పుస్తకం
All about booksపుస్తకలోకం

February 20, 2017

ఆరు కాలాలూ, ఏడు లోకాలూ – 2016లో నేను చదివిన పుస్తకాలు

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: చీమలమర్రి స్వాప్నిక్
***********
కిందటి ఏడు మా ఇల్లు – చాదస్తం బాబాయిలు, రెబెల్ తాతయ్యలు, పిచ్చి మంచి పిన్నులు, లోకం తెలిసిన అత్తయ్యలు, అంటుకుపోయే అంకుల్ లు, అంతుపట్టని ఆంటీలతో కళకళలాడింది.

మా Gaiman బాబాయ్ పెద్ద సెలబ్రిటీ. ఆయన్ని చూడంగానే ఎవరైనా అనే మొదటి మాట- ‘’ఏం ఉన్నాడు గురూ!!!‘’
కొంచెం మాట్లాడాక వచ్చే మాట – ‘’ఏం చెప్పాడు గురూ!‘’

“బాబాయ్! మేముకూడా సెలబ్రిటీస్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి ?”
“ఓస్ అంతేనా, ముందు ఉన్న లెజెండ్స్ అందరినీ చదివెయ్యండి, ఒక ఇరవై సంవత్సరాలలో ఆటోమేటిక్గా సెలబ్రిటీ అయిపోతారు.” అంటాడు.

“మరి లెజెండ్స్ ని గుర్తు పట్టటం ఎలాగ?” మా అక్క అన్నీఇలాంటి ప్రశ్నలే అడుగుతుంది.
“నేను చెప్తాగా పేర్లు”
ఎంత మంది తెల్సో బాబాయ్ కి లెక్కలేదు. ఏమి చదివాలి, ఎవరివి చదవాలి అన్న దగ్గర్నుంచి దేవుడు, దయ్యం వరకు అన్నిటి గురించి ఆశువుగా మాట్లాడగలడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా ఒక సంవత్సరానికి సరిపోయేంత Force ఇచ్చేసి Newton’s Second Law మాచేత అప్పచెప్పించుకుని వెళ్ళిపోతాడు. అల్లా సంక్రాంతి సెలవలకి వచ్చి “May the Force be with You!” అని ఇంకా చాలా తెలుసుకోవడానికి వెళ్ళిపోయాడు.

1. American Gods -Neil Gaiman
2. The Graveyard Book- Neil Gaiman
***

మా ఇంట్లో ఎప్పట్నుంచో ఉంటున్న విశ్వనాథగారి గదిలోకి వెళ్ళటం ఇదే మొదలు. ఇదివరకు మా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా ఏదో భయం ఆయనకి దగ్గరగా వెళ్ళటానికి. “నువ్వెవడ్రా! బొట్టికాయ్ గాడివి” అంటారేమోనని. కానీ బాబాయ్ ఇచ్చిన ఫోర్స్ తో, “అంటే అన్నారులే” అని ధైర్యం తెచ్చుకుని ముందుకు దూకా. గదిలోకి వెళ్ళాక ఇంక అంతే.. ఎంత అక్కరో మనిషికి! చెప్పాల్సినదానికన్నా నేను పూర్తిగా తెల్సుకోవాలి అనే ఆరాటంతో ఎక్కడెక్కడి విషయాలో చెప్తుంటారు. నేను అవన్నీ వినేసి ఆ రోజుకి ఏదో సాధించిన వాడిలాగా 10:30 కే పడుకుంటా. పడుకోను.

3. చంద్రగుప్తుని స్వప్నము
4. భగవంతుని మీద పగ
5. సంజీవకరణి
6. తెఱచిరాజు (విశ్వనాథ సత్యనారాయణ)
***

ఆ మరుసటి రోజు నేను, విశ్వనాథగారు కలసి ఆయన స్నేహితుడి నాటకాలు చూడటానికి బయల్దేరాం. Henrik Ibsen అట. నాటకం అయిపోగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన పాత్రలు ఎక్కడో ఊహాలోకాల్లో రంగులు పూసుకుని కాకుండా, ‘నిజం’ అనే ఇంట్లో, మనం తొడుక్కునేలాంటి బట్టలే వేసుకుని బ్రతుకుతుంటాయి. ఏమున్నాసరే భేషజం లేకుండా మొహం మీద మాట్లాడతాయి. ఆయనతో పరిచయం, నాటకరంగం మీద ఉన్న నాకు ఉండిన పూర్వభావాలని షష్టితిరునాళ్ళ లో వదిలేసేలా చేసింది.

