(శవ) సాహిత్యం మీదకి నా దండయాత్ర

అను MY EXPLORATIONS TO THE WONDROUS WORLD OF BOOKS

వ్యాసకర్త: సాయి పి.వి.యస్.
*********************
ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం సౌమ్య గారు తన సోదర పాఠక ప్రపంచంపై డిటెక్టివ్ సాహిత్యం గురించి సంధించి వదలిన ప్రశ్నపరంపరకి దీటైన సమాధానాలు వెతకటమే! అయినా…..

చాలామంది తాము ప్రస్తుతం ఏ పుస్తకాలు చదువుతున్నారు, ఇంకా ఏమేం పుస్తకాలు చదవాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలపైనే రాస్తున్నారు కానీ అసలు తాము ఈ wonder-land లోకి ఎలా ప్రవేశించారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి వగైరా తెలియ చేయటం లేదని, అలాంటి వ్యాసానికి నేనే అంకురార్పణ చేయాలని ఎన్నాళ్ళనుంచో నాకొక అభిలాష. నా పుస్తక పఠనం కూడా జానపద నవలలూ, డిటెక్టివ్ నవలలతోనే ప్రారంభమైనది, కాబట్టి ఆ అద్భత ప్రపంచంలోకి నేను అడుగు పెట్టిన అదృష్ట ఘడియల గురించి తెలియజేయవలసిన సమయము, సందర్భము ఇదేనని భావించి మొదటగా ఆ వివరాలు రాసినాక అనుబంధంగా సౌమ్య గారి ప్రశ్నలకి సమాధానాల్నివెతకటానికి ప్రయత్నిస్తాను. ఇందుకు పుస్తకం నెట్ సంపాదక వర్గము, సోదర పాఠకులు దయతో అంగీకరిస్తారని ఆశిస్తు, ప్రారంభిస్తున్నాను.

పన్నెండేళ్ళ వయసులో నాకు కుడి మోకాలు కింద tibia ఎముక విరిగింది. మర్నాడు ఫస్ట్ ఎయిడు చేసి, మరో రెండ్రోజుల తర్వాత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వేసి, రెండు నెలలు ఆ బాండేజ్ తో అలాగే మంచం మీద ఉండాలి తప్పదు అన్నారు డాక్టర్లు. హాల్లో కిటికీ పక్కన మంచం వేయించుకుని, వరండాలో — నా ముగ్గురు తమ్ముళ్ళు, వాళ్ళ మిత్రులు ఆడుకుంటుంటే చూస్తూ కాలం గడుపుతున్న నన్ను మా నాన్న observe చేసి ఉంటారు. ఆ రకమైన కాలక్షేపం వల్ల భవిష్యత్తులో నేనొక pervertగా మారతానేమోనని కూడా భయపడి ఉంటారు.

21 ఫిబ్రవరి 1965 ఆదివారం నాడు పడిపోతే, మళ్ళా ఆదివారం అంటే 28 ఫిబ్రవరి నాడు నా చేతిలో కృష్ణమోహన్ రచన, భేతాళలోకం — మొదటి భాగం అనే జానపద నవల పెట్టి, చదివి చూడు! నీకు నచ్చితే ఒకటి తర్వాత ఒకటిగా మిగిలిన ఏడు భాగాలూ తెస్తాను” అన్నారు. అప్పటికే చందమామ, బాలమిత్ర కథలు నెల నెలా క్రమం తప్పకుండా అణా లైబ్రరీలో చదవటం నాకు అలవాటు చేసేశారు. కానీ పుస్తకరూపంగా ఉన్న నవలలు, కథల పుస్తకాలు చదవటానికి అదే నాంది. అందువల్ల భేతాళలోకమూ, దాని రచయిత కృష్ణమోహన్ని ఇప్పటికీ మరచి పోవటం జరగలేదు. బాలసాహిత్యం అంటే ఇదేనని అనుకునే వాడిని. భేతాళలోకం మొదటిభాగం ఒకరోజులో చదివేయటమె కాక మిగిలిన భాగాలన్నీ రోజుకొకటి చొప్పున వారం రోజులు తిరిగేసరికల్లా మొత్తం పుస్తకం పూర్తయ్యింది.

అంతేకాక నేను చదువుతున్న పుస్తకం మొదలు, చివరా వచ్చే ప్రకటనల్లో ప్రచురణకర్తల రాబోయే ప్రచురణల వివరాలు; భేతాళలోకంలో అక్కడక్కడా footnotes లాంటివి ఎదురై, “మన ప్రతాపసింహుని మేనమామ కుమారశేఖర గుప్తా గురించి, ఆయన తన యవ్వనంలో చేసిన సాహసాల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ అభిమాన రచయిత కృష్ణమోహన్ రాసిన “కుమార విజయం” నాలుగు భాగాలు చదవండి”– వగైరాలు, నా పుస్తక పఠనానికి నిరాటంకమైన రాచబాటలు పరిచాయి. ఆవిధంగా ఒక పుస్తకం తర్వాత మరోటి వెదుక్కోనవసరం లేకుండా ఎలా చదువుకుంటూ పోవాలో నాకు పుస్తక పఠనంలో ఓనమాలు నేర్పినాయి.

