పుస్తకం
All about booksUncategorized

June 12, 2017

రొటీన్ కి భిన్నమైన డిటెక్టివ్ -‘డిటెక్టివ్’ సార్జంట్ మాల్కం ఐన్స్లీ

More articles by »
Written by: అతిథి

వ్యాసకర్త: సాయి పీ. వీ. యస్.         

*****************

పుస్తకం నెట్ 19380 పేజీలో సౌమ్యగారు డిటెక్టివ్ నవలల గురించి  రాస్తూ అడిగిన ప్రశ్న పరంపర: డిటెక్టివులు, సీక్రెట్ ఏజెంట్లు, వగైరాలు ప్రధాన పాత్రలుగా గల నవలల్లో ఎంతసేపూ వారి గురించి, వారు పరిశొధించే కేసుల గురించి,  వారి వింత వింత అలవాట్ల గురించి, వారి  idiosyncrasy ల గురించి హోరెత్తించటం కాక ఈ ప్రధాన పాత్రల స్వంత/వ్యక్తి గత జీవితాల గురించి; వారి వృత్తి లేదా వారు పరిశోధిస్తున్న ఏదైనా ఒక  కేసు వలన వారి వ్యక్తి గత లేదా వారి భార్యల, పిల్లల లేదా సంపూర్ణ కుటుంబ జీవితానికి అడ్దంకులో లేదా మరేదైనా అగచాట్లో వచ్చినట్టుగా చిత్రీకరించిన నవలలు ఏమైనా ఏ భాషలో నైనా సరే…. ఉన్నాయా అని .  

ఇంకొంత  వివరంగా, మరింత సోదాహరణంగా  చెప్పాలంటే…..!   ఓ న్యాయమూర్తి (జడ్జి)గారి తీర్పుల వలన ఆయన కుటుంబం పడ్డ ఇబ్బందులు, original తమిళ “తంగపతకం” సినిమా లోను,  దాని తెలుగు కాపీ జస్టీస్ చౌదరి లోను తాకబడ్డాయి.  మరో న్యాయమూర్తి తన మరదలి తప్పుడు అలోచనల (misconceptions)  వలన ఆయన తన పదవినే వదులుకో వలసిన పరిస్థితి ఎదుర్కోనటమే కాక తనే ఒక ముద్దాయిగా బోనెక్క వలసి వచ్చిన సంకట స్టితిని RK ధర్మరాజ్ ఓ చక్కని కథగా  రాస్తే “అక్కాచెల్లెలు”  అనే ఓ మంచి సినిమాగా చూశాము.  “నేనూ మనిషినే” అనే మరో సినిమాలో కూడా న్యాయమూర్తి “ఏది ఇలలోన అసలైన న్యాయం”, అంటూ ఏ మహాపాపం చేయటం వల్ల తానిలా న్యాయమూర్తిగా పుట్టవలసి వచ్చింది? అని వాపోతాడు.  గుమ్మడికి కలికితురాయి లాంటి పాత్ర.  సింగీతం దర్శకుడు.  

ఇటువంటి ఉదాహరణలు డిటెక్టివ్ సాహిత్యపరంగా  ఏమైనా మీ…మీ ఎరికలో ఉన్నాయా అని సౌమ్యగారు వాకబు చేస్తున్నారు అని అనుకుంటే!.

ఈ సందర్భంగా నాకు జ్ఞాపకం వస్తున్నది మాల్కం ఐన్స్లీ (Malcolm Ainslie).

