పుస్తకం
All about booksపుస్తకభాష

July 27, 2016

అవధాన విద్యాసర్వస్వము – ఒక పరిచయం

More articles by »
Written by: అతిథి
Tags:

వ్యాసకర్త: కోడిహళ్ళి మురళీమోహన్
*********

నేను అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగిన విశేషమేమోగాని నాకు అవధానాలతో పరిచయం కొంత ఉంది. నేను 8వ తరగతి చదువుకొనే సమయంలో మొదటిసారిగా అష్టావధానాన్ని చూడగలిగాను. ఆనాటి నుండి నేటి వరకు అనేక అవధానాలను పరికించే అవకాశం కలిగింది. హైదరాబాదుకు వచ్చాక అష్టావధానాలే కాక శతావధానాలు, సంపూర్ణ శతావధానాలు, ద్విశతావధానాలు, పంచ శతావధానాలు, సహస్రావధానాలు, మహాసహస్రావధానాలు, ద్విసహస్రావధానాలు, పంచసహస్రావధానాలు, అవధానసప్తాహాలు, జంట అవధానాలు, హాస్యావధానాలు మొదలైనవాటిని వీక్షించి ఆస్వాదించే అదృష్టం పట్టింది. ఒక విధంగా నాకు సాహిత్యం పట్ల అభిరుచి కలగడానికి ఈ అవధాన ప్రక్రియ కూడా ఒక కారణం.

కొన్నేళ్ల క్రితం ఆంధ్రజ్యోతిలో వారం వారం అవధానుల గురించి డాక్టర్ రాపాక ఏకాంబరా చార్యులు వ్యాసాలు వ్రాసేవారు. వాటిలో కొన్ని నేను చదివాను. తెలుగు వికీపీడియాలో వ్రాయడానికి ఒక అవధాని వివరాలు అవసరమై ఆంధ్రజ్యోతి వ్యాసాలు గుర్తుకు వచ్చి రాపాక వారిని సంప్రదించాను. వారు నాకు కావలసిన వివరాలను అందించడమే కాక త్వరలో అవధానుల గురించి, అవధానాల గురించి సమగ్రమైన గ్రంథాన్ని వెలువరిస్తున్నట్టు తెలియజేశారు. ఆ రోజునుండి ఆ పుస్తకాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూవున్నాను. నా నిరీక్షణ మొన్న జూలై 10వ తేదీన ముగిసింది. ఆ రోజు “అవధాన విద్యా సర్వస్వము” అనే పేరు ఉన్న ఈ గ్రంథం హైదరాబాదు చిక్కడపల్లిలో ఉన్న త్యాగరాయగానసభలో శ్రీశ్రీశ్రీసిద్ధేశ్వరానందభారతి (పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయకులపతి) గారి కరకమలముల మీదుగా ఆవిష్కరింపబడింది. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు, అవధానులు హాజరయ్యారు. ఆ సభలో వెలువడిన గ్రంథాన్ని కొని భద్రపరచుకోవడం జరిగింది. ప్రస్తుత వ్యాసం ఉద్దేశం ఈ గ్రంథాన్ని నలుగురికీ పరిచయం చేయడమే.