తెలుగు మీడియంలో చదూకోటం వల్ల అప్పటికి ALICE ఎవరో నాకు తెలియదు కానీ నాకూ మాత్రం అంత కన్నా ఎక్కువ అదృష్టమే పట్టింది. నేను మంచంలో ఓ గుదిబండతో ఉన్నానని కానీ, రెండు నెలలు కదలలేననికానీ, టీవీలు లేని ఆ రోజుల్లో రెండు నెలలపాటు కనీసం సినిమాలు చూడటం కూడా సాధ్యం కాదని — ఇలాంటి ఎన్నో భయంకరమైన ఆలోచనలు రానివ్వకుండా ఆపిందా చిరు … చిరుపొత్తాల పుస్తక పఠనం. లేవటం, కాలకృత్యాలు వగైరా మంచం దగ్గరే కానిచ్చుకోవటం, కాఫీ, టిఫిన్లు తీసుకున్నాక, నా దగ్గరున్న పుస్తకంతో “అదిగో! నవలోకం! వెలసే నాకోసం” అనే హుషారైన ఊహలతో ఆ వండర్ లాండ్ కి వెళ్ళిపోవటం.

ఇక్కడనే చెప్పవలసిన ఒక చిన్న anecdote. మరో నాలుగు సంవత్సరాల తర్వాత అప్పటికి ఆంధ్రా మెట్రిక్ కి వచ్చిన నేను నా తమ్ముళ్ళకి ఇంగ్లీష్ చెపుతున్నపుడు ఒక పాఠంలో హెచ్.జి.వెల్స్ బాల్యం గురించి చదువుతూ ఆయన కూడా చిన్నప్పుడు 12-13 ఏళ్ళ వయసులో పాఠశాలలో ఫుట్బాల్ ఆడుతూ కాలు విరగ్గొట్టుకున్నాడని, అది యూరప్ కాబట్టి ట్రీట్మెంట్ జరుపుతున్న రోజుల్లో ఆసుపత్రి వారే వెల్స్ చదువుకోటానికి పుస్తకాలు ఇచ్చేవారని, అదే ఆయన ప్రపంచ ప్రసిద్ధ రచయిత కావటానికి దారితీసినదని చదివినపుడు ఒక్క క్షణం నేను నోబుల్ లారియేట్ ని అయిపోయినట్టుగ ఏమిటో పిచ్చి భావాలు. అలాగే, ఇటీవలనే అంటే సుమారుగా 2012లో చలసాని ప్రసాదరావుగారి ‘ఇలా మిగిలేం!’ చాలా లేటుగా మూడో ముద్రణకి వచ్చాక చదువుతున్నపుడు ఆయన పఠనా జీవితం కూడా ఇంచుమించు నా మాదిరిగానే ప్రారంభమైనట్టుగా తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి లోనైనాను. ఎంత దివ్యమైన దూర దృష్టితొ మా నాన్నగారు నా అందాల భవిష్యత్తుకి బంగారు బాటలు పరిపించారో అర్థం అయ్యింది.

నేను మళ్ళా మామూలు పరిస్థితికి రావటానికి పట్టిన నాలుగైదు నెలల కాలంలో నేను ఆ షాపులో ఉన్న పుస్తకాలన్నీ చదివేయటమే కాక పాత చందమామ సంచికలన్నీ బైండులుగా కుట్టి భద్రపరిచారని తెలిసి అవి కూడా చదివేసేశా! అలా అని మా నాన్నగారు—నా వయసు రీత్యా — నాచేత అన్ని రకాల నవలలూ చదివింపచేయలేదు ఆ సమయంలో. జానపదనవలలు మాత్రమే చదివించారు. డిటెక్టివ్స్, సాంఘిక నవలలు చదవనివ్వలేదు. ఆ తర్వాత జూలైలో మా మాతామహుని ఊరికి వెళ్ళినపుడు ఆ పల్లెటూళ్ళో పొద్దు గడవక, పుస్తకాలు చదవటానికి అలవాటై పోయి ఉన్న నేను పరుపులు, పట్టెమంచం, భోషాణం వగైరాల కింద కనీసం చిరిగి, చివికిపోయిన పాత పత్రికలైనా దొరుకుతాయేమోనని వెతుకుతుంటే …
అప్పుడు దొరికింది అపూర్వ చింతామణి.
కొమ్మూరి సాంబశివరావుగారి ఆణిముత్యం.
తెలుగు డిటెక్టివ్స్ లో క్లాసిక్!
!!!!!!!పట్టుకుంటే లక్ష!!!!!!!
అబ్దుల్ రజాక్ ని సృష్టించిన ఈ సాంబశివరావు నా హృదయ పీఠంలో అప్పటికే అధిష్టించి ఉన్న మరో సాంబశివరావు పక్కన దర్జాగా కూర్చున్నారు. ఆ మొదటి సాంబశివరావు మా నాన్నగారు.

1960లలో కొమ్మూరి సాంబశివరావుగారు.

