Scandals, Controversies and World Cup 2003 – K.R. Wadhwaney

60897క్రికెట్ ప్రపంచ కప్ అనగానే భారతదేశంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఇంకా నెలా నెలన్నర సమయం ఉందనగానే అంచనాలూ, ఆశలూ తారాస్థాయికి చేరుతాయి. మన టీం అసలెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బలాబలాలను పక్కకు పెట్టి “మనమే గెలుస్తాం! గెల్చి తీరుతాం!” అన్న వెర్రి వెయ్యి తలలు వేస్తుంది. 2003వ సంవత్సరంలో ఈ ఆశ దాదాపు నెరవేరేట్టు అనిపిస్తూనే నీరుగారిపోయింది. కపిల్ దేవ్ సారధ్యాన జట్టు చాప కింద నీరులాగా విజయం పొందినా, ప్రపంచ క్రికెట్ పఠం పై తనదంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాక, భారత్ ప్రపంచ కప్ లో కనబరచిన అత్యుత్తమ ప్రదర్శన ఖచ్చితంగా 2003లోనే. ఈ టోర్నమెంటుకి సంబంధించిన పుస్తకం అనగానే మారు ఆలోచన లేకుండా తీసుకున్నాను.

క్రికెట్ అంటే టాస్ తో ప్రారంభమై ప్రెజంటేషన్ తో ముగిస్తుందనుకునే నాలాంటి వాళ్ళకి ఈ పుస్తకంలో బోలెడన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. ప్రపంచ కప్పును భారీ ఎత్తున నిర్వహించేటప్పుడు జరిగే వ్యయప్రయాసలూ, లాభనష్టాలు, పంతాలూ పట్టింపులూ అన్నింటి గురించి విపులంగా రాసుకొచ్చారు. ఆ విశేషాల్లో కొన్ని:

Scandals తో మొదలెట్టిన ఈ పుస్తకంలో ముందుగా షేన్ వార్న్ గురించిన వాక్యంతో ప్రారంభమవుతుంది – “Warne’s crulest enemy is Shane himself.” ప్రపంచ కప్పు ఆరంభానికి కొద్ది రోజుల ముందే బహిష్కరణ గురైన షేన్ ఉదంతం అప్పట్లో చాలా కలకలమే లేపింది. కాకపోతే షేన్ అభిప్ర్రాయపడ్డట్టే, ఆస్ట్రేలియన్ జట్టు అతడు లేకుండానే సునాయాసంగా కప్పు నిలబెట్టుకుంది.
దక్షిణాఫ్రికా క్రికెట్ చీఫ్ భారత్- హాలాండ్ మధ్య జరుగుతున్న మాచ్ లో చేసిన రభసా, డోపింగ్ టెస్ట్ లో రొన్నీ ఇరానీ అనే ఇంగ్లాండు ఆటగాడికీ జరిగిన అవమానం స్కాండల్స్ లో చెప్పుకొచ్చారు.

Controversies: మొత్తం పదమూడు వివాస్పద విషయాలను చర్చించారు ఈ విభాగంలో. వాటిలో ముఖ్యమైనవి కోకో-కోలా – పెప్సీల మధ్య ఆధిపత్య పోరు, ఆ పోరు వల్ల భారత ఆటగాళ్ళ వ్యక్తిగత కాంట్రాక్టులు ఇరుకున పడ్డం, భారత బోర్డు, ఆటగాళ్ళ మధ్య విభేదాలు రాజుకొని, ఆఖరికి బోర్డు దిగిరావడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ వివాదంలో భారత ఆటగాళ్ళ సమైఖ్య చూడముచ్చటగా ఉన్నట్టు రాసుకొచ్చారు.

జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే అధికారాన జరుగుతున్న పాలన వల్ల  ప్రజాస్వామ్యపు విలువలు నశించిపోతున్నాయన్న ఆందోళలను ఈ టోర్నమెంట్ మీద సుస్పష్టంగా పడ్డం, ఇంగ్లాండ్ గడికి అవుననీ, గడికి కాదనీ మొత్తానికీ జింబబ్వేలో ఆడకపోవడం, జింబాబ్వే కు చెందిన ఆండీ ప్లవర్ తదితరులు తమ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని నిరసనపూర్వకంగా నల్ల బాడ్జీలు ధరించడం లాంటి వాటిని ప్రస్తావించారు.

