పుస్తకం
All about booksపుస్తకాలు

January 5, 2017

“బియాండ్ కాఫీ” – ఖదీర్‌బాబు

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: మానస చామర్తి
**************

మంచి కథ అంటే, మనని తనలో కలుపుకునేది. రచయిత సృష్టించిన లోకంలోకి మనని తీసుకు వెళ్ళి, అక్కడి వాళ్ళని, వాళ్ళ చేష్టల్నీ, ఒక్కోసారి వాళ్ళ మనసుల్ని కూడా, చూపించి, మళ్ళీ మన దోవన మనని వదిలిపోయే రెక్కల గుర్రం లాంటిది కథ. మనని ఎంత నమ్మిస్తే అంత మంచి కథ. మన దోవ మనకు గుర్తు రాకుండా, మన సమయం గురించి మనకిక ఆలోచన లేకుండా, కథే నిజమన్న నమ్మకం కుదిరిస్తే, అది మంచి కథ. కానీ, కొన్ని కథలుంటాయి. ఖదీర్బాబు “బియాండ్ కాఫీ” లాంటి కథలు. సత్యానికీ, సత్యం అని మనం నమ్మే దానికీ మధ్య నున్న పల్చటి తెరని, అక్షరాలతో మెల్లగా పక్కకు జరుపుతూ పోయేవి. అన్నిలోకాలనూ ఒక్కటి చేసేవి. ఉన్నచోటే నిలబెట్టి, మన చుట్టూ ఉన్నవే, మనం చూసీ చూడనట్టున్నవే, బలవంతంగా మన కళ్ళకు చూపించేవి. చేదుగా ఉండేవి. భయాన్ని, బాధను కలిగించేవి. ఆలోచన ఒక్కటే ఆఖరి బహుమతిగా మిగిల్చేవి.

మనకి మన చుట్టూ ఏదో జరుగుతోందని తెలుసు. తప్పకుండా తెలుసు. పేపర్లలో చూస్తున్నాం, టి.వి. లలో వింటున్నాం. అలా విన్న వాటి గురించీ, చూసిన వాటి గురించీ తప్పొప్పులు ఎవరికి చేతనైనంత వాళ్ళు చెప్పుకుంటున్నాం. ‘ఇలా ఏలా చేశాడు’? అనో, ‘ఇలా మనమెప్పటికీ చెయ్యకూడదు’ అనో అనుకుంటూనే ఉన్నాం. అలా మనం తీర్పులిచ్చిన మనుషులను పోలిన మనుషుల కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. “బియాండ్ కాఫీ” తో కలిపి మొత్తం పది కథలు. పది కథల్లోనూ ప్రథాన పాత్రల్లో ఉన్నవాళ్ళ సమస్య- లేమి. ప్రేమ కోసమో, మాట కోసమో, శారీరక సుఖం కోసమో- లేమితో కొట్టుమిట్టాడిపోయే ప్రాణాలివన్నీ. ఏ కోరికైనా కానివ్వండి, మనకసలు ఆ పదమంటేనే ఏదో చిన్నచూపు ఉంది. వెరపు లాంటిదేదో ఉంది. మితిమీరిన ప్రతి కోరికా, వ్యసనం, – అదొక మానసిక వ్యథ అనీ, దాని వెనుక అర్థం చేసుకోవాల్సిన కారణాలుంటాయనీ ఈ సంపుటిలో కొన్ని కథలు చెప్తాయి. ఆ కారణాలు తెలుసుకుని, వాటిని అతి తెలివితో వాడుకోదలచిన ప్రబుద్ధుల కథలూ ఉన్నాయి.

