ఆచార్య ఆత్రేయ

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు మరియు ఇందు కిరణ్ కొండూరు
(మే ఏడవ తేదీ ఆత్రేయ జయంతి సందర్భంగా)

*********
“ఆచార్య ఆత్రేయ”గా పేరుగాంచిన “శ్రీ కిళాంబి వెంకట నరసింహాచార్యులు” మనందరికీ “మనసు కవి”గా “మన సుకవి”గా సుపరిచితులే. ఈయన గురించి తెలియని తెలుగు వాడుండడు. ఈయన తెలుగు సినీ ప్రపంచానికి గణనీయమైన కృషి చేసారు. వీరు మహారాష్ట్రలో జరిగిన అనేక సాహితీ సభలలో కూడా మరాఠి భాషలో ప్రసంగించారు. వీరికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠిలలో ప్రావీణ్యం ఉంది. వీరు అనేక సినీ గేయ రచనలే కాక పలు నాటికలు, కథలు, నాటకాలు రచన చేసారు. తమ సాహిత్యం ద్వారా, భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని చరసాల పాలయ్యారు.

వీరు వ్రాసిన కొన్ని నాటకాల జాబితా ఒక్కాసారి పరిశీలనా చేద్దాము.

1. “గౌతమ బుద్ధ”, 1943లో రచన చేసారు, ఈ నాటకం యొక్క మూల రచన “బెర్నార్డ్ షా” వ్రాసిన “The black girl In search of God” అనే కథగా చెప్ప బడుతుంది.

2. “అశోక్ సామ్రాట్”, 1944లో రచన చేసారు, ఈ నాటకం యొక్క మూల రచన ఒక చారిత్రక గ్రంథంగా చెప్పబడుతుంది.

3. “పరివర్తన”, 1945లో రచన చేసారు, ఈ నాటకం “హంరాహి” అనే హిందీ చలన చిత్రం కూడా తీసారు. ఈ నాటకం “బళ్ళారి రాఘవకు” అంకితం ఇచ్చారు. ఈ నాటకం “కలిపుంగవ” పేరుతో అనువాదం చేసారు. ఈ నాటకం ద్వారా “ఆచార్య ఆత్రేయ” “ప్రజా నాట్య మండలికి పరిచయమయ్యారు”.

4. “వాస్తవం”, 1946లో రచన చేసారు, ఈ నాటకం పూర్తిస్థాయి రాజకీయ ఇతివృత్తంతో నడుస్తుంది. అప్పటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో ఈ నాటకం నడుస్తుంది.

5. “ఈనాడు”, 1947లో రచన చేసారు, బర్మా దేశంలోని రంగూన్ అనే ఉళ్ళో జరిగిన మత కల్లోలాలకు స్పందన ఫలితమే ఈ నాటకం. ఈ నాటకానికి ప్రేరణ “The Banfire” అనే ఒక ఆంగ్ల కథ. మత సామరస్యం కోసం ఆత్మ బలిదానం చేసిన “బాపూజీ”కి అంకితం చేశారు.

6. “NGO”, 1948లో రచన చేసారు, ఆర్థికంగా దిగివ మధ్య తరగతికి చెందిన ఒక కుటుంబము ఆ కుంటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణల నేపథ్యంలో వ్రాసిన నాటకం ఇది. ఈ నాటకం ఆత్రేయకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. ఈ నాటికను పలు భారతీయ భాషల్లో అనువాదం చేసారు. దీన్ని 1953లో ఒక తెలుగు చలన చిత్రంగా (గుమాస్తా) కూడా తీసారు. “లంచావతారం” అనే కన్నడ కథ దీని అనువాదమే. ఈ కథకు మొదట “అద్దెకొంప” అని పేరు పెట్టారు తరువాత దీన్ని “NGO” గా మార్చారుట.

7. “విశ్వశాంతి”, 1951లో రచన చేసారు, ఈ నాటకంలో ఆత్రేయ వినూత్న ప్రక్రియ చేశారు, ఇందులో పాత్రలు పాత్ర దారులు సంకేతాలలుగా ఉంటాయి. ఈ నాటకానికి శ్రీశ్రీ ముందు మాట వ్రాసారు. శ్రీశ్రీ ముందు మాటలో “నాటక రంగమనే వైద్యశాలలో జరుగుతున్నఒక చికిత్సా విధానమే ఈ విశ్వశాంతి ” అని అభివర్ణించారు. ఈ నాటకం లో ఇంకో ప్రత్యేకత ఉంది, శ్రీశ్రీ వ్రాసిన మహాప్రస్థానంలోని గేయాలు ఇందులో ఉపయోగించారు.