మాల్కం ఐన్-స్లీ అంటే ఆర్థర్ హైలీ సృష్టి అన్నమాట. ఆర్థర్ హైలీ అంటే…? ఔను! ఆయనే! ఏర్ పోర్ట్, వీల్స్, ఫైనల్ డయాగ్నొసిస్, ఇన్ హై ప్లేసెస్ వగైరా పాపులర్ నవలా రచయిత. ఆయన ఆఖరి నవల Detective.  మాల్కం ఐన్స్-లీ Homicide Departmentలో డిటెక్టివ్ సార్జంట్.   ఇక్కడ సార్జంట్ అంతే తెలుగు వారికి బాగాపరిచయం ఐన ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు శిష్యుడు  శివం జ్ఞాపకం వస్తాడు.  కానీ ఇండియాది ఇంగ్లాండ్ పరిపాలనా విధానం కాబట్టి అక్కడ ఇంగ్లాండ్ లో  సార్జంట్ అంటే ఇనస్పెక్టర్ కి అసిస్టెంట్ లాంటి పదవి.   కాని అమెరికాలొ ఐతే సార్జెంట్ అంటే నలుగురైదుగు డిటెక్టివులమీద సూపర్వైజర్ లేదా సూపరింటెండెంట్ లాంటి పదవి.   అంటే ఘర్షణలో వెంకీ లాంటి పొస్ట్ అన్నమాట.  ఈ విషయాన్ని నవల ప్రారంభంలోనే రచయిత వివరిస్తాడు.

అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామిలో వరుసగా  దంపతుల హత్యలు జరగటం మొదలైంది.  ఒకటి కాదు రెండు కాదు వరుసగా  ఏడు జంటల హత్యలు జరిగాయి. ఎవరీ జాక్ ది రిప్పర్? హంతకుణ్ని పట్టి బంధించే పని మాల్కం అతని ముఠా (team) కి అప్పగించబడింది.  ఎప్పటిలాగానే మాల్కం తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి దోషి ఎల్రాయ్ దయాళ్ ని పట్టుకుని ఉరికంబానికి ఎక్కిస్తాడు.  మర్నాడే  ఆ మృగం  ఉరి.

ఆ తృప్తితో మాల్కం తన భార్య కరెన్ సతాయింపులకి ఇకనైనా ఫుల్ స్టాపు పెట్టాలనే ఉద్దేశ్యంతో,  ఆమె కోరినట్టుగా సెలవు సాంక్షన్ చేయించుకుని తను, తన భార్య,  పిల్లవాడు జాసన్, వాడి ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా వాడీ తాతగారు అనగా కరేన్ తండ్రి గారింటికి టోరంటో-కెనడా-కి వెళ్ళటానికి వీలుగా సమాయత్తం అవుతూ పది గంటలు దాటుతున్నా అతనింకా ఆఫీసులోనే ఉన్నాడు. జాసన్ పుట్టిన రోజునాడే వాడి తాతగారి 75వ పుట్టినరోజు కాకతాళీయంగా కలసిరావటం కరేన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.   అప్పుడు మోగింది ఫోన్. మీకోసమే అని అందించాడు అతని అసిస్టెంట్.  కరేనే అయ్యుంటుంది. సెలవు పెట్టావా? శాంక్షన్ అయ్యిందా? టొరంటో విమానానికి టిక్కెట్లు బుక్ చేశావా? వగైరా ఆరా తీయటానికి అని….. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఫోనెత్తాడు మాల్కం.

కాని కరేన్ నుంచి కాదా కబురు. అలాఅని మరో చల్లని చావు కబురూ కాదు. అంతకన్న నరకప్రాయమైన కబురు. అతనికి ఏం చెయ్యాలో, ఏ దారి పోవాలో తెలీనీక అతలాకుతలం చేసిన కబురు.  ఫ్లోరిడా రాష్ట్రపు జైలు అధికారి ఫాదర్ రే ఆక్స్ బ్రిడ్జ్,   రైఫోడ్ (Raeford) నుంచి  మర్నాడు ఉరికంబం ఎక్కే దోషి ఎల్రాయ్ దయాళ్ తరపున మాట్లాడటం మొదలుపెట్టాడు. ఉరితీతకి ముందు ఎల్రాయ్ confessకావటానికి నిర్ణయించుకున్నాడని, ఐతే ఆ confession కూడా ఒక్క మాల్కం ముందు మాత్రమే అవటానికి ఒప్పుకుంటున్నాడని, కాబట్టి చనిపోయే వ్యక్తి ఆఖరి కోరికగా దోషి దయాళ్  విజ్ఞప్తిని మన్నించటం కనీస ధర్మం అని నీతులకి లంకించుకున్నాడు ఫాదర్ రే!  ఆయన చెప్పేది తెలుసు కాబట్టి వినిపించుకోకుండానే ఫోన్ పెట్టేసాడు మాల్కం.

