పుస్తకం
All about booksపుస్తకభాష

July 4, 2016

మరల సేద్యానికి

More articles by »
Written by: DTLC
Tags: ,

శివరామ కారంత్ ​​”మరల సేద్యానికి” మీద డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ జూన్ 5,2016 న జరిపిన చర్చలో పాల్గొన్న వారు: మద్దిపాటి కృష్ణారావు, చేకూరి విజయసారథి, పిన్నమనేని శ్రీనివాస్, బూదరాజు కృష్ణ మోహన్, అడుసుమిల్లి శివ, కోవూరు మాధవి, నర్రా వెంకట్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి.

చర్చలో ముఖ్యాంశాలు సమీక్షించిన సభ్యుడు: పిన్నమనేని శ్రీనివాస్
***************
శివరామ కారంత్ జ్ఞానపీఠ్ తో పాటు ఎన్నో అవార్డులు పొందిన రచయితగా కన్నడ సాహిత్య ప్రపంచంలో అగ్రస్థాయి రచయిత. ఈ నవల 1941 లో రాశారట. కన్నడ లో “మరళి మణ్ణిగె” ! అంటే “తిరిగి మట్టికి” (వ్యవసాయానికి) అని అర్థం. తెలుగులో అర్థవంతంగా ఉండడానికి డాక్టర్ తిరుమల రామచంద్ర గారు 36 ఏళ్ళ తర్వాత 1977 లో “మరల సేద్యానికి” గా అనువదించారు.

ఈ నవల సముద్రం ప్రక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరి(కోడి) లో ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబపు మధ్య తరగతి జీవితాల, మూడు తరాల,వందేళ్ళ కథ.
కోడి గ్రామంలో ఇంటికి వంద గజాల దూరంలోనే సముద్రం! దానితో పాటు ముఖ్య పాత్రలు –
మొదటి తరం – రామ ఐతాళుడు, వితంతువై ఇల్లు చేరిన చెల్లెలు సరసోతి (సరస్వతి), భార్య పారోతి (పార్వతి), రెండో భార్య సత్యభామ, ఎదురింటి మరో బ్రాహ్మడు శీనమయ్యరు
రెండో తరం – రామ ఐతాళుడు కొడుకు లక్ష్మి నారాయణ (లచ్చడు), లచ్చడి భార్య నాగవేణి, లచ్చడి హితుడు ఒరటమయ్యరు (శీనమయ్యరు కొడుకు)
మూడో తరం – ఐతాళుడు, తాత పేరు పెట్టుకున్న రాముడు

ప్రతి పాత్రనూ కారంత్ ఎంతో సవిస్తరంగా చిత్రించారు. మనసుకు హత్తుకు పోయి గౌరవాన్ని కలిగించి మన అభిమానాన్ని చూరగొనేవి మాత్రం సరసోతి, నాగ వేణి, మూడో తరం రాముడి పాత్రలే గానీ, అన్ని పాత్రల ప్రవుత్తులనూ సజీవంగా చూపించగలగడంలో రచయత ప్రతిభ మనకు కనిపిస్తుంది. డాక్టర్ తిరుమల రామచంద్ర ఈ నవలను అంత అద్భుతంగానూ తెలుగులోకి అనువదించడం విశేషం! పాత్రలన్నీ మన తెలుగు పాత్రలే అనిపించేలా అనువదించడం నిజంగా అద్భుతం.

మొదటి తరం – కథ 1870 కాలమైతే, వారి కాలపు చిరు తిండ్లు అప్పడాలు, వడియాలు. ఇంటికి వచ్చిన వారికి ఆకులో పెట్టిన వూరగాయ ముక్కతో మంచి నీళ్ళు ఇవ్వడం, నీళ్లలో నానేసిన అటుకులు తినడం ఇప్పటి తరానికి కొత్తగానే అనిపిస్తుంది. రామ ఇతాళుడు చుట్టుపక్కల గ్రామాలకి పురోహితుడు. జాగ్రత్త పరుడు. మొదటి భార్య, చెల్లెలు, ఇంటికి దగ్గరే వుండే పాలెగాళ్ళ తో చెరువు పూడిక మట్టి పొలాల్లోకి తెచ్చి నింపడం, చెరువు నీళ్ళు తోడి పొలాలకు పెట్టడం వంటి పనులన్నీ ఎక్కువగా చేసి వ్యవసాయంచేస్తే, పంటలు అమ్మగా వచ్చిన మిగులు డబ్బు రామ ఇతాళుడు ఎవరికీ తెలియకుండా గోడల్లో దాస్తూ ఉంటాడు. వరి, అనుములు, ఉలవలు ఎక్కువ పండేవి. వారి జీవితాలు స్వయం సమృద్ధి. తినేవి అన్నీ వారే పండిచు కోవడం, దానికే రెక్కలు ముక్కలు అయ్యేలాగ కష్టపడి పనిచేయడం అప్పటి వారి జీవన విధానం.

