రచయిత్రి ఓల్గా తో సంభాషణ -1

‘ప్రతి అస్తిత్వాన్నీ గుర్తించి గౌరవించటమే స్త్రీవాదం ప్రత్యేకత’
(విముక్తి మార్గాన స్వేచ్ఛా ప్రస్థానంలో ప్రముఖ రచయిత్రి ఓల్గా తో సంభాషణ )

ఇంటర్వ్యూ : ఎ.కె.ప్రభాకర్

(ఈ ఇంటర్వ్యూ మొదట పాలపిట్ట పత్రికలో వచ్చింది. పుస్తకం.నెట్ కి పంపినందుకు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు)
******************
రష్యన్ నది ఓల్గాని మీ కలం పేరుగా మార్చుకొన్నారని చాలా మంది అనుకొంటారు. లలిత గంగగానో కావేరిగానో గోదావరిగానో కాకుండా ఓల్గాగా రూపొందడానికి కారణం? ఇంతకు ముందు చెప్పిందే కావొచ్చు – మళ్ళీ పాలపిట్ట పాఠకుల కోసం …

1940 వ దశాబ్దం భారతదేశం వందేమాతరంతో ఎంతగా ప్రతిధ్వనించిందో ‘గర్జించు రష్యా’తో కూడా అంతే ప్రతిధ్వనించింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సోవియట్ యూనియన్ నాజీలకు మంచి ప్రతిఘటనిచ్చింది. స్టాలిన్ నాయకత్వంలో రెడ్ ఆర్మీ విజయగాథలు భారతదేశం మారుమూల ప్రాంతాల్లో కూడా విన్పించాయి. ఆ రెడ్ ఆర్మీ సభ్యురాలు ఓల్గా అనే మహిళ 1946 ఏప్రిల్ 7 న మరణించింది. అదేరోజు మా నాన్నకు పెద్దమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి ఓల్గా అనే పేరు పెట్టుకున్నారు. తర్వాత నాలుగేళ్ళకు ( 1950 నవంబర్ 27 న) నేను పుట్టాను. మా అక్కా నేనూ మంచి స్నేహితుల్లా పెరిగాం. మా కుటుంబం దురదృష్టం ఏంటంటే మా అక్క తన 21 వ ఏట నా 16వ ఏట చనిపోయింది. అప్పుడప్పుడే కవితలు రాస్తున్న నేను నా కలం పేరుగా మా అక్క పేరు పెట్టుకుని అప్పటి వరకూ ఇద్దరు స్నేహితుల్లా ఉన్న మేం ఒకే వ్యక్తిగా మారిపోవాలనుకున్నాను.

తర్వాత తర్వాత నా రచనా వ్యాసంగం పెరిగే కొద్దీ నా అసలు పేరు లలిత – లలిత కుమారి అని ఎవరికీ తెలియనంతగా నేను ఓల్గానైపోయాను. ఇప్పుడు మా ఇంట్లో తప్ప నన్నెవరూ లలితా అని పిలవరు. అలా మా అక్కను సజీవం చేసుకున్నాను. ఇది వ్యక్తిగత విషయమే అయినా అందులో రాజకీయాలు కూడా ఇమిడి ఉండటంతో ‘వ్యక్తిగతం కూడా రాజకీయమే’ అన్న నా స్త్రీవాద సిద్ధాంతానికి సరిగా సరిపోయింది.

అంటే మీ కటుంబ నేపథ్యమే కమ్యూనిస్టు నేపథ్యం అన్నమాట!

అవును. మా నాన్నగారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యులు. 1964లో పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత ఆ రాజకీయాలకు దూరమయ్యారు. కానీ చిన్నప్పటినుంచీ మా ఇంట్లో లెనిన్ స్టాలిన్ చిత్రపటాలు – గాంధీ నెహ్రూల కంటే ఎక్కువగా – చూసేదాన్ని. సోవియట్ సాహిత్యం ఇంటి నిండా ఉండేది. అభ్యుదయ రచయితల రచనలు చేతికి అందుబాటులో ఉండేవి. ఆ రకంగా వామపక్ష ఆలోచనా బీజాలు చిన్నతనంలోనే నాలో బలంగా నాటుకున్నాయి.

విద్యార్థిగా విద్యార్థి సంఘాల్లో – వామపక్ష రాజకీయాల్లో పాలుపంచుకొన్నారా?

నాకు వామపక్ష విద్యార్థి ఉద్యమంతో మొదటి పరిచయం విశాఖ ఉక్కు ఉద్యమం సమయంలో(1967). అప్పుడు నేను 11వ తరగతి – గుంటూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో – చదువుతున్నాను. ఆ ఉద్యమంలో విద్యార్థులు చేసిన పోరాటం , వాళ్ళ త్యాగాలూ నన్ను తీవ్రంగా ఆకర్షించాయి. ఆ సంవత్సరం మా వూరు యడ్లపాడు దగ్గర తుమ్మలపాలెంలో జరిగిన అమరవీరుల సంస్మరణ సభలకు వెళ్ళాను. ఆ సభలను తుమ్మలపాలెం తిరణాల అనేవాళ్ళు. అక్కడ కొందరు SFI విద్యార్థి నాయకులతో పరిచయమైంది. ముఖ్యంగా మా నాన్నగారి స్నేహితుడు దండా నారాయణస్వామి గారి అమ్మాయి అరుణ పరిచయమైంది. ఆమె నా కంటే రెండేళ్ళు పెద్దది. అప్పటికే SFI లో పనిచేస్తుంది. ఆమె ప్రోద్బలంతో నేను SFI లో చేరాను. అప్పుడు గుంటూరి SFI ఎంతో రాజకీయ అవగాహనతో పోరాట పటిమతో ఉండేది. మోటూరి హనుమంతరావు గారి అమ్మాయి ఉష గుంటూరు మెడికల్ కాలేజి లో చదువుతూ ఉండేది. ఆమె మావో ‘వైరుధ్యాలు’ (On Contradiction) చాలా బాగా చెప్పేది. డా.చాగంటి భాస్కర్ రావు , డా.మల్లికార్జునుడు ఇంకా అనేకమంది నిరంతరం మార్క్సిజం అధ్యనంలో , దాన్ని సమకాలీన సమాజానికి అన్వయించటంలో మునిగి తేలేవారు. వాళ్ళంతా నాకు రాజకీయ గురువులు. 68లో తరిమెల నాగిరెడ్డి గారి ఉపన్యాసం వినటం నా జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతి.

