పుస్తకం
All about booksఅనువాదాలు

August 10, 2016

సార్థ

More articles by »
Written by: Srinivas Vuruputuri
Tags: ,

“సార్థ” – ఎనిమిదవ శతాబ్ద ప్రథమ పాదం నాటి భారతదేశ చరిత్రలో పొదగబడ్డ కథ. “మన దేశ చరిత్రలో అదొక సంధి సమయం. అప్పటికి వైదిక బౌద్ధ జైన మతాల వాదవివాదాలు ఓ కొలిక్కి వచ్చాయి. తన విధ్వంసకర విపరిణామాలతో ఇస్లాం రంగ ప్రవేశం చేసింది ఆ కాలంలోనే… రాజకీయ పరిణామాల కన్నా ఆనాటి బౌద్ధికమైన స్పర్థలే నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నాయి” అన్నారు భైరప్ప ఈ పుస్తకానికి రాసిన “క్లుప్తసరి” ముందుమాటలో.

అప్పటి వాతావరణాన్ని మనకు పరిచయం చేసేందుకు నాగభట్టు అనే సాక్షి గోపాలుడిని సృష్టించారు భైరప్ప. తారావతి అనే మధ్య భారతదేశపు రాజ్యంలో అదే పేరున్ననగరంలో పుట్టిన ఈ నాగభట్టుని, ప్రఖ్యాత వేదపండితుడైన మండన మిశ్రుడి దగ్గర చదివించి, ఒక మిథ్యా రాచకార్యాన్ని అప్పజెప్పి, భ్రమణకాంక్షా, తాత్త్విక జిజ్ఞాసా అనే జోడెడ్లు పూన్చిన మనశ్శకటాన్నెక్కించి, ఒక సార్థం వెంట ఉత్తరాన ఉన్న మథురా నగరానికి పంపించారు.

“సార్థము” అన్న మాటకి వర్తక జన సమూహము అని అర్థం. కొన్ని నెలల తరబడి ప్రయాణిస్తూ నానా రాజ్యాలలో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు నిర్వహిస్తూ తిరగటం జీవికగా ఎంచుకొన్నవాళ్ళు. నాగభట్టును తమ వెంటబెట్టుకెళ్ళిన సార్థం చిన్నదీ చితకదీ ఎంతమాత్రమూ కాదు. బండెనక బండి గట్టి – రెండు వందల ఎడ్లబండ్లు, పది ఏనుగులు, డెబ్భయ్యైదు గుఱ్ఱాలు, బండి రిపేర్లు చేసిపెట్టేందుకు కమ్మరి వాళ్ళు, వండిపెట్టేందుకు వంటవాళ్ళు, దారిదోపిడీగాండ్ర నుంచి రక్షించేందుకు సుశిక్షితులూ, సాయుధులూ అయిన సైనికులు, ఎదరనున్న దారిలోని ఆటంకాలను తొలగించే పనివారు, లెక్కలు రాసిపెట్టే గణకులు, ఈ పనీ-ఆ పనీ చేసిపెట్టే సేవకులు… – ఈ హడావిడి చాలనట్లు, భద్రత కోసం సార్థంతోబాటు ప్రయాణించే సంచార కళాకారులు, తీర్థయాత్రీకులు, సన్యాసులు…”ఓ చిన్నపాటి భరతఖండమే ఇది” అని అబ్బురపడిపోతాడు నాగభట్టు.

అసలు ఆ సార్థం వెంటే నాగభట్టు కడదాకా ప్రయాణించి ఉంటే? ఆ సార్థమార్గం తిరిగినన్ని మలుపులతో కూడుకున్న అద్భుత యాత్రాగాథ తయారయ్యేదేమో! కానీ రచయిత సంకల్పం మరోలా ఉన్నదని పసిగట్టిన ఆ సార్థవాహులు అతగాణ్ణి మథురలోని ఒక బౌద్ధ విహారంలో దిగవిడిచి, కాశీ దాకా తీసుకెళ్ళాల్సిన మరో సార్థం కోసం ఎదురుచూస్తూ ఉండమని చెప్పి, కథలోంచి నిష్క్రమిస్తారు.

