కనులలో తడి…. పెదాలపై నవ్వు – “పూర్వి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
***************
పొత్తూరి విజయలక్ష్మి గారు జగమెరిగిన రచయిత్రి. అద్భుతమైన కథలనీ, నవలనీ తెలుగు పాఠకులకు అందించారు. ఎన్నో హాస్య కథలతో పాటు కరుణరసార్ద్రమైన కథలనూ ఆవిడ సృజించారు. మానవతా పరిమళాలను వెదజల్లే కొన్ని కథలను “పూర్వి” అనే శీర్షికతో ఇటీవల పుస్తక రూపంలోకి తెచ్చారు. ఇందులో పదహారు కథలున్నాయి. కొన్ని కథలు ఆర్ద్రంగా మనసుని తాకి, కనులను తడుపుతాయి. మరికొన్ని కథలు పెదాలపై నవ్వులు పూయిస్తాయి. వాటిని పరిచయం చేసుకుందాం.

పూర్వి ఓ అనాథ. ఓ చిన్న టీ, టిఫెన్లు అమ్మే కొట్టు పెట్టుకుని బతుకుతూంటుంది. అనుకోకుండా ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు హరి. చిన్నతనంలో జులాయిగా తిరిగి సొంతూరి నుంచి పారిపోయి కుటుంబానికి దూరమైన హరి – తన తప్పు తాను తెలుసుకుని, మారిన మనిషిలా ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. అనుకోని పరిస్థితులలో అతనికి బదులుగా అతని ఊరికి పూర్వి వెళ్ళాల్సివస్తుంది. అతని తల్లిదండ్రులు, అక్కా బావా పూర్వితో ఎలా వ్యవహరించారు? ఆమె అక్కడికి ఏం తీసుకెళ్ళిందో తెలుసుకోవాలంటే “పూర్వి” కథ చదవాలి.

గల్ఫ్ దేశాలలో ఎలెక్ట్రీషియన్లకి బాగా డిమాండ్ ఉందంటే, ఆరు నెలల పాటు కష్టపడి విద్య నేర్చుకుని – అప్పుజేసి మరీ ఏజంట్‍కి డబ్బు చెల్లించి, అక్కడికి వెళ్తాడు మధ్య తరగతి యువకుడు రాజు. తీరా అక్కడ తనకి ఏ మాత్రం నైపుణ్యం లేని పని చేయాల్సొస్తుంది. వెనక్కి వచ్చేద్దామంటే చాలా నష్టం. ఏవో తిప్పలు పడి అక్కడే ఉంటాడు. ఓ సార్ సాయంతో తనకి అప్పగించిన పనిలో విశేష నైపుణ్యం సాధించి, బాగా రాణించి సంపన్నుడవుతాడు. ఇండియా వచ్చేశాక, తనకి అంత సాయం చేసిన ఆ సార్‌ని చూడాలనుకుంటాడు. మరి ఆయనను కలవగలిగాడా? ఆయన రాజుని గుర్తుపట్టారా? భావోద్వేగాలతో సాగుతుంది “బాలరాజు కథ“.

వివాహం అనేది అందరి జీవితాల్లోనూ ఓ మధురమైన ఘట్టం. వివాహ వేడుక అనేది ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇప్పటి కాలంలో అంతా వేగం… హడావిడిగా జరిగిపోతున్నాయి పెళ్ళిళ్ళు. అక్షింతలు వేశామా, తిన్నామా బయల్దేరామా అన్నట్టు ఉంటున్నాయి నేటి వివాహా వేడుకలు. ఇటువంటి పరిస్థితులలో, ఓ యాభై ఏళ్ళ క్రితం ఓ పెళ్ళి ఎలా జరిగిందో, పెళ్ళి తరువాత వధూవరులు ఏం మాట్లాడుకున్నారో, ఆ మాట్లాడుకోడానికి ఎలా ఏర్పాట్లు చేసుకోవలసివచ్చిందో మనసుని తట్టేలా చెబుతుంది “ఆనాటి ముచ్చట్లు” కథ.

