తెలుగు తుమ్మెదలు మోసుకొచ్చిన తేనె బాన – ‘తెలుగువారి ప్రయాణాలు’

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
*****************

సుప్రసిద్ధ యాత్రికుడు, యాత్రా రచయిత ఎమ్. ఆదినారాయణ గారు సంపాదకత్వం వహించి, సంకలనం చేసిన పుస్తకం “తెలుగువారి ప్రయాణాలు”. ఆరు ఖండాలలో 64 మంది తెలుగువారు చేసిన యాత్రలు, ప్రయాణాలను వారి ఆత్మకథలు, డైరీలు, వ్యాసాల నుంచి సేకరించి తెలుగు పాఠకులకు అందించారు ఆదినారాయణ గారు.

మాములుగా ఒక్కరి యాత్రా విశేషాలు తెలుసుకోవాలంటేనే మనస్సెంతో తహతహలాడుతుంది. అలాంటిది ఏకంగా 64 మంది యాత్రా కథనాలను ఒకేచోట చదవడం ఓ అద్భుతమైన అనుభవం. దేశవిదేశీయాత్రలలో ప్రకృతి, ప్రయాణాల వివరాలు, విషాద స్మృతులు, ఉల్లాసవంతమైన దృశ్యాలు, ఎదురైన మనుషులు, వారి ప్రవర్తన.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకీ పుస్తకంలో లభిస్తాయి.
***

అనారోగ్యంతో బాధపడుతూ, గాలిమార్పు కోసం కాశీయాత్ర చేశారు వెన్నెలకంటి సుబ్బారావు. మద్రాసు కోర్టులో దుబాసీగా పనిచేసిన ఈయన మద్రాసు నుంచి 8 ఆగస్టు 1822 నాడు బయల్దేరి గయ, కాశి, ప్రయాగ, కలకత్తాలు దర్శించి 11 సెప్టెంబరు 1823 నాడు తిరిగి మద్రాసు చేరుతారు. మార్గమధ్యంలో బాగా జబ్బుపడినా పట్టు వీడకుండా, యాత్ర పూర్తి చేశారు. ఆత్మకథని ఆంగ్లంలో రాసుకున్న తొలి తెలుగు వ్యక్తి వెన్నెలకంటి సుబ్బారావు.

తెలుగు యాత్రా సాహిత్యానికి ఆద్యుడైన ఏనుగుల వీరాస్వామి 18 మే 1830 నాడు మద్రాసు నుంచి వందమంది సహయాత్రికులతో బయల్దేరి కాశీ దర్శించి, 3 సెప్టెంబరు 1831 నాటికి మద్రాసు చేరుకున్నారు. కాశీలోని అన్ని ఘాట్లను, వీధులను తన పుస్తకంలో సవివరంగా వర్ణించారు. 15 నెలల 15 రోజుల పాటు ప్రయాణించినా, ఏ అవాంతరాలు లేకుండా క్షేమంగా ఇల్లు చేరడం దైవకృపే అంటారాయన.

యాత్రలంటే మహా ఇష్టమున్న ప్రాతూరి వెంకటశివరామ శర్మ అంతఃప్రేరణ పొంది ప్రయాగ కుంభమేళా యాత్ర చేశారు. రాహుల్ సాంకృత్యాయన్‌కి మంచి మిత్రులయిన స్వామి ప్రణవానంద గండశిలల దారిలో గోముఖానికి ప్రయాణం చేశారు. భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు సోదరుడు పి.వి. మనోహరరావు 1983లో మానససరోవర యాత్ర చేశారు. ఆ అనుభవాలతో “కైలాస దర్శనం” అనే పుస్తకం వ్రాసారు. ఎన్ని కష్టాలు ఎదురైనా గొప్ప మనోనిశ్చయంతో ఆయన తన యాత్ర పూర్తి చేశారు.

ఆధునిక యుగకర్త గురజాడ అప్పారావు విజయనగరానికి దగ్గరలో ఉన్న వెలగాడ కొండ మీద విహారం చేశారు. ఆ అనుభవాలని తన డైరీలో గ్రంథస్తం చేసుకున్నారు. వెలగాడ కొండ మీద నుంచి చూస్తే ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో గురజాడ మాటలలో చదువుతూంటే మనకీ ఆ కొండ ఎక్కేయాలనిపిస్తుంది. “ప్రకృతి అనే పుస్తకం అన్ని పుస్తకాల కన్నా గొప్పది.” అంటారు గురజాడ.

చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు 1889లో జరిపిన కాశీయాత్ర అనుభవాలను 1934లో పుస్తకరూపంలోకి తెచ్చారు. ఆయన అనుభవాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి.

జీవితంలో వరుసగా 21 రోజులు సుఖంగా ఉన్నది చైనాలో మాత్రమే’ అంటూ తన చైనా యాత్ర గురించి వివరిస్తారు శ్రీశ్రీ. 1976లో చైనా యాత్ర సందర్భంగా చైనా బాలబాలికలు తనకిచ్చిన బహుమతి భారతీయ బాలబాలికలకు ఎలా అందిందో చెబుతారు.

ప్రజాకవి కాళోజి తన మిత్రుడు, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుతో కలసి మహా బలేశ్వరం యాత్ర చేశారు. ఆయన ఆత్మకథ ‘నా గొడవ’లో ఈ యాత్రానుభవాలను పేర్కొన్నారు. ఉన్న డబ్బంతా హిందూ ముస్లిం మైత్రి కోసం బొంబాయిలో విరాళాలు సేకరిస్తున్న పృథ్వీరాజ్‌కపూర్‌కి అందజేసి, అప్పుచేసి హోటల్ బిల్లు కట్టి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన వైనం చదివితే వారి సున్నితమైన హృదయం అవగతమవుతుంది.

వివిధ సంస్కృతుల వైవిధ్యాల మధ్య మూడు తరాల తెలుగు వాళ్ళు ఎలా సహజీవనం చేస్తున్నారో తన అమెరికా పర్యటనలో తెలుసుకున్నారు ఆరుద్ర. విదేశాలలో భారత సంస్కృతి ఎలా ఉందో చూడడం కన్నా, ఆ దేశీయుల సంస్కృతి ఎలా ఉందో, అక్కడెలాగ ప్రస్ఫుటమవుతోందో గమనించడం పర్యాటకుల కర్తవ్యం అని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య సమరం జరుగుతున్న రోజులలో, రజాకార్ల దాడిలో గాయపడిన ఖైదీలతో పాటుగా చికిత్స కోసం – వరంగల్ నుంచి హైదరాబాద్ సెంట్రల్ జైలుకి తరలించబడ్డారు దాశరథి కృష్ణమాచార్య. ఈ రైలు ప్రయాణం గురించి తన ఆత్మకథలో వ్రాసుకున్నారాయన. ఎంతైనా కవి కాబట్టి, తన యాత్రా విశేషాలను సందర్భోచితంగా గాలీబు గీతాలతో వర్ణించారు.

1996లో మారిషస్ వెళ్ళి, తెలుగు భాష కోసం అక్కడి ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషిని “నేను చూసిన మారిషస్” అనే గ్రంథంలో వివరించారు ప్రముఖ కవి ప్రొఫెసర్ ఎన్. గోపి. మారిషస్‌లో తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి చేసిన ‘గున్నయ్య ఒత్తు’ అనే తెలుగు ఉపాధ్యాయుడి గురించి గోపి గారి ద్వారా తెలుసుకోడం బావుంటుంది.

2002లో ఆటా ఆహ్వానంపై అమెరికా సందర్శించి ‘ఆటాజనికాంచె’ అనే పుస్తకం వ్రాసి యాత్రాసాహిత్యంలో కొత్త ప్రయోగం చేశారు ఎండ్లూరి సుధాకర్. అమెరికన్ల జీవితాన్ని గురించి సుధాకర్ చేసిన కమ్మని కవితా వ్యాఖ్యానాలు చదువరులని రంజింపజేస్తాయి. “ఆకలికి అవమానం లేదు/కడుపు నిండిన విశ్వమానవుడు/నాకు అమెరికాలోనూ కనబడలేదు” అంటారు సుధాకర్. అమెరికా నుంచి ఏం నేర్చుకోవాలో, దేన్ని ద్వేషించాలో, ఏం ఆశించాలో కవితాత్మకంగా చెబుతారు.

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 1873లో తన కుటుంబంతో సహా చేసిన జగన్నాథ యాత్ర గురించి ఎంతో నిజాయితీగా తన ఆత్మకథ ‘నా యెరుక’లో రాసుకున్నారు. ఆనాటి పథికులు ఎదుర్కునే కష్టనష్టాలను చదువుతుంటే – అన్ని ఇబ్బందులు పడి కూడా యాత్ర సంపూర్ణం చేసినందుకు మనస్సులోనే వారికి అభినందనలు తెలపకుండా ఉండలేం.