ఆ తర్వాత గుంటూరు జిల్లా SFI మొత్తం శ్రీకాకుళం వైపు మొగ్గు చూపింది. నా రాజకీయ గురువులు అక్కడ ప్రాణాలర్పించారు. చాల చురుగ్గా పనిచేసిన అయిదుగురు అమ్మాయిలం మాత్రం గుంటూర్లోనే ఉండిపోయాం. ఆ తర్వాత విరసం ఏర్పడుతున్నప్పుడు నాకు పార్టీతో కాంటాక్ట్ దొరికింది. నేను అప్పుడు గుంటూరు ఎ. సి. కాలేజీలో బియ్యే ఫైనల్ యియర్. విశాఖలో శ్రీ శ్రీ షష్టి పూర్తి జరిగింది. ఆ సభలకు నేనూ నా స్నేహితురాలు ఆదిలక్ష్మీ కలిసి వెళ్ళటం, ‘రచయితలారా మీరెటు వైపు?’ అన్న విశాఖ విద్యార్థుల పిలుపు వినటం , తర్వాత విరసం ఏర్పడినప్పుడు మొదటి మహాసభలకు ఖమ్మం వెళ్ళటం , విరసంలో సభ్యత్వం తీసుకోవటం వరసగా జరిగిపోయాయి.

ఆ కాలంలో మీ సాహిత్య వ్యాపకాలు యెలా వుండేవి? వాటిపై ప్రభావాలేవి?

నేను చిన్నప్పటి నుండీ సాహిత్యం బాగా చదివేదాన్ని. ఏ సాహిత్యమైనా చదివేదాన్ని. అన్ని రకాల కవిత్వాన్నీ ఇష్టపడేదాన్ని. నిజానికి SFI లో పనిచేస్తూ నేను రాసిందంతా ప్రేమ కవిత్వం. నేను SFI లో మాట్లాడే రాజకీయాలకీ ప్రేమ కవిత్వానికీ ఎలా ముడిపెట్టాలో నాకే అర్థం కాలేదు. కానీ రాసేదాన్ని. వాటిని ఎవరికీ చూపించలేదు. చూపిస్తే నవ్వుతారని భయం. శ్రీకాకుళోద్యమం మొదలయ్యేసరికి అన్నీ చించి పారేశాను. అయితే నేనూ నా స్నేహితురాలు ఆదిలక్ష్మీ ఎ . సి కాలేజి లైబ్రరీ లో సాహిత్యం మొత్తం చదివేశాం – ఇంగ్లీషు తెలుగు కూడా. డిగ్రీలో నా గ్రూప్ తెలుగు – ఇంగ్లీష్ – హిస్టరీ. దేవీప్రియ నా సహాధ్యాయి. ఆయన అప్పటికే పద్యాల్లో కవిత్వం రాస్తుండేవాడు. ఆయన స్నేహితులు సుగంబాబు , కిరణ్ బాబు , కమలాకాంత్. వీళ్ళంతా మా ఇంటికి వచ్చేవాళ్ళు. సాహిత్య చర్చలు చేస్తుండేవాళ్ళు. దిగంబర కవిత్వాన్ని ఆసక్తిగా చదివేవాళ్ళం. మేమంతా కలిసి రాసిన కవితలతో ఒక సంకలనం తీసుకువచ్చేం – ‘యుగసంగీతం’ పేరుతో. మేం అయిదుగురం కల్సి ‘పైగంబర కవులు’ పేరు పెట్టుకున్నాం. ఆ ఊపులోనే ‘యుగసంకేతం’ అన్న సంకలనం కూడా తెచ్చేం. ఇంతలో విరసం ఏర్పడటంతో పైగంబర కవిత్వం పక్కకు వెళ్ళింది.

విరసంలో వుండగా మీ రచనా వ్యాసంగం …

విరసంలో మొదటి మహాసభల నుండీ నాలుగో మహాసభల వరకూ ఉన్నాను. ఈ కాలంలో నేను రచనలు చేయటం కంటే కార్యకర్తగా పనిచేయటం మీద ఎక్కువ దృష్టిపెట్టాను. ‘మనకంటే చాలా బాగా రాసేవాళ్ళున్నారు – వాళ్ళనూ వాళ్ళ కవిత్వాన్నీ ప్రజల దగ్గరకు తీసుకెళ్లటం మా పని అనుకునేదాన్ని. పౌరహక్కుల ఉద్యమంలో కూడా పని చేస్తుండటం వల్ల రచనకు సమయం కూడా తక్కువ ఉండేది. అయినా ఆ కాలంలో నేను రాసిన ‘జైలుగది ఆత్మకథ’ మంచి కథగా నేను భావిస్తాను. అలాగే గుంటూరు విరసం సభలు (1972) జరిగినప్పుడు ‘పంచాది నిర్మల వారసురాలు’ అన్న నా కవితను శ్రీ శ్రీ , కొ కు , రావిశాస్త్రి లాంటి ప్రముఖులు మెచ్చుకోవటంతో చాలా గర్వంతో విర్రవీగిపోయాను. అప్పుడది సహజం అనుకుంటా. తర్వాత ‘జీవనాడి’ పత్రికకు కవితలు అప్పుడప్పుడూ రాశాను. ముఖ్యంగా సమావేశాలు ఏర్పరచటం, ఉపన్యాసాలు ఇవ్వటంతోనే కాలం గడిచిపోయేది.

విరసం నుంచీ బయటకి రావడానికి – రాజకీయ కారణాలు కాక యితరేతరమైన ప్రత్యేక కారణాలు యేమైనా ఉన్నాయా? నిర్మాణ చట్రాలు మీ స్వేచ్ఛకేమైనా ఆటంకంగా అనిపించాయా?

విరసం నుంచి బయటకు రావటానికి ప్రధానంగా పనిచేసింది రాజకీయ కారణాలే. విరసం రెండవ మహాసభల తర్వాత విరసం లోపల రెండు గ్రూపుల – చారు మజుందార్ , నాగిరెడ్డి – రాజకీయాలు రచయితల్లో స్పష్టంగా బయటకు కనిపించటం , వాటి మీద చర్చలు జరగటం మొదలైంది. మూడవ మహాసభల నాటికి టి.యెన్. గ్రూప్ నుండి , విరసంలోని కొన్ని ధోరణులను విమర్శిస్తూ సరిచేస్తూ ‘ఓల్గా డాక్యుమెంట్ ‘ పేరుతో ఒక డాక్యుమెంట్ ని పార్టీ వైపు నుంచి ప్రవేశపెట్టారు. దాంతో ఆ విభేదాలు ఇంకా బహిరంగమయ్యాయి. నాల్గవ మహాసభల నాటికి ఇక రెండు గ్రూప్ ల రచయితలు కలసి పనిచేయలేని పరిస్థితి వచ్చింది. టి యెన్ గ్రూప్ రచయితలమందరం బయటకు వచ్చేశాం.

