విశ్వనాథలోని ‘నేను’ – మొదటిభాగం

రచయిత: పేరాల భరతశర్మ
టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి
(తొలి ముద్రణ విశ్వనాథ శారద(ప్రథమ భాగము) అనే సంకలనంలో సెప్టెంబరు 1982న జరిగింది. ఇందులో ప్రస్తావించిన అన్ని విషయాలు వాటికవే అక్కడే తెలుసుకోదగినవి కానీ చివరి భాగంలో వచ్చే పావని గురించి సరైన వివరణ లేదు. పావని అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ద్వితీయ కుమారులు, వారి సమగ్ర సాహిత్యానికి సంపాదకత్వం వహించి, తానూ స్వయంగా నవలలు మొదలైనవి రచించినవారూ అయిన శ్రీ విశ్వనాథ పావనిశాస్త్రి. –సూరంపూడి పవన్ సంతోష్)
(ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్  .)

*****************
‘‘ఆ వచ్చుచున్న మహాపురుషుడు దబ్బపండువంటి దేహచ్ఛాయ వాడు, కోల గుండ్రముకాని ముఖము, ఆజానుబాహువు, నల్లని కనులు, విశాలమైన ఫాలభాగము వయ సేబదియేండ్లుండును.”
‘‘కాయపారు మనిషి     నిగనిగలాడు శరీరము.  కోసలైన కనులు  తెలివి కొట్టవచ్చినట్లుండు మొగము.  అందమనగా నాయనదే యందము.”
‘‘ఆయన పేరు ధర్మారావు”
‘‘కాదు విశ్వనాథ సత్యనారాయణగారు”
వేయిపడగలలోని మాటలనే అనువదిస్తున్న ఈ సంభాషణ 1951 సంవత్సరం జూన్ నెల చివరివారంలో ఒకానొకనాడు విజయవాడలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది- శ్రీరాజారంగయ్యప్పారావు చుండూరు వేంకటరెడ్డి కళాశాల ప్రిన్సిపాలు గదిముందు వరండాలో నేను B A.లో చేరడానికి అక్కడే వేచివున్నాను. మా అన్నయ్య లక్ష్మణరావు నాకు తోడుగా వచ్చాడు. దూరం నుండి వస్తున్నవారిని గూర్చి మా పక్కనున్న యిద్దరూ అలా అనుకుంటూవుంటే మా అన్నయ్య కూడా కల్పించుకొని  “ఆయన గొంతుక వీణానిక్వానమువంటిది” అన్నాడు .తమ గడుసుదనాన్ని కనిపెట్టి అన్న మావాడి మాటలకు వాళ్ళు కొంచెం చకితులయ్యారు. ‘‘అవునండీ! వేయిపడగలలో ధర్మారావు శ్రీ విశ్వనాథవారే కదండీ” అని తమను సమర్థించుకొంటున్నట్లు వారు మాట కలిపారు. వీరితో మరొకాయన వచ్చి చేరాడు. ‘‘దానకేం లెండి! ఆ మాటలకు వస్తే కల్పవృక్షంలో రాముడిలో ఆయన కనిపిస్తారు. విశ్వామిత్రుడు ఆయనే అనిపిస్తుంది. దశరథుడు, జనకుడు వారి ఉదాత్తత, వారి చమత్కారాలు చూడండి. వారిలో ఆయన లక్షణాలు లేవూ? బాలకాండలో చూడండి!’’ అంటూ ఆయన రామాయణం వైపు తవ్వుకుపోతున్నాడు  “అశ్వత్థ స్సర్వవ్రక్షాణాం గంధర్వాణాం చిత్రరథ: ఆయుధానా మహం వజ్ర ధేనూనామస్మి కామధుక్” అని భగవంతుడన్నట్టే ఆయన యొక్క ఒక్కొక్క గ్రంథంలోని ఒక్కొక్క ఉత్తమోత్తమ పాత్ర ఆయనే అంటాను నేను” అంటూ సిద్ధాంతీకరించినట్లు మొగంపెట్టేశారాయన. ఆ మహాపురుషుడు ప్రిన్సిపాలు గదిదగ్గరకు చేరుకోవడంతో అందరూ నోళ్ళు కట్టేసి చేతులుజోడించారు.
‘‘అలఘుస్వాదురసావతారధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి” అనుకుంటూ నేను నమస్కారం చేశాను. ఏదో ఆనందం ఏమో తన్మయత్వం! నా కళ్ళు మూతపడిన సంగతి నాకు తెలియదు. మా అన్నయ్య తర్వాత అన్నాడు  “ఓరి! దౌర్భాగ్యుడా! నీవు నమస్కారం పెడితే ఆయన నీవైపు చూచి చిరునవ్వు నవ్వాడు. నీవు కళ్ళుమూసుకున్నావేమిటి? ‘చిరునవ్వు నవ్వెనా చిన్నారి ముత్యాలు ప్రోవులు ప్రోవులు పోసినట్లు’ అంటే ఏమిటో నీకు తెలిసేది. ఆయనగారి ఆ ప్రసన్నత చూడాల్సింది” అన్నాడు. ‘‘ఆయన నవ్వింది నేను చూడలేదు కాని ఆ క్షణంలో నాలో వెన్నెల ప్రాకినట్లుంది. అది చాలురా ఈ జన్మకు” అన్నాను.
అప్పటికి వారితో ప్రత్యక్ష పరిచయం లేదు. అదే వారిని మొట్టమొదటిసారిగా దగ్గరలో  చూడడం కూడా. ఆ కాలేజీలో B.A. స్పెషల్ తెలుగులో చేరడానికి సంవత్సరం వేచివున్నాను. ప్రిన్సిపాలు వద్దకు ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు ఆయన వుంటారేమోనని భయభయంగా లోపలికి వెళ్ళాను. ఆయన అక్కడ లేరు. ప్రిన్సిపాలు అప్లికేషను తీసుకుని డబ్బు కట్టమన్నాడు. ఆఫీసులో డబ్బు కట్టాడు మా అన్నయ్య. క్లర్క్ దగ్గర రూపాయిచిల్లర లేదు; అర్ధరూపాయి యివ్వాలి మా అన్నయ్య వరండాలోకి వచ్చి రూపాయి చిల్లరకోసం వారిని వారినీ అడుగుతున్నాడు. అప్పుడు వరండాలో ఎవరితోనో మాటాడుతున్న శ్రీ విశ్వనాథ  “ఇటురా! ఎంతకావాలి” అన్నారు. “రూపాయి చిల్లరండీ” అన్నాడు మా అన్నయ్య. ‘‘అది సరే! అక్కడ ఎంత చిల్లర యివ్వాలి చెప్పు” అన్నారు. ‘‘అర్థ రూపాయి