కాలూ, మనసూ నిలకడగా ఉండని నాగభట్టు ఊళ్ళోకెళ్ళిపోయి కొత్త స్నేహాలు పెంచేసుకొని, కొత్త వ్యాపకాలు కల్పించుకొని, గతం-గితం, రాచకార్యం-గీచకార్యం అన్నీ మరిచిపోయి ప్రవాస జీవితం ప్రారంభించేస్తాడు. జన్మాష్టమి సందర్భంగా మథురానగరంలో వేద్దామనుకున్న కృష్ణ చరిత నాటకాలలో నాయక పాత్రలో జీవించి, రంగస్థల నటుడిగా కొత్త జీవికనూ, “కృష్ణానందుడు” అనే కొత్త పేరునూ, అశేష జనాదరణనూ, చంద్రిక అనే కథానాయిక యొక్క విశేషాభిమానాన్నీ సంపాదించుకుంటాడు.

ఒక పెను జీవిత సంక్షోభంలో పడి లేచే క్రమంలో – యోగ సాధనలో ఒక స్థాయికి ఎదిగి, తోవ తప్పి వామాచార తంత్రంలోకి దిగి, ప్రేయసి ప్రోత్సాహంతో సాత్త్విక జీవితంలోకి మళ్ళబోతున్న వాడు కాస్తా, తన ప్రణయ ప్రయత్నం పరిణయ సాఫల్యంగా పరిణమించదేమోనన్న అనుమానం పీడిస్తూ ఉంటే, నిరుత్సాహ పడి పోయి, నిస్పృహలోకి, ఆధ్యాత్మిక శూన్యత్వంలోకి జారుకుంటాడు. తన లోపల తిష్ఠ వేసిన శూన్యత్వపు చీకటిని బౌద్ధ దర్శనాల వెలుగు సహాయంతో తొలగించుకుందామని నలందా విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోతాడు. అక్కడ పరిచయమైన ప్రజ్ఞాన ఘనుడనే వయో వృద్ధుడైన విద్యార్థి కారణంగా నాగభట్టు కథ ఒక నిర్ణయాత్మకమైన మలుపు తిరుగుతుంది.
***
నాగభట్టు కళ్ళలోంచి మనకు కనిపించే ఆనాటి భారతదేశంలో –

ఛప్పన్నారు రాజ్యాలు. ఒకో రాజ్యంలో ఒకో తీరు. పూర్వ మీమాంసలో మహా పండితుడైన మండన మిశ్రుడి ప్రభావం పడ్డ మాహిష్మతి, తారావతి ప్రాంతాల్లో విగ్రహారాధనకూ, దేవాలయాలకూ అట్టే ప్రాముఖ్యం ఉండేది కాదట. ఆ రాజ్యానికి పొరుగున ఉన్న రాష్ట్రకూటుల రాజ్యంలో పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం జరుగుతూ ఉండేది. రాష్ట్రకూటులకు ఉత్తరాన ఉన్న విరోధులు ఘూర్జర ప్రతీహార రాజులు యజ్ఞ యాగాలను ప్రోత్సహించే వైదిక మతస్థులు. వారి ఏలుబడిలోనే ఉన్న మథురలో భాగవత కథల ఆధారంగా భక్తి ప్రధానమైన మతం రూపు దిద్దుకుంటూ ఉన్నది. ధ్యాన మార్గం స్వీకరించి ఇంద్రియాలను నిగ్రహించే ఆధ్యాత్మిక సాధకులూ మథురలోనే తొలిసారిగా తటస్థపడ్డారు నాగభట్టుకు. పరివ్రాజక యోగులు, తాంత్రికులు తీర్థాలు-క్షేత్రాలు గమ్యంగా దేశమంతటా సంచరిస్తుండే వారు.
నాగభట్టు రావటానికి పూర్వమే మథురలో బౌద్ధం ధృడంగా నెలకొని ఉండేది. రెండువేల మంది (భిక్షువులు) నివసిస్తున్నఇరవై విహారాలు ఆ నగరంలో ఉండేవని హ్యూయెన్ త్సాంగ్ యాత్రా కథనం. మథురలో కన్నా పాటలీపుత్రం వైపున బౌద్ధం ప్రాబల్యం ఎక్కువ. బుద్ధుడు తమవాడన్న అభిమానంతో క్షత్రియులు ఆ మతాన్ని ఆదరించేవారట.

