తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి
(విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సాహితీచర్చ కోసం తయారుచేసిన వ్యాసం.)
****************

ముందు తెఱచిరాజు గురించి విశ్వనాథ వారి మాటలు..

“మొదటిది నేను ఏమి వ్రాస్తానో నేను తెలిసికొని వ్రాస్తాను గనక. నేను వ్రాసిన దానిలో అనంత విషయములు చొప్పించి వ్రాస్తాను కనక. అనాది నుంచీ ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకొంటూ వస్తున్నది. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను సఫలుణ్ణయి వాళ్ళని జ్ఞానవంతులను చేస్తున్నాను అనేభావం నాకు ఉన్నది కనక. ఈ భావం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసును కనక. పూర్వ సాహిత్యం ఒకటి ఉన్నది. నేను పోతే నాతో పోయే వాళ్లు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన్న, పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు మొదలయినవారు. ఊరికే ఒట్టి పూర్వకవులని కాదు – పద్యరచనాసామ్రాజ్య పట్టభద్రులు; కథాకథన శిల్పనూత్నాచార్యులు; వేదవేదాంగాది మహాగ్రంథస్థలు; మహావిషయనిర్ణేతలు; బహువిషయ వ్యాఖ్యాతలు; కావ్యకథాశిల్ప రహస్యవేత్తలు; అనే దృష్టితో ఆ పూర్వకవులను నిలబెట్టుకొంటే అప్పుడు నేనూ నిలుస్తాను. నేను చేసినపని అటువంటిది. రోజులు మారిపోయి తెలియటంలేదు. ఇంక నవలలను గురించి చెప్పవచ్చును. బందరులో మంజులూరి కృష్ణారావని ఒక మహానటుడు ఉండెడివాడు. పూర్వపు కూచిపూడి వాళ్ళలో పరదేశి మొదలైన వాళ్ళు ఎటువంటి అభినేతలో ఆయన అటువంటి వాడు. నాకు అభినయం చాలా తెలుసు. అదంతా అతనిని చూచి తెలుసుకొన్నదే. అత డొక విచిత్రమైన పురుషుడు. అతని నాట్యకౌశల మంతా ‘తెఱచిరాజు’ నిండా వ్రాసినాను. ఆహార్యకము, వాచికము, ఆంగికము, సాత్వికము మనకు పేర్లు తెలుసు. పెద్ద నటకుల మనుకునే వాళ్లకు కూడా ఆ పేర్లు మాత్రమే తెలుసు. ఈ నాటకాలు వేసే వాళ్లలో ఈ నాలుగూ సర్వంకషంగా తెలిసినవా డతడొక్కడే (పూర్వపు కూచిపూడి భాగవతులను వదిలిపెట్టి). తెఱచిరాజులో అతను ఎంత ఉన్నాడో, అతను కానిదీ అంత ఉన్నది. ఒక నవల వ్రాస్తూ ఉంటే మనము ఎరిగున్న మనుష్యుణ్ణే తీసుకొంటాము. కథ, భావము, రసము, పాత్రపోషణ మొదలైన వానిని పురస్కరించుకొని వ్రాస్తూ ఉంటే ఆ ఎరిగి ఉన్న పురుషుడు మారిపోతాడు. చాలా మారిపోతాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టర్‌ బి.వి.కుటుంబరా వని ఉన్నాడు. అతను తెలుగు నవలలను గురించి ఒక పరిశోధకవ్యాసం వ్రాసి డాక్టరేట్‌ పట్టం పొందాడు. ఆయన వ్రాసినట్లు – ఏకవీరలో నేను ప్రారంభించిన త్వగింద్రియస్పర్శ లక్షణము, తెఱచిరాజులో మరల నెత్తికొని వ్రాశాను” ఇవి- తెఱచిరాజు గురించి విశ్వనాథ సత్యనారాయణగారి చెప్పిన మాటలు.

ఒక రచయిత మాటల్లో చెప్పాలంటే “తెరచిరాజు, చెలియలికట్ట ఆ వరుసలోనే చదివాను. స్ర్తీ పురుష సంబంధాల గురించి ఆ నవలలో ఆయన చిత్రించిన సంగతులు కలవరపరిచేంత బలంగా ఉంటాయి. తెరచిరాజు చదివి నేను విహ్వలుడనయి ఏడ్చాను. వారం రోజులు తిండి మరిచి ఆలోచించాను. అట్లాంటి పుస్తకాలను వెదికయినా సరే తెచ్చి చదవాలి”.

ఇంతకీ తెఱచిరాజులో ఆయన ఏం చెప్పారు? నవలలో ఆయన మధించిన విషయాలు వదిలి ముందుగా కథను మాత్రం తలస్పర్శామాత్రంగా స్పృశిస్తాను.

కథ.

ఈ నవలలో ముఖ్య పాత్రలు సారథి, వాసంతి. సారథి మహా నటుడు. వైరాగ్య భావన ఉంటుంది. నటయోగి. అతనికి ఇష్టం లేనప్పటికీ కొంత కాముకత్వం కూడ ఉంటుంది. వాసంతి అతని స్నేహితుడి కూతురు. చిన్నప్పటి నుండి ఎత్తుకొని పెంచాడు. ఇప్పుడు సారథికి సుమారు 45 పైబడి. వాసంతికి 16. స్థలం – పల్లె నుండి పెరిగి ఇంకా పట్టణం కాని ఓ పెద్ద గ్రామం. కాలం – అటు పూర్తిగా జమీందారీ రోజులూ కాక, ఇటు రాజరికం పూర్తిగా నశించీ ఉండని రోజులు.