ఇది ఇలా ఉంచితే విరసం లో పని చేయటం నాకు రెండు రకాలైన అనుభవాలను ఇచ్చింది. మొదటిసారి విరసం మహాసభలకు వెళ్ళినప్పుడు మహామహులైన , ప్రసిద్ధికెక్కిన రచయితల సమూహాన్ని చూసి ఆనందాశ్చర్యాలతో నిలబడి పోయాను. ఆ సమూహంలో నేనొక్కదాన్నే స్త్రీనని స్పృహ కలిగింది. వాళ్ళ ఆలింగానాలు, కరచాలనాలు , భుజాల మీద చేతులు వేసుకునే స్నేహ ప్రకటనలు వీటన్నిటికీ ఎడంగా నిలబడటం నాకు ఏదో ఒంటరి భావనను కలిగించింది. అయితే అప్పుడు – ‘స్త్రీని అవటం వల్ల ఇదంతా జరిగింది ; స్త్రీలు ఎక్కువ లేకపోవటం వల్ల ఇలా అనిపిస్తుందిలే’ అనుకున్నాను. క్రమంగా నేను స్త్రీనని మర్చిపోయి పని చేస్తే తప్ప వీళ్ళతో మమేకం కాలేను అనుకోవటం మొదలుపెట్టాను. నిజంగానే కొన్నేళ్ళ పాటు నేను స్త్రీనని మర్చిపోయి పనుల్లో మునిగిపోయాను. కానీ ఒకటి రెండు అనుభవాల్లో స్త్రీనని నేను మర్చిపోయాను కానీ మిగిలినవాళ్ళు మర్చిపోలేదని అర్థమైంది. అప్పుడు లోపం నా స్త్రీత్వానిది కాదు; దానిని అర్థం చేసుకోలేని పురుష నైజానిది అని తెలుసుకున్నాను. క్రమంగా స్త్రీగా నన్ను నేను , నా అస్తిత్వాన్నీ వెతుక్కోవటం మొదలుపెట్టాను. ఇదంతా నాలో జరిగిన అంతర్మథనం.

అయితే విరసంలో అందరూ నన్ను చాల గౌరవంగా అభిమానంగా చూసేవారు. పెద్దవాళ్ళు ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఒక పితృవాత్సల్యం లాంటి ‘పెద్దతరహా’ ధోరణి. అయితే నన్ను ఒక ఇంటలెక్చువల్ గా గుర్తించటానికి వాళ్లకు ఇబ్బంది అనే విషయం నాకు తెలిసొచ్చింది. కార్యవర్గ సమావేశాల్లో నేను చాలా పుస్తకాలు అధ్యయనం చేసి తీర్మానాల మీద మాట్లాడితే భయంకరమైన మౌనం. ఆ విషయం అక్కడితో ఆపి తర్వాతి తీర్మానానికి వెళ్ళిపోయేవారు. నాకు చాలా అవమానం అనిపించేది. అలాగే ఒకసారి జనరల్ బాడీ సమావేశంలో నేను ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గే సరికి నేను ఎంతో గౌరవించే నాయకుడు ‘ఓల్గా అమ్మాయి కాబట్టి ఓట్లు అటు పడ్డాయి’ అని వ్యాఖ్యానం చేసే సరికి కుంగిపోయాను. ముఖ్యంగా ఈ రెండు సంఘటనలు విరసంలో నన్ను బాధించేయి. మిగిలినదంతా చాల స్నేహపూరితమైన వాతావరణం. స్త్రీలను మేధావులుగా గుర్తించటమనేది ఎవరికైనా కష్టమే. వీలైనంత వరకూ గుర్తించకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు అన్న విషయం ఇప్పుడు కూడా అనుభవం అవుతూనే ఉంది.
నిర్మాణ చట్రాలు రచనా స్వేచ్ఛకు ఆటంకం అని నాకెప్పుడూ అనిపించలేదు.

ఎమర్జెన్సీ తర్వాత జనసాహితి ఏర్పడింది. అందులో చురుగ్గా పని చేస్తూ ఉన్నాను. 1979 మే లో చలం గారు వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా ఒక తీర్మానం చేశాం. అయితే ఆ తీర్మానంతో జనసాహితి వెనక ఉన్న రాజకీయ పార్టీకి అంగీకారం లేదు. దాంతో ఆ తీర్మానం సరి కాదని విమర్శ పెట్టారు. ఒక రచయిత గురించి ఒక రచయితల సంఘం చేసిన తీర్మానం మీద రాజకీయ పార్టీ అధికారం ఏంటో ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్య సంస్కృతికి అర్థం లేదనిపించింది. దాంతో ఆ విషయంలో మొదలైన రగడ మళ్ళీ కొంతమంది జనసాహితి నుంచి బయటకు వచ్చే దాకా సాగింది.

మరి స్త్రీవాద రాజకీయాల వైపు ప్రయాణం ఎప్పుడు మొదలైంది?

1980 లో జనసాహితి నుండి బయటకు వచ్చాకా నేను ఒంటరిగా మిగిలిపోయాను. అప్పటివరకూ నా చుట్టూ ఉన్న రాజకీయాలలో ఆధిపత్య ధోరణుల గురించీ ముఖ్యంగా పురుషాధిపత్య ధోరణుల గురించి ఆలోచించటం మొదలు పెట్టాను. ఇన్ని ఉద్యమాలలోనూ స్త్రీలకు ఉన్న చోటేంటి? అది ఎంత చోటు? అన్న ప్రశ్నలు సమాధానం కావాలని నన్ను తొందరపెట్టాయి. అప్పుడు నా జీవితంలో ఒక మార్గం ఎంచుకోవాల్సిన అత్యవసర పరిస్థితి కూడా ఎదురైంది. తెనాలిలో లెక్చరర్ గా ( VSR & YRN కాలేజిలో) పని చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు. వాళ్ళను పెంచుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడపాలా? రాజకీయ ప్రమేయం లేని జీవితం నేను గడపగాలనా? ఇదొక ప్రశ్న. నా వైవాహిక జీవితం కూడా అదే సమయంలో సంక్షోభంలో ఉంది. అక్కడ రాజీ పడాలా లేక నా మార్గం నేను ఎంచుకోవాలా – ఇది మరొక ప్రశ్న. సలహాలిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఆ సమయంలో నేను రాజకీయాలు వదిలి జీవించలేననే నిర్ణయానికి వచ్చాను. ఫెమినిస్టు రాజకీయాలు అప్పటికే నన్ను పిలుస్తున్నాయి. ఆ నిర్ణయం తేలిగ్గానే తీసుకున్నాను. ఫెమినిస్టు సిద్ధాంత అధ్యయనం, దాన్ని తెలుగు ప్రజలకు అర్థమయ్యేలా పరిచయం చేయటం – ఇవీ మొదటి బాధ్యతలు. ఈ బాధ్యతలను తేలికగా నిర్వహించటానికి సాహిత్య మార్గం నాకు అందివచ్చింది. ఇప్పుడు సాహిత్య జీవితానికీ కార్యకర్త జీవితానికీ భేదం లేకుండా పోయింది. నేను నమ్మిన స్త్రీవాద సిద్ధాంతం ప్రకారం వైవాహిక జీవితంలో కూడా రాజీ పడకుండా బయటకు నడిచాను. వరసగా రచనలు చేయటం మొదలుపెట్టాను. ‘అతడు – ఆమె – మనం’ తో స్త్రీవాద సాహిత్య విమర్శ మొదలైంది. ఆ తర్వాత రాజకీయ కథలు – సహజ – స్వేచ్ఛ – మానవి – కన్నీటి కెరటాల వెన్నెల – ఆకాశంలో సగం – గులాబీలు నవలలు ఒక వైపు , భూమి పుత్రిక – సామాన్యుల సాహసం – మూడు తరాలు – పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం వంటి ఫెమినిస్టు అనువాదాలు ఇంకోవైపు , మాకు గోడలు లేవు – కుటుంబ వ్యవస్థ: మార్క్సిజం అంటూ స్త్రీవాద సిద్ధాంత ప్రతిపాదనలు మరోవైపు వరసగా దాదాపు ఒకే సమయంలో వెలువడ్డాయి. ఆ రోజుల్లోనే తెలంగాణా లోని ప్రతి జిల్లా , మండల కేంద్రాల్లో స్త్రీవాదం గురించి ఉపన్యాసాలు ఇచ్చాను. అలాంటి ఆసక్తి తెలంగాణలో ఆ రోజుల్లో ఉండేది.

