యూరోప్‌ని కళ్ళకు కట్టే యాత్రాకథనం “నా ఐరోపా యాత్ర”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
***********
చరిత్ర గురించిన జిజ్ఞాస, కొత్త ప్రదేశాలు చూడాలన్న ఉత్సాహం, తనకు తెలిసింది పదిమందికి చెప్పాలన్న ఆకాంక్షే తన పర్యటనలకు మూలమని వేమూరి రాజేష్ అంటారు. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా – యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశమైన పోలాండ్‌లో విధులు నిర్వహించడంతో – అక్కడ పనిచేసిన కాలంలో యూరప్‌లోని పలుదేశాల్లో పర్యటించి అక్కడి సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాలను అధ్యయనం చేశారు రచయిత. జర్మనీ, ఆస్ట్రియా, లిచెన్‌స్టైన్, స్విట్జెర్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో దాదాపు 4000 కిలోమీటర్లు తిరిగారు రచయిత. ఆ అనుభవాలకు ​“నా ఐరోపా యాత్ర​” పేరిట అక్షర రూపమిచ్చి ఆయా దేశాలలోని దర్శనీయ స్థలాలను, పర్యాటక ప్రదేశాలను చక్కగా వివరించారు, వింతలనూ విశేషాలను తెలియజేశారు. వీలైన చోట్ల ఛాయాచిత్రాలనూ అందించారు.

ఈ పుస్తకంలో ఇవి మాత్రమే ఉండుంటే ఇదొక మాములు టూరిస్ట్ గైడ్ అయి ఉండేది. అయితే – చరిత్ర పట్ల అనురక్తి, మానవీయ సంవేదన, స్వంత ఊరి పట్ల అభిమానం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై అవగాహన, ఉపయుక్తమైన సమాచారం, జనరల్ అబ్జర్వేషన్స్, స్నేహభావం – ఆత్మీయత అనే అంశాలు ఈ పుస్తకాన్ని ఓ చక్కని యాత్రాకథనంగా నిలిపాయి. వాటి గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తాను..

చరిత్ర పట్ల అనురక్తి:

అసలు రచయిత ఐరోపా పర్యటనకి ప్రేరణ ఎవరో తెలుసా? హిట్లర్. అవును… నాజీ నియంత హిట్లరే. కొంతమంది అవగాహనా రాహిత్యంతో – హిట్లర్‌ని ఒక హీరోగా, అతను చెప్పిన మాటలని కొటేషన్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యటం గమనించి విస్తుపోతారు రచయిత. ఓ నరరూప రాక్షసుడు ఈ తరానికి ఆదర్శమా? వీళ్ళు చరిత్రని తెలుసుకోవడం లేదా అనుకుంటారు.

అసలు హిట్లర్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అధికారం చేపట్టడం కోసం ఏం చేశాడు? యూదుల్ని ఎందుకు అంత క్రూరంగా చంపాడు? నాజీలంటే ఎవరు? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలు అవసరం అంటూ హిట్లర్ గురించిన వివరాలు, జర్మనీని ప్రపంచయుద్ధంలోకి లాగిన తీరు సవివరంగా చెప్పారు.
యూరప్‌లో పర్యటిస్తున్న సందర్భంగా – వెళ్ళిన ప్రతి దేశంలోనూ రెండవ ప్రపంచయుద్ధపు మారణ హోమానికి సంభందించిన గుర్తులను వెతికారు. వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ నాజీలు ఇక్కడికి వచ్చారా అని స్థానిక గైడ్‌లని అడిగి తెలుసుకున్నారు. కేవలం హిట్లర్ గురించి తెలుసుకోవటానికే ఆయన మూడుసార్లు జర్మనీలో ప్రయాణించారు. హిట్లర్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క యూదుల పట్ల సాగించిన మారణ హోమం పట్ల ఆవేదన పెల్లుబుకింది రచయితలో.

హిట్లర్ గురించి, రెండవ ప్రపంచ యుద్ధం గురించే కాకుండా, ఆయా దేశాలలోని రాచరిక వ్యవస్థను సైతం సందర్భానుసారంగా వివరించి చరిత్ర పట్ల తనకున్న అనురక్తిని పాఠకులతో పంచుకుంటారు. నాజీల దురంతాలని బాహ్య ప్రపంచానికి వెల్లడించిన అన్నే ఫ్రాంక్ గురించి పాఠకులకు సవివరంగా తెలియజేశారు.

