ఇంట గెలిచి రచ్చ గెలిచిన సంస్కర్త , ప్రాచ్య విజ్ఞాన వేత్త: బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(ఈ వ్యాసం అక్టోబర్ నెల పాలపిట్ట సంచికలో వచ్చింది. పుస్తకం.నెట్ లో పునఃప్రచురణకు అంగీకరించిన పాలపిట్ట సంపాదకులకు, వ్యాస రచయితకీ ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
**************
ఒక వ్యక్తి జీవిత చరిత్రని రచించడమంటే తేదీల వారీగా సంఘటనల్ని నమోదు చేయడం కాదు. ఆ వ్యక్తి జీవించి నడయాడిన ప్రాంతానికి చెందిన సామాజిక చరిత్ర నిర్మించడం. ఆయా సంఘటనల ద్వారా వ్యక్తమయ్యే వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడం. తోటి వ్యక్తుల పట్ల కుటుంబం పట్ల సమాజం పట్ల వారి జీవన దృక్పథాన్ని తెలుసుకోవడం. తద్వారా ఆనాడు అమల్లో వున్న సామాజిక విలువల్లోని మంచి చెడుల్ని సాపేక్షంగా గుర్తించడం. సమాజ చలనాన్ని అవగతం చేసుకొని కాలనాడిని పట్టుకొని రాబోయే తరాలకి అందించడం. జీవిత చరిత్ర రాసే రచయితకి యీ అవగాహన వున్నప్పుడే వొక జీవిత చరిత్ర సమగ్రమౌతుంది. అటువంటి అవగాహన పుష్కలంగా వున్న రచయిత డా. కె.ముత్యం.

పరిశోధకుడిగా తెలంగాణాకి చెందిన డా. ముత్యానికీ ఉత్తరాంధ్రకి విడదీయరాని బంధం వుంది. ఆ బంధం ప్రజా ఉద్యమాలతో ముడివడి వుంది. ఆ నేలపై కదలబారిన ప్రజా సమూహాల వుద్యమ చైతన్యం ఉత్తర తెలంగాణా నాగేటిచాళ్ళ లోకి ప్రవహించినట్టే ముత్యం నరాలలోకి కూడా యెగబాకింది. అందుకే ‘శ్రీకాకుళ వుద్యమ సాహిత్యం’ అతని పరిశోధనాంశమైంది. పరిశోధన చేసే క్రమంలో వుత్తరాంధ్రతో యేర్పడ్డ సాహిత్య బాంధవ్యాన్ని పురస్కరించుకొని ‘మాకొద్దీ తెల్లదొరతనమూ…’ అని స్వాతంత్ర్యోద్యమంలో పాటల పిడుగులు కురిసిన గరిమెళ్ళ సత్యనారాయణ అలభ్య రచనలు సేకరించి ప్రచురించాడు. ‘సునాముది జీవధార’ ద్వారా మందసా కేంద్రంగా వుత్తరాంధ్రలో జరిగిన జమీ వ్యతిరేక రైతాంగ పోరాటాన్ని అక్షర బద్ధం చేశాడు. వీరవనిత గున్నమ్మ సాహస చరిత్రని పునర్నిర్మించాడు. చరిత్ర నిర్మాణానికి జానపద సాహిత్యాన్నీ మౌఖిక ఆకరాల్నీ స్వీకరించి ఆ గ్రంథ రచనలో ముత్యం రూపొందించుకొన్న మెథడాలజీ తర్వాతి తరాలకు మార్గదర్శకమైంది. ఇప్పుడు ‘బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జీవిత దృశ్యం’ ని నెపం చేసుకొని అట్టడుగున పడి కాన్పించని కళింగాంధ్ర సామాజిక సాంస్కృతిక రాజకీయ చరిత్రని దృశ్యమానం చేస్తున్నాడు. పర్లా కిమిడి ఉర్లాం బరంపురం నరసన్నపేటలు కేంద్రంగా స్వాతంత్ర్యానికి ముందు వెనక కాలంలో కళింగాంధ్రలో మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సంభవించిన చలనాన్ని నేపథ్యం చేసుకొని అక్కడ జరిగిన భాషా – మత సంస్కరణోద్యమాల్లో బంకుపల్లి మల్లయ్య శాస్త్రి కృషిని – స్థానాన్ని అంచనా గడుతున్నాడు.

