మేరల కావల…….

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
****************
’మేరలకావల’ అనే పేరుతో తెలుగు ఉన్న ప్రాంతానికవతల నివసిస్తున్న తెలుగు రచనాకారుల రచనలతో సంకలనం కూర్చబడడం అభినందనీయమైన సంగతి. మొత్తం పదునెనిమిది కథలున్న ఈ సంకలనం లో జమ్ముకాశ్మీరం, ఉత్తరప్రదేశం, పడమటి బంగ్లా, గుజరాతు, మహారాష్ట్ర, చత్తీసుగడ, ఒడిశా, కర్నాటక, తమిళనాడు, అండమానులలో నివాసులైన వారి రచనలున్నాయి.

ఇందులోని కొన్ని కథలలో మాండలీకపు పదాలు చోటు చేసుకున్నాయి. మరికొన్ని ప్రామాణికమైన పదాలతో ఉన్నాయి. చదువరులకింకా పరిచయం కాని పదాలకు అర్థాలూ ఆయా కథల చివర ఇచ్చారు. ఈ రచనలను చదువుకోవడంలో ఇబ్బంది ఏమీలేదు.

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, తమ భాషంటూ వినబడని చోటుల్లో ఉంటూ కూడా తమదైన పలుకుమీద ఇష్టంతో వ్రాస్తున్న ఈ కథకులను చూసి ఇక్కడే ఉంటున్న వారమెంతైనా స్ఫూర్తి పొందాల్సి ఉంది. వీరిలో కొందరు ప్రసిద్ధి పొందిన రచయితలూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నవారూ ఉన్నారని ’నాలుగు నుడుగులు’ అనే పరిచయ వ్యాసంలో స.వెం. రమేశ్ గారంటారు. అమ్మ నుడి వినబడే దగ్గర కాక దూరంగా బయటి తావుల్లో ఉన్న ఈ కథకులు, వీరి వంటి అనేకులు కూడా పడే ఇబ్బందులు, నేర్చుకునే పాఠాలు ఈ కథల్లో ఉన్నాయి. అంతే కాదు, పలు నాడులలో పలు తరాలుగా కుదురుకొని ఉన్నవారు తమ సభ్యతా సంస్కారాలతో స్థానికులను ప్రభావితం చేసినవారి విశేషాలూ ఉన్నాయి.

బయటి దేశాల్లో ఉన్న తెలుగు రచయితకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి కిరీటాలు వీరికి ఉన్నాయో లేదో కానీ, ఈ కథల్లో ప్రవాసుల పాతకథలో, కొత్త కలలో కాక ఆయా ప్రాంతాల్లో వారి నిత్యజీవితం గురించి, అందులో సందర్భాలను గురించి మనకు తెలియజెప్పే, మనసును కదలించే కథలున్నాయి. అన్ని కథలూ ఆకట్టుకుంటాయని చెప్పలేను కానీ, అమ్మనుడి పట్ల వారికున్న తపన, ఆంగ్లపు ఎంగిట్లో పడకుండా వ్రాసిన తీరు ఆకట్టుకోకమానదు.

జోగారావుగారు (పశ్చిమబంగ్లా), అంబల్ల జనార్ధన్ గారు (ముంబై), తమ్మినేని యదుకులభూషణ్ గారు (అండమాన్), కుడాల లక్ష్మి గారు (కర్ణాటక), సజ్జా జయదేవ్ బాబుగారు, (తమిళనాడు), కెం. మునిరాజుగారు(తమిళనాడు), ఓట్ర పురుసోత్తం గారు (తమిళనాడు), సి రామచంద్రరావు గారు (తమిళనాడు), శిరంశెట్టి కాంతారావు గారు (మధ్యప్రదేశం), మన్నం సింధుమాధురి గారు (కర్ణాటక), ఆనందరావుపట్నాయక్ గారు (ఒడిశా), జోళదరాశి {గుత్తి} చంద్రశేఖరరెడ్డి గారు (కర్ణాటక), పాలెపు బుచ్చిరాజు గారు (గుజరాత్), పింగళి వేంకటరమణరావు గారు (జమ్మూకాశ్మీరం), ఐతం దివాకర్ గారు (తమిళనాడు), స. రఘునాథ గారు(కర్ణాటక), సోమవగఝల నాగేంద్రప్రసాద్ గారు (ఉత్తరప్రదేశం), మార్టూరి వసంత్ కుమార్ గారు (తమిళనాడు) వీరంతా ఆయా ప్రాంతాల్లో నివసించిన అనుభవాల ఆధారంగా వ్రాసిన కథలు ఇందులో ఉన్నాయి. వీరి ప్రస్తుత చిరునామాలూ సంకలనంలో దొరుకుతాయి.

బయటి తావుల తెలుగు కతలు అనే ఉపశీర్షికతో ఈ పుస్తకాన్ని పూదోట శౌరీలు గారి సంపాదకత్వంలో మల్లవరపు వెలువరింతలు, బోధన్ వారు ఏప్రిల్ 2016లో ప్రచురించారు. అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలలో దొరుకుతుంది. అచ్చుతప్పులు పెద్దగా లేవు గానీ విషయసూచికలో ఒక రచయిత కలంపేరు (కాబోలు) మాత్రం ఇచ్చి, కథ వద్ద అసలు పేరు ఇచ్చారు.

You Might Also Like

2 Comments

  1. Dr. Y. Kameswari

    Manchi vivarana . Abhinandanalu

    1. లక్ష్మీదేవి

      🙂 ఇటువంటి ఒక ప్రయత్నం నాకూ చాలా సంతోషాన్ని కలిగించిందండి.

Leave a Reply