ఓల్గా – రాజకీయ కథలు

వ్యాసకర్త: Sujata Manipatruni
***********
ఓల్గా రాసిన మంచి రాజకీయ కథలు. ఈ పది కథలూ రాయడానికి మిగిలిన రచనల కన్నా ఎక్కువ కష్టపడడం గురించి ముందుమాట లో ప్రస్తావిస్తారు ఓల్గా. అందుకేనేమో ఇవి రచయిత్రి బలపరచిన మిగిలిన భావజాలాల పుస్తకాల కన్నా, కథల కన్నా ఎక్కువ నచ్చాయి. స్త్రీ అంటే ఒక భోగ వస్తువు. ఆమె శరీరం, అంగాంగాల గురించీ సాహిత్య ప్రపంచంలో పుంఖానుపుంఖాలూఅ వర్ణనలూ, సంపెంగ ముక్కూ, మెడ మీది గీతలూ, తుమ్మెద రెక్కల్లాంటి కురులూ, పొడవాటి జడ, సన్నని నడుమూ, దొండ పళ్ళలాంటి పెదవులూ, నిండైన స్తనాలూ – ఇలా ఏ అంగాన్నీ వొదిలిపెట్టకుండా సమాజం అత్భుతమైనదిగా పొగిడే సాహిత్యం విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పుడు, ఒక స్త్రీగా, స్త్రీ శరీరాంగాల గురించి, వాటి పట్ల సమాజపు దౌష్ట్యం గురించీ రాస్తే అవి రాజకీయంగా సరైన వాదనలు గానే నిలుస్తాయి. అవీ ఈ రాజకీయ కథలు. ఈ కథలు ఎనభైల్లో వివిధ పత్రికల్లో విడిగా ప్రచురించబడ్డాయి. కానీ పుస్తకంగా, ప్రచురణా కాలం 1993.

మొదట: జడ. రచనా కాలం తొంభయిలదే అయినా, జడ పట్ల కధానాయకి అనుభవాలు కాస్త డెబ్భయిల్లో! అమ్మాయికి పుట్టిన దగ్గర్నుంచీ జుత్తు పోషణే జీవితం, జుత్తే ఐడెంటిటీ, జుత్తే సర్వస్వం. దాంతో పేలూ, ఉక్క పోతా.. రెండు పూటలా ఓ గంట సేపు సమయం వృథా అయినా, “అమ్మా జుత్తు అన్ని పన్లకీ అడ్డొస్తుంది కత్తిరించుకుంటానే” అంటే గదమాయింపు! ఆఖర్న ఆ పిల్ల జుత్తే తన ప్రత్యేకత అనుకుంటుంది. పెళ్ళయ్యాక భర్త జుత్తుని పట్టించుకోపోతే కృంగిపోతుంది. ఆ పెద్ద జడ పోషించీ పోషించీ, వైధవ్యం కలిగాకా, తనకూ గుండు గీస్తారేమో అని భయపడిపోతుంది. ఆ గండం ఎలాగో గడిచినా, జుత్తుకీ, విధవరికానికీ లంకె! “కోరికలు కలగకూడదనిట క్రైస్తవ నన్ లు గుండు గీయించుకుంటా” – అని స్కూల్లో తెలుసుకున్న పిల్ల – ఇప్పుడు విధవయ్యాకా, జుత్తుకి నూనె రాయడాన్ని కూడా వదినలు గేలి చేస్తూంటే ఇంక జళ్ళోకి పూలు పెట్టుకోవడమే?!! అరవై ఏళ్ళకి జుత్తు జబ్బు చేసి రాలిపోతూంటే, పుట్టిన్నాటి నుండీ తన వ్యక్తిత్వంలో భాగమైపోయిన జడ, దాని మీద కన్న వారి దగ్గరి నుంచీ, కట్టుకున్న వారి వరకూ, విధవయ్యాకా, వొదినల నుంచీ, సమాజపు పోకడల దాకా.. ఎందరి అజమాయిషీ – వీట్ని నెమరు వేసుకుని నివ్వెరపోయే, సీత!

