పుస్తకం
All about booksపుస్తకాలు

January 4, 2016

అభయప్రదానము

More articles by »
Written by: రవి

సరస్వతీపుత్ర – పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించిన ఒక అపూర్వమైన చారిత్రక నవల ఇది.

ఈ రచనలోని కథాకాలం క్రీ.శ. పదహారవ శతాబ్దపు ఉత్తరార్థం. క్రీ.శ.1565లో ఒక విశ్వాసఘాతకుడి వలన తళ్ళికోట యుద్ధంలో అళియరామరాయలు గతించి, విజయనగర సామ్రాజ్యం ఓటమి పాలయ్యింది. విద్యానగరం విచ్ఛిన్నమయింది కానీ అళియరామరాయల తమ్ముడైన తిరుమల రాయలు రాజధానిని చంద్రగిరికి, ఆపై పెనుగొండకు మార్చి జీర్ణ విజయనగరాన్ని పునః ప్రతిష్టించినాడు. తిరుమల రాయల తర్వాత రంగదేవరాయలు, వేంకటరాయలు, ఆపైన వేంకటపతిరాయల తరం వచ్చింది. ప్రస్తుతం వేంకటపతిరాయలుంగారి కాలం.

తంజావూరు సంస్థానం విజయనగరానికి సామంతరాజ్యం. ఈ తంజావూరిలో చోళులను పారద్రోలి, ఒకప్పటి విజయనగర ప్రభువు అచ్యుతరాయలు (కృష్ణదేవరాయలి తర్వాతి రాజు), తన తోడల్లుడైన శివప్పనాయకుని ప్రభువుగా నియమించాడు. శివప్ప పుత్రుడు అచ్యుతప్ప. గోవింద దీక్షితులు శివప్పకూ, అచ్యుతప్పకూ కూడా మంత్రి. ప్రస్తుతం అచ్యుతప్ప వృద్ధుడైనాడు. అచ్యుతప్ప నాయకుని పుత్రుడు రఘునాథనాయకుడు యువకుడు. ఈతడు సంగీత, సాహిత్యాలలో మేటి. గొప్ప యోధుడు, దేశభక్తుడు, ధర్మనిష్టాపరుడు, కరుణాస్వభావుడు. ఈతని అనుంగు చెలికాడు యజ్ఞనారాయణ దీక్షితులు.

తంజావూరికి పొరుగు రాజ్యమైన ’జింజి’ కూడా విజయనగరానికి సామంతరాజ్యం. జింజి కి అధిపతి కృష్ణప్పనాయకుడు. వీడొక అవకాశవాది, ధూర్తుడు. ఒక పక్క పోర్చుగీసు వారు భారతదేశంలో క్రైస్తవమత స్థాపనకై ఉవ్విళ్ళూరుతున్నారు. పోర్చుగీసు వారి అండతో, మధుర వీరప్ప నాయకుడు, జగ్గరాజుల సహాయంతో విప్లవం లేవదీసి విజయనగరాన్ని కూల ద్రోయాలని జింజి కృష్ణప్పనాయకుని కుటిలమైన ఆలోచన.

’జింజి’ కి, తంజావూరుకు మధ్య కోలగన్ నదీ పరీవాహక ప్రాంతంలో ఒక దట్టమైన అటవీప్రాంతం ఉన్నది. అక్కడ సోలగుడనే ఒక కిరాతకుడు నివసిస్తున్నాడు. వాడికొక కోట. గ్రామప్రజలను దోచుకోవడం, కనిపించిన స్త్రీనల్లా మానభంగం చేయడం, భైరవోపాసన చేస్తూ, నరబలులు ఇవ్వటం ఈతని నిత్యకృత్యాలు. నది మధ్య దీవిలో ఉన్న వీడి కోట దుర్భేద్యం. ఇతడిని సమీపించడానికి కూడా ఎవరికీ ధైర్యమూ, అవకాశమూ కూడా లేవు. ఈ సోలగుడు కృష్ణప్పకు అనుచరుడు. కృష్ణప్పకు అప్పుడప్పుడూ కావలసిన ధన సహాయం, సైన్య సహాయం చేస్తుంటాడు. బదులుగా కృష్ణప్ప వాడి చర్యలను ఉపేక్షిస్తూ ఉంటాడు. ఆ ఉపేక్ష వెనుక కొంత భయం, కొంత లాలస.

