నగరానికి నిండు నమస్కారం – “షహర్ నామా”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
******************

ప్రతీ ఒక్కరికీ తాము పుట్టి పెరిగిన ఊరి పట్ల కాస్త మమకారం ఉంటుంది. అక్కడి మనుషులు, జీవన విధానం అంటే అనురక్తి ఉంటుంది. తమ ఊరికి ఎంతో కొంత, ఏదో ఒకటి చేయాలనుకునేవారి సంఖ్య తక్కువేమీ ఉండదు. అలాంటి వారిలో పరవస్తు లోకేశ్వర్ గారు ఒకరు. తన తాజా పుస్తకం “షహర్ నామా”లో సొంత ఊరిని పరిచయం చేస్తూ, ఆయా వీథులలో పాఠకులను తనతో పాటు తిప్పుతారు. ‘హైదరాబాద్ వీథులు గాథలు’ అనే ఉపశీర్షికతో హైదరాబాద్ నగరం యొక్క గత వైభవం గురించి గొప్పగా వివరిస్తారు.

“నాలుగు వందల ఇరవై అయిదు సంవత్సరాల వయసున్న హైద్రాబాద్ నగరం కథలకు పుట్టినిల్లు. కథలకు కార్ఖానా. ఇక్కడ ప్రతి బస్తి బస్తీకి, గల్లి గల్లీకి, ప్రతి మంజిల్‌కు, ప్రతి మహల్‌కు, ప్రతి హవేలీకి, ప్రతి దేవుడీకి, ప్రతి బాడాకు, ప్రతి వాడకు ఒక కమ్మని కథనో లేక కన్నీటి కథనో దాని వెనుక ఒక వెతనో ఉంటాయి. ఒక్కోసారి కథ వెనుక కథ కూడా ఉంటుంది. ఈ కథలు ఒక కంట మనల్ని నవ్విస్తూ, మరో కంట కన్నీరు పెట్టిస్తాయి. ఈ కథలలోకి తొంగి చూస్తే మనకు నాలుగు వందల సంవత్సరాల నగర చరిత్రేగాక ప్రజల జనజీవన జగన్నాటకం కూడా కనబడుతుంది” అంటూ పుస్తకాన్ని ప్రారంభిస్తారు లోకేశ్వర్.

“గణగణ గంటలు మోగే గుళ్లు గోపురాలు, అజాలు వినిపించే గుంబజ్‌లు మినార్లు, ఆదివారపు ఉదయపు ప్రార్థనలతో కళకళలాడే చర్చ్‌లు, చాపెల్స్ లేకపోతే ఈ హైద్రాబాద్ నగరం ఇంత అందంగా కనబడేదా?” అని ప్రశ్నిస్తూ, “పహాడీ షరీఫ్” గురించి వివరిస్తారు. ఇదే వ్యాసంలో “జో జిస్సే మిలా సీఖా హమ్నే గైరోఁకోభీ అప్నాయా హమ్నే” (ఎవరు కలిసినా వారి నుండి నేర్చుకున్నాం. ఇతరులను కూడా మన వాళ్లుగా మార్చుకున్నాం), ఇదీ మన భారతీయ మనస్తత్వం” అని చెబుతారు. ఒక కాముకుడిని నిష్కాముకుడిగా మార్చిన పవిత్రమైన ఈ పహాడీ షరీఫ్ మహత్యం గురించి చెబుతారు.

బ్యారక్స్ అన్న ఆంగ్ల పదం అపభ్రంశమై, ఆ ప్రాంతం బార్కస్‌గా మారిన వైనాన్ని వివరిస్తారు. అక్కడ దొరికే పచ్చ కామెర్ల మందు గురించి, రుచికరమైన జామపళ్ళ గురించి చెబుతారు.

పిన్న వయసులోనే హైద్రాబాద్ నగరానికి వలస వచ్చి నవాబు అబుల్ హసల్ తానీషా దర్బారులో చిరుద్యోగులుగా చేరిన అక్కన్న మాదన్నలు నీతి, నిజాయితీ – అంకిత భావాలతో కష్టపడి 34 సంవత్సరాలు సర్కారీ కొలువులు చేశారు. మాదన్న ప్రధాన మంత్రిగా, అక్కన్న పేష్కారుగా అంటే ఆర్థిక శాఖామంత్రిగా స్థిరపడ్డారనీ చెబుతారు లోకేశ్వర్. తమ కర్తవ్యం గొప్పగా నిర్వహించిన ఆ అపూర్వ సోదరుల సమాధులు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదనీ; కాని, వారి స్మృతులు మాత్రం పురజనుల మనసులలో భద్రంగా వసివాడకుండా ఉన్నాయని అంటారు రచయిత. ఒక మాదన్న పేట, ఒక మహేశ్వరం సరాయి, ఒక అక్కన్న మాదన్నల దేవాలయం ఇందుకు ఉదాహరణలంటారు.