స్త్రీవాద రాజకీయాలూ సాహిత్యం కోస్తా అగ్ర వర్ణ స్త్రీలకి సంబంధించిన వ్యవహారమే గానీ తెలంగాణలో స్త్రీవాదం లేదు – ఆ సాహిత్యమూ లేదు అని తెలంగాణ రాష్ట్రోద్యమంలో సాహిత్య కారులు తరచూ ప్రస్తావించారు. మీరు దాన్నెలా స్వీకరిస్తారు?

ఈ మాట చరిత్ర తెలియని వాళ్ళూ జరిగిన చరిత్రని దాచేయాలనుకునే వాళ్ళో అనే మాట. స్త్రీవాదం తెలంగాణలో హైదరాబాద్ లో పుట్టింది. ‘స్త్రీ శక్తి సంఘటన’ ఇక్కడ పని చేస్తున్న రోజుల్లో నేను తెనాలిలో ఒంటరిగా ‘అతడు – ఆమె – మనం’ రాసుకుంటూ ‘భూమి పుత్రిక’ అనువాదం చేసుకుంటూ ఫెమినిస్ట్ రాజకీయాలను అర్థం చేసుకుంటూ ఉన్నాను. స్త్రీ శక్తి సంఘటనతో నాకు మరింత బలం వచ్చింది. స్త్రీ శక్తి సంఘటనలో వసంత కన్నబీరన్ , రమా మెల్కోటే , లలిత , రత్నమాల , సుసీతారు , విజయ , గీతా రామస్వామి … ఇలా ఎవరూ కోస్తా ప్రాంతం వాళ్ళు కాదు. అందరూ తెలంగాణకు చెందిన వాళ్ళే ఉండేవాళ్ళు. ‘మనకి తెలియని మన చరిత్ర’ పుస్తకాన్ని కూడా తెలంగాణ రైతాంగ ఉద్యమం లోని స్త్రీల గొంతులను నిపించటానికే తీసుకువచ్చారు. హైదరాబాద్ కార్య క్షేత్రం గా పని చేశారు. స్త్రీవాద సాహిత్యం నేను ఎక్కువ రాయటం వల్ల స్త్రీవాదం క్రెడిట్ అంతా నాకూ కోస్తా అగ్ర వర్ణ రచయిత్రులకే ఇచ్చేయటం చాలా అన్యాయం. స్త్రీవాదం మనది కాదు అని అంత తేలికగా ఒదులుకోవాల్సిన సిద్ధాంతం కాదు. ఒదులుకుంటే తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అసలు స్త్రీవాదమంతా మనమే మొదలుపెట్టాం – దాన్ని కోస్తా అగ్ర వర్ణ స్త్రీలు హైజాక్ చేశారనే నిందవేయాల్సి వస్తుంది. ఎందుకు ఇన్ని కష్టాలు? ఉన్నది ఉన్నట్లు వాస్తవాన్ని వాస్తవంగా చూడటం వల్ల అందరి మధ్య స్నేహ సుహృద్భావాలు పెరుగుతాయి. ఉద్యమం బలపడుతుంది.

స్త్రీవాద సిద్ధాంతం , సాహిత్యం బలపడుతూండగానే – ‘గురిచూసి పాడే పాట’ , ‘నీలి మేఘాలు’ వచ్చిన తర్వాతనే – ‘చిక్కనవుతున్న పాట’ దళిత కవితా సంకలనం వచ్చింది. నిజానికి అందులో కవయిత్రులు లేరు. ‘పదునెక్కిన పాట’ లో దళిత కవయిత్రులు తమ బలమైన గొంతులను వినిపించారు. అప్పటి నుండి దళిత వాదం బలపడింది. స్తీవాదం కూడా అంతకు ముందే స్త్రీలంతా ఒకటి కాదు – స్త్రీల అణచివేత అంతా ఒకే రకం కాదు – కుల వర్గ మత ప్రాంత అస్తిత్వాలను బట్టీ అణచివేత రూపాలు మారుతూంటాయి , దానిని గుర్తించకుండా స్త్రీలందరినీ ఒకే సమూహంగా చూడటం సరికాదనే అవగాహనకు వచ్చింది. దళిత కవిత్వాన్ని , మైనార్టీ కవిత్వాన్ని ప్రచురించటంలో ‘అస్మిత’ చాలా చొరవ తీసుకుంది.

బహుళ అస్తిత్వాలను గుర్తించి ఆ అస్తిత్వాలు సాధికారతనూ సామాజిక గౌరవాన్నీ న్యాయాన్నీ పొందేలా జరిగే ఏ పోరాటాన్నైనా ప్రతిఘటననైనా కార్యకలాపాలనైనా స్త్రీ వాదులు బలపరుస్తారు. ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ అస్తిత్వానికి గౌరవం కల్పించేందుకు , సమాజంలో వాళ్ళు తమ హక్కులు సాధించుకోనేందుకు స్త్రీ వాదులు వారి పక్కన నిలబడుతున్నారు. ఇలా ప్రతి అస్తిత్వాన్నీ గుర్తించి గౌరవించటమే స్త్రీవాదం ప్రత్యేకత. అన్ని అస్తిత్వాలూ ఒకరితో ఒకరు కలసినపుడే బలం వస్తుంది. ఎవరి ప్రత్యేకత వారిదే. అందరం కలసి సాధించాల్సింది – సామాజిక న్యాయం.

