మైమరపు ప్రయాణాలు – భూభ్రమణ కాంక్ష

వ్యాసకర్త – కొల్లూరి సోమ శంకర్

ప్రయాణాలంటే కొత్త ప్రదేశాలని చూడడం, కొత్త వ్యక్తులని కలవడం, పరిచయస్తులని సన్నిహితులను చేసుకోవడం! మనకి అలవాటైన జీవనశైలికి కొన్నాళ్ళయినా భిన్నంగా ఉండి, కొత్తగా జీవించడానికి ప్రయత్నించడం! హృదయాన్ని విశాలం చేసుకోవడం!

కొత్త సంస్కృతిని, ఆయా దేశాల్లోని మనుషుల జీవన రీతుల్ని గమనించి, వారితో పాటు సమయం గడిపి వాళ్ళ సహజ స్వభావాలని పరిశీలించడం యాత్రికులకే లభించే గొప్ప అవకాశం. ఏ ప్రాంతానికి వెడితే ఆ ప్రాంతపు ఆచార వ్యవహారాల ప్రకారం నడుచుకోవడం ద్వారా స్థానికులతో మమేకమై వారి గురించి మరింతగా తెలుసుకోవచ్చు. పరాయివాళ్ళ గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, మన గురించి మనకి అంత బాగా తెలుస్తుంది. ఈ అంశాలనే వునరుద్ఘాటిస్తుంది – నిరంతర సంచారి, విశ్వయాత్రికుడు అయిన ప్రొ. మాచవరపు ఆదినారాయణ గారి తాజా రచన “భూభ్రమణ కాంక్ష”.

మనసుకి నచ్చిన ప్రదేశాలలోకి వెళ్ళి, అక్కడి ప్రజలతో కలిసిపోయి, వారి జీవనవిధానంలో పాల్గొనాలి” అనేదే ఆదినారాయణ గారి భ్రమణకాంక్షకి మూలం. ఈ ఒక్క వాక్యంతోనే ఆయన ఎందుకు తిరుగుతారో, అసలు ప్రయాణాలెందుకు చేయాలో స్పష్టంగా చెప్పేశారు. “యాత్రల్లో పరాయి మనుషులు సొంతవారిగా మారిపోతారు. దూరం దగ్గరవుతుంది. మన హృదయాలు మరింత విశాలంగా రూపుదిద్దుకుంటాయి” అంటారు. ఆయన ఉద్దేశంలో ‘ప్రయాణం అంటేనే ప్రేమ కోసం చేసే ఒక అన్వేషణ’. ‘ప్రపంచాన్ని కళ్ళతో చూసి ఆనందిస్తే చాలదు, పంచేంద్రియాలకు అనుభవాన్ని పంచాలి, సర్వాంగాలకు సమానమైన వ్యాయామం కల్పించాలి’ అంటారు. అనడమే కాదు చేసి చూపించారు.

ఆరు ఖండాలలో పద్నాలుగు దేశాలలో యాత్ర చేసి, ప్రకృతిని, పరిసరాలను ఆస్వాదిస్తూ, స్థానికులతో మమేకమై, వారి జీవన విధానాన్ని అవగాహన చేసుకున్నారు. కవులను, కళాకారులను, చిత్రకారులను కలిసారు. వారితో పాటు తన చిత్రకళనూ ప్రదర్శించారు. పాశ్చాత్య దేశాలలో ఉంటున్న భారతీయుల/ఆసియా దేశాల వారి స్థితిగతులను అర్థం చేసుకున్నారు. “భూభ్రమణ కాంక్ష” అనే ఈ పుస్తకం ద్వారా ఆయా అనుభూతులు అంతే అందంగా పాఠకులకూ పంచారు.