వ్యవసాయంచేసి ధనవంతులైన వారు చాల తక్కువ. మేము ఇంతకుముంది చదివిన పుస్తకం – పల్లెను మింగిన పెట్టుబడి – శ్రీ ఆదిభట్ల విద్యాసాగర్ గుర్తుకువచ్చింది ఈ పుస్తకం చదువుతుంటే. చిన్న కమతాల్లో వ్యవసాయం చెయ్యటం వల్ల వచ్చే ఆదాయం బతకటానికి కూడా సరిపోదు. పెట్టుబడి తెచ్చిన మార్పుల వల్ల అన్ని కుల వృత్తుల వారు వేరొక ఉద్యోగాల చదువుల వైపు తరలారు.

ఐతాళుడు సంతానం కోసం రెండో పెళ్ళి చేసుకుంటాడు. రెండో పెళ్ళి వల్ల పుట్టిన కొడుకు లక్ష్మి నారాయణ (లచ్చడు)ను కష్టం కలుగకుండా వృత్తి విద్యలో పెట్టకుండా, అతి గారాబం చేసి చదివించి బారిస్టర్ ను చేద్దామనుకుంటాడు. వృత్తి విద్యలు వదిలి ఉన్నత చదువులకు, వ్యాపారానికి, పట్టణాలకు (బెంగుళూరు, మంగుళూరు) వలసలు వెళ్లడం, ఉడిపిలో హోటల్ వ్యాపారాలు, రెండవ తరం తో మొదలవుతాయి. శీనమయ్యరు కొడుకులు బెంగుళూరులో హోటళ్ళు పెట్టి రెండు చేతులా డబ్బు సంపాదించే పనిలో ఉంటారు. లచ్చడు మాత్రం అజమాయిషీ కూడా లేకపోవడంతో అన్ని రకాల చెడుసావాసలకు అలవాటు పడతాడు. వాడికి ఖర్చుపెట్టడం బాగా తెలిసిన విద్య. లచ్చడు బాగు పడతాడని నాగవేణిని ఇచ్చి పెళ్లి చేస్తారు. కొడుకు మీద నమ్మికలేమితో ఇతాళుడు ఆస్తి మొత్తం కోడలు పేరుతో రాసినా,తండ్రి పోయాక, నమ్మించి ఆస్తి మొత్తం నాగవేణి చేత రాయించుకుని దాన్ని అనతి కాలంలోనే హారతి కర్పూరం చేస్తాడు. రచయితకు కూడా లచ్చడి ప్రవర్తనను క్లుప్తంగా ముగిస్తాడు. నవల మొత్తానికి చెడ్డవాడు వీడు.

మూడో తరం – రాముడే మన కధా నాయకుడు. పుట్టిన ప్పుడే ఆస్తి లేదు. తల్లి తప్ప వేరే వారు తెలియదు. సముద్రం వాడి స్నేహితుడు. ఓక కధా నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు వున్న యువకుడు. వ్యవసాయం లో మార్పులు ఉలవలు,మినుములు దోసకాయలు పండించిన మొదటి తరంలోని రామైతాళుడి కుటుంబం లో రాముడి తరం పొగాకు పండిస్తుంది. రాముడి చదువు కష్టాలు చదివినపుడు కొడవటి గంటి “చదువు” గుర్తుకు వచ్చింది.
వ్యవసాయం చేసే వారి జీవితం, కష్టాలు చదివినపుడు కాశిపట్నం “యజ్ఞం” గుర్తుకు వచ్చింది.రాముడు ఎక్కడికి వెళ్ళినా (కోడి,మద్రాసు,బొంబాయి ) అక్కడి సముద్రపు వర్ణన చాలా బాగుంది. కోడిలో అద్భుతంగా ఉన్న సముద్రం బొంబాయి వచ్చేసరికి మురికి గుంటలాగా కనిపిస్తుంది మన రాముడికి . కారంత్ గారు రాముడి కి కధానాయకుడికి అమరే చాలా సుగుణాలు వర్ణించారు. రామునికి తాతగారి లుబ్ధత్వం లేదు,తండ్రిగారిదురలవాట్లు లేవు.సమాజం కొరకు సొంతలాభం కొంతమానుకునే త్యాగలక్షణం ( తరువాత అది వొట్టి భ్రాంతి అని తేలినా) వున్నది.