7. Doll’s House, Ghosts, Enemy of the People (Henrik Ibsen)
***

ఎప్పుడో ఇల్లు వదిలేసి వెళ్లిపోయి మా అమ్మతో ఫోన్లో టచ్ లో ఉంటున్న చలం (చెలం)గారితో, కొన్ని రోజులకి అక్క కూడా మాట్లాడేది. ఎందుకో నాకు ఎప్పుడూ మాట్లాడాలి అనిపించలేదు. “శుభ్రమైన ఇల్లు వదిలేసి ఏంటా వెధవ తిరుగుళ్ళు!” అనే మా అమ్మమ్మ తిట్లు బాగా లోపలికి తీసుకున్నానో ఏమో! ఈ యేడాది ఆయన చాలా రోజులకి మా ఇంటికి వచ్చాడు. అమ్మమ్మ వసతికి నా గది సర్దింది. నన్ను పిలిచి కాసేపు ‘అట్లా’ కొన్ని ఆలోచనలు చెప్పాడు. గౌరవం పెరిగిపోయింది. వెంటనే ఆయనికి అతుక్కుపోయాను. కథలు చెప్తానంటే “ఇప్పుడు వద్దులెండి, మీ చిన్నప్పటి విషయాలు చెప్పండి” అనేంత చనువు తీసుకున్నా. చాలా సార్లు అచ్చం అమ్మ మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన నిస్సహాయత మీద జాలి పడాలా? లోకం మీద కోప్పడాలా? అని అడిగితే, రెండూ వద్దు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఒక పది రోజులకి అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే, నేను కూడా కొంచెం మాట్లాడా.

8. మ్యూజింగ్స్
9. మైదానం
10. జెలసీ (కథలు) (చలం)
***

ఒకసారి Airport లో Chesterton అనే వ్యక్తిని కలిసాను. ఏమి మాట్లాడామో చెప్పలేను కానీ, మహా మేధావి. విజయవాడ వరకు పక్కపక్కన కూర్చుని వచ్చాం. నన్ను బస్సు వరకు ఆయన కార్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఫోన్ నెంబర్ అడగాలని కూడా తోచలేదు నాకు. ఇంటికి వెళ్లి ఈ సంగతి చెప్పి, “దేవుడా! మళ్ళీ ఆయన్ని కలిస్తే బావుణ్ణు.” అన్నా . “ఏడిసావులే, దేవుడికి నీ దండాలు వినడం తప్ప వేరే పని లేదు అనుకున్నావా” అని విసుక్కుంటూ ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు ప్రాచెట్టు తాతయ్య. వాళ్ళిద్దరికీ ముందే పరిచయం అట.

11. The Man who was Thursday (G.K. Chesterton)
***

సొంత ఊరిలో ఒక ఇరవై రోజులు ఉండవలసి వచ్చింది. తాతయ్యకి ఏదో పనుందని వెళ్ళాడు. ఈలోగా నేను Irving Stone గారిని కలిసా. గొప్పవాళ్ళ జీవితాల గురించి మా ఊళ్ళోని BVR కళాకేంద్రంలో బుర్రకథలు చెప్తూ ఉంటాడు. మంచి పేరు ఊరంతా. ఇలా చెలంగారి గురించి కాస్త చెప్తోవుంటే వెంటనే, “ఒక డచ్ పెయింటర్ ఉండేవాడబ్బాయి. Van Gogh అని…” అక్కడ మొదలుపెట్టి ఒక వారం పాటు ఆయన గురించి మొత్తం చెప్పాడు. అంతా విన్నాక నేను చెలంగారిని అడిగిన ప్రశ్నకి జవాబు దొరికింది.

12. Lust for Life (Irving Stone)
***

మధ్యాహ్నం పూట, ఒక పెద్దమనిషి మా ఇంటికి వచ్చారు,
“బాబూ, తాతయ్యగారు లేరా?”
“లేరండీ ఊరికెళ్లారు.”
“నా పేరు శంకరమంచి సత్యం.”
లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టా. పని మీద వచ్చినట్టు మొహంలో తొందర కనపడడం లేదు.
తీరిగ్గా, మా ‘చిందరవందర’ కంపెనీ బల్లమీద ఉన్న పుస్తకాలు చూసి ముచ్చట పడిపోయారు.
“నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మీ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు.” అని, నా చిన్నప్పటి విషయాలు కాసేపు చెప్పి, అయన చిన్నప్పటి విషయాలు ఎన్నో చెప్పారు. ఎన్ని విన్నా ఇంకా కాస్త వెలితి ఉండిపోయింది. ఆయనతో మాట్లాడినంతసేపూ తల తడవని ఒక చిన్న జల్లులో నడుస్తున్నట్టు ఉంటుంది.
“భోజనానికి మా ఇంటికి రా బాబూ, ఇక్కడ నీకు ఇబ్బంది కదూ..”
“తప్పకుండా వస్తానండి.” మరుసటి రోజే ఆయన ఇంటికి వెళ్ళా. భోజనం కోసం కంటే, ఆ కథల కోసం. బయట ఎర్రగా కాస్తున్న ఎండ ఆ ఇంటికి అంటడంలేదు. వాళ్ళ ఇంట్లో పెట్టిన ప్రసాదం వేడి ఇంకా కడుపులో చల్లగానే ఉంది.