మల్లయ్య శాస్రిది బహుముఖీనమైన వ్యక్తిత్వం. ఆయన పండిత కవి. భాష్యాంత వ్యాకరణం తర్క వేదాంత జ్యోతిష మంత్ర శాస్త్రాల్నిఆపోశన పట్టాడు. వ్యక్తిగతంగా స్వధర్మాన్ని ఆచరించిన బ్రాహ్మణ మేధావి ; కానీ ధర్మం యేకశిలా సదృశం కాదనీ కాలానుగుణంగా మారాలని నమ్మడంవల్ల ఆయన యెంత సనాతనుడో అంత ఆధునికుడయ్యాడు. భాషా మత సంస్కరణల్లో అభ్యుదయ దృక్పథాన్ని ప్రకటించాడు.

ప్రాచ్య విజ్ఞాన వేత్తగా సాయణ భాష్యాన్ని అనుసరిస్తూ వేదాల్ని తొలిసారిగా తెలుగులోకి అనువదించి ( ఆంధ్ర వేదములు: 1940 – 1941 ) నిశ్శబ్ద విప్లవానికి పాదులు కట్టాడు. తెలుగులోనే కాదు యే యితర భారతీయ భాషల్లోనయినా యిది తొలి బృహత్ ప్రయత్నమని చెప్పుకోవచ్చు. ఆయన వేదానువాదం గొప్ప సంచలనానికి కారణమైనప్పటికీ తానే ఆ రంగంలో మొదటివాడినని యితరుల్లా యెక్కడా ఘనంగా చెప్పుకోలేదు. వేద – ఉపనిషత్ – దర్శనాల అనువాదాల్లో మల్లయ్యశాస్త్రి గారిది పాండిత్య ప్రదర్శన దృష్టి కాదు. కుల ప్రమేయం లేకుండా జ్ఞానం పొందే హక్కు అధికారం అందరికీ సమానంగా వుందని ప్రచారం చేసి ఆచరించిన సమత్వ దర్శనమే.

దేశ స్వాతంత్ర్య వుద్యమంలో మల్లయ్య శాస్త్రి క్రియాశీలంగా వ్యవహరించాడు. శాస్త్రాల ప్రమాణంతో అస్పృశ్యతని ఖండించాడు. అస్పృశ్యత సంకుచిత బుద్ధులైన ఛాందసులు కల్పించినదనీ అది ధర్మ విరుద్ధమని ప్రవచించాడు. ఆంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్దాన ప్రాంతంలో ప్రారంభమైన అనేక వుద్యమ సభల్లో ప్రసంగించాడు. గంజాం నుంచి విశాఖ పట్నం కాకినాడ గుంటూరు బందరు నెల్లూరుల మీదుగా చెన్నపట్నం దాకా తీరాంధ్రమంతా తిరిగి అనేక వేదికలమీద సాధికారంగా ధాటిగా వుపన్యాసాలిచ్చాడు. తిరువాన్కూర్ లో హరిజనుల దేవాలయ ప్రవేశానికి దోహదమయ్యాడు. చివరికి సొంత కులంలో ‘అంటరానివాడ’య్యాడు. హేతుదృష్టితో శూద్రులకు వేదాధ్యన అధికారం వుందని నిరూపించాడు. దళితులకు గాయత్రీ మంత్రోపదేశం చేసి రామానుజుడిలా సంచలనం సృష్టించాడు. సంస్కరణ భావాలతో ఆచరణతో సొంత కులాల నుంచి వెలి అయిన యువకులకు తన యింట్లోనే ఆశ్రయమిచ్చి విద్యా బుద్ధులు నేర్పించారు.