మియామి నుంచి రైఫోడ్ కి కనీసం  400 మైళ్ళ దూరం ఉంటుంది. ఇంత పొద్దు పోయాక ఏ రూట్ కి విమానాలు దొరకవు కాబట్టి మర్నాడు ఏడు గంటలకి దయాళ్ ని ఉరితీసేలోగా కలవాలంటే ఈ రాత్రంతా నిద్దరోకుండా డ్రైవింగ్ చేస్తూ కూచోవాలి.  అంతకన్నా ముఖ్యంగా ఈ పనికి పూనుకోవాలంటే కరేన్ ఆగ్రహ జ్వాలలలో మాడి మసై పోక తప్పదు. ఆ మధ్య తమ మారేజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసుకున్న నైట్ డిన్నర్ విషయం ఎప్పటి లాగానే ఏదో హత్య కేసులో ఇరుక్కుపోయి, ఇల్లుని,  పెళ్ళిని,   పెళ్ళాన్ని మరచిపోయి ఆరాత్రి ఒంటిగంటకి ఇంటికి వెళితే, కరేన్ అతని వైపు విసిరిన హేయమైన చూపు, ఇచ్చిన వార్నింగు అతను ఇప్పుడే కాదు ఈ జన్మ చాలించే వరకూ మరచి పోలేడు.  కరేన్ డిటెక్తివ్ గారి భార్య. ఆ డిటెక్టివ్ గారి  modus operandiనే ఆమె కూడా అనుసరించటంలో ఆమెకి ఆరు నెలలేం ఖర్మ ఆరేళ్ళ సావాసం ఉన్నది. అందుకనే “అమ్మ వినవే! తల్లి వినవే! బుద్ధి వచ్చె నాకు బుజ్జగించవే!” అని మాల్కం, ముందు పాట ఎత్తుకోటానికి, ఆ తర్వాత ఆమెని ఎత్తుకోటానికి అస్సలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాకిలి తలుపు పూర్తిగా తీయకుండానే ఫట్వా జారీ చేసింది. “చూడు మాల్కం!  నిన్ను అభిమానిస్తూ, నీ నీడనే నీకు తోడుగా బతుకుదామని మేము ఎంతగా ప్రయత్నిస్తున్నా నువ్వు మాకా అవకాశం ఏమాత్రం ఇవ్వటంలేదు. రోజులో  నువ్వు కనీసం 16 గంటలపాటు ఆఫీసులోనే ఉంటున్నావు. మిగిలిన కాలమైనా  ఇంటికి వస్తున్నావంటే, అది కూడా మా మీద ప్రేమతోనో కనీసం జాలితోనో కాదు.  ఆదమరచి నిద్ర పోవటానికి, కాలకృత్యాలు తీర్చుకోటానికి ఆఫీసు కన్నా ఇల్లు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వస్తున్నావు. నువ్వీ విధంగా నిన్ను మేము కనీసం కళ్ళారా చూసుకోటానికి, నోరారా మాట్లాడుకోటానికి వీలు కల్పించలేక పోతున్నప్పుడు ఇక మనం కలిసి ఉండి ప్రయోజనం ఏమిటి? అర్థమైందనుకుంటాను. నీ పధ్ధతి మార్చుకుంటావో లేక మాకు పూర్తిగా దూరంగా ఉంటావో?   Decide it yourself అని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ ఏడాది మారేజ్ డే ఆ విధంగా తెల్లవారింది.

(ఇప్పుడే ఇది టైప్ చేస్తున్నప్పుడు అందిన వార్త: ప్రముఖ క్రికెటీర్ వీరేంద్ర షేవాగ్ IPL మేనేజిమెంట్ గొడవల్లో పడి రెండు నెలలకు పైగా ఇంటికి, ఇల్లాలికి, పిల్లలకి దూరంగా ఉంటున్నందుకు శిక్షగా వారిని తీసుకుని హాలిడే ట్రిప్ గా ఐరొపా దేశాలకి వెళ్ళాడని, ఇందుకుగాను అతను తన గురువు టెండుల్కర్ సినిమా “సచిన్” విడుదలకి ముందే చూసే అపురూప అవకాశం కూడా “త్యాగం” చేయక తప్పలేదని.)