నాగభట్టు స్నేహితులైన సార్థవాహులకు కూడా బౌద్ధం పట్ల అభిమానం. ఎంచేతనంటే – వైదిక మతం తమ ఉనికిని పట్టించుకోలేదన్న కినుక వారికి ఉండేది. పైగా, సముద్ర యానాన్ని నిషేధించి వారి లాభాలకు అడ్డు తగిలింది (“ధర్మ శాస్త్రాలలోని ఆ నిషేధం కేవలం బ్రాహ్మణులకే కదా?” అని వాదిస్తాడు నాగభట్టు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి విధించబడ్డ నియమమే మిగతా వాళ్ళకీ వర్తిస్తుంది కదా?” అని ప్రతివాదిస్తాడు బుధ శ్రేష్ఠి).
సార్థవాహుల వెలితిని బౌద్ధం పూరించింది. వారికోసం మణిభద్రుడనే యక్షుడిని (కాదు, బోధిసత్త్వుడిని) సృష్టించి ఇచ్చింది. “అదేం గొప్ప విషయం? కట్టు కథలను కల్పించి కొత్త దేవుళ్ళను సృష్టించడం?” అని అడిగిన నాగభట్టుకు, “ఆ కొంచెమైనా, ఎందుకు చేయలేకపోయింది వైదిక మతం?” అన్న ఎదురుప్రశ్నకు జవాబు దొరకలేదు.

సమానత్వం విషయంలో, పదుగురిని తనలో చేర్చుకోవాలనే పూనికలో వైదిక మతం కన్నా బౌద్ధం మెరుగని అనిపించినప్పటికీ దాన్ని పూర్తిగా ఆమోదించలేకపోయాడు నాగభట్టు. ఎలాగోలా ఎదుటివాడి మతం మార్చాలని చూసే వారి అత్యుత్సాహ ధోరణి అతడికి నచ్చలేదు. బౌద్ధ దైవీ మూర్తులలో కనబడే హిందూ పురాణ ప్రతీకల జాడల గురించి తెలుసుకున్నప్పుడు కాస్త విస్తుపోయాడు. మరికొందరు బౌద్ధ దేవతల రూపకల్పన హిందూ దేవతలను చిన్నబుచ్చేలా ఉన్నదని తెలిసి చికాకు పడ్డాడు. నలందలో ఒక ఏడాది పాటు చదువుకొన్న తరువాత మిగతా భ్రమలుడిగిపోయాయి.
మొదటగా – తన సమస్య అయిన మానసిక అశాంతికి పరిష్కారం బౌద్ధ దర్శనాధ్యయనం వల్ల లభించదు. ఆ దర్శనానికి అనుగుణంగా జీవించడం వల్ల మాత్రమే లభిస్తుంది. అదంత సులభం కాదు.

పైగా – బౌద్ధ మతం తాననుకున్నంత విభిన్నమైనదేమీ కాదు. అందులోనూ విగ్రహారాధన ఉంది. పురోహిత వర్గం ఏర్పడింది. తంత్రమూ ప్రవేశించింది. సరళమైన బుద్ధుడి బోధనల స్థానంలో పండితుల వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ప్రవేశించాయి. మౌలికమైన బుద్ధుని ఉపదేశంనుంచి క్రమక్రమంగా దూరం జరుగుతూ మాధ్యమిక, సౌత్రాంతిక వైభాషిక యోగాచార మార్గాలు వాదాలు రూపు దిద్దుకొన్నాయి. తాంత్రిక బౌద్ధంలోనూ రెండు చీలికలు – సహజ యానం, వజ్రయానం అంటూ. వీటన్నింటినీ తప్పించుకొని, ఎవరికి వారే బుద్ధుడి బోధనలను చదువుకోవటమే సరైన పద్ధతి.