మానవీయ సంవేదన:
రచయితకి సాటి మనుషుల పట్ల ఉన్న గౌరవం, మానవత్వం పట్ల ఉన్న విశ్వాసం ఈ యాత్రాకథనంలో కొన్నిసార్లు స్పష్టంగా, మరికొన్ని సార్లు అవ్యక్తంగా వెల్లడయ్యాయి.

రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా నాజీలు యూదులని చంపించిన పద్ధతులను చదువుల గురించి చెబుతూ చలించిపోతారు రచయిత. ఇంతటి దారుణాన్ని మానవాళి ఎలా సహించిందా అని వాపోతారు. ఎటువంటి శత్రుత్వం లేకుండా సాటి మనిషిని అత్యంత క్రూరంగా చంపగల మనస్తత్వాలని నాజీలకి హిట్లర్ ఎలా నూరిపోయగాలిగాడో అర్థం కాని విషయమని అంటారు. అస్విత్జ్ అనే ప్రదేశం చూశాక – ఆయనకి అసంకల్పితంగానే కన్నీరు ముంచుకొస్తుంది. అంతు తెలియని వేదన ఏదో ఉదాసీనుడిని చేస్తుంది. అసలు ఈ ప్రాంతం చూడకుండా ఉంటే బావుండేది అనిపిస్తుంది. తోటి మనుషుల్ని చంపటానికి మనుషులే నిర్మించిన ఆ సువిశాల మరణ ప్రాంగణం ఎన్ని రోదనలని భరించిందో, ఎంతమంది పసివాళ్ళ ప్రాణాలు గ్యాస్ చాంబర్ల ఆకలికి బలై పోయాయో తలుచుకునప్పుడల్లా గుండె బరువెక్కిపోతుందని చెబుతారు.

పుస్తకంలోని ఈ వాక్యాలు చదువుతుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది, స్వయంగా కళ్ళారా చూసిన రచయిత పరిస్థితిని మనం అర్థం చేసుకోగలం.
పోలాండ్‌లోని క్రాకో అనే ఊర్లో ఓ పర్వతాన్ని అధిరోహించడం కోసం క్యూలో నిలుచున్న సందర్భంగా అక్కడ రాగితో చేసిన చిత్రమైన ఆకారాలను చేసి అమ్మజూపుతున్న ఓ వృద్ధుడికి సాయం చేయడం కోసం వాటిని తను కొనడమే కాకుండా, తన తోటివారితో కూడా కొనిపించడం మరో దృష్టాంతం.
నెదర్లాండ్స్‌లోని ఎగ్మొండ్ అనే ప్రాంతంలో విడిది చేసిన హోటల్‌లో పని చేస్తున్న కుర్రాడితో సంభాషించి అతని జీవనశైలిని మనకి పరిచయం చేస్తారు. ఇక్కడ లభించే జీతంలో తన చదువు ఖర్చులని తానే భరిస్తున్నానని చెబుతాడా కుర్రాడు. ఈ అబ్బాయిని గురించి తెలుసుకోడం ప్రేరణనిస్తుంది.

స్వంత ఊరి పట్ల అభిమానం:

తమ ఊరి చరిత్రని పరిరక్షించడం కోసం ఎంతో పరిశోధన చేసి ఓ వెబ్సైట్ రూపొందించారు. 1923లో ఘంటసాల గ్రామంలో ఒక రైతు పొలం దున్నుతుండగా పాలరాతి శిల్పాలు బయట పడ్డాయని, అప్పట్లో ప్రజలకు అవగాహన లేక దొరికిన ఇలాంటి శిల్పాలన్ని అక్కడక్కడా గుట్టలుగా వేసి పెట్టేవాళ్ళని చెబుతారు. 1927 లో పారిస్ నుంచి వచ్చిన డూబ్రి యెల్ అనే చరిత్ర పరిశోధనకారుడు వాటిని సేకరించి పారిస్‌లోని గుయ్ మెట్ మ్యూజియంకి తరలించాడట. వెబ్సైట్‌లో ఆ సమాచారం రాసేటప్పుడు కూడా అదొక విషయం లాగే అనుకున్నాను తప్ప ఎప్పుడూ పారిస్ వెళ్లి చూస్తానని అనుకోలేదంటారు.

