పుస్తకం
All about booksపుస్తకభాష

September 18, 2015

బి.ఎస్.రాములు చిత్రించిన కఠోర వాస్తవిక దృశ్యం బీడీ కార్మికుల ‘బతుకు పోరు’ : రాజ్యాంగ నైతికత

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: డా. ఎ.కె.ప్రభాకర్
(రాజ్యాంగ నైతికత – స్వాతంత్ర్యానంతర తెలుగు సాహిత్యం పై సాహిత్య అకాడెమీ అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో సమర్పించిన పత్రం. ఫొటో: కందుకూరి రమేశ్ బాబు)
*************
సాహిత్యాన్ని యితర సామాజిక శాస్త్రాల వెలుగులో అధ్యయనం చేయడం కొత్త కాదు గానీ రాజ్యాంగ నైతికతకి అన్వయించి చూడడం కొత్తే. రాజ్యాంగ నైతికత అన్న దృష్టికోణమే కొత్త కాబట్టి దాని వెలుగులో సాహిత్యాన్ని పరిశీలించాలంటే – ముందుగా రాజ్యాంగ నైతికత గురించి అవగాహన చేసుకోవాలి. అందుకు మళ్ళీ సాహిత్యాన్ని ఆశ్రయించడమే నాకు కనిపించిన దారి. గురజాడ ‘కన్యాశుల్కం’ లో జట్కా బండి తోలుకొనే అతను తెల్లదొరల రాజ్యం పోయి స్వరాజ్యం వస్తే ఆ వూరి కానిస్టేబుల్ పోతాడా అని అడుగుతాడు. అది స్వాతంత్ర్యం రావడానికి చానాళ్ళ ముందుమాట. దేశం స్వతంత్రమైన దాదాపు యాభై యేళ్ళ తర్వాత పతంజలి ‘పిలకతిరుగుడు పువ్వు’ కథలో జామీ స్టేషన్ సి.ఐ. ఆలమండ తగువులో మేజిస్ట్రేట్ కి బుద్ధి చెబుతూ భూమి గుండ్రంగానో బల్లపరపుగానో లేదు – పోలీసోడి లాఠీలా వుందని తీర్మానిస్తాడు. రాజ్యం, రాజ్యాంగం, చట్టం, న్యాయం అన్నీ పోలీసు లాఠీ అదుపులో వున్నచోట రాజ్యాంగ నైతికత గురించీ దాని అమలు గురించీ సాహిత్య జీవుల ఆలోచన సాగవలసిన అవసరాన్ని యీ సెమినార్ ద్వారా గుర్తించగల్గుతున్నాం. ప్రజలకు మెరుగైన జీవితాన్నందించే ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి చర్చించుకోడానికో – ఆదివాసీల జీవించే హక్కు గురించి ప్రజాస్వామికంగా మాట్లాడుకోడానికో సభా సమావేశాలను నిర్వహించుకోవడం నేరమైన రాజకీయ సందర్భంలో, అత్యున్నత న్యాయస్థానం యిచ్చిన తీర్పుల్ని పరాస్తం చేస్తూ పాలకులు స్వీయ వర్గ ప్రయోజనాలకనుగుణంగా శాసనాలు తయారుచేస్తున్న విపరీత పరిస్థితుల్లో, న్యాయాలకీ చట్టాలకీ అతీతంగా శిక్షలు విధించే కుల పంచాయతీల ఆధిపత్య సంస్కృతి రాజ్యమేలుతున్న అరాచక కాలంలో రాజ్యాంగం దేశ పౌరులకిచ్చిన ప్రాథమిక హక్కుల గురించి – వాటికి విఘాతం కలిగినప్పుడు పౌర సమాజం చేపట్టవలసిన కార్యాచరణ గురించి మాట్లాడుకొనే బాధ్యత సాహిత్యకారులుగా మనమీద వుందని భావిస్తూ బి.ఎస్.రాములు రచించిన బతుకు పోరు నవల భూమికగా యీ నాలుగు మాటలు మీతో పంచుకొంటున్నాను.

రాజ్యాంగం – అది ప్రతిపాదించే నైతికతా యెప్పుడూ ప్రజానుకూలంగానే వుంటాయని చెప్పలేం. రాచరిక వ్యవస్థలో స్మృతులూ ధర్మశాస్త్రాలూ యేకపక్షంగా అసమానతల్ని పెంచి పోషించేవిగా వుండటం తెలిసిన విషయమే. ఉదాహరణకి – ధర్మవ్యాధోపాఖ్యానంలో పాతివ్రత్య ధర్మాల్నీ వర్ణాశ్రమ ధర్మాల్నీ వున్నతీకరించి అవి యిహ – పర విముక్తికి దోహదం చేస్తాయనీ, వాటిని కాపాడడంలో మిథిల రాజు యెంతో కఠినంగా వ్యవహరిస్తాడనీ ధర్మవ్యాధుడు పేర్కొంటాడు. బ్రాహ్మణుల్లా వేదం చదివే అర్హత కింది కులంలో పుట్టిన తనకు లేదనీ అందుకు తాను బాధపడడం లేదనీ చెబుతాడు. మొత్తం సమాజం, రాజ్యం – వాటి అన్ని అంగాలూ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ పునాదుల మీద నిర్మితమైన కాలంలో ఆర్థిక – సామాజిక అంతరాల్ని జన్మాంతర కర్మలతో ముడిపెట్టడం, వాటిని ప్రశ్నించరాని వ్యవస్థీకృతమైన ఆధిభౌతిక భావజాలంతో అనుసంధానించడం యిటువంటి కథల్లో కనిపిస్తుంది. ఆ భావజాలమే రాజశాసనం. భూస్వామ్య సమాజంలో వాటినే శిరసావహించాలి. ప్రశ్నిస్తే నేరమే కాదు; పాపం కూడా. వందలాది సంవత్సరాలు అవే శాసనాలు అమలయ్యాయి. సామాజిక కట్టుబాట్లకీ మతధర్మాలకీ ఆధ్యాత్మిక విశ్వాసాలకీ రాజశాసనాలకీ మధ్య గీత కనపడని రోజులవి. అప్పటి సాహిత్యం కూడా ఆ విలువల్ని స్థిరీకరించడానికే వుద్దిష్టమైంది. బ్రిటిష్ వలస పాలకులు తమ దోపిడీకి అనుకూలమైన చట్టాలే రూపొందించుకొన్నారు. తరాలుగా పాతుకుపోయిన రాచరిక వ్యవస్థలోని అసమానతల్ని తొలగించడం బ్రిటిష్ పాలకులకు ప్రాథమ్యం కాదు. పైపెచ్చు దేశీయంగా అసమానతల్ని కాపాడుకొంటూ వస్తున్న భూస్వామ్య ఆధిపత్యవర్గాలతోనే వాళ్ళు జతకట్టారు. దీన్నే ‘కుల వ్యవస్థ బ్రహ్మణాధిపత్యాలు వలస పాలనతో ఒక సంకర సంబంధాన్ని ఏర్పరచుకొన్నాయి’ అని విమర్శకులు పేర్కొన్నారు (ఓల్గా, సంతులిత – చిట్యాల ఐలమ్మ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ రిసెర్చ్:హైదరాబాదు, 2014, పే. 15).

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా సొంత రాజ్యాంగం రూపొందించుకోడానికి – రాజ్యాంగ పరిషత్ యేర్పడినప్పుడు దాని అధ్యక్షుడిగా డా. అంబేద్కర్ దృష్టి సారించింది వందలాది సంవత్సరాలుగా వేళ్ళూనుకొని వున్నయీ అసమానతల మీదే – ఆధిపత్య శక్తుల మీదే. ఆధునిక సామాజిక అవసరాలకీ ప్రజా ప్రయోజనాలకీ కీడుచేసే స్మృతుల్ని తగలబెట్టిన ప్రతీకాత్మక నిరసనలోనే నూతన రాజ్యాంగ నైతికతకి సంబంధించిన ఆలోచనలకి బీజాలున్నాయి. ఆర్థిక – సామాజిక రంగాల్లో అసమానతల్ని తొలగించకుండా దేశ ప్రజల్లో సౌభ్రాత్రం సాధించలేమన్న దార్శనికత ఆయనకుంది. అదే సమయంలో ‘సౌభ్రాత్రం లేని స్వేచ్ఛా సమానత్వాలు కేవలం పైపై మెరుగులే’నని అంబేద్కర్ భావించాడు (‘without fraternity equality and liberty would be no deeper than coats of paint’ – రాజ్యాంగం ముసాయిదా పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నవంబర్ 25, 1949నాడు అంబేద్కర్ చేసిన ప్రసంగం. చూ. The Constitution and Constituent Assembly Debates, Loka Sabha Secretariat : Delhi, 1990. P.174). రాజ్యాంగ ప్రవేశికలో లక్ష్యాలుగా నిర్దేశించిన సామాజిక – ఆర్థిక – రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావన లేని రాజ్యాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా పరిగణించలేం. రాజ్యాంగం ఆశించిన లక్ష్యాల దిశగా దేశీయులంతా పూనుకోవాలనే వొక ఆదర్శంతో కూడుకొన్న ఆశయమే రాజ్యాంగ నైతికత. అది అంబేద్కర్ వంటి క్రాంతదర్శి చేతిలో రూపొందింది కాబట్టే సౌభ్రాత్రం పెంచే సాహిత్యానికి దాన్ని అనుసంధానించి మనం యీ రోజున దాని గురించి యెంతో కొంత మాట్లాడుకోగల్గుతున్నాం.