అండీ” “చూస్తాను” అని పర్సు తెరుస్తూ “అర్థరూపాయి వుంటే నీ అదృష్టం” అంటూ  “వుంది” అన్నారు. మా అన్నయ్య “ఇంకో అర్థరూపాయి కూడా ఉంటుంది చూడండి సార్” అన్నాడు. ఆయన నవ్వుతూ  “అది వుండడం నా అదృష్టం అంటావు. అదీ వుంది” అని రెండర్థరూపాయిలు చిల్లర యిచ్చి రూపాయి తీసికొని పర్సులో పెట్టుకున్నారు. నేను వంగి వారి పాదాలు కళ్ళకద్దుకున్నాను. ‘‘ఇకనుండీ మావాడు మీ శిష్యుడండీ! ఇది మా భాగ్యం” అన్నాడు మా అన్నయ్య. మాష్టారు నా బుగ్గమీద తమాషాగా చిటికెవేసి నవ్వారు. అది మొదలు ఆ అదృష్టం నాకు 1976 అక్టోబరు 18 న ఆయన కన్నుమూసేవరకూ అవ్యాహతంగా దక్కింది.
‘‘ఆయన మహాపండితుడే, గొప్ప అధ్యాపకుడే. మహాపురుషుడే. కాని ఆయన చాలా గర్వి, అహంకారి, కోపిష్ఠి తొందరపాటు మనిషి. తిడతాడు. మొహాన వుమ్మేస్తాడు. ఏ క్షణాన ఎలా వుంటాడో తెలియదు. ఆయనతో వేగడం చాలా కష్టం. అంతంత మాత్రంగా ఆయన దగ్గరకు చేరనీయడు. మనిషి చాలా భయంకరుడు. కావాలని మీవాణ్ణి ఆయన వున్నాడని B.A స్పెషల్ తెలుగులో చేర్చడం కంటె ఏ B.Com లోనో చేర్చండి. లేదా యూనివర్శిటీకి పంపండి లేదా మరోచోట చేర్పించండి. ఆయన ఏమైనా అంటే మీవాడు అభిమానపడితే అప్పుడు సర్దుకోవడం కష్టం” అని కొందరు ప్రబుద్ధులు మానాన్నగారిని భయపెట్టారు. మా నాన్నగారు అప్పుడన్న మాటలు నాకిప్పటికీ గుర్తు  “దూరపుకొండలు నునుపు అంటారు. శ్రీ విశ్వనాథ వారి విషయంలో అలా కాదు. ఆయన దూరానికి గర్విగా, అహంకారిగా, కోపిష్ఠిగా కనిపించవచ్చు. సమక్షంలో సన్నిధిలో ఆయన అమ్రుతప్రాయుడు కావచ్చు. దూరంనుండికాదు దగ్గర నుండే అలాంటివారిని అర్థంచేసుకోవాలి” అని నన్ను ఆ కాలేజీలో చేరడానికే పంపించారు. ఆనాడు ప్రిన్సిపాలు గదిముందు జరిగిన సంగతులు చెప్తే మా నాన్నగారు “చూశారా! నేను చెప్పలేదా! అంతటి మహానుభావుడు మిమ్మల్ని పిలిచి చిల్లర యివ్వడమేమిటి! ఆ చమత్కార సంభాషణ ఏమిటి! మీరు చిన్నపిల్లలు క్రొత్తవారు యాదృచ్ఛికంగా కలిశారు కాని ఆయన మీతో ఎంత సరసంగా మాటాడారు! ‘నీ అదృష్టం’ అన్న కవివాక్కు ఎంత అమ్రుతమయం అయింది నిజంగా ‘నీ అదృష్టమేరా’ చాలా ఆనందంగా వుంది” అన్నారు.