ప్రకృతి పారవశ్యం:

నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వత గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ, మార్గమధ్యంలో తటస్థపడిన “ఖుదీ” అనే పర్వత గ్రామన్ని దాటుతున్నప్పుడు గోచరించిన ప్రకృతి శోభను అద్భుతంగా వర్ణించారు రచయిత. “దూరంగా ఉన్న పర్వతాల చాటున పైకి లేచిన ఒక మంచు శిఖరానికి సూర్యకిరణాలు అల్లుకుపోయాయి.”; “ఆకులన్నీ రాల్చేసుకున్న ఎర్రని పూలచెట్లు కొండంత ధీమాగా నిలబడ్డాయి.” లాంటి వాక్యాలు పాఠకులనూ మానసికంగా ఆ పర్వత ప్రాంతాలలో తిప్పుతాయి. “ఇలాంటి పరిసరాల్లో నడుస్తూ ఉంటే పచ్చని పైరచేల మీదుగా పరుగులు తీస్తున్న పిట్టంత తేలికైంది నా మనస్సు” అంటారు రచయిత. భూటాన్ దేశంలో తింపూ వైపు ప్రయాణం కొనసాగిస్తూ ఆ మార్గం గురించి -“కొండల పైకి వెళ్ళే కొద్దీ చీకటి ముసురుకొస్తూ ఉంది. చలి పెరిగింది. చీకటి ఎక్కువయ్యే కొద్దీ దాని ప్రయాణ భయం పోగొట్టుకోడానికి, చుక్కల్ని తోడుగా తెచ్చుకొంటూ ఉంది. కొండల మీద ఇళ్ళల్లో లైట్లు మెరిసిపోతున్నాయి. నింగిలోని చుక్కలు కిందకి దిగి, కొండలమీదకి పరుచుకు పోతున్నట్లుగా ఉంది” అంటారు. ఇరాన్‍లోని ఓ ఎడారి గ్రామంలో బస చేసినప్పుడు ఓ రోజు వేకువ జామునే మెలకువ వచ్చిందట ఆదినారాయణగారికి. “సగం కరిగిన చందమామ దానిమ్మ పూలకొమ్మల చాటున, దోరగా కాలిన రొట్టెముక్కలాగా ఊగి పోతున్నాడు” అంటారు చంద్రుడిని చూసి.

స్వీడన్‌లోని బోడోల్ స్టేషన్ పరిసరాలలో నడకసాగిస్తారు రచయిత. అక్కడ “పిట్టల గుంపులు పిలుస్తున్నాయి. నత్త గుల్లలు తమ ఇంటిని మోసుకుంటూ రోడ్డుకి అడ్డంగా నిదానంగా నడుస్తున్నాయి” అని చెబుతారు. చైనాలో తియోఫోసి గ్రామ పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు ఒకతోటలో చంద్రుడిని చూస్తూ… “ఎదురుగా ఆకాశంలో సగానికి చిక్కిపోయిన చందమామ, నక్షత్రాల నది మీద పడవలాగా మెల్లగా కదిలిపోతున్నాడు” అంటారు. ఆ గ్రామం పరిసరాల్లోని ఓ లోయలో తిరిగారు రచయిత. యాపిల్ చెట్లు విపరీతంగా ఉన్నాయట అక్కడ. “యాపిల్ చెట్ల కొమ్మలు మెల్లగా పూల టోపీల్ని పెట్టుకుంటున్నాయి” అంటారు వాటిని వర్ణిస్తూ. భావుకుడూ, యాత్రికుడు కలగలిస్తేనే ఇంత అందమైన వాక్యాలొస్తాయి కదూ!

నార్వేలోని ఓస్లో నగరంలో ఎంత సేపు తిరిగినా చెట్ల నీడ, తల్లి ప్రేమలా మనల్ని వదలదని అంటారు రచయిత. ఫ్రాన్సు దేశంలోని పాత్‌దేవో పర్వత శిఖరాన్ని ఓ స్థానిక టీచరుతో కలసి అధిరోహించి అక్కడి సౌందర్యానికి పులకరిస్తారు.

