కొత్త ముద్రలను వేసే ప్రయత్నం – ‘కాన్పుల దిబ్బ’

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
*****************
ప్రముఖ రచయిత డా. చింతకింది శ్రీనివాసరావు గారి రెండో కథాసంపుటి “కాన్పుల దిబ్బ”. తాడిత పీడిత ప్రజల పక్షం వహించి, వారి వెతలని కళ్ళకు కట్టిన కథలివి. ఉత్తరాంధ్ర మాండలికంలో మెరిసిన ఈ కథలు అక్కడి వాతావరణాన్ని, ప్రజల స్వభావాలని, అమాయకత్వాన్ని, నిస్సహాయతని, తప్పని పరిస్థితులలో చూపే తెగువని ఒడుపుగా పట్టుకున్నాయి.

శ్రీనివాస రావు గారి రచనా శైలి వల్ల ఆయా ఊర్లూ, అక్కడి ప్రజలూ పాఠకులకు చిరపరిచితమైపోతాయి. కథ కాకుండా దృశ్యం కనబడుతుంది. డా. ఎస్. రఘు అన్నట్టుగా కథలలోని పాత్రల ఆలోచనలు, సంఘర్షణలు, ఆవేదనలూ, ప్రశ్నలూ, ఆగ్రహాలు అన్నీ మనల్ని ముసురుకుంటాయి. పాత్రల అంతరంగంలోని అల్లకల్లోలాలు, సంఘటనలోని భావతీవ్రతలు మనసుకు బదిలీ అవుతాయి. ఈ సంకలనంలోని 10 కథలను పరిచయం చేసుకుందాం.

నామమాత్రపు బ్రాహ్మణుడైన నరసింహమూర్తి విశాఖపట్నంలో అపర కర్మలు చేస్తూంటాడు. అతగాడికి శుచిశుభ్రతా బాగా తక్కువ. దురలవాట్లు ఉన్నాయి. తన జీవన విధానంతో విసుగు చెంది, అక్క వాళ్ళింట్లో ఓ రెండు రోజులు గడుపుదామని అమ్మనగిరి అనే పల్లెటూరికి వెడతాడు. పంట పూజ సందర్భంగా ఓ పల్లెటూరి కుటుంబం తననో సద్బ్రాహ్మణుడిగా భావించి పాదపూజ చేసి, అత్యంత గౌరవంగా తొలి పంట ఫలాలను సమర్పించుకోవడంతో, అతనిలో అంతర్మథనం కలుగుతుంది. తనకు ఆ అర్హత ఉందా అని సందేహపడతాడు. ముందు అనుకున్న రోజు కాకుండా, మర్నాడే తిరుగు ప్రయాణమవుతాడు. ఎంతో శుచీ, శుభ్రతా కలిగి ఉన్న ఆ పల్లెటూరి కుటుంబమే అతని కళ్ళ ముందు మెదులుతూంటుంది. తన స్వభావాన్ని మార్చుకుని చక్కగా నడుచుకోడానికి ప్రయత్నిస్తాడు. కాని ‘మనిషికి ఎరుక తక్కువ, మరుపు ఎక్కువ’ అనే నానుడిని నిజం చేస్తూ మళ్ళీ పాత అలవాట్లకి బానిసయిపోతాడు. మరుపే శాపమైన ఓ పురోహితుడి కథ “పంటపూజ“.

సిరిపురపు దేవుడు అనే వ్యక్తికి సిరీ లేదు, అతను దేవుడూ కాదు అంటూ మొదలవుతుంది “మా దేవుడి మాయ్య బోగట్టా” కథ. అతనో చిత్రమైన వ్యక్తి. పిల్లల్ని చదవనీయకుండా ఆడుకోమనేవాడు. కలహప్రియుడు. వెటకారం మనిషి. “చదువుకుంటే ఏం రాదు, ఆడుకుంటే బలం వస్తుంది, ఆడితే బతకడం పట్టుపడుతుంది” అనేవాడు. సొంత కొడుకుని ఏడో క్లాసు తర్వాత చదువు మాన్పించి ఆటపాటల్లో పెట్టేస్తాడు. “ఆడు లెక్కలు సేయక్కర్నేదు, బొమ్మలు గియ్యక్కర్నేదు, రికాడ్డులు గోకక్కర్నేదు” అనుకునేవారు తోటి పిల్లలు అసూయగా. క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించిన మాయ్య కొడుకు ఆర్చరీలో పతకాలు సాధించి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించుకుని జీవితంలో స్థిరపడగా, మిగతా పిల్లలు అటు ఆటలకీ గాక, ఇటు చదువు వంటబట్టక ఎటూగాకుండా మిగిలిపోతారు. జీవితంలోని వైచిత్రిని కళ్ళకు కట్టిన కథ ఇది.