కౌముది వెబ్ మేగజైన్ సౌజన్యంతో. రచయితని అభిమానించటం నా జీవితంలో కొమ్మూరి వారితోనే ప్రారంభమైనది. కొమ్మూరి సాంబశివరావుగారి గురించి మరింత సమగ్రంగా, సోదాహరణంగా తెలుసుకోవాలనుకుంటే koumudi.netలోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్రంథాలయంలో అంతరంగ తరంగాలు అనే పుస్తకం క్లిక్ చేసి 26వ పేజీ తెరవండి. చాలు. అంతే! మీకిక సాంబశివరావు గారి గురించి తెలియని విషయం ఉండదు. అంతకుముందు కొవ్వలి రాసిన జగజ్జాణ 25 భాగాలు చదువుతున్నపుడు రచయిత రచనా శక్తికి అబ్బుర పడ్డానే తప్ప surrender అయిపోవటం జరగలేదు.

బిగ్ బాంగ్ లాగా కొమ్మూరి, యుగంధర్ నా పఠనా జీవితంలోకి ప్రవేశిస్తే, అదేం మహత్యమో కానీ విశ్వప్రసాద్, భగవాన్ మాత్రం చాపకింద నీరు లాగా, ఉరమని పిడుగు లాగా ప్రవేశించారు. విశ్వప్రసాద్ ఏ రచన ??? నాకు ఆయన పట్ల నా ఆరాధనని పెంచింది అనే విషయం నేనెంత ఆలోచించినా గుర్తుకి రావటం లేదు. ఎప్పుడో అర్థశతాబ్ది క్రితం నాటి మాట మరి.

మార్కెట్ లోకి వచ్చిన విశ్వప్రసాద్, కొమ్మూరి రచనలు దాదాపు అన్నీ వదిలి పెట్టకుండా చదివేశానని ఘంటాపథంగా చెప్పలేను కానీ… అపరాధ పరిశోధక నవలలు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయని ఈ జానర్ లో వరుసగా కొన్ని డిటెక్టివ్ నవలలు చదివాక నా చిన్న బుర్ర గ్రహించగలిగింది. కేవలం మేథోశక్తి, లాజిక్ ఆధారంగా సాగే యుగంధర్ మార్కు పరిశోధనాత్మక నవలలు. ఎంత క్లిష్టమైన కేసైనా ఈయనా, ఈయన అసిస్టెంట్ రాజునే అవలీలగా తేల్చేసి నేరస్తుణ్ని చట్టానికి అప్పగిస్తారు. ఏప్పుడో ఒకసారి — అవసరం కన్నా వరైటి కోసం — ఓ నాన్ ఇండియన్ NRI GIRL కాత్యా వచ్చి సహాయం చేస్తూంటుంది. “చిత్ర”గారి లాయర్ గాండీవి అపరాధ పరిశోధనలు కూడా ఈ కోవకే వస్తాయి. ఎవరీ “చిత్ర”? ఎవరా లాయర్ గాండీవి? అంటారా? ఉండండి. కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను.

వీటికి పూర్తి భిన్నంగా ఉంటాయి విశ్వప్రసాద్ రాసిన భగవాన్ పరిశోధనలు. నేర పరిశోధనలో భగవానే కాక అతని ఇంటిల్లిపాదీ పాలుపంచుకుంటారు. వీరందరూ కాక లై డిటెక్టరూ, TV యాంకర్ అనసూయ ఉపయోగించిన కనిపించని కెమెరాలూ లాంటి ఎలక్త్రికల్, ఎలక్త్రానిక్ గాడ్జెట్లూ, డివైసులూ సరే సరి.
మనం ఏమాత్రం ఉహించలేనటువంటి అద్భుతమైన ప్రపంచంలోకి మనలని ముకుతాడు పోసి తీసుకెళ్ళిపోతారు. ఇంటిల్లిపాదీ అంటే భగవాన్, ఆయన భార్య (పేరు గుర్తుకి రావటం లేదండీ ఎంత ఆలోచించినా very very sorry), ఆయన అసిస్టెంట్ రాంబాబు, అతని భార్య కిరణ్మయి, ఈ కుటుంబపు వంట మనిషి భార్గవ. భార్గవ పేరుకి వంట మనిషే ఐనా, తెలివితేటలలోనూ, ముఖ్యంగా శారీరక సౌష్టవంలోనూ అతను భగవాన్ కి ప్రతిరూపం, replica, duplicate. భగవానూ, భార్గవా మిగతా ముగ్గురితో కలిసి, కేటూ-డూప్లికేటూ ఆడుతూ నేర ప్రపంచాన్ని పెట్టిన ముప్పుతిప్పలు చదివి తీరవల్సిందే తప్ప వర్ణించటం సాధ్యం కాదు. విశ్వప్రసాద్ డిటెక్టివ్ రచనలు అన్నీ కాకపోయినా కనీసం ఈ కేటూ–డూప్లికేటూ తరహా పరిశోధనలు ఉన్న కాసినీ (లభిస్తే) చదివితే సౌమ్య గారి సందేహాలకి సమాధానం తప్పక లభించగలదని నా విశ్వాసం. డిటెక్టివ్ గా భగవాన్ ఒక ప్రదేశంలో ఉంటూనే మరో రెండు మూడు చోట్ల కూడా ఉన్నట్లుగా ఎలీబీ వాతావరణం సృష్టించాల్సి వచ్చినపుడు; ఖర్మం చాలక, ప్లాటు రీత్యా భగవాన్ వైరివర్గం డెన్ లో సింగంలా చిక్కుపడ్డప్పుడు, రాంబాబు సూచనల మేరకు భార్గవ భగవాన్ కి imposter లా తయారై చిక్కుపడ్డ సింగాన్ని విడిపించిన రచనా చమత్కృతులు అప్పట్లో విశ్వప్రసాద్ ని నేటి యండమూరి లాగా ఓ హౌజ్ హోల్డ్ రచయితగా మార్చేశాయి.

