“వెలుగు దారులలో…” పుస్తక పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
************

ఓ పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. మరి స్త్రీ విజయం వెనుక…..

అవహేళనలుంటాయి… అవమానాలుంటాయి… ఛీత్కారాలుంటాయి… బెదిరింపులుంటాయి… శారీరక లేదా మానసిక హింస ఉంటుంది.

ఇవే కాదు….
ఆత్మస్థైర్యం, పట్టుదల, మనోనిబ్బరం, లక్ష్యాన్ని చేరేవరకు అలుపెరగకుండా శ్రమించే తత్వం, తాను ఎదుగుతూ తోటివారు కూడా ఎదిగేలా చూసే హృదయం ఉంటాయి.

ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి –
జీవితంలోని అన్ని దశలనూ పరిపూర్ణంగా జీవించిన ఓ మార్గదర్శి జీవిత కథ ఇది. బాహ్యానికి ప్రశాంత తటాకంలా అనిపించినా, కల్లోల కడలి లాంటి అంతరంగం ఆవిడది.

చిన్నతనంలో ఇష్టపడి కష్టంతో చదువుకుని తెలివైన, చురుకైన బాలికగా, చిన్నారి గాయనిగా గుర్తింపు పొంది; చదువుతో పాటు వ్యక్తిత్వమూ సంతరించుకుని – తాను చదువుకుంటూనే, తోటి విద్యార్థులూ విద్యలో రాణించేటట్లు చేసి, విద్యార్థులకు శాపంగా మారిన ఓ విధానాన్ని తొలగించడానికి పెద్దలను పిన్నలను కూడగట్టుకుని సమ్మె చేసి విజయం సాధించి – ఆత్మవిశ్వాసం నిండిన యువతిగా ఎదిగి; దేశ బానిసత్వాన్ని రూపుమాపడానికి, ప్రజల్ని చైతన్యవంతులని చేయడానికి అప్పటి కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితురాలై – అధ్యయనమూ, పోరాటము లక్ష్యాలుగా – తనని తాను మలచుకుంటూ పార్టీ కార్యక్రమాలను చేపట్టిన ధీరగా మారి – పార్టీలోనే ఉన్నత స్థానంలో ఉన్న సహచరుడిని ఆదర్శ వివాహం చేసుకుని, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కున్నా మొక్కవోని దీక్షతో జీవిత రంగంలో తాను నిలబడి పోరాడమే కాకుండా సాటి మహిళలో స్ఫూర్తి నింపి వారు సైతం తమ బ్రతుకుల్ని తీర్చిదిద్దుకునేలా కృషిచేయడం మాత్రమే కాకుండా తన ముగ్గురు పిల్లలని చక్కగా చదివించి వృద్ధిలోకి తెచ్చి, వారిని కూడా సమాజానికి హితైషులుగా చేసి తాను సాధించిన వాటితో పొంగిపోక, ఇంకా సమాజానికి ఎంతో చేయాలని తపించే గొప్ప మనిషి కథ ఇది. ఆవిడే నంబూరి పరిపూర్ణ.

తల్లిదండ్రుల నుంచి క్రమశిక్షణనూ, పట్టుదలకు అంది పుచ్చుకున్నారు పరిపూర్ణ. సామాజిక, రాజకీయ అవగాహన పుష్కలంగా ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల లోకం పోకడలపట్ల బాల్యం నించే సదవగాహన పొందారు. చదువులో ముందుండడమే కాకుండా సాంస్కృతిక, కళా కార్యక్రమాలలోనూ విశేషంగా రాణించి, గాయనిగా, నటిగా గుర్తింపు పొందారు. బాలనటిగా సినిమాలలో నటించినా, చదువుని పాడుచేసుకుండా, ఖాళీ సమయాలలో ఆంగ్ల వ్యాకరణం మీద పట్టు సాధించారు.

పెద్దలు, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం కలిగి ఉండి వాళ్ళ నుండి కేవలం బడి పాఠాలే కాకుండా సాహిత్య విశ్లేషణా, జీవితంలోని సంఘటనలను విభిన్న దృష్టికోణాలతో చూడడం నేర్చుకుని ఆదర్శ విద్యార్థిని అయ్యారు.