మొదట మోహినీరుక్మాంగద నాటకం జరుగుతుంటుంది. సారథికి అభినయం బాగా వచ్చు కాని అందగాడు కాదు. రుక్మాంగదుడి వేషంలో ఉంటాడు. వాసంతి మోహిని. నటనంటే ఇష్టం. కానీ రాదు. సంగీతం బాగా వస్తుంది. కాని అంత ఇష్టం లేదు. ఈ నాటకంలో ఆమెకు కొన్ని గీతాలుంటాయి. సామాజికులకు ఇష్టం కనుక పాటల కోసం సారథి ఆమెను తీసుకుంటాడు. ఆ వేషములో ఆమె చాలనములలో భాసించిన సౌందర్యం అతనిలో, అతని నటనా వైదుష్యం ఆమెలో, ఇదమిత్థమని చెప్పలేని ఒక భావన సూచనాప్రాయంగా ఎక్కడో ఓ మూల అనిపిస్తుంది. నాటకము తరువాత వేషం తీసివేసేటపుడు వాసంతి సారథి కేయూరములు పొరపాటున తాకుతుంది. సారథి తాకరాదని వారిస్తాడు. వాసంతి కొంచెం నొచ్చుకున్నట్లవుతుంది.

తరువాత రోజు శిరీషు ఇంటికి వెళతాడు. ముందు జరిగిన నాటకము గురించి చర్చ ఉంటుంది. వాసంతికి త్వరలో ఒక సంగీతపు కచేరి ఉన్నది. వాసంతి తన కుడి చేయి సారథి భుజం మీద వేసి ఎడమ చేయి అతని రొమ్ముపై వేసి కచేరికి తప్పనిసరిగా రావలసినదిగా అడుగుతుంది. తనకు సంగీతమంటే ఆసక్తి లేదంటాడు. తను రాకపోతే పాడనంటుంది. చూద్దాం అంటాడు.

సారథి ఇంటికి వెళ్తాడు. అది ఒక తోటలో పాక వంటి ఇల్లు. పెళ్ళి పెటాకులు లేవు. నాటకం వేయడం, తోటంతా తవ్వి పని చేసుకోవడం, సముద్ర తీరంలో నడుస్తూ ఉండడం చేస్తూ ఉంటాడు. ఒక కాల నియంత్రణ, నిర్వహణ ఏమీ లేవు. తరువాతి రోజూ సముద్ర తీరంలో నడుస్తూఉంటాడు. అక్కడ ఉమాపతిని కలుస్తాడు. ఉమాపతి ఆలోచనాపరుడు. జ్ఞాని అని చెప్పుకోవచ్చు. సారథికి స్నేహితుడు. నిజానికి అతనిలాంటి వాళ్ళ మెప్పుదల కోసమే తను నాటకాలాడుతుంటాడు. మిగతా సామాజికుల పొగడ్తలు పట్టించుకోడు. ఉమాపతి నేరుగా పొగడడు. ఎలాగూ బాగానే నటిస్తావు అనే భావనతో కేయూరాలు బాగా చేయించావు అని అంటాడు. ఈ లోగా అవధాని వస్తూ ఉంటాడు. అవధాని తాను గొప్ప కవి అనుకుంటూ ఉంటాడు. ఆ నాటకం మొదట రాసింది అతనే. సారథి తనకనుకూలంగా మార్చి వేశాడు. పేరు మాత్రం అవధానిది పెట్టాడు. అవధాని స్వంత డబ్బా కొట్టుకుంటుంటే సారథి వదిలించుకుంటాడు.
తరువాత విశాలాక్షి పూటకూళ్ళమ్మ ఇంటికి వెళతాడు. విశాలాక్షి ఓ డాక్టరు గారి వద్ద వంటకత్తె. సారథే విశాలాక్షితో ప్రక్కవ్యాపారంగా పూటకూళ్ళ వసతిని పెట్టిస్తాడు. భోజనం అయిన తరువాత వాసంతికి నీకూ ఏమిటి సంబంధం అని అడుగుతుంది. వాసంతి నేను పెంచిన పిల్ల. మురుగు కాల్వలో స్నానం చేశావా అని అడుగు. గంగా స్నానం చేశావా అని అడక్కు అంటాడు. ఆ రాత్రి అక్కడే ఉంటాడు. అతడు కుల స్త్రీలను కన్నెత్తి కూడ చూడడు. నీచ స్త్రీ గమనం ఉంది. నీచ స్త్రీ అంటే తక్కువ కులపు స్త్రీ కాదు. అనభిజ్ఞాత రసభావలు. ఒక రకంగా తనలో ఉన్న కామ భావనను ఆ విధంగా అధిగమించడానికి ప్రయత్నిస్తుంటాడు.
తరువాత కొన్నాళ్ళకు సారథి, రాణాప్రతాపసింహుని నాటకము అవధానితోను, రంగనాథముతోను, కిరీటితోను రాయించు ప్రయత్నము జరుగుచుంటుంది. రంగనాథము ఆ ఊరిలో ఒక పెద్ద. ఆయన తాత ఆస్ధానంలో కవి. ఈయనకు చిత్కళ ఉంది. కాని ఎప్పటికైనా ఆస్ధానకవి కావలెనని ఆశ. ఎల్లపుడూ పిల్లి మీద ఎలుకకూ ఎలుకమీద పిల్లినీ పంపించే క్షుద్రమైన ఆలోచనలు కలవాడు. కిరీటి ఆ ఊరిలో ఒక కుర్రవాడు. రచనా సామర్ధ్యము గలవాడు. మంచివాడు, వినయవంతుడు.

రంగనాథానికి కోటలో పాగా వేయాలనే కోరిక ఉంటుంది. అవధానిని అధిగమించాలనే కోరిక ఉంటుంది. మళ్ళీ అవధాని ద్వారానే కోటలోకి వెళ్ళి, వాసంతి దొరగారికొరకు పాడుట అనే ఆలోచనను దొర గారికి ఎక్కిస్తాడు.

వాసంతి కచేరి జరుగుతూ ఉంటుంది. కచేరి ప్రారంభమయిన తరువాత కొద్దిసేపటికి వెళ్ళి చివరిదాక కూర్చొనలేక సభాసంప్రదాయాన్ని గౌరవింపక మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు. వాసంతి నొచ్చుకుంటుంది.

