Where I’m reading from – Tim Parks

ఈ పుస్తకం Tim Parks గతంలో న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్ లో రాసిన వ్యాసాల సంకలనం. వ్యాసాంశాలు – పుస్తకాలు, రచయితలు, ప్రచురణ, అనువాదం – వీటికి సంబంధించినవి. పుస్తకాలు చదవడం ఎందుకు? కథలు చదవడం అవసరమా? రాయడం ఎందుకు? డబ్బులిస్తే బాగా రాస్తారా రచయితలు? – అంటూ రకరకాల ప్రశ్నలతో మొదలవుతుంది పుస్తకం ముందుమాట. మా లైబ్రరీలో ఈ పుస్తకం చూసి ఆ ముందుమాట చదివాక ఇంక పుస్తకం తప్పక చదవాల్సిందే అని మొదలుపెట్టాను. చాలారోజుల పాటు చదివినా, చాలా వ్యాసాలు నాలుగైదుసార్లు కూడా చదివాను. ఈ పుస్తకంలో చర్చించిన కొన్ని అంశాల గురించి నా ఆలోచనలు ఇక్కడ పంచుకుంటున్నాను.

పుస్తకంలో నాలుగు భాగాలు: The world around the book, The book in the world, The writer’s world, Writing across worlds. ఒక్కో భాగం లో పదీ పదిహేను వ్యాసాలు. అయితే ఇవి భారీ సాహిత్య వ్యాసాలు కావు. నా బోంట్లు చదువుకోగల పత్రికల భాషలోని వ్యాసాలు. వ్యాసాల శీర్షికలు కొంత sensationalistic గా అనిపించాయి మొదట్లో.. “do we need stories?”, “why finish books?” ఇలా. కానీ, అవి అలా ఉన్నందుకే నేను చదివానేమో. అయితే, హెడ్లైన్స్ ఎలా ఉన్నా, రచయిత ఆలోచనలు నాకు బాగా ఆసక్తికరంగా అనిపించాయి.

ebooks are for grown ups” అని ఓ వ్యాసం ఉంది. చిన్నప్పుడు illustrated పుస్తకాలు చదవడం నుంచి పెద్దోళ్ళ పుస్తకాలు చదవడానికి మళ్ళినట్లు కాగితాలు, బైండింగులు, డిజైను గట్రా హంగులేం లేకుండా అక్షరాల మీద ధ్యాస పెడతాము ఈబుక్స్ తో అని అంటాడు. దీన్ని గురించి ఒక్కోళ్ళు ఒక్కోలా అభిప్రాయపడొచ్చు గాని, నాకు అసలు ఆ ఆలోచన ఆసక్తి కరంగా అనిపించింది. పైపెచ్చు ఈబుక్స్ చదువుతూ కూడా పేపర్ బుక్స్ ఇష్టపడే మనిషిని కనుక జ్ఞానోదయం అయింది 🙂 “Do we need stories?” అన్న వ్యాసంలో “ప్రపంచానికి కథలు అవసరం” అని చాలామంది రచయితలు భిన్న సందర్భాల్లో చెప్పిన విషయాలను చర్చిస్తారు. “This is all perfectly respectable. But do we actually need this intensification of self that these novels provide?” అని ప్రశ్నిస్తారు. ఆయన ఉద్దేశ్యంలో “I love an engaging novel. I love a complex novel; but I’m quite sure I don’t need it”.

తరువాత ప్రపంచీకరణ సాహిత్య సృష్టి మీద చూపిన ప్రభావం గురించి చర్చిస్తారు “The dull new global novel” లో. ప్రపంచ పాఠకులకి చేరువ కావాలి, వాళ్ళకి అర్థం కావాలి అన్న ఉద్దేశ్యంతో రచయితలు కొన్ని cultural and linguistic nuances ని వదిలేస్తున్నారని, దీనివల్ల ఆయా భాషలకి నష్టమే అంటారాయన. ఇంత దీర్ఘంగా ఇవన్నీ నేను ఆలోచించను కనుక, నాకు ఇది కొత్త విషయమే. “నిజమే కదా” అనిపించిన విషయం కూడా. ఈ విషయమై ఇంకో రెండు మూడు వ్యాసాల్లో కూడా వివరంగా చర్చించారు. మంచి వ్యాసాలవి.