13. అమరావతి కథలు – (శంకరమంచి సత్యం)
***

తాతయ్య ఫోన్ చేశాడు “నాకింకో వారం పడుతుంది రావటానికి, ఈలోపు మన చెక్కతలుపుల బీరువాలో పుస్తకాలు తిరగెయ్యి” అన్నాడు.
14,15,16,{17,18}. “The Hitchhiker’s Guide to the Galaxy, A Trilogy of Five- (Douglas Adams)”
నేను “వెటకారం లేనిదే జీవితం లేదు” మరియు “ఈవాళ ఏదోటి అదరకొడదాం” అనే సిద్ధాంతాలు నమ్మే ఇంట్లో పుట్టాను. “ఇదేంటి Trilogy of Five? మాంఛి తేడాగా ఉందే” అని మొదలుపెట్టా.

తస్సా చెక్కా!

వెటకారంలో కూడా తెల్సుకోవాల్సినవి చాలా ఉన్నాయ్ అని అప్పుడే అర్థమైంది. ఈయనతో పోలిస్తే, ఎవరి వెటకారం అయినా ఒక మూలకి కూడా రాదు, ఒక instant connection కుదిరేసింది. మూడు భాగాలూ, తూచ్.. కాదు, అయిదు భాగాలూ ఒక వారంలో అయిపోయాయి.

పుస్తకం చదివాక ఏదోటి రాయాలనే తపనతో Koios Coffee Shop కి వెళ్లాను. అది మేధావులకీ, మేధావులవాలనుకునే వాళ్లందరికీ ఓ ఆస్థానం.
అక్కడికెళ్ళి ఒక టీ చెప్పుకుని, ఎవరితోను పట్టనట్టుగా కూర్చోడం పెద్ద Ego Booster. కాసేపు టైప్ కొట్టి ఇంకో టీ తెచ్చుకోవటానికి వెళ్లాను. ఈలోగా నా కీబోర్డ్ నా ఒత్తిడి తట్టుకోలేక, పక్క మనిషి తో “బాబుగారు! మా వాడిని కాస్త దారిలో పెట్టండి” అని మొరపెట్టుకున్నట్టుంది.

నేను వచ్చేసరికి నేను రాసింది ఎవరో పరిశీలిస్తున్నారు.
“ఎవరండీ మీరు?”
“45.”
“ఎవరు సార్ మీరు, నా లాప్టాప్ తో ఏంటి పని, నేను రాసుకున్నది ఎందుకు చూస్తున్నారు?”
“కాదు, 42.”
అని, నా మీద చెయ్యివేసి “ఇంకా చాలా నేర్చుకోవాలి” అని వెళ్ళిపోయాడు.

మేధావుల కాఫీ షాప్లో అందరి ముందు నాకు అవమానం జరిగింది, తలుపు దగ్గర ఉన్న లక్ష్మణ రేఖ దాటేసి, ఊబర్ క్యాబ్ బుక్ చేసి, మెట్రో ఎక్కి అజ్ఞాతవాసానికి బయల్దేరా.

***
వెంటనే రాయటం నేర్చుకోవాలి, ఎలా? అప్పుడొచ్చాడు, Bradbury తాతయ్య సమ్మర్ సెలవలకి. అమ్మమ్మ ఓ పక్క ఆవకాయ పెడుతోంది. ఈలోపు పక్కన కొట్టుకు వెళ్ళి కోలా రస్నా తెచ్చి, మధ్యాహ్నం చక్కర పాకం పట్టి, సన్నని మల్మల్ గుడ్డలో వడకట్టి, రేపర్ తీసేసిన కోకాకోలా 1.5 లీటర్ బాటిల్స్ లో నింపాడు. సాయంత్రం మేము యథావిధిగా గ్లాస్లో 3 వంతులు రస్నా నింపి, 1 వంతు నీళ్లు పోసుకుని రస్నా సేవించాం. ఒక రోజు మధ్యాహ్నం పడకకుర్చీ మీద పడుకుని రస్నా తాగుతూ, “ఇంకెంత చదువుతావ్ రా? ఇప్పటికే ఎక్కువ చదివేసావ్. ఇంక చాలులే.” అన్నారు. ఆయనికి Formal Education అంటే మహా మంట.

“ఈ చెత్త చదువులన్ని చదవండి ఆఖరికి రేపు తలుచుకోవటానికి ఏమి మిగలవు.”
“ఇంకో మూడేళ్లలో అయిపోతుందిలెండి, మీరు భలే రాస్తారు, నాకు నేర్పుతారా?.”
చిరాకు మొహం లోకి ఓ నవ్వు చుక్క వచ్చింది. “రాయటం ఏం కష్టం రా! ఒక సందర్భం ఊహించుకో, దాని గురించి నీకు అనిపించే పదాలు ఒక్కోటిగా రాయి, వాటిని విడి పూలు కట్టినట్టు వాక్యాలతో కట్టేయి అంతే.” భలే చెప్పారనిపించింది.
“కానీ ఒకటి! రోజూ రాయాలి, లేకపోతే పూలే తప్ప దండలు కట్టలేవ్.”