రియో డీ జనిరియోలో కార్కోవాదో కొండ పైన ఉన్న “క్రైస్ట్ ది రిడీమర్” శిల్పాన్ని సందర్శించడం ఓ గొప్ప అనుభూతి. చదువుతుంటే మనం కూడా కళ్ళారా చూసినట్టుంది.

మనుషులతో మమేకం:

నేపాలీ ప్రజలు నిత్యజీవితాన్ని కూడా సాహసమయం చేసుకుంటూ తనకెంతో స్ఫూర్తినిచ్చారని చెబుతారు రచయిత. భూటాన్‌లో ప్రజలు తలసరి ఆదాయం కన్నా తలసరి ఆనందానికే ప్రాధాన్యతనిస్తారని చెప్తారు. ఇరాన్‌లో నౌదుషాన్ గ్రామంలో సున్నీలు, షియాలు కలిసే ఉంటున్నారని చెబుతారు. పట్నాల్లో ఒకరినొకరు వ్యతిరేకించుకున్నా, పల్లెల్లో ఒకరి అవసరం మరొకరి ఉంటుంది కాబట్టి కలిసిపోక తప్పదని అంటారు. టెహరాన్‌లో రచయితకి ఆతిథ్యం ఇచ్చిన అక్బారీసాబ్ గొప్ప వ్యక్తి. ఇరాన్‍లో ఉన్నన్ని రోజూలు రచయిత ఎక్కడ, ఎవరింట్లో ఉన్నా ప్రతీరోజు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కున్నారట. స్వీడన్‌లో హోత ఇంట్లో ఓ రాత్రి డిన్నర్‌లో రచయిత టమాటా పులుసు చేస్తే ఆ కుటుంబం వారందరికి అదెంతో నచ్చిందట, వాళ్ళ దేశంలో ఓ స్త్రీని వివాహమాడేందుకు రచయితకి అర్హత లభించిందని హాస్యమాడుతారు.

స్వీడన్‌లోని గోట్‌లాండ్‌లోని ఫెరూలిన్ అనే చిన్నదీవిలో రచయితకి ఆతిధ్యం ఇచ్చిన లూసియన్ అనే ఆయనకి ఓ గెస్టు హౌజ్ లాంటిది ఉంటుంది. జూలై – ఆగస్టు నెలలలో వచ్చే పర్యాటకులకు దాన్ని అద్దెకిచ్చి కొంత ఆదాయం సంపాదిస్తాడాయన. రచయితకి ఆ ప్రాంతం చూపించడానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడంతా బాగా గడ్డి మొలిచి ఉంటుంది. “పనివారిని పెట్టుకుంటే రోజుకి వంద యూరోలు ఇవ్వాలి కాబట్టి పనంతా మేమే చేసుకుంటాం” అని ఆయన రచయితతో అంటాడు. ఆదినారాయణగారు హోతతో కలసి లాన్ మూవర్‌తో గడ్డంతా కత్తిరిస్తూ కబుర్లు చెప్పుకుంటారు. అలాగే లవ్ అనే మరో గ్రామంలో తనకి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబంతో కలసి కూరగాయల తోటంతా శుభ్రం చేసారు రచయిత. లూసియన్ చెక్కబల్ల మీద నుండి పడిపోవడంతో ఆయనకి కూడా ఆ పూట టీ చేసిచ్చారు.

చైనాలో గ్రేట్‌వాల్‌ని చూడడం కన్నా దాన్ని నిర్మించిన గ్రేట్ పీపుల్‌ని చూడడం ముఖ్యమనుకుంటారు రచయిత. చైనాలో ఓ మొనాస్టరీలో గ్రాండ్ మాంక్‌ని కలుస్తారు. “మెదడులో పెరిగే దురాశ, ద్వేషం, భ్రాంతి అనే కలుపుమొక్కలని నాశనం చేసి వాటి స్థానంలో ఔదార్యం, ప్రేమ, జ్ఞానం అనే మంచి మొక్కల్ని నాటుకోవాలని తెలుసుకోవడమే నిర్వాణం” అని వివరిస్తాడా బౌద్ధసన్యాసి.