వీరిద్దరితో పాటు, నే చదివిన మరికొంతమంది ఇతర రచయితల గురించి వారి రచనల గురించి ఇక్కడ కాసేపు చెప్పుకుందాం. విశ్వప్రసాద్, కొమ్మూరి తర్వాత నన్ను బాగా ఆకర్షించిన డిటెక్టివ్ రచయితలు డాక్టర్, చిత్ర, వి.యస్.చెన్నూరి వగైరా. డాక్టర్ రచనలలో డిటెక్టివ్ ఎవరో ఇప్పుడు జ్ఞాపకం లేకపోయినా “చిత్ర” రచనలు బాగా ఆకర్షించేవి. ఈమె/ఈయన రచనల్లో డిటెక్టివ్ లాయర్ గాండీవి— బహుశా పెర్రిమేసన్ కి ట్రూకాపీ నేమో! తెలుగు మీడియంలో చదువు కుంటూ, తెలుగు సినిమాలు, నవలలతో మమేకం అయ్యే ఆ రోజుల్లో ఈ లాయర్ గాండీవిగారు లాజిక్ తో చేసే నేర పరిశోధనలు నా “తెలుగుబుర్ర”కి నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉండేవి.

మల్లాది వెంకట కృష్ణమూర్తి జూలాజికల్ ఫాంటాసీ నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త! కన్నా ఎంతో ముందుగానే వియస్ చెన్నూరి ఓ బొటానికల్ ఫాంటాసీ రాశారు. పేరు గుర్తుకి రావటం లేదు.ఆ రోజుల్లో నా చేతిలో ఉన్న ఏదో ఒక డిటెక్టివ్ నవలని చూడటం తటస్థ పడితే మా అమ్మ విందుకు వెళ్ళిన విమల చదివావా? లేకపోతే వెంటనే చదువు అని తగులుకుంటూ ఊండేది. ఈ విమల టెంపోరావ్ గారి సృష్టి. డిటెక్టివ్ వాలి. చర్చిల్ చుట్టలు గుప్పు, గుప్పున పీలుస్తూ కేసులన్నీ అవలీలగా పరిష్కరిస్తూ ఉంటారు.

ఈ రచనలన్నీ నేను at randomగా చదూకుంటూ పోయానే తప్ప చదవటానికి కూడా ఓ పద్ధతి, ప్రాతిపదిక వగైరా అవసరం అనే ప్రాథమిక విషయాలు తెలియని వయసు మొదటి కారణం ఐతే రెండవది నేను చదివేది పుస్తకానికి అణా అద్దె వసూలు చేసే లైబ్రరీ నుంచి. అటువంటి చోట మనం అడిగిన పుస్తకాలు అడిగిన వెంటనే ఇస్తారా?? కృష్ణమోహన్ తర్వాత నా చేతికి భయంకర్ రచన జగజ్జాణ అందింది. ఇది 25 భాగాల మహత్తర నవల. ఆరోజుల్లో ఈ భయంకర్ ఎవరో తెలియక పోయినా జానపద నవలలు రాయటంలో ఈయనది అందెవేసిని చేయి, అనితర సాధ్యమైన శైలి అని ఆయన రచనలు జగజ్జాణ, విషకన్య వగైరాలు చదివి తెలుసుకున్నాను. ఈయనే ఒక్క చేతి మీదుగా వెయ్యి నవలలు రాసిన “కొవ్వలి” అని…. 40 సంవత్సరాలు గడిచాక ఈ మధ్యనే గొల్లపూడి వారి వ్యాసం చదివినాక అర్థమైంది. కొవ్వలి జానపద నవలలే కాక డిటెక్టివులు కూడా రాసాడు కానీ… అది అనితరసాధ్యంగా కాదు. కాబట్టి భయంకర్ డిటెక్టివ్ నవలలని నేను ఒకటి రెండు కన్నా ఎక్కువ చదివిన జ్ఞాపకం ఏదీ లేదు.

కృష్ణమోహన్, టెంపోరావ్, డాక్టర్, చిత్ర; ఇవన్నీ నాటి చిరుపొత్తాల రచయితల కలం పేర్లు. “టెంపొరావ్” భలే విలక్షణమైన కలంపేరు. విశ్వప్రసాద్ కూడా కలం పేరే అని నా అనుమానం. ఎందుకంటే ముందు ఇంటిపేరు, పేరుకి చివర సామాజిక వర్గాన్ని తెలియ చేసే ఉపసర్గలు లేవంటే అది almost కలంపేరే నన్నది చెప్పకనే చెప్పే సత్యం.