కలిసి చేయాల్సిన పోరాటాల గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ అస్తిత్వ పోరాటాల కారణంగా సామూహిక ప్రతిఘటన స్వరాలు బలహీనపడుతున్నాయనీ సమూహాలుగా సమీకృతమై దోపిడీ వర్గ వ్యవస్థను నిర్మూలించడానికి కదలబారే ప్రజాశ్రేణుల్ని శకలాలుగా మార్చడానికి నయా సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగానే యివి ముందుకు వస్తున్నాయనే విమర్శ – అదీ స్త్రీవాదం మీద యెక్కువగా వచ్చింది. అందుకు మీ సమాధానం యేమిటి?

సమాజంలో ఉన్న అనేక రకాల అసమానతలను , అణచివేతలను వర్గం అనే ఒకే గాటన కట్టి దానిని చాలా యాంత్రికంగా అర్థం చేసుకోవటం వల్ల వచ్చిన చిక్కులు ఇవి. నిజానికి బహుళ అస్తిత్వ సమస్యలను అర్థం చేసుకుంటే పోరాటాలకూ విప్లవాలకూ బలం చేకూరుతుందే గానీ నష్టం కలగదు. చాలా సంవత్సరాల పాటు – అంటే , స్వాతంత్ర్య ఉద్యమం మొదలైనప్పటి నుండీ లేదా సంస్కరణోద్యమం మొదలైనప్పటి నుండీ మనం కుల సమస్య ఎంత తీవ్రమైనదో ఎంత అత్యవసరంగా ఎంత దీక్షతో పని చేయాల్సిన రంగమో గుర్తించి ఉంటే వామపక్ష ఉద్యమం బలపడేది. కులం అనేది లేనట్లు నటించటం ఒక దశలో నేర్చుకున్నాం. గ్రామాల్లో అగ్ర వర్ణాలకు చెందిన కమ్యూనిస్టు నాయకులు కుర్చీల్లో కూర్చొని తమ వద్ద పని చేసే దళితులు కింద కూర్చుంటే దానిని ఒక అనైతిక విషయంగా చూడకపోవటం ఎందువల్ల జరిగింది? అంత చిన్న విషయాల నుంచి మొదలైన కులతత్త్వం పైస్థాయి పదవుల వరకు వెళ్ళింది. అలాగే తమతో పాటు పనిచేసే స్త్రీలను కొన్ని పనులకే పరిమితం చేసి నాయకత్వ స్థానాలకు ఎదగనీకుండా చేయటంలో వాళ్ళ పురుషాధిపత్యాన్ని వాళ్ళు గుర్తించకపోతే లోపం ఎవరిది? అది సామ్రాజ్య వాదుల కుట్రా? కమ్యూనిస్టుల కుట్రా? నిన్న మొన్నటి వరకు పోలిట్ బ్యూరోలో ఒక్క స్త్రీ కూడా లేని చరిత్ర ఎలాంటి కుట్ర అందాం? ఈ కుట్ర అనే మాటను వదిలేసి వాస్తవాలను గ్రహిద్దాం. వర్గ పోరాటంతో సర్వ అసమానతలూ వివక్షలూ పోతాయనే మూఢ నమ్మకంతో మిగిలిన కుల లింగ మత ప్రాంత అస్తిత్వాలను పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పడేయటం వల్ల వచ్చిన సమస్యే ఇది. సమస్య కాదు ; పరిష్కారం. దేనికైనా ఒక ప్రారంభం ఉండాలి కదా! తమ అస్తిత్వాలను తాము తెలుసుకోకుండా సమూహంలో కల్సిపోతే వచ్చే ప్రమాదాలు వాళ్ళు తెలుసుకున్నారు. తమని తాము తెలుసుకునే క్రమంలో ఒక్కొకసారి సమతుల్యత లోపించటం సహజం. తమ ప్రత్యేకతను ఆధిక్యతగా చూపుకునే ధోరణి కూడా సహజమే. వీటన్నిటినీ దాటుకొని తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ సమూహంలో కలిసే సమతుల్యత త్వరలో వస్తుంది. సమూహం లేకపోతే ప్రత్యేకత లేదు. ఎన్నో ప్రత్యేకతలు లేకపోతే సమూహాలకు అందం లేదు , అర్థమూ లేదు. కాబట్టి నాకు భవిష్యత్తు మీద చాలా ఆశ ఉంది.

మీరు ఆశించే అందమైన ఆ భవిష్యత్తుని దర్శించడానికి మీ సాహిత్య ప్రస్థానం ఎలా తోడ్పడింది? ఆ ప్రయాణంలో మీరు మైలు రాళ్ళు అనుకోదగ్గ సందర్భాలేవి?

స్త్రీల అస్తిత్వం ప్రధానంగా వాళ్ళ శారీరక లైంగికత్వం మీద ఆధాపడి ఉంటుంది కాబట్టి ఆ శరీర రాజకీయాల గురించి కథలు రాయటం మొదలుపెట్టాను. ఆ క్రమంలో వచ్చినవే – సీత జడ , కళ్ళు , ముక్కు పుడక , నోర్ముయ్ , రాతి గుండెలు , వెన్నెముక, అయోని . ఈ కథలన్నీ స్త్రీల శరీరంలోని ప్రతి అవయం మీద పితృస్వామ్య సమాజం విధించే కంట్రోళ్ళ గురించి మాట్లాడతాయి. స్త్రీల శరీరాలు ఈ సమాజం విధించిన నిర్వచనాలనధిగమించి వాటితో ఎలాంటి అనుభూతులను ఆనందాలను పొందవచ్చో ఈ కథలు సూచిస్తాయి. స్త్రీవాద రాజకీయాలను పరిచయం చేయటానికి , స్త్రీల గురించి ఒక కొత్త చూపును ఏర్పరచటానికి ఈ కథలు ఉపయోగపడ్డాయని నా నమ్మకం. ఇప్పటికీ రాజకీయ కథలకు పాఠకుల నుంచి వచ్చే స్పందన , ఆదరణ నా నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.