నిజానికి ఉన్నవ లక్ష్మీనారాయణ వారు మాలపల్లి నవల రాసిన కాలంలోనే మల్లయ్య శాస్త్రి ‘జాతి వ్యవస్థ’ ( 1924 ) మూలాల గురించి పరిశోధన వ్యాసాలు రచించి అస్పృశ్యత వ్యతిరేక ప్రచారానికి నాందీ పలికాడు. ఆ తర్వాత తన ప్రబోధాన్ని నిజాయితీగా ఆచరించి చూపాడు.
సాహితీవేత్తగా బంకుపల్లి ప్రాచీన ఆధునిక రచనా సంప్రదాయాల కలబోత (కొండవీటి విజయం). భగవద్గీతకు వ్యాఖ్యానం చేసిన చేత్తోనే అలంకార శాస్త్ర గ్రంథాలు రచించాడు. ‘కావ్యతీర్థ’ బిరుదాంకితుడయిన ఆయన సంగీతజ్ఞుడు కూడా కావడం వల్ల యక్షగానాలు భామా కలాపాలు రచించి ప్రదర్శింపజేశాడు. సంస్కృతంలో హరికథలు రాశాడు. హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు మెచ్చేలా హరికథలు గానం చేశాడు. పురాణ ప్రవచానాన్నీ హరి కథనీ మిళితం చేసి ‘పురాణ హరికథా’ ప్రక్రియని రూపొందించి స్వయంగా ప్రదర్శించి ‘పురాణ వాచస్పతి’ గా పేరొందాడు.
ఎన్నో సంస్కృత నాటకాల్లో స్వయంగా ప్రధాన భూమికలు ధరించాడు. అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు, వేణీసంహారం లో భీముడు , స్వప్న వాసవదత్తంలో వత్సరాజు , మృచ్ఛకటికంలో చారుదత్తుడు మొదలైన వేషాలు కట్టి తన గాన అభినయ కౌశలంతో పండిత పామర వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

ఉత్పలమాల చంపకమాల వంటి వృత్తాలకూ సీసం వంటి దేశీ ఛందస్సుకి చెందిన తెలుగు పద్యాలకు మొట్ట మొదటి సారిగా తాళగతులు నిర్వచించాడు. అవి తర్వాతి కాలంలో వసుచరిత్ర లాంటి ప్రబంధ పద్యాల్ని గానం చేయడానికో వీణమీద వాయించడానికో మార్గదర్శకమయ్యాయి.
ప్రగతి శీల దృక్పథం పట్ల నిబద్దుడైన రచయితగా డా. ముత్యానికి సంస్కృతాంధ్ర భాషల్లో , ప్రాచీన ఆధునిక విద్యల్లో బంకుపల్లికి వున్న బహుముఖీనమైన పాండిత్యం కాక ఆయనలో వున్న ఉదాత్త సంస్కారం ఉదారవాద వైఖరి హేతు దృష్టి సంస్కరణ చైతన్యం నిబద్ధత నిరాడంబర జీవన శైలి మానవీయ గుణాలే యెక్కువగా ఆకర్షించి వుంటాయి అనడానికి పుస్తకంలో అనేక వుదాహరణలు కనిపిస్తాయి.

