డిటెక్టివ్ నవలల గురించి ఒక ప్రశ్న

ఓ పది-పదిహేనేళ్ళ క్రితం నాకు క్రైం నవలల మీద ఆసక్తిగా ఉండేది. డిటెక్టివ్ సాహిత్యం అదీ తెగ ఆసక్తిగా చదివేదాన్ని. క్రమంగా అది తగ్గిపోయింది కానీ, అడపా దడపా ఏదో ఒకటి చదువుతూనే ఉన్నాను. రెండేళ్ళ క్రితం Millenium Trilogy చదివాక నాకు స్కాండినేవియన్ క్రైం ఫిక్షన్ మీద ఆసక్తి కలిగింది. ఆ టైములో ఇతర స్వీడిష్ క్రైం రచయితల గురించి తెలుసుకుంటున్నప్పుడు scandinavian noir ఒక పాపులర్ సాహిత్య ప్రక్రియ అని తెలిసింది. ఆ టైములోనే Jo Nesbø, Hennig Mankell వంటి వారి పేర్లు విన్నాను. ఈ ఏడాది వెసవి సెలవుల్లో మా ఊరి పబ్లిక్ లైబ్రరీ పుణ్యమా అని కొన్ని నవలలు చదివాను. టీనేజిలో చదివినట్టు వారానికి రెండు నవలలు చదివేస్తూ ఓ నెలా రెణ్ణెల్లు గడిపా. దీనికోసమని రోజూ తొందరగా ఆఫ్లైన్ అవడం, ఎప్పుడు పడుకున్నా తొందరగా లేవడం, ఇలా రకరకాల విన్యాసాలు చేసానంటే ఎంత ఆకట్టుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా చదివాను కనుక, వీటిని ఇదివరలో చదివిన డిటెక్టివ్-క్రైం ఫిక్షన్ తో పోల్చుకోడం అనివార్యమైంది. నేను ముఖ్యంగా పోల్చుకున్న విషయాలు రెండు: కథల్లో ఆ కథల తాలూకా సమాజాన్ని ఎంతవరకు చూపిస్తున్నారు? డిటెక్టివ్ పాత్రల వ్యక్తిగత స్వభావాలని ఎలా చూపిస్తున్నారు? అని. ఈ విషయాల గురించి నా ఆలోచనలు ఇక్కడ రాసుకుంటున్నాను. ఇది తూలనాత్మక పరిశీలనో మరింకేదో కాదు. ఊసుపోక రాసుకుంటున్న అనాలసిస్ (ప్రశ్న మాత్రం చూడాలనుకుంటే లాస్టు లైనుకి వెళ్ళండి).

బాగా చిన్నప్పుడు మా స్కూల్ లైబ్రరీ లో Nancy Drew, Hardy Boys సిరీస్ నవలలు, Enid Blyton రాసిన పిల్లల డిటెక్టివ్ నవలలు, Alfred Hitchcock రాసిన Three Investigators సిరీస్ ఇలాంటివి ఉండేవి. అప్పట్లో అవి తెగ చదివేదాన్ని (జర్మనీలో ఓ అమెరికన్ స్నేహితురాలికి వాటి గురించి చెప్తూంటే – అవి మా అమ్మ వాళ్ళ తరంలో చదివేవాళ్ళు. ఇండియాలో తరువాతి తరంలో కూడా చదివారంటే గొప్పే అని ఆశ్చర్యపోయింది.). నాకు దేనికీ కథ గుర్తు లేదు కానీ, మూడేళ్ళ క్రితం జర్మనీలో ఒక ఆడియో పర్సెప్షన్ పరిశోధన చేసే స్టడీ లో పాల్గొన్నప్పుడు ఈ హిచ్కాక్ నవలల్లో ఒకదాని జర్మన్ అనువాదం విన్నా. నా అరకొర జర్మన్లో కూడా నేను దాన్ని గుర్తు పట్టా ఆశ్చర్యకరంగా. సరే, ఆ ఆశ్చర్యం అటు పెడితే, ఈ కథల్లో డిటెక్టివ్ లు పిల్లలు కనుక కథల్లోని అంశాలు, డిటెక్టివ్ ల పాత్ర చిత్రణా దానికి తగినట్లు గానే ఉన్నాయి. ఆట్టే హింస గానీ, చీకటి కోణాలు గానీ, ఇట్లాంటివి లేవు. కథలు కూడా పెద్ద లోతైన ఆలోచనలేవీ చేయకుండా వీలైనంత సూటిగా ఉండేవని గుర్తు.