తర్వాత స్త్రీ జీవితంలో గృహిణీత్వం – పౌరసత్వం ఈ రెండింటి మధ్య వచ్చే ఘర్షణ గురించి రాసిన నవల ‘స్వేచ్ఛ’. ఇది ఆంధ్రదేశమంతా విపరీతంగా చర్చించబడింది. సమాజం కోసం కుటుంబాన్ని ఒదిలివేయటమనేది ఇప్పటికీ మింగుడుపడని వ్యవహారంగానే ఉండటం నన్ను ఆశ్చర్యపరచింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సామాన్య పాఠకులు ఆ ననవలలోని కథా నాయిక అరుణ వేదనను సరిగానే అర్థం చేసుకున్నారు. కానీ ఉద్యమాలలో , రాజకీయాలలో పనిచేసేవారు మాత్రం అరుణను అతిగా ప్రవర్తించిందని విమర్శించారు. చాల మంచివాడైన భర్తను – ఏ దుర్గుణమూ లేని భర్తను ఏదో చిన్న సంఘంలో పనిచేయటం కోసం ఒదిలిపెట్టటం వారికి మింగుడుపడలేదు. ఆ నవలలో అరుణ పనిచేస్తున్న సంఘం వారికి కూడా నచ్చలేదు. కుటుంబ విచ్ఛిత్తిగానే దాన్ని చూశారు గానీ అరుణ తన పౌరసత్వం కోసం గృహిణీత్వాన్ని ఒదులుకుందనీ అనేక ఉద్యమాలలో అనేకమంది స్త్రీలు ఇలాంటి ఘర్షణ అనుభవించి గృహిణీత్వాలను ఒదులుకున్నారనీ వాళ్ళు గుర్తించలేకపోయారు. అరుణ స్నేహితురాలు ఉమ పెళ్లి లేకుండా ప్రేమించినవాడితో సహజీవనం చేస్తాననటం మీద కూడా వ్యతిరేకత వచ్చింది. దాని గురించి చాలా చర్చ జరిగి చివరకు నా జీవితం కూడా చర్చలోకి లాగబడింది. ఇంత అలజడి రేకెత్తించిందంటే ఆ నవలలో ఎంతో కొంత సరుకు ఉందని నాకు నమ్మకం కలిగింది.

తర్వాత – ‘ఆకాశంలో సగం’ నవలలో దళిత కథా నాయకురాలిని ప్రవేశపెట్టాను. నాకు తెలిసినంతవరకు గ్రామాల్లోని దళిత జీవితాన్ని చిత్రించగలిగాను. ఆ నవలలో కూడా గ్రామంలో స్త్రీలంతా కలిసి సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. స్త్రీల మధ్య ఈ సహకారం ఉండాలనే భావన నాకు మొదటి నుంచీ ఉంది. నా ప్రతి నవలలో , కథలో నేను అనుకోకుండానే నా ప్రమేయం లేకుండానే స్త్రీ పాత్రలు స్నేహంతో ఒకరికొకరు తోడుగా అండగా నిలబడతారు.

నవలలో స్త్రీల జీవితంలోని వివిధ కోణాలని చర్చించడానికి విస్తృతమైన అవకాశం వుండగా మీరు వొక వుధృతిలో రాసిన నవలా రచనకి కామా పెట్టి కథ వైపు మళ్ళడానికి కారణం యేమిటి?

దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి నేను పునరుత్పత్తి గురించి స్త్రీవాద సాహిత్యాన్ని రాయాలనుకున్నాను. అందులో ఉన్న వివిధ అంశాలను నవలలో చిత్రిస్తే అది బలవంతంగా చొప్పించినట్లు ఉంటుంది. దాంట్లో సృజనాత్మకత కంటే ఏదో చెప్పాలనే తపన ఎక్కువ కనపడే ప్రమాదం ఉంది. వాటినే కథలుగా రాయటం వల్ల నా పని సులువవుతుంది. చెప్పదలచిన విషయాన్ని చదివించే లక్షణంతో సూటిగా చెప్పే అవకాశం దొరుకుతుంది.

‘భిన్న సందర్భాలు’ లో బాగా చదువుకున్న యువతులు , అసలు అక్షరాస్యత లేని ఆడపిల్లలు , గ్రామీణ స్త్రీలు పునరుత్పత్తి విషయాల్లో ఎదుర్కొనే సమస్యలను చిత్రించాను. ఆ తర్వాత నవల రాయకపోటానికి వ్యక్తిగత కారణం కూడా ఒకటుంది. 90 వ దశాబ్దం నుంచీ నా పనిలో సినిమాలు , అస్మిత – ఈ రెండూ ఎక్కువ సమయాన్ని తీసేసుకున్నాయి. ఆ పనుల్లో మునిగిపోయాకా నవల రాసే సమయం , వెసులుబాటు నాకు దొరకలేదు. అందువల్ల ఈ మధ్య మొదలు పెట్టిన ‘గమనమే గమ్యం’ ( సారంగ వెబ్ మ్యాగజైన్) తప్ప దాదాపు 25సంవత్సరాలు నవల రాయలేదు.

ఇక్కడొక చిన్న ప్రశ్న – నవలల్లోలా సహజ , అరుణ , జెసింత , వసంత లాంటి గుర్తుండే పాత్రల్ని కథల్లోకి కూడా తీసుకురావడంలో మీరు ప్రతిపాదించదలచుకొన్న భావజాలమే అడ్డువచ్చిందనీ ఆ విధంగా కొంత నష్టం జరిగిందనీ భావిస్తారా?

నేనట్లా భావించటం లేదు. ఎందుకంటే నవలల్లో పాత్రలన్నీ ఒక విశిష్టమైన వ్యక్తిత్వంతో protagonists గా నేను చెప్పదలచుకున్న భావాలను ముందుకు తీసుకెళ్ళే వాహికలుగా నిలబడతారు. సమస్యలతో సంఘర్షించి చాలాసార్లు గెలుస్తారు. తాము అనుకున్నది సాధిస్తారు. తమ జీవితాలను తమ ఇష్టం ప్రకారం నిర్మించుకుంటారు. కానీ తర్వాత రాసిన ‘భిన్న సందర్భాలు’ , ‘ప్రయోగం’ లో కొన్ని కథలు , ‘మృణ్మయనాదం’ లో కొన్ని కథలు అతిసామాన్య స్త్రీల యథార్థ జీవిత చిత్రాలు విషయంగా ఉంటాయి . వీరెంత సామాన్యులంటే వీరి పేరు ఏదైనా కావచ్చు. అన్ని పేర్లూ వీరివే కాచ్చు. ఆ పాత్రలు అంత సార్వజనీనమైనవి. తమ సమస్యల సుడిగుండంలోంచి ఎలా బయటపడాలో తెలియక గిలగిలలాడే పాత్రలు. మొదటి చావు , పురుటి నొప్పులు – ఇలాంటి కథల్లో ఆ పాత్రల పేర్లు గుర్తుండవు. వారి బాధ మాత్రమే గుర్తుంటుంది. పాఠకులు ఆ బాధతో ఐడెంటిఫై అయ్యారు. ‘అయోని’ కథలో పాపకి అసలు పేరుండదు. అయోనిగానే గుర్తుంటుంది. చిత్రమేమిటంటే భావజాలం చెప్పటానికి రాశానని మీరు అంటున్న కథల్లో ఎక్కువ జీవితం ఉంది , నవలల్లోనే భావజాలం ఎక్కువుంది.
ఏదేమైనా మనం ఏ రూపంలో ఏ ప్రక్రియలో రాయాలి – రాస్తాము అనే దానిని మనం రాయదల్చుకున్న వస్తువు నిర్ణయిస్తుందని సాహిత్య విమర్శకులు చెప్పిందాంట్లో వాస్తవం ఉంది. నేను ‘ప్రయోగం’ కథను చిన్నకథగా రాయాలనుకున్నాను. కానీ ఒకసారి సునంద సురేంద్ర పాత్రలు unfold అయ్యాకా అది పెద్దకథ అయ్యింది. అట్లా నేను చెప్పదలచుకున్న విషయాలకు కథా ప్రక్రియ అనువుగా ఉండే సందర్భాలు వచ్చినప్పుడల్లా కథలు రాశాను.

