హిందూ జాతీయతావాద నిర్మాణంలో గీతా ప్రెస్ పాత్ర

గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ – మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ. అతి తక్కువ వెలకి అత్యున్నతమైన నాణ్యత గల పుస్తకాలను ప్రచురించి అమ్మటం వీరి ప్రత్యేకత.

జయదయాళ్ గోయంద్కా అనే ఓ మార్వాడీ వ్యాపారి తాను నిర్వహించే గీతా సత్సంగాలకు ఉపయోగపడేలా టీకా తాత్పర్య సహితంగా భగవద్గీతను అచ్చు వేయాలనుకోవటంతో – 1923లో – ప్రారంభమయ్యింది గీతా ప్రెస్ కథ. ఫిబ్రవరి 2014 నాటికి ఎనభయ్యేళ్ళకు పైగా రంగంలో ఉన్న గీతా ప్రెస్ వారి అమ్మకాల గణాంకాలిలా ఉన్నాయి: రామ్‌చరిత్‌మానస్ – 7 కోట్లు; ఉపనిషద్పురాణాదులు – 19 లక్షలు; హిందూ మహిళలకూ, బాలలకూ నీతి గరపేందుకు ఉద్దేశించిన చిన్న పుస్తకాలు – తొమ్మిదిన్నర కోట్లకి కొంచెం తక్కువ; భారతీయ చరిత్రా-పురాణాల నుంచి సంకలించిన కథలూ, ఆధ్యాత్మిక గీతాలు వంటి తతిమ్మా పుస్తకాలు – ఆరున్నర కోట్లు. (ఇంకా అబ్బురపరిచే నంబరు వికీపీడియాలో కనిపించింది – 41 కోట్లు! 2012 నాటికి గీతా ప్రెస్ వాళ్ళు అమ్మిన భగవద్గీత ప్రతుల సంఖ్య అది.) అవన్నీ ఒక ఎత్తూ, రెండు లక్షల సర్క్యులేషన్‌తో నడిచే ‘కల్యాణ్’ హిందీ మాసపత్రిక (దానికి తోడుగా లక్ష సర్క్యులేషన్‌తో నడిచే ఇంగ్లీషు ‘కల్యాణ కల్పతరు’ పత్రిక ) మరొక ఎత్తు!

గీతా ప్రెస్‌ని ప్రారంభించిన తరువాత – మరో మూడేళ్ళకు -ఢిల్లీ నగరంలో మార్చి-ఏప్రిల్ నెలల వేసవి ఉడుకులో జరిగిన అఖిల భారతీయ మార్వాడీ అగర్వాల్ మహాసభ ఎనిమిదో వార్షిక సమావేశాలలో సంస్కరణాభిలాషులకూ సంప్రదాయపరులకూ జరిగిన ఒక ఘర్షణ – 1926 ఆగస్టులో – కల్యాణ్ పత్రిక ఆవిర్భావానికి దారి తీసింది.

గోయంద్కా మిత్రుడయిన హనుమాన్ ప్రసాద్ పోద్దార్ అనే ఆయన కల్యాణ్ పత్రికకు తొలి సంపాదకుడు. పత్రిక పెట్టిన నాటి నుంచి 1971లో మరణించేదాకా నలభయ్యైదేళ్ళపాటు ఆ బాధ్యత ఆయనదే. పత్రిక నిర్వహణలో, పోద్దార్‌కి గురుతుల్యుడైన గోయంద్కా పాత్ర తక్కువదేమీ కాదు. అయితే, కల్యాణ్ పత్రికకు తీరూ తెన్నూ ఏర్పరచి ప్రభావశీలతను సంతరించిపెట్టిన ఘనత పోద్దార్‌కే దక్కుతుంది.