వ్యవసాయం మార్పులు- వ్యవసాయం తమకోసం తిండి గింజలు పండించుకోవడం నుండి వ్యాపార పంటల కోసం మారినప్పుడు పడిన కష్టాలు చదివినపుడు చంద్రలత “రేగడివిత్తులు” గుర్తుకు వచ్చింది. ఇలా మననానికి రావటం అనేది కారత్ గారి ఇతివృత్తానికిగల సార్వకాలీనతకు ఋజువు. పాత్రలదుఃఖం తో పాఠకులు మమేకం చెందేలా శివరాంకారంత్ గారు వ్రాసినతీరు అమోఘం. ఆకాలంలో ఏమి తినేవారు,ఇళ్ళూ ఎలావుండేవి, ఏమి పనిముట్లు వాడేవారు, చిరుతిళ్ళు ఏమితినేవారు, పండగలకూ,పబ్బాలకూ ఏమితిని ఎలాజరుపుకునేవారూ, హాస్యాలూ, పరాచికాలూ ఎలావుండేవీ వంటి అనేక వివరాలు పొందుపరిచి నవలకు ఒక చరిత్రాత్మకలక్షణం చే కూర్చారు. ​ప్రతి పాత్రను పరిపూర్ణంగా తీర్చిదిద్దారు.​

​ప్రేమలు, పంతాలు, మళ్లీ ఎవరి హద్దులు వారు గుర్తెరిగి ఉండటం అంతా కూడా మనల్ని ఆ కాలంలోకి ​తీసుకు వెళ్ళిపోతారు. పాత్రలతో పాటు మమైకమవుతాము. వారి కష్టాలకు తెలియకుండానే మన కళ్ళు కూడా చెమరుస్తాయి. ప్రతిభావంతుడయిన రచయితా, మరింత ప్రతిభకల అనువాదకుడు తోడయితే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయేమో. ఆకాలపు జీవనాన్ని, స్వతంత్ర పోరాటాన్ని కూడా ఒక విభిన్న కోణం నుండి చూపించారు. ఇప్పుడు మనం చదివి ఉంటాము కదా. స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళారు అని. ఇక్కడ మన రాముడి నేపథ్యంలోంచి చూస్తే ఆ జైలుకెళ్ళడం వెనుక కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడిందో అవగతమవుతుంది. అది ఎంత పెద్ద విషయమో కూడా తెలుస్తుంది.

చదువుకుంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని చదివితే ప్రతిసారి దొరకదనే విషయాన్ని గుర్తిస్తే అప్పుడు ఇప్పుడు అట్లాగే వుందనిపిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు మాని రాముడు తిరిగి కోడిలో వ్యవసాయం చెయ్యడం నవల పేరుకు న్యాయం చేస్తే, మంచి నీళ్లు తాగించినంత సులభంగా మనల్ని అక్కడికి తీసుకెళ్ళడం రచయిత ప్రతిభ. వ్యవహార్తలు, కార్యదక్షులు అయిన స్వతంత్ర ప్రతిపత్తి గల స్త్రీ పాత్రలను కారంత్ సహజత్వం ఉట్టిపడేలా సృష్టించారు.​About the Author(s)

DTLC2 Comments


  1. varaprasaad.k

    ముట్టి ముట్టనట్టు, అంటి అంటనట్టు సమీక్ష పూర్తయింది,మొత్తం మీద కదా గట్టిదే అని తేలింది,ఇంకాస్త విపులంగా చర్చిస్తే మరింత బావుండేది.


  2. సౌమ్య

    ఈ పుస్తకాన్ని నేను ఆంగ్లానువాదంలో (Return to Earth) చదివాను. అప్పట్లో నన్ను చాలా ఆకట్టుకుంది. మీరు రాసినట్లే నేను కూడా ఆయన చాలా డీటెయిల్డ్ గా చిత్రించారు పాత్రలను అనుకున్నాను.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

ప్రతిధ్వనించవలసిన ఒంటిదని – శివరామ్ కారంత్

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ******* ఈ నాటి సామాజిక చిత్రాన్ని, అందులో ఉన్న భేష...
by అతిథి
0