వేదాలు! వేదాలు! వేదాలు! వేదాలు!” ఏం చెప్పాయి వేదాలు?

వ్యాసకర్త: జె.యు.బి.వి. ప్రసాద్
*****
వేదాలు! వేదాలు! వేదాలు! వేదాలు!”
ఏం చెప్పాయి వేదాలు?
– రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం

వేదం! ఈ పదం వింటేనే, ఎంత మందికో ఒళ్ళు పులకరిస్తుంది. చిన్నప్పుడు నాక్కూడా పులకరించేది. పెద్దయ్యాక, పులకరాలు తగ్గాయి గానీ, జ్ఞానం బొత్తిగా రాలేదు. చాలా మందికి ఈ రోజుకీ పులకరాలు వున్నాయి. ఈ పులకరాలున్న వాళ్ళందరికీ, ముచ్చటగా మూడు ప్రశ్నలు:

1. “ఏం చెప్పాయి వేదాలు?”
2. “మీరు చదివారా, వేదాలు?” 
3. “మీకు తెలుసా వాటిలో ఏముందో?”

ఈ ప్రశ్నలకి సమాధానాలు అందరికీ తెలుసు. ఈ ప్రశ్నలు నాక్కూడా వర్తిస్తాయి. అందుకే, రంగనాయకమ్మ గారు రాసిన, “వేదాలు! వేదాలు! వేదాలు! వేదాలు!” పుస్తకం చదివాను. వేదాలు ఏం చెప్పాయో, ఈ పక్కన ఇచ్చిన కవర్ పేజీ చూసి గ్రహించండి. 

మా చుట్టాలాయన, తన కొడుక్కి ఐదో యేట, ఒడుగు చేసి, పిలక పెట్టి, వేద పాఠశాలకి పంపాడు, బడికి పంపకుండా. అలా ఐదో, ఏడో యేళ్ళు గడిచాయి. చుట్టాల్లో గొప్పగా చెప్పుకునే వాళ్ళు. తర్వాత కాలంలో, పిలక పోయి, బెల్ బాటం పేంటూ, మీసాలూ, సైడు బర్న్సూ వచ్చాయనుకోండీ. అది వేరే సంగతి. ఒక సారి ఆ కొడుకుని అడిగాను, “ఇంతకీ ఆ వేదాల్లో ఏం చెప్పారూ?” అని. అలా అడిగిన కాలంలో, భక్తి గానే అడిగాను, పాపం. అయితే ఏం లాభం? ఆ అబ్బాయి, కాసిని సంస్కృత మంత్రాలయితే అప్పజెప్ప గలిగాడు గానీ, ఒక్క పిసర అర్థం చెప్పలేక పోయాడు. తెలిస్తే కదా, చెప్పడానికి? ఆ పరిశోధన అలా ముగిసింది అప్పుడు.

ఇక మా అమ్మ, రోజూ బుట్టెడు పుస్తకాలు ముందరేసుకుని, వాటిలోని సంస్కృత మంత్రాలు చదువుతూ, పూజ పూర్తయి నైవేద్యం పెడితేనే గానీ అన్నం పెట్టేది కాదు. ఆ మంత్రాలు కూడా తప్పుడు ఉచ్ఛారణతో చదివేది. అది అర్థం కాగానే, వాటి అర్థాలు అడిగే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. 

ఇంతకాలానికి, రంగనాయకమ్మ గారి ‘పుణ్యమా’ అని, ఆ వేదాల్లో ఏవుందో తెలిసింది. మీరు కూడా ఈ పుస్తకంలో ఏవుందో చూడండి. ఇక్కడ ఇచ్చిన విషయ సూచిక చూశాక, ఇదొక పరిశోధనా గ్రంధం అంటే ఎంతో అర్థవంతంగా వుంటుంది.

vedalu-contents1

vedalu-content2

అన్నట్టు, హాస్యం లేదనుకోకండి. బ్రహ్మ గడ్డం గురించి ఎప్పుడన్నా, ఎవరన్నా ఆలోచించారా? మంత్రాలూ, చింతకాయలూ అనే పదాలు చిన్నప్పుడే విన్నారు కదా? మరి వాటిని ఎలా స్పష్టంగా, వివరాలతో అన్వయించాలో తెలుసా? తెలియదు కదూ? ఈ పుస్తకం చదవండి, అది తెలుస్తుంది.