రెండు : కళ్ళు. ఆడపిల్ల ఇంటి దగ్గర తల వంచితే, మళ్ళీ ఇల్లుంచేరాకే తలెత్తాలి.. అనే ధోరణి. ఈ కథల్లో కధానాయికలందరూ చెంగు చెంగున ఉత్సాహంతో తుళ్ళే పసిపిల్లలు. వాళ్ళకి పుట్టిన దగ్గర్నుంచీ పట్టింపుల మోతే. ఆడపిల్లలు అరవకూడదు. కన్నెత్తి ప్రపంచాన్ని చూడకూడదు.. ఇలా అన్నిటికీ ఆంక్షలే. ఎందుకు అని ప్రశ్నిస్తే గద్దింపులతో అణిచేసే తల్లిదండ్రులు. కళ్ళ ముందు అన్యాయం జరిగినా, ఆ ఆల్చిపల్లాంటి కళ్ళు ఏవీ చూసినా స్పందించని పూసల్లాగా తయారవడం గురించి. ఎంత మానసిక అణచివేత!

మూడు : ముక్కు పుడక. సంపెంగ పూనాసిక లేని అమ్మాయి. ముక్కు పుటాలు పెద్దవి. చిన్నపుడు నాయనమ్మ బలవంతానికి బేసరి కోసం ముక్కు కుట్టించుకున్నా.. అది కాస్తా సెప్టిక్కయ్యి, ముక్కు మీద మచ్చా, కన్నమూ మిగిలిపోయి మొహాన అదే పెద్ద అందవిహీనతా సాక్ష్యం లా మిగిలిపోతుంది. ఆడపిల్ల పొట్టయినా, పొడుగున్నా, నల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా.. ఇలా పలు వంకలతో పెళ్ళి అనే ముఖ్య కార్యానికి నిరాకరణ కి గురయిపోవడన్ని చర్చిస్తారు, ఆఖర్న ఆ కన్నం పూడేలా చిన్న ఆపరేషన్ కూడా చేయించాకా, చిన్నప్పట్నించీ తన అస్థిత్వంలో భాగమైపోయిన ఆ ముక్కు మీది కన్నం గురించి ఆలోచిస్తుంది అమ్మాయి. చదువు విషయంలోనూ వివక్ష! అన్నకి ఓలా, తనకింకోలా చదువు చెప్పించడం. అద్దెకున్న వాళ్ళు ఇంటిముందు పెద్ద చెట్లు నాటరు, ఎందుకూ? అవి పెద్దయ్యాకా, ఇంటి యజమాని అనుభవిస్తాడు గానీ, తాము అముభవిస్తామా అని! అందుకే ఆడ పిల్లలకి మంచి చదువులు చెప్పించరు, ఎలాగూ మనింటి పిల్ల కాదు కదా. వెళ్ళిపోతుంది కదా అని! అలా వానా కాలపు చదువు ముగించి, చిన్న ఉద్యోగం చేసుకుంటున్న పిల్లకి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది. అబ్బాయి ఆ ముక్కుకి ముక్కుపుడక లేదు.. కుట్టించుకోమంటే? అసలామె ముక్కు మీద అతని అధికారం ఏమిటి? అని అనిపించదూ?

నాలుగు : “నోర్ముయ్”! చిన్నప్పుడు ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసే ఆ ‘నోర్ముయ్’! మెదడు నిండా పుట్టే ఎన్నో మాటలూ, ప్రశ్నలూ, వాటిని శబ్ద రూపంలో బయట పెట్టే నోరు. పసితనం నుండీ ఆడ పిల్ల ఎక్కువగా వినే పదం. ఆఖరికి మాటలు మెదడు ఉత్పత్తి చెయ్యడమే మానుకునేంతలా కండీషనింగ్! పెళ్ళయాక మొగుడు ఎందుకలా ముంగిలా ఉంటావని చెంపలు వాయిస్తే మళ్ళీ నోరు పెగిలి బయటికొస్తాయి మాటలు, కేవలం అతనికి నచ్చేంత ప్రియ సంభాషణ చేసేంత వరకే. కానీ అదే నోరు ఆలోచనల్ని మొదలెట్టి, ప్రశ్నిస్తే మాత్రం ఉరుములా మీదపడే పదం ఈ “నోర్ముయ్!”

అయిదు : వెన్నెముక. స్త్రీ తన బలా బలాల్ని బేరీజు వేసుకుంటూ, మెదడుపయోగించని, గంగిరెద్దు వ్యక్తిత్వాన్ని, ప్రశ్నించని, ఆలోచించని, కష్టించని దారుల్లోంచీ బయటికొచ్చి సన్నని నడుం కోసం తిండి మానుకుని బలహీనపడకుండా, శారీరక, మానసిక దృఢత్వం పెంచుకోమని చెప్పే కథ.

