(సమకాలీన) ఆదివాసీ దృక్కోణంతో రాసిన సైఫై కథలు

ఒక ఆరేడు వారాల క్రితం మా యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న కాఫీ షాపుకి వెళ్ళి “లీజర్ కలెక్షన్” గది మీదుగా తిరిగి వస్తూండగా రోబో బొమ్మతో “Take us to your chief and other stories” అన్న టైటిల్ తో ఉన్న ఈ పుస్తకం కనబడ్డది. రచయిత పేరు Drew Hayden Taylor -అదే చూడ్డం తొలిసారి నాకు. సరే, ఆ బొమ్మ కి ఆ టైటిల్ ఏంటి అన్న కుతూహలం కొద్దీ అట్ట వెనుక వైపు చూస్తే క్రింది వర్ణన ఉంది:

ఎవర్రాశారో కానీ, ఆకట్టుకునేలా రాశారు. ఒక్క కథ…అన్నింటికంటే చిన్నగా ఉన్నది… చదివి, ఇదేదో బాగుందని అరువు తెచ్చుకున్నా. అప్పట్నుంచీ మా ఇంట్లో తరుచుగా ఒకళ్ళు చదివిన కథని ఇంకోళ్ళ చేత చదివించడం, చర్చించడం, నచ్చిన కథలని మళ్ళీ చదవడం – ఇలా సాగుతోంది. రచయిత రాసిన ఇతర పుస్తకాలు నా చదవాల్సిన పుస్తకాల జాబితాలో ఆల్రెడీ చేరిపోయాయి కూడా.అందువల్ల ఈ పుస్తకం గురించి ఇక కొంచెం వివరంగా రాసుకుందాం అని రాస్తున్నాను ఈ వ్యాసం.

ఆ అట్ట మీద రాసినట్లు – తొమ్మిది కథలున్నాయి పుస్తకంలో. అన్నీ ఫస్ట్ నేషన్స్ వారి (అమెరికన్ ఆదివాసీలని అమెరికన్ ఇండియన్స్ అని, నేటివ్ అమెరికన్స్ అనీ అన్నట్లు కెనడాలో ఫస్ట్ నేషన్స్ అంటారు) సమకాలీన జీవితాలకి ఏదో విధంగా సంబంధం ఉన్నకథలే. ఒక్క మూడు కథల గురించి మాత్రం పరిచయం చేసి ఆగుతాను.

మొట్టమొదటి కథ “A culturally inappropriate Armageddon”. 1991 నుండి 2019 దాకా సాగుతుంది. ఒక ఆదివాసీ జాతి వారికోసం వాళ్ళే ఏర్పరుచుకున్న ఒక రేడియో స్టేషన్ గురించిన వివరాలతో మొదలయిన కథ గ్రహాంతర వాసులు భూమ్మీదకి రావడం దాకా వస్తుంది. గ్రహాంతర వాసులు రావడం అన్నది బోలెడు కథల్లో సినిమాల్లో చూసిందే, కొత్తేమిటి? అంటే – వాళ్ళ రాకకి రేడియో స్టేషన్ కారణం కావడం. చాలా సేపు నాకు “వీళ్ళూ వీళ్ళ రేడియో గోల, పాటల సెలెక్షన్ గురించి చర్చ, ప్రోగ్రాముల గురించి ప్లాన్లు, అసలు కథేంటి, ఇదంతా ఎందుకు” అనిపిస్తూ ఉండింది. అందువల్ల చివరికి వచ్చేసరికి అదంతా ఎందుకు చెప్పారో అర్థమై “వావ్” అనిపించింది. చివర్లో గ్రహాంతర వాసులు వచ్చినపుడు కెనడాలో అంతా వెల్కం పార్టీలూ సంబరాలు ఏర్పాటు చేయడం చూసి ఓ పాత్ర “Those who cannot remember the past are condemned to repeat it” అంటుంది ఏదో పుస్తకం చదువుతూ. నాకు అయితే గొప్పగా అనిపించింది కొసమెరుపు (no spoilers here).

రెండో కథ: “I am.. Am I”. ఇందులో కొందరు శాస్త్రవేత్తలు “The Matrix Project” పేరుతో కృత్రిమ మేధను (Artificial Intelligence – AI) తయారు చేస్తూంటారు. ఒకానొక రోజు ఆ AI కంప్యూటర్ టర్మినల్ ద్వారా వీళ్ళతో సంభాషించడం మొదలుపెడుతుంది. అక్కడ్నుంచి ఇంక దానికి ఒక్కటే ప్రశ్నలు, అదీ ఇదీ తెలుసుకోవాలన్న కుతూహలం. సరే, దాని “మెదడు” కి మేతగా వీళ్ళూ రకరకాల సమాచారం దానికి ఇవ్వడం మొదలుపెడతారు. ఈ క్రమంలో అక్కడి ఆదివాసీల చరిత్ర చదువుతున్నప్పుడు దానికి emotions చేకూరుతాయి! డిప్రెషన్ వస్తుంది! ఆదివాసీలకి పట్టిన గతికి AI కన్నీళ్ళు పెడుతుంది – “వాళ్ళు అలా కావడానికి కారకులైన మీరు సృష్టించారు నన్ను.. I feel guilty” అంటుంది. చివరికి ఈ సంభాషణ ఎక్కడికి దారి తీసిందన్నది కథకు ముగింపు. నన్ను చాలా ఆకట్టుకుంది ఈ చర్చ అంతా. మరీ ఎక్కువ వర్ణనలూ అవీ లేకుండా పూర్తిగా కథ మీదే కథనం నడవడం వల్లనేమో – చాలా ఉత్కంఠతో చదివాను నేను కథని.