మేస్ట్రుబాబు మరి నేరు!” హృద్యమైన కథ. నిజమైన మనిషిగా సమాజంలో బ్రతకడానికి ఏం కావాలో చెప్పిన కథ. “మనిసన్నోడికి అన్నవూ, గుడ్డ గేరెంటీగుండాలి. ఆటితో పాటు నలుగురు మనుసులు కూడా వొప్పుడూ తోడుండాలి. మన సుట్టూరా జనాలుండాలి. మనం ఆల్ల మయానుండాలి.” అనే జీవితసత్యాన్ని చాటిన కథ ఇది.

పాటకపు జనాలలో ఓ నానుడి బలంగా స్థిరపడిపోయిన వైనాన్ని “ఏనుగుసావు” కథలో చూడొచ్చు. ‘బుగతల సావు ఉడతల సావు… యానాదుల సావు ఏనుగుల సావు’ అన్న ఆ నానుడి ఏళ్ళ తరబడి అ నోటా ఈ నోటా పాకిపోయి నాలుగు దిక్కులా వ్యాపించేసింది. మనిషి చనిపోయినప్పుడు… యానాదుల ఆచారాలు ఎలా ఉంటాయో ఈ కథ చెబుతుంది.

ప్రపంచమంతా కలసి బలంగా విసిరేస్తే మూలగా పడి చితికిపోయిన కుళ్ళు గుమ్మడికాయలా ఉంటుంది తటపర్తి. ఫక్తు వేదల ఊరు. సుస్తీ చేసిన పరిస్థితి ‘బతికుంటే బలుసాకు, ఛస్తే తులసాకు’ అన్నట్లు ఉంటుంది. ఓ దినపత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా ఈ ఊర్లోని కాన్పుల దిబ్బ గురించి అందరికీ తెలుస్తుంది. ఈ ఉదంతాన్ని తమకి అవమానంగా భావిస్తుంది ప్రభుత్వం. ఆఘమేఘాల మీద అక్కడ అభివృద్ధి జరిగిపోవాలని కలెక్టర్‌ని ఆదేశిస్తుంది. అభివృద్ధితో పాటు, అరాచక శక్తులూ ప్రవేశిస్తాయి ఊళ్ళోకి. కాన్పుల దిబ్బ మీద ఆరోగ్య కేంద్రం నిర్మాణమవుతున్న స్థలంలో నాలుగు గోడల మధ్య ఓ అమ్మాయిని చెరుస్తారు. ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమోనని చూసిన గ్రామస్థులు – ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వంతో విసిగిపోతారు. సగం నిర్మాణమైన ఆరోగ్య కేంద్రాన్ని కూలగొట్టి తమ నిరసన తెలుపుతారు. కదిలించే కథ “కాన్పుల దిబ్బ“.

విశాఖపట్నం జిల్లాలో అడవులకి ద్వారబంధం లాంటి ఊరు చోడవరం. మారకమ్మ రేవు సమీప ప్రాంతాలలో ఓ ఎలుగుబంటి చొరబడి పంటలని నాశనం చేస్తూ, మనుషుల్ని గాయపరుస్తూంటుంది. ఊరి జనాలకి ఏం చేయాలో పాలుపోదు. పక్కోడి కోసం పీక తెగ్గోసుకునే మనిషిగా పేరుపొందిన జాన్ మేస్టారుని ఆశ్రయిస్తారు. మొదట కాదన్నా, చివరికి గ్రామస్థుల వేడికోళ్ళకి కరిగి, ఆ ఎలుగొడ్డుని తన లైసెన్స్‌డ్ తుపాకీతో చంపుతారాయన. ఊరు ఊరంతా ఆయనకి జేజేలు పలుకుతుంది. చచ్చిన ఎలుగ్గొడ్డుని కర్రలకి కట్టుకుని ఊర్లోకి వచ్చిన ఆయనని ఫోటో తీస్తారు. చాలా ఏళ్ళ తర్వాత, మొక్కులు తీర్చుకోడానికి, ఆ ఊరుకి వచ్చిన ఓ యువకుడు మేస్టారుని చూడడానికి వెళ్ళి, ఆనాడు ఆయన చూపిన ధైర్యాన్ని మెచ్చుకుంటాడు. ఎలుగుని మించిన జంతువులు ఇప్పుడు ఊరిని నాశనం చేస్తున్నాయని, వాటి నుంచి ఊరిని తాను కాపాడలేకపోతున్నానని వాపోతారు జాన్ మేస్టారు. “పాదాలకు తగిలిన ప్రశ్నలు” ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది.