‘రాజ్యాంగ నైతికత’ అన్న పదాన్ని 1948 నవంబర్ 4 న రాజ్యాంగం ముసాయిదాని సమర్పిస్తూ చేసిన ప్రసంగంలో అంబేద్కర్ మొట్టమొదటిసారి ప్రయోగించాడు. చాలా సందర్భాల్లో రాజ్యాంగ విధేయతనే రాజ్యాంగ నైతికతగా భావించడం చూస్తాం. పాలకవర్గం కూడా తమ పౌరులనుంచి అదే కోరుకొంటుంది. కానీ బహుళత్వాన్ని గౌరవించడం, భిన్నాభిప్రాయాలకు – భావజాలాలకు చోటిచ్చి వాటిని ప్రకటించడానికి స్వేచ్ఛ కల్గి వుండడం, అందుకు అనువైన ప్రజాస్వామిక వాతావరణంలో మాత్రమే విధానాలను రూపొందిచుకోవడం దగ్గర్నుంచి – వాటిని పరిరక్షించుకోవడం, అమలుపరచుకొని ఆచరించడం వరకు రాజ్యాంగ నైతికతగానే భావించాలి. అందువల్ల రాజ్యాంగ నిర్మాతలతో మొదలై చట్టసభల్లో కూర్చొని కొత్తచట్టలూ – సవరణలూ చేసే శాసనకర్తలు, రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించే న్యాయపాలకులు, చట్టాన్ని అమలు చేసే అధికార యంత్రాంగం వరకు రాజ్యాంగ నైతికత గురించి అక్షరశః తెల్సుకోవాల్సి వుంటుంది. పతంజలి కథలోని జామీ స్టేషన్ సి.ఐ లాంటివాళ్ళకే ముందుగా రాజ్యాంగ నైతికత గురించిన అవగాహన కలగజేయవలసి వుంది.

ఆధిపత్యం, అసమానతల పునాదుల నిర్మితమైన ఫ్యూడల్ విలువల్నీ నీతుల్నీ కట్టుబాట్లనీ నిరాకరించి వాటి స్థానంలో స్వేచ్ఛా సమానత్వాలనే నూతన ప్రజాస్వామిక భావనలు బలంగా పాదుకొల్పాలంటే రాజ్యాంగ నైతికత గురించీ అది అందించే కొత్త విలువల గురించీ తెలియజేయ వలసిన అవసరం రాజ్యాంగం పుట్టిన 65 సంవత్సరాల తర్వాత కూడా వుండడం శోచనీయమే అయినప్పటికీ – రాజ్యాంగ నైతికతని అమలు పరచవలసిన వారే దాన్ని వుల్లంఘిస్తున్నపుడు, దాని పరిరక్షకులే దానికి విఘాతం కల్గిస్తున్నపుడు ప్రజలపక్షంలో నిలబడే రచయితలూ కవులూ కళాకారులూ దేశ పౌరులకి రాజ్యాంగం నిర్దేశించిన హక్కులూ బాధ్యతల గురించిన అవగాహన కల్గించి వారిలో సరైన చైతన్యాన్ని నింపే పనికి పూనుకోవాలి. పాలక వర్గం కేవలం తమకు అనుకూలమైన సంవిధానాన్నీ విధి విధానాల్నీ తయారుచేసుకొని ప్రజలమీద రుద్దినపుడు వాటిని వ్యతిరేకించి తిరస్కరించే స్పృహని కల్గించడం కూడా సాహిత్యకారుల బాధ్యతే. అందుకే రాజ్యాంగ నైతికతని పాటించడం ద్వారా మాత్రమే పరిపూర్ణమైన సమానత్వం, అంతిమ సామాజిక న్యాయం సాధించవచ్చని అంబేద్కర్ సైతం యెక్కడా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించలేదు (Pratap Bhanu Mehta, ‘What is constitutional morality’ , Seminar Magazine, November 2010). రాజ్యాంగ నైతికత ఆ దిశగా సాగే మార్పులకి వూతం యిస్తుంది. అసలు రాజ్యాంగమే మానవీయంగా వుండడానికి సాహిత్యం దోహదం చేయాలి. అంతేకాదు – పాలకుల ప్రజావ్యతిరేక నిర్ణయాలను కాదనే స్వేచ్ఛనీ హక్కునీ రాజ్యాంగం ద్వారానే ప్రజలు సాధించుకోవాలి అన్న చైతన్యాన్ని కూడా సాహిత్యమే అందిచాలి.

రాజ్యం, దాని అంగాలే రాజ్యాంగ వుల్లంఘనకి పాల్పడుతున్నపుడు, రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలకు ప్రభుత్వాలే తూట్లు పొడుస్తున్నపుడు, చట్టసభలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సవరణలకు పూనుకొన్నపుడు, ప్రజా ప్రతినిధులుగా వుండాల్సిన పాలకులు ఆధిపత్య స్వభావంతో స్వీయ వర్గ ప్రయోజనాలకు కొమ్ముకాస్తూ కొత్త చట్టాలు తయారుస్తున్నపుడు – వాటిని ప్రతిఘటిస్తూ వుద్యమాలు చేసే ప్రజాసమూహాలకు వెన్నుదన్నుగా నిలబడే సాహిత్యం అవసరం యే కాలంలోనైనా వుంది.

పౌరుల్లో రాజ్యాంగ నైతికతని పెంపొందించే దిశగా పాలకులు యెటువంటి ప్రయత్నాలూ చేయరు. చేస్తే అది తమ వునికికే ముప్పు తెస్తుందని వాళ్లకి తెలుసు. ప్రజలకి రాజ్యాంగ నైతికతా స్పృహ కల్గినపుడు పాలకులు వేసుకొన్న ముసుగులు తొలగిపోతాయి. అందువల్ల సాహిత్యానికి సామాజిక ప్రయోజనం వుందని విశ్వసించిన సాహిత్యకారులు మాత్రమే యిందుకు పూనుకోవడం జరిగింది.

భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందునుంచే సంస్కరణ వాదులూ స్వరాజ్య యోధులూ అభ్యుదయ కాములూ ప్రగతి గాములూ అయిన కవులూ రచయితలూ పాలకుల ప్రజా వ్యతిరేక చర్యల్ని నిరసిస్తూ రచనలు చేసి ఆ నాటి వలస పాలనలో నిషేధాలకూ నిర్బంధాలకూ గురయ్యారు. స్వాతంత్ర్యం వచ్చాకా సొంత రాజ్యాంగం నిర్మించుకొన్నాక సైతం అదే పరిస్థితి కొనసాగడం విచిత్రం కాదు – విషాదం. నేతిబీరకాయిలోని నెయ్యి చందమైన రాజ్యాంగ నైతికత, దాని దుర్బలత్వం (vulnerability) ప్రజా రచయితల రచనలకి ప్రధాన వస్తువులయ్యాయి. రాజ్యాంగం ద్వారా ప్రజా సంక్షేమం అన్న భావన పట్ల భ్రమలు తొలగిపోయిన వైనాన్ని రచయితలు తమ రచనల్లో నిర్దిష్టంగా యెత్తిచూపడానికి సంశయించలేదు. రాజ్యాంగ నైతికత పదమే పాలకుల చేతల్లో మాటల్లో అపహాస్యానికి గురైనపుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కోల్పోయిన ప్రజలు కొత్త ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం మొదలైంది. రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం యెండమావి అని తెలుసుకొన్న ప్రజలు జీవించే హక్కుకోసం తీవ్ర శ్రుతిలో పెనుగులాడక తప్పని పరిస్థితులు యేర్పడ్డాయి. రైల్వే కార్మికులు (1974) జౌళి పరిశ్రమ కార్మికులూ (1982) చేసిన సమ్మెలు వాటి ప్రతిధ్వనులే. కొన్నిప్రాంతాల్లో రైతాంగం జీవనపోరాటంలో సాయుధం కావడం జరిగింది. వాటిని అణచివేయడానికి ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి అన్నిరకాల అణచివేతలకీ పూనుకొన్నాయి. భావప్రకటన స్వేచ్ఛ మాటేమో గానీ ప్రజల ప్రాణాలకే భద్రత లేకుండా పోయింది. మానవహక్కుల వుల్లంఘన నిత్యకృత్యమైంది. దీన్నే ‘రెండు రెళ్ళు నాలుగు అంటే జైళ్ళు నోరు తెరిచిన’ కాలంగా కవులు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాకా 35సంవత్సరాలకి సరిగ్గా యిటువంటి రాజకీయ నేపథ్యంలోనే బీడీ కార్మికుల బతుకు వెతల్ని సజీవంగా చిత్రిస్తూ బి.ఎస్.రాములు రచించిన ‘బతుకు పోరు’ నవల వెలువడింది.

బి.ఎస్. బతుకుపోరు రాసేనాటికి (1982) వుత్తర తెలంగాణలో యుద్ధవాతావరణం నెలకొని వుంది. శ్రీకాకుళం కొండల్లో చెలరేగిన గిరిజన రైతాంగ వుద్యమం ఆదిలాబాద్ అడవుల్లో కరీంనగర్ మైదానాల్లో జగిత్యాల పల్లెల్లో సింగరేణి బొగ్గు గుట్టల్లో గోదావరి అలల్లో వొళ్ళు విరుచుకొని కళ్ళు తెరచింది (‘తెలంగాణ అన్వేషణ’ సృజన సంపాదకీయాలు, పర్ స్పెక్టీవ్స్:హైదరాబాద్, పే.220). రైతాంగ వుద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం వలస పాలన కాలం నాటి కల్లోల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది (1978). అయితే ప్రజా వుద్యమం వెనుకంజ వేయలేదు. రైతాంగంలో రగిలిన చిచ్చు బొగ్గు గని కార్మిక వాడల్లోకీ గిరిజన గూడేల్లోకీ వ్యాపించింది. 1981 ఏప్రిల్ లోనే యింద్రవెల్లి గిరిజనులపై మూకుమ్మడి హత్యాకాండా, మస్టర్ కోతకి వ్యతిరేకంగా సింగరేణి గని కార్మికుల 56 రోజుల సమ్మె జరిగాయి. వీటి ప్రభావం బీడీ పరిశ్రమ లాంటి అసంఘటిత కార్మికులపై కూడా పడింది.