ఐరోపా యాత్రలో భాగంగా పారిస్ వెళ్ళినప్పుడు ఈ మ్యూజియాన్ని సందర్శించి, అక్కడున్న తమ గ్రామం శిల్పాలను చూసి పొంగిపోతారు. మన సంపదని మనం భద్రపరుచుకోలేకపోయామే అని బాధపడినా, ఓ రకంగా ఆ శిల్పాలు అక్కడ ఉండటమే సరైనదని, దేశ విదేశాలనుంచి వచ్చే లక్షల మంది యాత్రికులు ఆ మ్యూజియాన్ని సందర్శిస్తారు, వారంతా తమ గ్రామాన్ని గురించి తెలుసుకుంటారు కదా అని ఒకింత గర్వంగా భావిస్తారు.

ఆర్థిక వ్యవస్థలపై అవగాహన:

సింగిల్ కరెన్సీ పద్ధతిపైనా, ప్రపంచీకరణపైనా రచయితకి స్పష్టమైన అవగాహన ఉంది. ఐరోపా సమితి బలవంతంగా యూరోని అన్ని దేశాలమీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని చెబుతూ, ఏకీకృత నగదు విధానం మంచిదే అయినా, దానిని అమలుచేయడంలో పాటించిన విధానాలు, కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలని పతనం చేశాయని అంటారు. ఉదాహరణగా గ్రీసు దేశం ఉదంతాన్ని వెల్లడిస్తారు.

కరెన్సీల మధ్య వ్యత్యాసం ఉంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుందో చెబుతారు. యూరప్ దేశాల ప్రజలు ఎక్కువ విహారాన్ని ఇష్టపడతారని, సెలవలు వస్తే ఇతర దేశాలకి వెళుతూ ఉంటారని, అన్ని దేశాలకి ఉన్న ప్రధాన ఆదాయ వనరు టూరిజమనీ చెబుతారు. అన్ని దేశాలలో యూరో కరెన్సీ ఉంటే ఒక దేశం అవలంబించే ఆర్థిక విధానాల వల్ల మాంద్యం ఏర్పడితే ఆ ప్రభావం యూరో మీద పడి యూరో చలామణిలో ఉన్న మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపుతుంది. కరెన్సీలో వ్యత్యాసం ఉంటే ఏదైనా దేశం ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు ఆ దేశపు కరెన్సీతో యూరో మారకం విలువ పెరుగుతుంది. యూరో చలామణిలో ఉన్న దేశస్తులు చవకగా వినోదం పొందటానికి ఆ దేశానికి వెళతారు. తద్వారా ఆ దేశం సంక్షోభం నుండి సునాయాసంగా గట్టేక్కవచ్చు అని అంటారు.

ప్రపంచీకరణ మొదలయ్యాక కొన్ని ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా ఒకేరకంగా అన్పిస్తాయని చెబుతారు. షాపింగ్ మాల్ ఫార్మాట్ అంతా అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటుందంటారు. హైదరాబాదులో చూసిన షాపింగ్ మాల్స్‌కి ఇతర దేశాలన్నిటిలో చూసిన షాపింగ్ మాల్స్‌కి ఎక్కడా తేడా లేదు. భారత దేశంలో ఉన్న పేరొందిన మౌలిక సదుపాయాల కల్పన కంపెనీలన్నీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులని నిర్మిస్తుండటంతో, ఆధునిక నిర్మాణాలలో మిగతా దేశాలలో నిర్మాణాలకి, మన వాటికి పెద్ద తేడా కనిపించదు. అందుకే వార్సాలో ఓ మాల్ చూస్తున్నంత సేపు తనకు ఏ జివికె లోనో, ఇనార్బిట్ మాల్ లోనో ఉన్నట్లే ఉందంటారు రచయిత.

ఉపయుక్తమైన సమాచారం:
ఈ పుస్తకంలో సందర్భానుసారంగా అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని అందించారు రచయిత.