“వేదాల్లో అన్నీ ఉన్నాయంష!” అని అందరూ అనడం విన్నాను గానీ, ఆ వున్నవేమిటో తెలిస్తేగా? 

రంగనాయకమ్మ గారు, వేదాల్లో వున్న విషయాలను యధాతధంగా ఇస్తూ, మంచి వివరాలు కూడా ఇచ్చారు. ఆ విషయాలను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పారు. రంగనాయకమ్మ గారు చెప్పిన విషయాలతో అంగీకరించని వారు, కనీసం వేదాల్లో ఏం వుందో, ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. 

ఇక వేదాల మీద, సినిమాల్లోని పాటలు:
“వేదంలా ఘోషించే గోదావరీ”
“….. సామ వేద సారమిదీ”
“వేదాలలో సార మింతే నయా”
“వేదం! అణువణువున నాదం!”

ఈ పాటల్లోని సంగీతానికీ, పాడే వాళ్ళ గొంతులోని మాధుర్యానికీ తన్వయత్నం చెందే వాళ్ళు, అదంతా ఆ సాహిత్యం గొప్పేననీ, ఆ వేదం అనే మాట చలవేననీ అనుకుంటారు. సంగీతమే ప్రధానమనీ, సాహిత్యం రెండో విషయమనీ వీళ్ళకి తెలీదు. 

ఓ చుట్టాలాయన, “వేదం” అనే ఒక కంపెనీ పెట్టి, కొన్నాళ్ళు నడిపి, మూసేశాడు. ఆ “వేదం”లో వున్న “గొప్పదనం” ఆయనకి ఏవీ లాభాలు తెచ్చి పెట్టలేదు మరి. అయినా, ఆ “వేదం”లో ఏం వుందో, ఆ కంపెనీ పెట్టినాయనకి తెలిస్తే కదా? “వేదం” అనే సినిమా కూడా వచ్చింది. నేను చూశాను. అయితే, ఆ సినిమాకీ, “వేదాని”కీ సంబంధం ఏవిటో బొత్తిగా తెలియలేదు మరి. 

వేదాలను ఇష్టపడే వాళ్ళూ, భక్తితో పూజించే వాళ్ళూ, వాటిని వెనకేసుకుని వచ్చేవాళ్ళూ, వాటిని విమర్శించే వారిని దుమ్మెత్తి పోసే వాళ్ళూ ముందస్తుగా వేదాల్లో ఏం వుందో తెలుసు కోవాలి. అన్ని అనువాదాలు ఎక్కడ చదవ గలరు గానీ, రంగనాయకమ్మ గారు రాసిన ఈ పుస్తకం చదివి, వేదాల్లో ఏం వుందో మొదట తెలుసుకోండి. ఆ తర్వాత, రంగనాయకమ్మ గారు రాసిందాన్ని తీరిగ్గా వ్యతిరేకించవచ్చు. అలా తెలుసుకోకపోతే, వాళ్ళకి తిట్లు వస్తాయి తప్ప, మరేవీ రాదు. 

“తేలు మంత్రం” నేర్చుకోవాలని చిన్నప్పుడు ఎంతో కోరికగా వుండేది. ఎప్పుడూ కుదరలేదు. తర్వాత కాలంలో ఆ విషయం మర్చిపోయాను. ఈ పుస్తకం చదివాక, ఆ కోరిక పూర్తిగా పోయింది. “ఇరుకు మంత్రం” అని వేరొకటి వుండేది. నడుమో, కాలో, చెయ్యో, మెడో బెణికిన వాళ్ళకి ఆ మంత్రం వేసేవాళ్ళు. చిన్నప్పుడు గానీ, పెద్దయ్యాక గానీ, ఆ మంత్రంలో వుండేదేవిటో  తెలియలేదు గానీ, ఈ పుస్తకం చదివాక మాత్రం, ఆ మంత్రంలో ఏం వుంటుందో తెలిసి పోయింది. “మంత్రాలకి శక్తి వుందా?” అని వ్యాసాలు రాసేవాళ్ళు, ఈ పుస్తకం చదివి, ఆ మంత్రాల అర్థం ఏవిటో మొదట తెలుసుకోవాలి. 