తెలంగాణలో బొగ్గు పరిశ్రమ కన్నా పెద్దది బీడీ పరిశ్రమ. 1901 లో నిజామాబాద్ లో మొదలైన యీ పరిశ్రమ రానురానూ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలలోకి విస్తృతంగానూ మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో కొద్దిమేరకూ వ్యాపించింది. తాజా లెక్కల ప్రకారం దేశంలో వున్న 90 లక్షల మంది బీడీ కార్మికుల్లో 6 లక్షలమందికి పైగా తెలంగాణాలోనే వున్నారు (చూ. డి.వి.కృష్ణ , సమ్మె పోరులో బీడీ కార్మికులు, భారత కార్మిక సంఘాల సమాఖ్య -IFTU,2010, పే. 16). అడవి నుంచి తునికాకు సేకరణ చేసే గిరిజనుల్ని కూడా కలుపుకొంటే యీ సంఖ్య యింకా యెక్కువే. వీరిలో 90 శాతం మంది స్త్రీలే. వీళ్ళు ఇంటి వద్దే వుండి బీడీలు తయారుచేస్తారు. కార్మిక చట్టాల్లో కార్మికుల సంక్షేమం కోసం వుద్దేశించినవేవీ బీడీ పరిశ్రమలో కార్మికులకు అమలు కావడం లేదు. పి.యఫ్, బోనస్, పెన్షన్, గ్రాటిట్యుటీ, ప్రసూతి సెలవు, అనారోగ్య సెలవు, వారాంత సెలవు, జీతంతో కూడిన సెలవు, వైద్యం వంటి సౌకర్యాల మాటే లేదు. (రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బీడీ కార్మికరంగంలో పనిచేస్తుండగా, కేవలం రెండు లక్షల మందికి కాస్త అటూ ఇటుగా పి.యఫ్‌. సౌకర్యం అమలు జరుగుతూంది – విశాలాంధ్ర, నవంబర్ 6 , 2010)

ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు కూడా యాజమాన్యాలు వీరికి వర్తింపజేయడం లేదు. రోజుకింత సేపని పని వేళలు లేవు. పండుగా పబ్బం లేవు. 365 రోజులూ పనిదినాలే. ఈ కార్మికులకున్న మరో ప్రత్యేక సమస్య – కంపెనీ యజమానితో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం. కంపెనీల యాజమాన్యాలు కమీషన్ దార్ల ద్వారా యేజంట్ల ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా దళారుల ద్వారా పనిచేయించుకొంటాయి. కార్మికుల జీత భత్యాలకూ సంక్షేమావసరాలకూ బాధ్యత వహించకుండా తప్పించుకోడానికి యిదొక పెద్ద యెత్తుగడ. కార్మికులకు కంపెనీ గుర్తింపు కార్డులు వుండవు. కార్మికుల పేర్లు కంపెనీ రికార్డుల్లో వుండవు [తాజా వుదాహరణ: ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లో పదివేలమంది బీడీ కార్మికులుండగా బీడీ కార్మిక సంక్షేమ పథకం లబ్ధిదారులు యిద్దరే – ఈనాడు – దినపత్రిక, జనవరి 31, 2011 ). అన్ని అసంఘటిత రంగాల్లో లాగానే చాలా చోట్ల కార్మిక సంఘాలు వుండవు. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు వీరి గురించి పట్టదు. లేదా స్థానిక కార్మిక సంఘాల నాయకులు కంపెనీ యాజమాన్యాలతో లాలూచి అయి కార్మికులకు అన్యాయం చేస్తారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అసంఘటిత మహిళా బీడీ కార్మికుల్ని సమైక్యం చేసి తమ హక్కులకోసం పోరాడేందుకు సిద్ధం చేయడంలో భాగంగా బి.ఎస్.రాములు బతుకుపోరు నవలరాయడం జరిగింది. అప్పటికే రైతాంగ – కార్మిక – గిరిజన పోరాటాలు ముప్పేటగా నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం రాజ్యంతో తలపడుతోన్నాయి. నిబద్ధ రచయితగా వాటితో మమేకమై వున్న బి.ఎస్. తాను నమ్మిన మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావో ఆలోచనా విధానం వెలుగులో కార్మికుల్ని విప్లవోన్ముఖుల్ని చేస్తూ బతుకుపోరును వొక సజీవ దృశ్య శ్రవ్య మాధ్యమంగా రూపొందించాడు (ఈ నవలని కార్మికులకి మౌఖికంగా వినిపించినప్పుడు వారిలో కలిగిన చైతన్య భరితమైన స్పందన గురించీ, నవల రాయడానికి కారణమైన పరిస్థితుల గురించి అప్పటి తన భావజాలం గురించీ రచయితతో నేను చేసిన సంభాషణలో పేర్కొన్న అంశాలు : బి.ఎస్. రాములుతో నా ఇంటర్వ్యూ – 1990). బి.ఎస్.కుటుంబమంతా (తానూ, తల్లీ, భార్యా) బీడీ కార్మికులే కాబట్టి కార్మికులపై అనునిత్యం నిరాఘాటంగా అమలయ్యే దోపిడిని స్వయంగా అనుభవించడం వల్ల వారి స్థితిగతుల్ని అత్యంత సహజంగా నవలలో వర్ణించగలిగాడు.

‘బతుకు పోరు’ కంటే ముందు సింగరేణి చారిత్రిక సమ్మె నేపథ్యంలో బొగ్గుగని కార్మిక జీవితం వస్తువుగా కథలు వచ్చాయి కానీ బీడీ కార్మిక జీవితాన్ని చిత్రించిన సాహిత్యం చాలా తక్కవ. బీడీ కార్మికుల కష్టాలూ కన్నీళ్ళూ ఆకలీ తీరాలంటే, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ శారీరకంగా మానసికంగా జరిగే దోపిడిని నాశనం చేయాలంటే బీడీ ఆకులు కత్తిరించిన కత్తెర్లనే ఆయుధాలు చేసుకోక తప్పదనే గ్రహింపుతో ఎన్నార్ భోలా రాసిన ‘ఆకలి తీర్మానం’ (సృజన , ఆగస్ట్ – 1978) కథ బీడీ కార్ఖానాలో పనిచేసే స్త్రీ స్వగతంగా వెలువడినప్పటికీ ‘బతుకు పోరు’ నవల కార్మికులలో అటువంటి చైతన్యం కలగడానికి దారితీసిన పరిస్థితుల్ని యెంతో సూక్ష్మంగా గతితార్కికంగా విశ్లేషించింది (ఎ.కె.ప్రభాకర్, తెలుగులో మాండలిక కథా సాహిత్యం, సాహితీ సర్కిల్ : హైదరాబాద్, 2002, పే.162). అదీగాక బి.ఎస్.రాములు యెన్నుకొన్న కాన్వాస్ మరింత పెద్దది. కార్మిక స్త్రీలు పనిస్థలంలో యెదుర్కొనే పీడనతో పాటు స్త్రీల యింటి చాకిరీ, కుటుంబంలో స్త్రీ పురుష సంబంధాలూ, బీడీలు తయారు చేయడం ద్వారా స్త్రీల ఆర్ధిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, కుటుంబ నిర్వహణలో స్త్రీల పాత్ర, స్త్రీల ఆరోగ్య సమస్యలూ, లైంగిక దోపిడీ, కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్కయ్యే ట్రేడ్ యూనియన్ నాయకుల మోసపూరిత విధానాలూ, వాటిని యెండగట్టే తెగువా చొరవా, వైయక్తిక – కౌటుంబిక –సామాజిక సమస్యల పరిష్కారానికి కార్మికవర్గ చైతన్యం దోహదం చేయడం వంటి అనేకానేక విషయాలు నేరుగా ప్రస్తావనకొస్తాయి.

లక్ష్మి అనే కార్మిక స్త్రీ జీవితాన్ని కేంద్రం చేసుకొని కుటుంబ నిర్వహణలో వైయక్తికమైన పెనుగులాటతో ప్రారంభమైన ఆమె ప్రస్థానం దోపిడీకి వ్యతిరేకంగా సామూహిక వుద్యమంలో భాగమయ్యే దిశగా సాగిన వైనాన్ని యీ నవలలో బి.ఎస్.రాములు అద్భుతంగా ఆవిష్కరించాడు. తమ హక్కులేవో కూడా తెలియని అమాయకత్వంతో అసంఘటితంగా వున్న స్త్రీలు సమైక్యంగా తమపై అమలయ్యే సమస్త పీడనలకు వ్యతిరేకంగా కదలబారటం యెంతో స్ఫూర్తిమంతంగా వుంటుంది.
బీడీ కార్మికుల చైతన్యాన్ని సమస్త పీడిత వర్గ విముక్తి పోరులో భాగంగానే రచయిత భావించాడు. కాగితాలకు పరిమితమైన చట్టాలూ పుస్తకాల్లో మునగదీసుకొన్న హక్కులూ అమలు కావాలంటే బానిస సంకెళ్ళు తెంచుకోవాలంటే పోరాటం తప్ప మరో దారి లేదనే స్పృహని రాములు బీడీ కార్మికుల దుర్భర జీవితాన్ని స్వీయానుభవం నుంచి యథాతథంగా వర్ణించడం ద్వారా పాఠకులకు కల్గించాడు. ప్రజా వుద్యమాలకు సాహిత్యం వెన్నుదన్నుగా నిలవడమే నిబద్ధత, నిమగ్నత కూడానని బతుకుపోరు నవల ద్వారా బి.ఎస్. నిరూపించాడు.

నిజానికి రాజ్యాంగ వుల్లంఘన బీడీ కార్మికుల విషయంలో జరిగినంతగా మరే యితర పరిశ్రమలోనూ జరగడం లేదని నిస్సంశయంగా చెప్పొచ్చు. రాజ్యాంగం దేశ పౌరులందర్నీ దృష్టిలో వుంచుకొని రూపొందించినదైనప్పటికీ కార్మికులకోసం కొన్ని అధికరణాల్ని ప్రాథమిక హక్కుల్లో, ఆదేశిక సూత్రాల్లో పొందుపరచింది. ఉద్యోగుల, కార్మికుల నియామకాల్లో సమాన అవకాశాలు కల్పించడం (ఆర్టికల్ – 16) దగ్గర్నుంచి అసోసియేషన్లు/యూనియన్లు యేర్పాటు చేసుకోవడం (19–1.C), నిర్బంధ చాకిరీ, బాలకార్మిక వ్యవస్థల నిషేధం (23& 24), ఎటువంటి వివక్షతకీ తావులేకుండా సమానవేతనం యివ్వడం, కార్మికులకూ వారి కుటుంబాలకూ విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించడం (38&39), మానవీయమైన పనిచేసే పరిస్థితుల్ని, ప్రసూతి సౌకర్యాలను యేర్పరచడం (42), వేతనాల్లో హేతుబద్ధతని పాటించడం (43), ఫ్యాక్టరీ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం (43 A) వరకు కార్మికులతో ప్రత్యక్ష సంబంధం వున్న అధికరణాలు వున్నాయి. ఈ అధికరణాల వెలుగులోనే కనీస వేతన చట్టం, ప్రావిడెంట్ ఫండ్ చట్టం, బోనస్ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, గ్రాటిట్యుటీ చట్టం, ప్రసూతి సదుపాయాల చట్టం వంటి కార్మిక చట్టాలు తయారయ్యాయి. ఇవి గాక బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా బీడీ కార్మిక చట్టం [The Beedi and Cigar Workers (conditions of employment) Act (1966)], బీడీ కార్మిక సంక్షేమ చట్టాలూ [Beedi Workers Welfare Cess Act & Beedi Workers Welfare Fund Act (1976)] వచ్చాయి.