వేంకటపతి రాయల వారు రఘునాథ నాయకుని సహాయంతో విద్రోహి కృష్ణప్పను బంధించి ఖైదు చేయించారు. కృష్ణప్పను బంధించడానికి సహాయపడిన రఘునాథుడే, తర్వాతి సందర్భంలో రాయలకు యుద్ధంలో గొప్ప సహాయం చేసి, ప్రతిసహాయంగా దయ తలచి కృష్ణప్పను విడిపించినాడు. అందుకు కృష్ణప్ప, తన కూతురు కళావతిని రఘునాథనాయకుడికి ఇచ్చి అల్లుణ్ణి చేసుకున్నాడు. ఒకసారి ఖైదు నుండి బయటపడినా, రఘునాథ నాయకుడికి మామ అయినా, కృష్ణప్ప నాయకుడిలో మార్పు లేదు. తిరిగి ధూర్తత్వంతోనే ఉంటాడు.

ఈ చారిత్రక యవనికపై ఒక సంఘటన జరుగుతుంది. తంజావూరికి చెందిన ఒకానొక ప్రముఖ వైశ్యదంపతులు అడవిలో వెళుతుంటే, సోలగుడు వారిని బంధించి భైరవునికి బలివ్వటానికి తలపెట్టాడు. చైత్రపౌర్ణమికి ఇంకా రెండు నెలల గడువు. ఈ రెండునెలల్లో ఆ జంటను విడిపించాలి. దీనికి రఘునాథనాయకుడు పూనుకుంటాడు. ఇది సామాజిక సమస్యే కాక రాజకీయ సమస్య కూడాను. ఈ ప్రయత్నంలో రఘునాథనాయకుడు వేసిన యుక్తి ప్రయుక్తులు, యజ్ఞనారాయణుని సాహసం, నేర్పు, తదనంతరం జరిగిన ఘటనలతో అభయప్రదానం ఎలా జరిగింది? అని నవలలో చదువుకోవచ్చు.

రఘునాథ నాయకుడు రచించిన రచనలేమిటి?
’జింజి’ కి సప్తమాతృకలకూ ఉన్న సంబంధం ఏమిటి? ’కమలకణ్ణి’ కథ యేమిటి? జింజి కి ఆ పేరు ఎలా వచ్చింది?
’సింగావరము’ రంగనాయకుల స్వామి విగ్రహం తల కాస్త వంచినట్లుగా ఎందుకు కనబడుతుంది?
విజయనగర రాజులు దక్షిణభారతాన్ని ఎలా జయించారు?
వారు ఈ ప్రాంతాలను జయించడానికి అంపిన నలుగురు వీరులెవ్వరు?
’తుపాకుల కృష్ణప్ప’ ఎవరు? ఆతని ఉదంతమేమిటి?
తాడిపత్రి ’అలూరు కోన రంగనాయక స్వామి’ ఎవరి కులదైవమయ్యాడు?
ఇమ్మడి కుళోత్తుంగచోళుని కాలంలో వైష్ణవ శైవ వైషమ్యాలు ఎలా, ఎక్కడి నుంచి మొదలయ్యాయి?
ఆ వైషమ్యాల తదనంతర పరిణామం ఏమిటి?
నీలకంఠదీక్షితుల గురువెవ్వరు?

ఇటువంటి అనేకమైన చారిత్రక విషయాలను నవలతో సమన్వయిస్తూ పుట్టపర్తి వారు అల్లిన చిక్కని అల్లిక ఇది. చరిత్రను యథాతథంగా వ్రాస్తే అది ’చారిత్రక వ్యాసం’. ’చారిత్రక నవల’ – అంటే చరిత్రకు ప్రాధాన్యత ఉన్న ఒకానొక ’కథ’. కథ కాబట్టి కల్పన తప్పదు. కల్పన ఎక్కువైతే చరిత్ర నీరసిస్తుంది. లేదా చరిత్ర వికృతమవుతుంది. రచయిత తన సిద్ధాంతం చెప్పటం కోసం, కల్పన అన్న ’సాకు’తో సాభిప్రాయంగా చరిత్రను వక్రీకరించే చారిత్రక నవలలూ తెలుగులో కద్దు. ఈ నేపథ్యంలో చరిత్రను సమగ్రంగా పరిశోధించి, పరిశీలించి ఆసక్తికరమైన చరిత్రను వింగడించిన కొన్ని నవలల్లో ఈ నవల ఒకటి. చరిత్రతో, ముఖ్యంగా విజయనగర చరిత్రతో పుట్టపర్తి వారికి గల సమగ్రపరిచయం ఈ చారిత్రక రచనలో కనిపిస్తుంది.