ఆరు : ‘రాతి గుండెలు’. పెరిగి వయసు తో పాటూ శరీరంలో వస్తున్న మార్పుల గురిచి అవగాహనే లేని చిన్న వయసునుండీ, మగాళ్ళ దృష్టిలో కామ వాంచలు కలిగించే స్తనాల, (గుండెల) వల్ల బాల్యం నుండే, టీచర్, మావయ్య, పక్కింటాయన, ఇలా అందరి ప్రవర్తన వల్లా – పెళ్ళయ్యాక భర్త వల్ల, తన దౌర్బల్యానికి కారణమయిన స్తనాల మీద విరక్తి ఆమెకు. పిల్లలు కలిగి వారికి ఆహారాన్నిచ్చే మధుర గర్వ క్షణాల వరకూ – స్త్రీల స్తనాల పాత్ర గురించి ఈ కథ. ఆఖర్న పిల్లలకు పాలివ్వాలన్నా ప్రైవసీ ఇవ్వక అబగా చూసే జనాల కారణాన, స్తన్యమే ఎండిపోయిన అమ్మ కథ. ఆఖరికి కేన్సర్ వచ్చి స్తనాల్ని తొలగించ్నేయాల్సి వస్తే, ప్రీ కౌన్సిలింగ్ లో డాక్టర్ తో – ‘వీటి పీడ వదిలితే ఆనందమే’ అని చెప్తూ – “నేను నా ఇద్దరు పిల్లలకీ పాలివ్వలేదు, అందుకేనా నాకు కేన్సర్ వచ్చింది ?” అంటూ గిల్టీ గా అడిగే అమ్మ “రాతి” స్తనాల వెనక ఓ హృదయం గురించి.

ఏడు: “అయోని”. అమ్మమ్మ రెక్కలలో దూరి కథలు వింటూ, చందమామ కథల్లో అపురూప బాల్యం అనుభవించే, తొమ్మిదేళ్ళకే చందమామకు కథ రాసిన బుల్లి రచయిత్రి. ఒకనాడు పిల్లలెత్తుకుపోయే రాక్షసుల బారిన పడి, మూడేళ్ళ పాటూ లైంగిక అత్యాచారాలకు గురయ్యి, బాల వ్యభిచారిణిగా చీకటి జీవితంలో మగ్గిపోతూ, పన్నెండేళ్ళకు, తాను చచ్చిపోయే ముందు రాసిన (రాయాలనుకున్న) కథ ఇది. ఎంత కరుణ లేదో. ఆ పసి దాన్ని.. తిండి పెట్టకుండా, ఆ శరీరాన్ని అమ్మి, వాళ్ళు తన యోనినే పదే పదే చీల్చేస్తూంటే, రక్తమడుగుల్లో అమ్మ కోసం వెతుక్కునే పిల్లకి అన్నం పెడితే, అది అన్నమో రక్తమో అర్థం కాదు. ఒకనాడు మాటల్లో సీత అయోనిజ అనే పాట వల్ల యోని అనే పదం తెలుసుకుని, మనమంతా యోనిజలమా. యోనిజ, అయోనిజ, అయోని అంటూ పదాల్ని చర్చించి, ఈ ‘పదం’ ఇప్పుడు తెలిసింది. “నేను అయోని ని అయితే బావుణ్ణు.. దీని వల్లే కదా నాకిన్ని కష్టాలు” అంటూ షాక్ కి గురి చేసే పాప కథ. ఈ కథ ఆడియో రచయిత్రి గొంతులోనే అందుబాటులో వుంది. ఎంత విషాదం? అది లేకపోతే ప్రపంచమే లేదు అంటే – “బాధ తోనే ప్రపంచం ఉందా? హింసతోనే ప్రపంచం ఉందా?” అనే ఆ చిన్న పిల్ల “అందరూ నన్ను ‘యోని’ గానే చూసారు (మనిషి లా కాదు) ఈ ఒక్క అవయవం లేకపోతే నా బ్రతుకు ఇలా ఉండేదికాదుకదా” అనుకోవడం! ఈ కథ చిన్నారి శ్వేతకు, రచనా కాలం నాటికి, హైదరాబాదులో లైంగిక వ్యాపారాలకు గురయ్యి, చనిపోయిన చిన్నారులకు, రక్తపు కన్నీటితో అంకితం చేశారు రచయిత్రి.