‘‘శిష్యవాత్సల్యంబు చెలువుదీర్చిన మూర్తి” అని తమ గురువుగారిని గూర్చి మా గురువుగారు చెప్పుకున్నారు. అది వారి విషయంలో యధార్థమనడానికి నేను ప్రత్యక్ష నిదర్శనం. ఆయన శిష్యులంటే ఎవరు? అన్న ప్రశ్న ఉండనేవుంది. ఆయనే చెప్పారు — ‘‘నేను ఎన్నో కాలేజీల్లో ఎన్ని ఏండ్లో పనిచేశాను. అప్పుడు చదువుకున్న వారంతా నా శిష్యులే అనడం ఏం న్యాయం? ఎందరో స్వబుద్ధి వికాసంతో మేధావులై ఎన్నో పెద్దపెద్ద పదవులు అలంకరించారు. వారంతా నన్ను గురువుగా చెప్పుకుంటారు. అది వారి మంచితనం అంటే వారు ఒప్పుకోరు. మాకు విలక్షణమైన ఆలోచనా పద్ధతిని నేర్పింది మీరే మా గురువలంటారు. ఇంకా కొందరు అత్యంత సన్నిహితులున్నారు. వాళ్ళు కొన్ని శాస్త్రాల్లో నిధులు. వాళ్ళూ నన్ను గురువుగారంటారు. వారిలో కొందరు నాతో కలిసి పనిచేసినవారు. కొందరు తరచు నన్ను కలుసుకునేవారు. మేము శాస్త్రమే చదివాంగాని అందులోని రహస్యం మీవల్ల తెలిసింది. మీరు మాకు గురువులు అంటారు. అది వారి మంచితనమే. ఇంకాకొందరున్నారు. వారి మొగం నేను చూడలేదు. వారు ఎప్పుడూ ఉత్తరాలు వ్రాస్తుంటారు. మేము మీకు ఏకలవ్య శిష్యులమని. అలాంటి కొందరు అప్పుడప్పుడూ పత్రికల్లో కొన్ని వ్యాసాలు విమర్శలు వ్రాస్తూంటారు. వారి వ్యాసాలూ విమర్శలూ అన్నీ నా గ్రంథాలని అధ్యయనం చేసినందువల్ల పొందిన సంస్కారంతో వుంటాయి. కొందరు వ్యాసాలు వ్రాయని వారున్నారు. నేను ఏ సభలోనో కనిపిస్తే వచ్చి దణ్ణం పెడ్తారు. ఏవో కొంతసేపు మాట్లాడతారు. వారు ఎంతో చక్కని భావుకులుగా కనిపిస్తారు. మేము మీ శిష్యులమంటారు. అలా వారనడం నేను ఒప్పుకోకపోతే ఎట్లా? సరే , వారూ శిష్యులే. ఈ రీతిగా నాకు దేశం నిండా వేలసంఖ్యలో శిష్యులున్నారు. అది నా అహంకారం అనుకుంటారు కొందరు. ఇది నాజాతకం. నేను వినయంగా నాకు మీరేమి శిష్యులంటే వారు ఒప్పుకోరు. నేను వారికి గురువునే. వాళ్ళు నాతో నిత్యం తిరిగేవారికంటే ఎక్కువ శ్రద్ధగా నా గ్రంథాలు చదివారు. నా పద్యాలు వందలు వేలుగా కంఠస్థం చేశారు. వారు ఏ పద్యమన్నా సొంతంగా వ్రాస్తే అది నేను వ్రాసినట్లు వ్రాస్తారు. నా మార్గాన్ని బాగా పట్టుకొన్న లక్షణం వారిలో కనిపిస్తుంది. వారు నిజానికి శిష్యులంటే శిష్యులే. ఇలాంటి శిష్యులు నేను బ్రతికుండగానే కాదు. ఈ లోకం విడిచిపోయినా వుంటారు. ఈ తెలుగుదేశం నా పుస్తకాలను బ్రతకనిచ్చినన్నాళ్ళూ వుంటారు. నేను ఏ గ్రంథం వ్రాసినా బుద్ధిమంతుడైనవానికి కొంత ఉపయోగించే విషయమే వ్రాసాను. మేధావి యైనవాడు తరచిచూస్తే పూర్వాపరానుసంధానం చేసుకుంటే నా గ్రంథాలన్నిటిలోనుండీ నేను గురువుగానే కన్పిస్తాను. అలాంటి గురుత్వం పొందని లక్షణంతో నేను ఏ గ్రంథం వ్రాయలేదు. నేను వ్రాయడం కాదు. నా నోటిలోనుండి అలా వాక్కు వస్తుంది. అలా వాగావిష్కారం జరిగేవరకూ ఆ వాక్స్వరూపం అలా వుంటుందని నాకే తెలియదు. ఆవిష్క్రుతమైన ఆ వాక్కును చూచి మీలాగే నేనూ ఆశ్చర్యపోతాను. కనక నాకు శిష్యులంటే ఆ వాక్కుకు శిష్యులన్నమాట. ఇది యధార్థం. అటువంటి నా శిష్యులు చిరకాలం వర్ధిల్లాలని నా ఆశ.”
అలా అని తాను కాలేజిలో పనిచేసేప్పుడు ఉన్నవారిని ప్రేమించలేదని కాదు. ఆ ప్రేమ, ఆ వాత్సల్యం అపారం. 1956లో మా విజయవాడ కాలేజీలో వారికి షష్టిపూర్తి సన్మానం జరిగినప్పుడు లేతలేత మొగాలతో చిరునవ్వులు చిందిస్తున్న తన విద్యార్థులందరినీ చూచి సభలో ఆశువుగా ఒక పద్యం చెప్పారు. అది ఆయన ప్రేమకు పతాక

