గాయపడ్డ ఆదివాసి సంధించిన ‘శిలకోల’

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
[రచయిత మల్లిపురం జగదీశ్ ‘శిలకోల’కి డాక్టర్ మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారం – 2012 యిచ్చిన సందర్భంగా (ఫిబ్రవరి 25, 2013) చేసిన ప్రసంగం]
*************

‘నా వాళ్ళ బ్రతుకు గాయాల మయం. వ్యాపారం, వస్తు వ్యామోహం ఎక్కువయిన నేపథ్యంలో ఆదివాసీల మనుగడ మరింత సంక్లిష్టమైంది. నా అక్కచెల్లెళ్ళ మాన ప్రాణాలకు విలువనివ్వని ‘వాకపల్లి’ సంఘటనలు … కంటి మీద కునుకు పట్టనివ్వని ‘గ్రీన్ హంట్’లు , సల్వాజుడుంలు అడవిని మాకు కాకుండా చేసే ఎత్తుగడలే.’
కొండకి నమస్కరించి  (శిలకోల కథల సంపుటి, ముందుమాట – 2011)

ఇది అడవి బిడ్డ మల్లిపురం జగదీశ్ ఆవేదన. రచయితగా జగదీశ్ ఆదివాసి బతుకు గాయాల మయం కావడానికి, మనుగడ సంక్లిష్టం కావడానికి కారణాలు తెలుసుకొన్నాడు. ఆ గాయాలకు ఆకుపసరు కోసం అడవీ కొండా గాలిస్తున్నాడు. తన నేలకి తాను పరాయి అవుతోన్న వైనాన్ని చూసి బిత్తరపోతున్నాడు. అడవి నుంచీ ఆదివాసిని వేరు చేస్తున్న కుట్రల్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాడు. వెంట్రుక వేసి కొండని గుత్తగా గుంజుకుపోతున్న ధోకాబాజీల అతి తెలివికి సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు. తమ సంస్కృతి నుంచి తమను దూరం చేసున్న నాగరిక దుర్మార్గాన్ని నిక్కచ్చిగా నిరసిస్తున్నాడు. ప్రకృతితో ముడివడివున్న ఆదివాసి సంస్కృతిని కొండ నెత్తమ్మీద నిలబెట్టి చూపుతున్నాడు. తన లోపలి కల్లోలాన్ని కథలు గట్టి మనలోకి నేరుగా ప్రవహింప జేస్తున్నాడు.

ఆదివాసీలకు ‘విత్తనం నాటితే పండుగ. మొలకెత్తితే పండుగ. పూస్తే పండుగ . కోత కోస్తే పండుగ. ఎంత గొప్ప సంస్కృతి!! ప్రకృతి మార్పులకనుగుణంగా సాంప్రదాయ గిరిజన జీవితం !!!’ కానీ యిప్పుడు కొండ మీద కంది కొత్తల్లేవు. ధింసా అడుగుల్లేవు. తుడుం దెబ్బల్లేవు. డప్పుల మోతల్లేవు. కిన్నెర పాటల్లేవు. పిన్లకర్ర రాగాల్లేవు. జాకరమ్మ పూజల్లేవు. గొడ్డలమ్మ ముస్తాబుల్లేవు. ‘దుర్ల’ దూకుడు లేదు. ‘శతర’ ఆట లేదు. జీలుగు కల్లు ఇప్పసారాల మత్తు లేదు. అన్నీ మాయమై పోయాయి. వాటి స్థానంలో హై వాల్యూం స్టీరియో డెక్ మ్యూజిక్ లు రికార్డింగ్ డ్యాన్సులు డిస్కో చిందులు హేపీ న్యూ యియర్లూ బ్రాందీ విస్కీలు బిర్యానీ పార్టీలు గడప గడపనా పేకాటలు పాన్ పరాగ్ లు ఖైనీలు చొచ్చుకు వచ్చాయి. కొండ శిరస్సుపై డిష్ ఏంటినాలు మొలిచాయిలైవ్ క్రికెట్ మ్యాచ్ లు, సీరియల్లు, ఎఫ్ టీవీలో అర్థ నగ్నంగా అమ్మాయిలు చేసే కేట్ వాక్ లు అడవిలోకి దావానలంలా దర్జాగా నడిచొచ్చాయి. సెల్ ఫోన్లూ విసిడి డివిడిల్లో బ్లూ ఫిల్మ్ లు అనేకానేక కొత్త మెమరబుల్ మూమెంట్స్ దెయ్యాల్లా వచ్చి చేరాయి. గిరిజన జీవితంలోని సామూహికత అదృశ్యమై పోయింది. ఇప్పుడు వూరు చినుకు రాలని చీకటి కొండలా వుంది. అందుకే జగదీశ్ కథల్లో కళ్ళ ముందే ‘వాయిదాల పద్ధతిలో బతుకంతా పరాయివాడి చేతిలోకి వెళ్ళిపోయింద’ని దిగులు ధ్వనిస్తుంది. ‘సుఖాల వేటలో మనిషి మృగమై పోతున్నాడ’ ని క్రోధం కనిపిస్తుంది. తన అక్కచెల్లెళ్ళ కలలు కాలుతున్న వాసన అతని అక్షరాల్లో ఘాటుగా ముక్కు పుటాల్ని తాకుతుంది. దారి తప్పి తిరుగుతున్న తన వాళ్లకి దారిల పెట్టాల’నే ఆర్తి వినిపిస్తుంది. ఆరిన నిప్పులా వున్న అడవీ కన్నీటి కుండలా వున్న కొండా గుండెకోతకి కారణమౌతాయి. ఆరిన నిప్పులా వున్న అడవీ కన్నీటి కుండలా వున్న కొండా గుండెకోతకి కారణమౌతాయి. అంతరించిపోతున్న స్వీయ సంస్కృతిమీద అలవి కాని అనురాగం పెల్లుబుకుతుంది. మాయమై పోతున్న మానవ సంబంధాలని నిలుపుకోవాలనే తపన తడి తడిగా తగులుతుంది.