నడమంత్రపు సిరి అబ్బి, ఉమ్మడి కుటుంబం నుంచి బయటివచ్చిన ఓ వ్యక్తి జీవితం కొన్ని రోజులలోనే తారుమారవుతుంది. అతను చనిపోయాక అతని భార్యాపిల్లలు నానా కష్టాలు పడి బ్రతుకుపోరు సాగిస్తూంటారు. మరో వైపు జీవితంలో అన్ని రకాలుగా నష్టపోయినా, ఇతరులకు తమకు వీలైనంత సాయం చేసే ఇంకో కుటుంబం! ఈ కుటుంబ ప్రభావం ఆ ఉమ్మడి కుటుంబంలోని పెద్ద కోడలిపై పడుతుంది. తమ నుంచి విడిపోయిన మరిది కుటుంబాన్ని ఎలా ఆదుకుంది, తిరిగి తమలో ఎలా కలుపుకుందో తెలిపే కథ “సుఖాంతం“.

తమకు చేతనైన విధంగా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పి పెంచి పెద్దచేసిన ఓ జంట ఈనాటి పరిస్థితులను ఆకళింపు చేసుకోలేకపోతారు. తాము పెంచి పెద్దచేసిన అన్న కొడుకు ఇంటికి వెళితే అక్కడ ఎదురైన అనుభవం ఆ పెద్దాయనకి విస్మయం కలిగిస్తుంది. తాము “ఇంకా మారాలి” అనుకుంటారు. మారిపోతున్న బంధాలపై వ్యాఖ్యానం ఈ కథ.

బంధువుని నమ్మి అతని వ్యాపారంలో తనకున్నదంతా మదుపు చేసిన ఓ వృద్ధుడు ఆ డబ్బుని తిరిగి పొందడానికి నానా అగచాట్లు పడతాడు, హేళనలకి గురవుతాడు. ఆయనకి ఊరట కలిగించాలనుకుంటుంది రుక్మిణి. తమ పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉన్నా, ఆ బీద కుటుంబంలోని అమ్మాయికి పెళ్ళి చేయడానికి సిద్ధమవుతుంది రుక్మిణి. సాటి మనిషి సాయం కోసం, సమర్థురాలైన మహిళ పూనుకుంటే ఏం జరుగుతుందో “పుణ్యాత్మురాలు” కథ చెబుతుంది.

జన్మనిచ్చి, పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి తమకు జీవితాలనిచ్చిన తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రవర్తన ఎలా ఉండకూడదో చెప్పే కథ – “ఒక ప్రయాణం“. ఢిల్లీ వెళ్ళేందుకు సికింద్రాబాద్‌లో రైలెక్కిన ఓ వృద్ధ జంట కథ పాఠకుల గుండెలను బరువెక్కిస్తుంది. ఈ వృద్ధ జంట అగచాట్లను కళ్ళారా చూసిన ఓ యువకుడు – తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు. మనుషుల కంటే డబ్బే ముఖ్యమైపోతున్న వైనం, ముసలి తల్లిదండ్రులను నిరాదరణకి గురిచేయడం వంటివి – ఎదిగిన పిల్లల వ్యక్తిత్వాలని మసకబారుస్తున్నాయి.

నేటి వివాహా రీతులకు, ఆధునిక ఎంపికలకు విరుద్ధంగా ఓ వ్యక్తిని ఎంచుకుంటుంది అపర్ణ. తను హైలీ క్వాలిఫైడ్ అయిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తను చేసుకోవాలనుకున్న శంకర్ గ్రాడ్యుయేట్ కూడా కాని ఓ రైతు. మరి ఆమె అతన్నే పెళ్ళి చేసుకోవాలని ఎందుకు పట్టుబట్టింది? అతనితో తన భావి జీవితాన్ని ఎలా నందనవనం చేసుకుందామనుకుందో తెలుసుకోవాలంటే “చల్లని దీవెన” కథ చదవాలి.