నైజిరీయాలో లాగోస్‌లోని లెక్కి ఏరియాలో బస ఏర్పాటవుటుంది ఆదినారాయణగారికి. ఆ కాలనీలో ఉద్యోగాలు చేసే వాచ్‌‌మెన్‌లను పరిచయం చేసుకుని వారి జీవితాల గురించి తెలుసుకుని, పాఠకులకీ తెలియజేస్తారు. తాస్మానియా మ్యూజియంలో ఎబారిజినల్ సెక్షన్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడి “సౌండ్ అండ్ లైట్ షో” ద్వారా ఎబారిజినల్స్ చరిత్ర విన్నప్పుడు రచయితకి అంతులేని వేదన కలుగుతుంది. ఆ వేదననీ పాఠకులూ అనుభవిస్తారు.

స్లాట్‌లాండ్‌లో జిప్సీల కారవాన్ వద్ద ఓ పంజాబీ పెద్దాయనిని పరిచయం చేసుకున్నప్పుడు ఆయన రచయితతో – “అందర్నీ తనలాగా తిరగమని చెబుతుంది ఈ భూమి. ఆ మాటలు మీలాంటి కొందరికే వినిపిస్తున్నాయి” అని అంటాడు. లండన్ యాత్ర ముగించుకుని భారతదేశానికి బయల్దేరే సమయంలో రచయితకి ఆతిథ్యం ఇచ్చిన శ్రీ వాస్తవ్ ఒక హోత – భారతదేశంలో తన తండ్రికి అందజేయగలరా అంటూ ఒక చిన్న బాక్స్ ఇస్తారు ఆదినారాయణగారికి. అందులో మందులు ఉన్నాయట. రచయిత ఎటువంటి సంకోచమూ లేకుండా వాటిని తనతో పాటు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా అక్కడి స్థానికులతో ఒకడిలా కలిసిపోయి, తన హోతలకి ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా తన యాత్రలను ముగిస్తారు.

రచయిత చూసిన/చూపించిన కొన్ని దర్శనీయ స్థలాలు:

  • ఇరాక్‌లో “గులిస్థాన్” రచించిన కవి సౌదీ సమాధి, మహాకవి హఫీజ్ సమాధి.
  • స్వీడన్‌లో నోబెల్ మ్యూజియం, జిప్సీ సొసైటీ, “మై లైఫ్ యాజ్ ఎక్స్‌ప్లోరర్” అనే గ్రంథం వ్రాసిన స్వెన్ హెడిన్ సమాధి.
  • చైనాలో తియోఫోసి గ్రామ సమీపంలోని యవతోంగ్ గుహలు. లియాంగ్ షాన్ కొండ మీది “కియాంగ్‌లింగ్” సమాధి. జివాంగ్‌ము బౌద్ధాలయం, స్వాన్‌కింగ్ మందిరం.
  • నైజీరియా దేశంలో లాగోస్ నగరంలో సుప్రసిద్ధ గాయకుడు ఫెలాకూటీ స్మారక చిహ్నమైన న్యూ ఆఫ్రికా ష్రైన్. వాటర్ స్లమ్.
  • నార్వే రాజధాని ఓస్లోలో నోబుల్ పీస్ ప్రైజ్ సెంటర్.
  • రోమ్‌లో ట్రేజాన్స్ కాలమ్, సెయింట్ పీటర్స్ బాసిలికా, మార్కోపోలో నివాసం, శాన్ మైఖేల్ ఐలాండ్ (సమాధుల దీవి).
  • ఫ్రాన్సు దేశంలోని పాత్‌దేవో పర్వత శిఖరం.
  • మెక్సికో దేశంలోని అక్వాస్ కాలియంత్ నగరంలోని “నేషనల్ మ్యూజియం ఆఫ్ డెత్”
  • ఆస్ట్రేలియాలో తాస్మానియా మ్యూజియం
  • లండన్‌లో విక్టోరియా ఆల్బం మ్యూజియం. ఈ మ్యూజియంలోని “రోడ్ టు కృష్ణ” అన్న వర్ణచిత్రం చూడతగ్గది.
  • బ్రైజిల్‍లో రియో డీ జనిరియోలో కార్కోవాదో కొండ పైన ఉన్న “క్రైస్ట్ ది రిడీమర్” శిల్పం.