మనం ఎంత అవకాశవాదులమైనా, మనని ఇష్టంగా నమ్మి వచ్చిన వాళ్ళ పట్ల మనకి జాలి ఉంటుంది. కొంత బాధ్యత కూడా ఉంటుందేమో. మనని నమ్మి వచ్చినవాళ్ళకి, మనం తలపెట్టదలచిన హాని కంటే పెద్దదేదో వేరొకరి వల్ల జరగబోతోంటే, పెదగీత ముందు చిన్నగీత లా, మనలోని చెడు చిన్నదైపోతుంది. ఆచరణగా మారిపోతున్న మరొకరి దుర్మార్గపు ఆలోచన ముందు, మనకే స్పష్టత కుదరని మన చెడు ఊహ, కుదించుకుపోయి, చెరిగిపోయి, మరో ఆలోచనగా మారి, మంచిదిగా స్థిరపడుతుంది. ఇది చాలా సహజమైన మానవ స్వభావం. చిన్నవో పెద్దవో రోజువారీ సంఘటనల్లోనూ మనకు ఎదురుపడే మనుషుల స్వభావం. కానీ దాన్ని కథగా చెప్పడం చాలా కష్టం. “అపస్మారకం” కథలో ఆ నేర్పు మనకు స్పష్టంగా కనపడుతుంది. అలా అని ఈ కథ కానీ, ఆ మాటకొస్తే ఈ పుస్తకంలోని వేరే కథలు కానీ, నీతి వైపు మొగ్గిన కథలు కావు. నీతికథలో, మంచి కథలో కానే కావు. ఇవన్నీ విపరీతమైన ఉద్వేగాలున్న, మానసికంగా ఎంతో అలిసిపోయిన మనుషుల కథలు. సరిగ్గా చదవకపోతే, పిచ్చివాళ్ళ కథలనిపించే కథలు. మరి ఇలాంటి కథలు చదవడమెందుకూ, కోరి మనని మనం బాధపెట్టుకోవడానికి కాకపోతే అంటే – నాదొక్కటే సమాధానం – ఇవి “కరుణ ముఖ్యం” అన్న ఇస్మాయిల్ మాటల్ని మనకి మళ్ళీ గుర్తు చేసే కథలు. తప్పకుండా చదవమని నేను సిఫార్సు చెయ్యను. కానీ చదివితే, మన మాటా, మనం మన వాళ్ళతో, అసలెవ్వరితోనైనా మసలుకునే తీరు కొంచం ప్రభావితమవ్వచ్చునేమో.

ఇవన్నీ స్త్రీల సమస్యల మీద కథలే. చిత్రంగా, తప్పు మాత్రం వాళ్ళది కాదు. గృహహింస మీద కథలున్నాయి, కానీ ఆ గాయాలన్నీ కళ్ళకు కనపడనివి. వాటిని పైకి కనపడేలా చూపించడం, ఒక్క ఖదీర్బాబుకే సాధ్యమైంది. తెగిపడ్డ వేళ్ళనీ, వాటి పైన పురుషుడు కప్పుకున్న గ్లోవ్స్‌నీ, ఖర్చైపోతున్న టాక్ టైంనీ, ఎక్కడో ఎవరిదో సెల్ బద్దలైతే తప్ప నిద్రపట్టని మరొక స్త్రీ ఉన్మాద స్థితినీ, చాలా మామూలుగా, ఉన్మాద ఛాయలేమీ కనపడని పదాలతో, అరుపులూ, కేకలో, రక్తాలో, నఖక్షతాలో, ఏమీ లేని, ఏ గుర్తులూ లేని, చూపలేని అవస్థని అలవోకగా రాసేశాడు ఖదీర్. బహుశా ఆ కారణానికే ఈ కథలు వెంటాడతాయి. మళ్ళీ మళ్ళీ చదివించి, ఆలోచింపజేస్తాయి. “టాక్టైం”, “మచ్చ”, “ఏకాభిప్రాయం”, “బియాండ్ కాఫీ” ఇవన్నీ ఈ కోవలోకి చెందిన కథలే. మనం ఎంత విముఖంగా ఉన్నట్టు నటించినా, ఒక ఆత్మీయమైన పలకరింపు, నిందారోపణ లేని మాటా, మనని ఎంత ఓదారుస్తాయో, ఎంత బలాన్నిస్తాయో “ఘటన” లాంటి కథ చెప్తుంది. అమాయకపు వయసులో పుట్టిన ప్రేమ పట్ల, ఆ తొలిప్రేమ కలిగించిన మనిషి పట్లా, అప్పుడు మనసులో ఎన్ని ఆలోచనలైనా రావచ్చు గాక, వాటి పట్ల ఎన్నేళ్ళైనా ఎలాంటి పశ్చాత్తాపమూ ఉండదనీ, అదెప్పటికీ మధురమైన జ్ఞాపకమేననీ “వహీద్” కథ చెప్తుంది. అదంతా ఆ వయసుకు పట్టిన అదృష్టం. ఆ పసివయసుకు మాత్రమే చెల్లే భోగం.

మనుషులు ఎందుకు మాట్లాడుకోవడం లేదు? మాట్లాడినప్పుడు మనం అసలు ఏం కోరుకుంటున్నాం? మన వృత్తీ, ఉద్యోగాలు, మనమే నిర్వచించుకుంటోన్న మన జీవితాలు మనం ధర్మంగా గడపడానికి ఏ మాత్రం వెసులుబాటునిస్తున్నాయి? ఈ జీవితం, దీని నడక – ఇది పక్క వాళ్ళను బట్టి మారుతోందా? మారాలా? మారవచ్చా? ఒంటరితనం ఈ కాలపు మనుషుల్ని ఎలా శాసిస్తోంది? ఎందుకు అన్ని జబ్బుల్నీ మించి ఇది భయపెడుతోంది? ఒక మాట సాయం కోసం, ఒక మనిషి సాయం కోసం ఆత్ర పడుతూనే, ఒక గీత దాటి ఎవ్వరికీ సాయపడకూడదనీ, దగ్గర కాకూడదనీ, బాధ్యతలకు వీలైనంత దూరం జరగాలనీ మనం ఎందుకు కోరుకుంటున్నాం? ఇందులో వైరుధ్యం లేదా? బాధ్యత ఉన్నచోటే భరోసా ఉంటుందని మనకు తెలియదా? కారణాలక్కర్లేని ప్రేమ గురించి వదిలెయ్యండి, కారణాలున్న ప్రేమను కూడా కాదనుకునేంత స్వార్థం, దానికి భిన్నంగా లోలోపలి నుండి కొరికేస్తున్న ఒంటరితనంతో, ఓటమికి చేరువయ్యే యుద్ధం – ఎందుకు చేస్తున్నాం ఇదంతా?