19. Fahrenheit 451
20. R is for Rocket (stories)
21. Zen in the art of writing (Ray Bradbury)
***

సమ్మర్ సెలవులు పూర్తిగా మాతోనే గడపాలని పాపం మా LG టీవీ ఆశపడింది, దాన్ని మేమెప్పుడూ తక్కువ చూస్తాం అని వెధవ ఊహలు అదీనూ. అప్పటికీ Freudian Therapy Sessions కి పంపించాం, అయినా గుణం కనపడలేదు. ఏం చెప్తాం! Childhood Problems. ఇంక కొంత టైం కేటాయించక తప్పలేదు. ఈలోపు Stephen King గారు వచ్చి బండ బూతులు తిట్టి, “ఎన్ని సార్లు అవే సినిమాలు చూస్తారు బుర్ర తక్కువ సన్నాసుల్లారా! పోయి ఏదయినా చదవటమో, రాయటమో, చెయ్యచ్చుగా. పెద్దాయన్ని అడిగి తెల్సుకున్నాక మళ్ళా పుస్తకం పడితే ఒట్టు.” అన్నాడు.

22. On writing : Stephen King
***

“ఎందుకలా కోప్పడతావ్! సెలవుల్లో కూడా ఆడుకోనివ్వవా, చదివినప్పుడు చదువుతారు లే.” అన్నాడు Wodehouse తాతయ్య.
“ఇటు రారా నీకో కథ చెప్తా.”
“ వస్తున్నా జంధ్యాల సినిమా వస్తోంది, కాసేపాగి వస్తా.”
“ముందు రారా ఇలాగ!”
టీవీ కట్టకుండానే ఆయన దగ్గరికి వెళ్ళా.
మళ్ళీ ఒక పదిహేను రోజులు టీవీ జోలికి పోలేదు.

23. Leave it to Psmith
24. Full Moon
25. Adventures of Sally
26. Money for Nothing
27. Mr. Mulliner Speaking (P. G. Wodehouse)
***

ఒక రోజు జాగింగ్ చేద్దాం అని అలా పార్కుకి వెళ్ళా…
“హెల్లో…!” (వీపు మీద చరుపు)
“ఆ హలో అంకుల్ బావున్నారా.”
“ఏంటి అసలు కనపడట్లేదు”.
“ ఏదో కొంచెం బిజీ అంకుల్ ”
“టీ కి రావచ్చుగా గాస్కెల్ గారు కూడా అడుగుతున్నారు.”
“టీ కి ఎందుకులేండి మీకు శ్రమ, మామూలుగా వచ్చి కనపడతా.”
(కొన్నాళ్ళ క్రితం…
“హాయ్ అంకుల్!, నేను మీ వీథి చివర ఉంటా.”
“ఓహ్ అవునా! సరే అయితే సాయంత్రం పార్టీ ఉంది వచ్చేయి.”
తీరా సాయంత్రం పార్టీ కి వెళ్ళాక చూస్తే, ఉన్నది ముగ్గురు జనాలు, వంటింట్లోంచి ఏవో వాసనలు, ఎక్కడో పడగ్గది లోంచి లీలగా వినిపిస్తున్న Jazz పాటలు. ఒకతను ముందు బాటిల్ పెట్టుకుని పుస్తకంలో ఏదో రాస్తూ తెగ ఆలోచిస్తున్నాడు. బాటిల్ ఎత్తి “హాయ్” అన్నాడు. ఆ బాటిల్ మీద “గ్లాసుకి తగలకుండా పోసుకొనవలెను” అని రాసి ఉంది. ఏదో హోమియోపతి మందు లే అనుకున్నా . వీళ్లతో పాటు డివోర్స్ కి అప్లై చేసిన వీళ్ళ కుక్క- నేను రాంగానే మొహమాటం నవ్వు ఒకటి విసిరి, పడగ్గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.

“ఈవిడ పేరు Elizabeth Gaskell , కాలనీలో ఈవిడకో క్లబ్ ఉంది. మేమిద్దరం ఇలా పార్టీలు పెడుతుంటాము. ఈయన Ernest Hemingway. ఓ మంచి రచయిత.”
“ఓహ్ అలాగాండీ :)”
కాలనీ వాళ్ళ గురించి, వాళ్ళ మధ్య జరిగే (ఆవిడకి సరదా అనిపించే) విషయాల గురించి ఆవిడా, పక్కింటి మనుషుల గురించి ఆయనా, మొత్తం HD Qualityలో మొదలుపెట్టారు.