పోద్దార్‌ని పరిచయం చెయ్యాలంటే ఆయన ఒక “సనాతనీ హిందువు అయిన మార్వాడీ” అని మొదట చెప్పాల్సి ఉంటుందేమో. ధర్మ నిష్ఠా, సాధక ప్రవృత్తీ, దేశభక్తీ ఆయన వ్యక్తిత్వాన్ని నిర్వచించే లక్షణాలు. అతివాదీ, విప్లవకారుడూ అయిన పోద్దార్ హిందూమహాసభ భావజాలానికి దగ్గర వాడు. ఆనాటి ప్రజా జీవితంలోని ప్రముఖులలో అనేకులతో – పోద్దార్‌కి ఆత్మీయమైన స్నేహం ఉండేది. పోద్దార్‌కి ఉన్న విస్తృతమైన పరిచయాలూ, talent scouting విషయంలో ఆయన చూపిన చొరవా, విలక్షణమైన ఆధ్యాత్మిక పత్రికగా కల్యాణ్‌కున్న మంచి పేరూ – వీటన్నింటి కారణంగా “The mightiest, the best and the holiest” వ్యక్తులు కల్యాణ్‌లో తమ రచనలను ప్రచురించేందుకు ముందుకు వచ్చేవారు. మచ్చుకి కొన్ని పేర్లు: గాంధీ, మాలవీయ, అరవింద ఘోష్, ఆనీ బెసంట్, రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి, పురుషోత్తమ్ దాస్ టాండన్, గోవింద్ వల్లభ్ పంత్, గోల్వల్కర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ,వినోబా భావే, రవీంద్రనాథ్ ఠాకూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాధాకుముద్-రాధాకమల్ ముఖర్జీలు, సి.ఎఫ్.ఆండ్రూస్, నికోలస్ రోరిఖ్, జార్జ్ ఆరుండేల్, మైథిలీ శరణ్ గుప్త, హరివంశ్ రాయ్ బచ్చన్, ప్రేమ్‌చంద్… (హిందీ సాహిత్యకారుల జాబితా చాలా పెద్దదే ఉంది ఈ పుస్తకంలో. రచయిత మాటల్లో – “A veritable who-is-who of the Hindi Literary world”.)

అదంతా నాణానికి ఒక వైపు. నిజానికి అక్షయ ముకుల్ ఈ పుస్తకంలో చెప్పాలనుకున్నది “నాణానికి అటువైపు” కథ!
“పందొమ్మిదో శతాబ్దపు సంస్కరణ/పునరుద్ధరణ ఉద్యమాలు ఇరవయ్యవ శతాబ్దపు ప్రథమ పాదంలో హిందూ జాతీయతావాదంలోకి పరిణమించాయి. అతి ప్రాచీనమైన “ఏకైక” హిందూ ధర్మం పునాదిగా నిర్మించబడ్డదీ జాతీయత. ఈ దేశంలోని అనేకానేక సంప్రదాయాలన్నీ తమకు మాత్రమే చెందిన వారసత్వమని ప్రకటించుకుంటారీ జాతీయతావాదులు. భగవద్గీతా, ధర్మ శాస్త్రాల వంటి బ్రాహ్మణీయ గ్రంథాల విశ్లేషణ ఆధారంగా “ఆధునికీకరించబడ్డ మతం మాది” అని చెప్పుకున్నా వీరు నిజంగా తలకెత్తుకున్నది ఆధునికత ముసుగుని తొడుక్కున్న ఛాందస భావాలనే.”

రొమిలా థాపర్ రాసిన ‘సిండికేటెడ్ హిందూయిజం’ అనే వ్యాసంలోంచి అక్షయ ముకుల్ ఏరుకొచ్చిన పై ప్రతిపాదనా వాక్యాలతో మొదలవుతుంది ఈ రెండో కథ. హిందూ జాతీయవాదపు చట్రంలో గీతా ప్రెస్-కల్యాణ్‌లు ఎలా ఇమిడిపోయాయో చెప్పటం ఈ కథా లక్ష్యం.
***