పదిహేనేళ్ళ వయస్సులోనే మల్లయ్య శాస్త్రి ఉర్లాం నుంచి 228 కిలోమీటర్లు కాలినడకన తుని వెళ్లి మహామహోపాధ్యాయ పరవస్తు వేంకట రంగాచార్యుల వద్ద సంస్కృత వ్యాకరణం నేర్చుకొన్నాడు. అందుకు కృతజ్ఞతలు తెల్పడానికి తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకొని గురు దక్షిణ చెల్లించాడు.
తెలంగాణ భాషని తౌరక్యాంధ్రమని నైజాం రాష్ట్రంలో తెలుగు కవులు పూజ్యమని బ్రిటిష్ సర్కారాంధ్ర పండితమ్మన్యుల అహంకార పూరిత ప్రకటనలకు సురవరం ప్రతాపరెడ్డి వంటి వారు యింకా సమాధానం యివ్వడానికి ముందే ఖమ్మంకి చెందిన తెలగాణ్య బ్రాహ్మణుడు ‘గౌతమి కోకిల’ వేదుల సత్యనారాయణ శాస్త్రికి (దీపావళి కవి)మల్లయ్య శాస్త్రి తన వితంతు కుమార్తె కృష్ణవేణినిచ్చి వివాహం చేసాడు. ఆయన కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి కూడా తండ్రితో పాటు సంస్కరణోద్యమ ప్రచారం చేసి వితంతు వివాహం చేసుకొన్నాడు. అతను , మరో కుమారుడు కృష్ణ శాస్త్రి స్వాతంత్ర్యోద్యమంలో జైలుకెళ్లారు. సూర్యనారాయణ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నందుకు కుటుంబమంతా పర్లా జమీందారు ఆగ్రహానికి గురయయింది. దొరవారు మల్లయ్య శాస్త్రిని సకుటుంబంగా దివాణం వుద్యోగాలు వదిలిపోమ్మని ఆజ్ఞాపించారు. దాదాపు 90 యేళ్లకి పూర్వమే శాఖా భేదాలు ప్రాంత భేదాలు అధిగమించి తన యింటి నుంచే సంస్కరణకు పూనుకొన్న ఆచరణ శీలి బంకుపల్లి. ఇంట గెలిచి రచ్చ గెలిచిన కార్య వాది ఆయన. తన పిల్లలకు శాఖాంతర వివాహాలు చేసాడు. విధవా వివాహాలకూ శాఖాంతర వివాహాలకూ శాస్త్రోపపత్తుల్ని చూపి రచనలు చేసి పీఠాధిపతుల్ని వొప్పించాడు. ఆయనతో వాదంలో గెలవలేని కులం కుళ్ళుమోతులు ఆయన్ని బహిష్కరించారు. దానిపై ఆయన న్యాయ పోరాటం చేశాడు. బహిష్కరణ విధించిన వారిపై కోర్టులో సవాలు వేసి విజయం సాధించాడు. కోర్టు ఇప్పించిన నష్ట పరిహారాన్ని బహిష్కరించిన పెద్దలకే తిరిగి యిచ్చి మానవీయమైన గుణపాఠం చెప్పాడు.

మల్లయ్య శాస్త్రి జీవితమ్మీద గిడుగు రామమూర్తి గారి ప్రభావం బలంగా వుంది. పర్లాకిమిడిలో ‘రీడింగ్ రూం’ సంస్థ ద్వారా రామమూర్తి గారికి ఆప్తులయ్యారు.ఆయన దగ్గర ఇంగ్లీషు నేర్చుకొన్నారు. కృష్ణవేణి – వేదుల వివాహ నిర్వహణలో గిడుగు ప్రధాన భూమిక వహించి శాస్త్రిగారికి నైతికంగా గొప్ప అండగా నిలిచారు. గిడుగు అడుగు జాడల్లో వారి అంతేవాసిగా బంకుపల్లి వాడుక భాష ప్రచారానికి పూనుకోవడమే గాదు ; దాన్ని శాస్త్ర –తాత్త్విక – ఆధ్యాత్మిక – దార్శనిక గ్రంథాల అనువాదాలకు సైతం నప్పేల వాడుకొని గురువుని మించిన శిష్యుడయ్యాడు. వీరిద్దరి సాన్నిహిత్యాన్నీ ప్రస్తావించడం దగ్గర ముత్యం ఆగిపోలేదు. పర్లాకిమిడిలో ఆ రోజుల్లో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని పేర్కొని అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళే అధిక సంఖ్యాకులున్నప్పటికీ ఆ ప్రాంతాన్ని ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి జమీందారు వేసిన యెత్తుగడలనీ అందుకు వ్యతిరేకంగా గిడుగు నేతృత్వంలో జరిగిన ఆత్మగౌరవ వుద్యమాల్ని ప్రధానంగా అభివర్ణించాడు. రామమూర్తి పర్లాకి నీళ్లొదలడానికి ముందే బంకుపల్లి పర్లాకి దూరమయ్యారు. ఆ తర్వాత జమీందారు మల్లయ్య శాస్త్రికి మళ్ళీ వుద్యోగం యిస్తానని ఆహ్వానించినా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు – కక్కిన కూడు తినడం తన వల్ల కాదని తిరస్కరించి ఆత్మాభిమానంలో గిడుగుకి తీసిపోనని నిరూపించుకొన్నాడు. ఏ రోటి కాడ ఆ పాట పాడే యీ తరం వారికి ఆ నాటి మహనీయుల జీవితాలు ఆశ్చర్యంగా తోచక మానవు.