వ్యాస రచయితగా కూడా మీరు స్త్రీవాద రాజకీయాల్ని విస్తృతంగా మాట్లాడారు. ఒక విషయాన్ని ప్రతిపాదించడానికి వ్యాసంలో మీకు వెసులుబాటు ఉండగా కథనే ప్రధాన పరికరంగా ఎందుకు వాడుకొన్నారు? ఆ సందర్భాల్లో కళాత్మక విలువలు దెబ్బతినకుండా ఉండటానికి యెటువంటి జాగ్రత్తలు తీసుకొనేవారు?

విషయ ప్రతిపాదన లేకుండా ఏ కథ అయినా ఎవరైనా రాశారేమో నాకు తెలియదు. ఇక్కడ విషయ ప్రతిపాదన , వ్యాసం అన్న మాటలు మీ ప్రశ్నలో వచ్చాయి కాబట్టి దీన్నే మరింత క్రూడ్ గా అడగాలంటే చాలామంది ‘మీ రచనల్లో సిద్ధాంతం ఉంటుంది గానీ జీవితం ఉండదు’ అంటుంటారు. ఇది చాలా యాంత్రికమైన అవగాహన. సిద్ధాంతం జీవితం వేరు వేరు కాదు. అనేక మానవ జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని నడిపించే సూత్రాలను అర్థం చేసుకుని ఒక సిద్ధాంతంగా ప్రతిపాదిస్తారు. అంటే సిద్ధాంతంలో జీవితం ఉన్నట్లే కదా! ఆ సిద్ధాంతపు వెలుగులో వర్తమాన మానవ జీవిత సంక్షోభాలను సంఘర్షణలను చూపిస్తే కథ మరింత అర్థవంతమవుతుందా – సారహీనమవుతుందా?

కళాత్మక విలువలంటారా – నా దృష్టిలో కథ పాఠకులను చదివించి వాళ్లకు అంతవరకూ తెలియని మరొక చూపునిచ్చి ఆలోచింపజేస్తే కళ ఉన్నట్లే. చాలామంది పువ్వులు పిట్టలు ప్రకృతి , భావుకతతో నిండిన వాక్యాలు , ఇంకా ఏవేవో మార్మికతతో నిండిన విషయాలో మరేవో కళ అనుకుంటారు. కళ బహుముఖీనమైనది. కళకళలాడే పచ్చని చెట్టు ఆకర్షించినట్టు ఎండిపోయిన చెట్టు మనల్ని ఆకర్షించదు. కానీ ఒక చిత్రకారుడు ఆ చెట్టును కూడా చాలా కళాత్మకంగా చిత్రిస్తాడు. దాని ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తే జీవితంలో ఎక్కడో ఒకచోట ఆ అనుభవం మనకు ఎదురవుతుందని చెప్తాడు. కళ – కళాత్మక విలువలు – సృజనాత్మక విలువలు ఇవి పడికట్టు పదాల్లా తయారయ్యాయి. చాలామంది సారాంశంలో తమకు నచ్చని విషయాలు తమని కలవరపెట్టినప్పుడు కొత్త విషయాలు తమని గందరగోళపరచినప్పుడు ఇందులో కళ లేదు – విలువలు లేవు అంటుంటారు. కళ ఎంత అమూర్తమో అంత మూర్తం కూడా. దాన్ని ఒకే మూసలో చూసే అలవాటుని మనం మార్చుకోవాలి. ఇదంతా నా కథల్ని నేను డిఫెండ్ చేసుకోటానికి మాట్లాడటం లేదు. నా కథల్లో కళాత్మక విలువలు లేవు అని నాకు చింత లేదు. నేను పనిగట్టుకుని కళాత్మక విలువలను నా కథల్లో కూరాలని ప్రయత్నించలేదు. నాకు తోచినట్లు నాకు చేతనైనట్లు నేను చెప్పదలచిన వాటిని చెప్పాను. నా కొలమానం ఒక్కటే – రీడబిలిటీ. పాఠకులు పక్కన పడేయకుండా చదవాలి. చదివి ఆలోచించాలి. అంతే!

పాఠకుల మీద ఆ impact పడటానికి మీరేదైనా – మీదైన టెక్నిక్ అనుసరించారా?

నేను ప్రయత్నపూర్వకంగా టెక్నిక్ ని ఉపయోగించాలి అనుకోలేదు. నేను దేన్నయినా కొంత ఇంటెలిజెంట్ గా ప్రెజెంట్ చేయాలని మాత్రం అనుకుంటాను. నేను చెప్పే విషయాలకు పాఠకులు కన్విన్స్ అవ్వాలనే ప్రయత్నం కొంత ఉంటుంది. పాఠకుల తెలివి మీద నమ్మకంతో ఒక తార్కికమైన వచనాన్ని రాస్తాను. బహుశా ఇది నా మీద కొ కు ప్రభావం వల్ల కావచ్చు. చలంగారిలో ఉండే ఎమోషనల్ టచ్ తో పాటు ఈ తార్కికమైన వచనం కూడా నా రచనల్లో కలిసిందనీ దానివల్ల ఒక ప్రత్యేకతా , పఠనీయతా వచ్చాయని నేను అనుకుంటాను. అయితే ఇంకా మరింత రీడబిలిటీని సాధించాలనీ, కథని పదే పదే చదివించేలా రాయాలనీ నా కోరిక.

వైయక్తికమంతా రాజకీయమే అన్న అస్తిత్వవాద భావజాలం నుంచి – అధికారం పొందాలంటే అధికారం వొదులుకోవాలి అన్న తాత్త్విక ఆలోచన వరకూ సాగిన మీ కథా రచనా ప్రస్థానంలో స్త్రీ స్వేచ్ఛకీ విముక్తికీ మీరు చెప్పిన పరిష్కారాలు పురుషాధిపత్య సమాజంపై యే మేరకు ప్రభావం చూపాయని అనుకొంటున్నారు?