ఎనిమిది: ఒక రాజకీయ కథ. స్త్రీ ఎందుకు కావాలి సమాజానికి ? పిల్లల్ని కనడానికే. వంశాభివృద్ధికి. అంత కన్నా ఇంకో పాత్ర లేదు, తనకో మనసుండదు. ఫాక్టరీ కో ఆక్సిడెంట్ లో చేతివేళ్ళు కోల్పోయిన భర్తను ఆదుకోవడానికి యూనియన్ వాళ్ళొస్తారు. మానసికంగా కుంగిపోయిన మనిషిని తాను మనిషిని చేస్తుంది. ఉద్యోగం పోదు. బ్రతుక్కి అండగా సమాజం నిలుస్తుంది, కానీ గర్భధారణ జరిగాకా, ఆక్సిడెంటల్ గా అది విచ్ఛిన్నమై, తను తల్లిని చేయగలిగే అవయవాన్ని కోల్పోవాల్సి వచ్చినపుడు, భర్తా, అత్త మామలూ, కన్న వారూ, ఎవరూ అండగా నిలవరు, మానసిక ఆసరా అవసరమైన మనిషిని వొదిలి ఇంకో పెళ్ళి చేసుకునేందుకు భర్త సిద్ధ పడుతుంటే, తనకెందుకు సమాజం సాయపడదో అర్ధం కాదు ఆమెకు.

తొమ్మిది: కేసు. ఇది చాలా ఆసక్తి కలిగించే రాజకీయ కథ. మెటర్నరీ లీవులు, పిల్లలు అనగా రేపటి పౌరుల పంపకం, ఉద్యోగం చేసే ఆడ వాళ్ళ మాతృత్వపు హక్కులు, తండ్రికీ కావాల్సిన పెటర్నరీ హాలిడేస్. వీటి గురించి, పాలిచ్చి పెంచాల్సిన వయసు పిల్లల కోసం ఆఫీసు కు అనుబంధంగా క్రెచ్, ఫీడింగ్ టైం.. వగైరాల గురించి చర్చించిన కథ. ఇవన్నీ దాదాపూ మొత్తంగా (180 రోజులు) పిల్లల సంరక్షణ కీసం చైల్డ్ కేర్ లీవుల దాకా ఇప్పుడు అందుబాటు లోకొచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఈ హక్కుల కోసం పోరాడిన వనితలు ఎదుర్కొన్న వివక్షా, తిరస్కారం, కుటుంబం నుంచీ సహాయ నిరాకరణల గురించి ఈ కథ.

పది: ఆర్తి. పిల్లలకు విడాకుల అనంతరం తండ్రే చట్ట ప్రకారం సంరక్షకుడు. ఇప్పటికీ అదే న్యాయం. పెళ్ళాం మీద కక్ష కట్టి, పిల్లల్ని తనతో తీస్కెళ్ళిపోయి, తల్లికి గర్భ శోకం కలిగించే భర్త. పిల్లలకి అన్నం పెట్టాడో లేదో, చదివిస్తున్నాడో లేదో, వొంట్లో బాలేకపోతే ఎలా చూస్తాడో అని బెంగ పెట్టుకుని, ఆ రంపపు కోర భరించలేని తల్లి కి.. లాయర్ స్పష్టంగా చెప్పిన విషయం ఇది. “పొలం కౌలుకి తీసుకున్నమనుకో.. ఫలసాయం మీద హక్కు ఎలా అయితే యజమానిదో.. నీ పిల్లల మీద హక్కు కూడా తండ్రిదే, నువ్వు కేవలం క్షేత్రానివి. నీ స్థానం అదే! నువ్వు స్త్రీ వనీ, నీ బిడ్డలు నిన్ను చీల్చుకుని పుట్టారనీ, నీ స్తన్యం, నీ రక్త మాంసాలని తాగి పెరిగారనీ న్యాయం గుర్తించదు”- ‘అనీబిసెంటు కే తప్పలేదు ఈ మాతృశోకం’. అని చెప్తే:

“మేము తల్లులం కాదు – ఆవులం.
మేము చెల్లెళ్ళం కాదు – గేదెలం,
మేము ఇల్లాళ్ళం కాదు – పందులం.
మేం దేవతలం కాదు – పొలాలం.