తరువాత శిరీషు ఇంటికి వెళతాడు సారథి.అక్కడ మాటలలో వాసంతి అలుక తీరినట్లవుతుంది. వాసంతి సారథి భుజం మీద చేయి వేసి తోసివేస్తుంది. సారథికి ఆ స్పర్శ కొత్తగాఉంటుంది. తరువాత వాసంతి ఇలా అంటుంది – సారధీ, నీవు గొప్ప నటుడవు. నీ అభినయము నాకు రాదు. నాకు భగవంతుడిచ్చిన విద్య సంగీతము. నేను తరింపవలయుననగా నీ సంపర్కము చేత నీఆత్మలో ఉన్న పారవశ్యలక్షణము నాలో జొచ్చి అది నాసంగీత విద్య యందు ప్రసరింపవలెను.
తరువాత సారథి సముద్రతీరం వైపు అద్భుతమైన ఆలోచనా నిమగ్నుడై ఆరు పుటలు నడుస్తాడు. చివరికి ఉమాపతి ఇంటికి వచ్చి సొమ్మసిల్లి ఒక రోజంతా ఒళ్ళెరగకుండా నిద్ర పోతాడు.

కొన్నాళ్ళకు సారథి శిరీషు ఇంటికి వెళతాడు. రాణాప్రతాపసింహుని నాటకములో తనకూ వేషం కావాలని అడుగుతుంది. సారథి కటువు మాటల్లో భాగంగా వాసంతి క్షోభ పడుతుంది. దానిలోనుండి తేరుకోకుండానే నాటకం వేయవలసిరావడం వల్ల ఆమె అద్భుతంగా నటించినట్లనిపిస్తుంది. ఆమెకు గల రెండు పాటలూ బాగా వస్తాయి. అవధాని రంగనాథము వల్ల సభలో అలజడి అవుతుంది. నాటకం సుమారుగా ముగుస్తుంది. వాసంతి పడిన క్షోభ వల్ల రాణాప్రతాపసింహుని భార్య పాత్రను చక్కగా ఆభినయించగలిగిందని చెపుతాడు సారథి.

రంగనాథము అర్జునరావును ఆ ఊరికి రప్పిస్తాడు. అర్జునరావు ప్రక్క ఊరిలో ఒక సాధారణ న్యాయవాది. నటుడు. అర్జునరావు రామరాయలు నాటకం రాయించి ఆడతాడు. తక్షణ తృప్తినిచ్చే కొన్ని వ్యాపార కిటుకులు జోడించడం వల్ల ప్రజలకు నచ్చి, అర్జునరావు కీర్తి ప్రభ అమాంతం వెలిగి పోతుంది. ఒక రోజు వీధి కూడలిలో కిరీటి వెళుతుండగా అర్జునరావు, రంగనాథము పిలచి ఎకసెక్కాలాడాలని నాటకముల గురించి ఎత్తుతారు. అటే వెళుతున్న శిరీషు, వాసంతి, ఉమాపతి, సారథి తోడౌతారు. చివరకు ఆ వాదనలు తేలక ఎవరి అభిప్రాయాలతో వారు నిష్క్రమిస్తారు.

దొర గారి డబ్బులతో నాటకశాలను ఉద్ధరింతమనుకున్న రంగనాథము చివరకు తన పొలము అమ్మి దొర గారి పేరుతో నాటకశాలను ఉద్ధరించి ఆయనతోనే ప్రారంభోత్సవం చేయిస్తాడు. ఇవేవీ తెలియని, పట్టని సారథి కిరీటితో కామదహనము నాటిక రాయిస్తుంటాడు. అదీ కేవలం మన్మధభంగం వరకే. వాసంతి తనకూ పాత్ర కావాలంటుంది. గిరిజ పాత్రకు వాసంతిని తీసుకుని దగ్గరుండి నేర్పిస్తుంటాడు. ఆ నేర్పిచే క్రమంలో వారిరువురూ దగ్గరగా వచ్చుట, తాకుట, మరింత దగ్గరగుట, పరిష్వంగం – ఇలా ప్రతి స్పర్శకూ వారిరువురూ తమ తమ శారీరక మానసిక భావాలగురించి ఎడతెగకుండా ఆలోచిస్తూ ఉంటారు.
వాసంతి అనాఘ్రాతపుష్పము. సారథి మీది మమత, అతని స్పర్శా సుఖమునకు అర్ధము కొరకు అన్వేషణ. సారథికి వాసంతి తన స్వంత కూతురు కాకపొయినప్పటికీ, పెంచిన ఈమె మీద వాంఛయా కాదా అని మధన. ఒక వేళ వాంఛయే అయినచో ఆమెకు నేర్పు క్రమంలో స్పర్శాదుల వల్ల తనలోని వాంఛ పెంచుకొని తనలో ఏ మూలో మిగిలి ఉన్న కామమునంతా కూడ ఆ నాటకము వేస్తున్నపుడు, కామ విజేత అయిన పరమశివుని భావించుకుని దగ్ధము చేసికొనాలని అనుకుంటాడు. నాటకం ప్రారంభమవుతుంది. తను అనుకున్నట్లుగానే శివుని పాత్రలో లీనమై కామాన్ని దగ్ధము చేసినట్లు భావించుకుంటాడు, క్రింద పడిపోతాడు. కాసేపటికి స్పృహలోకి వస్తాడు. సిధ్ధి పొందినట్లవుతాడు. ఒక్క ఉమాపతికి తప్ప ఎవరికీ విషయం అర్థం కాదు. సామాజికులకు- నాటకము అయిపోయింది వెళ్ళిపొమ్మని ప్రార్థిస్తాడు.

వాసంతికి ఏమీ అర్థం కాదు. నాటకమున జరిగిన దాని గురించీ, నాటకమునకు ముందు తన తండ్రిని కౌగలించుకుని తను పరిశీలించినప్పటి స్పర్శనూ, సారథిని పరిష్వంగ స్పర్శనూ పోల్చుకుంటూ ఇదమిద్ధంగా నిర్వచించలేక మధన పడుతుంటుంది. భర్త లేక భర్తగా తగినవాడి స్పర్శ శీతలంగాను, సుఖకరంగాను ఉంటుందని సారథి చెప్పడం వల్ల అవకాశం వచ్చిన ప్రతిసారి స్పర్శా పరీక్షాపేక్షురాలై ఉంటుంది.