శిలకోల సంపుటిలో లో కథలన్నీ 2000 తర్వాత రాసినవే కానీ వాటిలో వర్ణించిన జీవితం మూడు తరాలది. జగదీశ్ తన తాతలనాడు కొండ బిడ్డని షావుకార్లు సొండీలు బుగతలు దోచుకొన్న వైనం గురించి , దానికి వ్యతిరేకంగా గురువుల అండతో చేసిన సాయుధ పోరు గురించి విన్నాడు. తన తండ్రుల కాలంలో అభివృద్ధి పథకాలు గిరిజనుల్నిఅడవికి దూరం చేసి ఆర్థికంగా అవిటివాళ్ళుగా మార్చిన క్రమాన్ని చూశాడు. ఇప్పుడు తన తరంలో ప్రపంచీకరణ నేపథ్యంలో అడవిని కబళించిన మార్కెట్ శక్తులు ఆర్థికంగా సాంస్కృతికంగా ఆదివాసిని పరాయీకరణకి గురిచేస్తున్న హింసని స్వయంగా అనుభవిస్తున్నాడు.

తన ముందు తరం వాళ్ళు చీకటితో యుద్ధాలు చేస్తేనే ‘ఇప్పుడున్న ఆస్టల్లు ఇస్కూల్లు డిపోలు జీసీసీలు తెల్ల బువ్వలు ఉద్యోగాలు’ వచ్చాయనే యెరుక సైతం అతనికి వుంది. అప్పటి తరం చేసిన యుద్ధాల్లో అంటుకొన్న అడవి గురించి దాన్ని రగిల్చిన కొండగాలి గురించి , ఆ తర్వాత వీచిన కొత్తగాలులు గురించి భూషణం మాష్టారు కథలు బోధించేరు. భూషణం ఆగిన చోట అట్టాడ అప్పల్నాయుడు మొదలై పాలకుల గిరిజనాభివృద్ధి పథకాల్లోని డొల్లతనాన్నీ పునరావాసాల అమానవీయతనీ యెంతో ఆవేదనతో క్రోధంతో అక్షరాల్లోకి తర్జుమా చేశాడు. అటెనక సంక్షోభాలకు గురైన గిరిజన జీవితంలో చోటుచేసుకొన్న దృశ్యాదృశ్య హింసనీ దాన్నుంచీ బయటపడటానికి అడవి బిడ్డలు చేసే రాజకీయ సమరాన్ని సువర్ణముఖి సాహిత్యంలోకి తెచ్చి దానికి న్యాయసమ్మతిని సాధించే ప్రయత్నం చేసాడు. ఉత్తరాంధ్ర నేల నుంచి యీ యానగాలి తెలుగు కథకి ఆరని నిప్పురవ్వల్ని జోడించింది. అయితే యీ రచయితలెవరూ కొండ బిడ్డలు కారు. పల్లం నుంచీ మైదానం నుంచీ వచ్చినవాళ్ళే. కొండ పాదులో నుంచొని తలెత్తి కొండని చూసి అక్కడి ప్రజల జీవన పోరాటాన్నీ మరణ యాతననీ సొంతం చేసుకొని ఆర్తితో సహానుభూతితో కథీకరించారు. కానీ మల్లిపురం జగదీశ్ తెలుగులో తొలి ఆదివాసీ రచయితగా యిన్ సైడర్ గా తన చుట్టూ తన జాతి జనుల జీవితాల్లోని సంక్షోభాన్నీ సంఘర్షణనీ సంక్లిష్టతనీ అనితరంగా పట్టుకొని మనకు అందిస్తున్నాడు. అందుకే వుత్తరాంధ్ర కథల్లోనే కాదు; తెలుగు కథల్లో సైతం కొండ బిడ్డ గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ‘శిలకోల’ కథలు విలక్షణమైనవీ విశిష్టమైనవీ. ఇవి అన్నివిధాలా అచ్చమైన ఆదివాసీ కథలు. తమవి కాని జీవితాల్ని జగదీశ్ రాయలేదు. గిరిజన సాంస్కృతిక సామాజిక చలనాన్ని జగదీశ్ లా మరొకరు రాయలేదు. గిరిజన సాంస్కృతిక అస్తిత్వ చైతన్యం తో కొండ జీవన సౌందర్యాన్ని కవితాత్మకంగా వున్నతీకరించిన టిహిలి కి పెళ్లి (2010) లాంటి కథలు జగదీశ్ వంటి ఆదివాసి మాత్రమే రాయగలడు. బయటి వాళ్ళ నుంచి వూహించలేం.