షాద్‌నగర్ అనే ప్రాంతానికి ఆ పేరు రావడానికి కారణమైన కిషన్ పర్షాద్ – ఆరవ నిజాంకు దివాన్‌గా పనిచేశారు. ఆయన చేసిన ఓ రైలు ప్రయాణం ఒక గొప్ప చారిత్రక వినోద దృశ్యంగా నిలిచిపోయిందని రచయిత చెబుతారు. “ఇప్పటికి వందేళ్ల క్రితం ఆయన సిమ్లా రైలు యాత్ర తన కుటుంబ సభ్యుల సమేతంగా చేశారు. అన్ని విలాసాలతో కూడిన ఒక ప్రత్యేక రైలును, ఏకంగా అద్దెకు తీసుకున్నారు. తనకు, తన పట్ట మహిషికి, పిల్లలకు ఒక బోగీ, దాని వెనుక భాగంలో పనివాళ్లకు, వంటవాళ్లకు మరోబోగి, మిగతా బోగీలు ఇతర భార్యలకు వారి పిల్లలకు వారి సేవకులకు. ఇక వారి లగేజీలకు, సామానులకు అంతు లేదు….” అంటూ ఆ ప్రయాణం గురించి వివరిస్తుంటే పాఠకులకూ ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. “తెల్లారగానే చిలకలు వాలిన చెట్టులా రైలు కిలకిలలాడేది. కళకళలాడేది” అంటారు లోకేశ్వర్.

నగరంలో దాదాపు 150 సం॥ల కిందట వెలసిన బస్తీ ఆఫ్రికన్ కావల్రీ గార్డ్స్ (ఎ.సి.గార్డ్స్) అని చెబుతూ ఆ ప్రాంతానికా పేరు ఎలా వచ్చిందో చెబుతారు. ఈ బస్తీ మూలాలు ఇక్కడ లేవనీ, బొంబాయి బానిసల సంత నుండి మొదలై వనపర్తి సంస్థానం ద్వారా హైద్రాబాద్ చేరుకున్నాయని వివరిస్తారు. అరబ్బీ గుర్రాలపై ఆఫ్రికన్ రౌతులు సవారీలు చేస్తూ ఇప్పటికీ కనబడుతుంటారని చెబుతారు. ఈ ప్రాంతంలో దొరికే ఓ రకమైన బ్లాక్ టీ – ఝావా – తాగి తీరాలని అంటారు.

హైద్రాబాద్ నగరానికి పన్నెండు దర్వాజాలు, పన్నెండు కిటికీలు ఉండేవంటారు రచయిత. ఆ పన్నెండు దర్వాజాలలో ఒకటి గౌలిపురా దర్వాజా. 1950లలో వీధులను విశాలం చేసే కార్యక్రమంలో ఈ దర్వాజా కాలగతిలో కనుమరుగయ్యిందయిని చెబుతారు.

తెలంగాణాలో అక్షర విప్లవానికి దారి తీసి నిజాం నవాబును గడగడలాడించి, తెలంగాణ ప్రజలకు “జ్ఞానభిక్ష” పెట్టిన గౌలిగుడా గురించి చెబుతారు. 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి గౌలిగూడ ప్రధాన కేంద్రమని వివరిస్తారు. నగరంలో మొదటి హోటల్ అయిన గౌలిగూడా రాంమందిర్ గల్లీలో సుబ్బారావు హోటల్ గురించి చెబుతూ – అక్కడ నగరవాసులకు అంత వరకు తెలియని కాఫీ, టీ, ఇడ్లీ, వడ, దోసెలు దొరికేవనీ చెబుతారు. ఇక్కడ కడుపు ఆకలి తీరటమే గాక అణా గ్రంథమాల పుస్తక ఉద్యమం ద్వారా మెదడుకు మేత కూడా దొరికేదని అంటారు. ఈ హోటల్లో ఏ పుస్తకం తీసుకున్నా ధర మాత్రం ఒక్క అణా – ఏకానా మాత్రమే! ప్రతి పుస్తకం క్రౌన్ సైజులో ఎనభై పేజీలు ఉండేదట. పుస్తకాలను ముద్రించే అచ్చు యంత్రాలు ఈ గౌలిగూడాలోనే ప్రారంభమైనాయని గుర్తు చేస్తారు.