ఇది ఇలా ఉండగా అర్జునరావుకూ రంగనాథము మొదటి కూతురు లలితకూ సంబంధం ఏర్పడుతుంది. అర్జునరావు భార్య రోగిష్టిది. రంగనాథము రెండవ కూతురు కమల. రంగనాథము తన ఇద్దరు కూతుళ్ళనూ కోట చూసి రమ్మని పంపిస్తాడు. పెరుమాళ్ళుకు అప్పజెబుతాడు. పెరుమాళ్ళు పెద్ద కాసా. దొరకు అన్నీ. పైన గదిలో దొర లలితతో చెడుగా ప్రవర్తించబోగా లలిత తోసివేసి వస్తుంది. పెరుమాళ్ళు కమలను పైకి పంపుతాడు. కమల చిన్నది. దొర కౌగలించుకుని ముద్దు పెట్టి బహుమతులు ఇస్తాడు. కమలకు ఇష్టంగానే ఉంటుంది. దొరకు కమలాలలితల స్పర్శ వల్ల రంగనాథము కులపరంగా తనకంటే అధికవర్ణమువాడన్న భావన పోతుంది. స్పర్శ వలన వర్ణమునధిగమించిన భావన కలుగుతుంది.

తరువాత కొన్నాళ్ళకు నాటకశాలలోని ఒక కచేరిలో వాసంతి పాట, బహుమతి ఇచ్చే క్రమంలో దొర వాసంతి దోసిలి తాకుట, దొరకు సుఖముగా ఉండుట, వాసంతికి మండిపోవుట జరుగుతాయి. తరువాత కొన్నాళ్ళకు రంగనాథము ఇద్దరు కూతుళ్ళూ, కోటకు వెళ్ళి తమ తండ్రికి పదివేలిమ్మని దొరను వత్తిడి చేస్తారు. దొర పత్రం రాయించుకుని ఇస్తాడు.

పదివేలు చాలని రంగనాథము తన పొలం కూడ అమ్మి నాటక శాలను ఇంకా బాగుపరచి వ్యాపార కిటుకులతో చాల సంపాదించి దొర అప్పు తీర్చివేస్తాడు.అతనికి దొర మీద కక్ష.అవధాని మీద కక్ష. వాసంతి మీద కక్ష. సారథి మీద కక్ష.

చిన్నదొర గారి అక్షరాభ్యాసపు మిషతో వాసంతిని కోటకు పిలచి దొరనూ వాసంతినీ పతనం చేయాలనే ఎత్తు వేస్తాడు. అక్షరాభ్యాసము అయిన తరువాత రాణి గారు పిలుస్తున్నారని మేడ మీదకు పంపుతారు. దొర వాసంతిని కౌగలించుకుని ముద్దుపెట్టుకుంటాడు. వాసంతి ఎప్పటిలాగే ఆ స్పర్శను పరీక్షిస్తూ ఉంటుంది. బావుండదు. దైత్య భావ సమ్మిశ్రితము. తనకేమీ ఇష్టము కాదనీ, కేవలం పరీక్ష చేయడానికే కౌగలించుకోనిచ్చాననీ చెపుతుంది. కేవలం కామవాంఛానువర్తితుడైన రాజుకు ఇదేమీ అర్థం కాదు. పిసినారి కనుక అప్పటికే ఆమె మెడలో వేసిన పాతికవేల ముత్యాల హారాన్ని తిరిగి ఇచ్చేయమంటాడు. తిరిగి ఇచ్చే క్రమంలో అపుడే అక్కడకు వచ్చిన శిరీషును చూడడంతో, అమ్మాయీ నాకూతురు వలేనున్నావు తీసికో అని ఆ హారం ఆమె మెడలో వేయవలసి వస్తుంది. ఇది మొదలుగా ఊరిలో అందరూ అప్పటికే వాసంతికీ సారథికీ ఊహించుకుంటున్న సంబంధంతో పాటు దొరకూ వాసంతికీ కూడ సంబంధం ఊహించుకుంటుంటారు. వాసంతికీ సారథికీ ఇవేవీ పట్టవు.

వాసంతికి సుఖ స్పర్శ, ఉష్ణ శీతలములు, కామ స్పర్శ, వికారాదులు, లౌకికత్వము కొంచెం కొంచెంగా అర్థం అవుతుంటాయి. ఇంకా పరీక్ష చేయాలనుకుంటుంది. ఈలోగా రంగనాథమునకు వాసంతి మీద తేలిక భావముదయించి ఆమెను ప్రయత్నించవలెనని వాంఛ పుడుతుంది. ఏదో ఒక మిషతో శిరీషు ఇంటికి వెళ్ళి అక్కడే పొద్దుపొయేవరకు తచ్చట్లాడుతుంటాడు.ఒక్కొక్కసారి అక్కడే నిద్రిస్తుంటాడు. ఒక రాత్రి వాసంతిని కౌగలించుకొనుట ముద్దు పెట్టుకొనుట జరుగుతాయి. వాసంతి మేలుకొంటుంది. నిశ్చలంగా ఉంటుంది.వ్యతిరేకించదు. నేను పరీక్ష చేశాను అంటుంది. రంగనాథానికి ఏమీ అర్థం కాదు. దొరతో చెప్పవద్దంటాడు. వాసంతి నవ్వుకుంటుంది. ఈలోగా అర్జునరావు లలితల వివాహము అవుతుంది. రంగనాథము దొర పతనానికి ఏర్పాటు చేసిన మరొక కత్తి నగరాజకుమారి. ఆమె వ్యామోహంలో దొర తలమునకలవుతాడు. అర్జునరావు లలితను చేసికొన్నట్లు దొర తనను వివాహం చేసికోవాలని కమల కోరిక. కోటకు వెళ్ళి నిరాదరణకు గురి అవుతుంది. ఇదంతా చూచిన అర్జునరావు లలిత బుర్రకడిగి దొర నిన్ను చేసుకోవడం అసంభవం. శిరీషు మంచివాడు నిన్ను చేసికోగలడని శిరీషు మీదికి ప్రయోగిస్తాడు. కొన్ని రోజులు కమల శిరీషు ఇంటిలోనే ఉండుట, వాసంతీ కమలల స్నేహము పెరుగుట జరుగుతాయి. ఇద్దరూ ఆర్ద్ర స్ధితిలో ఉంటారు. వాసంతి కమలను తాకినపుడల్లా ఒక సుఖము మనస్సులోనుండి తన శరీరములోనికి ప్రవహించుట పరిశీలిస్తుంది. కమలను కౌగలించుకుని పరీక్షిస్తుంది. శిరీషు కమలలు దగ్గర అవుతుంటారు. శిరీషుకు చనిపోయిన తన భార్య గుర్తుకు వస్తూ ఉంటుంది.ఒకనాడు శిరీషు కమలల పరిష్వంగము చూచి వాసంతి అసహ్యించుకుంటుంది. కాని చూడాలను ఉంటుంది. తనలో కొన్ని చలనములు కూడ గమనిస్తుంది.

