నరదేవుడి కథ

ఇజ్రాయెల్ కు చెందిన చరిత్రకారుడు యువల్ నోవా హరారీ వ్రాసిన Sapiens, Homo Deus అన్న రెండు పుస్తకాలు బహుళ ప్రజాదరణని పొందాయి. ఈ పుస్తకాల్లో మానవ చరిత్రనీ, భవిష్యత్తునీ ‘భావవాదపు ఛాయల్లో’ విహంగ వీక్షణం చేయిస్తాడు రచయిత. వాటి సారాంశాన్ని (ప్రధానంగా Homo Deus ని) పరిచయం చెయ్యబోయే ముందు ఒక మాట.
ఒక మంచి పుస్తకానికి సారాంశం వ్రాయడం అంటే, అందమైన పూలదండలోని పువ్వులన్నిటినీ పీకేసి దారాన్ని మాత్రం చేతిలో పెట్టడంలాంటి పని. కాబట్టి, రచయిత ఎన్నో ఆసక్తికరమైన సంగతుల్ని పేర్చుతూ ఏకబిగిన చదివించేలా వ్రాసిన‌ ఈ పుస్తకాలని, నా వ్రాతలెల్లా ఉన్నప్పటికీ పుస్తక ప్రియులు పట్టించుకోకుండా, తప్పకుండా చదువుతారనే నా నమ్మకం.

భూమ్మీద‌ నరుడే రారాజు

పదిహేను వేల సంవత్సరాల పూర్వం వరకూ జనాభా ఎప్పుడూ సుమారుగా పది లక్షల నుంచి కోటికి మించని, నరులని పిలవబడే ఓ కోతి జాతి, ఈ రోజు భూగోళం మొత్తాన్ని ఆక్రమించి, దాని మీద చెరగని ముద్ర వేసి, తన పేరు మీద‌ ‘ఆంత్రొపోసీన్’ గా ఇప్పటి భౌగోళిక యుగాన్ని నిర్వచింపజేస్తున్నది.
నరపురుగులు మిగిలిన యావత్తు జంతుజాలాన్నీ ఇంతగా మించిపోవడం ఎలా సాధ్యమైంది? ఏమిటి వీళ్ళ ప్రత్యేకత? తెలివా?

జంతువులు మనకన్న తక్కువ తెలివైనవి కావు

చాలా జంతువులు మనతో పోలిస్తే తెలివితక్కువవి ఏమీ కావు. మన సోదర కోతి జాతులు కొంచం ఎక్కువ తక్కువల్లో మన ‘తెలివిడి’లోని అన్ని అంశాలనీ కలిగి ఉన్నవే. డాల్ఫిన్లకీ భాష ఉన్నది. కొన్ని రకాల కోతులు పనిముట్లు వాడతాయి.

మరైతే, మనం పరస్పరం సహరించుకోగలగడమే మన విజయానికి కారణమా? కావచ్చునంటే, మన సోదర కోతులూ సామాజిక జీవులే. ఆమాటకొస్తే చీమలు, తేనెటీగలు మనకన్న‌ గొప్పగా సహకరించుకోగలవు. కోట్లాదిగా చీమలు ఒకే సమాజంగా నివసించగలవు. మరి ఏమిటి తేడా?

పోనీ, జంతువులు మనకన్న తెలివి తక్కువవే అనుకుందాం. మనకీ, మనకు ముందు డెబ్భైవేల సంవత్సరాల వరకూ ఉన్న మన పూర్వులకీ తెలివితేటల్లో తేడాలేమీ లేవు. వాళ్ళకీ భాష ఉన్నది. పనిముట్లు ఉన్నై. వాళ్ళూ సమాజాలుగానే జీవించారు. మరి వాళ్ళు అప్పుడే మనంతగా ఎందుకు వ్యాపించిపోలేదు?

ఊహాత్మక విషయాలని అందరూ  పంచుకుని నమ్మగలగడం (Inter-subjectivity)

తేడా అంతా ఆధునిక మానవులు సహకరించుకునే పద్ధతిలోనే ఉన్నది. చీమలు సహకరించుకునే పద్ధతి వాటికి పుట్టుకతోనే వస్తుంది. అందులో మార్పు సాధ్యం కాదు. చింపాంజీలు తమ సమాజంలో తమ పరిచయస్తులతోనే సహకరించగలవు. ముక్కూ మొహం తెలియని కొత్తవాటితో సహకరించలేవు. ప్రాచీన మానవులూ అంతే. అలాంటి – పరిచయస్తులకే పరిమితమయ్యే – సహకారం నూటా యాభై మంది కన్న తక్కువైన గుంపుల్లో మాత్రమే సాధ్యం. ఆ రకమైన సహకారంతో వ్యవసాయాలు చెయ్యడం, నగరాలు నిర్మాణం చెయ్యడం సాధ్యం కాదు. వేటాడ్డం, ఆహారం సేకరించుకోవడం మాత్రమే దానితో కుదురుతుంది.