8. “కప్పలు”, 1953లో రచన చేసారు, ఇతః పూర్వము వ్రాసిన కథలకు నాటకాలకు విరుద్ధంగా, ఈ నాటకానికి ప్రత్యేకత ఏంటి అంటే, ఇది సునిశిత వ్యంగ్యంతో కూడిన హాస్యం నాటకం.

9. “భయం”, 1954లో రచన చేసారు, ఈ రచనకు అప్పటి సినీరంగ ప్రముఖుడు శ్రీ నాగ భూషణం సహకరించారుట. సగటు మనిషి జీవితంలో భయానికి అద్దం పట్టిన నాటకం. అనేక కళాపరిషత్ లలో బహుమతులు గెల్చుకుంది.

10. “మనసూ – వయసు”, 1968లో రచన చేశారు, ఈ రచనకు మరో పేరు “తిరుపతి”, ఈ రచన మూలాధారము “సిడ్నీ హోవర్డ్” వ్రాసిన “They knew what they wanted” అనే కథగా చెప్పవచ్చు. “మనసూ – వయసు” ఆత్రేయ వ్రాసిన చివరి కథ.

ఆచార్య ఆత్రేయ రచనలను వారి సాహిత్యాన్ని ఈ తరానికి అందించాలని, అలనాటి సినీరంగ ప్రముఖులు కీ.శే. కొంగర జగ్గయ్య గారు, కీ.శే. రామా నాయుడు గారు, కీ.శే. కె.యస్.ప్రకాశరావు గారు, కీ.శే. ఎం.ఎస్. రెడ్డి గారు, డా|| మోహన్ బాబు మొదలగు వారు నడుం బిగించి “మనస్విని” అనే పేరుతో ఒక దాతృత్వ సంస్థను (Public Charitable Trust) 1990లో స్థాపన చేసి మరుగున పడిపోయిన ఆచార్య ఆత్రేయ రచనలను ఎన్నో వెలికి తీసి, సంకలనం చేసి “ఆత్రేయ సాహితి” అనే శీర్షిక క్రింద పలు గ్రంథములు ముద్రణ చేసి తెలుగు ప్రజలకు అందజేశారు. ఈ సినీరంగ ప్రముఖులు కృషి అభినందనీయము.

సంతోషానికి, దుఃఖానికి స్పందించని హృదయం ఉండదు. స్పందనకి పసితనము, ముది తనములతో నిమిత్తము లేదు. అందుకే నేమో వారి పాటలకీ, మాటలకీ అందరూ మంత్ర ముగ్ధులవుతారు.

ఆత్రేయ గురించి ఏమన్నా చెప్పాలి అంటే, తెలుగులో వేరే మాటలు, పదాలు లేవు, వారు వాడిన పదాలతోనే, వారి మాటలతోనే, వారి పాటలతోనే వారి గురించి చెప్పాలి. వేరే మార్గం లేదు.

ముద్ద బంతి పూవులొ, మూగ కళ్ళ ఊసులూ,… బాసలూ” చెప్పాలన్నా? “ఈనాడే ఎదో అయ్యింది… అందాల లోకం రమ్మంది” అని ప్రేయసీ ప్రియులని ఉక్కిరిబిక్కిరి చెయాలన్నా? “మూగ మనసు” యొక్క భాష చెప్పాలన్నా? “మంచు కురిసే వేళలో మల్లె విరిసే దెందుకో” ఆలోచన చేయాలన్నా?
మధ్యతరగతి జీవుల బతుకు బండి” గూర్చి చెప్పాలన్నా? “విశ్వజనీన సమస్యలు” వెలికి తీయలన్నా? అది కేవలం ఆత్రేయకు మాత్రమే సాధ్యమైనది.

“రాక రాక వొచ్చావు చందమామ” అంటూ చల్లని తేనెలూరు తెలుగు పాటని చిత్ర రంగానికి పరిచయం చేసి. “తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా” అంటూ తెలుగు పాటల్లోని, తెలుగు దనాన్ని తెలుగు వారికి అందించి, “ఆడుతూ పడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది” అంటూ పాటలు పాడుతూ పనిచేస్తూ ఉంటే ఆ మధురిమ ఎలా ఉంటుందో వివరించారు. అలాగే “శిలలపై శిల్పాలు చేక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు” అంటూ తెలుగు చలన చిత్ర ప్రపంచానికే తలమాణికమైన అత్యద్భుతమైన పాటలను అందించారు.