బీడీ కార్మిక చట్టం కార్మిక సంక్షేమం గురించి మాట్లాడింది తక్కువ. కంపెనీ లైసెన్స్ ల గురించి, వాటి అనుమతుల గురించి, ఇన్స్పెక్టర్లూ వారి నియామకాల గురించి, కార్ఖానా వైశాల్యం వంటి వాటి గురించి చెప్పినంతగా కార్మికుల సంక్షేమానికి చేపట్ట వలసిన చర్యల గురించి, వారిపై అమలయ్యే దోపిడీ నివారణ గురించి చెప్పదు. “ఈ చట్టం అన్ని కార్మిక చట్టాలు లాగానే వారిని (కార్మికుల్ని) ఎల్ల కాలం తమ శ్రమ శక్తిని అమ్ముకొని బతకమని శాసిస్తున్నది తప్ప వారి శ్రమపైన, అది సృష్టిస్తున్న సంపద పైనా వారికి హక్కును కలిగించే ప్రయత్నం ఏ మాత్రం చేయదు. దీనిలో ఖార్ఖానా గోడల గురించి, వాటి రంగుల గురించి ఉన్నంత వివరంగా కార్మికులపై దోపిడి గురించి, దానిని అరికట్టేందుకు అవసరమైన చర్యల గురించి మాత్రం ఉండదు.” (బతుకు పోరులో బీడీ కార్మికులు, నవయుగ బీడీ కార్మిక సంఘం ప్రచురణ – 1987?, పే. 2) అని కార్మిక సంఘాలు నిర్ద్వంద్వంగా నిరసించాయి. కార్మికుల హక్కులకు విఘాతం కల్గిస్తే విధించే కంటి తుడుపు శిక్షలు, జరిమానాలు (పీనట్స్ లాంటివి) నవ్వు, కోపం తెప్పిస్తాయి. అయినా యీ చట్టాలకు వ్యతిరేకంగా కంపెనీ యాజమాన్యాలు కోర్టులకెళ్ళాయి. చట్టాలనుంచి తప్పించుకోడానికి అడ్డదార్లు పట్టాయి. యేజంట్ల పధ్ధతి అందులో వొకటి మాత్రమే. ఈ యేజంట్లు కార్మిక వర్గం నుంచే వచ్చినప్పటికీ సేటుల్లా వ్యవహరిస్తారు. యేజంటు యిల్లే కార్మికులు పనిచేసే స్థలం. అక్కడ కార్మికులకు యెటువంటి సౌకర్యాలూ వుండవు. కూర్చోడానికి సరిపడా చోటుండదు – గాలీ వెలుతురూ రావు. బందెల దొడ్లు నయం. మరుగు దొడ్లు మూత్రశాలలు వుండవు. తాగడానికి నీళ్ళు కూడా వుండవు. శిశు సంరక్షణ సదుపాయాలుండవు. ఆఖరికి పాలు తాగే పిల్లల్ని పడుకోబెట్టే జాగా వుండదు. బతుకుపోరు నవలలో వర్ణించిన యీ పరిస్థితుల్ని యే రాజ్యాంగ నైతికత అంగీకరిస్తుందో – యే చట్టం అనుమతిస్తుందో న్యాయ శాస్త్ర కోవిదులూ రాజ్యాంగ నిపుణులూ చట్టాలు వల్లె వేసిన మేధావులూ తేల్చి చెప్పాలి.
ఈ పరిస్థితుల గురించి రచయిత మాటల్లోనే చూద్దాం: అక్కడ అందరూ ఎంతో యిరుకు యిరుకుగా ఒకరి తొడలు మోకాల్లు మరొకరికి తాకేట్లుగా కూర్చుండాల్సి వస్తుంది. పద్మాసనంలాగా కాళ్ళు ముడుచుకొని బీడీలు చేసే చేట తొడలపై పెట్టుకొని బీడీలు చేస్తుంటారు.

“కాల్లు జాపుకుందామంటె జాగ లేదాయె. పోరగాన్లను పండేద్దామంటె సతం ముత్తెమంత జాగ లేదాయె. యిట్ల ముడుసుకొని కూసుండి మోకాల్లు గుంజవట్టె ముడ్డి కాయగాయవట్టె”

“అంత యిరుకుటం , యిరుకుటం. కిటికీలన్న సక్కగ లేకపాయె. గంత మీదికుండె. అంత ఉడుకపోత. గాలాడక చెముటలు కారుడు. బీడీలు జెయ్యంగ తంబాకు గాటు లేసి అంత పెయిమీద పారి అంటుకపోయి పెయంత సిమసిమ అనవట్టె. ఈ తునికాకు వాసనకు తంబాకు గాటుకు చెమట కంపుకు, గాలి ఆడక మనది మనకే గెడదు గెడదు వాసన రావట్టె.”

“తంబాకు నలిపి బీడీలు జేత్తాంటె పక్కనే పండేస్కుంటె పోరాగాన్ల మీద తంబాకు రెమ్మలు గాలికి పడి సిమసిమ అని కారంబెట్టినట్టు అయి జల్దేలెవ్వవట్టిరి.”
(బతుకు పోరు , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , హైదరాబాద్, రెండో ముద్రణ : 1991 , పే. 33)
యిదీ యేజంట్ మూడు గదుల యిరుకు యింట్లో వూపిరాడని కార్మిక స్త్రీల ఆవేదన. అమానవీయమైన దయనీయమైన ఈ పరిస్థితులకు – రాజ్యాంగం ఆర్టికల్ 42, పైన పేర్కొన్నబీడీ కార్మిక చట్టం సెక్షన్లు నం. 8, 9, 10, 11(1), 12, 13, 14(1,2,&3) మౌనసాక్షులు.

1982 లో బి.ఎస్. వర్ణించిన యీ పరిస్థితులు మరో పది సంవత్సరాల తర్వాత తంబాకు గొంతులో అడ్డుపడి పాలు తాగే పసిపిల్లాడు వుక్కిరిబిక్కిరి అయిన వైనాన్ని ఎ.ధర్మలింగం రికార్డు చేసే నాటికీ (A Dharmalingam, “Female Beedi Workers in a South Indian Village” in Economic and Political Weekly, July 3-10 (1993) at 1467), యింకో పది -పన్నెండు సంవత్సరాల తర్వాత 2003 – 2004 సంవత్సరాల్లో జాతీయ మహిళా కమీషన్ ( NCW) దేశ వ్యాప్తంగా అహ్మదాబాద్ – గుజరాత్, నిప్పని – కర్ణాటక, సాగర్ – మధ్యప్రదేశ్, తిరునల్వేలి – తమిళనాడు, వరంగల్ – ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ – Public hearing- నిర్వహించే నాటికీ యే మాత్రం మారలేదు (వివ. చూ. Women Beedi Workers – A Report by Kusum, National Commission for Women, New Delhi , పే.16-17). ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఒక్కటి చాలు బీడీ కార్మికుల రాజ్యాంగ బద్ధమైన హక్కులు యెటువంటి అణచివేతకి గురయ్యాయో తెలుసుకోడానికి – సభ్య సమాజం ఆవేదనతో కుంగిపోడానికి – చట్ట సభల్లో కూర్చొని రాజకీయాలు నడిపే పాలకులు సిగ్గుతో తలవంచుకోడానికి. కమీషన్ ముందు కార్మికులు వెళ్ళబోసుకొన్న వెతలన్నిటినీ రాములు అంతకు 20 సంవత్సరాల పూర్వమే యీ నవల్లో రికార్డు చేసాడు.

బీడీ కార్మిక చట్టం (1966) వల్ల కార్మికులకు వొక మేలు జరిగింది. కాంట్రాక్టర్ల ద్వారా ముడిసరుకు తీసుకొని యిళ్ళ దగ్గర పని చేసినా, యేజంట్ల యిళ్ళ దగ్గర పనిచేసినా వుద్యోగులుగానే పరిగణించాలి అనే రూలు (సెక్షన్ 2 F – i & ii) అమల్లోకి వచ్చింది. కానీ ఆచరణలో యిది కూడా విఫలమైంది. లైసెన్సులు లేకుండా, బినామీ పేర్లతో, కార్మికులకు రిజిష్ట్రేషన్లు లేకుండా కంపెనీలు నడపడంతో బీడీ కార్మిక రంగం మరింత అసంఘటితమై పోయింది (వరంగల్ పబ్లిక్ హియరింగ్ లో కేవలం 10 శాతం కార్మికులకే గుర్తింపు కార్డులున్నాయని కార్మిక స్త్రీలు తెలియజేశారు. వివ. చూ. పైనే). ఎటువంటి గుర్తింపు లేకుండా పనిచేసే ‘వర్దీ’ బీడీ కార్మికుల సంఖ్య రానురానూ పెరిగిపోతుంది. వీరి దుస్థితి వర్ణనాతీతం. వాళ బతుకు వెతలు చూస్తే రాజ్యాంగ నైతికత అన్నమాటకి అర్థమే లేదు.

బతుకు పోరు నవల్లో కార్మికులపై అమలయ్యే పీడనలో ప్రస్తావనకొచ్చిన అంశాలు – అవి కనీస వేతనం అమలు కాకపోవడం కావొచ్చు, పిల్లలతో పని చేయించడం కావొచ్చు, నిర్బంధ వెట్టి కావొచ్చు, జీవించే హక్కుని హరించడం కావొచ్చు… మొదలైనవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైనవే. చట్టాలని అతిక్రమించేవే. ప్రభుత్వాలు నియమించిన కమీషన్లు రిపోర్ట్ చేసినవే. అయినా ఫలితం శూన్యం. చట్టాలు బీడీ కార్మికుల విషయంలో కాగితం పులులే. అందువల్ల బీడీ కార్మికులు కార్మిక హోదా లేని కూలీలుగా బతుకులీడుస్తున్నారు. చాలా సందర్భాల్లో దినసరి కూలీలకు వచ్చే ఆదాయం కూడా వీరికి రావడం లేదు. కేంద్రం యిటీవల ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చేంత కూలి కూడా వీరికి దక్కడం లేదు. బీడీ పరిశ్రమలో పీస్ రేట్ పని విధానం అమల్లో వున్నందున వేతనాల విషయంలో కార్మికులు యీ పరిస్థితిని యెదుర్కొంటున్నారు (మరిన్ని వివ. చూ. బీడీ కార్మిక సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దాం, ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియన్, 1999).

