ప్రయాణానికే జీవితం… సమీక్ష

వ్యాసకర్త: ఎస్. లలిత
*************

ప్రతి మనిషికీ ఒక్కొక్క అభిరుచి వుంటుంది. అటువంటి అభిరుచుల్లో దేశ, విదేశాల పర్యటనలు కూడా మనం చేర్చవచ్చు. ఈ యాత్రలను విహంగవీక్షణంలా కొంతమంది విమానాల్లో చేస్తారు. పైపైన చూసేసి, యాత్ర ముగించినట్టే భావిస్తారు. మరి కొంతమంది రైళ్ళలో రిజర్వేషన్లతో ప్రయాణించి, కేవలం అక్కడి ప్రముఖ ప్రదేశాలు మాత్రం దర్శించి, వాటి గురించి మాత్రమే తెలుసుకుంటారు. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే అలాగ కేవలం ప్రదేశాలు మాత్రమే కాకుండా, ఆ ప్రదేశాల్లోని మనుషులతో మమేకమై, వారి ఆవేశాలను, ఆనందాలను కూడా తెలుసుకుందుకు ఆసక్తి చూపిస్తారు. అటువంటి ప్రత్యేకమైన వ్యక్తే అజిత్ హరిసింఘాని.

కొంతమంది జీవితంలో ప్రయాణాలు చేస్తే మరికొంతమంది జీవితాన్నే ప్రయాణానికి అంకితం చేస్తారు. అటువంటి మనిషే పూనె లో నివసిస్తున్న ఈ స్పీచ్ థెరపిస్ట్ అజిత్ హరిసింఘాని. ఈయనకి సాహసాలు చెయ్యడం కూడా ఇష్టమనుకుంటాను. కేవలం తన దగ్గరికి చికిత్స కోసం వచ్చిన ఒక పెద్ద కంపెనీకి సిఈఓ గా పనిచేసిన డీ కోస్టా అనే పెద్దమనిషి మాటల్లో సాహసాలు చేయడంలో వుండే ఉద్వేగాన్ని గురించి తెలుసుకున్నాడు. అంతే సాహసానికి సిధ్ధమైపోయాడు. తన మోటార్ సైకిలు మీద యేకంగా ప్రపంచంలోనే యెత్తైన లడాఖ్ లోని “ఖార్గుంగ్ లా” వరకు ప్రయాణం చెయ్యగలనా లేదా అని తనకీ, తన మోటార్ సైకిలుకీ కూడా పరీక్ష పెట్టుకున్నాడు. ఆ పరీక్షలో భాగంగానే తన మోటార్ సైకిలు మీద అంత దూరం ప్రయాణించగలనా లేదా అనుకుంటూ ముందుగా గోవా వరకు వెళ్ళొచ్చాడు. అలా వెళ్ళొచ్చాక అతనికి ధైర్యం వచ్చింది.

మన భారతదేశం విభిన్న సంస్కృతులతో విరాజిల్లే దేశమని అందరికీ తెలిసినదే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, వాతావరణమే కాదు, భాష, సంస్కృతి, అలవాట్లు, సంబంధబాంధవ్యాలు, అతిథిమర్యాదలు అన్నీ భిన్నమైనవే. అటువంటి భిన్నత్వంలోని ఏకత్వమే మన దేశం గొప్పతనం. అటువంటి భిన్న పరిసరాలను దర్శించి, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకోవాలంటే మనం వారితో కలవక తప్పదు. అలా కలవాలంటే మనం ఏ విమానంలోనో ఎగిరి ఆ ప్రదేశంలో వాలకుండా, దారిలో కలిగే ఇబ్బందులను అధిగమిస్తూ, మధ్యలో కలిసిన మనుషుల ప్రవర్తనను ఆకళింపు చేసుకుంటూ రోడ్డు మీద ప్రయాణించడమే సరైన పద్ధతి. అటువంటి మార్గాన్నే ఎన్నుకున్నారు మధ్యవయస్కుడయిన అజిత్ హరిసింఘాని. తన అభిలాష నెరవేరేందుకు ప్రయాణసాధనంగా తనకెంతో యిష్టమయిన రాయల్ ఎన్ ఫీల్డ్ ను యెంచుకున్నారు.