ప్రముఖ కవి, రచయిత, చిత్రకారుడు అడవి బాపిరాజు 1913లో అజంతా ఎల్లోరా గుహలను సందర్శించారు. ఆ వివరాలను 1941లో పుస్తకరూపంలోకి తెచ్చారు. ఆ పుస్తకంలో అజంతా ఎల్లోరా గుహల గురించి అద్భుతంగా వర్ణిస్తారు. పూర్వభారత ప్రపంచమంతా ఒక్కసారిగా కళ్ళముందు కనబడుతుందని అన్నారు.

ప్రయాణం అమావాస్య రోజున! జోరున వాన! సముద్రంలో తుఫాను. ఓడ హార్బరుకి రాకుండా సముద్రంలోనే నిలిచింది. చిన్న పడవల్లోనూ, డింగీల్లోనూ సముద్రంలోకి వెళ్ళి, రంగూన్ వెళ్ళే ఓడ ఎక్కాలి. ‘పద్మశ్రీ’ పొందిన తొలి ఆంధ్రుడు స్థానం నరసింహారావు రంగూన్ ప్రయాణంలో ఎదురైన ఆటంకాలివి. రంగూన్‌లో ‘సారంగధర’ నాటక ప్రదర్శనలో ఎదురైన అపశ్రుతి ఏమిటో, దాన్ని ఆయనెలా సరిదిద్దగలిగారో ఆయన మాటల్లోనే తెలుసుకోడం బావుంటుంది.

చూడబోతున్న దేశం మీద గౌరవంతో, కలుసుకోబోతున్న జాతి పట్ల స్నేహభావంతో అమెరికా కాంక్రీట్ గడ్డ మీద అడుగుపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు గారికి విమానంలో ఎదురైన సంఘటనలేవి? ప్రయాణీకులకు మర్యాదలు చేస్తున్న ఎయిర్ హోస్టెస్ గురించి ఆయనేమనుకున్నారు? ఆసక్తిదాయకం ఈ కథనం.

అలవాటయిన ప్రపంచం వదిలి, కొత్త ప్రపంచంలోకి పోబోతున్నట్టుగా వికలావస్థలో ఇల్లు చేరాను అన్నారు భానుమతి, తన సినిమా జీవితంలో భాగంగా చేయబోయే మొదటి ప్రయాణం గురించి. సి. పుల్లయ్యగారి ‘కాళింది’ సినిమా కోసం తాను చేసిన కలకత్తా ప్రయాణాన్ని తన ఆత్మకథ ‘నాలో నేను’లో వివరిస్తారామె. భానుమతిని సి.పుల్లయ్య గారి దగ్గరకి, కలకత్తాకి తీసుకువెళ్ళిన ‘టోపీవాలా’ ఎవరో తెలుసుకోవడం బాగుంటుంది.

సైకిల్ కొనుక్కోవాలన్న కోరికతో, ప్రొద్దుటూరు నుంచి బెంగుళూరు ప్రయాణించారు ప్రముఖ హాస్యనటులు పద్మనాభం. రైల్లో టికెట్ లేకుండా చేసిన ప్రయాణం, బెంగుళూరు నుంచి మద్రాసు చేరడం, అక్కడ కన్నాంబ గారిని కలిసి సినిమా రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారాయన. ఆత్మకథలోవీ వివరాలు.

నిజానికి ఎంతో దూరంగా ఉన్నా, సముద్రం ఇట్టే చెయి చాచి ముట్టుకోవచ్చు ననేటంత సమీపంగా కనిపించింది ఆచంట జానకీరాం గారికి. తన బావతో కలసి సింహాచలం యాత్ర చేసిన ఆయన ఎంతో భావుకతతో కొండ మీది ప్రకృతిని వర్ణించిన విధానం చదువుతూంటే, మరోసారి సింహాచలం వెళ్ళాలనిపిస్తుంది.

1940లో తాను చేసిన హిమాలయాల యాత్ర గురించి ‘తెగిన జ్ఞాపకాలు’ అనే గ్రంథంలో వివరించారు సంజీవ్‌దేవ్. “దేవదారు చెట్ల గుండా ఆ చలిలో నిశ్శబ్దంగా, ఏకాంతంలో నడిచివెడుతూ వుంటే అదో ఆనందంగా వుంది. శరీరానికంత సుఖంగా లేకపోయినా కూడా హృదయానికి ఉల్లాసంగా వుంది” అన్నారాయన. ఆయన కళ్ళతో హిమాలయాలని చూడడం మనోహరంగా ఉంటుంది.