ముందు ఆకర్షితుడనై విన్నా. కాసేపటికి ఎడిటింగ్ లేని బెంగాలీ సినిమా చూస్తున్నట్టుగా, “చివరంటూ లేని ఈ పయనానికి…” అని ఏవో పిచ్చి కవితలు మనసులో మొదలయ్యాయి. ఈలోగా టీ తాగుదాం అని కప్పు తీసుకున్నా-చెంచాడు టీ పొడితో గంగాళం టీ చేశారనుకుంటా.
“మన పాలవాడు కార్ కొన్నాడు Fitzgerald అన్నయ్యగారూ!” అంది ఆవిడ.
ఎందుకు కొనడు – పాలు వాడికి, నీళ్లు మనకి.
స్నాక్స్ ఇంట్లో చేసినట్టున్నారు, మంచి ప్రయత్నం. ఉప్పు వాడి ఉంటే బావుండేది. ఆర్గానిక్ ఫామిలీ లాగా ఉంది, NaCl వంటి కెమికల్స్ వాడరనుకుంటా. హల్దీరామ్స్ వాడు ఎంత పుణ్యాత్ముడో అప్పుడు తెల్సింది.
“నేను ఇంక బయల్దేరతా అంకుల్.” “ఇంట్లో గ్యాస్, అదే… సరుకులు తేవాలి.” అని లేచి వెళ్ళా.
అంతసేపూ తలెత్తకుండా రాసుకుంటున్న మనిషి రాసుకున్నట్టే ఉన్నాడు)

వీళ్ళు బయట భలే approachable గా ఉంటారు. వాళ్లకి ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారో లెక్కేలేదు. ఏమో, అక్కడ సరిపడా ఆనందించలేకపోవటం నాదే తప్పేమో.

28. Cranford – Elizabeth Gaskell
29. The Great Gatsby – F. Scott Fitzgerald
30. Oldman and the Sea – Ernest Hemingway
***

ఒక మధ్యాహ్నం దుమ్ముని చాలా రోజులకి కలిసిన ఈదురుగాలి, ఎత్తుకుని, ఎగరేసి ఆడిస్తోంది. వర్షం పడుతుందేమో అనే సందేహం వచ్చేలోపే, పిల్ల వర్షం మొదలయ్యింది. నేను టీకి బయల్దేరా. నా పక్కగా ఒక పెద్ద మనిషి వెనకాల చేతులు కట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు.

“మేష్టారు… గొడుగులోకి రండి వర్షం పెద్దదవుతోంది.”
“ఎందుకు?” అన్నట్టు చూసి తన దోవన వెళ్ళిపోయాడు.
నేను కూడా కాసేపు గొడుగు మూసేసి ఆయన వెనకాలే నడిచా. ఒక పెద్ద వసారా ఉన్న ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ – జరీ లేనిపట్టు చీర కట్టుకుని, కుంకం బొట్టు పెట్టుకుని ఒకావిడ. ఈయన కోసం చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్నట్టు కనిపించారు.
“ఎంతసేపయ్యిందమ్మా వచ్చి?” అన్నాడు ఆవిడతో.
“ఇప్పుడేలేండి.”
“అబ్బాయ్, ఇటు రా!”
అసలు నేను రావటం ఆయనికి ఎలా తెలిసిందా అనుకుంటూ లోపలి వెళ్ళా.
“ఈవిడ పేరు కల్యాణ సుందరి గారు.”
వాళ్లిద్దరూ కూర్చున్నారు. నేను నుంచున్నా. కొంత పరిచయంలోనే జీవితానికి సరిపోయేంత చెప్పేసారు.

31. Mayor of Casterbridge – Thomas Hardy
32. అలరాసపుట్టిళ్లు (కథలు) – కల్యాణ సుందరీ జగన్నాథ్
***

వర్షాలు వస్తే చాలు క్యాబులకి పాపం జలుబు చేస్తుందని వాళ్ళఇంట్లోవాళ్ళు బయటికి పంపరో ఏమో, ఒక్కటి కూడా కనపడదు, కనిపించిన కొన్ని కూడా బెట్టు చేస్తుంటాయి, చాక్లెట్ ఇచ్చినా దగ్గరికి రావు.

“ఒరేయ్ మీటింగ్ కి వెళ్ళాలిరా” అన్నారు మా అక్క, అమ్మ.
“క్షేమంగా వెళ్లి నీరసంగా తిరిగిరండి.”
“వర్షాలు కదా క్యాబులు లేవు…”
“అర్థమైంది.”
నేను లేచి బాషా సినిమాలో రజినికాంత్ వేసుకున్న ఖాకీ జాకెట్ తొడుక్కుని హవాయి చెప్పులేసుకుని గ్యారేజ్లో కార్ తీశా.

కార్లోంచి “సర్జాపూర్ రోడ్, ఇందిరానగర్, మల్లేశ్వరం..” అని అరిచా, మావాళ్ళు వచ్చి కార్ ఎక్కారు.
“ట్రిప్ స్టార్ట్”.
“నువ్వు కూడా రావచ్చుగా రా, బావుంటుంది, ఒక్కడివీ ఏం చేస్తావ్?”
“వద్దులే. మీరు కానివ్వండి”
మా వాళ్ళు తగ్గలేదు, లోపలావిడ గురించి విపరీతంగా ఫ్లూట్, సితార్, తదితర మధురవాయిద్యాలు వాయించారు.
“నువ్వు రావాల్సిందే” అన్న దగ్గర్నుంచి “నేను వెళ్లాల్సిందే” వరకు persuade చేసారు. మీటింగ్ అద్భుతంగా జరిగింది. రోజూవారీ జీవితమే కొత్తగా కనబడింది ఆ కాసేపట్లో. ఈసారి డ్రైవర్ లాగా కాకుండా, నేనుగానే వెళ్తాను.