మాకే హక్కూ లేదు. మా మీద కూడా మాకు హక్కు లేదు. మేం పెళ్ళాడాలన్న మా ఇష్టం కాదు, పెళ్ళిని కాదనాలన్నా మా ఇష్టం కాదు. అంతెందుకు మా మీద సర్వ హక్కులూ మీవే. మా రక్తం మీద, మా కోరికల మీద, మా ఆలోచనల మీద, మా మీద, అన్నిటి మీదా – మీకే హక్కు. మేం ఆడవాళ్ళం” అని బాధ పడే స్త్రీ చివరికి తన శక్తిని గుర్తు చేసుకుని,

“మా కీ మాతృత్వాన్ని ఏ ప్రకృతి ప్రసాదించిందో, ఆ హక్కును కూడా ఆ ప్రకృతే ఇచ్చింది. ఆ హక్కును కాల రాసిన ఏ శక్తి ఏదైనా, ఎంత రాక్షస బలంతో కూడినదైనా, దానితో నేను తలపడతాను.
మళ్ళీ రక్తం ధారపోసైనా నా హక్కును నేను పొందుతాను
నేను జయించి తీఎరుతాను. రాజీ ప్రశ్నే లేదు
ఈ పోరాటం చెయ్యనిదే నాకున్న సృష్టి శక్తికి అర్ధం లేదు. సార్థకత లేదు..”

అని ఆవేశంతో పాటూ ఎంతో ఆలోచన తో స్థిర నిర్ణయం తీసుకునే తల్లి కథ. తల్లి బిడ్డ “సంరక్షణా హక్కులు” పొందేందుకు చేసే పోరాటం గురించి.

ఈ కథలన్నీ మరీ చాదస్తపు రోజుల్నాటివనీ ఈ రోజలకి సంబంధించినవి కావనీ అనిపించొచ్చు, కానీ ఆ రోజులతో పోలిస్తే స్త్రీ అభ్యుదయం, చదువూ, ఉద్యోగాల వరకూ, కొద్దో గొప్పో ముందుకు కదిలినా, ఇంకా మార్పు రావాలి. ఆడపిల్లలు పురిటికి ముందే చావడం, పుట్టాకా అమ్మబడడం, పెంపకంలో వివక్షా అన్నీ మారాలి. మన సమాజంలో స్త్రీ కి న్యాయం, భద్రత, ఈ మాత్రమైనా సాధ్యమయ్యేలా చేసినవి మాత్రం మునుపటి తరాల పోరాటాలే, ప్రశ్నలే. ‘మొగ పిల్లలు ఏడవకూడదు, ఏడిపించకూడదూ’ అంటూ నేర్పే బదులూ, అమ్మాయిల్నీ, వాళ్ళ శరీరాంగాల్నీ కేవలం ఒక ఆస్థిలా చూసే స్వభావం మారి, వారినీ సమానంగా పెంచి, అవకాశాలిచ్చి, వారి బాధ్యతలని, కలల్నీ పంచుకుని, మనసున్న మనుషుల్లా చూడాలని చెప్పడమే ఫెమినిజం. ఈ కథల్లో బాడీ షాపింగ్ గురించి ప్రశ్నించడం, తూనీగల్లాంటి ఆడపిల్లల రెక్కల్ని కన్న వారే ఖండించడం, మానసిక, భౌతిక, లైంగిక దాడి, పిల్లల్ని అడ్డు పెట్టుకుని, భర్తల వేధింపులూ.. ఇలా రాజకీయాన్ని చక్కగా చర్చించారు. అందుకే ఇది ఓల్గా కథల్లో బెస్ట్. ఆవిడ కూడా వీటిని రాసి తానెంతో నేర్చుకున్నానూ అన్నప్పుడు, మనమూ ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకోవడానికీ, మనుషుల్ని మనుషుల్లా చూడ్డానికి, మానవత్వం తో నన్నా చదవాలీ కథలు.

You Might Also Like

One Comment

  1. Rajitha

    స్త్రీ కేవలం క్షేత్రం కాదని బీజము కూడా అని చెప్పకపోవటం బాధాకరంగా ఉంది.పిండోత్పత్తికి సూత్రదారుడు పురుషుడొక్కడే కాదు స్త్రీ కూడా..!స్త్రీ పురుష బీజ కణాల కలయికే పిండము కదా..!

Leave a Reply