కుల, ధన ప్రాతిపదికగా విద్యార్థుల మధ్య భేదాలు చూపుతున్న హాస్టల్ నుంచి బయటకొచ్చేసి నిరసన తెలపడం, తోటి విద్యార్థినులకు ఆంగ్ల పాఠాలు అర్థమయ్యేలా చెప్పడం, విద్యార్థుల భావి జీవితాలకు ప్రతిబంధకంగా ఉన్న డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయించేందుకు అందరిని కూడగట్టుకుని పోరాటం చేయడం వంటివి ఆమె నాయకత్వ లక్షణాలను చాటి చెబుతాయి.

నమ్మిన సిద్ధాంతాల కోసం, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం కోసం అప్పటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి అరెస్టయ్యారు. ఇరవై నాలుగు రోజులు పాటు జైల్లో ఉన్నారు. కాలేజీకి సెలవలు ఇచ్చినప్పుడు అందరిలా ఇంటికి వెళ్ళిపోకుండా, ఊర్లోనే ఉండి మహిళా సంఘాల నిర్మాణం వంటి కార్యక్రమాలలో పాల్గొని క్షేత్ర స్థాయి సమస్యలను అవగాహన చేసుకున్నారు.

పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తున్న సందర్భంగా కామ్రేడ్ దాసరి నాగభూషణరావు గారితో పరిచయం అవడం, ఆయన పరిపూర్ణగారిని ఇష్టపడడం, ఆదర్శ వివాహం చేసుకోవడం జరిగాకా, పార్టీపై ఉన్న నిషేధం కారణంగా రహస్య జీవితం గడపడం జరిగింది. ఆ క్రమంలో ఎన్నో సార్లు పోలీసులకు దొరకడం, సమయస్ఫూర్తిగా వ్యవహరించి తప్పించుకోడం జరిగింది. ఓ సారి విప్లవ సాహిత్యం చేతిలో ఉండగా పోలీసులు ఆపి, స్టేషన్‌కి రమ్మంటే… బెదిరిపోకుండా వారి ముందు సైకిళ్ళ మీద వెడుతుంటే.. పరిపూర్ణ గారు రిక్షాలో ఉండి ఓ మురికి కాలువలో ఆ కాయితాలని పడేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో సందర్భంలో – పరమ కర్కోటకుడిగా పేరుపొందిన పళనియప్పన్ అనే పోలీస్ అధికారితో ధైర్యంగా మసలుకొన్నారు.

అవరోధాలను ఎదుర్కుంటూ జీవనం గడుపుతున్న సమయంలో కామ్రేడ్ ఎన్. ఆర్. దాసరి గారితో అభిప్రాయబేధాలు రావడం, జీవన విధానాలు పొసగక పోవడం జరిగాయి. సర్దుకోలేకపోయిన దాసరి గారు కుటుంబాన్ని విడిచివెళ్ళడం పరిపూర్ణగారిని మానసికంగా గాయపరిచినప్పటికీ, ఒంటరిగానే తానెంచుకున్న మార్గంలో ముందుకుసాగడానికి ప్రేరణనిచ్చింది.

సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు మనకి కొత్త కాకపోవచ్చు, కానీ 1949 – 50 లలోనే ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు పరిపూర్ణగారు. బాధ్యత గల ఉద్యోగాలు నిర్వహిస్తూనే, పిల్లలను విలువలతో పెంచి పెద్ద చేశారు. ఆర్థికంగా ఎంతో లోటున్నా, పిల్లలకు ఒక్కో రోజు తినడానికే అన్నం కూడా లేకున్నా… క్రుంగిపోలేదు, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. పిల్లల కడుపు నింపడమే కాకుండా హృదయాలను నింపారు. ఫలితంగా ముగ్గురు పిల్లలు కూడా బాగా చదువుకుని తమ జీవితాలనూ తీర్చిదిద్దుకున్నారు. ఎదిగిన పిల్లల అభిప్రాయాలను ఆమె గౌరవిస్తునే, చెప్పాల్సిన చోట తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పి, తగిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛని వారికే వదిలేశారు.