వాసంతి మరలా సారథి దగ్గరకు వెళుతుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని స్పర్శల తాలూకు భావాలు చెప్పి, మరల సారథిని కౌగలించుకుని పరీక్ష చేయవలెనంటుంది. సారథి నవ్వి సరే అంటాడు. వాసంతికి శరీరము నుండి మనసుకు సుఖ భావ ప్రసారము జరిగినట్లనిపిస్తుంది. అదే వేరు పురుషుడైతే ఆమెకు అగ్నిజ్వాలలుగా ఉన్నట్లనిపించింది. సారథికి ఈ స్పర్శ ఈగలు వాలినట్లుంటుంది. అదే చెపుతాడు. వాసంతి సారథిని స్వార్ధపరుడని నిందిస్తుంది. ఈసారి కామ దహనము నాటకము చివరికంట వేయమంటుంది. సారథి నేను భ్రష్టుడను, ముసలివాడిని నిన్ను పెళ్ళి చేసుకోలేనని చెపుతాడు. వాసంతి స్పష్టంగా చెపుతుంది. నేను నిన్ను ప్రేమించుట లేదు. కేవలం ఈ స్పర్శ తాలూకు గందరగోళం నుండి బయట పడవేయమని అర్థిస్తుంది. సారథికి ఒక ఆలోచన వస్తుంది. కిరిటిని పిలుస్తాడు.

ఇలా ఒక ఏడాది పైగా గడుస్తుంది. ఆత్మ లక్షణములందు నిష్ఠగా ఉన్నవాడిది ఉదాత్త ప్రకృతి. ఆత్మ నుండి పరిభ్రష్టుడై మనసును బట్టి నడచు వాడిది నీచ ప్రకృతి. సృష్టి కొంత ఆత్మ నిష్టము కొంత మనోనిష్టము. ఆత్మ నిష్టమైనది స్ఫురించును. (బుద్ధి స్ఫురింపజేయును. బుద్ధి కర్మానుసారిణి) మనో నిష్టమైనది ఊహించబడవలెను. ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించడం సారథికీ కిరీటికీ ఉమాపతి వల్లనే వచ్చింది. వాసంతి కిరీటిని ముట్టుకుని పరీక్ష చేస్తుంది. కొంచెం శీతలంగా ఉన్నట్లనిపిస్తుంది. కాని అప్పుడు అతను సారథికి ఆనుకుని ఉంటాడు. వాసంతి, కిరీటిని సారథికి దూరంగా జరగమని మళ్ళీ ముట్టుకుంటుంది. ఇప్పుడు కొంచెం ఉష్ణంగా ఉన్నట్లనిపిస్తుంది. కిరీటి అన్వయం చెపుతాడు. సారథి మనసులో ఉన్న విషయాలు ఆత్మలోకి తీసుకువెళుతున్నాడు. ఇది రసానుభూతి. వాసంతి ఆత్మలో ఉన్న విషయాలను మనసులోకి తీసుకువస్తోంది. ఇది లోకానుభూతి. వాసంతికి స్పష్టత వస్తుంది. కిరీటిపై అభిమానము పెరుగుతుంది. అప్పటికి నిష్క్రమిస్తారు. కిరీటిని మరుసటిరోజు రమ్మంటాడు సారథి, కిరీటిని కౌగలించుకుని, తనలో ఏ మూలో మిగిలి ఉన్న వాంఛా శక్తిని కిరీటిలోకి ప్రసరింపజేయుటకు సంకల్పిస్తాడు. ఆ భావోధృతానికి సారథి పడిపోతాడు. కాసేపాగి లేచాక, కిరీటికి వాసంతి గురించిన అన్ని విషయాలు చెప్పి పరిణయం చేసుకోమంటాడు. ఈ శక్తి ప్రసరణ తరువాత కిరీటికి ఒంటిలో తపన ఎక్కువై పోతుంది. ఇదేమిటని ఉమాపతిని అడుగుతాడు. ఉమాపతి సారథిని అడుగుతాడు. ఏమిటి కుర్రవాడిమీద క్షద్రవిద్య ప్రయోగించావని. సారథి నాకు ఏమీ తెలియదు. నేను కేవలం సంకల్పం చేశాను. కొన్నాళ్ళకు అతనికి సరి అవవచ్చు అంటాడు. సారధి వాసంతిని పిలచుకొని తన ఇంటికి వెళతాడు. వాసంతి, సారథియే తన భర్త అని తన ఆత్మ చెబుతున్నదని అంటుంది. కౌగలించుకుని చూస్తానంటుంది. ఒక కొయ్యను కౌగలించుకున్నట్లుంటుంది. ఏమీ అర్థం కాదు. సారథి చెపుతాడు. అప్పటి నీ శరీరమునకు అలా అనిపించింది. ఇప్పుడు నీ శరీరమునకు ఇలా అనిపిస్తోంది. ఆత్మ మారకపోయినా శరీర స్థితి మారవచ్చు. ఒకసారి వివాహమైన తరువాత దాని మార్పులు పాటింపక పోవచ్చును. వివాహము కాకముందు మార్చుకొనవచ్చును అని.

తరువాత కిరీటి, వాసంతి సారథి ఇంటి దగ్గర కలవడం జరుగుతుంది. కిరీటికి తాపం ఎక్కువ అవుతుంది. తన శరీరం వాసంతీ పరిష్వంగం కోరుతుంది. వాసంతిని అనుమతి అడుగుతాడు. సరే నీ తాపం తగ్గేటట్లయితే కౌగలించుకోమంటుంది. ఇద్దరికీ పరమ సుఖంగా ఉంటుంది. వాసంతికి కిరీటే తన భర్త అనిపిస్తుంది. ఆసమయమున సారథి వచ్చి చూసి మహానందపడతాడు.