వేదాలను ఇష్టపడే వారి వాదం, ఆ వేదాల్లో ఏం వుందో నిజంగా తెలుసుకుంటే, ఇలా వుండాలి: అవునండీ, వేదాల్లో జంతు బలుల గురించి గొప్పగా రాశారు. అది అవసరమే. అవునండీ, వేదాల్లో స్త్రీలను చాలా తక్కువగా చేస్తూ రాశారు. అదీ అవసరమే. అవునండీ, వేదాల్లో కులాల ప్రసక్తి స్పష్టంగా రాశారు. అది చాలా ముఖ్యం కూడా. అలాంటి విషయాలను ఎందుకు విమర్శిస్తారూ? అవి మాకు నచ్చుతాయి బాగా. మీకు నచ్చకపోతే, మానెయ్యండి వాటిని పట్టించుకోవడం. మేం పట్టించుకుంటాము. — ఇలా వాదిస్తేనే, అలా వాదించే వారిలో కనీసం నిజాయితీని చూడగలం.

“రంగనాయకమ్మ గారు వేదాలని వక్రీకరించారు” అనేవాళ్ళకి జవాబు ఇదీ – రంగనాయకమ్మ గారు, వేదాలలో ఏం వుందో, దాన్ని మొదట యధాతధంగా ఇచ్చారు. తర్వాత తన వివరణనీ, విమర్శనీ, బ్రాకెట్లలో ఇచ్చారు. రంగనాయకమ్మ గారి విమర్శని వక్రీకరణ అని అనే ముందర, వేదాల్లోంచి యధాతథంగా ఇచ్చిన దాన్ని చదవండి ముందర. అదేవిటో తెలుసుకోండి ముందర. అప్పుడు మీకు ముందర విషయ జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత రంగనాయకమ్మ గారు చెప్పేదేవిటో స్పష్టంగా అర్థం అయిపోతుంది. 

ఈ పుస్తకం చాలా చవగ్గా, 80 రూపాయలకే దొరుకుతుంది. రంగనాయకమ్మ గారు ఎప్పుడూ తన పుస్తకాలను నష్టాలకే అమ్ముతారు. ఆ వివరాలన్నీ పుస్తకాల్లోని చివరి మాటల్లో వుంటాయి. 

పుస్తకం ఎక్కడ దొరుకుతుందీ, మొదలైన వివరాల కోసం కింద చూడండి. అన్నట్టు, ఈ పుస్తకం కినిగె డాట్ కాం లో కూడా దొరుకుతుందండీ!!

