దుప్పట్లో మిన్నాగు – యండమూరి

మిన్నాగుఐదు గంటలు బస్సులో ప్రయాణం చేయాలి కదా, కాలక్షేపానికి ఏదైనా పుస్తకం కొందామని బస్ స్టాండ్లో ఉన్న పుస్తకాల షాపుకు వెళ్ళాను. మామూలుగా అయితే సితార కొనడం అలవాటు నాకు. ఎందుకో బోర్ కొట్టింది. ఇంకేదయినా చూద్దామనుకుంటే, ఇదుగో – ఈ పుస్తకం కనబడింది.ఎప్పుడో చదివాను. మరోసారి చదవచ్చు కదా అని తీసుకున్నాను.

అప్పుడెప్పుడో స్రవంతి పత్రికలో ఈ కథలను యండమూరి ఎక్కడినుంచో కాపీ కొట్టారని దుమారం రేగింది. అందుకనేనేమో ఈ కొత్త ఎడిషన్లో, రొనాల్డ్ డాల్ కథలను చదవడం ఈ నవమాలికకు ప్రేరణ అని వ్రాశారు. ఇదో కథల మాలిక. ఆరు కథలను గుదిగుచ్చి చేసినది. ఓ ఎయిర్ పోర్ట్ లో కొంతమంది స్నేహితులు కూర్చుని మందుకొడుతూ కథలు చెప్పుకుంటారు. ఎవరి కథలో తక్కువ సస్పెన్స్ ఉంటే వారు బిల్లు చెల్లించాలి. ఇది కథల కమామీషు.

మొదటి కథ – దుప్పట్లో మిన్నాగు : భద్రాచలం అడవుల్లో ఓ కాంపు. ఒకరోజు రామభద్రం పడుకుని ఏదో చదువుతు ఉంటే, ఓ మిన్నాగు అలా పాక్కుంటూ, దుప్పటి కిందుగా వెళ్ళి, అతని పొత్తికడుపు మీద ముడుచుకుని పడుకుంది. ఆ పాము తోక పుస్తకం మీదుగా పాకేప్పుడు రామభద్రం చూశాడు దాన్ని. కన్ను మూసి తెరిచేంతలో అదెళ్ళి కడుపు మీద తిష్ట వేసింది. ఏ మాత్రం కదిలినా కాటేస్తుంది. అప్పుడక్కడికి తన మిత్రుడొస్తాడు. ఆ తర్వాత డాక్టరు, ఆ తర్వాత భద్రం వాళ్ళావిడ, ఆమెతో పాటు ఓ అమ్మలక్క. చివరకు డాట్రు రిస్కు తీసుకుని, క్లోరోఫాం పంపి, ఆ పాముకు స్పృహ పోగొట్టి ఎలానో దుప్పటిని పైకి జరుపుతాడు. అక్కడ భద్రం డ్రాయర్ తాలూకు నాడా. ఇంతకూ పాము ఉందా లేదా? ఉంటే ఏమయ్యింది?

రెండవకథ – ఓడప్రయాణం : దైవాధీనం విదేశాల్లో ఉండి డబ్బు వెనకేసుకుని తన దేశానికి తిరుగు ప్రయాణమవుతుంటాడు, ఒక ఓడలో. అప్పుడో తుఫాను. తుఫాను వల్ల ఓడకు ఏ దెబ్బ లేదు కానీ, పూర్తీ వేగంతో ప్రయాణించలేదు. ఓడలో ఒక చిన్న పందెం జరుగుతుంటుంది. ఓడ ఎంతదూరం ప్రయాణిస్తుంది లెక్కకట్టాలి. దైవాధీనానికి తుఫాను రాబోతుందని ముందస్తుగా తెలుసు కాబట్టి, తను సంపాదించినదంతా ఒడ్డి పందెం కాస్తాడు. అయితే తుఫాను తగ్గి ఓడ వేగం పుంజుకుంటుంది. దైవాధీనం ఎలాగైనా పందెం గెలవాలని ఒక ప్లాను వేస్తాడు. పొరబాటుగా నీళ్ళలో పడిపోయినట్టు, నీళ్ళలో దూకుతాడు. అలా పక్కన పడినప్పుడు పక్కన ఓ మహిళా ప్రయాణీకురాలు ఉండేట్లు చూసుకుంటాడు. అయితే ఆమె, దైవాధీనం ఈతకోసం దూకాడని భావిస్తుంది. ఇంతకూ దైవాధీనం బతికాడా?