ఇల్లు ఎందుకు విడిచిపెట్టాలో చెబుతారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన ఆత్మకథ ‘అనుభవాలూ – జ్ఞాపకాలూను’లో. ఎందుకంటే – లోకజ్ఞానం కోసమట! కోట్లు డబ్బిచ్చినా కలగని తృప్తి – ఓ రైల్వే బుకింగ్ క్లర్క్ చేసిన పనికి, అన్న మాటలకి శాస్త్రిగారికి కలిగింది ఓ యాత్రలో.

యుద్ధం యొక్క భీభత్సాన్ని, తీరప్రాంతాలలోని పట్టణాలను బాంబులతో నాశనం చేయడాన్ని – యుద్ధ సమయంలో సొంతూరికి బస్సులో వెళ్ళడాన్ని తన ‘స్వీయ చరిత్ర’లో వివరించారు దువ్వూరి వేంకట రమణ శాస్త్రి. భయం కలిగించే ప్రయాణమది.

‘హంపి నుంచి హరప్పా దాక’ తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ. మిలిటరీ జీవితం విసుగెత్తి, ఆ బాధ్యతలు వదిలించుకుని భారత దేశానికి తిరిగి వచ్చే క్రమంలో మొహెంజాదారో, హరప్పాలను దర్శించారాయన. తూటాలతో చిల్లులు పడిన జలియన్ వాలా బాగ్‌లోని రంధ్రాల గోడలు జీవితానికో గుణపాఠమని చెప్పారు.

శీర్షికలోనే రాకపోకలు ఉన్న రచన ‘గమనాగమనం’. భౌతికవాది, ప్రముఖ అనువాదకులు ఆలూరి భుజంగరావు గారి ఆత్మకథ ఇది. ఏమీ మాట్లాడలేని స్థితిలో – ఏమీ మాట్లాడకుండా ఉండడం వినా చేయగలిగింది ఏముంటుంది? ఈ విపత్కర పరిస్థితి ‘పిటకాలగుళ్ళ’ అనే గ్రామం నుంచి ఎడవల్లికి జరిపిన సైకిల్ ప్రయాణంలో భుజంగరావుగారికి ఎదురైంది.

‘నైలునదీ నాగరికత’ అనే చిన్నపుస్తకంలో తన ఈజిప్టు పర్యటన గురించి, పిరమిడ్ల గురించి, నైలు నది గురించి వివరిస్తారు డా. ముదిగంటి సుజాతారెడ్డి.
హితకారిణీ సమాజం అప్పులు తీర్చడానికి బొంబాయి యాత్ర చేసి అక్కడ విరాళాలు సేకరిస్తారు కందుకూరి వీరేశలింగం. ఆ ప్రయాణం వివరాలను తన ఆత్మకథ ‘స్వీయ చరిత్రము’లో తెలియజేశారు.

పిఠాపురం మహారాజాతో విదేశీయానం చేసిన కురుమెళ్ళ వెంకటరావు స్టీమరు మీద ఐరోపాకి చేసిన ప్రయాణం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ యాత్రాకథనం 1966లో వెలువడిన ‘మా మహారాజుతో దూరతీరాలు’ లోనిది.

‘అప్పారావుగారూ – నేనూ’ అనే చిన్న గ్రంథంలో భర్త బసవరాజు అప్పారావుతో కలసి తాను చేసిన ఉత్తర దేశ యాత్రల గురించి రాజ్యలక్ష్మమ్మగారు వివరించారు. తాజ్‌మహల్‌ని చూసి బసవరాజు అప్పారావు గారు ‘మామిడిచెట్టును అల్లుకున్నదీ మాధవీలత ఒకటి’ అన్న పాట వ్రాసిన వైనాన్ని చెబుతారు.

తన విద్యార్థినులను తీసుకుని కాశ్మీరులో విహారయాత్ర చేశారు నాయని కృష్ణకుమారి. ఆ యాత్రా విశేషాలను ‘కాశ్మీర దీపకళిక’ పేరిట గ్రంథస్తం చేశారు. దాల్ లేక్‌లో పడవ షికారు, మొగల్ తోటలలో విహారం, శ్రీనగర్ చుట్టుపక్కల గ్రామాల గురించి అందంగా వివరించారు. ఒకనాటి కాశ్మీరం అందాన్ని కళ్ళకు కడతారు.