ఆదివాసీ జీవితానికి సంబంధించిన అనేక పొరల్ని జగదీశ్ అపూర్వంగా ఆవిష్కరించాడు. బడిలో విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుల వద్దే అవమానాల నెదుర్కొన్న స్వీయ జీవితానుభవం నుంచే అతను కథకుడుగా మొదలయ్యాడు (అక్షరాల దారిలో … 2000). బడిలో దిద్దిన అక్షరాల్లోనే యెక్కడో ఆత్మగౌరవ స్వరాన్ని సరాయించుకొన్నాడు. చదువుల ద్వారా సాంస్కృతిక మూలాలకు దూరమౌతున్న క్రమాన్ని పసిగట్టాడు. ఒక అపరాధ భావనతోనే కావొచ్చు వాటికి కారణాలు వెతుక్కొన్నాడు. బయటపడటానికి సంఘర్షణ అనివార్యమని గ్రహించాడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం చంద్ర యానం చేయడానికి వుత్సాహ పడుతుంటే ఆకలికి విషపు గడ్డలు తినో టెంక పిండంబలి తాగో సరైన వైద్యం లేక ప్రాణాలు పోగొట్టుకొన్న కొండ మనుషుల్ని చూసి విచలితుడయ్యాడు (వాన 2010). క్రీస్తు సంఘాలు పాస్టర్లు గిరిజనుల మెడలో వేలాడదీసిన శిలువల్ని చూసాడు, నేర్పిన వాక్యాల్ని విన్నాడు (గాయం 2008). షావుకారి తరాజు పోలీసు లాఠీ మిలాఖత్తయి చేసిన మూగ గాయాల్ని తడిమాడు(ఉరులు). ఒకప్పుడు నాటుబళ్ల మీదికి బస్తాలు మోయించి సరుకులు తీసుకెళ్ళిన షావుకారి యిప్పుడు లారీని నేరుగా కళ్లానికకే తెచ్చి పంటల్ని సులభంగా మోసుకుపోతున్న’ సౌకర్యాల దారుల్ని గమనించాడు. అడవి బిడ్డల అరణ్య రోదనకి అసలు కారకుల్ని గొంతెత్తి నిలదీయడానికి పూనుకొన్నాడు. రైతాంగ పోరాటాలు గిరిజన జీవితాల్లో తెచ్చిన యెన్నో మార్పుల్ని అతను లోతుగాపరిశీలించాడు. వాటిని అణచివేయడంలో భాగంగా అనేక ప్రలోభాలకు గురి చేసి గిరిజనుల్ని ఉద్యమాలకు దూరం చేసిన వైనాన్ని విడమరిచి వివరించాడు. ఆ క్రమంలో అమలైన సంక్షేమ పథకాలు , ఐటిడిఏ గిరిజన కార్పోరేషన్ మొ. ప్రభుత్వ సంస్థలు , ఆశ్రమ పాఠశాలలు , హాస్టళ్ళు , చదువులు ఉద్యోగాలు అందివచ్చిన ఆధునిక సదుపాయాలూ సౌకర్యాలు అన్నీ ఆదివాసిని అడవి నుంచి వేరుచేయడానికే దోహదం చేశాయన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. వాటన్నిటినీ విమర్శనాత్మకంగా విశ్లేషించాడు. పెరట్లోని పెసర కాయలో కొండమీది కంది గింజలో , చీపుల్లో చింతపండో సంతకి దిగి పాకెట్ మనీగా మారుతున్నా డబ్బు అవసరం ఇంకా తీరని’ యువత కొత్త అలవాట్లని అసహ్యించుకున్నాడు.

అమలౌతున్న అభివృద్ధి నమూనాలు తప్పని చెప్పడానికి అతను యెక్కడా తడబడలేదు. నీళ్ళు నమల లేదు. అభివృద్ధి ఆదివాసి జీవితాల్లోని చీకటిని తొలగించలేదు సరికదా మరింత చీకటినే నింపిందని ప్రతి పదంలోనూ లోతుగా చర్చించి నిరూపించాడు (సిందవ 2010). డి ఫర్ డెవలప్ మెంట్ కాస్తా డి ఫర్ డిస్ట్రక్షన్ గా తయారైందనీ సమీకృత అభివృద్ధి విషమీకృత విధ్వంసంగా మారిందనీ ఆదివాసి స్త్రీల బతుకులు అగ్గిపాలయ్యాయనీ తీవ్రస్వరంతో నిరసించాడు. అందుకు కారణమౌతున్న ప్రతి సందర్భాన్నీ వ్యవస్థనీ ద్వేషించాడు. బతుకుతో నాగరిక సమాజంతో పెనుగులాడే ఆ స్త్రీల పట్ల అమితమైన అనుకంప అతని ప్రత్యక్షరంలోనూ కనిపిస్తుంది.