ప్రియుడి చేత “ప్రియతమా నా హృదయమా” అంటూ ప్రేయసే ప్రియుడి హృదయమనిపించినా, “ఎదుటా నీవె ఎదలోనా నీవె” అంటూ ప్రేయసి తన గుండెలోతుల్లోనే ఉందనిపించినా, “సిరి మల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు” అని ప్రియురాలి ఆనందాన్ని కోరుకున్నా, ఆనంద పారవశ్యంతో ఉన్న అదే ప్రియుడి చేత “ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం” ప్రియురాలి కఠినత్వాన్ని ఎత్తిచూపినా, “ప్రేమ లేదని ప్రేమించ రాదనీ” అని భగ్న ప్రేమను చూపినా, అది కేవలం ఆత్రేయకే చెల్లుతుంది. మనసెరిగిన “మన‘సు’కవి” కే చెల్లుతుంది.

అలాగే, “సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్” అంటూ పొట్ట చేత పట్టుకొని నగరాలకు వొచ్చిన నిరుద్యోగ యువతకు చేయూతనిస్తూ “పోరా బాబు పోరా, ఎలుకోరా నీ గమ్యం చేరుకోరా” వారిని ప్రోత్సహించారు.

మరోచోట, “ముద్ద బంతి పువ్వులో” దాగి ఉన్న ఊహల్ని వెలికి తీసి, “నువ్వు లేక వీణ పలుకలేనన్నది” అంటూ తెలుగు సినీ ప్రపంచాన్ని ఉహలోకంలో విహరింప చేశారు.

అంతే కాదు, “నీ సుఖమే నే కోరు కున్నా” అంటూ తెలుగు సాహితీ ప్రియుల సుఖాన్ని కాంక్షించారు. “తెల్ల చీర కట్టు కున్నది ఎవరి కోసము” అంటూ కొంటె ప్రశ్న వేసి, అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించి, “కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వేర్రిక్కి ఉన్నోళ్ళు” అని అంటూ, “వేళా పాళ లేదు ఈ కుర్రాళ్ళాటకు” అంటూ చమత్కరించారు.

అంతే కాక, “కన్నులు కన్నులతో కలబడితే” ఏమౌతుంది అని సూటి ప్రశ్న సంధించి “కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు” అంటూ “నా మాటే నీ మాటై చదవాలి” అని అంటూ “పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో” మాట లేక పొతేనేమి “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” అన్నారు ఈ విధంగా మనసులో పలికే మాటలు మనసెరిగిన “మన ‘సు’ కవి” కి తప్ప మరెవ్వరికి కుదురుతుంది?

అంతే కాక, “మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే” అంటూ మనసు మనిషికి మధ్య జరిగే ఘర్షణను ఈ మనోహరమైన కావ్యంద్వారా వెలిబుచ్చారు.

“భారత మాతకు జేజేలు” అంటూ దేశ భక్తిని కూడా చాటి చెప్పారు.

“ఉన్నావా అసలున్నావా? ఉంటే! కళ్ళు మూసుకున్నావా?” అంటూ దైవాన్ని నిలదీసిన ఘనత ఆత్రేయదే? మరి ఇంతలోనే ఆ స్వామి సాక్షాత్కారము లభించిందేమో “శేషశైల వాస శ్రీ వేంకటేశ” అంటూ తన దైవ భక్తి తత్పరతఃను చాటి చెప్పారు.

ఆత్రేయ తమ రచనల ద్వారా, పాటల ద్వారా, కవితల ద్వారా తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొని, 1989లో సినీ ప్రేమికుల నుంచి, సాహితీ ప్రియుల నుంచి శాస్వితంగా సెలవు తీసుకున్నారు. బహుశా తన నిష్క్రమణం ముందుగా ఉహించారో ఏమో? వారి మరణానికి కొంచెం ముందు తన చరమగీతాన్ని తానే ఈ క్రింది తేటగీతి పద్యంలో వారే వ్రాసుకున్నారు.

చలన చిత్ర నిర్మాతలు సంతసిల్ల
సురకవి వరుండిది విని యచ్చెరువు పొంద
గురువు మల్లాది, శ్రీశ్రీయు సరస నుండ
తరలె నాత్రేయ పరమపదమ్ము చేర!

ఇలా, ఆత్రేయ మాటలతోనే, ఆత్రేయ పాటలతోనే, ఆత్రేయ గురించి మనసారా ఒక్కసారి తలచుకున్నాము.

You Might Also Like

Leave a Reply