వెయ్యి కన్నా ఎక్కువ పుటలు ఉన్న ఈ గ్రంథంలో 1.అవధాన విద్యావికాసము, 2.అష్టావధానము, విభిన్న అష్టవధానములు, 3.అష్టవధానాలలోని అంశాలు, 4.శతావధానము ఆరంభ వికాసాలు, 5.అవధాన విద్యాధరులు, 6.కొందరు అవధానుల సంక్షిప్త జీవితచరిత్రలు, 7.హాస్యవల్లరి అప్రస్తుత ప్రసంగము అనే ప్రధానమైన అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో అవధాన విద్యాధరులు అనే విభాగం పెద్దది మరియు కీలకమైనది. ఈ విభాగంలో 20, 21 శతాబ్దాలలో జీవించిన 182 మంది అవధానుల విపులమైన పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలలో ఆయా అవధానుల జీవిత విశేషాలు, వారు నిర్వహించిన అవధానాల వివరాలు, ఏఏ చోట్ల అవధానాలు చేశారో ఆ వివరాలు, వారి అవధానాలలో ప్రత్యేక అంశాలు, వారు రచించిన కావ్యాల వివరాలు, వారు పొందిన సత్కారాలు, వారికి లభించిన బిరుదులు మొదలైన అనేక వివరాలు ఎంతో శ్రమకోర్చి రాపాకవారు సుమారు 40 సంవత్సరాలు కష్టపడి సేకరించిన సమాచారం ఉంది. వీటిలో ఆయా అవధానులు చెప్పిన సమస్యాపూరణలు, వర్ణనలు, దత్తపదులు, ఆశువులు కొన్ని పద్యాలు ఉదాహరణగా ఇచ్చారు. ఈ అవధానులలో 7గురు మహిళావధానులు, గానావధాని సయ్యద్ రహమతుల్లా, వచనకవితావధాని పి.ఆర్.ఎల్.స్వామి, నాట్యావధాని స్వర్ణరాజ హనుమంతరావు, చిత్రకళావధాని సింగంపల్లి సత్యనారాయణ మొదలైన వారి వివరాలు ఉండటం విశేషం. ఎక్కువ వివరాలు లభ్యం కాని మరో 107 మంది అవధానుల సంక్షిప్త వివరాలు తరువాతి అధ్యాయంలో చేర్చారు.

ఈ బృహద్గ్రంథంలో అవధానాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకు అవధానాలలో స్వీకరించే అంశాలు సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, నిషిద్దాక్షరి, అప్రస్తుతప్రసంగము, పురాణపఠనము మొదలైన కొన్ని మాత్రమే తెలుసు. ఈ గ్రంథం ద్వారా ఉద్ధిష్టాక్షరి, నిర్దిష్టాక్షరి, ఇచ్చాంక శ్లోకము, ఏకసంథాగ్రహణం మొదలైన 16 ధారణా సహిత సాహిత్య సంబంధ అంశాలు, కావ్యానుకరణం, ఛంధోభాషణం, కావ్యోక్తి, నృత్తపది మొదలైన 21 ధారణారహిత సాహిత్య అంశాలు, నామ సమీకరణం వంటి ధారణాసహిత సాహిత్యేతర అంశాలు, తురంగోద్గమనం వంటి ధారణారహిత సాహిత్యేతర అంశాలను వివరంగా తెలుసుకోవచ్చు. సమస్యలను పూరించడంలో ఎన్నిరకాల చమత్కారాలున్నాయో ఈ గ్రంథం చదివితే అర్థమవుతుంది. అలాగే దత్తపదులలో 10 విధాలు, వర్ణనలలో 12 రకాలు సోదాహరణగా ఈ పుస్తకంలో వివరించబడింది. ఇంకా అవధానాల రకాలలో సాహిత్యావధానాలతో పాటు సాంకేతిక అవధానాలు, శాస్త్రసంబంధ, కళాసంబంధ అవధానాల గురించిన సమాచారం ఈ గ్రంథంలో లభిస్తుంది.

ఈ అవధానాలను నిర్వహంచడంలో ఒక్కొక్క అవధానిది ఒక్కొక్క రీతి. కొందరు వేగానికి ప్రాధాన్యతను ఇస్తారు. మరికొందరు సభారంజకంగా ఉండటానికి ఇష్టపడతారు. కొందరి ధారణలో ప్రత్యేకత కనిపిస్తుంది. గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్, మాడుగుల నాగఫణిశర్మ లాంటి వారి సహస్రావధానాలు చూసిన వారికి శ్రీరాం వీరబ్రహ్మకవి, జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలైనవారు నిర్వహించిన సహస్రావధానం గురించి తెలుసుకుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. వెయ్యి కార్డులపై కొన్ని సమస్యలు, కొన్ని వర్ణనలు, కొన్ని రంగు రంగుల బొమ్మలు, కొన్ని సంఖ్యలకు వర్గ మూలాలు, ఘనమూలాలు ఇలా రకరకాలుగా వ్రాసేవారట. ఆ కార్డులకు నెంబర్లు కూడా ఇచ్చేవారట. అవధానిగారు రోజుకు 200 కార్డులు చొప్పున ఐదురోజులు వెయ్యి కార్డులను ధారణ చేసుకునే వారట. ఆరవరోజు అవధాని గారికి విశ్రాంతి. తరువాత రెండు రోజులు సభలోని వారు వారికి ఇష్టం వచ్చిన కార్డు నెంబరు చెప్పగానే ఆ కార్డులోని బొమ్మకో, ప్రశ్నకో సమాధానం పద్యరూపంలో చెప్పేవారట. అంటే మొత్తం అవధానానికి 8 రోజుల సమయం పట్టేది. ఇలాంటి విశేషాలు ఈ గ్రంథంలో కోకొల్లలు.