Why readers disagree” అన్న వ్యాసంలో, దాని తరువాతి “Where I’m reading from” వ్యాసంలో వివిధ రచనల్కి పాఠకులు, సాహితీ విమర్శకులూ అందరూ ఎందుకు రకరకాలుగా స్పందిస్తారు? అన్న విషయం చర్చిస్తారు. సాధారణంగా పాఠకులు అభిప్రాయం రాస్తే అది అప్పటికి పాపులర్ అభిప్రాయం తో తూగకపోతే “మీకు చదవడం రాదు” అనో “అంతమందికి నచ్చింది నీకు నచ్చలేదంటే తప్పు నీదే” అనో…” మీకు చదవడం రాయకపోతే మీరు ఇలా ఏది పడితే అది రాయకూడదు” అనో, నీకు literary theory లేదా literary criticism తెలీదనో, విమర్శకులు అనడం మామూలు. సరే, అది విమర్శకి, అభిప్రాయానికి తేడా తెలీని insecure విమర్శకుల వాదన అనుకుంటే, ఇక్కడ ఈయన విమర్శకుల విమర్శ కూడా subjective అనే అంటాడు. వాళ్ళు ఏం చదివారు? వాళ్ళ ప్రపంచం ఏమిటి? అన్న దాన్ని బట్టే వాళ్ళ స్పందనలు కూడా ఉంటాయని. ఈ విషయం నేను ఎప్పుడూ అనుకునేదే అయినా, ఎవరో ఒక ఫేమస్ రచయిత చెప్పాడు కనుక నాకు గొప్పగా అనిపించింది.

detour: ఈమధ్య కాలంలో రచయితంటే ఓ విధమైన భయం పట్టుకుంది నాకు. వీళ్ళేదో ఓ కథో ఓ పుస్తకమో రాస్తారు… లేదంటే అదీ రాయరు… నెక్స్టు వెంటనే ఇలా రాయాలి, ఇలా రాయకూడదు, ఇలా చదవాలి, ఇలా చదవకూడదు అంటారు. అదేదో సైన్సు లాగా, reproducible research లాగా, ఒకళ్ళకి అనిపించింది అదే thought process కొనసాగిస్తే అందరికీ అనిపిస్తుంది అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకొచ్చిన గోల అని అసలు సాహిత్య గుంపుల్లో తలదూర్చడమే మానేశాను. Tim Parks అంతర్జాతీయంగా ఎంతో కొంత పేరున్న రచయిత. నవలా రచయిత, అనువాదకుడు, సాహిత్య వ్యాసాల రచయిత – ఇలా రకరకాల పాత్రల్లో రకరకాల దేశాల్లో పేరుపడ్డ మనిషి. ఆ fame నేపథ్యంలో ఈ వ్యాఖ్యలో నాకు చాలా openness కనబడింది. ఆశ్చర్యంగా అనిపించింది ఈ విషయం అంత మామూలు విషయంలా ఒప్పేసుకోడం.
(detour ends)

రెండో భాగం వ్యాసాలు The book and the world – ప్రపంచంలోని చదువరులు ఏం చదువుతున్నారు? అనువాదం ప్రభావాలు ఏమిటి? వంటి అంశాల గురించి వ్యాసాలు. కొంతమంది నవలా-కథా రచయితలు అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతారు.. కొంతమందికి దేశీ చదువరులు ఎక్కువ. “అంతర్జాతీయత ఓ రచయిత గొప్పదనానికి కొలమానమా?” అసలు “ప్రపంచంలోని గొప్ప రచయిత” అంటే ఎవరు? ఎక్కువ మందికి అర్థమయ్యే రచయితా? ఒక భాషలోని సాంస్కృతిక కోణం అనువాదంలో ఎంతవరకూ అర్థమవుతుంది సాహిత్య పురస్కారాల న్యాయనిర్ణేతలకి?” అంటూ రకరకాల ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు రచయిత ఈ భాగంలో. సార్వజనీనత గొప్ప రచనకి కొలమానంగా మనం చూస్తున్నాం కానీ, గొప్ప రచన ప్రపంచ పాఠకులు అందరికీ అర్థమై అనుభవించేలా ఉండలనేం లేదనీ, స్థానిక భాషా, సంస్కృతుల చుట్టూనే తిరుగుతు, అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులని చేరకపోయినా గొప్పతనం పోదనీ అంటారు.నాకైతే, మన రచనల గొప్ప తనాన్ని అది ఎన్ని భాషల్లోకి అనువాదం చేశారు అన్న సంఖ్యతో కొలవలేము అని అర్థమైంది ప్రస్తుతానికి. అలా అనువాదం అయి పాపులర్ అయిన రచయితలు వాళ్ళ రచనలు globalise చేయగలిగారు … అలా అని అన్ని కథాంశాలు ప్రపంచంలోని అందరికీ అర్థమై వాళ్ళు relate అవాలని లేదు అని అర్థమైంది. ఆ లెక్కన గొప్ప రచనకి ఏది కొలమానం? అని నన్నడక్కండి. నేను అలాంటి విషయాల గురించి ఆలోచించేంత మేధావిని కాను.