ఇతరులు వ్యక్తిగతంగా భావించే విషయాలను తరచడం రచయితలకు బలహీనత అంటారు కవనశర్మ. 1986 డిసెంబర్ నుంచి 1987 జూన్ వరకు ఇరాక్‌లో ఇంజనీరింగ్ పాఠాలు బోధించారాయన. యుద్ధ వాతావరణంలో తన ప్రయాణాలను కొనసాగించారు. ఆయన రచన ‘ఇరాక్ డైరీ’ ఆసక్తిగా చదివిస్తుంది.

మనం చదివిన పుస్తకాలలోని లక్షల అక్షరాలు మనల్ని మన ఇరుకిరుకు ఇళ్ల నుండి ఇవతలకి లాగి సువిశాల ప్రపంచంలోకి నెట్టి దేశదేశాల రహదారుల మీద నడిపిస్తూ, సంచరించేటట్టు చేస్తాయని చెప్పటానికి ఒక పెద్ద ఉదాహరణ పరవస్తు లోకేశ్వర్ గారి కిర్గిజ్‌స్థాన్‌ యాత్ర. “సిల్క్ రూట్‌లో సాహసయాత్ర” ఓ చక్కని యాత్రాకథనం.

కొండలతోనూ, అడవులతోనూ, నదీనదాలతోనూ, పువ్వుపిట్టలతోను సన్నిహిత సంబంధం ఏర్పడాలంటే మారుమూలల ప్రదేశాలకు కాలినడకన వెళ్ళాలంటారు దాసరి అమరేంద్ర, ట్రెక్కింగ్ లోతుపాతులు తెలిసాక. ధర్మశాలలో తను పర్యటించిన అనుభవాలను పాఠకులతో పంచుకుంటారాయన “స్కూటర్లపై రోహ్‌తాంగ్ యాత్ర” పుస్తకంలో.

‘మనం ఇలాంటి స్థలాలకు వెళ్ళినప్పుడు – మనం మనలోని పరిమిత జ్ఞానాల నుంచీ, సంకుచిత దృక్పథాల నుంచీ, అపరిమితమైన దాంతో, గంభీరమైన దాంతో, శాశ్వతమైన దాంతో మనని మనం అనుసంధానించుకుంటా’మని టాగూర్ చెప్పినట్టుగా గుర్తు చేసుకుంటారు వాడ్రేవు చినవీరభద్రుడు – సాంచి స్తూపం దర్శించిన సందర్భంలో. అక్కడెంత ప్రశాంతత లభిస్తుందో వివరిస్తారు. “నేను తిరిగిన దారులు” ఆసక్తిగా చదివించే రచన.

“ఎంత అందంగా వర్ణించగలిగినా, ఎన్ని వివరాలు చెప్పగలిగినా స్వయంగా అనుభవించిన ఆనందానికి న్యాయం చెయ్యడం కష్టం” అంటారు బి.ఎస్.ఎస్. మూర్తి. 1957లో చైనాలోని పెకింగ్ నగరం నుంచి రష్యాలోని మాస్కో వరకు రైల్లో వెళ్ళారాయన. 5620 మైళ్ళ దూరం, 9 రోజులపాటు ప్రయాణించి మాస్కో చేరారు. ఈ అద్భుతమైన ప్రయాణం గురించి ‘నా అనుభవాలు – జ్ఞాపకాలు’ అనే తన ఆత్మకథలో విపులంగా వ్రాశారు.

‘లోకాలోకనం’ పేరిట తన యాత్రానుభవాలను ప్రచురించారు ప్రముఖ కవి జె. బాపురెడ్డి. తన యాత్రా విశేషాలను గద్యంలో కాకుండా పద్యరూపంలో పొందుపరిచారు.

ఆంధ్రుల ఆహ్లాద రచయితగా పేరుగాంచిన మల్లాది వెంకట కృష్ణమూర్తి తన టర్కీ పర్యటన అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు “దుబాయ్, టర్కీ, గ్రీస్” అనే యాత్రాగ్రంథంలో.

యూరప్ పర్యటనలో భాగంగా – వెనిస్, రోమ్, ఎడిన్‌బరో వంటి నగరాలలో తనకెదురైన అనుభవాలను హృద్యంగా వివరించారు వి. అశ్వినికుమార్ “దూరతీరాలలో” అనే రచనలో.