నలుగురి మధ్య సాగే ప్రయాణానికీ, నీడ కూడా సోకని దారిలో నడవటానికీ చాలా వ్యత్యాసం ఉంది. ఏదేమైనా మనకొకరున్నారన్న భరోసా మొదటి దారిలో ఉంటే, ఏమీ కాకుండానే కలతపడే అనారోగ్యకరమైన వాతావరణం రెండవ దారిది. తూలిపడితే చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు, తప్పటడుగు వేస్తే దారి మళ్ళించే దిక్కూ ఉండదు. కానీ, ఆ ఒంటరి ప్రయాణంలో మనం ముందెవ్వరూ చూడని గొప్ప మజిలీ చేరుకోవచ్చు, స్థిరచిత్తంతో మనకు కావాల్సిన లక్ష్యానికి అందరికంటే ముందే చేరుకోవచ్చు. వెనక్కి లాగే వాళ్ళు లేక, కోరినంత ఎత్తులకూ ఎగిరి, ఎదిగి – మనం కోరింది సాధించుకోవచ్చు. కానీ అంతకు ముందుగా, అంత ధృడంగా, స్థిరంగా మనమున్నామా, అంతలా సిద్ధపడే ఉన్నామా అలాంటి ప్రయాణాలకి? అదీ ప్రశ్న!

నాకు ఈ పుస్తకం చదివాక కలిగిన ప్రశ్న.

ఈ పుస్తకం చదివారా? అని అడిగినప్పుడు, ఇందులోని ఒక కథ పేరు చెప్పి, తన జీవితంలో ఈ మధ్యే జరిగిన ఒక మార్పు గురించి చెప్పి, అదే లేకపోతే, నేనా కథలో నాయిక లాగే.. అలాగే.. ఫోన్ రీచార్జ్ చేయించుకుని – అని ఆపేసిందో సన్నిహితురాలు. గుండె జారినట్టైంది. ఈ కథలు మనకెంత దగ్గరో, ఎందుకు వీటిని సమకాలీన కథలు అంటున్నామో, సమకాలీన సమాజమేనని అంటున్నామో, ఇప్పటి కథలు ఇప్పటి సమాజాన్నే ప్రతిఫలించాలనడంలో కొందరి ఆశ ఏమిటో, నాకూ కొంత తెలిసినట్టైంది.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.One Comment


  1. పది కథల్లోనూ ప్రథాన పాత్రల్లో ఉన్నవాళ్ళ సమస్య- లేమి. కొట్టుమిట్టాడిపోయే ప్రాణాలివన్నీ.
    Baga gurtu pattaaru manasaa. Bagaa rasaru. Abhinandanalu  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

ఖదీర్ బాబు ఫుప్పుజాన్ కతలు

వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్ ****** బెంగుళూరు వచ్చిన కొత్తలో స్నేహితుల ద్వారా మహమ్మద్ ...
by అతిథి
4

 
 

‘నూరేళ్ల తెలుగు కథ’ నుంచి మినహాయింపు ఒక అదృష్టం!

(ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి “వివిధ” లో అక్టోబర్ 31న వచ్చింది. కొన్ని మార్పులతో రచయిత...
by అతిథి
7

 
 

నూరేళ్ళ తెలుగు కథ – మళ్ళీ చెప్పుకొంటున్న మన కథలు

మీకు తెలుగు కథల గురించి ఏమీ తెలీదా? ఐతే ఇదిగో మీ కోసం ఒక పుస్తకం. మీకు తెలుగు కథల గురిం...
by Jampala Chowdary
24

 

 
నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ

నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ

ముందొక పిట్ట కథ. పూర్ణయ్యని బావగాడంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు....
by అరుణ పప్పు
27

 
 
ఈస్ట్‌మన్ కలర్ జ్ఞాపకాలు

ఈస్ట్‌మన్ కలర్ జ్ఞాపకాలు

(మహమ్మద్ ఖదీర్‌బాబు “బాలీవుడ్ క్లాసిక్స్” పుస్తకానికి జంపాల చౌదరి ముందుమాట) సిన...
by Jampala Chowdary
4