ఫ్రాన్స్ దేశం సందర్శించినప్పుడు – అంధులు చదవగలిగేలా చేసిన లూయిస్ బ్రైలీ గురించి, అతను కనుగొన్న లిపి గురించి తెలియజేస్తారు. నెదర్లాండ్స్ దేశం వెళ్ళినప్పుడు, గే వివాహం చేసుకున్న ఆ దేశాధ్యక్షుడు గురించి చెబుతారు. లక్సెంబర్గ్ లో ఉన్నప్పుడు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోడం కోసం ఏర్పాటు చేసే స్యూట్‌కేస్ కంపెనీల గురించి ప్రస్తావిస్తారు. చెక్ రిపబ్లిక్ సందర్శించినప్పుడు – ఆ దేశానికీ, హైదరాబాద్ నగరంలోని ఓ కాలనీకి ఉన్న సంబంధాన్ని చెబుతారు. ఇంకా ఆయా దేశాలకి సంబంధించి ఉపయుక్తమైన, విలువైన సమాచారాన్ని ఈ రచనలో పొందుపరిచారు.

జనరల్ అబ్జర్వేషన్స్

యూరప్‌లోని వివిధ దేశాలలోని పరిస్థితుల గురించి, అక్కడి మనుషుల గురించి, పద్ధతుల గురించి కొన్ని పరిశీలనాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆయా దేశాలలో జరిగిన అభివృద్ధికి, మన దేశంలో జరుగుతున్న అభివృద్ధి లోని వ్యత్యాసాలను ప్రస్తావించారు. ప్రజల ప్రమేయం లేని ఏ అభివృద్ధి పనులైనా విజయవంతం కావని, తమ ప్రాంతాల బాగు కోసం స్థానికులే పూనుకుంటే ఫలితాలు గొప్పగా ఉంటాయని భావిస్తారు రచయిత.

దేశమూ, ప్రజలు అభివృద్ధి చెందాలంటే – ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుకోకుండా – ముందు మనం చెయ్యగలిగింది చేస్తే మిగతావన్నీ కలిసి వస్తాయని అంటారు.

స్నేహభావం, ఆత్మీయత:

విదేశాలలో నివేశించేడప్పుడు స్థానికులతో మమేకం అవడం, తోటి భారతీయులను మంచి సంబంధాలు ఏర్పర్చుకోవడం అక్కడ గడిపిన కాలాన్ని మధురంగా మారుస్తుంది. జరిగిన సంఘటనలనూ, ఎదురైన సందర్భాలను అందమైన అనుభూతులుగా మార్చుకోవాలంటే స్నేహభావం, ఆత్మీయత ఎంతో అవసరం. అవి రచయితలో పుష్కలంగా ఉన్నాయని నిరూపిస్తుంది ఈ పుస్తకం. శశి, మార్చిన్ క్రదోహ, కాషా, మాక్సిమ్ – ఈ పుస్తకం ఈ పేర్లు చాలాసార్లు తారసపడతాయి. వీరి స్నేహం గురించి రచయిత వివరించిన తీరుకు పాఠకులకు కూడా ఆ వ్యక్తులు సుపరిచితులవుతారు.

ముగింపు:

?
రచయిత రాజేష్

యూరప్ దేశాల పర్యటన గురించి మాత్రమే కాకుండా, ఈ పుస్తకంలో అదనంగా దుబాయ్, కువైట్, ఒమాన్ దేశాల గురించీ వివరించారు.

ఈ రచనని ముగిస్తూ, “నిన్న రాత్రి వచ్చిన పీడకల తలుచుకుంటూ ఈ రోజు పడుకోకుండా ఉండలేము. ఎంత మంచి కల వచ్చినా అందులోనే ఉండిపోయి నిద్ర లేవకుండా ఉండలేము. మనిషి గమనమైనా అంతే, ఎక్కడా దేనికోసం మనం ఆగలేము. మనకోసం ఏదీ ఆగదు. వుయ్ జస్ట్ మూవ్ ఆన్ అంతే.” అంటారు. అందమైన రచనని మరింత అందంగా ముగించడమంటే ఇదే! “Take nothing but memories, leave nothing but foot prints” అన్న కొటేషన్‌ని అన్వయించుకుంటూ ఆయా దేశాల పర్యటనలో తాను పొందిన అనుభూతులను పాఠకులతో పంచుకునే ప్రయత్నం చేశారు రచయిత.

కవర్ పేజీ అందంగా ఉంది. ముద్రణ బావుంది. ఈ పుస్తకం కొన్నందుకు, చదివినందుకు పాఠకుల డబ్బు, సమయం వృథా కావనే నా అభిప్రాయం.
184 పేజీలున్న ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభిస్తుంది. వెల రూ.150/- ఈబుక్ కినిగెలో లభిస్తుంది.

You Might Also Like

Leave a Reply