డీ కోస్టా యిచ్చిన ప్రేరణతో అజిత్ హరిసింఘాని తో పాటు మనం కూడా ఆ యాత్రకి మానసికంగా సిధ్ధమైపోతాం. తాను మానసికంగా, శారీరకంగా యాత్రకి సిధ్ధం కావడమే కాకుండా రాయల్ ఎన్ ఫీల్డ్ ను కూడా సిద్ధం చేసుకుంటాడాయన. దానికి అవసరమైన చిన్నచిన్న మరమ్మత్తులు చెయ్యడం నేర్చుకుంటాడు. ఇంటర్నెట్ లో ఆ యాత్రకి వెడుతున్న కొందరితో స్నేహం కలుపుకుంటాడు. అన్నిరకాలుగానూ సిద్ధమయిన అజిత్ హరిసింఘాని భార్య, కూతురు పూనే లో వీడ్కోలు యిచ్చింది మొదలు తనకు యెదురైన ప్రతి అనుభవాన్నీ ఆస్వాదిస్తూ మనకి ఈ పుస్తకంలో అందించారు.

యాత్ర పొడుగునా ఆయనతో కలిసి ప్రయాణించి మనమూ అలసిపోతాం. రాత్రి అయేటప్పటికి వుండడానికి చోటు దొరకగానే “అమ్మయ్య..” అనుకుంటాం. మంచి భోజనం దొరికితే మన కడుపే నిండినంత సంతోషపడతాం. తినడానికి యేమీ దొరకకపోతే నీరసపడిపోతాం. సూఫీబాబాలు, సాధువులు యెదురైనపుడు పొంగిపోతాం. మనలాంటి మనుషులతో మమేకమై అబద్ధమాడి, భార్యా,తనూ స్కౌట్ కాంప్ లో విడిది చేసిన అనుభవం గుర్తు చేస్తే నవ్వుకుంటాం. పర్వతాలు అధిరోహిస్తున్నప్పుడు హై ఆల్టిట్యూడ్ కి యెదురయిన విపరీత పరిస్థితులకి ఖంగారుపడతాం. హెమిస్ ఉత్సవాన్ని చూడడానికి ఉత్సాహపడతాం. అప్పటిదాకా అనుభవంలేని వేదాంతసారాన్ని గ్రహిస్తాం. ప్రకృతి రమణీయతను చూసి అచ్చెరువొందుతాం. ఎన్నివిధాల జాగ్రత్తలు తీసుకున్నా నదీలోయల్లో ప్రయాణంలో దాగివుండే అపాయాలు చదివి భయపడతాం. మంచునీటి ప్రవాహం మధ్యలో బండిని నడుపుతున్నప్పుడు గోతిలో చిక్కుకుపోయిన బండి బైటకి రానప్పుడు కలిగే ఉత్కంఠ, భయం మాటల్లో చెప్పలేనంత అనుభవిస్తాం. అపాయం అంచులకి వెళ్ళినప్పుడు కానీ మనకి భగవంతుడొకడు వున్నాడంటూ గుర్తురాకపోవడం అందరిలోనూ సహజంగా జరిగేదే అనుకుంటాం. దారిలో మిలటరీ జవాన్లని కలిసినప్పుడు, వారు మళ్ళి యెప్పుడు వారి వారి కుటుంబాలని కలుస్తారో అన్న ఆలోచన వచ్చినప్పుడు చెమరించిన కళ్ళను అప్రయత్నంగానే తుడుచుకుంటాం. ఆఖరికి తిరుగుప్రయాణంలో రైల్లో కూడా మనని ప్రమాదంలోకి నెట్టేస్తున్న మనిషిని గమనించి భయపడతాం. ఒకటారెండా.. ఎన్నెన్ని రకాల అనుభవాలను ఈ పుస్తకం చదువుతూ అనుభవిస్తామో చెప్పలేము. అందులోనూ స్వయంగా అంత సాహసమైన ప్రయాణం చేసిన వ్యక్తి స్వయంగా వ్రాసిన ఆ అనుభవాలు చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆఖరుగా యింటి కొచ్చేటప్పటికి భార్యా, కూతురూ యెదురురావడం, ఆ డీ కోస్టా భార్య పూలదండ వేయడం చదివాక మన మనసు నెమ్మదిస్తుంది.