1870లలో మొదలై 1920ల దాకా కొనసాగిన మూడు ముఖ్యమైన చారిత్రిక పరిణామాలలో, గీతా ప్రెస్-కల్యాణ్ పత్రికల ఆవిర్భావ వికాసాలకు దోహదపడ్డ పూర్వ రంగాన్ని గుర్తిస్తారు అక్షయ ముకుల్:

1. ఉర్దూ, పర్షియన్ భాషలకు పోటీగా – ఖడీబోలీ మాండలికానికీ, దేవనాగరి లిపికీ ప్రాచుర్యాన్ని కల్పిస్తూ – హిందీ రచయితలు, మేధావులూ జరిపిన కృషి.
(ఆ కాలంలో – సరి కొత్త వ్యాకరణాన్నీ, వాక్య నిర్మాణ పద్ధతినీ, సౌందర్యాన్నీ, ఔన్నత్యాన్నీ సంతరించుకొని హిందీ సారస్వత భాషగా నిలదొక్కుకుంది. మహావీర్ ప్రసాద్ ద్వివేది సంపాదకత్వంలో సరస్వతి మాస పత్రిక (హిందీలో తొలి పత్రిక) హిందీ పత్రికల సత్తా ఏమిటో రుజువు చేసాడు. ఉత్తర భారతదేశంలో – బెనారస్, అలహాబాద్ నగరాలలో, ముఖ్యంగా ఒక రచయితల తరం పుట్టుకు వచ్చింది. భాషకి మతాన్ని ఆపాదిస్తూ హిందీ -ఉర్దూలను హిందూ-ముస్లిం భాషలుగా చూడటం మొదలయ్యింది ఈ కాలంలోనే.)

2. మార్వాడీలు వ్యాపార రంగంలో నిలదొక్కుకొన్నాక, కొత్త గుర్తింపు కోసం ఆరాటపడటం.
(ఈ ఆరాటమే వారి “దృష్టి”ని ధర్మం వైపుకి మళ్ళించింది. ఆలయాలను, సత్రాలను నిర్మించటం, రామ చరిత మానస్ ప్రవచనాలను ప్రోత్సహించటం, ఆర్య సమాజ స్ఫూర్తితో కుర్మీలు, ఆహిర్ యాదవులు ఏర్పరచిన గోరక్షణి సభలకు ఆర్థిక సహకారం అందించటం – వీటన్నింటి వెనకాల ప్రేరణ ఈ ఆరాటమే. క్రమంగా – వితరణశీలత దృష్ట్యా – మార్వాడీలు రాజుల/జమీదారుల పాత్రను పోషించసాగారు.)

3. హిందూ-ముస్లిం మత విభేదాలు రగులుకుంటున్న రాజకీయ సందర్భం.
(హిందీ-ఉర్దూ మనఃస్పర్థలు, గోవధ గురించి ఆవేశాలు, మేళతాళాలతో మసీదుల ముందు సాగే (హిందూ) మత ఊరేగింపులు తరచుగా మత కలహాలకి దారి తీసేవి ఆ కాలంలో. యునైటెడ్ ప్రోవిన్సెస్ (నేటి ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్) రాష్ట్రంలోనే 1923-27ల నడుమ 91 మత కలహాలు జరిగాయట. శుద్ధి-తబ్లీగ్, సంగటన్-తన్‌జీమ్ ఉద్యమాలు క్రియ-ప్రతిక్రియల్లా తయారై ఇరు వర్గాల మధ్య వైరభావాన్ని పెంపొందించేవి. “హిందూ జాతీయతే అసలు సిసలైన భారతీయ జాతీయత” అనే వాదం బలాన్ని పుంజుకుంటోంది. )

ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కల్యాణ్ సనాతనీయమైన పూర్వాచారపరాయణత్వానికీ, బ్రహ్మ సమాజ, ఆర్య సమాజాది సంస్కరణోద్యమాలకూ, హిందూ మహాసభ, ఆరెస్సెస్సాది హిందూ సంగటనవాదులకూ ఉమ్మడి వేదికగా నిలిచింది. ఆ క్రమంలోనే, భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు ప్రాతిపదికగా కల ఆధ్యాత్మికతకు తోడుగా, హిందుత్వ రాజకీయాలూ, ఛాందస భావాలూ ధారాళంగా ప్రవహించాయి, కల్యాణ్ పేజీలలో.