దరిమిలా, కొన్నాళ్ళ పాటు గయలోని బోధివృక్షచ్ఛాయలో సుత్త పఠనం చేస్తూ ఏకాంతంగా ఉందామని వెళ్ళిన వాడు అదే గయలో తల్లిదండ్రులకి శ్రాద్ధం పెట్టడం ఒక కొడుకుగా తన కర్తవ్యమని హఠాత్తుగా గుర్తుకు తెచ్చుకొని, అంతలోనే “సర్వం క్షణికం” అని బుద్ధుడు చెప్పిన మాటలను తలచుకొని అనశ్వరమైన ఆత్మ ఒకటి ఉండనప్పుడు ఇంక శ్రాద్ధ కర్మలెందుకని విరమించుకొని, అసంతృప్తితో, అపరాధభావనతో వెనక్కి తిరిగాడు, గయ నుంచీ, బౌద్ధం నుంచీ.
***
ఈ కథ ఇలా జరుగుతున్న కాలంలోనే, కుమారిల భట్టు కర్మనిష్ఠమైన వైదిక ధర్మాన్ని వైభవ స్థానంలో పునఃప్రతిష్ఠించే లక్ష్యంతో బౌద్ధంతో తర్క యుద్ధంలో తలమునకలై ఉన్నాడు. ఆదిశంకరుడు బదరికాశ్రమంలో బ్రహ్మ సూత్ర భాష్య రచనలో నిమగ్నమై ఉన్నాడు.

బౌద్ధ మతాన్నీ, అందులోని లోటుపాట్లనూ ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేసేందుకు కొంతకాలం బౌద్ధావతారం ధరించిన కుమారిలుడు ఇటు తాను నమ్మిన వైదిక ధర్మానికీ, అటు తనను నమ్మిన బౌద్ధ గురువుకీ ద్రోహం చేసానన్నపశ్చాత్తాపంతో ప్రాయోపవేశం చేయనున్న ఉద్విగ్న ఘట్టంలో ఆది శంకరుడిని కలుసుకుంటాడు నాగభట్టు. అక్కణ్ణుంచి మాహిష్మతిలో మండనమిశ్రుడితో శంకరుడి సంవాద ఘట్టం దాకా కథ ఎక్కడా కుంటుబడకుండా సాగిపోతుంది.

కర్మ మార్గమా, జ్ఞాన మార్గమా – ఏది మోక్షదాయకం? రోజుల తరబడి చర్చించుకొన్నారు శంకరాచార్య మండన మిశ్రులు, అహంకారానికీ, ఆవేశ కావేశాలకు చోటునివ్వకుండా, ఎంతో హుందాగా. సంవాదంలో పరాజితుడైన మండన మిశ్రుడు – తమ ఒప్పందం ప్రకారం, ఒక జీవిత కాలపు నమ్మకాలను, ఆచరణను వదిలేసుకొని సన్యాసాన్ని స్వీకరించి – శంకరాచార్యులను అనుగమించాడు.

మరి నాగభట్టు?

శంకరాచార్యుల మేధోవైభవం కన్నా కుమారిలుడి ధర్మనిష్ఠా, ఆత్మ త్యాగాలే అతణ్ణి ఎక్కువగా ప్రభావితం చేసాయి. ధర్మ రక్షణ కోసం తన వంతు ప్రయత్నంగా, వాయవ్యాన ముస్లిం ఆక్రమణకారులను ఎదుర్కోబోతున్న ఘూర్జర ప్రతీహారులకు జన సమర్థనను కూడగట్టేందుకు మూలస్థానానికి – ఇప్పటి ముల్తాన్ – వెళతాడు. శత్రు పక్షం వాళ్ళతణ్ణి ఖైదు చేస్తారు. వాళ్ళు పెట్టిన చిత్రవధలను తట్టుకోగలిగిన స్థైర్యాన్ని ఇస్తుంది, కుమారిల భట్టు ఆదర్శం. మతం మార్చుకొని ప్రాణం నిలబెట్టుకొమ్మని వాళ్ళు చూపించిన ప్రలోభానికీ లొంగడు. పైగా, తనను విచారిస్తున్న అధికారులతో భారతీయ మతాల గురించి తను రెండువందల పేజీలుగా నేర్చుకున్నదంతా రెండు పేజీలలో చెప్పేస్తాడు:

* రాజు గారి మతమే ప్రజల మతమవ్వాలన్న పట్టింపు లేదు ఈ దేశంలో.
* మతం మార్చటం ఇక్కడా ఉంది. అయితే, కత్తితో బెదిరించి కాదు, వాదంలో ఓడించి.
* అవును. ఇక్కడ దేవుడి గురించీ వాద వివాదాలు జరుగుతాయి. వాదాన్ని వెదుక్కుంటూ ఇక్కడి పండితులు ఊరూరూ తిరుగుతుంటారు. వాదాహ్వానాన్ని నిరాకరించటం తలవంపుగా భావించడమూ కద్దు.
* ఒక మతం – ఒక దేవుడు అన్న నిర్బంధం లేదిక్కడ. వైదికులు, బౌద్ధులు, జైనులు. వాళ్ళలోనే శాఖోపశాఖలు.ఎవరి మతం వారిది. తమ తమ చిత్త సంస్కారానికి అనువైన మతాన్ని ఎంచుకొనే అధికారం, మార్చుకొనే అధికారం అందరికీ ఉంటుంది.
* ఆ స్వేచ్ఛ అరాచకత్వంలోకి పరిణమించకుండా కాపాడే ఒక సూత్రబద్ధత ఉన్నది. దాని పేరు ధర్మం. ధర్మనిష్ఠ చాలు, దేవుడినీ నమ్మక్కర్లేదు.
* దేవుడి ఉనికే ప్రశ్నార్థకమైన మతాలలో దైవ విరోధి (సైతాన్) ప్రసక్తీ ఉండదు కదా.
* నమ్ముతానా, నమ్మనా అంటే, నా ఇష్టం. ఎంచుకొనే స్వేచ్ఛ ముఖ్యం. దేవుడి కన్నా. “దేవుణ్ణే నిరాకరిస్తావా?” అంటే – నేనూ దేవుడూ అభిన్నమని నిబ్బరంగా చెప్పగలిగిన మతమూ ఉన్నది కదా ఇక్కడ.

ఆ సంభాషణ జరిగిన కొద్దికాలానికే ఖైదు నుంచి విడుదలవుతాడు. చంద్రికతో కలిసి శేష జీవనయానం కొనసాగించేందుకు సిద్ధమవుతుండగా కథ కంచికి వెళ్ళిపోతుంది (ఉత్తిదే. మథురలోనే ఆగిపోతుంది.). మరి మనమేమో ఆదిశంకరుడి గురించి, బౌద్ధం గురించి, మొహమ్మద్ బిన్ కాసిం గురించి, భైరప్ప గారి గురించి రోజుల తరబడి గూగుల్ చేస్తూ ఉండిపోతాము.
***

కొసరు వివరాలు

 1. ఆక్స్‌ఫోర్డ్ ఇండియా ప్రచురణ; 2006; 290 పేజీల నవల; 35 పేజీల కొసరు
 2. కొన్ని సమీక్షలు (1, 2, 3, 4)
 3. ఒక పరిచయం
 4. అనువాదకుడితో ఇంటర్వ్యూ
 5. అమెజాన్ ఇండియా లింకు


About the Author(s)

Srinivas Vuruputuri

శ్రీనివాస్ వురుపుటూరి; హైదరాబాద్‌లో నివాసం; సాఫ్ట్‌వేర్ ఉద్యోగం; చదవడం హాబీ; చర్చించడం సరదా; రాయాలంటే బద్ధకం, బోలెడన్ని సందేహాలున్నూ.2 Comments


 1. వురుపుటూరి శ్రీనివాస్

  భూషణ్ గారికి

  మీ ప్రశంసా వాక్యాలు చదివి చాలా సంబరపడిపోయాను. చాలాసార్లు చదువుకున్నాను. ధన్యవాదాలు.

