పుట్టపర్తి నారాయణాచార్యులు

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీనివాసాచార్యులు గారు మంచి మిత్రులు. ఆయన అనంతపురం శారదా స్కూలు (బాలికల ప్రభుత్వ పాఠశాల) లో తెలుగు అధ్యాపకుడు.

సాయంత్రం ఆయన నాతో అన్నారు. “రేయ్ బుజ్జీ, ఈ రోజు మన లలితకళాపరిషత్తులో నారాయణాచార్యుల వారి సభ ఉంది. ఆయనకు సన్మానం జరుగుతా ఉంది. వస్తావారా?”

అలాంటి సభలు అనంతపురంలో బానే జరిగేవి. కొన్నింటికి మా తెలుగు సారు తీసుకెళ్ళారు. వెళ్ళాలని అనిపించేది. వెళితే ఏం తెలుస్తుందో తెలీదు. వెళ్ళకపోతే కోల్పోయేదేమిటో తెలీదు. వయసు, అనుభవమూ రెండూ లేని సమయం అది. ఏదేమైనా ఆ రోజు వెళ్ళలేదు.

ఆ రోజు స్వామి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు అనే జ్ఞాన వృద్ధునికి మా ఊళ్ళో సన్మానం జరిగింది. ఎలాంటి సన్మానం అంటే – ’దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణధీశు ముత్యాలశాల’ – అని శ్రీనాథుడు చెప్పుకున్నట్టు కాసులతో ఆయనకు సన్మానం. అయితే ఆ సన్మానం కాదు ఆకర్షించింది, ఆయనకు పైన పట్టుశాలువా కప్పినా, కాసులతో అభిషేకించినా నిర్మలంగా, నిర్నిమిత్తంగా, నిర్వేదంగా ఉన్న ఆయన ముఖం. చేతులు జోడించి నించున్నట్టు పేపర్లలో వేసిన ఆయన చిత్రం మాత్రం గుర్తు.

అయితే – పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అనే ఆయన రచన/కవిత్వ స్పర్శ తెలియటానికి చాలా యేళ్ళు పట్టింది. ఈ మధ్య స్వామి రచనలు ఎన్నో సార్లు తరచి తరచి చదువుకున్న తర్వాత ఆ రచనలలో సాంద్రపరిమళం కొంత మేరకు తెలుస్తోంది. తెలియాలే కానీ ఆ పరిమళం వర్ణనాతీతం. ఆయన కవిత్వాన్ని కానీ, రచనను కానీ చెయ్యరు. చూపుతారు. ఆ చూపించటంలో తిరిగి – ఆయన పాఠకుని నెత్తిన మోపే అభిప్రాయాల పరంపర ఉండదు. అది కేవలం వస్తువుని వస్తువుగా చెబుతూ, అందులోని ఎవరూ చూడని విశిష్టత్వాన్ని, అద్భుతమైన కోణాన్ని పరామర్శించటం మాత్రమే ఉంటుంది. అలాగని అందులో ఈయన సొంత సిద్ధాంతాలు ఉండవు. నిజంగా, సాహిత్యంలో ఏ విషయాన్నైనా నవ్య దృక్పథంతో చూడాలనుకునే వాళ్ళు ఈయన రచనలను చదవాలి.

ప్రబంధనాయికలు, వసుచరిత్ర వ్యాసాలు, తెనాలి రామకృష్ణుని పై వ్యాసాలు, ప్రాకృత కావ్యాలపై విమర్శలూ, రామాయణంపై సాధికారికమైన పీఠికా వ్యాసం, ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో…అన్నీ ఇక్కడ చెప్పడం అసాధ్యం.

ఆచార్యుల వారి కవిత్వం మరొక తీరు. ఇది ’ధ్వని’ మార్గమని, వక్రోక్తి అని కానీ, శాబ్దికమని, ఇతమిత్థమని నిర్వచింపటానికి వీలుకాని ఒక నవ్య మార్గం. అయితే శబ్దసంంచయంలో వేదాంతదేశికుల వారు, భావంలో నీలకంఠ దీక్షితుల వ్యంగ్యం, అల్లసాని పెద్దనలోని శృంగారత్వం, పోతన సొబగు ఎన్నో విభిన్న ధోరణులు అక్కడక్కడా కనిపిస్తాయి. శ్రీనివాస ప్రబంధంలో ఓ చోట ఇంద్రుడు తన “ఆఫీసు ఎంప్లాయీస్” అయిన రంభ, ఊర్వశి ఇత్యాది అప్సరలను ఓ మహర్షి తపస్సు భగ్నం చేయటానికి పిలుస్తాడు. ఆ ప్రహసనం అచ్చు సాఫ్ట్ వేర్ వాళ్ళ క్రైసిస్ మేనేజ్ మెంట్ మీటింగు లాగా ఉంటుంది. వారు చేసే ఫలితం ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతాడాయన. మరి అది ’ధ్వని’ మార్గమా అంటే? కాదు అనవలసి వస్తుంది.

