పుస్తకం
All about booksపుస్తకాలు

June 29, 2016

సీనియర్ సిటిజెన్స్ కథలు – “అమ్మ అలిగింది”

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
************
వాణిశ్రీ‘ అనే కలం పేరుతో సుప్రసిద్ధులైన సి.హెచ్.శివరామప్రసాద్ గారు రచించిన కథల సంపుటి “అమ్మ అలిగింది“. గత కొద్ది కాలంగా సీనియర్స్ సిటిజన్స్ వ్రాసిన కథల సంకలనాలు వెలువరిస్తున్నారు వీరు. ఈ వరుసలో ఈ పుస్తకం రెండవది. ఈ పుస్తకంలో 34 కథలున్నాయి. ఈ కథలన్నీ కుటుంబాల కథలు – ముఖ్యంగా మధ్యతరగతి బ్రతుకుల కథలు. ఈ సంపుటి లోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

ఒక చిన్న అపోహ కుటుంబలోని సభ్యులను ఎంత ఆందోళనకి గురి చేస్తుందో, అహాన్ని విడిచి అరమరికలు లేకుండా మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా సులువుగా పరిష్కరించుకోవచ్చని చెబుతుంది “అమ్మ అలిగింది” కథ. మనసు పొరలు కమ్మిన మనిషి ప్రవర్తన అసహజంగా ఉంటుందని ఈ కథ ద్వారా మరోసారి అనుభవమవుతుంది.

దేశంలోని అల్లుళ్ళంతా మంచివాళ్ళయిపోవడానికి పెరిగిన పెట్రోలు రేట్లు కారణమవుతాయా? అవుననే భావించాడో అమాయక మావగారు. మన నియంత్రణలో లేని ఘటనలకు సర్దుకుపోవడం కూడా ఒక్కోసారి ఎదుటివారికి మంచితనంలానే కన్పిస్తుంది “అల్లుడొచ్చాడు” కథలో.

లక్షాధికారి అయిన వ్యక్తికి చిన్నా చితకా అప్పులు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? ఖరీదైన ఫ్లాట్‌లో నివాసం ఉంటూ ఇరుగుపొరుగుల నుంచి అప్పులు చేయాల్సిన అగత్యమేమిటి? పరిస్థితులు వికటించాయా? లేక మరేదైనా కారణం ఉందా? తెలుసుకోవాలంటే “అప్పుల అప్పారావు” కథ చదవాలి.

మరపు ఒక వరం! ఎన్నో బాధల్ని, చేదు సంఘటలని గుర్తు రాకుండా చేసి మనిషిని ప్రశాంతంగా ఉంచుతుంది. అయితే అదే మరపుని కూతురి మేలు కోసం తెలివిగా ఉపయోగించుకుంటాడో తండ్రి “ఎవరికి ఎవరు” కథలో. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న వైనాన్ని ఈ కథ ప్రస్తావిస్తుంది.
స్వార్థం, దురాశ, రాజకీయం కలిసి ఓ మధ్యతరగతి మనిషిని ఎలా బలిచేసాయో “కుచేలుడు” కథ చెబుతుంది. వర్తమాన సమాజంలోని ఘటనలకి వ్యాఖ్యానమీ కథ.

ఒకే తరహా సంఘటనలు ఒకేసారి రెండు కుటుంబాలలో జరగడం యాదృచ్ఛికమేనా? వేరే మర్మం ఏదైనా ఉందా? ‘నలుగురితో పాటు నేనూ…’ అని ఎవరేది చేస్తే తాను అదే చేయాలనుకునే వ్యక్తికి – స్వంత ప్రవృత్తి అనేది ఏ జీవికి ఆ జీవికి ప్రత్యేకమని – తెలుస్తుంది “పరివర్తన” కథలో.
అనంతమైన ఎపిసోడ్లతో – చిరకాలం ‘సాగు’తున్న టీవీ ధారావాహికలపై సెటైర్ “పెట్టెలో ప్రాణం” కథ.

చిన్నప్పుడెప్పుడో చదువు చెప్పి, జీవితంలో ఎదగడానికి ప్రోత్సహించిన ఓ మాస్టారి బాకీ తీర్చడానికి అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడు మాస్టారిని కలవగలిగాడా? ఆయన బాకీ తీర్చగలిగాడా? కొంత సినిమాటిక్‌గా ఉన్నా, ఆసక్తిగా చదివిస్తుంది “బాకీ” కథ.

ఎదుటివారికి నీతులు చెబుతూ, తాను మాత్రం వాటిని పాటించిన ఓ ఘరానా వ్యక్తికి కన్నతల్లి నుంచే ఎదురైన ఛీత్కారం ఎటువంటిదో “మాతృదేవోభవ” కథ చెబుతుంది.