అక్కడ దొర గారి డబ్బంతా నగరాజకుమారి మరి నలుగురు ద్వారా వేగంగా క్షవరం అయిపోతూ ఉంటుంది. రంగనాథానికి ఆస్థానకవి పదవి రాదు. రామశాస్త్రి అని వేరే ఎవరికో వస్తుంది. పెద్దకూతురు లలిత ఎలాగూ అర్జునరావు పాలన బడింది. ఎలాగోలా పెళ్ళి అయింది. చిన్న కూతురు శిరీషు పాలన బడింది. పెళ్ళికూడ అవలేదు. ఇటు వాసంతీ దక్కలేదు. సారథి మీద తిరుగుతుంది అతని దృష్టి. దొరతో సారథి ఉంటున్న తోట స్వాధీనపరచుకుంటారు. సారథి కండువా భుజాన వేసుకుని ఆ ఊరి నుండి నిష్క్రమిస్తాడు. దొర ఆశ్చర్య పోతాడు సారథి నుండి ప్రతిక్రియ లేనందుకు.

కిరీటీ వాసంతిల కల్యాణం జరుగుతుంది. కమలా శిరీషులకు కల్యాణం అవకపోయినా కాపురం పెడతారు. సారథి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. క్రైస్తవంలోకి చేరి, ఇస్లాంలోకి మారి ఇప్పుడు బౌద్ధంలో ఉన్నాడని గాలి వార్తలు.

ఒకనాడు సారథి ఆ ఊరు వస్తాడు. రుక్మాంగద నాటకం వేస్తున్నాడని ప్రచారం జరుగూతుంది. మోహిని వాసంతి కాదు. మరెవరో. నాటకము జరుగు సమయానికి ఎలాగో సరిజేసి మోహినీ పాత్రధారిణిని తప్పించి వాసంతి మోహినీ రూపంలో వేదిక మీదకు వెళుతుంది. వాసంతీ సారథులు కౌగలించుకుంటారు. వేదిక మీదే ఇద్దరి ప్రాణాలు వదిలేస్తారు. ఇదీ కథ.

ఒక పరిశీలనా ప్రయత్నము.
అనాది నుంచీ ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకొంటూ వస్తున్నదానిలో త్వగింద్రియస్పర్శ లక్షణమును తీసుకుని మధించి దానిలో సూక్ష్మంగా ఉన్న విషయాలన్ని విశేషంగా విస్తృత పరచి రాశారు.

దృశ్యం ఉంది. శ్రవణం ఉంది. ఘ్రాణం ఉంది. వాక్కు ఉంది. త్వక్కు ఉంది. వీటన్నిటితోను మనసు రమించినపుడు అనుభూతి కలుగుతుంది. ఏది ఎక్కువ? దేనికదే. కాని మిగతవాటికి లేని విలక్షణత త్వగింద్రియ స్పర్శలక్షణమునకు ఉంది. స్పర్శ వలన ఒక ఉధృతమైన భావం కలుగుతుంది. ఇది చర్యా ప్రతి చర్యాత్మకం. మిగతా ఇంద్రియాలకు అది లేదు. స్పర్శ ఎక్కువ ప్రభావం కలది.

NLP ( Neuro Linguistic Program) అని ఒకటుంది. దేహ భాష (బాడీ లాంగ్వేజ్) అని ఒకటుంది. ఈ మధ్య పశ్చిమాన బాగా నలుగుతున్నాయి. అక్కడ నలగడం వల్ల ఈ మధ్య మన దేశంలో కూడ బాగా ఎత్తుకున్నారు. అందులో మనుషులూ మనుషుల మధ్య జరిగే కార్యములలో ఇంద్రియాల పరినిర్వహణ. దేహ స్పందన ప్రతి స్పందనలు. దానిలో స్పర్శ ప్రభావం ఒక అంశం. మా తల్లి గారు అమెరికా వెళ్ళిన మొదట్లోనే ఏదో గమనించి చెప్పారు. అక్కడ మానవ సంబంధాలు ఆ రకంగా ఏడవడానికి కారణం పుట్టినప్పటి నుండి మాతృ స్పర్శ లేకపోవడం. పితృ స్పర్శ లేకపోవడం. సోదర సోదరీ స్పర్శ లేకపోవడం అని సూత్రీకరించారు. వారికి వ్యక్తిగత ప్రదేశం (పర్సనల్ స్పేస్) ఉంటుంది. దానిలోకి ఎవరినీ రానివ్వరు. పిల్లలకూ చిన్నప్పటినుండి వేరు పడకలు. మాతృ స్పర్శ వలన లభించు భద్రతాభావం ఏదీ? ఇప్పుడిప్పుడు వాళ్ళూ తెలుసుకున్నారు. వారు ఇప్పుడిప్పుడు ప్రాముఖ్యతనిస్తున్న ఈ అంశాన్ని ఆయన 50లలోనే మథించారు.

కాసేపు హేతువాదం, వాస్తవికత, మతం, ఆత్మ ఉనికి, ప్రక్కన పెడితే ఆయన, చాలా మంది భారతీయులు నమ్మిన చట్రంలో, ఇంతకన్నా విశ్లేషాత్మకంగా ఎవరూ రాయలేరు. అయితే సంప్రదాయాన్నీ, సదరు జ్ఞానాన్నీ మూఢంగా నమ్మే సంప్రదాయవాదులు కూడ ఈ నవలను గభాల్న అందుకోలేరు. కొంచెం వెగటుగా కూడ అనిపిస్తుంది. ఇదేమిటి ఈయన ఇలా రాశాడు అనిపిస్తుంది. అసలు ఇది ఈయన రాసిందేనా అనిపిస్తుంది. ఆయన అంత నగ్నంగా, ఆధునికంగా వెయ్యేళ్ళ తరవాత కూడ పనికి వచ్చే విధంగా రాశారు. ఎందుకంటే ఇది సత్యం కనుక. నిజానికి ఆకాలంలోనే కాదు ఈకాలంలో కూడ అలా రాయడానికెంతో ధైర్యవంతుడు అయిఉండాలి. ఆయన మాత్రమే రాయగలరు. ఆయన కాలాతీతుడు.