గిరిజన స్త్రీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ సర్వస్వాన్నీ దోచుకొని జీవితాల్నినాశనంచేసే గిరిజనేతరులు లెక్కలేనంతమంది. గిరిజన సంప్రదాయం ప్రకారం రెక్క పట్టిన వాడితోనే ఆ స్త్రీ బతుకు ముడివడి పోతుంది. వాడు గిరిజనేతరుడైనా నామ మాత్రపు దండగ కట్టేసి ఆమెను సొంతం చేసుకొని పెత్తనం చెలాయిస్తాడు. ఆమెను పని మనిషిగా భోగ వస్తువుగా వాడుకుంటూ గిరిజనుల పేరుతో వచ్చే పథకాల ద్వారా ఆర్థిక రాజకీయ లబ్ధిని పొందుతాడు. గిరిజనుల కట్టుబాట్లనీ నాగరిక చట్టాల్నీ అడ్డుబెట్టుకొని పచ్చటి జీవితాలతో ఆటలాడుకుంటాడు. కళ్ళం (2010) లో సిరిమెల, శిలకోల (2009) లో చామంతి అలా మోసపోయిన వాళ్ళే. చివరికి నమ్మి తాము కోల్పోయిందేంటో తెలుసుకొని స్వీయ అస్తిత్వాల్ని కాపాడుకోటానికి స్థిరంగా నిలబడ్డారు. సిరిమెల భూమిని కాపాడటానికి వూరంతా వుమ్మడి పోరుకి తయారైతే చామంతి వొంటరి పోరుకి సిద్ధపడింది.

అయితే ‘ఇప్ప మొగ్గలు’ కథ (2011)లో బూదేవి సిరిమెల చామంతిల్లా మోసపోడానికి సిద్ధంగా లేదు. అభివృద్ధి తెచ్చిన చీకటి ఆమెకి తెలుసు. ఆ చీకటిలో అడుగులు తడబడకుండా దాన్నుంచీ బయటపడే దారి కూడా ఆమెకు తెలుసు. అందుకే యీ కథ ప్రత్యేకమైంది. నిజానికి ఇప్పమొగ్గల్లో రెండు కథలున్నాయి; ఒకటి : కొత్త శతాబ్దంలో ప్రపంచీకరణ తెచ్చిన మార్పుల్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించే బూదేవిది , రెండు : అంతకు ముందు పాలకులు యెరవేసిన అభివృద్ధి పథకాలకు బలైన బూదేవి అక్క జ్యోతిది.

జ్యోతక్క విషాద జీవితం బూదేవిని అనుక్షణం బతుకు పోరులో అప్రమత్తం చేస్తూ వుంటుంది. జ్యోతక్క రోజుల్లో గిరిజన యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఐటీడిఏ ద్వారా బుక్ బైండింగ్, టైలరింగ్, ఫ్రూట్ జ్యూస్ మేకింగ్టైప్ రైటింగ్, బనియన్ల తయారీలో ఉచిత శిక్షణ ఇచ్చేవారు.

ఐటీడిఏ లో బనియన్ ఫేక్టరీల కోసం, పళ్ళరసం తయారీ కేంద్రాల కోసం కొత్త కొత్త భవనాలు కట్టించేరు. పగోడాలు పర్ణశాలలు, రకరకాల పేర్లతో రకరకాల రూపాల్లో. అవి ఊపిరాడని పగోడాలు చీకటి నింపుకున్న రహస్య నిర్మాణాలని తర్వాత తెలిసొచ్చింది. బనియన్ల తయారీలో చీకటి కత్తెరకి చిక్కి చీలిక పేలికలైన గుడ్డముక్కలయ్యేరు కొండ పిల్లలు కొందరు. పళ్ళరసం తయారీలో రసం పిండిన పిప్పిలాతయారయ్యేరు మరికొందరు.’ వాళ్ళలో జ్యోతి కూడా వొకరు.

ప్రపంచీకరణలో గిరిజనుల్ని నాగరికులుగా మలిచే శిక్షణ స్వభావం అదే గానీ స్వరూపం మారింది. అది పూర్తిగా మార్కెట్ భాష నేర్చింది. విషయం విషం అదే; స్వరం మారింది.మారుతున్న కాలంతో పాటు గిరిజనులూ మారాలి. సభ్య సమాజంలో కలిసి నడవాలి. పోటీ పడాలి. అభివృద్ధి సాధించాలి.’ కాబట్టి కొత్త పద్ధతులు, కొత్త విధానాలు. గిరిజన విద్యార్థుల కోసం ఐటీడిఏ, కొన్ని కార్పోరేట్ సంస్థలతో కలిసి సంయుక్తంగా శిక్షణనిస్తోంది. హోటల్ మేనేజ్ మెంట్కంప్యూటర్ ఎడ్యుకేషన్, పేషన్ డిజైనింగ్ లాంటి కోర్సులు …’

ఎవరైనా కొత్త వ్యక్తి ఇంటికొస్తే ఆదరించడం పండో కాయో మామిడి తాండ్రచుట్టో ఇచ్చి నేస్తరికం చెయ్యడం కొండ ఫలంలోని కొంత నేస్తానికివ్వడం ఇది గిరిజన సంప్రదాయం అతిథుల్ని గౌరవించడం, వాళ్ళని నమ్మడం సంస్కారం.’ అదే వాళ్ళ పాలిట శాపంగా మారింది. ఆతిథ్యం గురించి వారికి శిక్షణ. హాస్పిటాలిటీ అంటే ఆడపిల్ల అన్ని వొదులుకొని అవకాశాన్ని అందిపుచ్చుకొని యెదగడం అన్న కార్పెరేట్ భాషని భూదేవి తన అక్క జీవితానుభవం నుంచి అర్థం చేసుకొని దాన్ని గుండె లోతుల్లోంచి అసహ్యించుకొని ఆ చీకటి తనకి అంటక ముందే వూబి నుంచి బయట పడింది.

