స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
************
భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ కొఱతా లేదు. కానీ వాటిలో అత్యధిక రచనలు భౌతిక విషయాలను చర్చించేవిగా ఉంటాయి- వర్గవైషమ్యము, స్త్రీ పురుష అసమానత, మూఢాచారాల విమర్శ, నైతిక పతనము మొదలైన అవగుణాల ఖండన వంటివి. కానీ వెలుపలి సంఘర్షణ వలెనే ఆంతరంగిక సంఘర్షణ కూడా మనిషి జీవితంలో బాగానే ప్రభావం చూపుతుంది. ప్రస్తుత నవల ‘స్వర్గానికి నిచ్చెనలు’ ప్రసిద్ధ కవి, సాహిత్యవేత్త, కథకుడైన విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క విశిష్టరచన. స్వాతంత్ర్యానంతర కాలానికి చెందిన ఈ నవల ఆనాటి సామాజిక పరిదృశ్యాన్ని చక్కగా ఆవిష్కరిస్తుంది.

భారతీయ దర్శనసాంప్రదాయాలను లోతుగా అధ్యయనం చేయలేనివారికి, వాటి బాహ్యరూపాన్ని మాత్రమే చూసి, అర్థం లేనివని విడిచిపెట్టవలసినవని డప్పు కొట్టేవారు కూడా తమ స్వార్థానికి ఉపయోగపడుతుందనుకుంటే వాటినే పట్టుకోడానికి వెనుకాడరు. వీరిని చేరిన మరి కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం వీరితో చేతులు కలిపి మొత్తం సమాజాన్ని ముంచడానికి తోడ్పడతారు. భక్తివిశ్వాసాలకు వీరంతా కళంకం ఆపాదిస్తారు. అటువంటి వారి గురించి, వారి అంతరంగం గురించి, వారి సంఘర్షమయమైన జీవితం గురించి ఈ నవలలో గంభీరమైన చర్చ జరిగింది.

విదేశీ సాహిత్యపు నిరంతర అధ్యయనంలో మునిగి ఉన్న అనేకులకు భారతీయ దర్శన సాంప్రదాయాలను ఖండించడం అతి సాధారణమైన విషయంగా మారింది. దాంతో సామాన్య మానవునికి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనే విషయం చాలా కఠినంగా మారింది. ఏది సత్యం? ఏది అసత్యం? చాలామంది ఆహారవ్యవహారాదులలో, వస్త్రధారణలలో , భాషాప్రయోగాల్లో మార్పుని పాటించి తమను తాము ఆధునికులుగా నమ్ముతుంటారు. జీవితంలోని అనేక దశల్లో ఎప్పటికప్పుడు మారుతున్న ఇటువంటి వారి ప్రవర్తన గురించి అత్యంత సహజంగా ఈ నవలాకారుడు చాలా హుందాగా చిత్రీకరించాడు.

‘స్వర్గానికి నిచ్చెనలు’ లో వసుంధర మరియు ఆమె కుటుంబసభ్యులు తమను తాము అత్యాధునికులుగా భావించుకుంటుంటారు. ఇద్దరు అన్నదమ్ములకు కులాంతర, మతాంతర వివాహాలు జరిగాయి. వసుంధరకు చిన్నతనంలో వివాహం జరిగి వైధవ్యం ప్రాప్తించగా, పునర్వివాహం చేస్తారు. రెండవ భర్త వచ్చిన పదిరోజులలోపే మొదటి భర్త యొక్క ఆత్మతో జరిగిన సంభాషణల మూలంగా వసుంధరకు రెండవ భర్తతో పెద్దగా పడకపోవడం మొదలవుతుంది. రెండవభర్త ఒంటరిగానే తన ఊరు వెళ్ళిపోతే కూడా వసుంధరకేమీ పట్టదు. తనే సృష్టించుకున్న ఒక ఊహా ప్రపంచంలో లీనమై ఉంటుంది. తనను ప్రపంచం కన్నా భిన్నమైన దానిగా భావించుకుంటూ, ఏకాంతంలోనే ఉండడాన్ని ఇష్టపడుతుంది. వాళ్ళింటిలో ఉంటున్న సింగారవేలు చెల్లి శశి ఈమె వల్ల ప్రభావితురాలై వసుంధరతో పాటే ఉండిపోతుంది. క్రమంగా శశి నిజమైన ధ్యానసమాధిలోకి వెళ్ళిపోతుంది. మెల్లమెల్లగా ఈ విషయాలన్నీ ఊళ్ళోవాళ్ళకు తెలుస్తుంటాయి. వీళ్ళను దేవతల రూపాలుగా భావించి జనం తమ తమ సమస్యలతో వీరి వద్దకు రావడం మొదలుపెడతారు. వసుంధర, శశిల ప్రమేయం ఏమీ లేకుండానే ఊరివాళ్ళ సమస్యలు కొన్ని పరిష్కారమౌతాయి, కొన్ని కావు. అయినా వీరిని నమ్మి వచ్చే ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ముడుపులు, దక్షిణలు కుప్పలుకుప్పలుగా చేరుతుంటాయి. ఇంత సంపద వచ్చి చేరుతుంటే కొత్త ధ్యానమండపము, మందిరము కట్టే పనులు కూడా మొదలయిపోతాయి. వీటన్నిటిలో విదేశాలనుంచి వచ్చే ఆంగ్లభాష లోని ఉత్తరాలను చదవడానికి నియమింపబడిన కళాధరుడు, మందిర నిర్మాణ కార్యాలను పర్యవేక్షించే బాబాయి, మళ్ళీ తిరిగివచ్చిన రెండవభర్త ఉమాకాంతుడు మొదలైన వారంతా సపరివారంగా ఈ ప్రజాధనంలో తమ వాటా యథేచ్ఛగా తీసుకుంటూనే ఉంటారు. విదేశాల్లో ఉన్న సోదరుడొకరు పంపిన ఒకానొక వామదేవుడు కూడా ఇక్కడ చేరి చాలా హంగామా చేస్తూ ప్రజలను మరింత దురవగాహనకు గురిచేస్తూ ఉంటాడు.