మూడవకథ – మానవాతీత వ్యక్తి : ఈ కథ రచయితే చెబుతున్నట్టు సాగుతుంది. ఓ హేతువాదీ, ఓ మానవాతీత శక్తులను నమ్మే వాడు (నమ్మించాలనుకొనే వాడు) మిత్రులు. మా.శ.న వయసు మళ్ళిన వ్యక్తి. హేతువాదికి యవ్వనంలో ఉన్న ఒక కూతురు. వారు ఒక రోజు డిన్నర్ లో ఉన్నప్పుడు అతీత శక్తులున్నాయ అన్న చర్చ వస్తుంది. మాటా మాటా పెరుగుతుంది. చివరకు ఒక పందెం వేసుకుంటారు. ఒక రోజంతా ఒక పెట్టెలో పడుకుని ఉండగలనని మా.శ.న పందెం కాస్తాడు. అది అసంభవమంటాడు హేతువాది. పందెంలో గెలిస్తే, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చెయ్యమంటాడు మా.శ.న. మాట పట్టింపు కోసం సరే నంటాడు హేతువాది. పెట్టె రెడీ అవుతుంది. పెట్టెలోకెళ్ళగానే. మా.శ.న. ఒక ద్రవాన్ని వళ్ళంతా పట్టించుకుంటాడు, చమట రాకుండా ఉంటానికి. కొన్ని నిద్రమాత్రలు మింగుతాడు. పెట్టే గోడ వైపుకు ఆనించి ఉన్న సైడు చిన్న రంధ్రం చేయడానికి, జేబులో ఒక చిన్న డ్రిల్లింగు మెషన్ తీస్తాడు. (ఆ రంధ్రం ద్వారా ఊపిరి తీయడం ప్రాక్టీసు చేసి ఉంటాడతను) బయట హేతువాది తన భార్యతో ఏదో చెబుతూ, ఆ పెట్టె చాలా పాతకాలం నాటిదని, ఇనుపపెట్టె అయినా, దాని మీద చెక్కలా పెయింటింగ్ ఎంతో చక్కగా చేశారని చెబుతాడు. చివరికి మా.శ.న బతికాడా?

నాల్గవ కథ – వరండా కుర్రాడు : రాధ, విశ్వనాథం అన్యోన్య దంపతులు. రాధ చాలా అందగత్తె, చలాకీ. విశ్వనాథం బ్యాంకులో ఆఫీసరు. వాళ్ల ఎదురింట్లో పరంధామయ్య అనే ముసలాయన రాధ వంక ఆశగా చూస్తుంటాడు. రాధ కు ఇంట్లో బోరు కొడుతుంటుంది. వాళ్ళింటి వెనుక పోర్షను అద్దెకిద్దామంటుంది. సరేనని విశ్వనాథం ఓ కుర్రాడిని తీసుకొస్తాడు. ఆ కుర్రాడు రఫ్ గా ఉంటాడు. ఒక్కో సారి మందుకొడతాడు. పొద్దునే లేచి గిటారు వాయిస్తాడు. రాధకు ఇదంతా సరిపోదు. చివరికి ఒక రోజు భర్తకు చెబుతుంది. విశ్వనాథం – ఎదుటి వ్యక్తుల మీద అనుమానం పెంచుకోకూడదని, సరైన దృష్టితో చూడాలని ఆమెకు నచ్చజెబుతాడు. రాధ తను ఆ అబ్బాయి మీద పెంచుకున్నవన్నీ అపోహలని, ఆ అబ్బాయి తన జీవితం మీద ఎంతో నిబద్ధత ఉన్నవాడనీ తెలుసుకుంటుంది. ఈ కథలో రచయితది ఏ పాత్ర?