విద్యానగరం (హంపి) ని బహమనీ సుల్తానులు ఆక్రమించిన తర్వాత విజయనగరం పూర్తిగా నశించిందని ’హెరాస్’ వంటి పాశ్చాత్య చారిత్రకులు వ్రాశారు. కానీ ఇది అబద్ధమని, తర్వాత కూడా చాలా కాలం పెనుగొండ రాజధానిగా విజయనగరం సుల్తానుల దాడులను తట్టుకుని నిలబడిందని కొన్ని శాసనాల వలన, వసుచరిత్ర, నరపతి చరిత్ర వంటి కావ్యాల వలన స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి, పెనుగొండలో ఆంజనేయ దేవాయలం వెనుక కనిపించిన ఒక శాసనాన్ని రాళ్ళపల్లి గోపాలకృష్ణశర్మ గారు పరిశోధించి, 1926 శ్రీసాధన ఆరంభ సంచికలో ప్రకటించారు.

చారిత్రక నవలలో నాటి చారిత్రక వాతావరణం కనిపించాలి. దీనికి భాష కూడా కొంత తోడ్పడుతుంది. ఈ సందర్భంలో తిరుమల రామచంద్ర గారు తమ ఆత్మకథ “హంపీ నుండీ హరప్పా దాక” లో చెప్పిన ఒక ఉదంతం గుర్తుకు వస్తుంది.

రామచంద్ర గారు తంజావూరిలో ఉన్నప్పుడు విజయనగరకాలంలో అక్కడికి వెళ్ళిన తెలుగు వారిని, వారి సాంప్రదాయాలను, వెయ్యేళ్ళుగా వారు కాపాడుకుంటున్న వారి తెలుగు భాషను చూసి అబ్బురపడ్డారట. రామచంద్ర గారితో అక్కడ సుబ్బురెడ్డి గారు అనే ఆయన అన్నారట – “మీరు మా భాష బాగుందని చెపుదురు. కానీ మాకు సిగ్గయ్యీని”. క్రియాపదాల ద్విత్త్వం తరువాత “ని” జోడింపు. “అయ్యీని”, “పొయ్యీని”, “ఉండేని” ఇటువంటివి రాయలసీమ పల్లెప్రాంతాలలో కూడానూ క్వాచిత్కంగా కనిపిస్తాయి.

అభయప్రదానంలో ఒకట్రెండు చోట్ల రచయిత ఈ భాషను ఉపయోగించడం ఉన్నది. వేంకటపతి రాయలుంగారు తంజావూరు ప్రభువులకు పంపిన రాయసము – ఇలా ఉంటుంది.

“స్వస్తిశ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర మేదినీమీసరగండ – జీర్ణకర్ణాటపునరుద్ధారణేత్యాది బిరుదాంకితులైన – శ్రీమద్విద్యానగర రత్నసింహాసనాధీశ్వరులైన వెంకటపతిరాయలుంగారు సామంతశ్రేష్టులైన అచ్యుతప్ప నాయకునిఁ గారికి ప్రీతిగౌరవములతో పంపిన నిరూపకము.

పరమపూజ్యులైన యచ్యుతరాయల కాలము నుండిన్నీ మీ తండ్రిగారైన శివప్ప నాయకులున్నూ, మీరున్నూ సామ్రాజ్యానికి గొప్ప సేవలు చెల్లించుచూ వచ్చుచున్నారు. ఇంతవఱకున్నూ విజయనగర సామ్రాజ్యానికి మీరు చెల్లించిన సేవలను మేము సదా తలచుకునేము.

ఈ నాడు మహాసామ్రాజ్యం యొక్క చావుబ్రతుకుల ప్రశ్న సమీపించేని. ఈ మహాయుద్ధాన మనం బ్రతికి బయటపడినచో ఏ పవిత్రఫలములకై సామ్రాజ్యము నిర్మింపబడెనో ఆ యుద్దేశ్యము లీడేరేని. లేకున్నచో సామ్రాజ్యముతో పాటవిన్నీ నాశనమయ్యేని. …

ఈ పత్రమును చూచిన వెంటనే మీరు సకల సైన్యముతో మా సహాయార్థమై వచ్చుచున్నారని నమ్మేము.

ఇట్లు
చతుస్సముద్రాధీశ్వర
వేంకటపతి రాయల వ్రాలు”

ఆహ్లాదకరంగా, రఘునాథనాయకుడు, కళావతిల ప్రణయకలహంతో ఆరంభమయ్యే ఈ నవల, ఆ తర్వాత మెలమెల్లగా ఉత్కంఠభరితంగా మారుతుంది. చివరివరకూ అదే బిగిని చదివిస్తుంది. చివర తిరిగి చిన్ని ప్రణయోదంతంతో ముగుస్తుంది.