పాకిస్థాన్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడ్డ 1940లలో – కల్యాణ్ తన “శుద్ధ ఆధ్యాత్మిక వైఖరి”నూ, నిష్పాక్షికతనూ పక్కనబెట్టేసి ఆనాటి హింసాత్మక వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసింది. 1946 చివరి రెండు సంచికల్లో, పోద్దార్ రాసిన ‘వర్తమాన్ వికట్ పరిస్థితి ఔర్ హమారా కర్తవ్యా , ‘హిందూ క్యా కరేఁ’ అనే వ్యాసాలూ, మాలవీయ స్మారకార్థం వెలువరించిన ప్రత్యేక సంచిక (డిసెంబర్ 1946)లోని వ్యాసాలూ – ముఖ్యంగా ‘బంగ కన్యాకీ మర్మస్పర్శీ అప్పీల్’ అనే విషాదోద్విగ్న వ్యాసమూ – హిందువులను కూడగట్టేందుకు, వారిలో ఉద్వేగాలను రేకెత్తించి ప్రతీకారేచ్ఛను రగిలించేందుకు ఎంతో దోహదపడ్డాయి. హిందూ మహాసభ వాళ్ళు, వారి సగోత్రీకులూ ఆ వ్యాసాలను కరపత్రాలలా అచ్చు వేసి లక్షల సంఖ్యలో పంచిపెట్టారట. కొంచెం ఆలస్యంగానే – ఆ వ్యాసాలను ప్రచురించిన సంచికలను ప్రభుత్వం నిషేధించింది కూడా.
(భూతద్దం కింద పెట్టి పరిశీలిస్తున్నది, గీతా ప్రెస్/కల్యాణ్ పత్రికలనూ, హిందూ మతతత్త్వ వాదాన్నీ కనుక కాబోలు ఈ పుస్తకంలో ముస్లిం వేర్పాటువాదాన్ని తప్పనిసరి సందర్భాలలో, అత్యంత ముక్తసరిగా తప్ప ప్రస్తావించలేదు. ఈ పుస్తకంలో అదో పెద్ద లోపమని నాకు అనిపించింది.)

“హిందూ ప్రయోజనాలను కాపాడటం” ప్రాజెక్టులో భాగంగా, అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం, వర్ణాంతర వివాహాలు, విధవా పునర్వివాహాలు, విడాకులకు చట్టబద్ధతా – అన్నింటినీ తీవ్రంగా వ్యతిరేకించింది, కల్యాణ్. హిందువులకు వర్తించే చట్టాలను ఆధునీకరించిన హిందూ కోడ్ బిల్ ను వ్యతిరేకిస్తూ – సాధు సంతులతో, సంప్రదాయాభిమానులైన రాజకీయ నాయకులతో చేతులు కలిపి పెద్ద ఎత్తున యుద్ధమే చేసింది. ఈ సందర్భంలో నాటి న్యాయ శాఖా మంత్రి, హిందూ కోడ్ బిల్ రూపశిల్పి అయిన అంబేద్కర్‌ను కల్యాణ్ తీవ్రంగా విమర్శించింది. ఆ విమర్శ వ్యక్తిగత దూషణగా దిగజారిన సందర్భాలూ ఉన్నాయి.
ఇప్పటికీ హిందూ అస్తిత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నగోసంరక్షణోద్యమం నూటా పాతికేళ్ళ నాటి సరి పాత సమస్యే! సనాతనీయుడైన పోద్దార్, “గోరఖ్”పూర్ కేంద్రమైన కల్యాణ్ గోవధ నిషేధార్థం తీవ్రంగా పోరాడారు. 1945 వార్షిక సంచికగా వెలువడ్డ కల్యాణ్ పత్రిక “గో అంక్” గో సంరక్షణను వివిధ కోణాల్లోంచి – ముఖ్యంగా సెక్యులర్/ఆర్థిక కోణం నుంచి – చర్చించింది (అందులోని కొన్ని వాదనలు ఇప్పటికీ – వాట్సాప్ మెసేజెస్ రూపంలో – చలామణిలో ఉండటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.). 1947లో అనేక కబేళాలను మూసివేయించటం, గోసంరక్షణను రాజ్యాంగంలో ఆదేశిక సూత్రంగా చేర్పించటం, 1950ల్లో గోహత్యా వ్యతిరేక బిల్లును పార్లమెంటులో ప్రైవేటు బిల్లుగా ప్రవేశపెట్టించటం, అరవైలలో గోవధ నిషేధం కోసం అనేకానేక రాజకీయ నాయకులను, సాధు సంతులను, హిందుత్వవాద సంస్థలని ఏకత్రాట గట్టి ఉద్యమాలను నిర్వహించటం – వీటన్నింటి వెనకాలా, ముందరా పోద్దార్/కల్యాణ్‌లు గణనీయమైన పాత్రను పోషించారు.