‘‘చిఱుత తామరపూల్ వికసించుచున్న
చెఱువునుంబోని మీ ముఖసీమలొప్పు
ఈ కళాశాల గురువనై యెసగుచుంటి
నిత్యమార్తాండమూర్తిని నేనొకండ”

తాను నిత్యమార్తాండమూర్తిని కనుక ఆ తామరపూలు వికసించేవుంటాయన్నమాట. మార్తాండుని వెలుగుసోకని తావేలేదు “ఈ కళాశాల గురువునై యెనగుచుంటి” – తన గురుత్వము కళాశాలపైన నిత్యమార్తాండతేజముతో పరివ్యాప్తమై వుందట.

మాకు తెలుగు అభిమాన పాఠ్యాంశంలో మహాభారతములో సభాపర్వములో ద్వితీయాశ్వాసముంది దానినొక మాష్టారు చెప్పేవారు. ఆయన గంటకు ఏభై పద్యాలు చదువుకుపోయి ఏదో వివరించేవారు. మేము ఆ గ్రూపులోని నలుగురు విద్యార్థులం “మాస్టారూ! మాకు భారతం మీరుచెప్పండి” అని ఒకసారి గురువుగారిని అడిగాము. ‘‘మీకు ఏ పాఠం ఎవరుచెప్పాలో మీరానాకు చెప్పేది?’’ అని గద్దించారు. వణికిపోయాం. ‘‘కాదు మాష్టారూ” అన్నాను “కాదు లేదు గీదులేదు పొండి” అని తరిమేశారు. తన తోటి ఉపాధ్యాయుడి గౌరవాన్ని కాపాడడంలో ఆయన పట్టుదలచూచి మేము మొగాలు వ్రేలాడవేసుకొని నోరుమూసుకుని ఊరుకున్నాం. మళ్ళా ఆ ప్రసక్తి ఆయనవద్ద తేలేదు. మా మామూలు మాష్టారు తమ మామూలు ప్రకారం సభాపర్వం ఒక వారంలో పూర్తిచేశారు. తర్వాత ఆయన పారిజాతాపహరణం కూడా అలాగే చేశారు. పరీక్షలింకా మూడు నెలలున్నాయి. గురువుగారు మమ్మల్ని నలుగురినీ ఒక ఆదివారం ఇంటికి రమ్మన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాం. అప్పుడు వారి యిల్లు ఒక చిన్నపాక. ఎవరైనా వస్తే కూర్చుండేందుకు ఇంటి ఆవరణలో ఆగ్నేయభాగంలో అష్టకోణాకారపు చుట్టుగుడిసె వుండేది. రాతి అరుగులుండేవి. చుట్టూ మాతోబాటు ఆయన కూడా వాటిమీదే కూర్చున్నారు. భారతం సభాపర్వం తెచ్చి ద్వితీయాశ్వాసం మా పాఠం మొదలుపెట్టారు.