హాస్యపు చెణుకులు:

రచయిత ప్రకృతినీ, మనుషుల్నీ, ప్రాంతాల గురించి మాత్రమే చెప్పలేదు ఈ పుస్తకంలో. మనుషుల స్వభావాలని వివరించేడప్పుడు. అక్కడక్కడా హాస్యపు చెణుకులు విసురుతారు. నైజీరియాలోని లాగోస్‍లో ఓ వాచ్‌మెన్ తమ ఊర్లో దెయ్యాలు తిరుగుతుంటాయనీ, అవి పైకి ఎక్కకూడదని ఇళ్ళల్లో మెట్లు అడ్డదిడ్డంగా కట్టుకుంటారని చెబితే “మా దేశంలో దెయ్యాలు గాల్లో తేలిపోతూ వస్తాయి. మీ దేశం దెయ్యాలకి నడక అంటే ఇష్టం కాబోలు” అంటూ చమత్కరిస్తారు రచయిత.

మెక్సికోలో డౌన్‌స్ట్రీట్‍లో ఉండే క్రైమ్ రేట్ గురించి చెబుతూ “మనం ఒక మంచి కారు కొనుక్కుంటే మాఫియా వాళ్ళు ఇంటికి వచ్చి, ‘మనం కార్లు మార్చుకుందామా’ అంటూ ఎంతో మర్యాదగా మన చేతికి వాడి పాత కారు తాళాలు ఇచ్చి, మన కొత్త కారు తాళాలని తుపాకీ మొనతో తీసుకుని వెళ్ళేవాళ్ళు” అంటారు మైగూల్ అనే వ్యక్తి రచయితతో. హాస్యంగా అన్నా, ఆ మాటల వెనుక ఎంతో బాధ ఉంది.

ఇతర ఉపయుక్త సమాచారం:

అనుభూతులు పంచే విశేషాలతో పాటు ఆయా దేశాల గురించి ఉపయుక్తమైన సమాచారం అందించారు రచయిత.