మనం అల్లా కాదు. కోట్లాదిమంది ప్రజలం ఒకే వ్యవస్థలో భాగంగా జీవిస్తాం. డబ్బుకోసం ఎవడితోనైనా వ్యాపారం చేస్తాము. మన దేశం వాడితోనో, మతం వాడితోనో మనకి ఉత్తినే పేచీ ఉండదు. ఆపిల్ కంపెనీవాడి సరుకంటే కళ్ళు మూసుకుని కొంటాము. డబ్బు, దేశం, మతం, దేవుడు, కార్పొరేషన్ – వీటి పేరు చెప్పి మనం లక్షలు, కోట్లాది మందిగా సహకరించుకోగలం. ఒకే పనిలో భాగం కాగలం.

మరి ఈ డబ్బు, దేశం, దేవుడూ, కంపెనీ ఎక్కడ ఉన్నాయి? భౌతికంగా లేవుగా! మన ఊహల్లోనే ఉన్నాయి. అంతే కాదు, మన అందరి ఊహల్లోనూ ఉన్నాయి. భౌతిక వస్తువులెంత నిజమో మనకి అవీ అంతే నిజం. ఇలాంటి ఊహాత్మక వస్తువుల్ని/విషయాల్ని మనం పుట్టించి, అందరితోనూ పంచుకోగలం. అందరూ అవే ఊహల్ని నమ్మేలా, వాటి ఆధారంగా సహకరించేలా చేయగలం.

అంతే కాదు, కాలానుగుణంగా ఈ ఊహల్ని మార్చుకోగలం. పాతవాటిని వదిలేసి, కొత్త ఊహల్ని పుట్టించగలం.  వాటి ద్వారా మన సహకారాన్ని అనేకవిధాలుగా విస్తరించుకోగలం. అదీ మన బలం. మిగతా జంతువుల్తో పోలిస్తే అదే మన విజయ రహస్యం.

ఏ ఊహలు ఎక్కువమందికి మేలు చేస్తాయో, అవే విజయవంతమౌతాయి

చరిత్ర పూర్వపు కాలం నుంచీ ఆధునిక కాలం వరకూ కలిగిన పరిణామాలకి ఆయా కాలాల్లో మనం పుట్టించి, పంచుకున్న‌ కొత్త కొత్త ఊహలే కారణమయ్యాయి. ఏ ఊహలు ఎక్కువమంది జనాల్ని సమీకరించి, వాళ్ళ సహకారాల్ని పొందగలిగేయో, అవే విజయవంతమయ్యాయి.

రెండు ఉదాహరణలు. ఒకటి: వ్యవసాయానికి పూర్వం చెట్లనీ, నదుల్నీ, జంతువుల్నీ పూజించే  ప్రకృతి మతాలు ఉండేవి. అవి ఎక్కడికక్కడ స్థానికంగా ఉండేవి. వ్యవసాయంతో నగరాలు, రాజ్యాలు నిర్మాణమైనాక‌, ఏకేశ్వరోపాసనా మతాలు పుట్టి మరింతగా ప్రజల్ని సమీకరించడం ప్రారంభమైంది. క్రైస్తవం గాని, ఇస్లాం గాని ఆయా కాలాలకి సంబంధించిన భావజాలాల పరంగా చూస్తే పెద్ద ముందడుగులే, సామాన్య ప్రజల్ని మరింతగా తమ గొడుగు కిందకి తెచ్చుకున్నవే.

రెండు: వ్యాపారాల్లో పెద్ద ఎత్తున ప్రజల్ని భాగస్వాములుగా చెయ్యడం మొదలైన తర్వాతే యూరోపియన్ కలోనియలిజం ప్రారంభమైంది. యుద్ధాలకి కూడా ప్రజల పెట్టుబడుల్ని ఆహ్వానించారు. దానివల్ల జవాబుదారీతనం పెరిగి ప్రభుత్వాలు, కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించడం, అవి నిర్మించుకున్న కొత్త‌ వ్యవస్థలు పాత రాజరిక వ్యవస్థలకన్నా విజయవంతం కావడం జరిగింది.

మనల్ని నడిపిస్తున్న రెండు నమ్మకాలు

మానవ‌ చరిత్రలో గడిచిన మూడు వ‍ందల సంవత్సరాల చరిత్ర్ర ఇంకా ప్రత్యేకమైనది. మన‌ నాగరికత‌ వ్యవసాయం నుంచి పారిశ్రామిక యుగానికి మళ్ళిన‌ కాలమిది. ఈ కాలానికీ అంతకు ముందు కాలానికీ ఉన్న ప్రధానమైన తేడాలు రెండు నమ్మకాలు. ఈ రెండూ అంతకు ముందు చరిత్రలో కనీ, వినీ ఎరుగనివి. అవి ఇప్పటికీ మన సమాజాన్ని నడిపిస్తున్న చోదక శక్తులు. ఆ నమ్మకాలు ఏమిటంటే –

1) మనకి తెలిసింది చాలా తక్కువనీ, ప్రకృతిలో తెలుసుకోవలసిన విషయాలూ, మనకి ఇంతవరకు తెలియని భూఖండాలూ, సమాజాలూ చాలా ఉన్నాయనీ కొద్ది శతాబ్దాల క్రితం యూరోపులో పుట్టిన అవగాహన (Discovery of ignorance). ఇది సైన్సులోనూ, వ్యాపారంలోనూ విప్లవానికి దారి తీసింది.