చదువుకొన్నా యెందరో గిరిజన యువతుల జీవితాలు పూలై వికసించకుండా మొగ్గలుగా మాడిపోడానికి కారణం అన్వేషించే బూదేవి మొగ్గల్ని పువ్వులుగా చేసి రేపటి సమాజానికి అందించే దిశగా అడుగులేస్తుంది.

ఈ కథ చదువుతోన్నంత సేపూ సువర్ణ ముఖి ‘గోరపిట్ట’ కథ , కుప్పిలి పద్మ సాలభంజిక కథ గుర్తొస్తాయి. గిరిజన స్త్రీల శీలం గురించి సెక్సువాలిటీ గురించి సభ్య సమాజం యెంత నీచంగా ఆలోచిస్తుందో యెంత అసభ్యంగా వ్యవహరిస్తుందో జగదీశ్ మాటల ద్వారా విన్నప్పుడు దేశం యావత్తూ సిగ్గుతో తలవంచుకోవాలి. నాగరిక సమాజం మార్జినలైజ్డ్ బతుకుల్ని అపహాస్యం చేసే తీరుని అతను గొప్ప నైపుణ్యంతో ఆవిష్కరించాడు.

ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన కథ యిది. ఎత్తుగడ నిర్వహణ ముగింపు అన్నీ చక్కగా అమరిన కథ. హృదయమెక్కాడున్నాది’ రింగ్ టోన్ తో ఫోన్ మోగే దగ్గర మొదలు పెట్టడం లోనే జగదీశ్ కథలో సగం చెప్పేశాడు. కొండ మీద చోటుచేసుకొన్న సామాజిక చలనాన్ని వొక్క మాటలో ఆవిష్కరించాడు. ముగింపులో, బూదేవి గమనంలో ‘దారికడ్డగా’ వచ్చిన ఐటీడిఏ నిర్మించిన చెక్ డ్యాం తాలూక మట్టిలో పాతుకుపోయిన శిలా ఫలకాన్ని గెడ్డలోకి విసిరి కొట్టి , ‘బడి మొఖం ఎరుగని పసిమొగ్గ’ పిల్లల వేపు నడిచిందని చెప్పి అభివృద్ధి మానవీయతల గురించి పాఠకుల్లో కొత్త ఆలోచనకి తెర తీశాడు. ఆదివాసి స్త్రీకీ మొత్తం సమాజానికీ బూదేవి ఆదర్శం కావాలని జగదీశ్ యెంతో సంయమనంతో నేర్పుతో రాసిన కథ యిది.

వని యిప్పుడు బహుళజాతి కంపెనీలకు లాభాల గని అయ్యింది.కొండని తవ్వాలంటే అక్కడ ఊళ్లుండకూడదు. ఊళ్లుంటే ఉద్యమాలంటారు.’ అడవినీ అడవి నుంచి ఆదివాసినీ మాయం చేసే కుట్ర పాలకుల కనుసన్నల్లో అమలవుతోంది. అందుకనే అడవిని నమ్ముకొన్న ఆదివాసికి అడవిలో వొకింతసేపు నిలబడి సేద తీరడానికి చెట్టునీడ కూడా వెతుక్కొనే పరిస్థితి యివ్వాళ యెదురవుతోంది. బాక్సైట్ కోసమో బండరాళ్ల కోసమో వజ్రాల కోసమో నల్ల బంగారం కోసమో అడవి కడుపుని చీల్చడానికీ కొండ గుండె ఛిద్రం చేయడానికి వ్యవస్థీకృతమైన హైటెక్ హింస పడగ విప్పింది. అభివృద్ధి అణచివేత అనే రెండంచుల కత్తితో , జోడుగుళ్ల తుపాకితో రాజ్యం అడవిమీద కమ్ముకుంది. అడవిలో వున్నా ఆస్టల్లో వున్నా కొండ పిల్లల మాన ప్రాణాలకు భద్రత లేదు. భద్రతా బలగాల తోడేళ్ళ దాడికి అడవి బతుకులు ఆగమౌతోన్నాయి . అడవి షావుకారి, సొండోడు దౌర్జన్యం గురువులు సంఘాలుపోలీసులు లాఠీలు లూఠీలు అరెస్టులు , పారిపోవడాలు పోరాటాలు .టి.డి.ఏలు జీసీసీలు ఆస్టలు, ఆసుపత్రులు ఇస్కూళ్ళు చదువుల కోసం కొండనొదిలి పట్నం వేపు పరుగులు …’ అయినా తుపాకి గొట్టాల నీడల్లోనే ఇంకా గడపాలా అని అడవీ కొండా ఆక్రోశిస్తోన్న తీరుని నలభై యేళ్ల చరిత్ర సాక్షిగా రచయిత అడుగుతున్న ప్రశ్నకి (దాడి – 2008) సమాధానం ‘మళ్ళీ తుపాకీల మోతే.’ ఆదివాసీ బతుకు అడుగడుగు గండమే. నిప్పుల గుండమే.