  • ప్రపంచంలో సహజమైన నీటి వనరులు ఉన్న రెండో దేశం నేపాల్.
  • భూటాన్ దేశస్తులకు టింబర్ ముఖ్యమైన ఎగుమతి.
  • దక్షిణ భారతదేశమంత వైశాల్యం ఉన్న ఇరాన్‌లో జనాభా మాత్రం ఏడు కోట్లే.
  • 1954 నుంచి 1964 వరకు తొంభై దేశాలలో తిరిగిన ఒమిద్‍వార్ బ్రదర్స్ పేరిట ఓ గ్యాలరీ ఇరాక్‍లోని సాదాబాద్ మ్యూజియంలో ఉంది.
  • షియాలు గడ్డం పెంచుకోరు, సున్నీలు గడ్దాల ప్రేమికులు.
  • ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండడం వల్ల ఎండాకాలం అంతా వెలుగే ఉంటుంది స్వీడన్‍లో. బాల్టిక్ సముద్రంలోని ఇరవై ఐదువేల దీవులు కలిసినందువల్ల స్వీడన్ ద్వీపసముదాయం ఏర్పడింది.
  • స్టాక్‍హోం సమీపంలోని ఉప్‌సాలా అనే ఊర్లో జనాలది “హర్రీ అప్ స్లోలీ” పాలసీట!
  • లాగోస్ నగరంలో ప్రతీ నెలా ఆఖరి శనివారం అందరికీ సెలవు. ఆరోజూ ఇంట్లో ఉండి తమ పరిసరాలన్నీ పరిశుభ్రం చేసుకోవాలి.
  • ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా 1972వ సంవత్సరంలోనే గే, లెస్బియన్ హక్కుల్ని గౌరవించి చట్టాలు చేసిన దేశం నార్వే.
  • ఫ్రాన్స్ లోని టూలూజ్ నగరంలో ఇళ్ళపైన పెంకులన్నీ గులాబీ రంగులో ఉండడం వల్ల ఈ ఊరికి “పింక్ సిటీ” అనే పేరు వచ్చింది.
  • మెక్సికో దేశంలో హరితవిప్లవానికి మూల పురుషుడు మహారాష్ట్రకి చెందిన పాండురంగ సదాశివ ఖాన్ ఖోజే. ఈయన “మెక్సికో సిటీలో నేషనల్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్”లో బోటనీ ఫ్రొఫెసరుగా పనిచేశారు.
  • మెక్సికో జాతీయ జండాకి, భారత పతాకానికి సారూప్యత ఉంది. భారత జాతీయ పతాకంలో మూడు రంగులు అడ్డంగా ఉంటే, అవే రంగులు మెక్సికో పతాకంలో నిలువుగా ఉంటాయి.

ముగింపు:

ఎంత గొప్ప ప్రయాణమైనా ముగియవలసిందే. ఎంతో ఆకట్టుకునే పుస్తకానికీ ముగింపు ఉంటుంది. రచయిత పుస్తకంలో అక్కడక్కడా రాసిన కొన్ని వాక్యాలని ఒకచోట చేరిస్తే ఈ వ్యాసానికి అర్థవంతమైన ముగింపు వస్తుంది.

“ప్రపంచమంతా ఈనాడు ఒక చిన్నగ్రామంలాగా మారిపోయింది. నా సొంత గ్రామంలో, ఆ పరిసరాల్లో ఎంత సులభంగా నిర్భయంగా, ఆనందంగా తిరిగానో, అదే విధంగా ఈ గ్లోబల్ విలేజ్‌లోనూ తిరుగుదామన్న కోరికే నన్ను ఇక్కడి వరకూ తీసుకువచ్చింది” అంటారు రచయిత ఓస్లోలో రూజ్ అనే వ్యక్తితో. “మనం ధైర్యంగా ముందుకి పోతూ ఉంటే మనకి సహాయం చేసే వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు అని పూర్తి నమ్మకం కలిగింది నాకు” అంటారు. “ఇన్ని పరిచయాలు దొరకటం, అనుకున్న విధంగానే సజావుగా ప్రయాణాలన్నీ సాగిపోవటం, నన్ను గౌరవించే వారు దొరకటం ఇదంతా నిజమేనా అనిపించింది. దిమ్మరితనంలో ఎంత ఆనందం ఉంది!” అనుకుంటారు రచయిత.

ప్రపంచ యాత్రానుభవాలన్నీ ఒకే పుస్తకంలో పాఠకులకి అందించడం రచయితకి ఆనందం కలిగించింది. రచయితతో పాటు పాఠకులు కూడా ఈ యాత్రలో భాగమై, పుస్తకంలో లీనమై తన్మయులవడం ఖాయం.

“బాటసారి బుక్స్” ప్రచురించిన ఈ 385 పేజీల పుస్తకం వెల రూ. 250/-. నవోదయ బుక్స్, కాచీగుడ, హైదరాబాద్ వారి వద్ద, ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలలోను లభ్యం.  

[pullquote_left][/pullquote_left]

You Might Also Like

Leave a Reply