  ఆ పీడకల నుంచే ఇంకా పూర్తిగా కోలులోక ముందే మళ్ళీ ఇప్పుడీ ఉత్పాతం!  అలా అని O my GOD! What is the way out? అని తల పట్టుకు కూర్చోలేదు మాల్కం. తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిం చటానికే నిశ్చయించుకున్నాడు.

తన పై అధికారికి రింగ్ చేసి సెలవు కాన్సిల్ చేసుకుంటున్నానని, విషయమంతా వీలైనంత క్లుప్తంగా వివరించాడు. ఆయన మాత్రం ఏం చేయగలడు? సానుభూతి ఒలకబోయటం తప్ప. మర్నాడు దయాళ్ కన్ఫెక్షన్ రికార్డ్ చేసుకున్న వెంటనే రైఫోడ్ నుంచి ఎకాఎకిగా టోరోన్తోకి విమానంలో వెళ్ళిపోయి కరెన్ ని మచ్చిక చేసుకో అని ఓ ఉచిత సలహా పారేసాడు. “నా ఐడియా కూడా అదే” నంటు ఫోన్ పెట్టేసాడు మాల్కం.   తన అసిస్టెంట్లలో మెరికలాంటి కుర్రాడు, తన భక్తుడు ఐన  రోడ్రిడ్జ్ ని పిలిచి విషయం టూకీగా వివరించి ఈ సమయంలో నువ్వు నాకు అండగా ఉండాలి, అన్ని విధాలా అనువుగా ఉన్న కారు టాంక్ నిండా పేట్రోల్ నింపి సిద్ధం చేసి  అక్కడే ఉండు. మనకి అవసరం అయ్యే సరంజామా అంతా తీసుకుని నేను ఓ పావుగంటలో కలుస్తానని పంపించేశాడు.  క్యూబన్ కుర్రాడు రోడ్రిడ్జ్ Mad Max, Need for Speed సినిమాలలో లాగా కారుని మేఘాలలో పరిగెత్తిస్తుంటే అతని పక్క సీట్లో ఓ పక్కకి హాయిగా జారగిలబడి అప్పుడు నింపాదిగా తీరుబడిగా  కరేన్ కి కాల్ చేశాడు మాల్కం.   ఫోన్ ఎత్తీ ఎత్తగానే కరేన్, మాల్కం ని  అడిగిన ప్రశ్న “ఇంటికి ఎన్నింటికి వస్తున్నావ్? అని. ఏం చెప్పాడు? ఎలా చెప్పాడు? అందుకు కరేన్ ప్రతి స్పందన ఏమిటి? ఆ సందర్భాన్ని హైలీ ఎంత చాకచక్యంగా డీల్ చేశాడు అనేది ఎవరికి వారే చదువుకుంటే స్వారస్యంగా ఉంటుంది అని నా ఉద్దేశ్యం.

సరే! పడవలసిన తిప్పలన్నీ పడి మర్నాడు సరైన stipulated సమయానికే మాల్కం, ఎల్రాయ్ దయాళ్ ని కలుసుకున్నాడు. ఆరు జంటల హత్యలకే నా బాధ్యత. మరో జంట హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మొదలు పెట్టాడు దయాళ్. నేను హత్య చేసిన ప్రతి జంట దగ్గరా గుర్తుగా కొన్ని సంకేతాలు వదిలేవాడిని. సార్జెంట్ మాల్కం మీరు ఈ వృత్తి లోకి రాకముందు క్రైస్తవ మిషినరిగా దశాబ్దం పనిచేశారు కాబట్టి ఆ అనుభవం మీకు ఇక్కడ అక్కరకి వచ్చి ఆ సంకేతాల వెనుక ఉన్న నన్ను పట్టుకో గలిగారు.  కానీ మీ పరిజ్ఞానం పూర్తిగా సంపూర్ణం కాదు. ఆ సంకేతాలన్నీ బైబిల్ లోని Book of revelation కి సంబంధించినవి.