కొవ్వలితో జంటగా వినిపించే పేరు “జంపన”. కొవ్వలి కలం పేరు భయంకర్ అని తెలుసుకున్నాను. అలాగే జంపన కూడా ఏదైనా కలం పేరుతో రాసారేమో తెలియదు కనుక ఆయన రచనలు ఏవైనా చదివానో లేదో నాకే తెలియదు. నా అంచనా, నా observation కరెక్ట్ ఐతే కృష్ణమోహన్ అనే కలం పేరు జంపన గారిది కానీ లేదా మానాపురం అప్పారావు గారిది కానీ అయ్యుండాలి. సిని నటుడు కాంతారావ్ సినిమాలు గండర గండడు, సప్తస్వరాలు వగైరాలకి కథా రచయిత కృష్ణమోహనే! మానాపురం అప్పారావు అనే సినిమా దర్శకుడు ఉండేవారు. ఆయన కలం పేరుతో చిరుపోత్తాలు రాసేవారుట. ఈయన కలం పేరు ఏమిటి? పైవారి అసలు పేర్లు ఏమిటి?

వెబ్ మాగజైన్ “కౌముది” సంపాదకులు కిరణ్ ప్రభ గారి ప్రేరణతో ఏ గొల్లపూడి వారో, అటు చందమామ నుంచి ఇటు అపరాధ పరిశొధన వంటి మాస పత్రికలకి పూటకాపు ఐన “వసుంధర” గారో, లేదా నవ్య వారపత్రికలో దాని సంపాదకులు జగన్నాథ శర్మ గారు కానీ, 1950—60ల నాటి చిరుపొత్తాల సాహితీ వేత్తల గురించి, వారు చేసిన సాహిత్య సేవ గురించి ఓ విపులమైన, విశ్లేషణాత్మకమైన వ్యాసం వ్రాస్తే తప్ప ఈ సంశయాలు వీడవు.

ముళ్ళపూడి వారు కొ-కొ-కొ-రా-కో అంటు తన కోతికొమ్మొచ్చిలో శ్లాఘించినది ఈ మహితాత్ముల గురించే కదా! ఇప్పుడు వీరితో నా పరిచయ భాగ్యం గురించి కొంత ముచ్చటిస్తాను. వీరిలో రా-కో లని మిహాయిస్తే మిగిలిన ముగ్గురినీ చదవటమూ వారి రచనల నుంచి ప్రేరణ పొందటమూ జరిగింది. కొవ్వలి జానపదనవలలూ, కొమ్మూరి అపరాధ పరిశొధక నవలలూ ఓ ఐదారు సంవత్సరాలు పాటు అలాయిదాగా చదివి బాల్యావస్థ దాటి, అత్తెసరు మార్కులతో ఆంధ్రా మెట్రిక్ పాసైనాననిపించుకున్నాక ఆర్థిక, ఆరోగ్య, (విద్యా) చట్టపరమైన కారణాల వల్ల పై చదువుని కొంతకాలం అటక ఎక్కించక తప్పనప్పుడు, ఉబుసుపోక కోసమో, విజ్ఞానం కోసమో మావూళ్ళో ఉన్న మూడు లైబ్రరీల్లో సభ్యునిగా చేరాను. కొకు గారి పానకంలో పీచు వంటి కథా సంపుటాలు తరచుగా చేతికి తగులుతూ ఉండేవి. వాటిలో కురూపి పెద్ద కథకి ఆకర్షితుడనై కొకు సాహిత్యంతో చెలిమి ఏర్పడింది. మరి కొన్నాళ్ళకి చదువు నవల చదవటంతో ఆ చెలిమి కాంక్రీటు మాదిరిగా బలపడింది.

ఇక కొ-కొ-కొ-రా-కో లో “రా” అనే రాధాకృష్ణ రచనలు ఆ రోజుల్లో నాకు తారసపడలేదు. ఈయన రచనలు కూడా చదవండి అని నా కెవరూ చెప్పలేదు. కాబట్టి ఆయనని వదిలేద్దాం. ఇక మిగిలిన కో అనే కోడూరి కౌసల్యాదేవి గురించి. ఈమె చక్రభ్రమణం నవల ఆంధ్రప్రభలో సీరియల్ గా వస్తున్నపుడు నేను కొ.కొ.(కొవ్వలి, కొమ్మూరి)ల చిరు పొత్తాలు చదూకునే వయసు నాది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆ నవల చదవటమే కుదరలేదు. సినిమా మాత్రం చాలాసార్లు చూసాను. ఇంకా కొన్ని సార్లు చూడమన్నా చూస్తాను. ఆమె మిగిలిన నవలల్లో శాంతి నికేతన్, ప్రేమ నగర్ వంటివి చదివాను. ఆమె శైలి విలక్షణమైనది. కానీ అది నాకు అంతగా నచ్చలెదు. THAT’S ALL.