నిజానికి అయిదు వందల సంవత్సరాల పూర్వం చైనా గానీ, భారత దేశంగానీ అర్థికంగా, సైన్సు పరంగా, సైనికంగా చాలా శక్తివంతమైన దేశాలు. కానీ ఆ సమాజాలు, మనకి తెలియనిదేమీ లేదు, తెలుసుకోవలసినది అంతకన్నా లేదనే ధోరణిలో అంతర్ముఖంగా ఉండిపోయినై. చైనీయుల నావికా సామర్థ్యం అప్పటి యూరోపు నావికా సామర్థ్యం కన్నా ఎక్కువ‌. వాళ్ళు తలచుకుంటే అమెరికా ఖండాన్ని అవలీలగా కనుక్కుని, ఆక్రమించుకుని ఉండేవారు. చరిత్ర మరొక రకంగా ఉండేది. కానీ అలా జరగలేదు.

2) అనంతమైన ఆర్థికాభివృద్ధి మీద విశ్వాసం (Belief in perpetual economic growth).  వ్యవసాయాధారిత సమాజాల్లో ప్రతి ఏడాదీ క్రితం ఏడాది లాగానే ఉండేది. అప్పులు సులభంగా పుట్టేవి కావు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది, ఎక్కువ డబ్బు వస్తుంది అన్న నమ్మకమూ సమాజంలో ఎవరికీ ఉండేది కాదు, ఆ నమ్మకానికి కావలసిన పరిస్థితులూ లేవు. ఎవడన్నా ముందుకొచ్చి, మీరు పెట్టుబడి పెట్టండి, నేను పరిశొధించి కొత్త విషయం కనుక్కుంటాను, దాని వల్ల అభివృద్ధి జరుగుతుంది అంటే అప్పట్లో జరిగే పని కాదు.

కానీ, ఈ రోజుల్లో ఆర్థికంగా అనంతమైన వృద్ధి సాధ్యమనే నమ్మకమే మన ఆర్థిక వ్యవస్థల్ని నడిపిస్తూ ఉన్నది. ఆ నమ్మకమే లేకపోతే ఒక్కసారిగా మన సమాజాలన్నీ కుప్పకూలిపోతాయి. బ్యాంకుల్లో అప్పు పుట్టదు. పరిశోధనలు ఆగిపోతాయి. ఉద్యోగాలు ఉండవు. వ్యాపారాలు ఉండవు. అందుకే ఆర్థిక మాంద్యం అనగానే అందరికీ దడ మొదలౌతుంది. మరి ఈ ఆర్థికాభివృద్ధి ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూనే ఉంటుందా? అన్న ప్రశ్నకి ఇంకా సరైన సమాధానం పుట్టలేదు. చాలామటుకు పైన చెప్పిన మొదటి అంశమే ఈ ప్రశ్నకి సమాధానం. మనకి కొత్త వస్తువుల్నీ, ఇంధనాల్నీ, ప్రకృతి రహస్యాల్నీ కనుక్కునే  సామర్థ్యం మీద నమ్మకం ఉన్నంత వరకు ఆర్థికాభివృద్ధి మీద విశ్వాసం సడలదు.

మన మూడు ప్రధాన విజయాలు

ఈ రెండు నమ్మకాలూ మనల్ని పారిశ్రామిక విప్లవంలోకి, దాని ద్వారా ఆధునిక యుగంలోకీ నడిపించాయి. ఇక్కడి దాకా వచ్చిన మానవుడు గత వంద సంవత్సరాల్లో సాధించిన ముఖ్యమైన విజయాలు మూడు ఉన్నాయి. అవి కరువు, అంటువ్యాధులు, యుద్ధాల మీద సాధించిన విజయాలు. వేల సంవత్సరాలపాటు  అంతు చిక్కని సమస్యలుగా మానవ సమాజాల్ని పీడించిన ఈ మూడు మహమ్మారుల పైనా ఇప్పుడు మనకు పట్టు చిక్కింది. ఒకప్పుడు ఇవి దైవాగ్రహం వల్ల కలిగే పీడలు. దేవతల్ని శాంతింపచెయ్యడం తప్ప‌ వాటి గురించి మనం చెయ్యగలిగేది ఏమీ ఉండేది కాదు. ఇప్పుడవి మనకు అర్థమైన, మనమే పరిష్కరించుకోగలిగిన సమస్యలు.

మరి ఇరవై ఒకటో శతాబ్దంలో ఇకపై మనం పోరాటం చెయ్యవలసిన ప్రధాన సమస్యలు ఏమి మిగిలి ఉన్నాయి?

రేపటి మానవుడు – నరదేవుడు

హోమో డియస్ – అంటే నరదేవుడి కథ ఇక్కడే ప్రారంభమౌతుంది. నిన్నగాక మొన్నటివరకు (భౌగోళిక కాలమానంలో పది, పదిహేను వేల ఏళ్ళ కాలం ఒక లెక్కలోనిది కాదు) సర్వసామాన్యంగా కనిపించిన‌ ఒక కోతి/నర‌ జాతి త్వరలో దేవజాతిగా మారబోతోంది. దేవజాతి అంటే, నరుడికి దివ్యశక్తులు రాబోతున్నాయి అని. నరుడు చావుని జయిస్తాడు. మనసుతో యంత్రాల్ని నియంత్రిస్తాడు. సర్వాంతర్యామి అవుతాడు – అంటే, అతని కళ్ళు ఒక దేశంలో చూస్తుంటాయి, చెవులు మరొక దేశంలో వింటుంటాయ్, ఇక్కడ‌ చేతులు ఉపయోగిస్తూ వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒక రోగికి అతను ఆపరేషన్ చేస్తుంటాడు. అతని శరీరావయవాల్లో ఏది యంత్రమో, ఏది కాదో కనిపెట్టలేం.

