నా యెఱుక – ఆదిభట్ల నారాయణదాసు

చిన్నప్పుడు “హరి కథా పితామహుడు” ఆదిభట్ల నారాయణ దాసు అని చదువుకున్నాము స్కూల్లో. “నా యెఱుక” అన్న పుస్తకం ఒకటి ఉందని కూడా అప్పట్నుండీ తెలుసు గానీ, అసలా పుస్తకం ఏమిటి? అసలాయన గొప్పతనం ఏమిటి? అన్నది నాకు ఇప్పటిదాకా తెలియదు. ఈమధ్య ఈ పుస్తకం మా తమ్ముడి దగ్గర కనబడ్డంతో చదివాను. పుస్తకం గురించి ఓ నాలుగు వాక్యాలు:

పుస్తకం దాసు గారి స్వీయచరిత్ర. తెలుగులో మొదటి ఆత్మకథ అంటారు. ఆయన చిన్నతనం నుండీ హరికథలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించే వరకు జరిగిన ముఖ్య ఘట్టాలు ఆయన ఒక పత్రికలో సీరియల్ పద్ధతిలో రాసినట్లు ఉన్నారు. అలా రాసిన  ఏడువ్యాసాలు కాక,  ఆయన తన గురించి రాసుకున్న ఒక ద్విపద, ఆయన గురించి ఇతరులు రాసిన నాలుగైదు వ్యాసాలు అనుబంధంగా చేర్చారు ఈ పుస్తకం లో. వీటితో పాటు వివరంగా అవసరమైన చోట్ల ఫుట్నోట్లు జతచేశారు. ఈ పుస్తకానికి సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ.

విషయానికొస్తే: దాసు గారు తమ గురించి, తమ కుటుంబం గురించీ, తాను కలిసిన కొంతమంది మనుషుల గురించీ, హరికథ ల గురించి తనకు ఆసక్తి కలగడం, అందులో పేరు పొందడం గురించి అనుభవాలు రాశారు. అంతా ఒక క్రోనోలజీ లో ఉందని చెప్పలేము – అందుకే ఏ అధ్యాయానికి ఆ ఆధ్యాయం లా చదివాను నేను. దాసు గారు చిన్నతనం నుండి ఏకసంథాగ్రాహి గానూ, గొప్ప “gifted person” గానూ అనిపించారు వ్యాసాలు చదువుతూ ఉంటే. రాజులూ వాళ్ళూ చాలా మంది వద్ద చిన్న వయసులోనే గొప్ప పేరు ను పొందారు. మైసూరు దాకా పేరు ప్రతిష్టలు పాకాక గానీ వారి ప్రాంతపు రాజుల దర్శనం కలుగలేదంటే… ఆ కాలంలో కూడా పాలిటిక్స్ అంటే… ఆశ్చర్యంగానే అనిపించింది నాకు.

వీరేశలింగం గారిని పేరు చెప్పకుండా విచిత్ర వివాహ కర్త అని సంభోదిస్తూ రాయడం కొంచెం amusingగా ఉండింది. చాలామంది గురించి ఇలాగే రాశాడాయన – ఆ వైదికుడు, ఆ వైణికుడు – ఈ తరహాలో. కొన్ని విషయాల్లో దాసు గారి అభిప్రాయాలు (ముఖ్యంగా స్త్రీ విద్య) నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి కానీ, ఆ కాలానికి ఆ విధమైన ఆలోచనావిధానం మామూలే అనుకోవాలి, మొదట్లో సంపాదకుడు అన్నట్లు. అయితే ఏదో దానికి అటూ ఇటూ padding వేసి నైసుగా చెప్పకుండా నేరుగా, ఖచ్చితంగానే తమ అభిప్రాయాలు చెప్పారు – అది గొప్ప విషయమే. ఆయన రాసినవీ, ఆయన గురించి ఇతరులు రాసినవీ చదివాక ఆయన గాత్రం ఎలా ఉండేదో అన్న కుతూహలం కలిగింది కానీ, పుస్తకంలోనే అన్నట్లు – ప్రస్తుతం అలాంటి రికార్డింగులు ఉండకపోవచ్చట.