సాహిత్యంలో అప్పటి boom ఐన శరత్ సాహిత్య విషయంలొ కూడా నా అభిప్రాయం ఇదే! దురదృష్టవశాత్తూ నేను చక్రపాణి గారి బెంగాలీ అనువాదాలు ముందుగా చూడటం సాధ్యపడలేదు. శ్రీకాంత్, చరిత్రహీన్ అని అందరూ లొట్టలేసుకుని మరీ చదూతున్నారు కదాని మా అణా లైబ్రరీలో సిద్ధంగా ఉన్న అనువాదాలేవో తెప్పించి చదవటానికి ప్రయత్నిస్తే పట్టుమని పది పేజీలు కూడా ముందుకి సాగలేదు. శరత్ కి ఫుల్ స్టాఫ్ పెట్టేశాను చాలాకాలం పాటు. ఈ మధ్యనే చక్రపాణి గారి నాటి అనువాదాలు వెలగా వెంకటప్పయ్య గారి సంపాదకత్వలో పునర్ముద్రణ పొందినాక కావలసినవి కొన్ని తెప్పించుకున్నాను.

కొవ్వలి లాగా భారీ (సీరియల్) పాపులర్ నవలలు రాసినా ముళ్ళపూడి వారి ఇంటింటి రచయితల జాబితా లోకి చేరని అత్యంతాకర్షక రచయితలు మరొక ఇద్దరున్నారు మన తెలుగులో. ఒకరు మహా మాయ అనే 24 భాగాల భారీ జానపద నవల రాయటమే కాక 24 భాగాలే కల డిటెక్టివ్ నవల కూడా రాసిపారేశారు. ఆ నవల పేరు “డిటెక్టివ్ ఇంద్రజిత్” అపరాధ పరిశోధనలో వరస పెట్టి నవలలు రాయటం కొత్త ఒరవడి. ఏందుకంటే చేయి తిరిగిన కొమ్మూరి, విశ్వప్రసాద్ వగైరాలందరూ సింగిల్ పన్నా నవలలే రాసారు కానీ, చిరుపొత్తాల సీరియల్ నవలలు రాసిన దాఖలా ఎక్కడా లేదు. ఇంతకీ ఇలా 24 భాగాలేసి నవలలు ఎడాపెడా రాసిన ఈ రచయిత “కనకమేడల”. అప్పట్లో ఆ రచయిత గురించి అంత మాత్రమే తెలుసు. ఎంత ప్రయత్నించినా ఆయన నవలలు ఒక్కటీ చదివే భాగ్యం ఇప్పటికీ కుదరలేదు. కారణం కనకమేడల రచనలేమీ తన దగ్గర లేవని మా బుక్ షాప్ ఓనరు చెప్పాడు. ఆ షాపులో లేకపోతేనేమి, మనం కొనుక్కోవచ్చుగా అని మా నాన్నగారిని నేను అడగ లేదు. ఇటువంటి నవలలని ఇలా అణా లైబ్రరీలోనే చదవాలి అనే బూర్హువామనస్తత్వం నాలో ఏదో ఉండి ఉంటుంది. అంతెందుకు ఆ తర్వాత ఐదేళ్ళకి 1970లలో మా ఊళ్ళో ఉన్న మూడు లైబ్రరీలలోనూ సభ్యత్వపు కార్డులు తిసుకున్నాక కూడా ఎప్పూడు ఈ లైబ్రరీలలో కనకమేడల పుస్తకాల కోసం వెదకటం కానీ, లైబ్రేరియన్ని అడగటం కానీ చేయలెదు అంటే ఆ పై మెంటాలిటీ బలంగా పాతుకుపోయి ఉంటుంది.

ఆ మధ్య కంప్యూటర్లో వెతుకుతున్నపుడు “కనకమేడల” అంటే కనకమేడల వెంకటేశ్వర్రావు అని, గుడివాడ ప్రాంతానికి చెందిన వారనీ, ఆయన erstwhile రచనలు మనకే కాదు ఆయన వారసులకి కూడా అలభ్యాలు అనీ, వారు కూడా ఆ పాత రచనలు కలిగిన వదాన్యుల కోసం అన్వేషిస్తున్నారనీ తెలిసింది. “నువ్వు చదవాలనుకుంటున్న కొన్ని రచనలు ఒక జీవితకాలం లేటు అనే నిరాశతో డిటెక్టివ్ ఇంద్రజిత్ ని వెదికే పరిశోధనకి full stop పెట్టేశాను.

నేను ఏ శుభ ముహుర్తంలో సాంఘిక తెలుగు నవలలు చదవటం ఆరంభించానో, నేను చదివిన మొదటి సాంఘిక తెలుగు నవల ఏదో చెప్పలేను కానీ ఈ జానర్ లో నన్ను మెస్మరైజ్ చేసి ఇలాంటి నవలలు చదవాలిరా బాబూ అని నా చేత పదే పదే చదివించిన ఆనాటి మరో రచయిత రావి శ్రీమన్నారాయణ. ఈయన అప్పటి వార, మాస పత్రికల వారికి పాతకాపు కాదు. పూటకాపు కూడా కాదు. ఈ మూస పత్రికాధిపతులతో ఈయనకి ఏదో ప్రచ్ఛన్న యుద్ధం ఉన్నట్టు నాకు అనిపించేది. ఆయన నవలలు అటు పత్రికల్లో కానీ, ఇటు ఎమెస్కొ, నవోదయ, నవభారత్ లాంటి ప్రచురణ కర్తలనుంచి కాక డైరక్టుగా అయనే ప్రచురించుకునేవాడు. చాలా విలక్షణమైన రచయిత. అద్భుతమైన శైలి. యద్దనపూడి, తొలినాళ్ళ రంగనాయకమ్మ, కావిలిపాటి, కొమ్మూరి వేణు మాదిరిగా పుస్తకం ఎక్కడ ఏ పేజీలో తెరచినా పాఠకుణ్ని చివరికంటా ముకుతాడు వేసి తీసుకుపోగల అనితర సాధ్యమైన శైలీ విన్యాసం. యండమూరి, మల్లాది కన్నా దశాబ్దం ముందుగానే తెలుగు పాఠక ప్రపంచానికి professional నవలలు పరిచయం చేసిన ప్రతిభాశాలి.