రాబోతున్న ఆ నరదేవుడి గురించి చర్చించుకునే ముందు అసలింత వరకు జరిగిన మన గమనంలోని మరొక అంశాన్ని లోతుగా పరిశీలించాలి.

నైతిక చట్రమూ ‍-  జ్ఞానార్జనమూ

మతమూ, సైన్సూ అన్నవి పాత చింతకాయ పచ్చడి మాటలు అయిపోయాయని పై మాటలు వాడేను. ఏ సమాజంలోనైనా ప్రధాన స్రవంతిగా ఒక నైతిక చట్రం ఉంటుంది. అది ఆ సమాజంలో అధికులూ, అధికారం గలవాళ్ళూ నమ్మే, సమాజాన్ని శాసించే నైతిక విలువలుగా ఉంటుంది. నిన్నా మొన్నటి వరకూ మనం దీన్నే మతం అనేవాళ్ళం. (ఈ సందర్భంగా, ఆధ్యాత్మికతని మనం మతం నించి వేరు చేసి పక్కన పెట్టేద్దాం. మతాన్ని నైతిక చట్రం గానే చూద్దాం; ఎందుకంటే మనం మాట్లాడుతున్నది సమాజం గురించి, వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కాదు).

ఒకప్పుడు మతమూ ప్రకృతి జ్ఞాన‌మూ కలగలిసిపోయి ఉండేవి. ఆధునిక రూపాన్ని సంతరించుకున్న ప్రకృతి జ్ఞానం, అంటే సైన్సు, భౌతిక విషయాల నిజానిజాల (facts) గురించి మాత్రమే  శోధించగలదు. నైతికవిలువలు దాని పరిధిలోకి రావు. సైన్సుకి నిజంగా కావలసినదేమిటో తెలుసునా? ప్రకృతి మీద అధికారం. (ఒట్టి ‘జ్ఞానం’ లేదా ‘సత్యాన్వేషణ’ కోసం సైన్సు అనే చాదస్తుల్నిఇక్కడ పట్టించుకోకూడదు. ఎందుకంటే, ఇందాకే చెప్పినట్టు, ఇక్కడ మనం మాట్లాడుతున్నది సమాజం గురించి; ఒకరిద్దరు చాదస్తుల్ని గురించి కాదు). అలాగే మతాలకి, అంటే నైతిక చట్రాలకి కావలసింది సమాజం మీద అధికారం. కాబట్టి నైతిక చట్రాలెప్పుడూ సైన్సు మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాయి.

నిజానికి ఇవి రెండూ (సైన్సూ, మతమూ) నిరంతరం కొట్టుకు చచ్చే భార్యాభర్తల్లాంటివి. కానీ ఒకటి లేకుండా మరొకటి ఉండలేదు. మతానికి సైన్సు మీద అధికారం కావాలి. మరి సైన్సేమో నిరంతరం మతం చెప్పే అంశాల్లోని అసత్యాలని కనిపెట్టి వాటి మీద దాడి చేస్తుంటుంది. అప్పుడు మతం తన రూపం మార్చుకొని, మరొక కొత్త నైతిక చట్రంగా మారి, మళ్ళీ సైన్సుని నియంత్రిస్తుంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.

మన ఆధునిక మతం – మానవవాదం (Humanism)

పారిశ్రామిక విప్లవం వచ్చి సైన్సు అభివృద్ధి చెందాక ‘దేవుడు చచ్చిపోయాడు’ అన్నారు (నీషే). భౌతిక దేహానికి అతీతమైన ఆత్మ అనేది ఏదీ లేదన్నారు. పాత మతాలు అధికారం కోల్పోయినై. వాటి స్థానంలో మరొక భావజాలం వచ్చి చేరింది. దాన్నే మానవవాదం అన్నారు. దాని ప్రకారం, మానవుడి మీద అధికారం చెలాయించే బాహిరమైన శక్తి ఏదీ లేదన్నారు. మానవుడే మహనీయుడు.. శక్తియుతుడు యుక్తిపరుడు.. మానవుడే.. అని పాటలు వ్రాసేరు.

విషయం ఏమిటంటే, మనిషికి జీవించడానికి ఒక పరమార్థం కావాలి. దాన్ని పాత‌ మతాలు సమృద్ధిగా ఇచ్చినై. దేవుడున్నాడు. ఈ విశ్వమంతా ఆయన‌ ప్రణాళిక ప్రకారం నడుస్తూ ఉంది. నువ్వు అందులో ఒక భాగానివి. ఆయన ఈ విధంగా చెప్పాడు. అలా చెయ్. నీ భావాలకి, ఆవేశాలకి, నీ సొంత ఆలోచన్లకి విలువ ఏమీ లేదు. పైవాడు చెప్పిన ప్రకారం నడుచుకో, అదే పరమార్థం, అని పాత‌ మతాలు చెప్పాయి.