తరువాత కొన్ని జేంస్ బాండ్, జేంస్ హాడ్లీ చేస్ నవలలు చదివినా కూడా, ఎక్కువగా చదివినవి: షెర్లాక్ హోంస్ నవలలు, అగాథా క్రిస్టీ Poirot, Miss Marple లలో ఎవరో ఒకరు ప్రధాన పాత్రగా రాసిన నవలలు. వీటిలో నాకు గుర్తున్నంత వరకు ప్రధాన ఫోకస్ ఈ డిటెక్టివ్ లు సమస్య ని ఎలా పరిష్కరిస్తారు? అన్న దాని మీద ఉండింది. కథలన్నింటిలో డిటెక్టివ్ ల ఆలోచనావిధానాన్ని చిత్రించిన తీరు కథానాయిక/నాయకులు కనుక వాళ్ళని ప్రత్యేకంగా నిలబెట్టేలా రాసినట్లు అనిపించింది. అసలు నవలలు చదివి చాలా ఏళ్ళైంది కనుక ఈ విషయం నిర్థారణగా చెప్పలేను. వ్యక్తిగత అలవాట్ల విషయానికొస్తే షెర్లాక్ హోంస్ లో కొంచెం అతగాడి సిగరెట్ సేవనం గురించి ఉండేది అనుకుంటాను కానీ, నేను Sherlock టీవీ సీరీస్ లో ప్రధాన పాత్రధారి Benedict Cumberbatch ప్రభావంలో ఉన్నాను గత రెండేళ్ళుగా.

నా జీవితంలోకి లేటుగా ఎంటరైంది దేశీ డిటెక్టివ్లే. కినిగె.కాం లో కొన్నాళ్ళు షాడో నవలలు తరుచుగా చదివేదాన్ని చదివా మూడు నాలుగేళ్ళ క్రితం. ఒకటీ అరా కొవ్వలి, జంపనా, కొమ్మూరి వంటి వారి రచనలు అప్పుడప్పుడూ చదివాను . ఏదో ఆ క్షణంలో కాలక్షేపానికి బాగున్నా, కథనం చదివించేలా ఉన్నా, ఈ కథలు నన్ను ఆట్టే ఆకట్టుకోలేదు. కథాంశాలు కూడా గుర్తుండిపోయేలా ఏవీ లేవు. ఇవ్వాళ చదివి రేపు మరిచిపోయే తరహాలో అనిపించాయి. సత్యజిత్ రాయ్ రాసిన ఫెలూదా నవలలు (పిల్లలవే అయినా నేను 20-25 ఏళ్ళ మధ్య వయసులో చదివాను), బ్యోంకేశ్ బక్షి నవలలూ – ఇవి నేను చదివిన దేశీ డిటెక్టివ్ కథలలో నాకు నచ్చినవి. డిటెక్టివ్లు, హంతకులూ కూడా మన్లాంటి మామూలు మనుషులే అనిపించేలా ఉంటాయి ఈ కథలు-పాత్రలు నా అభిప్రాయంలో. అందువల్ల నాక్కొంచెం నమ్మశక్యంగా అనిపించాయి . ఫెలూదా నవలలు టీనేజీ పిల్లల్ని ఉద్దేశించి రాసినవి కనుక “క్లీన్” రచనలు హింస, ఇతర విషయాల పరంగా. బ్యోంకేశ్ బక్షి కథలూ చాలా వరకు క్లీన్. పైగా నేను చూసిన డిటెక్టివ్ లలో ఇప్పటిదాకా పెళ్ళి-ఇల్లూ ఇలా మామూలుగా చూసే మనుషుల్లా ఉన్న డిటెక్టివ్ బక్షీ ఒక్కడే. టీవీ సిరీస్ లో అయితే ఓ ఎపిసోడ్ లో కొడుకు ఉన్నట్లు కూడా చూపినట్లు గుర్తు. కథనం విషయానికొస్తే, వీటిల్లో చాలావరకు ఆ డిటెక్టివ్ ఏ మర్డరో ఇంకేదో మిస్టరీనో ఎలా ఛేదిస్తాడు? అని మెయిన్ పాయింట్. పన్లో పనిగా సామాజికాంశాల గురించి వ్యాఖ్యానం, సవిస్తారమైన రిసర్చి కథలోకి ఇమిడ్చినట్లు గుర్తు లేదు.