33. Persuasion – Jane Austen

ఈ సంవత్సరం ఇవన్నీ జరిగేంతసేపు నా పక్కనే ఉన్నాడు మా Pratchett తాతయ్య. నా పయనానికి బొటాబొటిగా ప్లాన్ వేసుకుంటే, ఘనంగా నడిపించిన ఓ గొప్ప మాస్టర్ ఇంజనీర్. నేను తవ్వుకున్న పునాదులకి క్యూరింగ్ చేసి, గట్టి స్లాబులు పోశాడు.

“ఈ గోడ ఎందుకు ఇక్కడ?” అని నేను కట్టుకున్న కొన్ని గోడలని బద్దలుకొట్టి, కొన్నిటికి ప్లాస్టరింగ్ చేసి నున్నగా సున్నం కొట్టాడు. కాంట్రాక్టు ఇంజనీర్ చూసినట్టు కాక ఇంట్లో మనిషి లా, నన్ను సొంత మనవడిలా వేలుపట్టుకుని నడిపించాడు. ఉట్టి ఇడ్లీలాంటి ఫిలాసఫీలు తింటుంటే, ప్లేట్లో కాస్త హాస్యపు కారప్పొడీ వేసేసి వెళ్లిపోయేవాడు… అలా కదా బతకాలి! మా ఇంటి పక్కన పెద్ద మర్రి చెట్టుకి “ప్రాచెట్టు” అని నేనూ మా అక్కా పేరు పెట్టుకున్నాం.

34. Nation
35.Small Gods
36. Making Money
37. The Truth
38. The Last Hero
39. Mort (Sir Terry Pratchett)

వీళ్లు కాక ఇంకొన్ని పరిచయాలు. కొంతమంది నాకోసమే వస్తే, కొంతమంది అక్క, అమ్మల కోసం వచ్చి నాతో ఎక్కువ కలిసిపోయారు. ఇల్లు ఖాళీగా ఉంటే గెస్ట్ రూమ్ లోనూ, లేకపోతే నా మంచం మీదా పడుకున్నారు, నేను కింద పడుకున్నా.

40. Cyrano De Bergerac (Edmond Rostand)
41. Animal Farm (George Orwell)
42. All the light we cannot see (Anthony Doerr)
43. Eugenie Grandet (Honore De Balzac)
44. An Ideal Husband (Oscar Wilde)
45. The Picture of Dorian Grey (Oscar Wilde)
46. The Big Sleep (Raymond Chandler)
47. A Darker Shade of Magic (V.E. Schwab)
48. Outliers: The story of success (Malcolm Gladwell)
49. What the dog saw and other adventures (Malcolm Gladwell)

సంవత్సరం చివరికి వచ్చేసరికి తెలియకుండానే నా తల ఒక 20 కేజీలు బరువు పెరిగింది. Gym Membership కోసం వెళ్తుంటే, రోడ్ మీద కుర్రాడు ఎవడో చేతికి చిన్న కాగితం ఇచ్చాడు. ఆ పక్కన బిల్డింగ్లో, “అహం మన శత్రువు” అనే సెమినార్ జరుగుతోంది. ఫ్రీ ఎంట్రీ. (లేకపోతే ఎవడు వెళ్తాడు!). “పాత సిద్ధాంతాలకు నూతన తళుకులు” అనే Patented Technology ని వాడి నా బరువు మళ్ళీ యథాప్రకారానికి తెచ్చారు. ఇంట్లోనే తేలిగ్గా చేసుకోగలిగే మెడిటేషనూ గట్రా నేర్పించారు. తేలికపడిన ఒంటితో కొత్త సంవత్సరం (2017) మొదలుపెట్టాను.

50. Ego is the Enemy (Ryan Holiday)
51. Meditations (Marcus Aurelius)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.39 Comments


 
 

 1. కె.కె. రామయ్య

  స్వాప్నిక్! శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం పెంచుకుంటావు కదూ!

  http://vaakili.com/patrika/?p=13538


 2. ఒక సంవత్సరంలో ఇన్ని చదవటం, చదివినవాటి గురించి ఇంత హాయిగా‌, రేఖామాత్రంగా పరిచయం చెయ్యటం, రాయటంతో పాటు, చదవటంలో కూడా నీకున్న ప్రతిభని తెలియ చేస్తున్నాయి స్వాప్నిక్. Truly inspiring one!
  Remembering my younger days, when read with a thrust like you. నీక్కూడా కవిత్వం కన్నా, కథా, వ్యాసమే ఇష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
  ఇకముందు డాక్టరుగారి ఇంటికి వెళితే మూడు సాహిత్యప్రపంచాలతో సంభాషణ చెయ్యవచ్చన్నమాట. చాలా సంతోషం. మీ తలిదండ్రులకి అభినందనలు స్వాప్నిక్.


 3. పవన్ కుమార్. బి

  చాలా అద్భుతంగా రాసారండీ. మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పటి తరంలోని పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగితే అదే ఆనందం.