మధురలోని కృష్ణ జన్మభూమిలో గుడి కట్టేందుకు ఏర్పడ్డ ట్రస్టులో పోద్దార్ సభ్యుడు. 1949లో అయోధ్యలోని బాబ్రీ మసీదులో ఓ డిసెంబరు అర్ధరాత్రి “వెలసిన” రాం లల్లా విగ్రహాన్ని సరయూ నదిలో అభిషేకించినప్పుడు ఆ బృందానికి నాయకత్వం వహించింది పోద్దారే అని ఒక (“అభిజ్ఞ వర్గాల వారి”) కథనం!
అన్నట్లు – విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో పోద్దార్ కూడా ఒకరు.

“బ్రహ్మ తల్లీనులు” ఐన నాలుగు దశాబ్దాల తరువాత కూడా – ఇప్పటికీ కల్యాణ్ పత్రిక పేజీల్లో పోద్దార్-గోయంద్కాలు సజీవంగా కనబడుతూ ఉంటారు. పాత కల్యాణ్ వార్షిక సంచికలు (1948 – నారీ అంక్; 1950 – హిందూ సంస్కృతి అంక్; 1953 – బాలక్ అంక్; 1988 – శిక్షా అంక్) ఇప్పటికీ పునః పునర్ముద్రించబడుతూనే ఉన్నాయి. 1926లో అచ్చు వేసిన “స్త్రీ ధర్మ ప్రశ్నోత్తరి” అమ్మకాలు పది లక్షల కాపీలు దాటాక – ఇంకా డిమాండ్‌లోనే ఉన్నది. పోద్దార్ సంకలించిన ఆ సంభాషణా రూప హిందూ స్త్రీ ధర్మ ప్రబోధిని ఇప్పటికీ బాగా అమ్ముడు పోతుంది (ప్రస్తుత వెల ఐదు రూపాయలు). పోద్దార్ నాటి ప్రాభవం ఇప్పుడు లేదు కానీ ఆనాటి ఒరవడి ఇంకా కొనసాగుతూనే ఉంది – మొన్నటి అయోధ్య ఉద్యమం గురించి వచ్చిన వ్యాసాల్లో, నిన్నటి సేతు సముద్రం ప్రాజెక్టు గురించి లేవనెత్తిన అభ్యంతరాలలో, ఇటీవలి లివ్-ఇన్ సంబంధాలపై వచ్చిన తీర్పుల గురించి ప్రకటించిన ఆందోళనల్లో, ఇంకా ఇటీవలి (హర్యానా/మహారాష్ట్ర) గోవధ నిషేధపు బిల్లుల పట్ల వెలిబుచ్చిన ఆనందంలో …