తన పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఒక మంచి పని చేసి మీడియా దృష్టిలో పడాలనుకుంటాడో ముసలి ఎమ్మెల్లే. ఏ పని చేద్దామన్న దాని వల్ల ఎదురయ్యే తలనొప్పలను భరించలేననుకుంటాడు. చివరికి ఓ ఆలోచన వస్తుంది. మరి అది ఫలించి, అతని పబ్లిసిటీ ఆశ తీరిందో లేదో తెలియాలంటే – “మిఠాయి చేదు” కథ చదవాలి.

సమాజంలో పలుకుబడి కోసం ఓ డ్రైనేజి వర్కర్‌కి నలుగురిలో సత్కారం చేసి, అదే వ్యక్తిని ఇంటికి పిలిచి మాటల ఈటెలతో గుచ్చుతుందో కుటుంబం. మనుషుల్లో ద్వంద్వ వైఖరిని ఎండగడుతుంది “మేన్‌హోల్” కథ.

అవసరమున్నా లేకపోయినా స్థలాలు కొనిపడేసే ఓ పెద్దమనిషికి, అలా చేయవద్దని అతని కొడుకు ఎలా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడో “మీకెందుకు?” కథ చెబుతుంది. కొడుకు ప్రతిపాదించిన మార్గం ఆచరణీయం.

సగటు మనిషికి కొత్త నిర్వచనం చెబుతుంది “సగటు మనిషి” కథ. చాలీచాలని సంపాదన ఉన్నవాడూ, సర్దుకుపోయేవాడు సగటు మనిషి కాదట… నిజాయితీగా ఉండాలని తాపత్రయపడేవాడే సగటు మనిషి అంటుందీ కథ. అటువంటి వారు సగటు మనుషులే మాత్రం కాదు, వారు మంచి మనుషులు! ఆస్తులు, ధనాలు శాశ్వతం కాదని, తోటి మనిషికి చేసిన సాయమే చిరకాలం నిలుస్తుందని చెబుతుందీ కథ.

తెలివైన అమ్మాయైనా, రోజూ స్కూలుకి వెళ్ళదని తెలుసుకున్న ఓ పారిశ్రామికవేత్త ఆ అమ్మాయికి స్కాలర్‌షిప్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఆ అమ్మాయి రోజూ బడికి ఎందుకు వెళ్ళదో కారణం తెలిసాక, మనసు భారమై, ఆ అమ్మాయికి సహాయం చేస్తాడు. అంతే కాదు, భవిష్యత్తులో ఆ అమ్మాయి ఉద్యోగస్తురాలై సంపాదించగలిగిన స్థితిలో ఉన్నప్పుడు మరో పేద విద్యార్థికి సాయం చేయలని షరతు విధిస్తాడు. సంతోషంగా ఒప్పుకుంటుందా అమ్మాయి. అది తీర్చుకోదగ్గ “ఋణం“!

అన్నీ సీరియస్ కథలే కాదు, “కవి సమయం”, “తాతా పెళ్ళి కావాలా”, “పబ్లిసిటీ”, “పీనాసి అతిథి” వంటి కొన్ని హాస్య కథలు కూడా ఉన్నాయీ సంపుటిలో. వాణిశ్రీ గారి కథనశైలి తేలికగా, ‘టు ది పాయింట్’ అన్నట్లు ఉంటుంది. గంభీరమైన వర్ణనలు, భారీ పదప్రయోగాలు లేకుండా సరళమైన వచనంతో హాయిగా చదివిస్తుంది. 218 పేజీల ఈ పుస్తకం వెల రూ. 99/-. రచయితే స్వయంగా ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. కినిగె.కాంలో ఈబుక్ లభ్యం.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2

 
 

నగరానికి నిండు నమస్కారం – “షహర్ నామా”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ****************** ప్రతీ ఒక్కరికీ తాము పుట్టి పెరిగిన ఊరి పట్ల కాస...
by అతిథి
0

 
 

కొత్త ముద్రలను వేసే ప్రయత్నం – ‘కాన్పుల దిబ్బ’

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ***************** ప్రముఖ రచయిత డా. చింతకింది శ్రీనివాసరావు గారి రె...
by Somasankar Kolluri
1

 

 

కనులలో తడి…. పెదాలపై నవ్వు – “పూర్వి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ *************** పొత్తూరి విజయలక్ష్మి గారు జగమెరిగిన రచయిత్రి. అద...
by Somasankar Kolluri
1

 
 

తొలితరం మహిళా పోరాట యోధులు – చిట్టగాంగ్ విప్లవ వనితలు

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************** దాస్య శృంఖలాలలో మగ్గుతున్న భరత భూమిని విముక్తం చ...
by Somasankar Kolluri
1

 
 

అంతశ్చేతనని తట్టి కుదిపే “బుచ్చిబాబు కథలు”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ *********** లబ్దప్రతిష్ఠులైన అలనాటి రచయితల కథలను నేటి తరానిక...
by Somasankar Kolluri
1