 4. ఏల్చూరి మురళీధరరావు

  మైథిలాలజీలో సాంత్వనను కల్పిస్తున్న సరికొత్త స్వాప్నికునికి స్వాగత శుభాకాంక్షలు!


 5. ఆరు కాలాలు ఏడు లోకాలు…ఎంత అద్భుతమైన ఆవిష్కరణ…మాటల్లేవు…చవినంత సేపు ఏదో స్వాప్నివిక జగత్తులో విహరించి నట్టే ఉంది.
  అభినందనలు..(యధా మాతః తధా సుతః)!!


 6. S. Narayanaswamy

  Wah wah


 7. కె.కె. రామయ్య

  మీరు ఆస్వాదించిన సువిశాల సాహితీ ప్రపంచాన్ని
  అద్భుతంగా పరిచయం చేసిన ప్రియమైన స్వాప్నిక్!

  తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుడు, హేతువాది, నవయుగ వైతాళికుడు, ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క, భావ విప్లవ కారుడు, మహాకవి … సమాజంలోని సాంఘిక రుగ్మతలను రూపుమాపి స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం కోసం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి, సంఘసంస్కర్త … గురజాడ అప్పారావు గారి అపూర్వ సృష్టి “కన్యాశుల్కం” నాటకం (1892లో తొలి ప్రచురణ, 1909లో రెండవ కూర్పు) కూడా మీరు చదివే ఉంటారని నా ప్రఘాడ విశ్వాసం.

  తన జాతి పురోభివృద్ధిని ఆకాంక్షించిన ఆ స్వాప్నకుడిని ఈ స్వాప్నిక్ అబిమానించాలని సవినయ విన్నపం.


  • Swapnik

   చదవలేదు సార్! తప్పకుండా ఈ ఏడు చదువుతాను.


 8. ns murty

  ప్రియమైన స్వాప్నిక్,

  మొన్న కొత్తగా పరిచయమైనప్పుడు ఇంకా అమ్మ /అక్క చాటునే ఉంటున్నట్టు కనిపించిన మీలో ఎంత సృజనశక్తి దాగుంది!!!

  మీ నెరేటివ్ కొత్తగా గమ్మత్తుగా ఉంది. మీనుండి మరిన్ని మంచి రచనలు ఆశించవచ్చని ఈ కథనం చెబుతోంది.

  హృదయపూర్వక అభినందనలు.


 9. రామ్

  “వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్…”
  ఇందరు ఋషులేల ? ముందు నేను – ఈ “వ్యాసం” … “వ్యాసార్థం” … కొలిస్తే …

  శుభం భూయాత్ swapnik . అద్భుతః !!

  రామ్


 10. స్వాప్నిక్,నీ సాహితీ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా పరిచయం చేసేవ్ !ఎంత కొత్త వూహ !ఒక సుప్రభాతాన సన్నటి చిరుజల్లులో పైకి రావాలని ప్రయత్నిస్తున్న తేజోమయమైన ఒక సాహితీ మయూఖమేదో గోచరించింది నా కళ్ళలో !నాన్నా ,నీకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు !


 11. పేరుకు తగినట్ట్లుగానే ఎన్ని కలలు (ఇన్ని రోజులలోనే)
  కీప్ ఇట్ అప్!!


 12. Kandula v n sarma

  keep it up
  ka va na sarma


 13. naresh nunna

  “చదివించిరి నను గురువులు/ చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ/ జదివినవి గలవు పెక్కులు…” అని చెప్పినవాళ్లం ఉన్నాం, చెబుతుంటే విన్నవాళ్లమీ అయ్యాం. కానీ, మాతరం నుంచి, ఈ తరం వరకూ ‘చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ!’ అని గొప్ప ధీమాగా చెప్పిన వాళ్లు గానీ, చెబితే విన్నామన్న వాళ్లుగానీ నాకు ఇంత వరకూ తారస పడలేదు. ఇదిగో, ఈ వ్యాసం రూపంలో నువ్వు చెప్పకనే చెబుతున్నావు డియర్ స్వాప్నిక్. కేవలం వయసు ద్వారా మాత్రమే ఆధిక్యత ప్రదర్శిస్తూ నీ భుజం తడ్తున్నా అభినందనగా, కృతజ్ఞతగా కూడా!


 14. కె.కె. రామయ్య

  స్వాప్నిక్ గారు, తెలుగు కధల్లో హెమింగ్వే వాక్యాలు లాంటివి రాసిన త్రిపుర గారు – బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఎం. ఏ. లిటరేచర్ లో గోల్డ్ మెడల్ తీసుకున్న, ఇంగ్లిష్ ప్రొఫెసర్ త్రిపుర గారు ( వారు లెజెండ్ అవునో కాదో నా మంద బుద్ధికి తెలియదు కానీ, తన కొద్దిపాటి పాఠక వీరాభిమానులకు మాత్రం ఓ కల్ట్ ఫిగర్ ) – అలాంటి త్రిపుర గారు కూడా ( త్రిపుర కధలు ) తప్పక చదవ తగ్గవారు అని మీకు నా విన్నపం.

  http://kinige.com/book/tripura+kathalu+print+book


 15. Sreekanth Gaddipati

  వెరీ గుడ్ స్వాప్నిక్..