ఐదవ కథ –  అంతర్నేత్రం : రంగారావు, అరుంధతి భార్యాభర్తలు. భార్యాభర్తలు అవాలి కాబట్టి అయారు. అరుంధతి భర్తతో సర్దుకుపోతుంటుంది. రంగారావు వ్యసనపరుడు. అతని ఓ ప్రాణాంతక వ్యాధి వస్తుంది. అప్పుడు డాక్టర్ విలియమ్స్ అనే అతను – ఎలాగూ చావబోతున్నావు కాబట్టి, నా పరిశోధనకు ఉపయోగపడమంటాడు. విలియమ్స్ – ఒకవ్యక్తి మెదడును, దేహం నుంచీ విడదీసి, కొన్ని పద్ధతుల ద్వారా ప్రిజర్వ్ చేయటం మీద పరిశోధిస్తుంటాడు. ఆ మెదడుకు కన్నును అనుసంధానిస్తారు. ఆ కన్ను ద్వారా మెదడులో జరిగే ప్రకంపనలను ఒక సూచి ద్వారా గమనిస్తారు. అదీ పరిశోధన. చివరకు రంగారావు ఒప్పుకుంటాడు. పరిశోధన విజయవంతమవుతుంది. అరుంధతి, ఆ పరికరాన్ని (వాళ్ళాయనను) ఇంటికి తెచ్చుకుని, అతని కళ్ళ ఎదురుగానే వక్కపొడి తినడం మొదలెడుతుంది. (వక్కపొడి ఆమె భర్తకు సరిపడదు). పరికరంలో ప్రకంపనలు తీవ్రమవుతాయి.

ఇవి కథలు. ఈ కథల తర్వాత చివరి కథ బావోలేదని తీర్మానించబడుతుంది. అప్పుడక్కడికి పట్నాయక్ అనే ఆరవ వ్యక్తి వస్తాడు. ట్రూత్ టెల్లర్ అనే పరికరం సాయంతో ఆ నిర్ణయంలో తప్పుని కనిపెట్టి చెబుతాడు. పందెం మార్చబడుతుంది. పట్నాయక్ కథ చెబుతాడు. ఆ కథ కు మార్కులేయాలి. ఎవరైనా తప్పు మార్కులు వేస్తే కనిపెట్టటానికి ట్రూత్ టెల్లర్ ఉండనే ఉంది!