ఇది ఒక్క చిన్న తునక మాత్రమే. సమగ్రంగా శ్రీనివాస ప్రబంధాన్ని కానీ, పండరీ భాగవతాన్ని కానీ, జనప్రియ రామాయణాన్ని కానీ అనుశీలించాలంటే సంస్కృత, ప్రాకృత, తెనుగు కవుల గురించి ఓ మోస్తరుగా తెలిసి ఉండాలి. ఇతర భాషాకవుల ధోరణులూ కొంత తెలియాలి. నవ్యత్వానికి ఆహ్వానించే దృక్పథమూ కావాలి.

ఇవేవీ లేకపోతే చాలా చక్కని ఆసక్తి అయినా కావాలి. అలవోకగా తెలియడం కుదరదు. మరి అలాగని ఆయన ప్రౌఢరచయితా? కాదు. ఆయన శివతాండవం వింటే చాలు. లేదా చదువుకుంటే చాలు. మేఘదూతమ్ కూడా అంతే. చదువుకుంటే చాలు.

సీమలో ఆరేళ్ళకు ఒకసారి మారెమ్మ జాతర అని ఒక జాతర వస్తుంది. ఆ రోజు పోతును ఒక్క వేటుతో నరుకుతారు. అస్సాదులనే ఒక తెగ వారు పూజలు చేస్తారు. పోతురాజు ఆ రోజు చాలా రౌద్రంగా ఉంటాడు.

ఆశ్చర్యమేమిటంటే – ఈ విషయాలు ప్రాచీన కాలంలో ఒకానొక ప్రాకృత కావ్యంలో కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. ఆ వర్ణనను సరిగ్గా పట్టుకుని అందించింది – స్వామి ఒక్కరే. ఇలాంటివి కొన్ని వందలు చెప్పాలి మరి.

మరొక విషయం. చాలా మందికి హిందుత్వం/వైదిక మతం అంటే బౌద్ధ మతాన్ని నిందించటం. సాంప్రదాయం అంటే కమ్యూనిజాన్ని/మార్క్స్ ను కాదనడం. ఇలాంటి అసమగ్ర దృష్టి స్వామికి లేదు. ఈయన బుద్ధుని, మార్క్స్ ను, వేదవ్యాసుని సమన్వయించగలరు. దాశరథి కవులు కూడా ఇలాంటి పని చేయగలిగిన మహానుభావులు.

(స్వామి – అనడం భక్తి/భజన కాదు. మా ఊళ్ళో స్వామి అని కొంతమందిని అంటారు. మా నాన్నను చాలా మంది స్వామి అనే వారు. నన్ను కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది స్వామి అనే వాళ్ళు. “ఏంది సామీ?” ఇది సీమలో మామూలు పిలుపు)

పుట్టపర్తి వారు సాహిత్య రంగంలోనే కాదు, నిజ జీవితంలోనూ పండితుడు. పండితుడు అంటే –

విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః ||

(విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మని విషయంలో, ఏనుగు విషయంలో, శునకం, శునకమాంసము తిను వాని విషయంలోనూ సమానత్వం పాటించెడు వాడు పండితుడు)

అన్న విధాన పండితుడు. బయటకు చాలా చాలా మామూలు వ్యక్తి. లోపల ఓ సముద్రం.

అయితే అయనను తెలుగు వారు గుర్తించింది లేదు. ఈ జాతికి పండితులను గుర్తించే సంస్కారం కానీ, వైవిధ్యతను అనుశీలించే చాతుర్యం కానీ, ప్రాధాన్యతలను తెలుసుకునే తెలివి కానీ లేవు. దురదృష్టవశాత్తూ జాతి తాలూకు బలహీనతలు కొందరిని తాకుతూ ఉంటాయి. ఆయన అందులో ఒకరు. నారాయణాచార్యులు అనగానే నిర్లిప్తత, “శివతాండవం” అని చేతులు దులుపుకోవడం … ఇదీ తీరు.