ఈ మతాలు చెప్పిన ‘సత్యాలు’ (దేవుడున్నాడు, శాశ్వతమైన ఆత్మ ఉన్నది మొదలైనవి) ఏవీ సైన్సు ముందు నిలబడలేవు. కాబట్టి ఆధునిక కాలంలో పాత‌ మతాలు తమ విలువని కోల్పోయినై. వాటి స్థానంలో వచ్చిన‌ మానవవాదం ఏం చెప్పిందంటే, ఈ ప్రపంచానికి అర్థం లేదు. కానీ దానికి అర్థాన్ని కల్పించేది నువ్వే.  నీలోని సున్నితత్వాలని, నీ అనుభవాల విస్తృతిని పెంచుకో. నీ పరమార్థాన్ని నువ్వే వెతుక్కో. నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి నువ్వే పరమార్థాన్ని ఇవ్వు అని. ఆ రకంగా మనిషికీ, అతని మనోభావాలకీ, తన పరమార్థాన్ని తాను వెతుక్కునే ‘వ్యక్తి స్వేచ్ఛ’కీ (Individual Freedom), ‘స్వేచ్ఛా సంకల్పాని’కీ (Free Will) మానవవాదం సింహాసనం వేసి కూర్చోబెట్టింది.

ఈ రోజు మనం మనోభావాలు గాయపడ్డాయి అని గొడవ చెయ్యగలుగుతున్నామంటే అది మానవవాదం మనకి ఇచ్చిన అధికారమే. (అంటే,  మానవవాదం అధికారంలో ఉండడమే.) పాతరోజుల్లో మనోభావాలూ, గాడిదగుడ్డూ అంటే రాజులూ, మతాధికారులూ చెమ్డాలెక్కదీసేవారు. ఈ రోజుల్లో ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అతను స్వచ్ఛందంగా ఆలోచించుకుని చేసే ఎన్నిక‌ తిరుగులేనిది. స్వేచ్ఛా విపణిలో వినియోగదారుడే రారాజు. నీకేది నచ్చితే అది చెయ్, నీ జీవితాన్ని ఏ విధంగా గడపాలో నిర్ణయించే హక్కు నీకు తప్ప‌ మరెవ్వరికీ లేదు అంటుంది హ్యూమనిజం.

నేటి మన నైతిక చట్రం -‍ లిబరల్ హ్యూమనిజం

ఈ విధమైన‌ హ్యూమనిజం ఇరవయ్యో శతాబ్దం ప్రారంభం నాటికి మూడు రకాలుగా చీలింది. మొదటిది పైన చెప్పిన మానవవాదమే. దాన్నేలిబరల్ హ్యూమనిజం (లేదా లిబరలిజం) అన్నారు. అది కొంత జాతీయవాదంతో కూడా కలగలిసింది. దాన్ని సవాల్ చేస్తూ సోషలిస్ట్ హ్యూమనిజం వచ్చింది.

అదేమంటుందంటే – బాగుందయ్యా, నీ మనోభావాలు నీకు ముఖ్యమే. అలాగే నిన్ను దోచుకునేవాడి మనోభావాలు వాడికీ ముఖ్యమే మరి. కాబట్టి వాడికీ నీకూ ఘర్షణ తప్పదు. అందుచేత‌, వ్యక్తి మనోభావాలు కాదు ముఖ్యం. నీ చుట్టూ ఉన్న సమాజం మనోభావాలు ముఖ్యం (ఎందుకంటే నువ్వు కూడా అందులో భాగం కాబట్టి). అందరి మనోభావాల్నీ సరిగ్గా పరిరక్షించాలంటే, అందరం కలిసి ఒక యూనియన్ లేదా పార్టీగా ఏర్పడాలి. అందులో చర్చించుకుని అందరికీ ఏది మంచో నిర్ణయించుకోవాలి. దాని ప్రకారం అందరం నడవాలి. ఒకసారి అలా నిర్ణయించుకున్నాక మళ్ళీ నా మనోభావాలు నావి అంటే కుదర్దు అని. అదీ, రెండోదైన సోషలిస్ట్ హ్యూమనిజం.

ఇక మూడోదాన్ని పరిణామ మానవవాదం (Evolutionary Humanism) అన్నారు. అది నాజీయిజానికి దారితీసింది. దాని గురించి ఇప్పుడు పెద్దగా చెప్పుకోనక్కరలేదు.

1914లో వచ్చిన మొదటి ప్రపంచయుద్ధంతో లిబరల్ హ్యూమనిజం బలహీనపడింది. సోషలిస్ట్, పరిణామ హ్యూమనిజాలు బలపడ్డాయి. కానీ, ఆ తర్వాత వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం దెబ్బతో పరిణామ హ్యూమనిజం నశించిపోయింది. సోషలిస్ట్ హ్యూమనిజం సోవియట్ రష్యా ప్రభావంతో ఎంతో బలపడింది. అలాగే పశ్చిమ యూరోపు, అమెరికాలలో లిబరల్ హ్యూమనిజం నిలబడింది.