ఆరవ కథ – ట్రూత్ టెల్లర్ :ఆంధ్రశోభ పత్రిక సంపాదకుడు స్వామినాయుడు అసాధ్యుడు. తన హయాంలో కొన్ని రోజులకే పత్రికను అగ్రస్థానంలో నిలబెడతాడు. ఒకరోజు ఒక విలేఖరి వైజయంతికి, కొన్ని గంటల్లో ఉరి తీయబడుతున్నఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చెయ్యమని, అతన్ని జైల్లో కలుసుకుందుకు ఏర్పాట్లు చేయిస్తాడు. ఆ వ్యక్తి పేరు పట్నాయక్. అతనో పరికరాన్ని కనుగొంటాడు. ఆ పరికరం ట్రూత్ టెల్లర్. అయితే ఆ పరికరం ఫార్ములాను ఇంకొక వ్యక్తి దొంగతనం చేసి, ఆ పరికరం తను సృష్టించిందేనని చెబుతాడు. ఆవేశంలో ఆ రెండవ వ్యక్తిని పట్నాయక్ హత్య చేస్తాడు. ఇది అతని కథ. జైల్లో వైజయంతి ఇంటర్ వ్యూ జరుపుతుంది. మధ్యలో తను ఆంధ్రశోభ నుంచి వచ్చినట్లు చెబుతుంది. అప్పుడు పట్నాయక్ తీవ్రంగా ఆవేశపడతాడు. ఆమె భయపడి మధ్యలో వచ్చేస్తుంది. అయితే ఆమె ఆ పనిని అసంపూర్ణంగా వదిలేయక, అదే సెల్ లో ఇంతకు మునుపు ఉరిశిక్ష పడి చివరిక్షణంలో రద్దయిన ఒక ఖైదీని కలుస్తుంది. ఆ ఖైదీ పేరు చిరంజీవి. (అభిలాష సినిమా/నవల హీరో). అతను మాటల్లో, ఆ సెల్లో ఒక సొరంగం ఉందనీ, ఆ మాట ఆ సెల్లోనే పైన రూఫ్ లో బొగ్గుతో రాశారని చెబుతాడు. వైజయంతి ఎక్సయిట్ అవుతుంది. తిరిగి రెండో సారి జైలుకు వెళ్ళి ఎలాగోలా పర్మిషను సంపాదించి, పట్నాయక్ ను కలుసుకుంటుంది. అతనికి ఆ సొరంగం వివరం చెబుతుంది. ఆ తర్వాత వైజయంతి స్వామినాయుడును కలుసుకుని తను చేసిన ఘనకార్యం చెబుతుంది. మరుసటి రోజు స్వామినాయుడు హత్య చేయబడతాడు. ఇనస్పెక్టర్ జార్జ్ తన అఖండమైన తెలివితేటలతో మొత్తం కూపీ లాగి, హంతకుడు పట్నాయక్ అని, అతడు జైల్లో తప్పించుకోవడానికి సహాయం చేసింది (హత్య చేస్తాడని ముందుగా తెలియకపోయినా) వైజయంతి అని కనుక్కుంటాడు. ఆ మరుసటి రోజు పట్నాయక్ తనంతట తానే లొంగిపోయి, వైజయంతిని రక్షిస్తాడు. ఇంతకూ పట్నాయక్ ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? ట్రూత్ టెల్లర్ వెనుక నిజమేమిటి?

ఇవండీ కథల వివరాలు. పుస్తకం చిట్టచివర్లో హిచ్ కాక్ మార్కు ట్విస్టు ఒకటున్నది. ఈ కథలు స్కెజ్వాన్ పాప్ కార్న్ లా మంచి కాలక్షేపానికి పనికివస్తాయి. అయితే అక్కడక్కడా యండమూరి మార్కు విశ్లేషణలు మామూలే. అవి వదిలేస్తే మంచి కాలక్షేపమే. ఇక యండమూరి శైలి గురించి కొత్తగా చెప్పే పనిలేదు. పాతికేళ్ళ క్రితం పాఠకులను బాగా అలరించిన పాపులర్ రచనఇది. రొటీన్ రొడ్డకొట్టుడు సెంటిమెంట్ కథలతో విసుగెత్తిన వారికి, ఇది కొంచెం రిలీఫ్.

ఇది నవసాహితి ప్రచురణ. కొత్త ఎడిషన్ ఖరీదు 45/-

You Might Also Like

2 Comments

  1. varaprasaad.k

    దుప్పట్లో మిన్నాగు ఆరంభం నుంచి చివరాఖరి దాకా ఊపిరి బిగ పట్టుకొని మొదటిసారి చదివిన జ్ఞాపకం ఇప్పటి దాకా మరిస్తే ఒట్టు.

  2. XYZ

    hahahahahha………..రొటీన్ రొడ్డకొట్టుడు సెంటిమెంట్ కథలతో విసుగెత్తిన వారికి, ఇది కొంచెం రిలీఫ్.

Leave a Reply