తప్పించుకోలేని ప్రభావాల నుంచి పుట్టిన కథల సంపుటి “మనోవీథి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
***************
ప్రముఖ రచయిత్రి శ్రీమతి దాసరి శిరీష గారి తొలి కథాసంపుటి “మనోవీథి“. గత మూడు దశాబ్దాలుగా ఆవిడ వ్రాసిన కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. కథకురాలిగా కన్నా, తనని తాను ఓ మంచి పాఠకురాలిగా చెప్పుకుంటారామె. ముందుమాటలో కాత్యాయని గారన్నట్లు – మంచి సాహిత్యం ఆవిడకందించిన విలువలని తన రచనల్లోకీ, జీవితంలోకి అనువదించుకోవాలని తపన పడతారు శిరీషగారు. ఆ తపనలోంచి పుట్టినవే ఈ కథలు.

సమాజంలో జరుగుతున్న ఘటనలు, వాటి ప్రతిస్పందనలతో సంబంధం లేదంటూ ఊరుకోలేని వ్యక్తులు వివిధ రకాలుగా కార్యాచరణకి దిగుతారు. కొంతమందిది ప్రత్యక్ష కార్యాచరణ అయితే, మరికొందరిది పరోక్ష సహకారం. సమాజంలోని రుగ్మతలకు మందుని సాహిత్యం ద్వారా అందించడానికి ప్రయత్నిస్తారు కొందరు. సమాజం పట్ల తన బాధ్యతగా శిరీషగారు వెలువరించిన కథలు ఇవి. ఈ కథలు మన కథలు. మనం బ్రతుకుతున్న సమాజపు కథలు. మనం తప్పించుకోలేని ప్రభావాల నుంచి పుట్టిన కథలు. ఈ సంపుటిలోని కథల గురించి తెలుసుకుందాం.

వర్గ వైషమ్యాలు నరనరాల్లో జీర్ణించుకుపోయిన వ్యక్తులు తమ స్వీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుని ఎలా ప్రవరిస్తారో చెబుతుంది “సరిహద్దులు” కథ. అందరికీ విద్య అనే లక్ష్యం ఇంకా ఎందుకు నెరవేరడంలేదో ఈ కథ చెబుతుంది. కార్పోరేట్ స్కూళ్ళు సాధారణ ప్రజలని ఎలా మోహానికి గురిచేస్తాయో ఈ కథ చదివితే తెలుస్తుంది.

జీవితంతో నిత్యం యుద్ధం చేస్తూ బ్రతికే వ్యక్తిని ఓదార్చి, జీవితం పట్ల మళ్ళీ ఆశ చిగురించేలా చేస్తాడతని మిత్రుడు. అద్భుతమైన సాహిత్యం, పాటలతో పాటు – జీవితంలో ఎంతో విషాదాన్ని మోస్తున్నా కూడా వర్తమానంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించే స్నేహితుడి జీవనవిధానం చంద్రాన్ని కదిలిస్తాయి. జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతాడు – “జీవితమంటే…?” కథలో.

పైకి ఆదర్శాలు చెబుతూ, నిజ జీవితంలో వాటినే మాత్రం పాటించని వ్యక్తులకు సమాజంలో కొదవేమీ లేదు. చిత్తశుద్ధీ, సామాజిక బాధ్యత వంటి వాటిని పట్టించుకోకుండా, కేవలం ఇగోని తృప్తి పరచుకోడం కోసమే వ్రాసే ఓ రచయిత ప్రథమ బహుమతి కోసం ఏం చేస్తాడు? తన మాజీ స్నేహితురాలిని ఇంప్రెస్ చేయడం కోసం రాసిన ఆ కథ ఎటువంటి పరిణామాలకి దారి తీసింది? ఆ కథని ఆమె ఆమోదించిందా? తెలుసుకోవాలంటే – “ఇది కాదు ముగింపు” చదవాలి.