1857 సిపాయిల తిరుగుబాటు హైద్రాబాద్ రాజ్యంలో కూడా జరిగిందని, దానికి తుర్రేబాజ్ ఖాన్ అనే సాహసి నేత్రుత్వం వహించాడని చెబుతారు. ఈ తిరుగుబాటు హిందూ ముస్లిం ఐక్యతకు మంచి ఉదాహరణ అని అంటారు రచయిత. బ్రిటిష్ రెసిడెంట్ నివసిస్తున్నందున ఆ రోజులలో ఆ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అనేవారు. రాజా ప్రతాప్ గిర్‌జీ కోఠీ ఉన్నందున ప్రజలు ఆ వీధిని తర్వాత కాలంలో కోఠీ అన్నారు. కోఠీ అంటే భవనం అని అర్థం. ఆధునిక కాలంలో అనేక బ్యాంకులు అదే వీధిలో ఉండటం వల్ల ప్రస్తుతం బ్యాంక్ స్ట్రీట్ అని పిలుస్తున్నారని చెబుతారు. నగర పాలక సంస్థ కోఠీ చౌరస్తాకు తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అని నామకరణం చేసినా ఆ సంగతి ఎవరికీ తెలియదని వాపోతారు.

“ఇప్పుడు కార్వాన్ అంతరించిన ఒక వైభవోజ్వల జ్వాల” అంటూ – ఆ రోజులలో మచిలీపట్నం ఓడరేవుకు వెళ్లే ప్రదాన రహదారిపై అటు గోల్కొండకు, ఇటు పురానాపూల్‌కు మధ్య ఉన్న వ్యాపార నగరం కార్వాన్ గురించి వివరిస్తారు. కారవాన్‌కు ఉర్దూలోనూ, ఇంగ్లీష్‌లోనూ దాదాపు ఒకే అర్థం ఉంది. వర్తకుల బిడారును లేక యాత్రికుల సమూహాన్ని కారవాన్ అంటారు. 1908 మూసీ వరదలు తర్వాత మార్వాడీ గుజరాతీ షావుకార్లు అందరూ కార్వాన్‌ను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి పోగా ముత్యాలు, వజ్రాలు అమ్మిన కార్వాన్ పేద ప్రజల బస్తీగా మిగిలిపోయిందని గుర్తు చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల గురించి వాటి పేర్ల వెనుక ఉన్న కథల గురించి వివరిస్తారు.

కుతుబ్ షాహీల కాలం నాటి షా అలీ ఒక సూఫీ ఫకీరు పేరిట వెలసిన బస్తీ షాలిబండ. మిట్ట, లేదా మెట్టకు పర్యాయపదమే ఈ బండ అని చెబుతారు రచయిత. మూసీ నదికి దక్షిణాన చార్మినార్ దాటి చాంద్రాయణ్‌గుట్టకు (అసలు పేరు చెన్నరాయుని గుట్ట) వెళ్లే దారి అంతా ఛడావ్ ప్రాంతమని. అంటే ఎత్తైన ప్రాంతమని వివరిస్తారు. ఆ దారిలో ఎత్తు ప్రాంతాలలో ఉన్న బస్తీల పేర్లకు చివరన బండ అని పేరు స్థిరపడి పోయిందంటారు. నగరం రూపురేఖలు మాసిపోయి షాలిబండ రంగు వెలిసిన బస్తీగా, పాతనగరంలో వెనుకబడిన బస్తీలలో ఒకానొకటిగా మిగిలిపోయిందని బాధపడతారు.

కుతుబ్‌షాహీ నవాబులు నగరం చుట్టూ ఓ ప్రాకారాన్ని నిర్మించటం ప్రారంభించినా, వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన ఆసఫ్‌జాహీల కాలంలో ముఖ్యంగా రెండవ నిజాం కాలంలో 1802లో నగర ప్రాకారం గోడ పూర్తయ్యిందని రచయిత చెబుతారు. ఆ ప్రాకారానికి పన్నెండు తలుపులు. అందులో ఒకానొకటి అలియాబాద్ దర్వాజా. రెండవ నిజాం పేరు అలీఖాన్. ఆయన పేరు మీదనే అలియాబాద్ దర్వాజా, అలియాబాద్ మొహల్లా (బస్తీ) ఏర్పడిందని అంటారు. చార్మినార్ నుండి ఫలక్‌నుమాకు వెళ్లే దారిలో అలియాబాద్ ఇప్పటికీ ఉందని, కాని ఆ దర్వాజా మాత్రం లేదని జ్ఞాపకం చేసుకుంటారు.