‘‘అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె, నట్లు రాజసూయ మహోత్సవంబు నొప్పను, ధర్మరాజు ధర్మ నిత్యతయును స్తుతించి నారదుండు…’’ మొదలైన వచనం చదివి అక్కడ ఆపారు. రాజసూయ మహోత్సవంబు నొప్పును, ధర్మరాజు ధర్మనిత్యతయు అన్న రెండు విషయాల గురించే చెప్పారు. సాయంత్రం అయిదయింది. సభాపర్వం అంతా తేనెపట్టును కదిలించినట్లు కదిలించారు తేనెటీగలలాగా ఎన్నో రహస్యాల చాటున కథాపరమార్థం వుంది. ఆ ఆశ్వాసం అలా ఎందుకు ప్రారంభించాడు కవి? వచనమే ఎందుకు వ్రాశాడు? ఆ రెండు సమాసాల కూర్పు ఎటువంటిది? మహోత్సవంబు నొప్పును, ధర్మరాజు ధర్మనిత్యతయు అన్న ఆ సముచ్చయార్థ కాలంలోని స్ఫూర్తి ఏమిటి? ఇలా ప్రశ్నలూ వాటి సమాధానాలు భావ ప్రపంచంలో ఉయ్యాలలూగించారు. నారదుడు సభను భావించిన వైఖరి ఏమిటి? ఆయన చెప్పే విషయం  – ఒక మాటో రెండు మాటలో మహా అయితే మూడు మాటలు – విసుగు పుట్టదు ఆశ్చర్యానికి అంతువుండదు. ప్రతిక్షణం క్రొత్త విషయం బయటపెట్టడమే . “ఆ వచనం గురించి ఇంకాచెప్పాలి రేపు కాలేజి కాగానే యింటికి వద్దాం ద్వితీయవిఘ్నం కాకుండా చెప్తాను రండి” – అప్పుడాయన కళ్ళలో వెలుగు మొగంలో చిరునవ్వు ఆయన దయనంతా పైకి చిమ్ముతున్నట్టున్నాయి. మరునాడు పాఠం చెప్పారు. ఛందస్సులు మారినాయి. మళ్ళా వచనం వచ్చింది. తరువాత సీసపద్యం కథతోపాటు ఈ మర్మాలు త్రవ్వుకుని వస్తున్నాయి. ద్రౌపదీ వస్త్రాపహరణం గూర్చిన సీసపద్యం చెప్పేనాడు, ఆయన శాలువా నాలుగు మడతలుగా పెట్టి ఎడమభుజాన వేసుకొని కూర్చున్నారు. ‘‘దుశ్శాసనుండు నెట్టన ద్రౌపది కట్టిన పుట్టంబు సభలోన విడ్చె నాశంకలేక యడుగక యొలువంగఁబడియు మున్నపనీతమైన తద్వస్త్రంబు నట్టి వలువ లలితాంగ జఘన మండలమునఁబాయక యొప్పుచునున్న వయ్యువిదఁజూచి సభ్యులెల్ల నుదిత సమ్మదులైరి” – ఆ పద్యం చెప్పేటప్పుడు ఆయనే ద్రౌపది ఆయననాలుగుమడతలతో ఎడమ బుజముపైగా కాళ్ళదాకా కప్పుకొన్న శాలువా ఆమెకట్టిన పుట్టము ఆయనచేయి దుశ్వాసనుడు మేము సభ్యులము ఆచుట్టు పాక సభామందిరము, దుశ్వాసనుడు ద్రౌపది కట్టిన పుట్టంబు విప్పుతున్నాడు శాలువా ఒక మడత తొలగింది “ఉడుగక యెలువంగబడియు మున్నపనీతమైన తద్వస్త్రంబునట్టి వలువ” శాలువా రెండవమడత “లలితాంగి జఘనమండలమున బాయక యొప్పుచున్నది”ఎన్ని మారులు చీరెలాగినా అలాంటి అలాంటి చీరే మళ్ళీ ఆమె శరీరం మీద కన్పిస్తున్నది. ద్రౌపది శరీరమునుండి చీరె తొలగడమనేది జరగలేదు. శాలువా మడతలతో ఆ పదంలోని ఔచిత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన సినిమాల వాళ్ళు “ద్రౌపది వస్త్రాపహరణ” మని పేరుపెడ్తారు. ద్రౌపది వస్త్రం అపహరింపబడితే కృష్ణుడామెను ఆదుకోవడమేమిటి? ద్రౌపది యొంటిమీద వస్త్రము తొలగలేదు “అందుకు సభ్యులెల్ల నుది సమ్మదులైరి” మేమే ఆ సభ్యులమనిపించింది ఆయన పాఠం చెప్పేవేళ. అది శిష్యుల అదృష్టం. ఆ ఆనందం అనుభవైక వేద్యం మాకు సభాపర్వం యింత నేత్రపర్వమైంది. హృదయపర్వమైంది. కాలేజీలో ఇతరులు చెప్పిన మిగతా తెలుగుపాఠాలన్నీ మళ్ళా మాకు ఆయన యింటిదగ్గర సింహావలోకనం చేశారు. అప్పుడాయనదయ మాకు అర్థమైంది. మేము స్పెషల్ తెలుగు చదివేమంటే బి. ఏ డిగ్రీకోసంకాదు. ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో గొప్ప పట్టాపుచ్చుకుంటున్నంత తృప్తి పొందాము.