***
ఇతఃపూర్వం వెలుగు చూడని “పోద్దార్ పేపర్స్” పెన్నిధి, నేషనల్/స్టేట్ అర్కైవ్స్‌లో భద్రపరచబడ్డ బ్రిటిష్ కాలం నాటి ఆధికారిక పత్రాలు, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ వారి ఓరల్ హిస్టరీ ప్రాజెక్టులో భాగమైన స్వాతంత్య్రోద్యమ నాయకుల జ్ఞాపకాల కవిలెకట్టలు, గీతా ప్రెస్ ముద్రణలు, కల్యాణ్ పాత సంచికలు, మన దేశపు గత శతాబ్దపున్నర చరిత్ర గురించి (అందునా హిందుత్వం గురించీ) వెలువడ్డ ప్రామాణిక గ్రంథాలు, ఇటీవలేటెస్టు అముద్రిత పరిశోధనాపత్రాలు…వందలాది ఆకరాలను పరిశోధించి, – విశ్వసనీయంగా, పోలెమికల్ ధోరణులకు దిగకుండా, అకడెమిక్ కంఠస్వరంలోనే రచనను కొనసాగిస్తూ ఈ పుస్తకాన్ని రాసేందుకు అక్షయ ముకుల్‌కి ఏడేళ్ళ వ్యవధి పట్టిందట. “Time well spent!” అని మీరూ ఒప్పుకుంటారు, ఈ పుస్తకాన్ని చదివితే .
***

అదనపు వివరాలు

  1. హార్పర్ కోలిన్స్ వారి ప్రచురణ; ప్రచురణ సం. 2015; 552 పేజీలు; అమెజాన్ లింకు
  2. రచయితతో ఇంటర్వ్యూలు (1, 2)
  3. కొన్నిసమీక్షలు (1, 2, 3, 4)
  4. హిందూ కోడ్ బిల్ యుద్ధాధ్యాయం

You Might Also Like

5 Comments

  1. bollojubaba

    Yes
    It’s a great essay
    Thank you srinivas gaaru

  2. varaprasaad.k

    గీత ప్రెస్ ప్రతి హిందువు గర్వించేలా ఇంత కాలం తన గమనాన్ని సాగించిన తీరు అద్భుతం ,జ్ఞాపకం చేసిన మీకు అభినందనలు.

  3. srinivasrav.kandala

    గీత ప్రెస్ గోరఖ్పూర్ సనాతన ధర్మానికి విశేషమయిన సేవ చేస్తుంది.లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ సేవ సత్ఫలితాలను ఇస్తోంది.ధన్యవాదములు.

  4. pavan santhosh surampudi

    ఇలాంటి పరిశోధనల్లో ప్రధానమైన లోపం మరో కోణాన్ని చూపించకపోవడం. ఈ పుస్తకం హిందూ అతివాదంతో పాటు దానికి కారణాలు, ప్రేరకాలు అయిన మరి ఇతర అంశాలను కూడా విశ్లేషిస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ తమ సౌలభ్యం కోసం వాటిని వదిలేసుకుంటారు. హిందూ జాతీయ వాదాన్ని విశ్లేషించేవారు ఎట్టి పరిస్థితిలోనూ 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో జరిగిన ముస్లిం వేర్పాటువాదాన్ని విస్మరించకూడదు. ఆ నాలుగో పార్శ్యాన్ని కూడా పరిగణిస్తే లోపలి, బయటి కారణాలతో సుసంపన్నం అవుతుంది పరిశోధనాంశం.

  5. లక్ష్మీదేవి

    సుదీర్ఘకాలంగా ఆధ్యాత్మిక ప్రచురణలలో అగ్రగామిగా ఉన్న,విశ్వసనీయమైన గీతా ప్రెస్ సేవల గురించి పుస్తకం, పరిచయం వ్రాసినవారికి ధన్యవాదాలు.
    ఆమధ్య ఫేస్ బుక్ లో దీనిని మూసి వేస్తున్నట్లు ప్రచారం జరిగితే ఆశ్చర్యపోయాను. తర్వాత గీతా ప్రెస్ వారు ఈ వార్తను ఖండించారు.

Leave a Reply