vedalu-cover2

You Might Also Like

8 Comments

  1. SRINIVAS SATHIRAJU

    ఆవిడ నిజంగా ఒక సమగ్ర చర్చ జరపలేదు. ప్రపంచంలో కమ్యూనిజానికి కాలం చెల్లి చాలా కాలమయ్యినా మన స్వదేశీ మూఢ విజ్ఞానులు మాత్రం ఇంకా ఆ ఆలోచనల్లో బ్రతుకుతూ అవే బ్రాహ్మణ వ్యతిరేక భావ జాలాన్ని పెట్టుబడి దారి మనస్తత్వాన్ని నిరసిస్తూ చేసిన మరొక అనాగరిక రచన ఇది. దీని ద్వారా రచయిత్రి సంకుచిత మనస్తత్వం గురించి మనకి ఒక అవగాహన అనేది స్పష్టం గా వస్తుంది కానీ వేదాల గురించి మాత్రం రాదు. ప్రతీ రచనలోనూ ఒక కాలపు జీవిత విధానాల గురించి ఒక అవగాహన కల్పించుకోవాలి అందులో మంచి చెడూ రెండు అర్ధం చేసుకుని మంచిని స్వీకరించి చెడుని వదిలివేయాలి. అదే విమర్శకుల లక్ష్యం గమ్యం కావాలి కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రవర్తనల ఎప్పుడూ అధికార పార్టీని విమర్శించడమే లక్ష్యంగా సాగే రచనలకి పెద్దగా విలువ నివ్వ వలసిన పని లేదు. ఆమె వృద్దాప్యం లో కి అడుగుపెట్టింది అనే విషయం మాత్రం స్పష్టంగా గోచరమవుతుంది. పైగా పాఠకులకు అర్ధం కాదు కాబట్టి చర్చించటం లేదు అనే మూర్ఖత్వం లేదా అహంకారం ఆవిడ వెలిబుచ్చటం నిజంగా శోచనీయం. ముందు ఆవిడ ఒక రచనని ఎలా చదివి అర్ధం చేసుకోవాలీ అనే విషయం నేర్చుకోకుండా ఇలాంటి రచనలు చేయడం మానుకుంటే మంచిది. ఇప్పటి తరం ఆలోచనలకే కాదు కదా..అసలు ఊరంతా ఒక దారి అయ్యితే తనదొక దారి అనే మనస్తత్వం మార్చుకుని భ్రమలు తొలిగించుకుని నిజాయితీగా ఆత్మ విమర్శా చేసుకుంటూ రాయగలిగితే రాసింది ప్రజల్లోకి వెడుతుంది. లేకపోతె కేవలం భాజా భజంత్రీల మేళానికి వెడుతుంది వండి మాగధుల జయ కారాల్లో జీవితం వెళ్లి పోతుంది. ప్రతీ చెత్త కి ఎప్పుడూ అభిమానులుంటారు..అలాంటి అభిమానులను అలరించే రచనే తప్పా ఇది అందరిని అలరించి వేదం జ్ఞానం పెంపొందించే సమగ్ర ప్రయత్నం కానీ కాదు. ఒక ముసలి తనంలో తన ఉనికిని కోల్పోతున్న మనిషి ఎలాగైనా తన ఉనికిని చాటు కోవాలని చేసే వృధా ఆఖరి పోరాటం
    ఈ రచన.

  2. varaprasaad.k

    భారతీయ సంస్కృతిని పాతి పెట్టడమే ముఖ్యం అనుకుంటే ఇక చెప్పటానికేముంటుంది'”,రామాయణ విష వృక్షం “,ఈ ఒక్క పేరు చాలు ఆవిడ ఈ నేలపైన పుట్టి ఈ భారత మాతకు ఏమి ఇవ్వదలచిందో.

    1. The Stork

      రామాయణానికీ భారతజాతికీ సంబంధమేమిటండి? సంబంధమున్నదల్లా బ్రాహ్మణమతానికేగానీ?

  3. బి. పవన్ కుమార్

    రంగనాయకమ్మ గారి రచనల పట్ల నాకు గౌరవం ఉంది. ఆవిడ ప్రతీ రచలలలో చాలా వరకూ మార్క్సిజాన్ని గురించి, శ్రమ దోపిడీ గురించి ఎక్కువగా అంశాలు కనిపిస్తుంటాయి. ఈ తరం విద్యార్ధులులో చాలా వరకు పెట్టుబడీదారీ విధానానికీ, కమ్యూనిజానికి మధ్య తేడా కాదు కదా ఆ పదాల గురించి విని వుండరు. ప్రపంచీకరణ ద్వారా బహుళజాతి సంస్థల ద్వారా సమాజంలో చోటుచేసుకున్న మార్పు ఆంగ్ల భాష పట్ల ప్రేమతో మాతృభాషను సైతం వదులుకుంటున్న దుస్థితిలో మన సమాజం వున్నది. రంగనాయకమ్మ గారు స్తీ అభ్యుదయం, ప్రజలలో తార్కిక ఆలోచనలను రేకెత్తించగల పుస్తకాలు వ్రాయాలని కోరుకుంటూ సెలవు.

  4. THIRUPALU

    ఇందకే నన్న మాట వేదాలు స్త్రీ లు దళితులు చదవకూడదు అని మభ్యపెట్టింది. ఏదైనా గుప్పెట ఉన్నంతకాలం దాని గొప్పదనం. దనం.ఎవరూ చదవకపోతే ఎవరికి ఏమి తెలియదు గదా! అప్పుడే ఏమున్నాయన్న నోరు మూసుకుని నమ్ముతారు. హాన్నా! అందుకే కో.కు. గారు ఆనాడు వేదమంత్రాలు వల్లస్తే గాని అన్నం పుట్టదు. ఓ దేవా మాకు సోమరసమియ్యి. గోధనాన్ని సమర్పించఉ అని వేడు కోవటమణె వారి పని అనొ నాజుగ్గ చెప్పారు.