అడుగడుగునా కథ ఉంది “సుల్తాన్ బజార్” అనే వ్యాసంలో సుల్తాన్ బజార్ పరిసర ప్రాంతాల గురించి వివరిస్తారు. హిందూ ముస్లిం సమైక్యతకు సంకేతం చార్మినార్ అని చెబుతారు. ఒకనాటి అధికమెట్ట నేడు అడిక్‌మెట్‌గా మారిందని వివరిస్తారు. చార్మినార్ నుండి చాంద్రాయణగుట్టకు తిన్నగా ప్రయాణిస్తే ఒక మలుపులో కుడివైపు గుట్టమీద వెలసిన పాలరాతి వెన్నెల భవనమే ఫలక్‌నుమా. “ఆకాశంలో విరిసిన అందాల పుష్పం” అంటూ ఈ భవన వైభవాన్ని వివరిస్తారు.

షాలిబండ ప్రాంతాన్ని గతంలో చిచ్లం అని పిలిచేవారని చెబుతూ ఆ భోగట్టా వివరిస్తారు. ఉన్న పేర్లను చెడగొట్టటంలో ఘనులం మనం అంటారు రచయిత. “మూన్సే రేమండ్ బాగ్‌ను ముసారాంబాగ్ అన్నాం. తోపులబట్టీని లేదా తోప్‌కాసాంచాను గన్‌ఫౌండ్రీ అన్నాం. జియ్యోరుగూడెం కాస్తా జియాగూడా అయ్యింది. ట్రూప్స్ బజార్ తూర్పు బజార్ అయ్యింది. అధికమెట్ట అడిక్‌మెట్ అయ్యింది. పాపం దోమహల్ దోమల్‌గూడాగా అపఖ్యాతి చెందింది. ఇట్లా ఆ తప్పుల తడక వరుసలో ఇరామ్ మంజిల్ కాస్తా ఎర్రమంజిల్ కావటంలో ఆశ్చర్యం ఏముంది?” అంటారు.

ధూల్‌పేట్ అసలు పేరు ధూళిపేట అని చెబుతూ – ధూల్‌పేట్ అనగానే సాధారణ ప్రజలకు గుడుంబా, గూండాలు అన్న సంగతే జ్ఞప్తికి వస్తుంది, దాని గత చరిత్ర, వైభవం ఎవరికీ పట్టదని వాపోతారు. ఒకప్పుడు నగరంలో ఎన్నో తోటలు, ఉద్యానవనాలు ఉండేవనీ, వాటి పేరిట – భాగ్‌ల పేరుతోనే అనేకానేక బస్తీలు అవతరించాయని చెబుతారు. సీతారాం బాగ్, బషీర్ భాగ్, జాం భాగ్, అజీజ్ భాగ్, మురళీధర్ బాగ్, ఇబ్రాహీం భాగ్, ఫూల్ భాగ్, మూసారాం భాగ్, రాం భాగ్, కిషన్ భాగ్, లలితా భాగ్, అసద్ భాగ్ (నేటి నిజాం కాలేజీ), భాగ్ లింగంపల్లి, భాగ్ అంబర్ పేట్, భాగే ఆం (పబ్లిక్ గార్డెన్) వంటి ప్రాంతాలను ప్రస్తావిస్తారు. మరి ఆ తోటలన్నీ ఏమైపోయినాయి? నగరం నిప్పుల కొలిమిలా ఎట్లా మారిందని ప్రశ్నిస్తారు.

వీధులు, వాటి పేర్లు మాత్రమే లేవీ పుస్తకంలో. ఒకనాటి వ్యక్తులున్నారు. వారి జీవితం సంక్షిప్తంగా ఉంది. నగరం నేపథ్యం ఉంది. గత వైభవ చిహ్నాలను కోల్పోతూ, విశ్వనగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్‌పై అంతులేని ఆపేక్ష ఉంది. హైదరాబాద్ నగరం గురించి అద్భుతమైన సమాచారంతో పాటు, అందమైన, అపురూపమైన ఫోటోలు కలిగి ఉన్న ఈ 208 పేజీల పుస్తకం వెల రూ.110/-
ప్రాప్తి:
1. పి. లోకేశ్వర్, ఇం.నెం. 12-2-709/5/1/సి, నవోదయ కాలనీ, హైదరాబాదు – 28, సెల్: 9160680847.
2. నవోదయ బుక్‌షాప్, కాచిగూడ, హైదరాబాద్. ఫోన్: 040 2465 2387

You Might Also Like

Leave a Reply