అలా సామాజికాంశాల గురించి వ్యాఖ్యానం విపరీతంగా ఉన్నట్లు నాకు అనిపించిన మొదటి నవలా త్రయం Millenium Trilogy – హింస, షాక్ ఫాక్టర్ విపరీతంగా ఉన్నాయి వీటిలో (అప్పటికి నాలుగో పార్టు రాలేదు). కానీ దానితో పాటుగా స్వీడెన్ దేశంలోని సమాజం గురించి, అందులోని సమస్యల గురించి కూడా చాలా వివరమైన వ్యాఖ్యానాలు కథలో భాగంగా ఆసక్తికరంగా జొప్పించారు. అందువల్ల, సాధారణంగా ఆ హింసాత్మక వర్ణనలు అవీ ఉండే పుస్తకాలని ఇష్టపడని నేను, ఈ పుస్తకాలని ఇష్టపడ్డాను. ఇందులో ప్రధాన పాత్రలక్కూడా వ్యక్తిగత జీవితాలలో రకరకాల కల్లోలాలు. కుటుంబ సంబంధాలు ఆట్టే ఉండవు. ఇవీ ఇదివరలో చదివిన నవలలపై నాక్కలిగిన అభిప్రాయాలు… నాకు గుర్తున్న అంశాలు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి వస్తే: Hennig Mankell, Jo Nesbo ల రచనలు. మొదట Hennig Mankell రాసిన డిటెక్టివ్ పాత్ర Kurt Wallander. నేను ఈ సిరీస్ లో మొదట వచ్చిన ఐదు నవలలు చదివాను. ఈ నవలలు మిస్టరీ పరంగా క్రమంగా బోరు కొట్టాయి. మొదటి నవల ఒక్కటే చివరి పేజి దాకా ఉత్కంఠతో చదివించింది. చివరి రెండూ అయితే, సగంలోనే ఏం జరుగబోతోందో తెలిసిపోయి బోరు కొట్టేశాయి. అయితే, కథాంశాలు అటుపెడితే కథలోకి కాందిశీకుల పునరావాసం, ఎక్స్-కమ్యూనిస్టు దేశాల్లో పోలీసు వ్యవస్థ పని తీరు, దక్షిణ ఆఫ్రికాలో రాజకీయాలు : ఇలా రకరకాల అంశాలను తీసుకుని వాటి గురించి విస్తారంగా చేసిన వ్యాఖ్యానం నేర్పుగా జొప్పించినట్లు అనిపించింది. ఇకపోతే ఆ ఇన్స్పెక్టర్ పాత్ర చిత్రణకి వస్తే Wallander రోజంతా తాగుతూనే ఉన్నట్లు అనిపిస్తాడు. కథల ప్రకారం భార్య నుండి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటాడు. కూతుర్ని అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాడు. తండ్రితో ఆట్టే సత్సంబంధాలు ఉన్నట్లు తోచదు. డ్యూటీ చేయనప్పుడల్లా తాగుతూనో, తాగడానికి ముందో తరువాతో డిప్రెస్ ఔతూ గతాన్ని తల్చుకుంటూనో ఉంటాడు.