ఇంత ఉత్కంఠభరితంగా సాగే ఈ పుస్తకం పేరు “ప్రయాణానికే జీవితం” దీనిని ఆంగ్లంలో అజిత్ హరిసింఘాని వ్రాస్తే, కొల్లూరి సోమ శంకర్ తెలుగులోకి అనువదించారు. కానీ ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ అనువాదమనే మాటే గుర్తురాదు. మాటకి మాట అనువదించడంలా కాకుండా పుస్తకం లోని భావాన్ని చక్కటి తెలుగులో మనకి అందించారు శ్రీ సోమ శంకర్. జె.ఆర్.డి. టాటాకి అంకితమిచ్చిన ఈ పుస్తకం ప్రతివారూ చదవదగినది. ప్రతి యింట్లోనూ వుండవలసినది. అన్ని పుస్తకాల షాపుల్లోనూ ఈ పుస్తకం దొరుకుతుంది. పూనె నుంచి జమ్మూ వరకు సాగే ఈ యాత్ర ఖరీదు కేవలం నూటయిరవై రూపాయలు మాత్రమే.

You Might Also Like

9 Comments

  1. కొల్లూరి సోమ శంకర్

    సి. ఉమాదేవి గారు, సుజల గంటి గారు, ఉష గారు, మణి వడ్లమాని గారు ధన్యవాదాలు.

  2. C.Uma devi

    అజిత్ హరి సింఘానిగారి ప్రయాణానికే జీవితం ,జీవన ప్రయాణంలోని పదనిసలే!విభిన్న కష్టసుఖాల ఆరోహణ అవరోహణలు రుచి చూపిన షడ్రుచుల సమాహారం. వెల తక్కువయినా వెలకట్టలేని అనుభవాల అక్షయపాత్ర.మీరు విశ్లేషించి వినిపించిన సరిగమలు మా మనసులను మీటాయి.
    అనువదించిన కొల్లూరి సోమశంకర్ గారికి,మీకు ధన్యవాదాలు.

  3. sujlaganti

    సుబ్బలక్ష్మిగారూ మీ వ్యాఖ్యాన౦ సమీక్ష ఎ౦త బాగు౦ద౦టే వె౦టనే పుస్తక౦ కొని చదవాలని ఉ౦ది

  4. ఉష

    “యాత్ర పొడుగునా ఆయనతో కలిసి ప్రయాణించి..మంచి భోజనం దొరికితే మన కడుపే నిండినంత సంతోషపడతాం” మంచి పుస్తకం దొరికినప్పుడూ సాహితీవిందు అందిదని సంబరపడతాము; నిష్పక్షపాత పరిచయమో , సమీక్షనో దొరికితే ఇంకాస్త ఉత్సాహపడతాము … మీకు నెనర్లు, సోమ శంకర్ గారికి అభినందనలు.

  5. Mani Vadlamani

    బాగా సమీక్ష చేసారు శ్రీ లలితగారు, నేను చదివాను ఈ పుస్తకాన్ని మనం కూడా
    ప్రయాణం చేస్తాము కధకుడి తో పాటు రచయత అనువాదాన్ని బాగా చేసాడు మూలభావం దెబ్బతినకుండా.

  6. D Madhusudana Rao

    సమీక్ష చాల బాగుంది. ఎక్కడ దొరుకుతుందో సమీక్షకులు చెప్పలేదు. తెలెయ చేస్తే తప్పక కొని చదువుతాను. వీలయితే తెలియ చేయ గలరు

  7. కొల్లూరి సోమ శంకర్

    ఈ పుస్తకం కాచీగుడా నవోదయలోనూ, కినిగెలోనూ లభిస్తుంది. విజయవాడ నవోదయ వారి వద్ద లభిస్తుంది.
    http://kinige.com/book/Prayananike+Jeevitam

    1. D Madhusudana Rao

      Dhanyawaadaalandi

  8. కొల్లూరి సోమ శంకర్

    నేను అనువదించిన “ప్రయాణానికే జీవితం” పుస్తకాన్ని సమగ్రంగా సమీక్షించినందుకు వ్యాసకర్త ఎస్. లలిత గారికి, సమీక్ష ప్రచురించినందుకు పుస్తకం.నెట్ వారికి ధన్యవాదాలు.

Leave a Reply to Mani Vadlamani Cancel