ఆర్థిక లేమి వల్ల, ఎదురైన అవమానాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్న స్థితినుంచి పోరాడి జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం అత్యంత స్ఫూర్తిదాయకం. సంసారంలో పురుషాధిక్యతనీ, అగ్రకుల అభిజాత్యాన్ని సమర్థవంతగా ఎదుర్కుని తాను ఎంచుకున్న మార్గంలో, ఒంటరిగా ధైర్యంగా నడిచి ఎందరికో బ్రతుకు బాట చూపారు.

తన జీవిత గమనంలో తనకు సాయం చేసిన అందరినీ – దాదాపుగా ప్రతీ ఒక్కరినీ – పేరుపేరునా గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఈ క్రమంలో సమాజంలో ఆనాడు ఎంతో ప్రసిద్ధులుగా, గొప్ప వ్యక్తులుగా చలామణీ అయిన దర్శి చెంచయ్య గారు, జాషువా గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, బాలాంత్రపు రజనీకాంతరావు గారు, రేలంగి వెంకట్రామయ్య గారు, జి. వరలక్ష్మి గారు, మాస్టర్ వేణు గారు, అశ్వత్థామ గారు, పుండరీకాక్షయ్య గారు, నాగభూషణం గారు, వల్లంపాటి నరసింహారావు గారు వంటివారితో పరిచయాలున్నా వాటిని దుర్వినియోగపరచకుండా, వారి సహాయ సహకారాలను అవసరమైనంత వరకే ఉపయోగించుకున్న విధానం ఆవిడపై గౌరవాన్ని మరింత పెంచుతుంది.

ఇద్దరన్నయ్యలు ఎం.ఎల్.ఎలుగా ఉన్నప్పటికీ, దర్పం, గర్వం లేకుండా నిరాడంబరంగా జీవితాన్ని గడిపారు. బాల్యం లోని సినీ జీవితం గురించి, భారతదేశపు తొలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు తమ తమ ప్రదర్శనల ద్వారా పార్టీకి ప్రచారం చేసిన వైనం గురించి, తదుపరి కాలంలో ఆ కళాకారులు సినీరంగంలో ప్రవేశించడం గురించి సందర్భోచితంగా వివరించారు.

ఈ పుస్తకంలో పార్టీ చరిత్ర ఉంది, ఉద్యమాల వివరణ ఉంది, నాయకుల స్వభావ చిత్రణ ఉంది. ఒక్క విజయవాడని మాత్రమే కాకుండా కోస్తా జిల్లాల్ని సైతం ప్రభావితం చేసిన రౌడీయిజం తాలూకూ వివరణ ఉంది.

రిటైరయ్యాకా తమ కాలనీలోని స్త్రీలతో మహిళామండలి ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరించుకున్న తీరు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
72 ఏళ్ల వయసులో కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించడం… ఉత్సాహంగా జీవించడానికి వయసు ప్రతిబంధకం కాదని చెప్పడానికి సూచనగా భావించవచ్చు.
***
కొందరి ఆత్మకథలు వేదన కలిగిస్తాయి, వారి జీవితంలోని కష్టాలకూ, వెతలకూ పాఠకుల కళ్ళు చెమర్చుతాయి. కాని ఈ ఆత్మకథలో కష్టాలు, వ్యథ ఉన్నా అవి కన్నీరు కార్పించవు. వాటిని అధిగమించి ముందుకు సాగేలా ప్రేరణనిస్తాయి. వ్యక్తిగత దుఃఖం ఉన్నా, దాన్ని రేఖామాత్రంగా ప్రస్తావిస్తూనే… ఆ కఠిన పరిస్థితులను ఎదుర్కున్న వైనాన్ని ఉత్తేజకరంగా చెప్పారు రచయిత్రి.

మొత్తం మీద ఆసక్తిగా చదివించే ఈ స్వీయచరిత్ర నేటి తరం పాఠకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
248 పేజీల ఈ పుస్తకం వెల 120 రూపాయలు. ప్రతులు ఆలంబన ప్రచురణలు వద్ద, కాచీగూడా నవోదయ బుక్ హౌస్‌లోనూ, ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభిస్తాయి. కినిగె.కాం లో ఈ-బుక్ లభిస్తుంది.

You Might Also Like

2 Comments

  1. Desu Chandra Naga Srinivasa Rao

    Highly Inspiring!!!!

Leave a Reply