ఇంతటి విశిష్ట వ్యక్తిత్వం మూర్తీభవించిన బంకుపల్లి వారి జీవిత దృశ్యాల్ని రికార్డ్ చేయడంలో డా. ముత్యం యెక్కడా అభిమానపు వెల్లువలో కొట్టుకుపోలేదు. ‘కందుకూరికి సైదోడు’ అని మల్లయ్య శాస్త్రిగారి మీద కవులు పద్యాలు కట్టినప్పటికీ (బూరాడ గున్నయ్య శాస్త్రి తన వాణీ విహార కావ్యాన్ని బంకుపల్లి వారికుమారుడు సూర్యనారాయణ శాస్త్రికి కి అంకితం చేస్తూ రాసిన పద్యాల్లో మల్లయ్య శాస్త్రి వ్యక్తిత్వ విశేషాల చిత్రణ కూడా వుండడం వల్ల వాటిని పరిశోధకుడు అనుబంధంలో చేర్చాడు), వీరేశలింగానికి ఆయనకు వున్న పోలికల్నీ తేడాల్నీ యెత్తిచూపాడు. మత సంస్కరణలో శాస్త్రిగారి పరిధి పరిమితుల్ని సైతం అతను గుర్తించాడు. వీరేశలింగంలా బంకుపల్లి బ్రహ్మ సామాజికుడు కాలేదు. సనాతన బ్రాహ్మణ సంప్రదాయాల్నిఅంటిపెట్టుకునే సంస్కరణలకి పూనుకున్నాడు. వీరేశలింగం బ్రిటిష్ వలసవాదాన్ని యెక్కడా వ్యతిరేకించిన దాఖలాల్లేవు. స్వాతంత్ర్యోద్యమం ఆయన కార్యక్షేత్రం కాలేదు. ఆ తేడాని గుర్తిస్తూ మల్లయ్య శాస్త్రిని గాంధేయవాదిగా ఉన్నవతో పోల్చవచ్చుఅని ముత్యం భావించాడు. అయితే ఉన్నవ పై సామ్యవాద ప్రభావం వుందనీ బంకుపల్లి సనాతన ధర్మంలోనే వుండిపోయిన సమదర్శి అనీ సరిగానే అంచనా వేశాడు.

అదేవిధంగా శాస్త్రిగారి వేదానువాదాల గురించి వివరించే సందర్భంలో అంతకు ముందు ఆ రంగంలో జరిగిన కృషినీ ఆనాటి కాంగ్రెస్ జస్టిస్ పార్టీల రాజకీయాల్లో బ్రాహ్మణ బ్రాహ్మణేతర శక్తుల ప్రమేయాల్నీ అవి వేదానువాదానికి నేపథ్యంగా పనిచేసిన తీరునూ ముత్యం నిష్పాక్షికంగా విశ్లేషించాడు.

ముత్యం పరిశోధనలో ప్రత్యేకత యేమంటే చెప్పాల్సిన విషయమే రంగస్థలం మీదికి వెలుగులోకి వస్తుంది. పరిశోధకుడు మాత్రం తెర చాటునే ఉండిపోతాడు. ఇది తన డిస్కవరీ అన్న అహంభావ ప్రకటనలు అతని రచనలో కనిపించవు. ఎవరినైనా పూర్వపక్షం చేయాల్సి వచ్చినా మాటలో పారుష్యం వుండదు. అలా అన్జెప్పి నిర్ధారణల్లో యెక్కడా తడబాటు వుండదు.