భాష చాలా క్లిష్టంగా ఉండింది. లైన్లకి లైన్లు సాగిపోయే వాక్యాలు… కనీ వినీ ఎరుగని పదాలు.. ఇలా అయోమయంగా ఉండింది కానీ పోను పోను కొంచెం సులువుగానే అర్థమైంది. నాకు ఆ పద్ధతి అలవాటైందో, ఆయనే నిజంగా క్రమంగా కొంచెం ఆధునిక వ్యావహారికం వైపుకి వచ్చారో గానీ నా అనుభవం అది. ఇది చదువుతూంటే నాకు విశ్వనాథ వారి భాష చాలా సులువుగా అర్థం అవుతుందనిపించింది (ఇది దాసు గారి మీద విమర్శ కాదు. పుస్తకంలోని భాష ఇప్పటి వాడుక భాషకి, నాకు వచ్చిన తెలుగుకీ దూరంగా ఉందని మాత్రమే చెబుతున్నా). పుస్తకం లో వివరంగా రాసిన ఫుట్ నోట్లు లేకపోతే నాకు ఏమాత్రం అర్థమయ్యేది కాదనుకుంటాను ఆ భాష. అందుకని రవికృష్ణ గారికి ధన్యవాదాలు. పుస్తకం సడెన్ గా ఆగిపోవడం కొంచెం నిరుత్సాహపర్చింది కానీ, ఉన్నదదీ. మనమేం చేస్తాం అని సరిపుచ్చుకున్నాను.

పుస్తకం మొదట్లో రవికృష్ణ గారి “మనవి మాటలు”, యూ.ఎ.నరసింహమూర్తి గారి వ్యాసం రెండూ గొప్పగా ఉన్నాయి. పుస్తకం చదవడానికి చాలా ఉపకరించాయి. కానీ, ఇవి కాక ఒక చిన్న బయోగ్రఫీ లాంటి వ్యాసం కూడా ఉంటే బాగుండేది పుస్తకానికి – నా బోటి “ఫస్ట్ టైమర్ల”కి కొంచెం పనికి వచ్చేది దాసు గారి గురించి మొదట కొంచెం తెలుసుకోడానికి. పుస్తకం చివర్లో ఉన్న ఇతరులు రాసిన అనుబంధ వ్యాసాలు దాసు గారు తమ రచనలో చెప్పని కోణాలు కొన్ని చూపాయి. మొత్తానికి చక్కగా కూర్చారు పుస్తకాన్ని.

మొత్తానికైతే చాలా కొత్తగా ఉండింది ఈ పుస్తకంలో వర్ణించిన కాలం నాటి జీవితాన్ని గురించి చదవడం. మొదటిసారి శ్రీపాద వారి ఆత్మకథ చదివినప్పుడు చాలా కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది ఆ జీవన విధానం అదీ చదువుతూ ఉంటే.  ఈ పుస్తకం అంతకంటే ఆశ్చర్యంగా అనిపించింది. కానైతే, శ్రీపాద వారి శైలి వేరు, ఈ పుస్తకం ఆ పరంగా నాకు మళ్ళీ మళ్ళీ చదవాలి అన్న భావన కలుగజేయలేదు – ఎందుకో గానీ ఈ పుస్తకం అవ్వగానే మరోసారి శ్రీపాద వారి అక్షర దర్శనం చేసుకోవాలి అనిపించింది. కానీ విలువైన పుస్తకం.

పుస్తకం కినిగె.కాం లో కొనుగోలు కు లభ్యం. ప్రివ్యూ లో రవికృష్ణ గారి “మనవి మాటలు” వ్యాసం పూర్తిగా చదవొచ్చు, ఆసక్తి గల వారు.

పుస్తకం గురించి వాకిలి పత్రికలో రాజశేఖర్ పిడూరి గారి వ్యాసం, ఆంధ్రభూమి లో వచ్చిన వీక్యూబ్ రమణ గారి వ్యాసం అంతర్జాలంలో నాకు కనబడ్డ వ్యాసాలు.

You Might Also Like

Leave a Reply