ఆయన ఒక్క శివతాండవమో, పండరీ భాగవతమో కాదు. ఆయన ఎన్నో విషయాల సమాహారం. ఇటు లోతుని, అటు పరిధిని నింపుకున్న వ్యక్తి. నిజానికి విమర్శ, పీఠిక, సంస్కృతరచనలు, తెలుగు వ్యాసాలు, చారిత్రక నవలలు, కథలు, ముక్తక కావ్యాలు, మహాకావ్యాలు, శతకాలు, ఆంగ్ల రచనలు, భావకవిత్వం ఇలాంటి అనేక ప్రక్రియలలో ఆయన విశ్వనాథ సత్యనారాయణ కు ఒక మెట్టుపైనే నిలుస్తారు. విశ్వనాథ నవలలతో పాపులారిటీ సంపాదించుకోవచ్చు గాక. కానీ విశ్వనాథ వారికంటే కూడా ఈయన అదనంగా కొన్ని ప్రక్రియలు చేశారు. వందల వేల పదసాహిత్య సృష్టి, ఇంకా అన్య భాష రచనానువాదాలు, గ్రంథ పరిష్కారాలు, పురాణోపన్యాసాలు ఈ ప్రక్రియలు విశ్వనాథకంటే అదనంగా చేశారు నారాయణాచార్యులు గారు. అంతే కాదు ఈయన బహుభాషా పండితుడు, వాగ్గేయకారుడు, సంగీతనిధి, ఆఖరుకు హరికథ దాసు కూడాను. విశ్వనాథ మధ్యాక్కరలతో ప్రయోగాలు చేస్తే, నారాయణాచార్యుల వారు మధ్యాక్కరలు వ్రాయటమే కాక, ద్విపద, షట్పది లాంటి వృత్తాలతో కావ్యాలే వ్రాశారు.

అటు వ్రజ భాషా సాహిత్యానికి మూలమైన తులసీదాసును, ఇటు మలయాళంలో ఎఝుత్తచ్చన్ ను, స్వాతి తిరునాళ్ ను, పంబన్ ను, కన్నడ పంపని, మరాఠీ భక్తిసాహిత్యాన్ని, అవపోసన పట్టిన వ్యక్తి ఈయన. ఈయనకు రామాయణం అంటే వాల్మీకి మాత్రమే కాదు, పంబన్, తులసీదాసు, విశిష్టాద్వైత వ్యాఖ్యానాలు, గాయత్రి మంత్ర వ్యాఖ్యానం, మురారి, భవభూతి ఇలా ఎన్నో. మహా భారతమంటే కవిత్రయమే కాదు, వ్యాసుడు, పంపడు, వేణీ సంహారకర్త ఇంకా ఎన్నో.

నిజజీవితంలోనూ ఆయన పంథాయే వేరు. తన స్వంత శిష్యులను తన పాపులారిటీ కోసం వాడుకోకుండా, తనకు వ్యతిరేకంగానే విమర్శలు వారితో వ్రాయించుకున్న లౌక్యం తెలీని మొరటు వాడు ఆయన. ఎవర్ని పడితే పేరొస్తుందో, ఎలా పడితే పేరొస్తుందో – ఈ లెక్కలు ఈయనకు తెలియవు. అసలవన్నీ పట్టించుకున్న పాపాన పోలేదు ఈ మనిషి.

అయితే ఈ వైవిధ్యాన్ని జీర్ణించుకోవడం, ఆయనను సరిగ్గా అంచనా వేయలేకపోవడం చేసింది తెలుగు జాతి. ఇది జాతిలక్షణాన్ని సూచిస్తుంది కానీ ఆ మనిషికి ఉన్న అంతస్తును సూచించేది కాదు. ఆయనకు పోయిందీ లేదు.

ఏది ఏమైనా ఆయన పని ముగిసి వెళ్ళిపోయేడు. ఆయన రచనలు అలా ఉన్నాయి. తెలుగు, సంస్కృత, ప్రాకృతాది కావ్యాలను అనుశీలించటానికి, సాహిత్యపు విభిన్నపార్శ్వాలను తరచి చూడటానికి ఈ జాతికి నారాయణాచార్యులే గొప్ప ఆకరం. అలాంటి అవసరాలు ఏర్పడినప్పుడు నారాయణాచార్యులు వంటి వాళ్ళ అవసరమే వస్తుంది.

ఈ రోజు ఆయన జయంతి అట.

You Might Also Like

2 Comments

  1. anyagaami

    నారాయణస్వామి గారు శిఖరం. యాదృచ్చికంగా దాశరథి వారి ‘జీవనయానం’ ఇప్పుడే పూర్తి చేసాను. మీరు చెప్పిన పోలిక ఏమిటో ఇప్పుడు స్పష్టమైయ్యింది. ఇద్దరూ ఋషులు, స్థితప్రజ్ఞులు. వారికి మన పొగడ్తలతో, ఖండనలతో ప్రమేయం లేదు. చక్కటి నివాళి.

  2. VSTSayee

    “చాలా మందికి హిందుత్వం/వైదిక మతం అంటే బౌద్ధ మతాన్ని నిందించటం.”

    ఆయనపేరెత్తకుండానే వ్యాసం సాగుతోందే అనుకున్నానుకానీ.. 🙂

    Regards,
    VSTSayee.

Leave a Reply