పూర్తిగా అలభ్యాలైన అప్పటి ఆ నవలల గురించి సాధ్యమైనంత క్లుప్తంగా…
దంత భవనం: నా పరిమిత జ్ఞానం మేరకు తెలుగులో వచ్చిన తొలి క్రికెట్ నవల. TVలు లేని ఆరోజుల్లో క్రికెట్ గురించి సాధికారంగా తెలియచేస్తూ గారీ సోబర్స్, అజిత్ వాడెకర్, బేడీల గురించి పిట్ట కథలు ఎన్నో, ఎంతో ఆసక్తికరంగా చెప్పిన నవల.

రచయిత భార్య: బుచ్చిబాబు లగా ఓ magnum opus నవల రాదామని కూచున్న రచయితకి అతని భార్యే ప్రథమ ప్రతిబంధకం ఐతే…..!? ఆలర్ట్ మొ రేవియో ఇటాలియన్ నవలకి స్వతంత్ర రచనా అనిపించగల చక్కని అనువాదం.

లేడీ టైపిష్ట్: సులోచనారాణి రాజశేఖర్– జయంతి జ్ఞాపకానికి వస్తున్నారా?? డిజిటల్ లైబ్రరీలో దొరికే అవకా శం ఉందా? ప్రయత్నించండి.

రేడియో సిలోన్: ఆకాశవాణికే కాలం చెల్లిపోతున్న ఈ రోజుల్లో రేడియో సిలోన్ గురించి ఎమైనా వ్రాసినా అర్థం చేసుకుని ఆస్వాదించగలగటం చాలా కష్టం. శ్రీలంకలో పులులు విచ్చలవిడిగా సంచరించని స్వర్ణయుగానికి ప్రతీక రేడియో సిలోన్. బినాకా గీత్ మాలా, ఏక్ ఔర్ అనేక్, ప్రతిదినం సాయంకాలం 4-30 నుంచి 5 గంటల దాకా మీనాక్షి పొన్నుదురై వంటి తమిళ అనౌన్సర్లు తమిళ యాసతో చెప్పే తెలుగు సినీ గీత్ మాల, వగైరాలు ఆ స్వర్ణ యుగం నాటి నాస్టాల్జియా!.

15. 1965లో మొదలు పెట్టి ఓ దశాబ్దం అటూ ఇటూగా డిటెక్టివ్ నవలలే చదువుతూ వచ్చిన నేను ఆ తర్వాత ఆ తరహా నవలలపై వెగటు పుట్టి చదవటం మానేశాను. పట్టుకుంటే లక్ష నేను చదివిన మొదటి డిటెక్టివ్ నవలే కాదు తెలుగు సినిమాకి ఎక్కిన తొలి డిటెక్టివ్ కూడా అదే! నాగభూషణం డిటెక్టివ్ యుగంధర్ గానూ. కృష్ణ “రాజు” గానూ నటించారు. 1971 మేలో పట్టుకుంటే లక్ష అదే పేరుతో విడుదలైంది. కాలాతీత వ్యక్తులు (చదువుకున్న అమ్మాయిలు), చక్రభ్రమణం (డాక్టర్ చక్రవర్తి), నవలలు సినిమాలుగా వచ్చినపుడు చూసిన జనం “సినిమా కంటే నవలే బాగుంది” అని చప్పరించేసినట్టుగా ఈ పట్టుకుంటే లక్షని కూడా అలాగే చప్పరించేశారు. దాంతో ఆ తర్వాత ఒకటి రెండు నవలలు తప్ప కొమ్మూరి వారి మిగతా డిటెక్టివ్ నవలలు తెరమీదకి ఎక్కలేదు.
ఆ తర్వాత ప్రయత్నం విశ్వప్రసాద్ నవలల మీదకి కాకుండా డైరక్టుగా ఆయన మీదకే లంఘించారు. అంటే ఏం లేదు, ఆయన రచనా పాటవాన్ని, ఆయన అపురూప సృష్టి భగవాన్ని మాత్రమే ఉపయోగించుకుని జగత్ కిలాడీలు అనే సినిమాకి ఆయన చేత సంభాషణలు రాయించారు. భగవాన్ ప్రతిభా పాటవాలుగల డిటెక్టివ్ గా కాక ఆ పేరుకి ఉన్న పాపులారిటి డబ్బు చేసుకోవాలనే దుర్భుద్ధితో భగవాన్ ని ఒక imposterలా చూపించారు. వెటరన్ యాక్టర్ గుమ్మడి గారు ఈ imposterలా అగుపించారు. ఒరిజినల్ భగవాన్ లాంటి పాత్రలో యస్వీ రంగారాయుడుగారు కనిపిస్తారు కానీ అక్కడా మళ్ళా ఎంగిలి మెతుకులే. అప్పటికి రెండు మూడేళ్ళ కిందట సేలమ్ థియేటర్స్ వారు తమిళ, తెలుగులలో జాయింటుగా ఓ డిటెక్టివ్ తరహా సినిమా తీశారు. అది వల్లవనక్కు వల్లవన్ లేదా మొనగాళ్ళకు మొనగాడు. ఇందులో యస్వీయార్ “కత్తులు రత్తయ్య” అనే ఓ కొత్త పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ రత్తయ్య గెటప్ ని ఇక్కడ మళ్ళా జగత్ కిలాడీలు లోకి లాక్కొచ్చారు. దాంతో సినిమా కిచిడీ అయికూర్చుంది. కొమ్మూరి నిబద్ధత గల రచయిత. సినిమా రంగం ఎంగిలి మెతుకులకొసం యుగంధర్ని అమ్ముకోలేదు.