రాపాక వారు వివిధ అవధానాలలో సేకరించిన అప్రస్తుత ప్రసంగాలలోని చమత్కారమైన, హాస్యపూరితమైన సమాధానాలను హాస్యవల్లరి పేరుతో ఇదివరకు ఒక చిన్నపొత్తాన్ని ప్రచురించారు. ఆ పుస్తకాన్ని యథాతథంగా ఈ సర్వస్వంలో ఒక అధ్యాయం కింద చేర్చారు. వీటిలో చాలా ప్రశ్నలు సమాధానాలు చమత్కారంగా, హాస్యభరితంగా ఉన్నాయి. అయితే కొన్ని అవధాని ఆయా సందర్భంలో చెప్పినప్పుడు పండి ఉండవచ్చుగాని ప్రస్తుతం చదివితే పేలవంగా అనిపిస్తాయి.

ఇక ఈ పుస్తకంలో ముద్రారాక్షసాలేవీ నా కంట పడలేదు. చెఱువు సత్యనారాయణశాస్త్రి గారి గురించిన వ్యాసంలో వారి రచనల జాబితాలో 6 నుండి 8 సంఖ్య గల రచనలు ఎడిటింగ్ వల్ల ఎగిరిపోయాయి. ఇలాంటి పరిగణనలోనికి రాని లొసుగులు ఒకటిరెండు ఉండవచ్చు. అంతకు మించి ఈ గ్రంథంలో రంధ్రాన్వేషణ చేయడానికి ఏమీలేదు.

రాపాక ఏకాంబరాచార్యులు ఇంతకు ముందు విశ్వబ్రాహ్మణసర్వస్వం వెలువరించారు. కాబట్టి ఈ సర్వస్వాన్ని సాహిత్యాభిమానుల మెప్పుపొందేలా రూపొందించడంలో ఆ అనుభవం ఉపయోగపడిందని భావించవచ్చు. ధర కాస్త ఎక్కువయినా అవధానాలను, పద్యాన్ని అభిమానించే వారందరూ కొని దాచుకోదగిన పుస్తకం ఇది.

ఈ పుస్తకం కావలసిన వారు శ్రీమతి రాపాక రుక్మిణి, యం.ఐ.జి. II నెం.56, మస్క్ మహల్ కాంప్లెక్స్, హుడా కాలనీ, అత్తాపూర్, బహదూర్ పురా పోస్టు, హైదరాబాదు 500 064, ఫోన్ నెంబర్లు 8686825108, 9440404752 అనే చిరునామాలో సంప్రదించవచ్చు. పుస్తకం వెల రూ.1000/- మాత్రమే.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.One Comment


  1. రవి

    పరిచయం బావుంది. ఇదివరకు కొన్ని అవధానపుస్తకాలు వచ్చాయేమో కానీ ఈ పుస్తకం చాలా సమగ్రంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, వ్యాసం చూస్తే. ఏ యూనివర్సిటీ వాళ్ళో చేయాల్సిన పని ఈయన చేశాడు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngugi Wa Thingio’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Nguigi Wa Thiongio) రాసిన Education for a national culture అన్న వ్యాసం గు...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 

 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1

 
 

పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడ...
by పుస్తకం.నెట్
0