2010లో – శాంతి ప్రతినిధి బృందంలో సభ్యుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాకిస్థాన్‍లో పర్యటించారు. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ సందర్శించారు. ఆ వివరాలను “పాకిస్థాన్‌లో పది రోజులు” అన్న పుస్తకంలో వెల్లడించారు. భారతదేశానికి విషాదం మిగిల్చిన చోటు, తరువాత పాకిస్తాన్‌కి సంతోషాల కూడలి అయ్యిందని పాకిస్థాన్ లోని ఓ కూడలి గురించి చెబుతారు. మనస్సు చివుక్కుమనిపించే వివరణ అది.

ప్రముఖ ఆయుర్వేద నిపుణులు పి.వి. రంగనాయకులు 1994లో తన జరిపిన జపాన్ పర్యటన గురించి “జపాన్ – ఒక నాగరిక జైత్రయాత్ర” అనే పుస్తకం రాశారు. జపాన్ భూకంపాలకు, బుల్లెట్ రైళ్ళకు ప్రసిద్ధమని అందరికీ తెలిసిందే. అక్కడి వారు భూకంపాలకు ఎంత సన్నద్ధంగా ఉంటారో చక్కగా వివరించారు. టోక్యో నుంచి క్యోటో మధ్య ప్రయాణం గతం నుంచి భవిష్యత్తుకు వెళ్ళినట్టు ఉంటుంది అంటారాయన.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి – ‘చేవెళ్ళ నుంచి ఇచ్ఛాపురం’ వరకు జరిపిన పాదయాత్రలో పాల్గొన్న భూమన కరుణాకర రెడ్డి తన యాత్రానుభవాలను “ప్రజాప్రస్థానం – నా అనుభవాలు” అనే రచనలో వివరించారు.

పుస్తకంలో చివరగా, ఆదినారాయణ గారు తన స్వీడన్ యాత్రానుభవాలని వివరించారు.
***
కొన్ని ప్రయాణాలు – ‘అయ్యో, అప్పుడే ముగిసాయా’ అనిపిస్తాయి, ఎన్నో స్మృతులను, అనుభూతులను ప్రయాణీకులకు మిగులుస్తాయి. కొన్ని రచనలూ అంతే! చదవడం పూర్తయ్యాక, ‘అయ్యో, అప్పుడే అయిపోయిందా’ అనుకుంటారు పాఠకులు. ఈ పుస్తకం కూడా ఆ కోవలోదే.

64 మంది చేసిన ఈ యాత్రల గురించి విడివిడిగా 64 పుస్తకాలూ చదివే అవకాశం బహుశా మనకి ఇప్పుడు లభించకపోవచ్చు. అందుకే ఈ పుస్తకం విలువైనది. “తెలుగు యాత్రా సాహితీ సంపదని పదిమందికీ పంచాలి అనే ఆలోచన ఈ సంకలనానికి మూలం” అంటూ, ప్రపంచమంతా ప్రయాణించిన మన తెలుగు తుమ్మెదలు మోసుకొచ్చిన తేనె బానని మనకి అందించారు ఆదినారాయణగారు. ఆ మకరందాన్ని గ్రోలడం ఇక మనవంతు.

‘ఎమెస్కో బుక్స్’ ప్రచురించిన ఈ పుస్తకానికి పంపిణీదారులు విజయవాడకి చెందిన ‘సాహితీ ప్రచురణలు’. 520 పేజీల ఈ పుస్తకం వెల రూ. 200/-. అన్నిప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభ్యం.

You Might Also Like

3 Comments

  1. dvrao

    తెలుగు సాహిత్యం లో చదవాల్సిన పుస్తకాలలో ఈ పుస్తకం చేరుతుంది

  2. Aruna Pappu

    Prof Adinarayana garu has been working on this book since 7, 8 years I believe. I met him in vizag and saw his preparation in 2010 I think. It made me read “Naa Yeruka” n many books in this compilation. Kudos to Adinarayana garu. Thank you somasekhar garu for a good introduction. Pls see if you can talk to him about this book n publish an interview. Thank you pustakam team.

  3. amarendra

    అసలు ఆ పుస్తకమే ఒక కమ్మని విహంగ వీక్షణం…ఈ వ్యాసం దానిమీద అతిసూక్ష్మ పక్షి చూపు…ఒక్కొరికొక్కో వీరతాడు, వెరసి రెండు తాళ్లు !!

Leave a Reply