బాల్య వివాహాల ఖండన , వితంతు పునర్వివాహాల శాఖాంతర వివాహాల సమర్థనలతో మల్లయ్య శాస్త్రి సభలు సమావేశాలు నిర్వహిస్తూ గ్రంథాల్ని (వివాహ తత్త్వము) ప్రకటించినప్పుడు తాతా సుబ్బరాయ శాస్త్రి వజ్ఝల చిన సీతారామ శాస్త్రి వంటి ఆధునిక భావాలు కలవారు ఆయన భావాలతో అభిప్రాయాలతో యేకీభవించి వాటిని ఆమోదించినప్పటికీ రాత పూర్వకంగా సమర్థించ లేకపోయారు. ఆచరణలో ముందుకు రాలేక పోయారు. ఈ విషయంలో ఆరుద్ర పొరపాటు పడ్డ సందర్భాన్ని వుటంకిస్తూ ముత్యం అందుకు అవసరమైన ఆధారాల్ని సేకరించి అనుబంధంలో పొందుపరిచాడు తప్ప స్వోత్కర్ష చూపలేదు. ఇటువంటివి యీ గ్రంథంలో అనేకం. అవి పరిశోధకుడి వినమ్రతకీ నిష్పాక్షిక దృష్టికీ నిజాయితీకీ నిదర్శనాలు.

శాస్త్రిగారి జీవిత చరిత్రకు ఆధారాలు దొరికినప్పుడల్లా భాగాలు భాగాలుగా అల్లుతూ పేనుతూ మారుస్తూ పోవడం వల్ల ఒక నిర్దిష్ట శైలి లేకుండా పోయిందని పరిశోధకుడే అంగీకరించినప్పటికీ మౌఖిక కథనాల (oral tesimonies) ఆధారంగా ఘటనల కథనం నుంచి వాస్తవాల్ని నిర్ధారిస్తూ నిర్మించే మౌఖిక చరిత్ర రచనలో యేర్పడే యిబ్బందుల్లో అది సహజమేనని ఆ రంగంలో పని చేసేవాళ్ళు గుర్తిస్తారు. ముత్యం శాస్త్రి గారి రచనల్ని ప్రథమ ఆకారాలుగా స్వీకరించాడు. శాస్త్రిగారితో ప్రత్యక్ష పరోక్ష పరిచయమున్న వ్యక్తుల్ని సంప్రదించాడు. ఆయన సాహిత్య కృషి గురించి వ్యక్తిత్వం గురించి సమకాలీనులు రెండో తరం వారూ శిష్య ప్రశిష్యులు తమ రాతల్లో మాటల్లో చెప్పిన అభిప్రాయాల్ని సేకరించాడు. ప్రాథమిక సమాచారం లేని సందర్భాల్లో మల్లయ్య శాస్త్రిగారి జీవితాచరణని ఆయన తన రచనల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో , మౌఖిక ఆధారాలతో పరీక్షించి నిజానిజాల్ని నిర్ధారించాడు. గ్రంథ రచనలో ముత్యం పాటించిన యీ పరిశోధన పధ్ధతి యెంతో ప్రామాణికమైనది. అది చరిత్ర రచనలో పరిశోధన విధానానికి చక్కని పాఠం అని చెప్తే తప్పు కాదు. జీవిత చరిత్ర నిస్సారమైన చరిత్రగా మారకుండా ఆసక్తికరంగా చదివించేలా చేయడానికి ముత్యం మరో అడుగు ముందుకు వేసి దానికి సృజనాత్మక శైలిని అద్దాడు. పర్లా జమీందారు బంకుపల్లి కుటుంబాన్ని వూరు విడిచి పొమ్మన్నప్పుడు , కాశీ నుంచి తిరుగు ప్రయాణంలో శాస్త్రి గారి చరమదశని వర్ణించినప్పుడు వుద్వేగ ప్రధానమైన సందర్భాల్ని వొక కథలా నడపడటంలో డా.ముత్యంలోని సృజనాత్మక రచయిత వెలికి వచ్చాడు. చిందు ఎల్లమ్మ జీవితాన్ని అందించినప్పుడు మోసులు వేసి పూలు తొడిగిన యీ నేర్పు యీ గ్రంథ రచనకు వచ్చేసరికి మరింత పరిపక్వమైంది.