స్వేచ్ఛకు అర్థం ఏమిటి – అని అన్వేషిస్తూ స్వేచ్ఛకూ రాజకీయాలకూ ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటూ అర్థం చేయించే ప్రయత్నం చేస్తూ నేను నా రచనలు మొదలుపెట్టాను. ఈ అన్వేషణలో అనేక సంఘర్షణలు , సందిగ్ధతలు , సమాధానం దొరకని సవాళ్ళు ఎన్నిటినో ఎదుర్కొన్నాను. స్వేచ్ఛ అనే భావన మనందరి జీవితాల్లో అతి మామూలు సందర్భం నుంచి రోజువారీ పనుల దగ్గర నుంచి మన జీవితాలను శాసించే వ్యవస్థల వరకూ పరచుకుని ఉంది. ఈ భావన అంతటినీ అర్థం చేయించటం అంత తేలిక కాదు. అందులో స్త్రీల విషయంలో అది మరింత కష్టం. సంప్రదాయాలు , ఆచారాలు , ప్రేమ , మాతృత్వం – వీటన్నిటితో చిక్కుముళ్ళు పడిన స్త్రీల జీవితాల్లో స్వేచ్ఛను గాయాలు తగలకుండా పూవులా పైకి తీసుకొచ్చి చెప్పటం అసాధ్యం. అందువల్ల నా రచనా వ్యూహంలో నాకు తెలియకుండానే ఒక క్రమం వచ్చి చేరిందని నాకు అనిపిస్తుంది. రాజకీయ కథల్లో ప్రధానంగా స్త్రీల శరీరాల మీద తద్వారా మనసుల మీదా జరిగే అణచివేత ప్రధాన వసువైంది. ఈ శరీర రాజకీయాలను చెప్పకుండా శరీరాలలో బంధించబడిన స్వేచ్ఛను విడుదల చేయకుండా ఆ భావనను విస్తృతపరచటం కష్టం. బహుశా అందుకే ముందుగా రాజకీయకథలు రాశాననుకుంటున్నాను.

తర్వాత మధ్య తరగతి స్త్రీల ఆశలు , కలలు , వాటిని సాకారం చేసుకోలేని పరిస్థితులు – ఇవి నా పాఠకులకు నేను నా పద్ధతిలో చెప్పాల్సిన విషయాలుగా భావించి ఒక urgency తో ‘సహజ’ నవల రాశాను. కాలేజి చదువుల వరకు వచ్చిన స్త్రీలందరూ ఆ నవలతో ఐడెంటిఫై అవటంతో స్త్రీల మనసులను తెలుసుకోగలిగానని వాటిని వ్యక్తపరచగలిగానని అనుకున్నాను. ఆ తర్వాత స్త్రీలు తమ వ్యక్తిగత జీవితాలకు అవతల ఉన్న సమాజంతో ఒక సజీవ సంబంధం కావాలనుకుంటే వారికెదురయ్యే కుటుంబ సమస్యలు చెప్పాను. అది ఒక పౌరసత్వ విషయమైపోయింది. భర్త , పిల్లలు వారి ప్రేమలను taken for granted గా భావించి బతికేస్తున్న గృహిణుల జీవితాల్లో హఠాత్తుగా ఆ సంబంధాలు అదృశ్యమైపొతే – తాము ఒంటరిగా నిలబడాల్సి వస్తే తమ జీవితాల్ని ఏం చేసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితికి నెట్టబడతారు. అలాంటి ఆడవాళ్ళు మనుషులుగా మారాలని చెప్తూ రాసినది ‘మానవి’. కూతురు , భార్య , తల్లి పాత్రల నుంచి మానవి పాత్రలోకి స్త్రీలను మళ్ళించాలనే కోరిక ఆ నవల వెనక ఉంది. స్త్రీలకు తమ శరీరాల ద్వారా ఇతరులతో ఏర్పడే సంబంధాలలోని అణచివేత నుంచి మొదలై కుటుంబమనే వివాహమనే వ్యవస్థల ద్వారా ఏర్పడే నియంత్రణ వరకు నా రచనా ప్రయాణం సాగింది.

ఆ తర్వాత అనేక కథలలో నాకు సమాధానం లేని ప్రశ్నలే మిగిలాయి. హింస , బాధ వీటి మూలాలేంటి – వీటి నుండి బయటపడే మార్గాలేవి అన్న ప్రశ్న నన్ను నిరంతరం వేధిస్తూ ఉండేది. అప్పటికప్పుడు దొరికే కంటికి కనిపించని కారణాలతోనూ మార్గాలతోనూ పరిష్కారాలతోనూ నేను సంతృప్తి పడలేకపోయాను. నేను చేసే పనిలో – అస్మిత ద్వారా – అనేక వేల మంది గ్రామీణ స్త్రీలను , మధ్యతరగతి స్త్రీలను , వారి జీవితాలను దగ్గరగా చూడగలిగాను. దాంతో పాటు ఒక తాత్త్విక అన్వేషణ కూడా కొనసాగిస్తూ వచ్చాను. ఈ జీవితాలు , ఆ తాత్త్విక చర్చలు నన్ను చాలా వరకు స్త్రీల అణచివేతకు , మానవులందరి అణచివేతకు ప్రధానకారణం వైపు తీసుకువెళ్ళాయి. దాంతో నాకు అనేక విషయాల పట్ల స్పష్టత వచ్చినట్లు అనిపించింది. అణచివేతకు ప్రధాన కారణం అధికారం. అధికారం అనే మాట రెండు అర్థాల్లో మనం వాడుతూంటాం. ఒకటి ఆధిపత్యం ; రెండు సాధికారత. ఇందులో ఆధిపత్యాన్ని గురించి చాలా ఆలోచించాల్సి ఉంది. మానవజాతికి ఈ ఆధిపత్యం ఎన్నో వేల సంవత్సరాల నుండి తమ బతుకు పోరాటంలో అలవాటయిందా లేక స్వాభావికమైందా? దీనిని ఒదుల్చుకోటానికి ఇంతవరకూ జరిగిన ప్రయత్నాలేంటి? ఒదుల్చుకోవటం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలు నన్ను చుట్టుముట్టి ‘విముక్త’ కథల వైపు నడిపించాయి.

(ఇంకా ఉంది)

You Might Also Like

2 Comments

  1. రచయిత్రి ఓల్గా తో సంభాషణ -1 | Bagunnaraa Blogs

    […] అతిథి ‘ప్రతి అస్తిత్వాన్నీ గుర్తించి […]

  2. రచయిత్రి ఓల్గా తో సంభాషణ -2 | పుస్తకం

    […] భాగాలుగా వేస్తున్నాము. మొదటి భాగం ఇక్కడ.) […]

Leave a Reply