ఆయన వాత్సల్యానికి హద్దులు లేవు. నా బి. ఏ మొదటి సంవత్సరం కాగానే మా తండ్రిగారు స్వర్గస్థులయినారు. అప్పుడాయన నన్ను ఆదరించిన ఘట్టం నా జన్మలో మరువలేను. నా చేయి తన చేతిలోకి తీసుకొని ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. నన్ను తన ఒంటికి అతుక్కుపోయినట్లు అదుముకున్నారు. మా కుటుంబ పరిస్థితినంతా క్రమంగా తెలుసుకొన్నారు. ‘‘ఏమైనా డబ్బుకావాలా?’’ –వద్దని తల ఆడించాను దుఃఖంతో నోట మాట పెగలక. ‘‘అవును కావాలంటావా? అభిమానం వుంటుంది. తప్పదు తండ్రి హోదా కుటుంబపు పాణీ. అభిమానపడకు. నాయనగారు లేరని బాధపడకు. నేనున్నాను” ఆయన నేను డబ్బు అడగనని ఖాయం చేసుకున్నారు. అప్పటి నా స్థితి ఎలాంటిదో ఆయన ఊహించారు. ఏదోరీతిగా సహాయం చేయాలని “నాయనా! పాతికరూపాయలు అద్దెపెట్టి మీకు యిల్లెందుకు? పెద్దది మీ అమ్మగారూ నీవే కదా! మేముటుంన్నది పాకలోనే కదా! అంతకంటె మంచిపాక మా ఆవరణలో ఆ ప్రక్కన వేయిస్తాను. అందులో వుండండి. నీవున్నన్నాళ్ళూ అది నీ సొంతం. కావలసినంత స్వేచ్ఛగా నీవు వుండి నిన్ను నేనేమీ చిన్నచూపు చూడను. గురుకులవాసక్లేశం లాంటిది నీకేమీ వుండదు. ఆలోచించి చెప్పు. పాక వేయిస్తాను” ఇలా ఎంతో చెప్పారు. ఆ అవకాశం కూడా నేను వినియోగించుకోలేదు. ‘‘మీ పెద్దవాళ్ళు వద్దన్నారు కదూ! న్యాయమే నాయనా! దశ మారిందని అభిమానం చచ్చిపోతుందా? బాగా బ్రతికిన కుటుంబంకదా!’’ అన్నారు.
‘‘మీరేమనుకోకండి మాష్టారూ” అన్నాను.
‘‘పిచ్చివాడా  ! నేనేమనుకుంటానోయ్ నీవు యిబ్బంది పడకుండా వుండటమే నాకు కావలసింది” అని ఆప్యాయంగా వీపుతట్టారు. ఆ తర్వాత ఒకనాడు నేను ఇంగ్లీషుక్లాసులో ఉన్నాను. కీ.శే. జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు గంభీరంగా పాఠం చెప్తున్నారు. గురువుగారు ఉత్తరీయం తలపాగాలాగా చుట్టి తలవెనుకనుండి ఉత్తరీయం కుచ్చు బుజం మీదికి లాగిపట్టుకొని క్లాసుగుమ్మం దగ్గరకువచ్చి “ఏడీ మావాడు ఎక్కడా?’’ అని నావైపు సైగచేసి బైటికిరమ్మని చేయి వూపారు. శ్రీ జొన్నలగడ్డ మూర్తిగారి వైపు అదొక ఒడుపుగా చూస్తూ  “అతనికి పర్మిషన్ యివ్వండి” అని నవ్వారు. మూర్తిగారు నవ్వులో నవ్వుకలిపారు. నేను బయటకువచ్చాను. మాష్టారు “నీవు Term fees కట్టాలికదూ.. ఎల్లుండిలోగా కట్టాలి ఆపైన పేరు తీసేస్తారు”
‘‘అవును మాష్టారూ”
‘‘నీవు ఫీజు కట్టవు కాలేజి కట్టుకుంటుంది”