బీడీలు చుట్టే స్త్రీ కార్మికులకు నెలజీతం గానీ దినసరి కూలీగాని వుండవు. వెయ్యి బీడీలు చేస్తే యింత అని యిస్తారు. రోజుకు పన్నెండు గంటలు పని చేస్తే గానీ – ఆకు కత్తిరించడం దగ్గర్నుంచి బీడీలు చుట్టి దారం కట్టి కట్టలు కట్టడం వరకూ – వెయ్యి బీడీలు తయారవ్వవు. అవసరమైన తునికాకు, తంబాకు, దారం కంపెనీ యిస్తుంది. కార్మికులపై దోపిడీ యిక్కడ నుంచి మొదలౌతుంది. ముడిసరుకు తూకంలో మోసం చేస్తారు. చాలా సార్లు ఆకు మంచిగా వుండదు. పగిలిన ఆకు, దొడ్డాకు, కప్పాకు, డాగాకులు అన్నీ తూకంలోకి వస్తాయి. దాంతో తునికాకు, పొగాకు వెయ్యి బీడీలకు చాలవు. తక్కువ పడితే యిచ్చిన ఆకుకు అదనంగా లెక్క రాసి జీతంలో కోత పెడతారు (బతుకు పోరు, పే. 42). అలాగే వెయ్యి బీడీలకు రెండు కట్టలు ‘గుల్ల కట్ట’ల పేర్న పెచ్చుకట్టలు తీసుకొంటారు. బీడీలను చాటాన్ (గ్రేడింగ్) చేస్తూ మూతులు బాగా లేవని కొనలు సరిగ్గా వొత్త లేదనీ సైజు సరిగా లేదని వొంకలు పెట్టి తీసి పక్కకి పెట్టేస్తారు. అలా నాణ్యత లేదని తీసిన బీడీలను కూడా కంపెనీ వాళ్ళు మార్కెట్లో అమ్ముకొంటారు (వివ. చూ. కనిపించని శ్రమ … బీడీ కార్మికుల స్థితి – గతులు, నవయుగ బీడీ కార్మిక సంఘం, జంట నగరాలు : 1997?). బీడీ కార్మిక చట్టం ప్రకారం తిరస్కరించే బీడీలు (రద్దీ బీడీలు) 2.5% కంటే ఎక్కువ వుంటే దానికి సరైన కారణాలు రిజిష్టర్లో నమోదు చెయ్యాలి. చాలా సందర్భాల్లో యీ కోత 10% నుంచి 15% కూడా వుంటుంది. కానీ ప్రశ్నించేవారుండరు. ఇన్స్పెక్టర్లు యజమానులతో కుమ్మక్కై కార్మికులకే ద్రోహం చేస్తారు. నవల్లో యీ కోతకి వ్యతిరేకంగానే రామక్క తిరగబడుతుంది (పే.43). కార్మిక స్త్రీలంతా వొక్క తాటిమీదకు వచ్చి ఐక్యంగా నిలిచారు. అంతకు ముందే నెలవారీ జీతం తీసుకొనే మగ కార్మికులు కూడా అశాంతికి లోనై వున్నారు. డ్యూటీలో తంబాకు సంచులు మీదబడి నాల్గు రోజులు పనిలోకి రానందుకు సిక్ లీవ్ యివ్వకుండా రాజలింగం అనే కార్మికుడికి జీతం కోశారు. నారాయణ అనే మరో కార్మికుడు ముందస్తు అనుమతితో సెలవు తీసుకొన్నా జీతంలో కోతపెట్టినందుకు యేజంట్ ని నిలదీశాడు. దొంగ లెక్కల గురించి ఓవర్ టైం గురించి ప్రశ్నించినందుకు అతణ్ణి పనిలోంచీ తీసేస్తారు (పే. 27, 28). కార్మికుల సహనం బద్దలైంది. కంపెనీ సేట్ల యేజంట్ల పగటి దోపిడీని నిరసిస్తూ కార్మికులంతా కోతకి వ్యతిరేకంగా న్యాయంకోసం గొంతు విప్పుతారు. సమస్యల పరిష్కారం పట్ల స్థానికంగా వున్న బీడీ సేట్ల నిర్లక్ష్యంవల్ల, గుజరాత్ లోనో రాజస్థాన్ లోనో వుండే కంపెనీ యజమానుల మొండి వైఖరివల్ల కార్మికులు సమ్మెకి దిగుతారు.

సమ్మెలో దళారి యేజంట్ల పధ్ధతి రద్దు, కూలీ పెంపుదల (వెయ్యి బీడీలకు 7 రూపాయిలనుంచి 10 రూపాయిలకు), జీతం తో కూడిన ప్రసూతి సెలవు, బోనస్, లీవ్ విత్ వేజేస్, సంవత్సరాల పాటు పబ్లిక్ హాలిడేస్ లేబర్ హాలిడేస్ లో సైతం చేసిన పనికి అరియర్స్, సెక్షన్ 31 ప్రకారం యే కారణంగా నైనా సర్వీస్ నుంచి తొలగిస్తే 90రోజుల సర్వీస్ పేమెంట్ వంటి న్యాయ సమ్మతమైన డిమాండ్లు కార్మికులు ముందుకు తెస్తారు. చుట్టుపట్ల వున్న అన్ని కంపెనీలనుంచీ కార్మికులను సమ్మెలోకి సమీకృతులను చేసే క్రమంలో వారి చైతన్యం విస్తృతమౌతుంది.

‘గుల్ల కట్ట’ల పేర్న పెచ్చుకట్టలు తీసుకోవడం చట్ట విరుద్ధం. ఇది వొక విధంగా నిర్బంధ వెట్టి వంటిదే. దేశంలో దీని చరిత్ర వందేళ్ళకు పైనే. రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడుకొంటే ఆర్టికల్ 23కు పచ్చి వుల్లంఘన యిది. 1987లో హైదరాబాద్ నగరంలో యీ పెచ్చుకట్టల సమస్యకి వ్యతిరేకంగానే కార్మికులు సంఘటితమయ్యారు. పెచ్చుకట్టలు 3 నుంచి 2 కి తగ్గాయి గానీ యివాల్టికీ వెట్టి కట్టల రివాజు పోలేదు (పార్శీగుట్ట, హైదరాబాద్ బీడీ కార్మిక స్త్రీలతో యీ పత్రం కోసం నేను చేసిన సంభాషణ).

ఆకు తరుగు, పెచ్చు కట్టలు, చాటాన్ తదితర రూపాల్లో కార్మికులు నష్టపోతున్న సొమ్ము మొత్తం ప్రతి వెయ్యి బీడీలకూ 7 రూపాయలుంటుందని 1995లో భారత ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. దేశమంతటా సంవత్సరానికి 120వేల కోట్ల బీడీలు తయారవుతున్నాయని వొక అంచనా. అంటే బీడీ కార్మికుల శ్రమ నుంచి అక్రమంగా దోచుకొంటున్నమొత్తం 840కోట్ల రూపాయలన్నమాట. ప్రభుత్వం బీడీ కార్మికుల సంక్షేమం పై పెట్టె ఖర్చుకన్నా యిది యెన్నో రెట్లు యెక్కువ (వివ. చూ. బీడీ కార్మిక సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దాం, ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియన్, 1999).

కమీషన్ కంపెనీల రద్దు కోసమో, అక్రమ కోతలకి వ్యతిరేకంగానో, కనీసవేతనం అమలు కోసమో, పెరిగిన డి.ఏ. కోసమో, పెన్షన్ కోసమో, పిల్లల చదువు కోసమో, వైద్య సదుపాయాల కోసమో రోజూ దేశంలో యెక్కడో వొక చోట బీడీ కార్మికులు ఆందోళనలు చేస్తూనే వున్నారు.

2010 చివరలో 32 రోజుల సమ్మె పోరాటం తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీడీ కార్మికుల వేతనాలు పెంచుతూ జీవో 41ని విడుదల చేసింది. కాని అదే ప్రభుత్వ పెద్దలు, కార్మిక శాఖాధికారులు బీడీ యజమానులతో మిలాఖతై ఆ జీవోను అబయెన్సులో పెడుతూ మరో జీవో (81) ని విడుదల చేశారు. రాష్ట్రంలోని లక్షలాది బీడీ కార్మికులకు తీరని ద్రోహం చేశారు. దీంతో ప్రతి బీడీ కార్మికురాలు రోజుకు 85.20 రూపాయలు, నెలకు 2,210, ఏడాదికి 26,520 నష్టపోతున్నది. కేవలం తెలంగాణలోనే 7లక్షల మంది బీడీ కార్మికులు రోజుకు 6కోట్లు, నెలకు 154 కోట్లు, సంవత్సరానికి 1856 కోట్లు నష్టపోతున్నారు. (బీడీకార్మికుల వేతనాల వెతలు – డి.వి.కష్ణ, బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు). ఇదంతా రాజ్యాంగ పరిరక్షకులే చేస్తోన్న దోపిడీ. సంవత్సరాలు గడుస్తోన్న దీన్నుంచి విముక్తి లేదు.

ఆరోగ్యం, పిల్లల చదువులు బీడీ కార్మికులు యెదుర్కొనే సమస్యల్లో ప్రధానమైనవి. నిత్యం పొగాకుతో పనిచేయం వల్ల కార్మికులు టి.బి., క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు.

“యీ ఘాటు ఊకే పీలిస్తె టీబీ అసొంటి రోగాలత్తయంట – గా గాండ్ల బుచ్చక్క గిట్లనే తంబాకు గాటు పడక బీడీలు చేసి చేసి చేదగ్గుతోటె గాదె దవాకాన్ల వడ్డది.” (పే.34).