ఆ రోజుల్లో ఉర్లాం కాశీలా గొప్ప విద్యా కేంద్రంగా వుండేది. ఉర్లాం లో శ్రావణి పరీక్షా పట్టభద్రులు కావడం పాండిత్యానికి గుర్తింపుగా భావించేవారు. ఈ విషయాన్ని పేర్కొంటూ ముత్యం శ్రీపాద కథలో సంభాషణని వుదాహరిచడం చూస్తే పరిశోధకులకు అందునా సాహిత్యం ద్వారా సాంఘిక చరిత్ర రచనకు పూనుకొన్న వారికి విస్తృత అధ్యయనం యెంత తోడ్పడుతుందో తెలుస్తుంది. ఈ విషయంలో ముత్యం సురవరం ప్రతాపరెడ్డికి కొనసాగింపులా కనిపిస్తాడు.
అపారమైన మేధ అపూర్వమైన వ్యక్తిత్వం వున్న మల్లయ్య శాస్త్రి సాహిత్య కారుడిగా సంస్కర్తగా వెలుగులోకి రాకపోడానికి కారణాల్ని కూడా ముత్యం విశ్లేషిస్తాడు. ‘వైదిక నియోగుల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరు’లో ఇతర కులాలవారి కృషే కాకుండా ఇతర శాఖల బ్రాహ్మణుల కృషి కూడా విస్మరణకి గురైంది అనీ , కళింగాంధ్రని వెనకబడిన ప్రాంతంగా చేసిన ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రాంతాల ‘ముందు చూపు’ కూడా అందుకు కారణమనీ , అభ్యుదయ విప్లవ సాహిత్యోద్యమాల ప్రభావంలోనే ఆ ప్రాంతపు సాహిత్యం వెలుగులోకి వచ్చిందనీ … ఇప్పుడు ప్రాంతీయ , ఉద్యమ , కుల చైతన్యాల స్ఫూర్తితో యీ విషయాల్ని అధ్యయన చేయాలనీ డా. ముత్యం చేసిన ప్రతిపాదనలు భావి పరిశోధకులకు కొత్త చూపునిస్తాయి. నూత్న పరిశోధనలకు ద్వారాలు తెరచి వుంచడమే మంచి పరిశోధన లక్షణమైతే అది నిండుగా వున్న గ్రంథం ‘బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జీవిత దృశ్యం’.

[ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జీవిత దృశ్యం , డా. కె. ముత్యం , దృష్టి ప్రచురణ – నిజామాబాద్ , 2015 ]

You Might Also Like

4 Comments

  1. bhanu prakash

    అత్యద్భుతమైన రివ్యూ.మా ఊరిలో (శ్రీకాకుళం లో)కొత్త బ్రిడ్జీ దగ్గర బంకుపల్లి మల్లయ్య శాస్త్రిగారి శిలా విగ్రహం ఉంది.కానీ ఇప్పటవారికి నాతొ కలిపి చాలా మందికి ఆయన గురించి తెలియదు. ఇక ముత్యం గారికి ఉత్తరాంధ్ర అంతా రుణపడి ఉంది.ఆయన మా చారిత్రిక సాహితి ఉద్యమ విషయాలపై చేయేసినా కృషి అమోఘం.ఆయనకీ నిజంగా పాదాభివందనం.

  2. murthy

    దయచేసి ఈ పుస్త్తకం ఎక్కడ దొరుకుతుంది (కొనుక్కోవచ్చో) తెలుపగలరా

    1. bhanu prakash

      లోగిలి.కామ్ లో దొరుకుతుంది.

  3. varaprasaad.k

    ఎందరో మహానుభావులు,అందరికి వందనాలు,నేటికీ మనకు తెలియని ఎందరో సాహిత్య వేత్తలు ఉన్నారు,వారిలో కొందరి గురించి ఐనా పుస్తకం ద్వారా తెలుసుకోవటం ఆనందంగా ఉంది.

Leave a Reply