కానీ మరింత పాపులారిటీ కోసమో లేక ధనాపేక్షతోనో విశ్వప్రసాద్ భగవాన్ ని తాకట్టు పెట్టేశారు. ఫలితం తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం అంపశయ్య ఎక్కింది. 70వ దశకం కదా! వార/మాస పత్రికల పోరు, రచయిత్రుల జోరు, సీరియల్ నవల హోరు బ్రహ్మాండంగా సాగుతున్న రోజులు. జ్యోతి లాంటి సాహిత్య మాస పత్రిక “పత్తేదారు”అనే ఫక్తు డిటెక్టివ్ మాసపత్రికని ప్రారంభించింది. శ్యామా దామోదరరెడ్డి గారి అపరాధ పరిశొధన ఉండనే ఉంది. ఇవి కాక ఇంకా సెర్చ్ లైట్ వగైరా చాలానే ఉండేవి. ఈ పత్రికలకి పాతకాపు పూటకాపు కూడా విశ్వప్రసాదే కదా! దాంతో ఏ డిటెక్తివ్ పత్రిక తిరగేసినా విశ్వప్రసాద్ రచన, భగవాన్ పరిశోధన అనే టాగ్ లైన్లతో యస్వీ రంగారాయుడి గారి కత్తుల రత్తయ్య ఫొటోలు, “బే! ఘూట్లే!” అనే డైలాగులు. డిటెక్తివ్ పత్రికలు తెరవాలంటేనే కంపరం పుట్టుకొచ్చేది. డిటెక్తివ్ సాహిత్యమంటేనే రోత కలిగేది. ఫలితం: విశ్వప్రసాద్, భగవాన్ ఫేడౌట్ కాక తప్ప లేదు. వయసురీత్యా అనారొగ్య కారణాలచే కొమ్మూరి కలం మూసేశారు.

అప్పటి ఆ శూన్య స్థితిలో యండమూరి, మల్లాది; వీరి ప్రేరణతో ఇంకా అనేకానేకమంది — అపరాధ పరిశోధక నవల అనే సెపరేట్ టాగ్ లైన్ లేకుండా సాంఘిక నవలలకే క్రైం, డిటెక్షన్ జోడించి అదనంగా సస్పెన్స్ అనే మసాలా బాగా దట్టించి థ్రిల్లర్స్ రాయటం ఆరంభించారు. అభిలాష, చంటబ్బాయ్, లిటిల్ రాస్కేల్ మచ్చుకి కొన్ని. ఆ విధంగా శవ సాహిత్యంగా (అ)గౌరవమో, గుర్తింపో పొందిన crime fiction ఆ జీర్ణ వస్త్రాలని త్యజించేసింది.

ఇక స్వ విషయానికి వస్తే, మెట్రిక్ పాసైనంత మాత్రాన ఉద్యొగం రాదనీ ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఎంతో అవసరం అనీ తెలిసొచ్చి కొనాళ్ళు, తెలుగు పత్రికలు పుస్తకాలు పక్కన పెడితే తప్ప పరువు దక్కదనీ తెలిసి, ఇంగ్లీష్ చందమామా, సిడ్నీ షెల్డానూ వెంట పడ్డాను.చిట్ట చివ్వరగా చెప్తున్నా మొట్ట మొదటనే చెప్ప వలసిన విషయం నాకు పుస్తకాలు అణాకి అద్దెకిచ్చి నా సాహిత్య దండ యాత్రలకి ఏంతో సహాయ సహకారాలందించిన ఆ లైబ్రరీ: శ్రీ లక్ష్మి ఫాన్సీ, కంగన్ హాల్ అండ్ లైబ్రరీ, కర్ర వంతెన ఎదురుగా, స్టేషన్ రొడ్, ఏలూరు. సౌమ్యగారి ప్రశ్నలకు పూర్తి సమాధానాలు మరింత విపులంగా విశదంగా త్వరలో రాసి పంపిస్తాను. ప్రస్తుతానికి సెలవ్!

You Might Also Like

Leave a Reply