నేను కొంచెం ఆశ్చర్యంగా వారివైపు చూశాను. ‘‘కాలేజి మేనేజుమెంటు నీకు స్కాలర్ షిప్పు గ్రాంటు చేసింది. ఇప్పుడే మీటింగయింది. మధ్యాహ్నం నోటీసు వస్తుందిలే”  ఈ మాటలంటూ ఆయన నాలిక మెలిత్రిప్పి సన్నగా నా మొగంపైకి గాలి వూదారు. అది చప్పుడులేని యీల. ‘‘పో ఇంగ్లీషుపాఠం నీకోసం ఆగిపోయింది. ఇక ఈ సంవత్సరం నీవు ఫీజు కట్టక్కరలేదు” అని హేలగా వెళ్ళిపోయారు. నేను స్కాలర్ షిప్ కు అప్లికేషన్ పెట్టలేదు. అది గవర్నమెంటు గ్రాంటుకాదు. మేనేజిమెంటు వారిది. మాష్టారు చేయించినది.

ఈ విషయం నేనుచెప్తే కొందరిట్లా అన్నారు. ‘‘ఎందరు విద్యార్థులకో ఆయన సొంత డబ్బు ఫీజులు కట్టేవారు. చాలామందికి పై చదువులకు సాయంచేశారు. తనకు బాగా జరగని రోజుల్లోకూడా చేతికి డబ్బువస్తే ఎవరికో కొంత దక్కించనిదే ఆయనకు తోచేదికాదు. కాలేజీలో ప్రతినెలా చందాలు వేయించి ఎవరికో ఒకరికి సహాయంచేస్తూనే వుంటారు. నీకీ సహాయం చేయడం ఆయనకు క్రొత్త ఏమీ కాదు” అని. ఆయన గుప్తదాత, నలుగురిలో ఆడంబరానికి డబ్బిచ్చేవాడు కాదు; అడిగిన వాణ్ని కొంచెం చీదరించుకొనేవారు. ఏకాంతంలో ఎందరికో ఆయన సహాయం చేసేవారు. నా కోసం వేయిస్తానన్న పాక తర్వాత మరొకరి సహాయార్థం వేయించారు. తాము మేడ కట్టుకున్నా మరొక ప్రక్క రేకులతో షెడ్డు వేయించి తమ సహాయాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఇప్పటికీ ఆ షెడ్డు ఆయన సహాయాన్ని కొనసాగిస్తూనేవుంది.

ఆయన రాబడి మొదటినుంచీ జాగ్రత్తపడితే కొన్ని లక్షలు మిగలవలసిందట. క్లాసులో ఎవడో ప్రక్కవాడితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే ఒకనాడు “ఒరేయ్ ! ఏమిటీ దవడలాడిస్తున్నావ్. ఇంకోసారి మాటవినిపిస్తే ఆ దవడలు నీవికాదు” అనీ “చదువుకోండోయ్ ఉద్యోగాలు రావద్దా ఊళ్ళేలవద్దా. నేనూ మొన్నటిదాకా ఒళ్ళూపాయా తెలియకుండా తిరిగినవాణ్ణే ఒక ఏడాదిక్రితం నాకొక ఆలోచన వచ్చింది మన జీవితంలో మిగిల్చింది ఏమిటి? ఇంత మహాకవినీ ఇప్పుడుపోతే నా భార్యకు పిల్లలకు తిండికూడా కష్టమైపోతుంది. ఆ స్థితి ఊహిస్తే నాకు జాగ్రత్త పడాలన్న జ్ఞానోదయమైంది. అప్పటినుంచీ కొంచెం వెనకవేస్తున్నాను. జీవితంలో నాకు ఆలస్యంగా మొదలైంది మిమ్మల్ని చిన్నప్పుడే జాగ్రత్త పడమని కోప్పడుతా” అని చమత్కారంగా చెప్పారు.

You Might Also Like

3 Comments

  1. Varaprasad

    వివరంగా అందంగా చెప్పారు.

  2. విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం | పుస్తకం

    […] భాగం ఇక్కడ. రెండవ భాగం ఇక్కడ. (తొలి ముద్రణ […]

  3. విశ్వనాథలోని ‘నేను’ – రెండవభాగం | పుస్తకం

    […] భాగం ఇక్కడ. (తొలి ముద్రణ విశ్వనాథ శారద(ప్రథమ […]

Leave a Reply