ఆదివాసిని యిప్పుడు దోచుకునేది మైదానాల నుంచి దారులు పరచుకొంటూ వచ్చిన బయటి వ్యక్తులు మాత్రమే కాదు. దోపిడీ రాజకీయాలు నేర్చిన సొంత మనుషులు కూడా. చదువుల ద్వారా ఉద్యోగాల ద్వారా మూలాలకి దూరమైన ఆదివాసీలు కొందరు రాజకీయ స్వార్థం బలిసి వుద్యమాల చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొంటూ తమ జాతికే ద్రోహం చేయడానికి , తమ వాళ్ళనే మోసగించడానికి పూనుకొంటున్నారు. కొండోడెప్పుడూ మోసపోడమేన్రా అయితే మోసం చేసినోడే మారేడు. అప్పుడు పయోడు, ఇప్పుడు మనోడు అంతేన్రా తేడా.’ అయితే పయోడితోనైనా లోపలోడితోనైనా అడవి బిడ్డలు పోరాటానికి వెనుదీసేది లేదనే జగదీశ్ చెబుతున్నాడు. రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే ప్రధానమని (దారి -2009) స్పష్టం చేస్తున్నాడు.

బూదేవి (ఇప్పపూలు) సిరిమెల (కళ్ళం) సోమేశు ( సిందవ) నిమ్మీ (కలలు కాలుతున్న వాసన) చామంతి (శిలకోల) కురమయ్య (దారి) మిలంతి (గాయం) ధర్మూ ( టిహిలి కి పెళ్లి ) వీళ్ళంతా అది మాయల మార్కెట్ తెల్ల దెయ్యం కావొచ్చు పైమెరుగుల వికృత వస్తు వ్యామోహం కావొచ్చు రాక్షస రాజకీయం కావొచ్చు ప్రలోభాల మతాంతరీకరణ కావొచ్చు కలుషిత కార్పోరేట్ భూతం కావొచ్చు పాశవిక రాజ్య హింస కావొచ్చు సాంస్కృతిక పరాయీకరణ కావొచ్చు యెదురైన సంక్షోభం యేదైనా యెంత తీవ్రమైనదైనా యెదిరించి యెదురీదడానికే నిర్ణయించుకొన్నారు. ఎన్ని పరాజయాలు సంభవించినా ఆదివాసీల యీ సడలని తిరుగుబాటు తత్త్వమే జగదీశ్ కథలకు ఆత్మయింది. జీవం పోసింది. వన్నె తెచ్చింది.

అయితే దాన్ని పాఠకుల గుండెలోకి సూటిగా ప్రవహింపజేయడానికి అతను సంయమనాన్ని పాటిస్తూనే వుద్వేగ ప్రధానమైన కథనాన్ని యెన్నుకున్నాడు. కవితాత్మక శైలిని ఆశ్రయించాడు. కథలో స్వీకరించిన వస్తువుకి అనుగుణమైన వాతావరణాన్ని నిర్మించడానికి ఆ శైలి యెంతగానో వుపకరించింది. ఉత్తరాంధ్ర నేలలోనే ఆ గుణం వుంది. సంభాషణల్ని సామెత స్థాయికి తీసుకెళ్ళిన గురజాడ కథలో వాతావరణానికి అనుకూలమైన కొత్త డిక్షన్ నీ ఆధునికోపమానాల్నీ వుపయోగించిన రావిశాస్త్రి , బీనాదేవీ వచనానికి వ్యంగ్య వైభవాన్ని జోడించిన పతంజలి కథనంలో అనేక ఉద్వేగాలకు కవిత్వ సువాసనలద్దిన అప్పల్నాయుడు , గౌరునాయుడుల వారసత్వాన్నే జగదీశ్ అందుకున్నాడు. అట్లా అని తనకు తాను గానీ యితరులకు గానీ పునరుక్తం కాలేదు. వస్తు స్వీకరణలో వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ‘గురువుల’ నుంచి నేర్చిన దాన్ని తన జీవితానుభవం వెలుగులో మెరుగులు దిద్దుకున్నాడు. సమాజాన్ని తనదైన ప్రాపంచిక దృక్పథంతో వ్యాఖ్యానించాడు. ‘ఆకుపచ్చని చీర కట్టి ఒద్దికగా కూర్చున్న గిరిజన యువతిలా అడవి ఆ పిల్ల సూసిన సూపులికి ఇప్పమొగ్గలు జలజల రాలినట్టిగైందిగిలిగిచ్చికాయలు గాలికి కదిలినట్టు కిలకిల నవ్వులు థింసా అడుగులేస్తున్న ఆడపడుచుల వరస కొండ మెడలో బంతిపూల దండలా కదులుతుందిఒక్కొక్క మొగ్గా , ఒక్కొక్క జ్ఞాపకంలా ఏరుకుంటోంది పోడు దువ్వి ఇతనాలేసింతర్వాత కొండ మీద సినుకు రాలినట్టిగైందిఉరిలో టిక్కిపోయిన సెవర పిల్లిలా గిలగిల్లాడిపోయే మనుషులు కొండొచ్చి మీద పడినట్లైందిచినుకు రాలని చీకటి కొండలా ఉంది ఊరు రేతిరి నా దు:ఖంలో ఈదుతున్నట్టుంది ఇలాంటి సందర్భోచిత వర్ణనలు యీ కథల్లో కొల్లలు.