కానీ మియామి సిటీ మునిసిపల్ కమీషనర్, ఆయన భార్య హత్య జరిగిన తావులో సంకేతాలు ఉన్నా, వాటికి  Book of revelation కి ఏ సంబంధం లేదు అంటూ సోదాహరణంగా చెప్పటం మొదలు పెట్టాడు.  అంతా విన్నాక మాల్కం కి కలిగిన ఆలోచనలు ఇవి:  కేసు పూర్తైపొయిందని దోషిని ఉరికంబానికి ఎక్కించానని తాను మురుస్తున్నాడే కాని, అసలు కేసు ఇప్పుడే మొదలవుతోంది. మియామి కమీషనర్ ని, అతని భార్యని దయాళ్ హత్య చేయలేదు. ఎవరో కాపీకాట్ దయాళ్  modus operandi ని ఎంతో తెలివిగా అనుసరిస్తూ తనని తప్పు దోవ పట్టించాడు. తాను వెంటనే వెళ్లి, మళ్ళీ ఆ మూసేసిన ఫైల్ ని తెరచి మియామి కమీషనర్ జంట ఎందుకు హత్య కావింపబడింది పరిశోధించి  ఆ copy cat ని కుడా అరెస్ట్ చేయాలి. లేకపొతే “ఏమో మరెన్ని జంటల హత్యలు జరగనున్నాయో!!!

ఒళ్ళు గగుర్పొడవగా టోరంటోని, పిల్లవాడి బర్త్ డే పార్టీని, కరేన్ హెచ్చరికలని ఒక్క తల విదిలింపుతో వదుల్చుకుని దయాళ్ ఉరి జరిగే ప్రదేశానికి పరుగెత్తాడు మాల్కం. ఉరితీత సవ్యంగా కరగటానికి అంతా సిద్ధంగా ఉంది. దోషి ఉరితీత న్యాయబద్ధంగా జరిగిందని సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన 12మంది ప్రముఖులూ ముందువరుసలో ఆసీనులైనారు. ఎవరా వీరు అని పొలీసు డిపార్టుమెంట్ కి సహజమైన కౌతుకంతో ఆ 12 మందిని  తేరిపార చూసుకుంటూ వెళుతున్న మాల్కం వారిలో మియామి సిటీ కమీషనర్ సింథియాని కూడా చూసి ఆశ్చర్య పోయాడు.

సింధియా! కృష్ణ కన్యక. Black lady.  ఒక్కప్పటి తన జీవిత సర్వస్వం. మూసేశాను అనుకున్న కేసును మళ్ళీ అరంభించవలసి వచ్చిన ఈ స్థితిలో ఎప్పుడో ముగిసి పోయిందనుకున్న తన ప్రేమ పురాణం కూడా తిరిగి తెరిచే అవకాశమే వస్తే మాల్కం జీవన పరమపద సోపాన పటంలో సర్పద్రష్టుడు కాకుండా బయట పడగలడా? ఏ విధంగా? ఎంత చాకచక్యంగా?

చదవండి inimitable మాష్టర్ స్టోరీ టెల్లర్ ఆర్థర్ హైలీ ఆఖరి నవల డిటెక్టివ్. 1997లో బర్క్లీ బుక్ గా క్రౌన్  పబ్లిషర్స్ ప్రచురించారు.

నేను 1998 లో చదివాను.