సోవియట్ రష్యా అంతరించాక, చివరికి మిగిలిన ఒకే ఒక అధికారిక మతంగా, ప్రపంచవ్యాప్తంగా బలీయమైన ప్రధాన ఆలోచనా స్రవంతిగా, ఇప్పుడు లిబరల్ హ్యూమనిజం స్థిరపడి ఉంది. ఇదే ఇప్పటి మన నైతిక విలువల్నీ, మన సైన్సునీ, టెక్నాలజీని, కళాదృష్టినీ శాసిస్తూ ఉన్న మతం లేదా నైతిక చట్రం.

ఇప్పుడు మనం ఆలోచించవలసినదేమిటంటే, ఇరవై ఒకటవ శతాబ్దంలోమరింతగా అభివృద్ధి చెందుతున్న సైన్సుని హ్యూమనిజం నియంత్రిస్తూ పోగలదా? లేక, హ్యూమనిజాన్ని కూడా పాత మతాల్లాగే సైన్సు పెళ్ళగించి వేస్తుందా? దాని స్థానంలో కొత్త నైతిక చట్రమేమన్నా వస్తుందా? అది ఎలా ఉండవచ్చు? అని.

హ్యూమనిజం పునాదులు కదుల్తున్నాయి

వ్యక్తి (Individual), అతని స్వేచ్ఛా స‍కల్పం (Free Will), వ్యక్తి స్వేచ్ఛ (Individual Freedom)  అన్న భావనలు హ్యూమనిజానికి పునాదులు. గత కొద్ది దశాబ్దాలలో జీవశాస్త్రమూ, డేటా సైన్సులు ఆవిష్కరిస్తున్న సత్యాలూ, టెక్నాలజీలూ ఈ పునాదుల్ని కదిలిస్తున్నాయి.

  1. ఎలుకల మెదడుల్లో ఎలక్ట్రోడ్లని అమర్చి, దూరం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వాటి కార్యకలాపాల్ని నియంత్రించడం ఇప్పుడు సాధ్యమౌతోంది. ఆ ఎలుకలకి మరొకళ్ళు తమని నియంత్రిస్తున్నారని తెలియదు. తమ స్వేచ్ఛానుసారం, తమ ఆనందం కోసమే ఆ పనులు చేస్తున్నాయని వాటికి అనిపిస్తుంది.
  2. మిలటరీ అవసరాల కోసం మనిషి మెదడుని నియంత్రించగల‌ ఒక హెల్మట్ తయారు చేశారు. దాన్ని ధరిస్తే మనసు నిశ్శబ్దమై, భయాలు అన్నీ తొలగిపోయి, చేస్తున్న పనిమీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది.
  3. మనం అనుకుంటున్న ‘నేను’ లేక ‘వ్యక్తి’ (individual) అనేది ఏకరూపమైన వస్తువు/భావన‌ ఏమీ కాదు. మెదడులోని ఒకానొక‌ భాగం దాని గమనికలోకి వచ్చే అనుభవాలని బట్టి నిరంతరం ఈ ‘నేను’ అన్న భావనతో కూడిన ఒక కథని అల్లుతూ ఉంటుంది. ఆ అల్లిక‌లోని పరిమితుల్ని కొన్నిటిని ఇప్పుడు పరిశీలించడం సాధ్యమౌతోంది.
  4. ఒక వ్యక్తి మెదడుని స్కాన్ చేస్తూ, ఆ వ్యక్తికి కలిగే ఆలోచనల్నీ, కోరికల్నీ ఆ వ్యక్తి కన్నా ముందుగానే మరొకళ్ళు గుర్తించడం వీలుపడుతోంది.
  5. డేటా సైన్సు మన గురించి ఎంత వివరంగా తెలుసుకోగలదంటే, మన అభిరుచులూ, మన వ్యక్తిత్వ విశేషాలూ మనకన్న ఎక్కువగా దానికే బాగా తెలుస్తాయి. మన గురించిన నిర్ణయాలని, మన కన్న ఎంతో బాగా, కంప్యూటర్లే తీసుకోగలవు. అంతే కాదు, మనం చేయబోయే కార్యకలాపాల్ని అవి ముందుగానే చాలామటుకు పసిగట్టగలవు.
  6. కృత్రిమ మేధ అభివృద్ధి చెందాక ఒక విషయం స్పష్టమైంది. ‘తెలివి’ (intelligence)కి ‘చైతన్యం’ లేదా ‘ఎరుక'(consciousness) అవసరం లేదని. మన తెలివిని అనేక కోట్ల రెట్లు మించిన‌, ‘ఎరుక’ లేని, కృత్రిమ మేధ భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుంది. అప్పుడు మానవులకి ఉన్న ప్రత్యేకతగా పేర్కొనడానికి ‘ఎరుక’ తప్ప ఏమీ మిగలదు. మనం ఇప్పుడు జంతువుల ‘ఎరుక’ కి ఇచ్చే విలువ ఎంతో చూసుకుంటే, భవిష్యత్తులో మానవులకి మిగలబోయే విలువ ఏమిటో మనకి కొంతమటుకు అవగాహనకి వస్తుంది.

 

పైన చెప్పిన అంశాలన్నీ కలిపి చూసుకుంటే, ‘వ్యక్తి’, ‘స్వేచ్ఛ’, ‘స్వేచ్ఛా సంకల్పం’ అన్న భావనలు కూడా ‘దేవుడు’, ‘ఆత్మ’, ‘స్వర్గనరకాలు’ మొదలైన పాత మత భావనల్లాగే సైన్సు దెబ్బకి కొట్టుకుపోయే అవకాశం ఉందని తెలుస్తుంది.