మొదట పాఠకులకు వచ్చే సంశయాత్మకమైన భావం.. ఈయన ఇలా కూడా రాశారా అని. నవలలో చాల మందికి వివాహేతర సంబంధాలుంటాయి. వారందరికీ వావి-వయసు అంతరాలుంటాయి. వాసంతి అయితే తండ్రితో సహా అందరినీ కౌగలించుకుని పరీక్షిస్తూ ఉంటుంది. సాధారణ పాఠకులు ముఖ్యంగా క్రింది విషయాలు మనసున పెట్టుకుని తెఱచిరాజును చదివితే కలవరం వేయదు.

1. కారణము ముందు పుట్టి (ఆత్మలో నుండి) కార్యము యొక్క నిర్వహణ జరుగుతూ ఉంటుంది.
2. శుధ్ధ సత్వము, ఆత్మ, (బుధ్ధి) మనసు ,శరీరము (జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు) ఒక వరుసలో పని చేస్తుంటాయి. సృష్టిలో అన్ని ఆత్మలూ ఒకటే అయినా, కర్మానుసారం బుధ్ధి పనిచేసి మనసు ద్వారా శరీరంతో నిర్వహణ జరుగుతుంది.
3. ప్రత్యేక లక్షణ విశిష్టుడైన జీవుడు సధర్ముడైన జీవుని కలయిక కోసం ఆరాట పడుతుంటాడు.
4. ఎక్కడో చాల అరుదుగా తప్ప సృష్టిలో తండ్రీ కూతుళ్ళ స్పర్శకు, మాతృ పుత్ర స్పర్శకు, సోదర సోదరీ స్పర్శకు కామగత భావన ఉండదు. ఎందుకంటే అవి ఆత్మగతమైనవి. తండ్రి స్పర్శ అంటే ఒక రక్షణ. తల్లి స్పర్శ అంటే ఒక వాత్సల్యం. సోదర సోదరీ స్పర్శ – రక్షణ, వాత్సల్యముల మిళితం. ఆత్మగతమైన – స్వచ్ఛమైన భావాలే మనసు ద్వారా శరీరమునకు ప్రసరిస్తుంటాయి. శరీరము, ఇంద్రియములు బలీయమైనవి కనుక ఎక్కడో చాల అరుదుగా వావిని లక్ష్యపెట్టని సంబంధాలుంటాయి. ఇవి కర్మానుసారమై ఉండ వచ్చును. లేదా పరిసరాల దుష్ప్రభావం వల్ల మనసు మలినపడి, బలవంతంగా శరీరము నుండి మనసు ద్వారా ఆత్మకు కామగతభావనలు ప్రసరింపజేయడం జరుగుతూ ఉండి ఉండ వచ్చును. ఇలాంటివి సంబంధాలు ఎక్కువ క్షోభకు గురి అవుతాయి. సాధారణంగా ఒక రక్తం పంచుకు పుట్టిన వారి స్పర్శలలో కామగత భావనలు ఉండే అవకాశం లేదు.
5. మంచి స్పర్శ, చెడు స్పర్శ (కామగత స్పర్శ) మీద విచక్షణ మాత్రమే పాశ్చాత్యులకు అవగతం. విశ్వనాథ వారు స్పర్శ, శరీరము, జీవులు, జీవుల లక్షణములు, రక్త సంబంధములు, అప్పటి వయసు, స్ధితి, పరిసరాలు, ఊహ, మనసు, అప్పటికి తోచిన బుధ్ధి, కర్మ, ఆత్మ, కారణము, కార్యము, స్పందన, ప్రతి స్పందన, అభిజ్ఞ, అనభిజ్ఞ, భావ ప్రసారము, వీటన్నిటినీ కూలంకషంగా చర్చిస్తారు.

ఇక సాధారణంగా పాఠకులకు నచ్చని మరో విషయం ముగింపు. కిరీటి వాసంతిల పెళ్ళి తరువాత, సారథి దేశాలు పట్టి పోయిన తరువాత, మళ్ళీ ఆ ఊరు వచ్చి నాటకం వేయడం ఏమిటి? వాసంతి తపన ఏమిటి? వారిరువురూ పరిష్వంగంలో ప్రాణాలు వదలడం ఏమిటి? సారథి తన వాంఛా శక్తి నంతటినీ కిరీటిలో ప్రతిక్షేపించాడు కదా. ఇంక తనలో వాసంతి మీద తపన మిగిలి లేదు. ఆత్మ గతంగానూ, శారీరకంగానూ. అలాగే వాసంతికి కూడ సారథి మీద తపన మిగిలి లేదు. ఈ విషయం చెపుతుంది కూడాను. ఇంకా కిరీటిని ఆత్మికంగా కూడ ఆమోదించినట్లే కనబడుతోంది. మరి ప్రాణాలు వదిలేయడానికి అర్ధం? ఈ విషయానికి రెండు మూడు వాదనలు చెప్పుకోవచ్చును.

ఆయనతో విభేదించు స్థాయి లేనప్పటికీ, ఈ జీవుడికి తోచిందేమిటంటే ఆయన అన్నట్టు “ప్రత్యేక లక్షణ విశిష్టుడైన జీవుడు సధర్ముడైన జీవుని కలయిక కోసం ఆరాట పడుతుంటాడు” అని కాదు. “ప్రత్యేక లక్షణ విశిష్టుడైన జీవుడు పరిపూరకధర్ముడైన జీవుని కలయిక కోసం ఆరాట పడుతుంటాడు” అని తోచింది. ఇప్పుడు వాసంతీ సారధుల ఆత్మగతమైన జీవులు- ఒకరికొకరు పరిపూరకులు కావచ్చును. ప్రకృతీ పురుషుల వలె. ఆత్మగతమైన ఆరాటము జీవుల స్వధర్మము. పరిష్వంగంలో చివరికి మోక్షం పొందారు. అలా కాదంటే –

ఇది కేవలం ఒక స్పర్శ విషయం మాత్రమే కాదు. స్పర్శతో యోగమును సాధించుట. తెఱచిరాజు ఒక చదరంగపుటెత్తు. రాజు ఆటకట్టు స్ధితి. నవలలో ఎక్కడా కూడ చదరంగము ప్రసక్తి ఉండదు. ఇక్కడ ఆత్మ రాజు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, శుద్ధసత్వముల మధ్య జరిగే ఆటలో చివరి మెట్టు మోక్షము. ఆటకట్టు తెఱచిరాజు.