  శ్రీనివాస్


 2. తమ్మినేని యదుకుల భూషణ్

  అద్భుతమైన పఠనానుభవాన్ని కలిగించిన రచయితకు మనమివ్వగల నిజమైన నివాళి సమీక్షే. శ్రీనివాస్ ఈ ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు ; నవలా సారాన్ని చక్కని వాక్యాల్లో సహృదయులైన పాఠకులకు అందించారు. ఆ క్రమంలో పాఠకులకు ఊహా వైభవంతో అలరారే రచయితలోకి పరకాయ ప్రవేశం చేసే అరుదైన అవకాశం కలిగించారు

  నాలుగు అర్థవంతమైన వాక్యాలు రాయలేని కవులు,రచయితలు కూడా కాలం చెల్లిన వాదాల పేర్లు చెప్పుకొని పత్రికల్లో , వేదికల మీద కలగాపులగపు ఆలోచనలతో చేలరేగి పోతున్న కాలమిది . ఎవరూ పుస్తకాలు చదవరు. బుద్ధిగత జాడ్యాలను బద్దలుగొట్టే తత్వాన్ని తలకెక్కించుకోరు. సందేహం లేని క్షణం దేహం కేవలం దేహమే. కొత్తగా కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు మనలోకి ప్రవేశిస్తే గాని మన మనసు /బుద్ధి తేటపడవు . ఇది సందేహాలు కలిగే సామాన్యుల విషయం. ఒక వాదాన్ని /మతాన్ని గుడ్డిగా నమ్ముకుని మూర్ఖంగా వాదిస్తూ బ్రతకడంలో ఎంత హాయి!నీడ పట్టున వాలుకుర్చీలో సుఖానికి అలవాటు పడ్డ ఒక తరహా మేధావుల ధోరణి ఇది

  ఈ మధ్య పుస్తకంలో ఎంతో చక్కని పుస్తకాల మీద మంచి సమీక్షలు (ఉదా : అవ్యయ, When Breath Becomes Air, Quiet ) రావడంశుభ పరిణామం . ముఖమండల దీధితులు అందరికి హ్రస్వ దృష్టి ప్రసాదిస్తున్న తరుణంలో, magazine కు facebook కు మధ్య తేడా లేకుండా పోతున్న సంధికాలంలో పుస్తకం వెలుగొందు గాక.
  తగిన ఆధారాలను సంతరించి , చక్కని సంభాషణను ఉటంకించి
  సార్థ పుస్తకానికి సమగ్ర సమీక్ష వెలయించిన శ్రీనివాసుని అభినందిస్తూ –

  తమ్మినేని యదుకుల భూషణ్  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

భైరప్పగారి ‘దాటు’

1975లో కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకున్న భైరప్పగారి దాటు నవలను ఓ నాలుగేళ్ళ క్...
by Srinivas Vuruputuri
8

 
 

గృహభంగం

ప్లేగు భయం సద్దు మణిగి రేపో, మాపో షెడ్డులనొదిలేసి రామసంద్రం గ్రామస్థులు మళ్ళీ ఊళ్ళో...
by Srinivas Vuruputuri
3

 
 

ఆవరణ – ఎస్.ఎల్.భైరప్ప

“ఆవరణ అంటే నిజాన్ని దాచివేయటం. విక్షేపం అంటే అబద్ధాన్ని ప్రచారం చేయటం. వ్యక్తి స్థ...
by Srinivas Vuruputuri
7

 

 

కులాలను అధిగమించే దాటు ఎప్పుడు?

‘గతం నీకు చూపించే దారి బ్రతుకు మీద కులం గుర్రాల సవారీ!’ అంటారు వాస్తవిక దృష్టితో ...
by అరుణ పప్పు
10

 
 

మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

ప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి ‘పర్వ’ నవల చదవడానికి నాకు ప్రేరణ కలిగించ...
by nagamurali
44