అంతవరకూ వెళ్ళకపోయినా, లిబరల్ హ్యూమనిజానికి ఎదురవబోయే ప్రమాదాలు ఈ విధంగా ఉండవచ్చు. మొదటిది, మానవమేధ బలహీనమైనది కాబట్టి మన వ్యవస్థల్ని చాలా మటుకు కృత్రిమ మేధ చేతిలో పెట్టడం. దానివల్ల మానవుల అధికారం నశిస్తుంది. మనకి సంబంధించిన అన్ని నిర్ణయాలూ కృత్రిమ మేధ తీసుకుంటుంది. అప్పుడు వ్యక్తులుగా, సమాజంగా మనం ఇప్పటికన్న ఎక్కువ ఆనందంగానే ఉండవచ్చు. కానీ లిబరలిజం భావనకి ఇది పూర్తి వ్యతిరేకం.

రెండు, కృత్రిమ మేధ వల్ల జనసామాన్యానికి పెద్దగా విలువ లేకుండా పోయి, కొద్దిమంది ప్రత్యేకమైన నైపుణ్యాలు, అసాధారణ తెలివితేటలూ కల మానవులకే విలువ పెరగవచ్చు. తద్వారా కొద్దిమంది ప్రత్యేక తరగతిగా మారి ప్రత్యేకాధికారాలు పొందవచ్చు. అంతే కాదు, జరగబోతున్న వైద్య, శాస్త్ర పరిశోధనల్లో అగ్రభాగం మానవ సామర్థ్యాల్ని పెంపు చేసి, ‘అతిమానవు’ల్ని రూపొందించేవిగా ఉండబోతున్నాయి. ఇవి అందరికీ అందుబాటులోకి వస్తాయా అన్నది ఒక సందేహం. ఆర్థికంగా వెనకబడ్డ సమాజాలకి ఆ పరిశోధనల ఫలితాలు అందకపోవచ్చు. ఆ రకంగా చూసినా శాస్త్ర, సాంకేతికాభివృద్ధి లిబరల్ హ్యూమనిజాన్ని దెబ్బతీసే అవకాశాలే కనిపిస్తున్నాయి.

టెక్నో హ్యూమనిజం; డేటాయిజం

ఇలాంటి పరిస్థితుల్లో లిబరలిజం స్థానంలో కొన్నికొత్త మతాలు రాబోతున్నట్టు కనిపిస్తున్నాయి. మొదటిది, టెక్నో హ్యూమనిజం. ఇది స్థూలంగా ఏమి చెప్తుందంటే, టెక్నాలజీ ద్వారా మానవుని చైతన్యాన్నీ, భౌతిక, మానసిక సామర్థ్యాల్నీ విస్తృతపరచి అతిమానవుల్ని (నరదైవాలని) తయారు చెయ్యాలని.

ఈ దిశగా మనం పురోగమిస్తే , ఎప్పటికైనా మెదడు యొక్క రహస్యాల్ని మరింతగా భేదించి, మన కోరికల్నీ, ఆలోచనల్నీ, మనం అనుకునే స్వేచ్ఛా సంకల్పాన్నీ కూడా నియంత్రించగల స్థాయికి సైన్సు చేరుకోవడం తథ్యం. అప్పుడు ఏమి జరుగుతుందో మన ఊహకి అందని విషయం.

రెండవది, డాటాయిజం. సృష్టిలోని ప్రాథమికమైన మూలకం సమాచారమే అనీ, సమాచార ప్రవాహమే ఈ ప్రపంచంగా విస్తరిస్తున్నదనీ, మానవులతో సహా సకలజీవజాలమూ కూడా సమాచారాన్ని మదింపు చేసే ఆల్గారిథమ్స్ మాత్రమే అనీ డాటాయిజం చెప్తుంది. పాత మతాల్లోని దేవుడి స్థానాన్ని దీనిలో సర్వసమ్మిళితమైన సమాచార ప్రవాహం (లేదా నెట్వర్క్) ఆక్రమిస్తుంది.

మానవ చరిత్రను డేటాయిజం దృక్పథంతో వివరించడం సాధ్యమే. మనుషులందరూ నెట్వర్క్ లోని కంప్యూటర్ల వంటివారు. చరిత్రలోని ఒక్కొక్క దశా ఈ కంప్యూటర్లు ఒకదానితో ఒకటి అనుసంధానించుకున్న తీరుగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్. రాచరిక, సోషలిస్టు వ్యవస్థలు సెంట్రలైజ్డ్ నెట్వర్క్. ఇలా.

ఈ మతం ప్రకారం మనిషి అర్థాన్ని వెతుక్కోవాల్సినది తనలో కాదు, నెట్వర్క్ లో. అతని అనుభవాలకి విలువ ఏమీ లేదు, సాగుతున్న సమాచార స్రవంతికి తన వంతు దోహదం చెయ్యడం తప్ప. నెట్వర్క్ తన లక్ష్యం కోసం తాను ముందుకు సాగుతుంది. సకల వస్తువుల్నీ అనుసంధానించుకుంటూ గెలాక్సీల దాకా విస్తరిస్తుంది. దాని ప్రయాణంలో, ఇంకా ఇంకా ప్రభావవంతమైన ఆల్గారిథమ్స్ పుట్టే కొద్దీ మనిషికి విలువ నశిస్తుంది. మనిషి అస్తిత్వంతో సంబంధం లేకుండానే నెట్వర్క్ విస్తరిస్తుంది – సరిగ్గా ఈనాడు మనం ‘అభివృద్ధి’ కోసం భూతాపాన్ని, ఇతర ప్రాణికోటి సంక్షేమాన్నీ పట్టించుకోనట్టుగానే.