హైలీ తల్లి మంచి చదువరి. ఆమె భర్త మాత్రం ఫాక్టరీ కార్మికుడు. తన కొడుకు భర్త లాగా ఏదో ఫాక్టరీ కార్మికుడు కాకుండా ఉండటానికి ఆమె హైలీ జీవితాన్ని ఎంతో పకడ్బందీగా బాల్యం నుంచే మలచ సాగింది. అతనికి పుస్తక పఠనం అలవాటు చేయటంతో పాటు టైపు రైటింగు, షార్ట్ హాండ్ నేర్పించింది. జీవిత ప్రథమాంకంలో రకరకాల ఉద్యోగాలకి ప్రయత్నించినా ఎట్టకేలకు తల్లి ఆశించినట్లుగానే హైలీ రచయితగా స్థిరపడ్డాడు. మూడేళ్ళకి గానీ ఒక నవలని విడుదల చేసేవాడు కాదు. తను రాయబోయే  నవలకి టాపిక్ నిర్ణయించుకున్నాక విషయ సేకరణకి ఒక సంవత్సరం అంతా  కేటాయించేవాడు.   విషయ సేకరణ సమయంలో తనకి కావాలసిన విషయ పరిజ్ఞానం గురించి అవతలి వారు ఎంత వేగంగా చెప్తుంటే అంతే వేగంగా నోట్సు రాసుకోటానికి తల్లి నేర్పించిన షార్ట్ హాండ్ అతనికి అప్పుడు,  ఆ సందర్భంలో  ఎంతో అక్కరకి వచ్చేది.  ఒక ఏడాది అంతా ఈవిధంగా సేకరించిన ముడిసరుకుని తరువాతి సంవత్సరంలో ముందుగా సాధ్యమైనన్ని ఎక్కువ విభాగాలుగా విభజించేవాడు. ఇలా అనేక విభాగాలుగా ఏర్పడ్డ ముడి వస్తువుని ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా తన పాఠకులకి అందించటానిక్ వీలుగా తగిన పాత్రలని, సంఘటనలని సృష్టించుకునేవాడు.

అతని మేధోతనమంతా ఇచ్చోటనే కుప్పగా కొలువైనది.  ఈ పద్ధతిన మూడవ సంవత్సరం ప్రారంభానికి రాయదలచుకున్న నవలకి synopsis version తయారయ్యేది. అప్పుడు మళ్ళా చిన్నప్పుడు నేర్చుకున్న టైపు రైటింగ్ సహాయంతో స్వతంత్రంగా పూర్తి నవలని టైపుచేసేవాడు. అలా మూడేళ్ళ శ్రమతో నాలుగో ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే ఆ నవల, అతను అతని కుటుంబం మరో నాలుగు తరాలు ఏ పనీ చేయకుండా నిశ్చింతగా జీవితం సాగించటానికి అవసరం అయ్యే ధన రాశులని తీసుకొచ్చి పడేసేది.  1959లో రాసిన మొదటి నవల ఫైనల్ డయాగ్నసిస్ నుంచి 1997లో విడుదలైన చివరి నవల డిటెక్టివ్ వరకూ ఇదే తంతు. ముఖ్యంగా మూడవ నవల హోటల్, ఆ తర్వాత వచ్చిన ఏర్ పోర్ట్ అతనిని ప్రపంచ ప్రఖ్యాతుణ్ని చేయటమే కాక,  వచ్చి పడుతున్న ధనాన్ని ఎక్కడ ఎలా దాచుకోవాలో తెలుసుకోలేనంత ఉక్కిరి బిక్కిరి చేశాయి. అతని ఇంకం టాక్స్ ఏజంట్లు “మీరు కొన్నాళ్ళు అమెరికాకి గుడ్ బై చెప్పి బహామా దీవులకి వెళ్ళటం మంచిదని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళు ఉండి వద్దాం అని వెళ్ళిన హైలీ,  ఇన్ కం టాక్స్ తలనొప్పులు లేని ఆ భూతల స్వర్గం విడవ లేక అక్కడనే జీవితాంతం ఉండిపోయాడు.

సౌమ్యగారితో పాటు ఇటువంటి పరిశీలనల  పట్ల ఆసక్తి గల పాఠకులు ఆ నవలని చదివి తమ తమ అమూల్యాభిప్రాయాలని నిర్మొహమాటంగా ఇవే పేజీలలో మనందరికీ  తెలియచేస్తారని ఆశిస్తూ ప్రస్తుతానికి సెలవు!  About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1