మనమెటు నడుస్తున్నాము? ఆ రోజుల్లోన ముసిలోలు ఆలు వయసప్పుడు వుద్యమం కాసి నడిచేరు. ఈ వేల మనము, రేపు మన పిల్లలుఎటు నడుస్తారు?’ … ‘ మూలాల్ని మరిచి అడవికి దూరమవడమే అభివృద్ధా ?’ అని ప్రశ్నించే సోమేశ్ (సిందవ – 2010) గొంతు రచయితదే. అడవి బిడ్డల సాంస్కృతిక అస్తిత్వాన్నే కాదు అడవిలోని సమస్త జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే అభివృద్ధికి చెందిన అనేక పార్శ్వాలని (కట్టూ బొట్టూ ఆహారపు అలవాట్లూ రోగాలూ ఆటా పాటా పంటలూ…) ‘శిలకోల’ కథల ద్వారా చర్చకు పెడుతున్నాడు. రచయితగా, ఆదివాసిగా జగదీశ్ వొకటి కాదు వందల ప్రశ్నలు సంధిస్తున్నాడు. అవి సూటిగా వున్నాయి.ఇక్కడ వుద్యమం వుంది. ఉత్తేజమూ వుంది. ఐతే అదెలా వుంది? దశాబ్దాల నాడు యిక్కడ ఎంత కల్లోలం జరిగింది? ఇంత జరిగినా ఈ ప్రాంతంలో ఇంట వెనుకబాటుతనం ఎందుకుంది? విద్య వుంది వివేకమూ వుంది. కానీ ఇంకా జరగాల్సింది ఎంతో వుందని అర్థమవుతూనే వుంది. అసలేం జరుగుతోందిక్కడ? జేగురు కొండ మీది వూళ్లెందుకు ఖాళీ అయిపోయాయి?’ యిలా ప్రతి వాక్యలోనూ తన జాతి మనుగడ గురించి ఆలోచిస్తున్నాడు. గత పోరాటాల పటిమనీ వర్తమాన నిర్వీర్యతనీ బేరీజు వేస్తున్నాడు. చీకటి వర్తమానం గురించి ఆవేదన చెందుతున్నాడు. భవిష్యత్తు వెలుగుల కోసం బెంగపడుతున్నాడు.

అడవిలో వొంటరిగా వొట్టి చేతుల్తో సిందవని యెదిరించగల ఆదివాసిలు అభివృద్ధి ముఖం తొడుక్కొని అవసరంలేని ఆధునికతని మోసుకొస్తున్న కొత్త క్రూరమృగాన్ని తరిమికొట్టాలంటే వూరు సమూహం కాక తప్పదని గ్రహించారు. బాణం శిలకోల గొడ్డలి కత్తి వడిసెల బల్లెం యెవరికి దొరికిన ఆయుధంతో వాళ్ళు ముందుకు కదలక తప్పదని తెలుసుకున్నారు. ఆ సమూహంలో రచయితగా జగదీశ్ కూడా ముందు నిలబడి వున్నాడు. సిందవ – ఆడ సిరత పులి దాడికి గాయపడిన మేకపిల్లకు మందేసి కట్టుకట్టే పనిలో నిమగ్నమై వున్నాడు. ఆదివాసి మీదకు ‘ఎగిరి పీక కరిసీసి రక్తం లాగేసే ‘బాకుడుంబారి’ భరతం పట్టేందుకు అప్రమత్తుడై అక్షరాయుధుడయ్యాడు. అతని కథలన్నీ ఆ ప్రయత్నంలో పుట్టినవే.

అటవీ పర్యావరణాన్ని దెబ్బతీసే విధ్వంసకర పవర్ ప్రాజెక్టులు , 1/70 ని భూస్థాపితం చేస్తున్న దుర్మార్గపు భూసేకరణ చట్టాలు, కార్మికులు పోరాడి సాధించుకొన్న సమస్త హక్కుల్నీ కాలరాసే సెజ్ లు , కార్పోరేట్ కి అడుగులకు మడుగులొత్తుతున్న పాలకుల పారిశ్రామికీకరణ విధానంలో అమలౌతున్న బలవంతపు విస్థాపనలు వలసలు, గిరిజన జీవితాల్ని షోకేస్ చేసి అమాయిక యువతుల్ని మార్కెట్ సరుకుగా మారుస్తున్న టూరిజం స్కీంలు … యిలాంటి వివిధ అంశాలు ఆదివాసీ బతుకుల్లో తెస్తున్న పరిణామాలు జగదీశ్ మాత్రమే చెప్పగలిగినవి తెలుగు కథలోకి యింకా యెక్కవలసే వున్నాయి.