గ్రామాలలో సెల్ టవర్లు పాతించే కాంట్రాక్టు పొందిన మహేశ్వర్రావు కందిపూడి గ్రామంలో ధనమమ్మ మీద కన్నేసి, ఆమెని వెంబడిస్తూ, మాటలతో హింసిస్తూ ఉంటాడు. వాడిని ఏమీ అనలేకపోతుంటారు ధనమమ్మా, అప్పారావు దంపతులు. సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్, తరంగాల ద్వారా తమకి జీవనోపాధి కలిపించే తేనెపట్టులను కోల్పోతున్న ఆ దంపతులు చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నారు. మదమెక్కి నోరు జారిన మహేశ్వర్రావు మాటల్లోంచి, తనని తాను రక్షించుకునే మార్గం దొరుకుతుంది ధనమమ్మకి. “మూడు గుర్రాలు – మూడు అయిదులు” కథ తిరగబడ్డవారి తెగువని చాటుతుంది.

అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య పోరాటం – ఏనుగులు పోట్లాడుకుంటే గడ్డి పరకలు నలిగిపోయినట్లుగా – నిమ్నవర్గాల వారి ఉసురు ఎలా తీస్తుందో చెబుతుంది “పేనం దీసుకున్న పాల్తేరు సిన వెంకటి” కథ. యజమానికి భయపడి అతడు చెప్పిన దారుణాలన్నీ చేసిన పాల్తేరు చిన వెంకటి జీవితపు చరమ దశలో పశ్చాత్తాపం చెందుతాడు. ఆ వయసులో కూడా తన చేత దుర్మార్గం చేయించాలని చూసిన కామందు ఆజ్ఞని ధిక్కరిస్తాడు. ఆత్మాభిమానం కోసం ఆత్మార్పణ చేసుకుంటాడు. హృదయం బరువెక్కుతుందీ కథ చదివాక.

అంకురపాలెంలో అగ్రవర్ణాల యువకులు ఓ పేదింటి పిల్లని దారుణంగా చెరుస్తారు. పత్రికలు, మహిళాసంఘాల మద్దతుతో ఆ యువకుల మీద కేసు వేస్తారు ఆ బాలిక తల్లిదండ్రులు. వైద్య పరీక్షల పేరుతో డాక్టరూ, పోలీసులు ఆ అమ్మాయిని మరింతగా క్రుంగదీసేలా అవమానిస్తారు. ఆ అమ్మాయి తీసుకున్న ఓ నిర్ణయం ఆమె భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. “ఘోరం” కథ నిజంగానే ఘోరమని అనిపిస్తుంది.

అగ్రవర్ణాల కుత్సితానికి, కుట్రలకు అణగారిన వర్గాల ప్రజలు ఎలా బాధితులవుతున్నారో మరోమారు చాటిన కథ “మైనం“. దొరల కుతంత్రం పసిగట్టలేక, తన జాతి పరువుని పణంగా ఒడ్డి కట్టిన పందెం ఓడినందుకు తనని తాను శిక్షించుకుంటాడు మూలయ్య. అణగారిన వర్గాల ఐక్యతనీ, అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు ఇప్పటికీ కొత్త పద్ధతులలో కొనసాగుతూనే ఉన్నాయని ఈ కథ చెబుతుంది.

రచయిత కల్పించిన కొత్త పదాలు, పదబంధాలు ఈ కథలకి వన్నెలద్దాయి. “భావిస్తుంటారు కాబట్టి అహంభావిస్తుంటారు కూడాను.”, “గొప్ప కట్టుగా తేనెపట్టుగా ఉంటుంటారు.”, “బతికుంటే బలుసాకు, ఛస్తే తులసాకు”, “మహేశ్వర్రావు కామా ఫుల్‌స్టాప్ లేకుండా వాగాడు. కామానికీ ఫుల్‌స్టాప్ లేకుండా వాగుడు.”, “వెంకటరత్నాన్ని గడ్డికుప్పల మీద నమిలిపారేసిన… ఊడ్చిపారేసిన… దోచిపారేసిన… త్రిధూర్తులూ…….” వంటివి ఇందుకు ఉదాహరణలు.

శ్రీనిజ ప్రచురణలు, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ 124 పేజీల పుస్తకం వెల 110/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ బుక్‌ని మీ ఇంటికే తెప్పించుకోవచ్చు.

కొల్లూరి సోమ శంకర్
ప్రచురణకర్త చిరునామా:
శ్రీనిజ ప్రచురణలు,
6-60/1, రవీంద్రనగర్,
పాత డెయరీ ఫారం
విశాఖపట్నం-40

You Might Also Like

One Comment

  1. varaprasaad.k

    అన్ని కధల్ని టూకీగా,స్పష్టంగా వెంటనే చదవాలని పించేలా రాసారు. సమీక్ష బావుంది.

Leave a Reply