విలువలపై సమాజంలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకరి విలువలు మరొకరికి అసమంజసంగానూ, తర్కరహితంగానూ అనిపిస్తాయి. ఓ వ్యక్తి ఉన్నతంగా భావిస్తున్న నైతిక విలువలన్నీ ఒక మహిళ తన బ్రతుకు పోరాటం గురించి ఇచ్చిన వివరణ ముందు ఎలా వెలవెలబోయాయో తెలుసుకునేందుకు “మిస్టీరియస్ వాల్యూస్” కథ చదవాలి.

DSPhotoసమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో తన వైవాహిక జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఒంటరిగా సమాజాన్ని ఎదుర్కునే ఓ అమ్మ కథ “ఈ దేశంలో తల్లి“. విప్లవదళంలో అజ్ఞాతంగా ఉన్న భర్త మరో పెళ్ళి చేసుకున్నా చలించకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేసి సమాజానికి ఉపకరించేలా తీర్చిదిద్దుతుందా తల్లి.

చైల్డ్ అబ్యూస్‌కీ, వ్యవస్థ సృష్టించిన సంక్షోభాన్ని తట్టుకోలేక జనించే నిస్సహాయతకీ బలైన మాణిక్యం గురించి, కుటుంబ సభ్యులు సున్నితమైన మానవ స్పందనలను కోల్పోతున్న వైనం గురించి తెలిపిన కథ “సమిధలు“.

ఇద్దరు వ్యక్తులు ప్రేమికులుగా ఉన్నప్పడు, భార్యభర్తలుగా మారిన తర్వాత వాళ్ళలో ఏం మార్పులు వచ్చాయో; ఏం పొందారో, ఏం కోల్పోయారో చెప్పే కథ “నిదురించిన హృదయాలు“.

జీవితంలో ఎంతవరకు రాజీ ధోరణి అవలంబించవచ్చో, భరించలేని స్థితి వచ్చినప్పుడు బంధాల నుండి విడివడి తమ జీవితాలను ఎలా గెలుచుకోవచ్చో చెప్పే కథలు – “మరో మలుపు“, “మనోవీథి“.

నిస్సహాయులకు సాయం చేద్దామని ప్రయత్నించే సంస్థల ప్రయత్నాలకు అటువంటి నిస్సహాయుడే ఎందుకు ఆటంకం కలిగించాలని చూశాడో చెప్పే కథ “నీలి నీడలు“.

ప్రేమలో విఫలమయ్యానని కృంగిపోయి దిగులు పడుతూ కూర్చున్న యామిని మనోభారాన్ని తొలగించి, కొత్త ఉత్సాహాన్ని కలిగించి జీవితంపై ఆశలు రేకెత్తిస్తుంది ప్రభ. ప్రేమతోనే సరికొత్త లోకాన్ని నిర్మించవచ్చని చెబుతుంది. చదవండి “కల కానిది” కథ.

ఆప్యాయతలు, అనురాగాల మధ్య పెరిగిన ఓ కుటుంబంలోని పిల్లలు – విలువ పెరుగుతున్న ఆస్తుల మోహంలో పడి, తమ ఇంటిని అమ్మేద్దామని తల్లిని ఒత్తిడి చేస్తే – ఆమె ఏం చేసింది? మానవ సంబంధాలు దశల వారీగా ఎంత విచిత్రంగా మారిపోతాయో చెప్పే కథ “తరంగాలు“.

డిగ్నీటీ ఆఫ్ లేబర్“, “సుఖం“, “హృదయగీతం” కథలు ఆసక్తిగా చదివిస్తాయి.

సామాజిక ప్రయోజనాన్ని ఆశించి, నిబద్ధతతో చేసిన రచనలు ఈ కథలు. 102 పేజీల ఈ పుస్తకం వెల రూ. 100/-. ‘ఆలంబన ప్రచురణలు’ వారు ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. కినిగె.కాంలో ఈబుక్ లభ్యం. కినిగె నుంచి ప్రింట్ బుక్ కూడా తెప్పించుకోవచ్చు.

You Might Also Like

Leave a Reply