అయితే తెలంగాణా నుంచి పద్దం అనసూయ లాంటి యే వొకరిద్దరో తప్ప జగదీశ్ లా తమ జాతి జనుల జీవన వైవిధ్యాన్ని సాంస్కృతిక చలనాన్నికథలుగా మలుస్తున్నవారు లేరు. ఈ నేల మీద అది శ్రీకాకుళమైనా ఆదిలాబాద్ అయినా ఆదివాసి సాయుధుడై ముందు నడవని వుద్యమం లేదు. ఆదివాసిల్లో అక్షరాస్యత పెరిగింది. అడవికీ మైదానానికీ మధ్య దూరం తరిగింది. అయినా వుత్పత్తి కులాల నుంచి వచ్చినట్టు గిరిజన సమాజం నుంచీ రచయితలు యెందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు రానున్న కాలంలోనైనా సమాధానం దొరుకుతుందని ఆశ.

‘… కొమ్మకి పూసిన పువ్వు
నేల రాలి పోకూడదు.
పిందవ్వాల …
కాయవ్వాల …
పండవ్వాల …
యిత్తనమై మొలకెత్తాల.’ (టిహిలి కి పెళ్లి)

ఇదీ ఆదివాసి హృదయం . సంస్కృతి. ప్రాపంచిక దృక్పథం. జీవన తాత్త్వికత. అవి అలాగే పదిలంగా వుండిపోవాలని కోరుకొనే జగదీశ్ కథలూ గాథలూ మండే గూడేల్లో కొండ పూలై విరిసి , మంది గుండెల్లో విత్తనాలై మొలకెత్తాలని కోరుకొంటూ ….

నాకీ కథలు చదివే అవకాశం కల్గించిన మాడభూషి కథా పురస్కార కుటుంబానికి అభివాదాలు తెల్పుతూ

తన కథల ద్వారా నన్ను కొండ దరికీ అడవి దారికీ చేర్చిన పురస్కార గ్రహీత మల్లిపురం జగదీశ్ కి అభినందనలు అందిస్తూ

సెలవ్.

You Might Also Like

5 Comments

  1. రేసు.ఆదినారాయణ మూర్తి

    మీ యొక్క పుస్తకపరిచయవాక్యాలు చదివితేమొత్తం జగదీష్ గారి కథలనుచదివినట్లేఉంది సర్.అలాగే జగదీశ్ గారిఅంతరంగాన్నీఆవేదననీపరిచయంచేసారు.ఒక ఆదీవాసీ రచయిత ఆదీవాసీలమనోవేదననిఇంతయధార్ధంగావ్రాయడంమా ఆదీవాసీలు ఎంతోగర్వించతగ్గవిషయం.నాకుఎంతోఆనందంగాఉందిసర్.వారికినాశుభాకాంక్షలు.ఇలాగేమాఆదీవాసీల సుఖధుక్కాలు.,సంస్కృతిపైయధార్గగాధలనుఈసమాజానికి ఎరుకపరచాలని ఆశిస్తున్నా….

  2. జగదీశ్ మల్లిపురం

    ధన్యవాదాలు సార్! ఈ ఒక్క మాట సరిపోతుందా నిజానికి?
    ఇది కధల విశ్లేషణ మాత్రమే కాదు. నా మనో విశ్లేషణ కూడా. కధల దారిలో ఇంత దూరం నడిచాక ఇప్పుడిది చదువుతూ వుంటే నాలో వణుకు సన్నగా మొదలయ్యింది. ఆ వణుకులో మును ముందు ఎంత బాధ్యతగా అడుగెయ్యాలొ తెలిసొచ్చింది.
    ఆ రోజు ఎప్పటికీ మరిచిపోలేను.లలితాదేవి మేడమ్ గారు, వీరలక్ష్మీ దేవి గారు, శీలావి గారు, సుధామ గారు, బీ ఎస్ రాములు గారు మీరూ ఈ అవార్డు ద్వారా నాకిచ్చిన ఆశీస్సులు నా తోడుగా వుండి నను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను.

  3. కే.పి .అశోక్ కుమార్

    ఇంత మంచి వ్యాసం మా పాలపిట్టలో వస్తే బాగుండేది .ఈ వ్యాసం మళ్ళీ ఇంకోసారి ఆ పుస్తకాన్ని చదవాల్సిన అవసరాన్ని గుర్తుచెసిన్ది

  4. divikumar

    మల్లిపురం జగదీష్ కథలలోని సామాజిక, సాహిత్య, జీవన సంఘర్షణా చలనాలని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని పాఠకులకు సులువుగా అర్థమయే విధంగా సమీక్ష చేసిన ఏ.కె. ప్రభాకర్ గారికి అభినందనలు .. .. దివికుమార్

  5. Mukundaramarao

    Great review .
    Well presented
    It makes us read those stories ..they are the insider stories ..
    Congrats jagadish garu and thanks prabhakar garu for sharing like this ..
    Mukundaramarao

Leave a Reply to Mukundaramarao Cancel