ఇందరు చేరి తమ అవసరాల కోసమూ, తమ తమ స్థాన గరిమ కోసమూ ఒత్తిడి పెంచేసరికి వసుంధరలో తన అవివేకపు కృత్యాలమీద పునర్విచారణ మొదలవుతుంది. మెల్లగా తన పరిస్థితిని బేరీజు వేసుకోవడము, మొదటిభర్త ఆత్మతో తన సంభాషణ అంతా తన భ్రమగా తెలుసుకోవడంవల్ల వాటిని తన మనసులోంచి తీసివేస్తుంది. రెండవభర్త పై తనకు రాగమోహాదులు మిగిలి ఉండడం, తను స్వయంగా ఏ మహిమలూ చూపించలేకపోవడం, కొన్ని హఠాన్మరణాలను ఆపాలని సంకల్పించి కూడా ఆపలేకపోవడం వీటన్నిటిని సమీక్షించుకొని తనను తాను ఒక విశిష్ట వ్యక్తిగా నమ్మడం మానేస్తుంది. శశి నెలల తరబడి సమాధిలో ఉండడంలో రహస్యం వసుంధర బుద్ధికి అందని విషయంగా మిగిలిపోతుంది. ఉన్నట్టుండి శశి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతుంది. రెండవభర్తకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది.

దైవీకశక్తులను త్రోసిరాజని వెళ్ళేవారు కొందరు నకిలీ శక్తులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో, వీటన్నిటిలో ఆస్తికులు, నాస్తికులు పరస్పరం వైరం ఎలా పెంచుకుంటారో అనే విషయాల గురించి లోతైన చర్చ సమర్థవంతంగా జరిగింది ఈ నవలలో.

అస్తి నాస్తి సంఘర్షణలో నాస్తి అనే వారికీ అస్తిత్వం అనేది ఉంటుంది కదా! అస్తి అనే వారికీ ఒక అంతం అనేది ఉంటుంది. ఇక ఈ శుష్క వాదోపవాదాల వల్ల ఏమిటి ప్రయోజనం? వర్షపంకిలమైన మహా ప్రవాహంలో ప్రతిదీ తన అస్తిత్వాన్ని వదలుకోవాల్సి ఉంటుంది, స్వచ్ఛమైన బిందువులు కూడా వాటిలో కలిసి మలినం కావలసి ఉంటుంది. “ఒక్కటి గా స్వచ్ఛంగా మిగలడం జరగని పని. కాలచక్రగతిలో అంతర్హితం కావలసే ఉంటుంది. ఈ మొత్తం క్రమంలో జన్మాంతర కర్మఫలం అనుభవించడానికి ఈ దృశ్యమానమైన జగత్తు సాక్షి కాజాలదు, సాక్షిగా ఉండతగినది వేరే ఒక అద్భుతశక్తి ఉన్నది” అని వసుంధరకు అవగాహన కలుగుతుంది.

ఈ అనంతమైన సంఘర్షమయ జీవనచక్రంలో శాంతిని అన్వేషించడం కానీ ఘర్షణను గుర్తించడం కానీ యుక్తం కాదు. ప్రగాఢ విశ్వాసమే అత్యావశ్యకము. ఆస్తికత, నాస్తికత రెండూ స్వకామాదుల తృప్తీకరణ వరకే పరిమితమైనవి. వీటివలన లాభమేముంది? ఆస్తిక నాస్తిక వాదాలు రెండింటివలనా సమాజానికి ఒరిగేదేమీ లేదు. ఏ ధర్మం యొక్క ప్రధాన సూత్రాలలోనూ లోపం ఉండదు. వాటి దుర్వ్యాఖ్యానాల వల్లే అన్ని సమస్యలూ ఉత్పన్నమౌతాయి. ఆ వ్యాఖ్యానాల ప్రభావం, కామక్రోధాది బాధితులైన సామాన్యప్రజలపై పడుతుంది. స్వర్గం ఉందో లేదో, పాపభీతి ఉంటే కామక్రోధాల విజృంభణ పై ఒక అంకుశం ఉంటుంది. ఈ భావాలను బుద్ధికితోచినట్టో, ఇష్టానుసారమో మారుస్తూ ఉంటే అనర్థాలే పెరుగుతాయి.

నవలాకారుడు ఆయా పాత్రలను తగినవిధంగా వాడుకుంటూ గంభీరమైన చర్చ చేస్తాడు. ప్రారంభంలో నవలపై దృష్టి నిలపడం కొంచెం కష్టంగానే అనిపించినా విషయగాంభీర్యత, లోతైన చర్చలలో దానంతటదే చిత్తం కుదురుకుంటుంది.

నవల పేరు’స్వర్గానికి నిచ్చెనలు’ అంటే తెలిసినదే. ఆస్తిక నాస్తిక వర్గాలు తమ తమ మాటల మాయాజాలంలో సామాన్యులకు గాలిలో మేడలు నిర్మించడం వస్తువు కాబట్టి శీర్షికకు పూర్తి న్యాయం చేకూరింది. అంతిమంగా శాంతిప్రాప్తి కి ఏ మార్గం మంచిదనే చర్చను చక్కగా నడిపారు.

You Might Also Like

Leave a Reply