మూడు, నాలుగో భాగాలు చదవడం గురించి కాదు. రాయడం, దాన్ని ప్రచురించడం గురించి. రచన అన్నది ఇదివరకటితో పోలిస్తే క్రమంగా కెరీర్ లా మారడం, రైటర్ అవడానికి శిక్షణకోసం రైటింగ్ కోర్సులు, వర్క్ షాపులు రావడం గురించి రాసిన విషయాలు నాకు ఆసక్తికరంగా అనిపించాయి. నవలలో అంశాలని రచయితల జీవితాలకి ముడిపెట్టడం గురించి చెబుతూ ఒక వ్యాసం లో – ultimately, one might see a great deal of literature as a happy byproduct of a disturbing communication problem” అని తేల్చారు. జీవిత చరిత్రలు రాసేటప్పుడు విమర్శ తక్కువగా ఉండడం గురించి కూడా రాశారు. నాకు ఈ విభాగంలో బాగా నచ్చిన వ్యాసం బుక్ రీడింగ్స్, బుక్ రిలీజు ఫంక్షన్ల గురించి రచయిత అభిప్రాయాలు. ఏదో పార్ట్-టైం కాక రచయితగా ఆక్టివ్ గా రాస్తున్న మనిషి ఇదంతా దాపరికం లేకుండా రాయడం నాకు బాగా నచ్చింది.

ఈ పుస్తకం మొత్తంలో బాగా విజ్ఞానదాయకంగా అనిపించిన వ్యాసాలు అనువాదం చేయడం, అనువాదాలని ప్రచురించడం గురించి ఆయన పరిశీలనలు. ముఖ్యంగా అమెరికన్ పాఠకులకి చేసే అనువాదాలకి, ఇతర దేశాల వారికి చేసే అనువాదాలకి మధ్య ఉండే తేడా, పబ్లిషర్లు అనువాదాలు వేసేటప్పుడు పెట్టే నిబంధనలు, అనువాదాల పుణ్యమా అని ఇటాలియన్ భాష syntax ఆంగ్లం వైపుకి మళ్ళుతోంది అంటూ చేసిన పరిశీలన – ఇలాంటివి చాలా ఆలోచింపజేసేలా అనిపించాయి. ఆ ఊపులో వెళ్ళి ఇక్కడ ఇద్దరు లిటరేచర్ ప్రొఫెసర్లకి పొడుగు ఈమెయిల్స్ పంపి ప్రశ్నలతో తల తిన్నాను కూడా 🙂

మొత్తానికి వ్యాసాలు scholarly తరహాలో రాసిన పత్రికా వ్యాసాలు కావు (అంటే నా ఉద్దేశ్యం ప్రదీప్ సెబాస్టియన్ రాసే “ది హిందూ” లిటరరీ రివ్యూ వ్యాసాల లాంటివి. అవి కూడా మామూలు మనుషులకే రాస్తారు కానీ, చాలా intense గా చదవాలి వాటిని. చర్చించే అంశాలు కూడా చాలా వివరంగా, బోలెడు information density తో ఉంటాయి నా ఉద్దేశ్యంలో). కొంచెం మామూలుగా, ఆట్టే క్లిష్టంగా లేకుండా, అలాగే ఆట్టే లోతైన చర్చలు లేకుండా, ఒక అనుభవజ్ఞుడైన రచయిత తన అనుభవంలో చేసిన పరిశీలనలు పంచుకున్నట్లు అనిపించింది నాకు ఈ వ్యాసాలు చదువుతూంటే. మీకు చదవడం అంటే ఆసక్తి ఉండి, లోతైన చర్చలు, academic తరహా వ్యాసాలు చదవడం మీద ఆసక్తి లేని పక్షంలో ఈ పుస్తకం చదవొచ్చు.

Where I’m reading from: the changing world of books
Tim Parks
Amazon.com link

You Might Also Like

One Comment

  1. Ramana Murthy

    థాంక్స్ సౌమ్యగారూ! ఈ పుస్తకం ఉందని ఇప్పుడు మీద్వారానే తెలిసింది.

    మీ పుస్తకపరిచయం బాగుంది – సిద్ధాంతాలు లేకుండా, సింపుల్ గా!

Leave a Reply