తన మనసు గాయపడుతున్నా పట్టించుకోకుండా పదేపదే హేళన చేస్తూండడంతో ఓపిక నశించిన ఓ ఇల్లాలు భర్తకి ఎదురుతిరుగుతుంది. భర్తలో వ్యతిరేకిస్తున్నది అహంకారాన్నే తప్ప భర్తని కాదని తెలియజేస్తూ… అతనికి కావల్సిన పనులు చేసి పెడుతూనే తనకంటూ ఓ జీవన విధానాన్నిఏర్పాటు చేసుకుంటుంది. ఆమెని చూసి మరికొంత మంది స్త్రీలు అదే పద్ధతిని అనుసరిస్తారు. వారి భర్తల పరిస్థితి ఏమయిందో తెలుసుకోవాలంటే – “ఆడవారికి ఆవేశం వస్తే!!” కథ చదవాలి.

రచయితలు సుప్రసిద్ధులయ్యే కొద్దీ వారు ఎనెన్నో సభలలో మాట్లాడాల్సి వస్తుంది. అందులోనూ వాక్చాతుర్యం ఉన్నవారైతే, వారు లేకపోతే సభ రక్తి కట్టడంటూ లాక్కుపోతుంటారు నిర్వాహకులు. మరి ఉత్తినే వేదికమీద కూర్చోబెట్టరుగా – శాలువాలు కప్పుతారు, తలపాగాలు పెడతారు. ఇంట్లో కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్న శాలువాలను వదిలించుకోడానికి ఓ రచయిత భార్య ఎలాంటి పాట్లు పడిందో, ఆ సమస్యని పరిష్కరించేందుకు భర్తకి ఏం సూచనలు చేసిందో తెలుసుకునేందుకు “ఎవరో ఒకరు ఎపుడో అపుడు” కథ చదవాలి.

హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కోతులు ఇళ్ళల్లో దూరి నానా ఖంగాళీ చేసిపోతుంటాయి. ఓ పోర్షన్‌లో కాపురం ఉండే సీతా, రామారావు దంపతులు కోతులతో ఇబ్బందులు పడుతుంటారు. ఇంట్లో ఏం చప్పుడైనా “ఏవండీ మీరా? కోతా?” అని ఆవిడ, “ఎవరదీ సీతా నువ్వా? కోతా?” అని ఆయన అడగడం మామూలే. అల్లరి కోతుల ఆగడాలను తప్పించుకోడానికి వాళ్ళేం చేశారు? ఆసక్తిగా చదివించే కథ “సీతారాములు – కోతులు“.

రిటైరై పోయి జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్న ప్రసాదరావుకి ముచ్చెమటలు పోయించింది స్మార్ట్‌ఫోన్. ఫేస్‍బుక్ పోస్టింగ్స్ వల్ల బంధువుల నుంచి తిట్లు తిని, వాట్సప్ జోకులకు విరగబడి నవ్వుతూ ఓ అపార్థానికి కారణమై మనశ్శాంతి పోగొట్టుకుంటాడాయన. దీనికి తోడు ఫేస్‌బుక్‌లో భార్య దూసుకుపోతుండం ఆయనకి అసూయగా ఉంటుంది. కూతురి సలహాతో బ్లాగు ప్రారంభించాక ఆయన మనసుకి తృప్తి కలుగుతుంది. హాస్యంగా సాగే కథ “బ్లాగుతో కథ సుఖాంతం“.