లాస్టుకి ఆ పాత్ర చిత్రణ గురించి క్రమంగా చిరాకు పుట్టి నార్వే కి చెందిన Jo Nesbø రాసిన Inspector Harry Hole సిరీస్ లో రెండు నవలలు చదివా. ఇందులో కథనం వాలాండర్ నవలలతో పోలిస్తే ఇంకాస్త sophisticated గా అనిపించింది . కథాంశాలలో వివరంగా వర్ణించిన విపరీతమైన మలుపుల వల్ల క్యాజువల్ గా చదివినట్లు కాకుండా కాస్త మనసు పెట్టి చదవాల్సి వచ్చింది. నార్వే వాళ్ళ పోలీసు వ్యవస్థ పనితీరు గురించిన వ్యాఖ్యానానికి ఉన్న స్థానం కథలోని మిస్టరీ కి సమానంగా ఉన్నట్లు అనిపించింది. ఇదంతా ఉన్నప్పటికీ, ఈ Harry Hole కూడా Wallander మాదిరే .. తాగుడు, స్మోకింగ్ రెండూ అడిక్షన్ లా అనిపిస్తాయి ఈ పాత్రకి. కుటుంబ సంబంధాల విషయంలో ఇతగాడు కొంచెం నయం కానీ, ఎలాగైనా చూడగానే “ఇతని జీవితం ఆనందంగా ఉంది” అనిపించలేదు నాకు. ఇక్కడ మందు తాగడమో, డ్రగ్స్ సేవించడమో, సిగరెట్ తాగడమో -ఇవి మంచి అలవాట్లా? చెడు అలవాట్లా? అన్నది కాదు ప్రశ్న. డిటెక్టివ్లు, ఇన్స్పెక్టర్లు, ఇట్లాంటి పాత్రలుంటే ఇలాగే ఉండాలా? అని. ఆ అలవాట్ల విషయం అటు పెడితే మట్టుకు, ఈ స్కాండినేవియన్ నవల్లో పాత్రలు more human అనిపించాయి వాళ్ళు ఎదుర్కునే ఓటముల విషయంలో. ఏ షెర్లాక్ హోంస్ నో తీసుకుంటే, అతను ఫెయిల్ అవడం అనేది మనం చూడము. కానీ, ఈ నవలల్లో వ్యక్తిగతంగా ఎన్నోసార్లు ఫెయిల్ అవుతారు వీళ్ళు. చివరికి అంతా గుంపు గా కలిసి సమస్యలు పరిష్కరిస్తున్నట్లే చూపారు. ఆ పరంగా ఇవి కొంచెం వాస్తవికంగా అనిపించాయి.

ఇదంతా రాసినదానికి కారణం: డిటెక్టివ్ లు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వగైరాలు ప్రధాన పాత్రలుగా వచ్చిన నవలల్లో ఈ ప్రధాన పాత్రలు కొంచెం సగటు మనుషుల్లాగా కుటుంబం, పెళ్ళీ, పిల్లా-జెల్లా గట్రా వంటివో, లేకపోతే మరోలాగో వ్యక్తిగత జీవితంలో ఎంతో కొంత సంతోషం గా గడిపిన దాఖలాలు ఉన్నాయా (కథ ప్రకారమే లెండి! ఇవన్నీ పాత్రలు అన్న విషయం గుర్తుండే అడుగుతున్నా!)? అని.

(ముఖచిత్రం లంకె)

You Might Also Like

4 Comments

  1. తాడిగడప శ్యామలరావు

    . . . . షెర్లాక్ హోంస్ లో కొంచెం అతగాడి సిగరెట్ సేవనం . . . .
    సిగరెట్ కాదండి సిగార్ (అనగా…. చుట్ట అన్నమాట)

    1. సౌమ్య

      Thanks. కానీ, పాయింటు సిగరెట్టా సిగారా అని కాదండి ఇక్కడ.

  2. ఫణీంద్ర పురాణపండ

    ఆరుద్ర కొన్ని డికెష్టీ నవల్లు రాశారు. ‘పలకల వెండి గ్లాసు’ అనే నవల పేరు బాఘా గుర్తుండిపోయింది. (అవేవీ నేను చదవలేదనుకోండి.. :)) వాటన్నింట్లో ప్రధాన పాత్ర పేరు వేణు అనుకుంటా.. అతను మీ పెరామీటర్స్‌లో ఉండేవాడేమో అని లీలగా అనిపిస్తోంది. మీకు ఎక్కడైనా దొరుకుతాడేమో చూడండి.

  3. varaprasaad.k

    సౌమ్య గారు డిటెక్టీవ్ నవల మొదలెడితే ఉత్కంఠతో చివరిదాకా చదివి తీరాల్సిందే,మీ సమీక్ష కూడా అలానే చదివించింది ,కొమ్మూరి నుండి మధుబాబు వరకు విపరీతంగా చదివినా ,డీటెక్టీవ్స్ కి స్టార్ స్టేటస్ తెచ్చిన మధుబాబు షాడో ఇప్పటికీ గుర్తుండి పోయాడు.మీ సమీక్ష పుణ్యమా అని మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయి….మరిన్ని మంచి సమీక్షలు మీ నుండి ఆశిస్థూ. ..

Leave a Reply to తాడిగడప శ్యామలరావు Cancel