    1. Srinivas

      తిరుపాలు, వేదాలు రాసిన కాలం లో దళితులు ఎక్కడున్నారు?

  5. HARIPRASAD G

    ప్రసాద్ గారు

    చాలా చక్కగా రాశారు.

    హరిప్రసాద్ బళ్లారి

  6. Lalitha

    “వేదాలను ఇష్టపడే వాళ్ళూ, భక్తితో పూజించే వాళ్ళూ, వాటిని వెనకేసుకుని వచ్చేవాళ్ళూ, వాటిని విమర్శించే వారిని దుమ్మెత్తి పోసే వాళ్ళూ ముందస్తుగా వేదాల్లో ఏం వుందో తెలుసు కోవాలి. ” – ఈ మాట ఒప్పుకుని తీరాలి.

    “ఆ వేదాల్లో ఏం వుందో నిజంగా తెలుసుకుంటే, ఇలా వుండాలి: అవునండీ, వేదాల్లో జంతు బలుల గురించి గొప్పగా రాశారు. అది అవసరమే. అవునండీ, వేదాల్లో స్త్రీలను చాలా తక్కువగా చేస్తూ రాశారు. అదీ అవసరమే. అవునండీ, వేదాల్లో కులాల ప్రసక్తి స్పష్టంగా రాశారు. అది చాలా ముఖ్యం కూడా. అలాంటి విషయాలను ఎందుకు విమర్శిస్తారూ? అవి మాకు నచ్చుతాయి బాగా. మీకు నచ్చకపోతే, మానెయ్యండి వాటిని పట్టించుకోవడం. మేం పట్టించుకుంటాము. — ఇలా వాదిస్తేనే, అలా వాదించే వారిలో కనీసం నిజాయితీని చూడగలం.” – అదే చెప్పి ఉంటే అలాగే అనాలి. ముందు చదవాలి. నేను చదవలేదు, చదివి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది. చదివాక నాకు పైన చెప్పినట్టే అనిపించవచ్చు. బహుశా అనిపించకపోవచ్చు కూడా. చదవనిదే చెప్పలేను.

    నా అభ్యంతరం – చాలా కించపరచడం ఒక్కటే వ్యక్తమౌతోంది మీ article లో.

    రంగనాయకమ్మ గారి “జానకి విముక్తి” చదివి ఎంతో తెలుసుకున్నాను. కానీ సగం తర్వాత ఇక విషయం ఒక వాదం గురించి ఐనట్టు అనిపించి చదవడం ఆపాను. ఆమె వ్యక్తీకరణకి, వ్యక్తిత్వాల పరిశీలనకీ ఆశ్చర్యపోతూ, తెలుసుకుంటూ , నా ఆలోచనలను పెంచుకుంటూ చదివిన దానిని, ఆ పైన, ప్రతిపాదించబడ్డ ఆలోచనని బలపరచడం తప్ప వేరే ప్రయోజనం నాకు కలగక ఆపేశాను. రంగనాయకమ్మ గారి పుస్తకాలు మరో రెండు, మా పిల్లలకి తెలుగు నేర్పించడం కోసం కొన్నాను. తెలుగు చదవడం నేర్చుకోవడానికి బావున్నాయి ఆ పుస్తకాలు. కానీ కథల దగ్గరకి వచ్చేసరికి ఒక రకం నీతులనుంచి పిల్లలని రక్షించాలని పూనుకుని ఇంకో రకం నీతులని ఎక్కించాలనే ప్రయత్నం కనిపించింది. ఆకర్షణ కొంచెం లోపించింది ఆ కథలలో. అందుకని ఆవిడ చెప్పారు అనగానే ఆ విషయన్ని పూర్తిగా పరిశీలించేసినట్టు అనుకోలేను, వేదాలలో అన్నీ ఉన్నాయి అని అనుకోలేనట్లే.

    కాకుంటే మీ వ్యాసం వల్ల బహుశా ఆ పుస్తకం కొని చదువుతానేమో. పిల్లల కోసం కొన్న పుస్తకాలు కూడా ఇక్కడ పుస్తకం.నెట్ లో చదివిన వ్యాసం మూలంగానే తెలిశాయి నాకు.

Leave a Reply to SRINIVAS SATHIRAJU Cancel