పూజ్యులు కుందుర్తి రజనీకాంత్ గారికి తోచినది ఇంకా ఆమోదనీయ యోగ్యముగా ఉన్నది. అక్కడ ధర్మాతిక్రమణ జరిగినది. విశ్వనాథ వారి దృష్టిలో ధర్మమును అతిక్రమించినచో నిష్కృతి లేదు. మరణమే ముగింపు. దొర, రంగనాధము తదితరులు ధర్మాతిక్రమణ చేసిననూ వారు తుఛ్ఛులు. ఆత్మికంగా ఉన్నత స్ధితిలో ఉన్న సారధీ వాసంతులలో ఇంకా కామం మిగిలి ఉన్నది. చివరి నాటకములో – పెళ్ళయిన తరువాత కూడ వాసంతి, ఇంకా మిగిలియున్న వాంఛతో సారథి, పరిష్వంగంలో పరమపదిస్తారు. ఒక పావు (కామము) తప్పుకొనుట వల్ల (ఆత్మ) ఆటకట్టు. తెఱచిరాజు.

You Might Also Like

7 Comments

  1. P.vijayalakshmi Pandit

    మీరు “తెఱచిరాజు “నవలలోవిశ్వనాథ వారి పంచేద్రియాల,స్త్రీ పురుష స్పర్స్య పరిజ్ఞాన్నిఅంత విశదంగా వివరించడం వల్ల ఆ నవలనుసులభంగా అర్థంచేసుకోవడానికి మీ సమీక్ష చాలాఉపయోగపడింది .
    విశ్వనాథ వారి రచనలు లౌకికవిషయాల ను వ్యక్తులనుసాధనంగా చేసుకుని మలచి నా,అందులో అలౌకిక,తాత్విక,తత్త్వం అంతర్లీనంగాప్రతి రచనలో దాగుంటుంది.
    నేను నా 30/40 వయసులోవిశ్వనాథ వారి రచనలు జోలికిపోలేదు. అది భాష వల్లనో వారిరచనలు లోతు ను అందుకొనేపరిణితి ,జ్ఞానం ,మనో ఆత్మస్థితి అప్పటికి లేనందుకుకావచ్చు .వారి రచనలను అర్థం చేసుకోవాలన్నా ఇష్టపడాలన్నాఆత్మ జ్ఞానం ,అలౌకిక తత్వాలధర్మాల ,భారతీయ హృదయమయిన సనాతన ధర్మం గురించి పరిచయం ,నమ్మకంఉండాలి.
    ఆడ మగ స్పర్శల అంతరార్థంమనకుటుంబాలలో ఇతరపచ్చిమ దేశాలలో తేడా మీఅమ్మ గారి ఆబ్సెర్వేషన నిజమే . ఆ స్పర్శల లో వ్యక్తమయే ప్రేమ / వాంఛ తాలూకు తేడాలు ఈకాలంలో ఆడపిల్లలకు తెలియకchild abuse కు లోనవడం ,మోసపోవడం.
    విశ్లేషణ ముగింపు బాగుంది. పరిత పిస్తున్న సారధి వసంతల ఆత్మలు చివరకు మరణించిశివ శక్తి ఏకత్వాన్ని పొందడా న్నీ…కాలానికి వ్యక్తులకు అతీతంగావిశ్వనాధ గారు గాడంగావిశ్వసించే ఆత్మా తత్త్వం,మనిషి జీవన ధర్మంముగింపులో ప్రస్ఫుటమైంది .

    1. sreekanth gaddipati

      ధాంక్స్ అండి.
      మొదట నేను ‘శివశక్తుల వలే’ అనే రాశాను. రెండు రోజుల తరువాత చాగంటి వారి మాటలు గుర్తుకు వచ్చాయి.
      ‘శివ’ అంటే శంకరుడు. ‘శివా’ అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము. శివుడు ఎల్లపుడూ శక్తి రూపిణియైన పార్వతీదేవి యందే అనురాగరూపుడై ఉండును. పార్వతి ఎల్లపుడూ శివునే ధ్యానిస్తూఉంటుంది.
      ఇక్కడ సారధీ వాసంతులు వేరు. సారధి నీచ స్త్రీ సంగమము కలవాడు. వాసంతి కిరీటిని పెండ్లి చేసికొనినది.
      అందువల్ల ఆఖరు పేరాలలో – ‘శివశక్తులవలె’ అని రాసినది కొట్టివేసి ‘ప్రకృతీ పురుషుల వలె’ అని రాశాను. అంటే బ్రతికి ఉన్నపుడు త్రిగుణాలతో బంధింపబడినవారు వీరు. జీవాత్మల నిష్క్రమణంతో మాయ తొలగి శివశక్తులతో ఐక్యం అయినారని భావించవచ్చు.
      మీరన్నది సబబే.
      ధన్యవాదాలు.

    2. Varaprasad

      చాలా బాగా చెప్పారు.

  2. ఉరుపుటూరి శ్రీనివాస్

    “సముద్రతీరం వైపు అద్భుతమైన ఆలోచనా నిమగ్నుడై ఆరు పుటలు నడుస్తాడు.”, “ఎవరి అభిప్రాయాలతో వారు నిష్క్రమిస్తారు.”

    బాగా వ్రాసారు. మీ వ్యాసం పండింది. నా చదవాల్సిన పుస్తకాల జాబితాలో మరో చేర్పు.

    1. sreekanth gaddipati

      థాంక్స్ అండీ.

  3. G. K. Ananthasuresh

    మంచి విమర్శనాత్మక వ్యాసం. ధన్యవాదాలు, శీకాంత్ గారు.

    1. sreekanth gaddipati

      థాంక్స్ సర్.

Leave a Reply