Fatal Guidance – చిన్న కథను గురించి

Fatal Guidance by William Bainbridge (కథ సబ్స్క్రైబర్లకి మాత్రమే. పీ.డీ.ఎఫ్ ఇక్కడ షేర్ చేయడం కాపీరైట్ ఉల్లంఘన అవుతుంది అని రాశారు. ముఖచిత్రం CACM పత్రిక నుండి.)

ఒక నెలన్నర క్రితం ఒక చక్కటి చిన్న కథ చదివాను, Communications of the ACM మాసపత్రిక ఫిబ్రవరి సంచికలో. నాకు మొదట చదివినప్పుడే చాలా నచ్చి నలుగురైదుగురు స్నేహితులకి దాన్ని చదవమని షేర్ చేశాను. నా Statistical Natural Language Processing క్లాసులో కూడా ఈ కథలోని సాంకేతిక అంశాల గురించి ఓ చిన్న చర్చ లాంటిది జరిపాను స్టూడెంట్ల మధ్య. ఇంతా అయ్యాక కూడా, ఈ నెలన్నర కాలంలో రెండు మూడ్రోజులకోసారి ఈ కథని తల్చుకుంటూనే ఉన్నాను. దానితో ఒక్కసారి “ఎందుకు నాకీ కథ నచ్చింది?” అనుకుని, ఇలా రాసుకుంటున్నాను.

కథ గురించి క్లుప్తంగా: ఇందులో కథను చెప్పే అతను నవలా రచన చేసే ఒక సాఫ్ట్వేర్ యంత్రాన్ని తయారు చేస్తాడు. దాని ముఖ్యోద్దేశం ఏమిటంటే బెస్ట్ సెల్లర్ మర్డర్ మిస్టరీ నవలలు తీసుకుని దాన్ని పాఠకుడి ఆసక్తికి అభిరుచికీ తగ్గట్లు కస్టమైజ్ చేయడం. ఇపుడు నాకు “కౌంట్ ఆఫ్ మాంటెక్రిస్టో” నవలని మన నేటివిటీకి తగ్గట్లుగా మార్చుకుని చదవాలి అనిపిస్తే (“వేట” సినిమాలాగా), ఈ సాఫ్ట్వేర్ నాక్కావలసినట్లు కథలోని పాత్రల, ప్రదేశాల పేర్లు వంటివి మార్చేసి నవలని నాకు చూపిస్తుంది. ప్రదేశాల పేర్లకి తగ్గట్లుగా కథలోని సంఘటనలు జరిగే ప్రదేశాలు కూడా మారతాయి. ఉదాహరణకి కథలో డిటెక్టివ్ అమీర్పేట్ లో జరిగిన హత్య గురించి ఎస్సార్ నగర్లో ఉన్న కాఫీడే లో కూర్చుని ఆలోచిస్తున్నాడు అని ఉంటే, పాఠకుడు “నా కథ విజయవాడలో జరగాలి” అని కోరుకుంటే, ఈ ప్రదేశాలు, ప్రదేశాల మధ్య దూరాలూ వంటివన్నీ విజయవాడకి తగ్గట్లు మారిపోతాయి. దీనికోసం అతగాడి సాఫ్ట్వేర్ అనేక రకాలైన data/information sources మీద ఆధారపడుతుంది. రీమేక్ కథలు రాసేవాళ్ళకి మంచి పోటీ అని అనిపించింది మొదట. కానీ, ఇక్కడ ఈయన రాసిన ఈ సాఫ్ట్వేర్ క్రమంగా frustrated జనాలు తాము పగబట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోడానికి కావాల్సిన ప్లానులు వేస్కోడానికి ఉపయోగపడుతుంది. ఆయన బిలియనీర్ అయిపోతాడు కానీ అవి చదివిన జనం పరిస్థితి ఏమిటి? ఆ తరువాత ఏమైంది? అలా ఎన్నాళ్ళు ఉన్నాడు? వంటివి ఇక కథలో మిగితా భాగం.

నాకు కథ నచ్చడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి:
అ) కథలో వర్ణించిన సాఫ్ట్వేర్ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ పద్ధతిలో దాన్ని రూపొందించాలంటే ఎటువంటి ప్రాసెసింగ్ అవసరం? భాష గురించి కంప్యూటర్ కి ఎంత స్థాయిలో అర్థం కావాలి? అన్న విషయాలు నేను చాలాసేపు ఆలోచించాను. ఇదే మా స్టూడెంట్లతో చర్చించిన భాగం కూడా.
ఆ) సై-ఫై కథే అయినా కథలోని పాత్రలు, పరిస్థితులు నాకు వాస్తవికంగానే అనిపించాయి. కథ ఊహాజనితమైన లోకంలో (ఇంకో గ్రహం, ఇంకో శతాబ్దం, ఇంకో రకం ప్రాణులు) కాక, మామూలు మనుషుల గురించి కావడం.
ఇ) క్లుప్తత. ఎంతవరకూ చెప్పాలో అంతవరకు మాత్రమే పాఠకుడికి వాక్యాల్లో చెప్పడం. పక్కనుండి చేయిపట్టుకుని నడిపించుకు పోయినట్లు కాక, పాఠకుడి తెలివితేటల్ని నమ్మడం నాకు నచ్చింది.