ఉపసంహారం

మానవ చరిత్ర మీద చేసిన ఈ విహంగ వీక్షణానికి గల ఉద్దేశ్యం ఒకటే. ఒకసారి నిలబడి, మనం అసలు ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చామో, ఇప్పుడు ఏ కూడలిలో నిలబడ్డామో చూసుకోవడం. అలా వెనక్కి, మన చరిత్రలోకి చూసుకోవడం వల్ల మాత్రమే మనం దాని ప్రభావాల నుంచి విముక్తిని పొందగలుగుతాం.
భవిష్యత్తును మనం దర్శించలేం. కానీ ఏ దిశగా మనం సాగుతున్నామో ఒకసారి సమీక్షించుకోవడం అవసరం. ఇరవై ఒకటో శతాబ్దంలో అడుగు పెట్టిన మనం మూడు తాత్త్విక‌ ప్రశ్నల్ని గాఢంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది.

1) జీవులంటే ఆల్గారిథమ్సేనా? జీవితమంటే సమాచార మదింపు మాత్రమేనా?
2) మనకి ‘తెలివి’ ముఖ్యమా? ‘ఎరుక’ ముఖ్యమా?
3)  మనకన్న తెలివైన కృత్రిమ మేధకి మన వ్యవస్థలమీద అధికారం ఇస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?
బహుశా ఈ ప్రశ్నలద్వారానే మానవుల‌, ఇంకా ఇతర‌ జీవజాలాల భవిష్యత్తు నిర్దేశింపబడవచ్చు.

చివరి మాట‌

నాకీ పుస్తకాలు నచ్చడానికి ప్రధానకారణాలు మూడు:
1) చరిత్ర గురించి రచయిత చేసిన ఆసక్తికరమైన సూత్రీకరణలు (‘భావవాదపు ఛాయల్లో’. అవి అందరికీ రుచించకపోవచ్చు).
2) వేదాంత ఛాయల్లో చాలా చోట్ల‌ కవితాత్మకంగా చేసే చర్చ (రచయిత విపస్సన మార్గంలో ధ్యాన సాధకుడు. అతనిపైన బౌద్ధ తాత్వికత ప్రభావం ఉన్నది).
3) సందర్భానుసారంగా ఆసక్తికరమైన చారిత్రిక, విజ్ఞానశాస్త్ర విషయాలను గుదిగుచ్చుతూ అతను కథనాన్ని నడిపిన తీరు.
పుస్తకంలోని భాగాలు ఒకసారి చదవగానే మరొకసారి తిరిగి చూడకుండా ఈ సారాంశాన్ని వ్రాస్తూ పోయాను కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలని నేను వదిలివేసి ఉండవచ్చు. (జంతువులకూ, ప్రకృతికీ మానవ ‘అభివృద్ధి’ వలన కలుగుతూన్న వ్యధనీ, వినాశనాన్నీ రచయితే పదే పదే వివరిస్తాడు, నేనా అంశాన్ని ఈ వ్యాసంలో పెద్దగా స్పృశించలేదు).

ఈ వ్యాసంలో ఎక్కడైనా నేను రచయితని సరిగ్గా అర్థం చేసుకోక తప్పుగా పేర్కొంటే, దయచేసి సరిదిద్దండి. రచయితదే తప్పంటే నేను తిరిగి మాట్లాడను కాని, వివరాలు తెలుసుకోవడానికి మాత్రం సిద్ధం. (రచయిత అక్కడక్కడా మరీ నేల విడిచి సాము చేసినట్టు నాకూ అనిపించింది సుమా!)

You Might Also Like

7 Comments

  1. Venkata subbaiah

    Very nice.i listened to harari.u expressed the salient points nicely.

  2. Chinna

    Very nice article murali garu..

    1. nagamurali

      Thank you Chinna gaaru

  3. చంద్ర మోహన్

    “భావవాదపు ఛాయల్లో…” – దీని ఆంగ్ల సమానార్థకం ఏమిటి?

    1. nagamurali

      “భావవాదపు ఛాయల్లో…” : along the lines of Idealism / has shades of Idealism.

      Here, Idealism is from Philosophy. If we google it, we find its definition as ‘any of various systems of thought in which the objects of knowledge are held to be in some way dependent on the activity of mind.’

  4. చంద్ర మోహన్

    పరిచయం ఆసక్తికరంగా, అసలు పుస్తకాన్ని వెంటనే చదవాలని ప్రేరేపించేలా వుంది. విషయం కొంత బరువైనది కనుక పుస్తకం అందరికీ రుచించక పోవచ్చు. వారికి మీ పరిచయం గొప్పగా ఉపయోగ పడుతుంది.

    1. nagamurali

      చంద్రమోహన్, మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

Leave a Reply