దైవం అంటే ఏమిటో అర్థం చెప్పిన కథ “ఈశ్వరానుగ్రహం“. ఎంత పేదరికంలో ఉన్నా తనలో జీర్ణించుకుపోయిన సంస్కారాలని విడవడో అర్చకుడు. తనకి సాయం చేయవచ్చిన మనిషిలోనే దేవుడిని చూస్తాడు. నిస్వార్థంగా తోటి మనిషికి సాయం చేయడంలోనే దైవత్వం ఉందని, అవసరమైన సమయంలో తగిన సహాయం అందడమే భగవంతుని అనుగ్రహమని ఈ కథ చెబుతుంది.

త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న తన బావతో అల్లరిగా ఉండే ఓ అమ్మాయి, మంచిగా మారి బావని మర్యాదగా చూసుకోవాలని అనుకుంటుంది. కాని ఆ బావ మాత్రం – మరదలిలో తనకి నచ్చేది ఆ అల్లరేననీ, తను అలానే ఉంటే జీవితమంతా సరదాగా, సందడిగా సాగిపోతుందని అంటాడు. చక్కని హాస్యంతో హాయిగా చదివించే కథ “ప్రేమికుల రోజు“.

పురాణేతిహాసాలకు కొత్త భాష్యాలు చెప్పి తమకి అనుకూలంగా అన్వయించుకుని ఉన్నఫళంగా పేరు ప్రతిష్ఠలు తెచ్చేసుకోవాలనుకునే వారికి చురకలంటించే కథ “కొత్త కోణం“.

వృద్ధాప్యం కారణంగా నిద్రపట్టక, రాత్రిళ్ళు రోజుకో పిచ్చి కథ చెప్పే బామ్మగారి నుంచి స్ఫూర్తి పొంది గొప్ప టివి సీరియల్ రైటర్‌గా ఎదిగిన యువకుడి కథ “శ్రీదేవమ్మగారి మామిడితోరణం“. చతురమైన సంభాషణలతో చదువుతున్నంతసేపూ నవ్వించే ఈ కథ టివి ధారావాహికలపై సెటైర్.

ఈ కథలు – మనుషులలోని ఆశనిరాశలు, అసూయా ద్వేషాలు, పట్టనితనం, ఓర్వలేనితనం, డబ్బుపై మోజు, ఎదుటివారి బలహీనతలతో ఆడుకోడం; సాటి మనిషి పట్ల సంవేదన, మానవత్వం, తమకు వీలైనట్లు తోటి వారికి సాయపడడం – ఇలా సమాజంలోని మంచీ చెడులకు అద్దం పడతాయి.

pv50001వృద్ధులు సైతం సాంకేతికతని అందిపుచ్చుకుని, సామాజిక మాధ్యమాలలో యువతతో పోటీపడడం ఉత్సాహం కలిగిస్తే, వేలంవెర్రిగా మారుతున్న వేలంటైన్స్ డే గిఫ్ట్స్ పట్ల సున్నితమైన చురకలు వేయడం యువతని హెచ్చరిస్తుంది. ఈ కథలు వర్తమాన సమాజానికి ప్రతిబింబాలు.

చివరిదాకా ఆసక్తిగా చదివించే “పూర్వి” కథాసంపుటి ప్రచురణకర్తలు శ్రీ రిషిక పబ్లికేషన్స్. ఈ పుస్తకం వెల 120/- రూపాయలు. 131 పేజీల ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ, ప్రచురణకర్త వద్దా లభిస్తుంది. 

ప్రచురణకర్త చిరునామా:
Sri Rishika Publications
Flat No. 201; Vikasini Apartments
2-2-1121/3 & 3A, New Nallakunta,
Hyderabad – 500 044
Ph : 040-2763 7729

You Might Also Like

One Comment

  1. G.S.Lakshmi

    విజయలక్ష్మిగారి కథలు ఎంతో బాగుంటాయి. మీరు చేసిన ఈ పరిచయం కొత్తపుస్తకాన్ని వెంటనే కొని చదవాలన్నంత బాగుంది. అభినందనలు…

Leave a Reply