నవల్లో కార్మిక స్త్రీ భూదేవి అన్నమాటలో వినిపించే భీతి ఆమె వొక్కతిదే కాదు; బీడీ కార్మికులందరిదీ. ‘తంబాకుల మునిగి తంబాకుల తేల్తె’ కార్మికులకు మిగిలేది రోగాలే. కోట్లు గడించేది మాత్రం బీడీ సేట్లు.

బీడీ చేట కార్మిక స్త్రీ శరీరంలో భాగమైపోతుంది. పసి పిల్లల తల్లుల వొడిలో బిడ్డకన్నా యెక్కువ సమయం బీడీ చేటే వుంటుంది అన్నది జీర్ణించుకోలేని కఠోర సత్యం. ఆడ పిల్లలు బీడీలు చుట్టడం 7–8 యేళ్ళ వయస్సులో మొదలుపెడతారు. 70–75 యేళ్ళ దాకా చేస్తూనే వుంటారు. ఒకే పనిని నిర్విరామంగా రోజుకి 14 గంటల పాటు చేయడం వల్ల బీడీ కార్మికుల్లో 30 యేళ్లకే మెడ నరాల నొప్పి, నడుం నొప్పి, మోకాళ్ళ కీళ్ళ నొప్పి, సర్వసాధారణంగా కనిపించే బాధలు (చూ. పే.37). దాదాపు 65శాతం కార్మిక స్త్రీలు యీ నొప్పులతో సతమతమవుతున్నారు. 10 శాతం వరకు వూపిరితిత్తులకు సంబంధించిన రోగాలకు గురౌతున్నారు (వివ. చూ. Health of Women Workers in the Beedi Industry by Moona Gopal, medico friend circle bulletin, Jan-Feb. 2000).

బీడీ కార్మిక స్త్రీలకు పౌష్టికాహారం అంటే ఏమిటో తెలియదు. ప్రతి మనిషికి కనీసం 2,800 కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరం అని వైద్యులు చెప్తుండగా ఆర్థిక సమస్యల కారణంగా వీళ్లు కేవలం 1,700 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నారని ఇటీవల ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఫలితంగా ప్రతి మహిళ రక్తహీనతతో బాధపడుతోంది. (దుర్భరస్థితిలో బీడీ కార్మికులు, సాక్షి – దినపత్రిక, జనవరి 28, 2014).

కార్మికులు సంపాదించిన దానిలో దాదాపు 45 శాతం డబ్బు ఆస్పత్రుల ఖర్చులకే  పోతున్నాయి. కార్మికులు రోగాల బారిన పడ్డప్పుడు వీళ్లకు అండగా నిలబడాల్సిన కంపెనీలు మొఖం చాటేస్తున్నాయి. దేశంలో వున్న 90 లక్షలమంది కార్మికులకి వున్న 7 ఆసుపత్రులు (13 లక్షల మందికొకటి), 240 డిస్పెన్సరీలు (40 వేల మందికొకటి) (ఏప్రిల్ 29, 2013న పార్లమెంట్ లో కార్మిక వుపాధి శాఖా మంత్రి ప్రకటన) కార్మికుల ఆరోగ్య పరిరక్షణకి, ప్రసూతి సౌకర్యాలు సమకూర్చడానికి యే మేరకు సరిపోతాయో ప్రభుత్వమే చెప్పాలి. కంపెనీల్లో అమలుకాని ప్రసూతి సెలవలకీ కార్మిక స్త్రీల అనారోగ్యానికీ సంబంధం వుంది. ‘స్త్రీలకు ప్రసవానికి ముందు ఆరువారాలు, ప్రసూతి అనంతరం ఆరువారాలు – మొత్తం 12వారాలపాటు వేతనంతో కూడిన సెలవులు యివ్వాలనే చట్టం ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు… బిడ్డకు 15రోజులు రాగానే తల్లులు బీడీలు చెయ్యక తప్పని పరిస్థితికి నెట్టబడుతున్నారు. ప్రసవానికి ముందు తర్వాత శారీరకంగా, మానసికంగా ఎదురయ్యేరకరకాల ఇబ్బందుల్నుంచి బయట పడకుండానే, అవసరమైన విశ్రాంతి లేకుండానే పేదరికం వల్ల స్త్రీలు అనారోగ్యాన్ని కష్టాల్ని పంటి బిగువున భరిస్తున్నారు’ (మరిన్ని వివ. చూ. ఎం. లక్ష్మి, ‘తరాలు మారుతున్నా మారని బీడీ శ్రామికుల జీవితాలు’, కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ, స్త్రీ విముక్తి సంఘటన:2014, పే.76-82).

బతుకు పోరు లో సమ్మెలోకి కార్మికుల్ని సమీకరించే క్రమంలో పొందిన చైతన్యంతో ‘మన బీడీలోల్లకు వేరే ఓ దావుకానా పెట్టిద్దాం’ అని రామక్క ప్రతిపాదిస్తుంది. ఆ రోజున న్యాయ బద్ధమైన తమ హక్కుల సాధన కోసం, తమపై అమలయ్యే దోపిడీకి వ్యతిరేకంగా సంఘటితమయిన కార్మికుల దూర దృష్టి లో రచయిత ప్రాపంచిక దృక్పథం స్పష్టమౌతుంది.

బీడీ కార్మిక సంక్షేమ చట్టాల [Beedi Workers Welfare Cess Act & Beedi Workers Welfare Fund Act (1976)] ప్రకారం కంపెనీల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన సెస్ ని కార్మిక కుటుంబాల వైద్య- విద్యావసరాలకు వినియోగించాలి. నెలకి 20 లక్షల బీడీల లోపు తయారీకి ప్రభుత్వం యెక్సైజ్ పన్ను మినహాయించడంతో తప్పుడు లెక్కలు చూపించి యాజమాన్యాలు పన్నులు యెగవేయడం సర్వసాధారణం. అందువల్ల కార్మిక సంక్షేమానికి గండిపడుతుంది. కార్మికుల పిల్లలకు అందాల్సిన స్కాలర్ షిప్ లు అందక సరైన విద్యావకాశాలు దక్కడం లేదు. ఎక్కాల పుస్తకం చిరిగిందనీ ఫోంటిన్ పెన్ను పత్తి (పాళి) విరిగిందనీ లక్ష్మి కొడుకు శ్రీను బడికి వెళ్ళనంటాడు. బడి మానితే బీడీ కంపెనీలో కూలీగా బతకాల్సిందే అని తల్లి హెచ్చరిస్తుంది (పే. 18,19). యెంతో గంభీరమైన సామాజిక – ఆర్థిక అంశాల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ యేకకాలంలో సున్నితంగానూ సునిశితంగానూ సృజనాత్మక రచనలోకి తీసుకురావడంలో రచయితగా బి.ఎస్. చూపిన ప్రతిభ అమోఘం. సాహిత్య సృజనను సామాజిక బాధ్యతగా భావించినందువల్ల మాత్రమే బి.ఎస్. యీ పని చేయగలిగాడు.

బడికి వెళ్లినా వెళ్లకున్నా శ్రీను బీడీ కంపెనీలో యేదో రూపంలో కూలి పని చేయాల్సిందే. ‘బడికి పోయి వచ్చాక గంటకు పదిపైసల చొప్పున రెండు మూడు గంటలు దారంకట్టే పిల్లలు’, యింటి దగ్గర, కంపెనీలోనూ చాలా చిన్న వయసులోనే తల్లులకు సహాయపడుతూ బీడీలు చుట్టే పిల్లలు (ముఖ్యంగా ఆడపిల్లలు 7–8 యేళ్ళ వయస్సులో బీడీలు చుట్టే పని నేర్చుకోవడం మొదలుపెడతారు. 10-12యేళ్ళు వచ్చేసరికి పూర్తిస్థాయి నైపుణ్యం పొందిన కార్మికులుగా తయారవుతారు), బీడీలు ప్యాకింగ్ – లేబిలింగ్ చేసే పిల్లలు … యిలా బీడీ కార్మికుల్లో 15 శాతం బాలలుండం పరిశ్రమ ప్రారంభమైననాటి నుంచీ జరుగుతున్నా అదేదో చాలా సహజమైన విషయం అన్నట్టు యే ప్రభుత్వాలు పట్టించుకోవు. ఇవ్వాల్టికీ దాదాపు రెండు లక్షల మంది పిల్లలు బీడీ పరిశ్రమలో పని చేస్తున్నారని అంచనా (V.Murugan and C.Venkatesh, A STUDY ON SOCIO – ECONOMIC CONDITIONS OF FEMALE BEEDI WORKERS IN KARUGAMPUTHUR VILLAGE, VELLORE DISTRICT, Indian Streams Research Journal, Oct. 2014 ). దేశంలో వున్న బాలకార్మికుల్లో అత్యధిక శాతం బీడీ పరిశ్రమలోనే వున్నారన్నది (21 శాతం) ప్రభుత్వం నిర్వహించిన లెక్కలే తేల్చి చెబుతున్నాయి (వివ.చూ. A Study on Child Labour in Indian Beedi Industry by Dr. Yogesh Dube, Member NCPCR, New Delhi : August 2013).

రాజ్యాంగం లోని ఆర్టికల్ – 24, బీడీ కార్మిక చట్టం సెక్షన్ 24 ప్రకారం పిల్లలతో పనిచేయించుకోవడం నేరం. కానీ యితరేతర నేరాలతోపాటు యిది కూడా ఘరానాగా నడిచిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు చిన్న చిన్న అవసరాల కోసం అప్పులు తీసుకొని అవితీర్చడానికి కంపెనీ దాదాలకో యేజంట్లకో పిల్లల్ని వెట్టి కూలీలుగా కుదువ/తాకట్టు పెట్టడం జరుగుతోంది. రోజుకి 16 గంటలు పని చేస్తే పిల్లలు పిల్లలు సంపాదించేది – రెండు లేదా మూడు రూపాయిలు (వివ. చూ. SURVEY OF STUDIES ON BEEDI INDUSTRY – With Special Emphasis on Women and Child Labour, CWDS Research Team – Preet Rustagi, Priyanka Srivastave, Preeti Bhardwaj, Manojit Saha, Anju Vyas and Madhu Shree). ఎంతో అమానుషమైన యిటువంటి సమస్య లోతుల్లోకి వెళ్ళకుండా కేవలం వుపరితలాన్నిమాత్రమే తడుముతూ ప్రభుత్వ సంస్థ National Commission for Protection of Child Rights యిచ్చిన పరిష్కార సూచనల అమల్లో సైతం అలసత్వమే కనిపిస్తుంది.