ప్రపంచ కప్పు 2003లో భారత టీం కు సంబంధించి: ఆస్ట్రేలియాతో లీగ్ ఫేస్ లో ఓడిపోగానే వెల్లువైన నిరసనలూ, ముఖ్యంగా మాజీ క్రికెటర్ల నుండీ. కమ్మెంటేటర్లు చేసే నిందారోపణలు శృతి మించుతున్నాయని భారత ఆటగాళ్ళు ఎదురుతిరిగిన వైనం, నవ్‍జోత్ సిద్ధు ఇంటికి బయలుదేరేలా చేశాయి.

భారత్ చేతిలో దారుణంగా ఓటమికి గురై, నెట్ ప్రాక్టీసులో ఒకరిని ఒకరు తోసుపుచ్చుకొన్నారన్న వివాదం పాక్ ఆటగాళ్ళు ఇర్రుక్కోగా, “టాస్ గెలిచిన టీంకే గెల్చే అవకాశాలు ఎక్కువున్నాయం”టూ వకార్ యునిస్ చేసిన వాఖ్యలతో పాటు మరికొన్ని వివాదాలను చెప్పుకొచ్చారు.

అంగరంగ వైభవంగా, కన్నుల పండుగా మొదలైన ప్రపంచ కప్ ఆరంభోత్సవాల గురించి వర్ణించాక, లీగ్ ఫేస్ లో ఒక్కో మాచ్ (స్కోర్ కార్డ్ తో సహా) మీదా వ్యాసాలున్నాయి. “అబ్బా, అన్నీ ఏం చదువుతాం, అసలేం గుర్తున్నాయి కనుక!” అనుకున్నాను కానీ, ప్రతీ వ్యాసం చదివించేదిలా ఉంది. ’ఫలనా టీం టాస్ నెగ్గి’ అంటూ ఏదో రిపోర్ట్ లా ఉండక, ప్రతీ మాచ్ లోని విశేషాలూ, వింతలూ చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది. బ్రెయిన్ లారా ఈ ప్రపంచ కప్పులో సచిన్ ఆటోగ్రాఫ్ చేసిచ్చిన బాట్ తో ఆడాడనీ, దక్షిణాఫ్రికాలోని ఓ స్టేడియంలో ఆడే ప్రతీ జట్టు కాప్టెన్ ఒక మొక్క నాటే ఆనవాయితీ ఉందనీ తెల్సాయి.

ఇక ఊహించినట్టుగానే భారత్-పాక్ మాచ్ గురించీ, సచిన్ వీరబాదడు గురించీ ఓ పెద్ద వ్యాసం ఉంది. అప్పటి వరకూ రాళ్ళ దెబ్బలూ, దిష్టి బొమ్మ దహనాలు చూసిన భారత ఆటగాళ్ళు ఈ గెలుపు తర్వాత మళ్ళీ దేవుళ్ళైపోయారు. అటుపై ఫైనల్ కి వెళ్ళేసరికే సుభాభినందనల వర్షం కురిసింది. ఫైనల్లో ఖంగుతిని కొందరి ఆగ్రహావేశాలకు గురైనా, రెండో అత్యుత్తమ జట్టుగా నిలిచినందుకు తగిన పురస్కారాలే అందుకున్నారు.

భారత క్రికెట్ ఫాన్స్ అయిన ఎవరికైనా ఈ పుస్తకం నచ్చుతుందనే అనుకుంటున్నాను, ముఖ్యంగా ప్రపంచ కప్పును నిశితంగా చూసినవాళ్ళకి. రచన ఎక్కడా ఆపించకుండా చదివిస్తుంది. కాకపోతే, మధ్యమధ్యన చాలా టైపోలు దొర్లాయి. అయినా సరే, ఆరేళ్ళ క్రితం జరిగిన సంబరాన్ని నెమరువేసుకొనే మహత్తర అవకాశం ఈ పుస్తకం కల్పిస్తుంది. బోర్ కొట్టే సమయాల్లోనో, ప్రయాణాల్లో మంచి తోడుగా నిలుస్తుంది.

****************************************************************************************

Scandals, Controversies and World Cup 2003
K. R. Wadhwaney
Price: 195 /-
Pages: 287

You Might Also Like

Leave a Reply