మూడో కథ – ఈ పుస్తకానికి శీర్షికనిచ్చిన కథ – “Take us to your chief”. హాస్యం పాలు మెండుగా ఉన్న కథ. ఇంకో గ్రహం నుండి వచ్చిన వారి “cultural exchange” ఆహ్వానానికి ప్రతిగా ఒక నేటివ్ తెగ నాయకుడు అక్కడే తమ తెగలో ఉంటూ పనీపాటా లేక తింటూ, తాగుతూ కాలక్షేపం చేసే ముగ్గుర్ని పంపిస్తాడు వదిలించుకోడానికన్నట్లు. అయితే, గ్రహాంతరవాసులకి వీళ్ళ పద్ధతి మరోలా అర్థమవుతుంది – దీని వల్ల పుట్టే హాస్యం ఈ కథ. పుస్తకం లో పూర్తిగా హాస్యరసంలో ఉన్న కథ ఇదే అనుకుంటాను.

ఇంకా ఆరుకథలు – “Lost in Space”, “Dreams of Doom”, “Mr Gizmo”, “Petropaths”, “Stars”, “Super Disappointed” ఉన్నాయి పుస్తకంలో. అంతరిక్షయానం, కాన్స్పిరసీ థియరీలు, సూపర్ హీరో కష్టాలు – ఇలా ఒక్కోటీ ఒక్కో విభిన్నమైన అంశం గురించి. నాకైతే అన్నీ నచ్చాయి. సైన్సు ఫిక్షన్ పరిధిలోనే రాస్తూ ఇన్ని రకాల ఎమోషన్స్ పాఠకులకు కలిగించడం అన్నది నాకు ఈ కథల్లో అన్నింటికంటే నచ్చిన అంశం. “I wanted to take traditional (a buzz word in the Native community) science-fiction characteristics and filter them through an Aboriginal consciousness. That is what you are holding in your hands.” అని రాసుకున్నాడు రచయిత ముందుమాటలో. ఇది ఈ పుస్తకానికి ఇంకెవ్వరూ రాయలేనంత క్లుప్తమైన, కరెక్టైన పరిచయం 🙂

నిజానికి ఈ పుస్తకం తెచ్చేటప్పటికి ఇంట్లో సైఫై హవా నడుస్తోంది. అప్పటికి రెండు నెలలుగా మొదట Ted Chiang, తరువాత ఆయన్ని గురించి మెచ్చుకుంటూ విమర్శించుకుంటూ Isaac Asimov కథలు, వ్యాసాలూ చదువుతున్నాము – ఇద్దర్నీ పోల్చుకుంటూ. ఈ నేపథ్యంలో, ఈ పుస్తకం కూడా చేరింది. కానీ Asimov వంటి దిగ్గజం, ఇటీవలి కాలం లో అరైవల్ సినిమాకి మూలకథ రాసిన Ted Chiang వంటి ప్రముఖుల కథల మధ్య మేము రోజు విడిచి రోజు ఒక్కటే మార్చి మార్చి చర్చించుకున్నది Drew Hayden Taylor రాసిన ఈ కథల సంపుటి గురించి, ఇందులోని కథల గురించి అంటే మా ఇంట్లో ఈ పుస్తకం ప్రభావం అర్థం చేసుకోవాలిక. నాకైతే పూనకంలో నేను కూడా దేశీ హృదయంతో సై ఫై రాసేయాలి అనిపించింది (నాకు చేతకాదు, నేను రాయను. ఖంగారు పడకండి!). మీకు సైఫై ఆసక్తి ఉంటే ఇది టిపికల్ సైఫై కి భిన్నంగా సాగుతుంది కనుక తప్పక చదవాలి. మీకు “మన సంస్కృతి, మన సంప్రదాయం” అన్న consciousness ఎక్కువ ఉన్న పక్షంలో వాటి మూలాలతోనే సమకాలీనంగా ఉండే కథలు ఎలా సృష్టించవచ్చో తెలుసుకోడానికి ఈ కథలు తప్పక చదవండి.

You Might Also Like

One Comment

  1. Chandra Naga Srinivasa Rao Desu

    కృత్రిమ మేధ,సైన్సు ఫిక్షన్ కు సంబంధించిన ఈ కథలు ఆకట్టుకునేలా తప్పక చదవాలి అనిపిస్తుంది

Leave a Reply