప్పిక, కోరిక తీరితే కానీ మనిషిలా ప్రవర్తించలేడనీ  మరోసారి స్పష్టమైంది. ఈ రచనలోని కొన్ని  పాత్రల వైఖరి ఎంత నీచంగా, హేయంగా అనిపించిందంటే పుస్తకం మూసేసి, మళ్ళీ తెరవకూడదు అనిపించే అంతగా. అలాంటి సందర్భాల్లో కూడా ఈ రచనను చదవటం ఆపలేకపోయాను. మనిషిలోని చీకటి కోణాలను ఆవిష్కరించే చోట్ల చాలా కష్టపడ్డాను. మనిషిలోని మృగత్వాన్ని, అసహాయతనీ, ఆత్మాభిమానాన్నీ, ఆవేశాన్నీ, ఆకలినీ సంపూర్ణ స్థాయిలో అర్థం చేసుకోవడానికి నాకు ఈ రచన ఉపయోగపడింది.

వెనుక నుండి ఎవరో తరుముతున్నట్టు నడిచే కథనంతో, చూడరానివి చూడాల్సివచ్చే పరిస్థితుల్లో,  అరువు తెచ్చుకొన్న నరేటార్ కళ్ళతో  పూర్తి చిత్రాన్ని చూడలేక, భయమూ, జాలీ, అసహ్యమూ, వెగటు, విరక్తీ అన్నీ కలగలిపి కలుగుతూ ఉన్నట్టు అనిపించింది. పుస్తకం అయిపోయాక ఒక దుస్స్వప్నం నుండి మెలకువ వచ్చినంత ప్రయాసకలిగింది.

ఈ రచనలో నాకు ఆసక్తి కలిగించిన కొన్ని విషయాలు:
౧.  ఉండటానికి ఏడు పాత్రలున్నా, వారి మధ్య అనేకానేక సందర్భాల్లో సంభాషణలు జరుగుతున్నా ఈ రచనలో కామాలు,ఫుల్ స్టాపులు తప్పించి అన్యమైన punctuation marks చాలా అరుదు. (పుస్తకంలోని మొదటి చాప్టర్ ఇక్కడ) మొదలెట్టిన ఈ తరహా punctuation గమ్మత్తుగా అనిపించినా, కథనం వేగవంతం అయ్యే కొద్దీ, పాత్రల మధ్య సంభాషణలు హెచ్చే కొద్దీ తికమక మొదలయ్యింది నాకు. అలవాటు పడడానికి కాస్త సమయం పట్టింది. ఉరుకులు, పరుగుల్లా సాగే రచనా ప్రవాహంలో ఈ ప్రక్రియ నన్ను కాస్త గందరగోళానికి గురిచేసింది. (వీరి ఇతర రచనలూ ఇదే పంథాలో ఉంటాయని విన్నాను. ఈ శైలి పై వ్యాఖ్యానం ఏదైనా ఉంటే తెలుపగలరు. )
౨. ఇందులో పాత్రలను పేరు పెట్టి వ్యవహరించరు. “first blind man”, first blind man’s wife”, “doctor”, :doctor’s wife”, “boy with the squint”, “girl with the dark glasses, “old man with the patch” – ఇలానే ఉంటుంది నవల మొత్తం. ఇది కూడా నాకు భలే తమాషాగా అనిపించింది. అంతే కాక, ఇది ఏ దేశంలో  ఎప్పుడు జరిగినది అన్నది కూడా చెప్పరు. A story in an unnamed country, with unnamed characters.

తప్పక చదవాల్సిన పుస్తకాల్లో ఒకటీ అని ఖచ్చితంగా చెప్పగలను. నచ్చుతుందా, లేదా అన్నది వేరే విషయం. ప్రయత్నించాల్సిన పుస్తకాల్లో ఒకటి.

కొన్ని లంకెలు:
Blindness in wiki
Review: Blindness by Jose Saramago
Another Review

You Might Also Like

3 Comments

  1. పుస్తకం » Blog Archive » Seeing. – Saramago

    […] సరమగో పుస్తక పరిచయాలు: బ్లైండ్‍నెస్, డెత్ ఎట్ ఇంటర్వెల్స్. (No Ratings Yet)  Loading […]

  2. పుస్తకం » Blog Archive » మృత్యువుకు జీవం పోసి..

    […] నేను పరిచయం చేసిన Blindness నవలనే తీసుకుందాం. అందులో […]

  3. budugoy

    బాగుందండీ మీ రివ్యూ. మొన్నా మధ్య ఈ నవలని సినిమాగా తీశారు. మంచి కాస్టుకూడా ఉండింది. గేల్ గార్సీ బెర్నల్ (ప్రపంచ తెర పై ఇరవైల్లోనే అద్భుతాలు సృష్టిస్తున్న నటుడు) ఉన్నాడు కానీ..పుస్తకమంత గొప్పగా తీయలేదు. బహుశా అమెరికంకు అడాప్ట్ చేయడం వల్లేమో..

Leave a Reply