బి. ఎస్. రాములు 30సంవత్సరాల క్రితం నవల్లో వర్ణించిన పరిస్థితులకీ యిప్పటికీ – రాజ్యాంగంలో బాలలకు విద్యాహక్కు [ఆర్టికల్ 21 (A)] ని పొందు పరచిన తర్వాత కూడా – తేడా యేం లేదు. రాజ్యాంగ నైతికత పాటించడం పట్ల పాలకుల అగౌరవానికీ అశ్రద్ధకీ అలక్ష్యానికీ నిలువెత్తు వుదాహరణ యిది.

నవల్లో సుగుణ లాంటి ఆడపిల్లలు ఖార్ఖానాలో చిన్నవయసు నుంచే బీడీలు చుడుతూ తమ పెళ్ళికి కట్నం సొమ్ము తామే కూడబెట్టుకొనే పనిలో వుంటారు. ఆకు తూకం దగ్గరో చాటాన్ దగ్గరో జీతాల్లో కోతల దగ్గరో యేజంట్లు సేకర్లు దాక్షిణ్యం ప్రదర్శిస్తున్నట్టుచేసి లైంగిక దోపిడీకి సైతం పాల్పడతారు (పే. 41). అందుకు అవకాశమిచ్చే పనివేళల విషయంలో బీడీ కార్మిక చట్టం సెక్షన్ 25 మిగతా అన్ని సెక్షన్లలాగానే నిరుపయోగం.

తోటి కార్మికుడైన నారాయణతో సుగుణ పెళ్లి విషయంలో ఆటంకంగా మారిన కట్నం సమస్య గురించి కూడా రచయిత లోతుగా విశ్లేషించాడు( పే. 30). మగవాళ్ళ ఆలోచనా విధానంలో మార్పు రాకుండా దురాచారం పోదనే స్పృహనీ స్త్రీ పురుష సంబంధాలు డబ్బుతో ముడిపడి వుండకూదన్న అవగాహననీ రచయిత ఆ యా సందర్భాల్లో ప్రతిపాదిస్తాడు. సమస్త పీడనలకూ దోపిడీకీ వ్యతిరేకంగా కార్మికులు చైతన్యం పొందే క్రమంలోనే స్త్రీ పురుష అసమానత్వం, కట్నంలాంటి అనేక సామాజిక రుగ్మతలు పరిష్కారమౌతాయన్న సూచన కూడా నవల్లో కనిపిస్తుంది.

అయితే అసంఘటితరంగంలో పనిచేసే కార్మికులు అందునా పితృస్వామ్య ఆధిపత్యంలో యింటా బయటా అణచివేతకి గురయ్యే మహిళా కార్మికులూ సంఘం కట్టి పోరుబాటలోకి రావడం అంత తేలికైన విషయం కాదు. బీడీ కార్మిక స్త్రీలలో 90 శాతం బి.సి. – ఎస్.సి. – ముస్లిం మైనార్టీ – అట్టడుగు వర్గాలనుంచి వచ్చిన వాళ్ళే (గణాంకాలకు చూ. SURVEY OF STUDIES ON BEEDI INDUSTRY, పైన). కల్లోల చట్టాల్లో నిత్య నిర్బంధాలు యెదుర్కొంటున్నవారే. ఆర్థికంగా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన స్త్రీల బాలల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తూ వుండగా వారి సమస్యల పట్ల యెటువంటి వ్యగ్రతా చూపడంలేదు సరిగదా మౌలిక హక్కుల్ని నేలరాయడంలో పాలక యంత్రాంగం ప్రత్యక్ష పాత్ర పోషిస్తోంది. వ్యవసాయం చేనేత వంటి గ్రామీణ చేతి వృత్తులు మూలబడడంతో మగవాళ్ళ ఆదాయ మార్గాలు మూసుకుపోయినప్పుడూ వాళ్ళు కుటుంబావసరాలకు బొంబాయో భివాండీనో కూలీలుగా పోయినప్పుడూ కుటుంబ భారాన్ని పంచుకొంటూ/మోస్తూ స్త్రీలు ప్రత్యామ్నాయంగా బీడీ పరిశ్రమని యెన్నుకొన్నారు. ఉత్తర తెలంగాణలో పీడిత ప్రజా సంఘాలమీద రాజ్యం క్రూరమైన నిర్బంధం అమలు చేస్తోన్న రోజుల నేపథ్యాన్ని రచయిత చాలా మెలకువతో నవల్లోకి తీసుకువచ్చాడు.

నవల ప్రారంభంలోనే రాజయ్య పెద్దవ్వ బిడ్డ కొడుకు వెంకట రాజంను పోలీసులు కాల్చి చంపిన విషయం ప్రస్తావనకు వస్తుంది. ‘రైతు కూలి సగాలు వెట్టి కూలీలు వెరుగాలెనని, దున్నెటోనికే భూమి కావాలని పోరాటం జేపిచ్చ’డమే అతను చేసిన నేరం( పే.23). సంఘం కట్టి పోరాడడం రాజద్రోహమైనప్పుడు, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు ప్రశ్నార్థకమైన చోట బీడీ కార్మిక స్త్రీలు తమ హక్కులకోసం వీథికెక్కడం సాహసమే. ‘’ఆడోల్లకు కూడ పుట్టిందిరో రోగం” అని బజార్లో దుకాణదారులు, “పోలీసోల్లచ్చి ఒక్కొక్కదాన్ని తంతె తెలుస్తది పని వరస” అని పల్లెనుంచి పారిపోయి వచ్చి పట్నంలో బ్రాండి షాప్ పెట్టుకున్న ఒక దొర వ్యాఖ్యానించడం (పే. 60) యీ నేపథ్యంలోనే. పల్లెల్లో రైతు కూలీ సంఘాలు నడుపుతోన్న వుద్యమాలూ వాటిపై అమలవుతున్న రాజ్యహింసా దాన్ని యెదుర్కొని ప్రజలు సాధించుకొంటున్న విజయాలూ – అన్నిటినీ వొక్క వాక్యంలోకి రచయిత కుదించాడు. శిల్ప విషయకంగా నవలా రచనలో బి.ఎస్. రాములు చూపిన నేర్పుకి యిదొక గొప్ప నిదర్శనం.

యజమానులు కార్మికుల సమైక్య వుద్యమ చైతన్యాన్ని సహించలేరు. ఉద్యోగాలనుంచి తొలగిస్తామని బెదిరిస్తారు. అభద్రతకి గురిచేస్తారు. పోలీసుల్లా ప్రవర్తిస్తారు. రాజకీయ పార్టీలకి అనుబధంగా వున్న ట్రేడ్ యూనియన్ ల ద్వారా కార్మికుల సమైక్యతనీ, పోరాట స్ఫూర్తినీ భగ్నం చేయాలని ప్రయత్నిస్తారు. అయితే అప్పటికే సింగరేణి కార్మికుల సమ్మె నుంచి, స్వీయానుభవాల నుంచి ట్రేడ్ యూనియన్ ల అవలక్షణాల్ని అర్థం చేసుకొన్న బీడీ కార్మికులు తమ పోరాటాన్ని తామే చేసుకోడానికి సంఘటితమౌతారు(పే. 59- 60). రాములు బతుకు పోరుతో పాటు మొదలైన బీడీ కార్మిక సంఘాలే తర్వాతి కాలంలో యితర ప్రాంతాల్లో కార్మికులకు కూడా దారిదీపాలయ్యాయి. కంపెనీ యజమానులు యేర్పాటు చేసిన రౌడీల దాడుల్ని తిప్పికొట్టే చైతన్యాన్ని సైతం కార్మికులు అందిపుచ్చుకొన్నారు (హైదరాబాద్ నవయుగ బీడీ కార్మిక సంఘం స్థాపన లో కీలక పాత్ర పోషించిన సంధ్య తాము అప్పట్లో యెదుర్కొన్న అడ్డంకుల గురించి బీడీ ఖార్ఖానా యజమానుల దౌర్జన్యాల గురించి పార్శీ గుట్ట కార్మికులతో సంభాషిస్తున్నప్పుడు పేర్కొన్నారు).

అయితే సంఘటిత శక్తితోనే తమ హక్కుల్ని సాధించుకోగలమనీ యజమానులు చేసే దోపిడీని అడ్డుకోగలమనీ కార్మికులు తెలుసుకోగలిగారు. అంతే కాదు; స్త్రీలుగా తాము సంఘటితమవడానికి అడ్డుగా నిలిచిన పితృస్వామిక భావజాలానికీ, కుటుంబ పరంగా యెదురయ్యే వొత్తిళ్ళకీ, వ్యతిరేకంగా పోరాడాల్సి వుంటుందని కూడా వారు అర్థం చేసుకొన్నారు.

ఇంటి చాకిరీ, పిల్లల పెంపకం – వాళ్ళ చదువుల అవసరాలు, అలవిగాని కోరికల, అలకలు తీర్చడం …, కుటుంబం బరువు బాధ్యతలు వొకవైపు బీడీల పని మరొకవైపు తెల్లారి యే అయిదు గంటలకో లేచి రాత్రి పదకొండు గంటల దాకా లక్ష్మి లాంటి స్త్రీలు అనునిత్యం అనుభవించే జీవిత క్షోభను, వేదనా భరితమైన తండ్లాటనూ బతుకు పోరులో అద్భుతంగా ఆవిష్కరించాడు బి.ఎస్.రాములు. లక్ష్మీ – రాజయ్య దంపతుల సంభాషణలో కుటుంబ నిర్వహణలో స్త్రీపురుషుల బాధ్యతల గురించి హోదాల గురించి శ్రమ విభజన గురించి ఆలోచనల్లో ఆచరణలో వున్న పితృస్వామ్య ఆధిపత్యాల గురించి రచయిత చేసిన విశ్లేషణలు అపూర్వం అనడం అతిశయోక్తి కాదు. సామాజిక సమస్యల్ని వాటి పరిష్కారాల్ని ఉత్పత్తి సంబంధాల రీత్యా విశ్లేషిస్తూ స్త్రీ సమస్య పరిష్కారం సామాజిక సమస్య పరిష్కారంలో మాత్రమె ఉందనే సత్యాన్ని ఈ నవల చిత్రించిందని విమర్శకులు భావించారు (కలువకొలను రాం మోహన్ రాజు, బతుకుపోరు నవల రెండో ముద్రణ (1991) కి ముందుమాట).