రెండు పేజీలే అయినా కావాల్సినంత సస్పెన్స్ ఉంది కథలో. దానితో పాటు సాంకేతికతతో కావాల్సిన ethics గురించి ఆలోచింపజేసే వాక్యాలూ ఉన్నాయి. సాధారణంగా సైన్స్ ఫిక్షన్ కథలంటే నేను చదివినంతలో నాకు సమకాలీనంగా అనిపించినవి తక్కువ. నలభై యాభై ఏళ్ళ క్రితం రాసి ఇప్పుడు చదివి “వాళ్ళు futuristic గా రాశారు” అనుకునే కథల గురించి కాదు నేను అంటున్నది. ఇది 2017లో వచ్చిన, ఈ కాలానికి వాస్తవికంగా, సమకాలీనంగా ఉన్న కథ అని మాత్రమే. ఇటీవలే ఇలా మరొక రచయిత కథల గురించి అనిపించింది – ఆయన పేరు Ted Chiang, ఆయన కథల గురించి మరొకసారి.

మొత్తానికైతే కథ నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఈ రచయిత రాసిన ఇతర కథలు ఎక్కడన్నా దొరికితే చదవాలి అని నిర్ణయించుకున్నాను.
రచయిత గురించి: William S. Bainbridge అనే ఈయన సోషియాలజిస్టుగా మొదలై కంప్యూటర్ సైంటిస్టుగా మారి Human-Computer Interaction రంగంలో పేరుపొందిన పరిశోధకుడు. కంప్యూటింగ్ గురించి పుస్తకాలు కూడా రాశారు. గత ఇరవై ఏళ్ళుగా సైన్స్ ఫిక్షన్ రాస్తున్నారట. ఇంకా ఆయన గురించి చాలా కథుంది. ఆసక్తి గలవారు ఆయన వెబ్సైటులో చూడండి.

You Might Also Like

One Comment

  1. ఏల్చూరి మురళీధరరావు

    విజ్ఞానశాస్త్రప్రభావం వల్ల సృజనాత్మకరంగంలో సాధ్యం కాగల ఆసక్తికర పరిణామాలను గురించి చాలా బాగా పరిచయం చేశారు. పది – పదిహేనేళ్ళ క్రితం నేను అమెరికాలోని ఒక సినిమా థియేటర్లో అరగంట (లేదా) గంటసేపు ప్రదర్శించే విధంగా ఇటువంటి ఒక ప్రయోగాత్మక చలనచిత్రాన్ని రూపొందించారని, దానిని ప్రేక్షకులు తమ ఇష్టానునుసారం ముందుకు నడిపింపవచ్చునని, పాత్రప్రవేశనిష్క్రమణలు, సంభాషణలు, సన్నివేశాలు, ముగింపు, సెట్టింగులు, సంగీతం, కెమెరా ఏంగిల్స్ మొదలైనవాటిని ప్రేక్షకులు ఏ విధంగా మార్చదలుచుకొంటే ఆ విధంగా మార్చవచ్చునని, అందుకు ప్రేక్షకుల సీటువద్ద ఉండే కంట్రోల్ ప్యానెల్ లోని మీటలు ఉపకరిస్తాయని, హాలులో ఉన్న జనంలో ఎక్కువమంది ఏ విధంగా కోరితే ఆ విధంగా ఇతివృత్తం కొనసాగుతుందని, తాము కోరిన మార్పులనే అధికసంఖ్యాకులు కోరుతున్నారని తెలిసినప్పుడు ప్రేక్షకుల ఆనందం అవధులు దాటుతుందని – వార్తావ్యాసం ఒకటి చదివాను. ఆ ప్రక్రియకు సంబంధించిన సాంకేతికతను గురించి, బహుజనమధ్యంలో ప్రేక్షకులు అనుచితమైన దృశ్యాన్ని కోరకుండా విధినిషేధాలు (ఎథిక్స్) వంటి వాటిని ముందుగానే వివరిస్తారట. అది విజయవంతంగా ప్రదర్శింపబడిందో, లేదో ఆ వివరాలు నాకు తెలియవు. మీరు చెప్పిన విషయానికి సరిపోలినది కావటం వల్ల జ్ఞాపకం వచ్చింది.

Leave a Reply