ఆచార్యుల వారి నవల శైలిలోని ఒకట్రెండు విభిన్నమైన లక్షణాలను కూడా చెప్పుకోవాలి. అక్కడక్కడా రాయలసీమ మాండలికపు శబ్దాలు కనిపిస్తాయి ఈ నవలలో. రచయిత కథను దాటి బయటకు వచ్చి చారిత్రక విశేషాలు చెప్పటం ఒకట్రెండు సందర్భాలలో ఉంది. ఆచార్యుల వారి శైలి కొంచెం గ్రాంథికంలా కనిపిస్తుంది కానీ అంత ఆయాసపరిచే గ్రాంథికం కాదు. అభయప్రదానము నవల రచనాకాలం 1962. ఈ నవలలో ఈ వ్యాస రచయిత గమనించిన ఒకే ఒక చిన్ని దిష్టి చుక్క యిది – ఆరంభంలో కళావతి, రఘునాథుడు చదరంగం ఆడడానికి ఉద్యుక్తులవుతారు. అప్పుడు కళావతి ’పాచిక’ లందుకుంటుంది!

ఈ పుస్తకం విడిగా దొరికే అవకాశం లేదు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి సమగ్ర గద్య సాహిత్య సంకలనాన్ని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖవారు శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారి సంపాదకత్వంలో రెండు భాగాలుగా ముద్రించారు. వాటిలో మొదటి భాగంలో ఈ నవల ఉన్నది. ఈ నవలతో బాటు మరో నాలుగు రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఈ రెండు భాగాలు ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్నాయి. వెల – ఒక నెల ’సొల్లు’ ఫోను బిల్లు లేదా ఇంటర్నెట్ బిల్లు కన్నా చాలా తక్కువ. ముద్రణ, పేపరు, ముఖపత్రం నాణ్యత చాలా చక్కగా ఉన్నాయి.About the Author(s)

రవి7 Comments


 1. Gopala krishna

  గోపాలకృష్ణ

  వ్యాసం చాల బాగుంది నవలని కొనుక్కుని చదవాలనిపించేల వుంది


 2. Chiranjeevi pattipati

  హంపి నుండి హరప్పా దాక తాపి ధర్మరావ్ కదా తిరుమల రామ చంద్ర కాదు


 3. చాలా బాగా వ్రాసారండి రవిగారూ! నేను ఇక్కడ పరిచయం వ్రాసినపుడు నాకు అసంతృప్తిగానే ఉండింది.


 4. వసంత రేణుక

  వ్యాసకర్తకు ధన్యవాదములు.రచయిత రచనసౌందర్యమును చక్కగా తెలిపినారు.


 5. hrk

  పాచికలందుకొనడంలో తప్పేమిటి? ఆటకు ఉద్యుక్తులవుతున్న సందర్భం కదా. పాచికలు వేయడానికి వాటిని చేతిలోనికి తీసుకునే పనిని అలా అనవచ్చు, కాదాంటారా?


  • hrk

   ఓహ్, మీరు చెప్పే దాక నాకు తట్టలేదు. అది చదరంగం కదా, అందులో పాచికలుందవు కదా. 🙂 సాధారణంగా చదువుతూ కొట్టుకుపోతాం.. మీ జాగరూకతకు అబినందనలు.


 6. hrj

  వ్యాసం చాల బాగుంది. అవసరమైన సమాచారం. ఆ రెండు వాల్యూములు కొనుక్కోవాలి.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పుట్టపర్తి నారాయణచార్యులు

అది 1989 అనుకుంటాను సరిగ్గా గుర్తు లేదు. నా కాలేజీ మొదటి రోజులు. మా అప్పకు పుట్లూరి శ్రీ...
by రవి
0

 
 

(శవ) సాహిత్యం మీదకి నా దండయాత్ర

అను MY EXPLORATIONS TO THE WONDROUS WORLD OF BOOKS వ్యాసకర్త: సాయి పి.వి.యస్. ********************* ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం సౌమ్య ...
by అతిథి
0

 
 

నా కథ – చార్లీ చాప్లిన్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార...
by పుస్తకం.నెట్
0

 

 

The Book of Joy

వ్యాసకర్త: Naagini Kandala ***************** The Book of Joy:Lasting Happiness in a Changing World by Dalai Lama XIV, Desmond Tutu, Douglas Carlton Abrams కొన్ని పుస్తకాలు దా...
by అతిథి
0

 
 

జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్

పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహ...
by పుస్తకం.నెట్
2

 
 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2