దాంపత్య జీవితంలో ”ఏది యాంత్రికతో, ఏది వ్యక్తిగత అవసరమో తేడా తెలీనంతగా గడియారం లాంటి యాంత్రికత కార్మిక స్త్రీల జీవితాల్లో పెనవేసుకు పోయింది” అంటాడొక చోట రచయిత. తెలుగు నేల మీద స్త్రీ వాదం యింకా వేళ్ళూనుకోక ముందే రాములు స్త్రీ కార్మికుల జీవితాల పట్ల చూపిన గొప్ప ఆర్తితో కూడిన పరిశీలన వొక్కటే యీ నవలని ప్రత్యేకంగానూ విశిష్టంగానూ నిలుపుతుంది. కేవలం సంభాషణలతో కూడిన యీ సన్నివేశం రాములు సృజనాత్మక ప్రతిభకు సామాజిక అవగాహనకి మనస్తత్వ విశ్లేషణా శక్తికి నిండైన తార్కాణంగా, నిలువెత్తు అద్దంగా భాసిస్తుంది.

ఇది కేవలం బీడీ కార్మికుల బతుకు పోరు మాత్రమే కాదు; సమస్త కార్మిక జాతి విముక్తి మార్గం. “ఆ యిద్దరూ చీకటి కడుపులో చిచ్చు రగిల్చే వెలుతురూ బాణాల్ల ముందుకు సాగిపోతున్నారు.” అన్న నవల ముగింపు అదే సూచిస్తుంది. ఇవ్వాళ బీడీ కార్మికులు పొందుతున్నజీతాలూ యితర సౌకర్యాలైనా పోరాట ఫలితాలే. ‘సంగం పెట్టుకున్నాక ఖార్ఖానా సేట్లు భయపడుతున్నరు. అన్యాయం జరిగితే వూకొనేది లేదు. మాట్లాడతాం. వినకపోతే కొట్లాడతాం. ఇప్పుడు మేం తూకం రాళ్ళ సీసం కూడ చూస్తున్నం. ఇంట్ల, బయటా ఎక్కడైనా ఎవరైనా ఆడోల్లకి అన్యాయం చేస్తే వూరుకొనేది లేదు. యూనియన్ మాకు ధైర్యం యిచ్చింది. ఎదురు మాటాడే గ్నేనం వచ్చింది.’ అన్న పార్శీగుట్ట మణెమ్మ మాటలు అదే నిర్ధారిస్తున్నాయి.

సంఘటిత పోరాటం ద్వారా మాత్రమే ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకోగలరన్న స్పృహని అంతిమంగా బతుకుపోరు నవల అందించే చైతన్యం. అయితే ప్రపంచీ కరణ నేపథ్యంలో దశాబ్దాలుగా వుద్యమాల ద్వారా సాధించుకొన్న హక్కులు అణచివేతకి గురౌతున్నాయి. ధిక్కార స్వరాలపై హింసాత్మక నిర్బంధం యెక్కువైంది. సామాజిక సంపదని ప్రైవేటు వ్యక్తుల పరంచేసే వికృత రాజకీయాలు బలపడ్డాయి. శ్రమ పరాయీ కరణ రూపాలు మారాయి. మారిన పరిస్థితుల్లో సమస్త ఆధిపత్యాల్ని నిరసించే చైతన్యాన్ని పీడితులు గుండె నిండా నింపుకోడానికీ, ప్రజా సమూహాల్లో స్వేచ్ఛా సమానత్వ భావనలు పెంచడానికీ బతుకుపోరు లాంటి సాహిత్యం అవసరం యెంతైనా వుంది. అటువంటి సాహిత్యం మాత్రమే రాజ్యాంగాన్నీ రాజ్యాంగ నైతికతనీ ప్రజా శ్రేణుల విశాల ప్రయోజనాల్ని హితాన్ని దృష్టిలో వుంచుకొని యెప్పటికప్పుడు మూల్యాంకనం చేసుకొని పరిరక్షించుకోడానికి తోడ్పడుతుంది.

చివరగా వొకమాట – రాజ్యాంగం రాజ్యాంగ నైతికత దేశ కాలాల పరిమితులకు లోబడి వుండేవి అయినప్పటికీ వాటి నిర్మాణం జరగాల్సింది మాత్రం మానవీయ విలువలమీదే. నాకీ అవగాహన, స్పృహ కల్గించింది కూడా సాహిత్యమే. ఈ నవల్లోనే లక్ష్మి కొడుకు శ్రీను తల్లికి యింటి పనిలో సాయపడినందుకు చాయ్ లోకి బిస్కెట్ కోసం ఐదు పైసలు డిమాండ్ చేస్తాడు. తల్లి బీడీ చేట లోంచి ఐదు పైసలు తీసుకోమంటే పది పైసలు తీసుకొంటాడు. కొడుకు చేసిన పని గమనించి కూడా ‘చూసీ చూడనట్టు ఊర్కుంది లక్ష్మి’ ( పే.14).

యే దేశంలో యే కాలంలోనైనా రాజ్యాంగం , రాజ్యాంగ నైతికత వాటిని అమలుపరచే రాజ్యం, దాని అంగాలూ, రాజ్యాంగ నిర్మాతలూ బలహీనులపట్ల మానవీయంగా వుంటూ తల్లి పాత్ర పోషించాలి. నాకీ యెరుక కల్గించినందుకు బతుకు పోరుకు దాని రచయిత బి.ఎస్. రాములుకూ, ఆ యెరుక పొందే అవకాశం కల్పించినందుకు సాహిత్య అకాడెమీ, అస్మితలకూ కృతజ్ఞతలు.
***

ఆధారాలు:

* Beedi and Cigar Workers ( conditions of employment) Act (1966)
* Beedi Workers Welfare Cess Act(1976)
* Beedi Workers Welfare Fund Act (1976)
* SURVEY OF STUDIES ON BEEDI INDUSTRY – With Special Emphasis on Women and Child Labour ,CWDS Research Team – Preet Rustagi, Priyanka Srivastave,Preeti Bhardwaj,Manojit Saha,Anju Vyas and Madhu Shree)
* A Study on Child Labour in Indian Beedi Industry by Dr. Yogesh Dube, Member NCPCR, New Delhi:August 2013
* V.Murugan and C.Venktesh , A STUDY ON SOCIO – ECONOMIC CONDITIONS OF FEMALE BEEDI WORKERS IN KARUGAMPUTHUR VILLAGE, VELLORE DISTRICT , Indian Streams Research Journal , Oct. 2014
* Health of Women Workers in the Beedi Industry by Moona Gopal, medico friend circle bulletin, Jan-Feb. 2000
* Women Beedi Workers – A Report by Kusum , National Commission for Women , New Delhi
* A. Dharmalingam , “Female Beedi Workers in a South Indian Village” , Economic and Political Weekly , July 3-10 ,1993
* Pratap Bhanu Mehta , ‘What is constitutional morality’ , Seminar Magazine , November 2010
* Speeches of Dr. B .R. Ambedkar , The Constitution and Constituent Assembly Debates, Loka Sabha Secretariat : Delhi, 1990.
* బి. ఎస్. రాములు , బతుకు పోరు , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , హైదరాబాద్, రెండో ముద్రణ : 1991
* బతుకు పోరులో బీడీ కార్మికులు , నవయుగ బీడీ కార్మిక సంఘం ప్రచురణ – 1987?
* సమ్మె పోరులో బీడీ కార్మికులు , భారత కార్మిక సంఘాల సమాఖ్య – IFTU,2010,
* ఎం. లక్ష్మి , ‘తరాలు మారుతున్నా మారని బీడీ శ్రామికుల జీవితాలు’ , కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ , స్త్రీ విముక్తి సంఘటన:2014
* బీడీ కార్మిక సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దాం , ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియన్ , 1999
* కనిపించని శ్రమ … బీడీ కార్మికుల స్థితి – గతులు , నవయుగ బీడీ కార్మిక సంఘం , జంట నగరాలు : 1997?
* సృజన సంపాదకీయాలు , పర్ స్పెక్టీవ్స్ : హైదరాబాద్
* ఎ.కె.ప్రభాకర్ , తెలుగులో మాండలిక కథా సాహిత్యం , సాహితీ సర్కిల్ : హైదరాబాద్ , 2002
* ఓల్గా , సంతులిత – చిట్యాల ఐలమ్మ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ రిసెర్చ్ : హైదరాబాదు, 2014
* ఆంధ్ర భూమి, ఈనాడు, నమస్తే తెలంగాణ , ప్రజాశక్తి , విశాలాంధ్ర , సాక్షి , The Hindu , The Indian Express మొదలైన దిన పత్రికల్లో వచ్చిన వార్తలు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

గాయపడ్డ ఆదివాసి సంధించిన ‘శిలకోల’

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ [రచయిత మల్లిపురం జగదీశ్ ‘శిలకోల’కి డాక్టర్ మాడభూషి రంగాచార...
by అతిథి
4

 
 

రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్ (ఈ వ్యాసం మొదట పాలపిట్ట జనవరి 17 సంచికలో వచ్చింది. పుస్తకం.నెట...
by అతిథి
3

 
 

ఇంట గెలిచి రచ్చ గెలిచిన సంస్కర్త , ప్రాచ్య విజ్ఞాన వేత్త: బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (ఈ వ్యాసం అక్టోబర్ నెల పాలపిట్ట సంచికలో వచ్చింది. పుస్తకం.నె...
by అతిథి
4

 

 

గూడ అంజయ్య యాదిలో

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ‘అమ్మ నుడి’ జూలై2016 సంచికలో మొదటిసారి ప్రచురితమైన ఈ వ్యాస...
by అతిథి
2

 
 

జాంబ పురాణం – సామాజికాంశాలు : పాఠ్య అధ్యయన పద్ధతులు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ దళిత – ఆదివాసీ అధ్యయన – అనువాద కేంద్రం , హైదరాబాద్ విశ్వవిద్...
by అతిథి
1

 
 

మనిషి అస్తిత్వపు పెనుగులాటకి ప్రతిఫలనాలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ [ఈ తరం కోసం … అరసం (ఆం. ప్ర) సమర్పిస్తోన్న కథా స్రవంతి సీరీస్ ...
by అతిథి
2