  All the best.
  Sreekanth Gaddipati.


 16. Sasikala Volety

  స్వాప్నిక్! అద్భుతం, అనిర్వచనీయం లాంటి మాటలతో నిన్ను ఉక్కిరిబిక్కిరి చెయ్యలేను. ఎందుకంటే నువ్వు వాటికతీతంగా ఎదిగిపోయావు, ఒక అద్వితీయ స్వాప్నిక పుస్తత జగత్తులో ఒదిగి పోయావు. ఒక జీవితకాలం చాలా తక్కువ అనుకునేవారికి ఒక యేడాది ఎంత ఇవ్వగలదో, ఎంత తీసుకో వచ్చో చూపించావు. నిజమే ఇన్ని అనుభూతులు తెలుసుకోడానికి ఒక జీవితకాలం సరిపోదు. అందుకే ఏళ్ళ తరబడి, రకరకాల ఒరవడులలో ఆవిష్కారమయిన విశ్వ సాహిత్యం మనకు ఎన్నో జన్మల అనుభవాలను ప్రోవుచేసి పెడుతుందని మాకు చెప్పావు. ఎవరయినా పిల్లలను సజావుగా పెంచుకుందామనుకుంటే, నీ జాబితా దగ్గర పెట్టుకోడంఉత్తమోత్తమం. నేనిది నా కూతరికీ, నా మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మనవలందరికీ పంపుతా. అక్కడో కుర్రాడున్నాడు. అల్లరి చేస్తూనే పుస్తకాలతో, వాటి అమ్మా నాన్నలతో జట్టుకట్టేసి , ఒక వ్యాసం రాసి మమ్మల్ని కట్టిపడేసాడూ అని. గాడ్ బ్లెస్స్ యు నాన్న. నువ్వనుకున్నవన్నీ సాధించాలి.


 17. సునీత

  ఎందరు ఆత్మీయుల్ని సంపాదించుకున్నారు స్వాప్నిక్. అభినందనలు.

  చిన్న చిన్న వాక్యాలతో చెప్పడం, నచ్చిన విషయం ఆనందంగా చెప్పడం, నచ్చకపోవడం పెద్దగా లెక్కించకపోవడం; మీరు ఎంత నేర్చుకున్నది చాలా అందంగా అర్థం అయ్యింది.

  మరింత మంది ఆత్మీయుల్ని పెంచుకుని మాకూ పంచండి ఈ సంవత్సరం కూడా.


 18. S V R Jogarao

  ఆర్యా,
  శ్రీ చీమలమఱ్ఱి స్వాప్నిక్ గారికి,
  శుభోదయ నమస్కారములు..
  సుప్రభాత శుభాకాంక్షలు.
  ఉభయ కుశలోపరి
  ఆరు కాలాలు ఏడు లోకాలు వ్యాసం చదువుతూ చదువుతూ ఆవిడ పోయేను.
  ఒక సంవత్సరములో మీరు ఎన్ని గ్రంథములు చదివేరా ?
  నమ్మలేక పోతున్నాను.
  మీ పఠనాసక్తికి జోహారులు.
  ఇంత మంది రచయితలను మీ విజ్ఞాన కోశములో బంధించిన మీ మాతృమూర్తికి, మీ సోదరికి జోహారులు.
  అభివాదములు.
  జోగారావు


 19. amarendra

  అక్షర ప్రపంచానికి స్వాగతం …మీ నుంచి మంచి రచనలు ఆశిస్తున్నాం…శుభ ఆకాంక్షలు


 20. Venkat Suresh

  స్వప్నిక్, ఈ మధ్య కాలంలో ఇంత ఆత్మీయంగా రాసిన వ్యాసం చదవలేదు. అంత గొప్ప గొప్ప రచయితల గురించి .. ముచ్చటైన మాటల్లో ఎంత బాగా చెప్పారు!!


 
   Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నేనూ, పుస్తకాలూ, రెండువేల పదహారూ …

వ్యాసకర్త: పద్మవల్లి ************* ఓ రెండేళ్లుగా కొన్ని కారణాల వల్ల నేను పుస్తకాలు చదవటం బాగ...
by అతిథి
0

 
 

2016 లో చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: Naagini Kandala ********************* ప్రతి సంవత్సరం మొదట్లో క్రమం తప్పకుండా Good reads లో రీడింగ్ ఛాలె...
by అతిథి
0

 
 

2016 నా పుస్తక పఠనం

జంపాల చౌదరి గారి పోస్టు చూసి ఆ స్ఫూర్తి తో రాస్తున్న పోస్టు ఇది. గత ఏడాది నాకు అమెరిక...
by సౌమ్య
0

 

 

Books 2016

This has been a busy year for me with a lot of travel and work on different fronts. Finding leisure time was difficult. At some point, I stopped visiting our local library. While I went to India thrice during the year and colle...
by Jampala Chowdary
0